30, నవంబర్ 2009, సోమవారం

"అ ఆ ఇ ఈ"



అతను ఆమె ఇంతలో ఈమె

రెండు రోజుల క్రితమే చూశానండి ఈ సినిమా. బహుశా: రేపో, ఎల్లుండో ఈ సినిమా వెళ్ళిపోవచ్చుకూడా. ఏం చేయను, అందరూ చూసేసారు. ఇప్పటిదాకా నాకు వీలవ్వలేదు. అయినా సరే, నేను చూసాను కాబట్టి ఈ సినిమా గురించి రాస్తాను.

ఇ౦కా ఎవరైనా చూడని వాళ్ళు ఉ౦టారులె౦డి. ఇది వాళ్ళ కోసమన్న మాట. ఒకవేళ చాలా రోజుల క్రితం చూసిఉంటే కొంచెం గుర్తు చేసుకోవచ్చని, నా ఉద్దేశం.

ముఖ్యంగా ఈ సినిమా మొదటి భాగం లో నాకు రెండు సినిమాలు గుర్తుకొచ్చాయి. అవేంటంటే, రాజేంద్ర ప్రసాద్, యమున నటించిన చాదస్తపు మొగుడు. రెండవది నాగార్జున, రమ్యకృష్ణ నటించిన చంద్రలేఖ.

బామ్మా, మనవళ్ళ చేజింగ్ తోటి ఈ సినిమా మొదలవుతుంది. చంద్రం (శ్రీకాంత్) వాళ్ళ బామ్మ (తెలంగాణ శకుంతల) కి చాలా దేశభక్తి. దేశనాయకుల పుట్టిన రోజులకి వాళ్ళ వేషాలు వేసి ఫొటోలు తీయిస్తూ ఉంటుంది వాళ్ళ బామ్మ. అప్పటికే గోడ మీద చంద్రం ఫొటోలు వివిధ దేశనాయకుల వేషాలలో తగిలించి ఉంటాయి. ఆ రోజు గాంధీ పుట్టిన రోజు. గాంధీ వేషం వేయటానికి, గుండు చేయాలిగా మరి. అందుకే బామ్మ, మనవడి వెంట పరుగులు తీస్తూ ఉంటుంది. వొచ్చే వేమన పుట్టిన రోజుకి వేమన వేషంలో కూడా ఫొటో తీయిస్తానని అంటుంది కూడా. చివరికి మనవడు తప్పించుకొని మంగలి వాడే గుండు గీసుకొని, గాంధీ లాగా అహింస ప్రచారానికి వెళ్ళిపోతాడు. ఇటువంటి కొన్ని తమాషా సంఘటనలు మనల్ని బాగానే నవ్విస్తాయి.

చంద్రం, కల్యాణి (మీరా జాస్మిన్) లది అన్యోన్య జంట. 'మేడ్ ఫర్ ఈచ్ అదర్ ' లాగా ఉంటారు. వాళ్ళ ఫామిలీ ఫ్రెండ్ కృష్ణ భగవాన్. పని దొరకని ఒక ప్లీడర్. ఈ సినిమా లో కొంచెం కీలక మైన పాత్రే.. చంద్రం శ్రీ కల్పనా డ్రైవింగ్ కంపెనీ లో ఒక కాబ్ డ్రైవర్ గా పనిచేస్తూ ఉంటాడు.

ఈ ఇద్దరు దంపతులకి సంతానం లేదు. తనతోటి ఇతర డ్రైవర్ల పిల్లలు ఎప్పుడూ ఇతని ఇంట్లోనే ఆడుకుంటూ ఉంటారు. అంతేకాకుండా,అ పిల్లల ఫీజులు, బర్త్ డే ఫంక్షన్ ల వంటివి తన ఖర్చుతోటే చేస్తూ ఉంటాడు.

ఈ సినిమాలో స్త్రీలకి నచ్చే కొన్ని రమ్యమైన దృశ్యాలు కూడా ఉన్నాయి. చంద్రం మెడపట్టుకొని నొప్పితోటి ఇంటికి వొచ్చినప్పుడు అతని భార్య, ఎదురు కాళ్ళతో పుట్టిన వాళ్ళు, పాదం తోటి మెడ మీద మెల్లగా రాస్తే ఆ నొప్పి పోతుందని, అతని మెడ మీద తన పాదం తోటి రాస్తుంది. ఈ విషయం నేనెక్కడో చదివాను కూడా. కల్యాణి పిల్లలు కలగాలని గుడి మెట్లకు పూజ చేస్తూ ఒక్కొక్క మెట్టే ఎండలో ఎక్కుతున్నప్పుడు, తన షర్ట్ విప్పి ఆమెకి గొడుగులాగా పట్టి తోడుగా చివరి దాకా వెల్తాడు. ఇలాంటి కొన్ని దృశ్యాలు బాగానే ఆకర్షిస్తాయి.

బ్రమ్హానందం, కోవై సరళల హాస్యం కొన్ని చోట్ల శ్రుతి మించినా, కొంతమేర బాగానే అనిపిస్తుంది. కోవై సరళ తండ్రి తన ముగ్గురు భార్యలు లేచిపోయిన సందర్భంగా, తన కూతురికి మొగవాళ్ళే కనిపించకుండా, కళ్ళకు గంతలు కట్టి పెంచుతాడు. మొదటిసారిగా చూసిన భర్త మొహమే ఆమెకి అందరిలో కనిపించటమే ఈ సినిమా లోని కామెడీ.

చంద్రం భార్య గర్భవతి అవుతుంది. ఆమెకి గుండెజబ్బు ఉందని, ఆపరేషన్ కి కొన్ని లక్షలు కావాలని చెప్పట౦తో కథ మలుపుతిరుగుతుంది. అప్పటివరకు సరదాగా సాగే సినిమాలో కొంత గంభీరత చోటుచేసుకుంటుంది.

అనుకోకుండా రైలు పట్టాల మీద మరణించిన స్త్రీ, ఆమె దగ్గిర ఉన్న బాగ్ లో లక్షల డబ్బు, ఆమె ఫొటో ఇతని కంట పడుతాయి. అదంతా పోలీసుల కప్పచెప్పిన చంద్రం, తరువాత తన స్నేహితుడి బలవంతంతో ఆమె తన భార్యేనని పోలీస్ ఆఫీసర్ కి చెప్పి, అతనికి కొంత లంచమిచ్చి మిగతాడబ్బు తన భార్య ఆపరేషన్ కోసం కడుతాడు. మర్నాడు పేపర్ లో ఆత్మహత్య చేసుకున్నట్లుగా ఆ స్త్రీ ఫొటో వొస్తుంది. ఆమె ఒక గొప్ప ధనికుని కుమార్తె రమ్య (సదా). ఆమె తండ్రి (తనికెళ్ళ భరణి) ఆ వార్తతో, గుండె పోటు వొచ్చి ఆసుపత్రిలో చేరుతాడు. మళ్ళీ స్నేహితుడి ప్రోద్భలంతో, తానే అల్లుడినని చెప్పి అతనికి సేవలు చేస్తాడు చంద్రం.

అప్పుడే చనిపోయిందనుకున్న రమ్య తిరిగి ఒస్తుంది. కాని చంద్రం తన భర్త కాదని చెప్పకుండా, అతను తన భర్తలాగానే ప్రవర్తిస్తుంది. ఎందుకని?

తనభర్త ప్రేమ క్రమంగా తరిగిపోతొందని భయపడుతుంది కల్యాణి. తన శీమంతానికి రాని భర్త ఎక్కడున్నాడో తెలుసుకొని అక్కడికి వెల్తుంది. కాని అక్కడ తన భర్తని ఇంకో స్త్రీ తో చూసికూడా, అతనిని ఏమీ అనకుండా, అతడు తన భర్త కాదని తాను పొరపడ్డానని చెప్పుతుంది. ఎందుకని?

పోస్ట్ మార్టం చేసిన డాక్టర్ తరువాతి కథలో కొంత ముఖ్య పాత్రే నిర్వహిస్తాడు. కథ మలుపుకి అతను ఎలా కారణమవుతాడు?

ఇందులో ఒక జేంస్ బాండ్ 000 కూడా ఉన్నాడు. అతని పరిశోధనలు చంద్రం కి ఏమన్నా సహకరించాయా?

కథను క్లైమాక్స్ కి తీసుకెళ్ళే మతిమరుపు ఆలీ కూడా ఇందులో ఉన్నాడు. అతడు చెప్పిన రహస్యమేమిటి?

రమ్య ఫ్లాష్ బాక్ ఏంటి? కల్యాణి భవిష్యత్తు ఏంటి?

ఇవన్నీ వెండితెర మీద చూడాల్సిందే!

ఎందుకూ పనికిరాని రఘుబాబు పాత్ర కూడా ఇందులో ఉంది.

ఈ సినిమాలో అడుగడుగునా ఇంతవరకు వొచ్చిన అనేక సినిమాల్లోని పాటలు బాక్ గ్రౌండ్లో అప్పుడప్పుడూ వొస్తూఉంటాయి. ముఖ్యంగా హృదయమెక్కడున్నది అన్న పాట చాలా సార్లు ఒస్తుంది.

"ఎంత నరకం ఎంత నరకం నా కళ్ళ ముందు నువ్వుంటే ఎంత నరకం" అనే పాట చాలా బాగుంది. "అచ్చట...ఇచ్చట..." అన్న ఇంకో పాట కూడా వినటానికి బాగానే ఉంది.

ఈ సినిమాలో మీరా జాస్మిన్ బొద్దుగా లేకుండా, ముద్దుగా ఉంది. సదా తన పాత్రలో ఎటువంటి భావాలు సరిగ్గా పలికించలేక పోయింది. శ్రీకాంత్ బాగానే ఉన్నాడు. సినిమా లొ ఒక క్లబ్ డాన్స్ ఉన్నా, అన్ని సినిమాల కన్నా, చాలా నీట్ గా ఉ౦దని చెప్పొచ్చు. అ౦దరు కలిసి చూడొచ్చు.

స్క్రీన్ ప్లే, దర్శకత్వం ఎన్. శ్రీనివాస రెడ్డి. బాగానే ఉంది. స౦గీత౦ ఎమ్.ఎమ్. శ్రీలక్ష్మి


*********************************************************




28, నవంబర్ 2009, శనివారం

మది దోచిన పాండురంగడు...

నాలోని నవరసాలు - శాంతం


మచిలీపట్ణం వెళ్ళాము . . . మా అమ్మ, పిన్ని, అక్కా, నేను కలిసి.

ఊరంత దాటాక . . . ఊరిచివర . . . అదిగో . . . అక్కడ, నాకు చాలా నచ్చింది . . . కావాల్సింది కనిపించింది . . .
అదే, పాండురంగని గుడి . . . . నా మది దోచిన దేవాలయం.

దూరం నుంచి గుడి గుమ్మాలు . . . రా . . . రమ్మని పిలిచాయి.

మెల్లగా . . . అతి మెల్లగా, ప్రవేశ ద్వారం చేరుకున్నాను.

నిలువెల్లా, పచ్చటి గుమ్మాలు . . . దేవుడి ఇంటి గుమ్మం ఎంత అందంగా ఉంది.

ప్రతి రోజు పసుపు రాసి, బొట్టు పెట్టి అలంకారం చేస్తారనుకుంటా...ఆ రోజేదో పండుగ లాగానే తోరణాలు కూడా కట్టారు. అవును దేవుని గుడి లో రోజూ పండుగే కదా!
ఆ నిలువెత్తుటి ప్రాకారపు గోడలు, అంద మైన, కళ కళ లాడుతున్న ఆ గుమ్మం మీద నా తల అనించి...రెండు చేతులతోటి, కళ్ళ కద్దుకొని దండం పెట్టుకున్నాను.

గుమ్మం దాటి కాలు లోపలికి పెట్టగానే, అది బృందావనమా అనిపించి మైమరచి, పరవశించాను.

"డోలారె..డోలారె..ఢం... ఈ జగమంతా బృదావనం..." మనసూగి పోయింది.
ఒక్క సారిగా చల్లటి పిల్ల తెమ్మరలు నన్ను తాకి, ఎటో వెళ్ళిపోయాయి. ఆ చల్లటి పిల్లగాలి వెంటే తిరిగిన నాకళ్ళకు రెండువైపులా విశాలమైన దేవాలయం కనిపించింది.

ఎంతో విశాలంగా ఉంది. లోపల ప్రాకారం చుట్టూ అన్ని దేవతల గుళ్ళు ఉన్నాయి. కుడి వైపున సహస్ర లింగేశ్వరుని గుడి, ఎడమ వైపున లక్ష్మీ దేవి గుడి కనిపించింది.

ఎదురుగా . . . దూరంగా అశ్వద్థ వృక్షం కనిపించింది. దాని కానుకోనే పున్నాగ చెట్టు కూడా ఉంది. దూరం నుంచే ఎంతో అందంగా కనిపించి, నా కాళ్ళు ముందుగా అటువైపే నడిచాయి. దగ్గరికి చేరుతూఉంటే కింద నేలంతా పరుచుకొని, ఎంతో అందమైన పున్నాగపూలు కనిపించాయి. తెల్లటి, మెత్తటి వెల్వెట్ తివాచీ పరచినట్లు నా కాళ్ళు ఆ మెత్తదనంలో కరిగిపోయాయి. ఆ పూల సువాసనలు గాలిలో తేలుతూ చుట్టూ వ్యాపించి ముందు మా దగ్గరికి రావూ . . . అని నన్ను పిలిచినట్లే అనిపించింది. ఆగలేక అక్కడికే ముందుగా వెళ్ళాను. అక్కడ ఒక అందమైన పుష్కరిణి, చెట్టుకిందనే చిన్న గుడిలో శివలింగం ఉంది. ఆ కోనేరు దగ్గిర మెట్లమీద కూచున్నాను. ఆ కోనేరుకి రెండో వైపు గాలికి మెల్లగా తలూపుతున్న పొగడ చెట్టు కూడా కనిపించింది. అబ్బ ఎంత ఎందంగా ఉంది ఈ దృశ్యం అనిపించింది.
కిందపడ్డ ఆ పూల సువాసనలు ఎంతో హాయిగా మత్తుకొలుపుతున్నాయి.

వాడిపోతానని తెలిసినా వికసించక మానదు కదా పుష్పం . . .

ఏదో ఆలోచనలో మునిగిన నేను, అప్పుడే ఒచ్చి నా ఒడిలో పడుతున్న పున్నాగ పువ్వును గమనించాను. ఎందుకో నాకే తెలియ కుండా ఆ చిన్ని పువ్వు కింద పడిపోకుండా నా చేయి చాపి ఒడుపుగా పట్టుకున్నాను. ఎంత ముద్దుగా ఉందో ఈ బుజ్జితల్లి . . . నన్ను స్వామి దగ్గరికి చేర్చవూ...అని నన్నడుగుతున్నట్లే అనిపించింది . . . ఒక్క క్షణం కూడా ఆలష్యం చేయకుండా అక్కడే ఉన్న పరమశివుడిగుడి దగ్గరికి వెళ్ళి , మోకాలిమీద కూర్చోని . . . నా రెండు చేతులూ ముందుకు చాచి ఆ చిన్నారిని స్వామి ఒడిలో భద్రంగా ఉంచాను . . . ఆ బుజ్జితల్లి తప్పకుండా ఎంతో సంతోషించి ఉంటుంది అనిపించింది . . .

నన్ను నీవు నాటినప్పుడు
నాకు జన్మ నిచ్చిన తల్లి వనుకున్నాను
నాకు నీరు పోసి పెంచినపుడు
నా మేలు కోరే తండ్రి వనుకున్నాను
నేనొక పూవు పూయగానే
నువ్వు సంతోషిస్తావనుకున్నాను
తీరా నువ్వు ఆ పువ్వును కోసి నప్పుడు
నేను కొంత కృంగిపోయాను
కానీ ఆ పువ్వును భగవంతుని
పాదాల చెంత ఉంచినపుడు
నేనెంతో సంతోషించాను
చివరకు నా జన్మ సార్ధకమైనందుకు
నేను మరీ మరీ ఆనందించాను . . . .
నేనెప్పుడో రాసుకున్న ఈ కవిత గుర్తొచ్చి, ఒక్కసారిగా తలెత్తి ఆ పున్నాగ చెట్టును చూశాను. ఆ పున్నాగ తల్లి తన బిడ్డ జన్మ సాఫల్య మయింది, అని సంబరపడినట్లే అనిపించింది నాకు. అవును . . . నీ ఆలోచన నిజమే . . . అన్నట్లు ఇంకా కొన్ని పున్నాగ పూలు నా మీద జలజలా రాలాయి. ఆ పూలన్నీ భద్రంగా ఏరుకున్నాను. ఈ సారి ఆ పూలను నా ఒళ్ళోనే పెట్టుకొని చూస్తూ ఉండిపోయాను .

ఈ పూలను నేను రోజూ చూస్తూనే ఉంటాను. అయినా ఆ స్వచ్చమైన, ప్రశాంత వాతావరణంలో, ఆ గుడి ముందు చెట్టుకింద, కొలను పక్కనే కూచున్న నాకు . . . ఆ పూలలో ఎన్నో కొత్త కొత్త అందాలు కనిపించాయి . . . ఈ పున్నాగ పూలు ఇంత అందమైనవా . . . అని మొదటిసారిగా అనిపించి, దోసిట్లో పూలను అలాగే నా ముఖనికి దగ్గిరిగా తీసుకున్నాను . . . నా కళ్ళని ఆ మెత్తటి పూల మీద అనించాను . . . లోకమే మరిచిపోయాను . . .

తలెత్తిన నాకు దూరంగా పొగడ చెట్టు కనిపించి, నా దగ్గరికి రావా అనిపిలిచినట్లే అనిపించింది . . . ఈ రెండు చెట్లను ఒక్క చోట నేనెప్పుడూ చూడలేదు. పున్నాగ పూలను, చెట్టునుంచి రాలిన రావి అకులను ఏరి అందులో ఉంచి స్వామి దగ్గిర అందంగా అలంకరించి . . . పొగడమ్మ దగ్గరికి బయలుదేరాను. దూరం నుంచే ఆ పూలు రాలుతూ కనిపిస్తున్నాయి. చిన్ని చిన్ని, అందమైన ఆ పుష్పాలు చేతిలోకి ఏరుకొన్నాను. నా చేతినిండా బంగారం కుప్ప పోసినట్లే అనిపంచింది. కాంతులీనుతున్న ఆ పుష్పాలను మైమరచి మరీ చూశాను. ఆ చిన్ని పూల మదిలో రాగాలు వింటూ తరించిపోయాను.

ఇంతలో మా పిన్ని పిలిచింది. ఎందుకలా చెట్ల కింద తిరుగుతున్నావు, ఇంక గుళ్ళోకి రావా? ఇక్కడ సహస్ర లింగాల తోటి శివాలయం ఉంది. చూద్దువుగాని రా, అని. మెల్లగా వాళ్ళదగ్గిరికి చేరుకున్నాను. ఈ గుడి చాలా బాగుంది, పిన్ని...అన్నాను. లోపల ఇంకా బాగుంటుంది చూద్దువుగాని రా, అని తీసుకెళ్ళింది. ఆ గుళ్ళోకి పోగానే ఒక శివలింగం కనిపించింది. ఈ శివలింగమంతా కూడా ఇంకా చిన్న చిన్న శివలింగాలతోటి అమర్చిఉంది. చుట్టూ నాలుగు వైపులా భక్తులు ప్రతిష్టించి పూజలు చేసుకున్న వెయ్యి లింగాలు ఉన్నాయి. ఎవరైనా అక్కడ శివలింగం పెట్టి పూజించి, సంవత్సరమంతా కూడా అర్చనలు చేయించొచ్చు. ఆ శివలింగం కిందకూడా ఇంకా చాలా శివలింగాలున్నాయని పూజారి చెప్పారు. అక్కడ భక్తితో పూజించి, తీర్థం తీసుకొని బయటికి ఒచ్చి అక్కడి మంటపం లో కూర్చున్నాము. ఆ మంటపం నుంచి దూరంగా కొండలు, పెద్ద పెద్ద తాటిచెట్లు, ఆకాశంలో కదులుతున్న నీలి మబ్బులు మళ్ళీ మనసును ఉయ్యాల లూపేసాయి.

ఇంకా మనం గర్భగుడిలోకి పోలేదు కదా . . . పాండురంగణ్ణి చూడాలి కదా...పండరీపురంలో పాండురంగడే నాకు గుర్తుకొస్తున్నాడు..ఎప్పుడు చూద్దాం పిన్ని, అనడిగింది మా అక్క. ఇదిగో పోదాం పదండి... అని బయలు దేరింది మా పిన్ని.

నరసిమ్హా చారిగారు, 1888 లో ఈ గుడిని కట్టించారుట. లోపల ఆయన, ఆయన భార్య విగ్రహాలు పెట్టారు. ఆయన జీవిత చరిత్ర కూడా ఉంది. ఆయన యజ్ఞం చేయిస్తున్న ఫొటో కూడా ఉంది. లోపల అయిదారుగురు మించి జనం లేరు. చాలా ప్రశాంతంగా ఉంది. నల్లటి రాతి స్థంభాలు చక్కటి శిల్పకళతో చాలా ప్రత్యేకంగా కనిపించాయి. ఇక్కడ గర్భ గుడిలో దేవుని దగ్గరిదాకా పోనిస్తున్నారు. అంతలోపలికి వెళ్ళి దేవుని ఎదురుగ్గా, అంత దగ్గిరిగా నుంచునే అవకాశం వొచ్చింది.

అంత ఆకర్షవంతమైన ఆ నల్లనయ్య విగ్రహం, తేజోవంతమైన ఆ కళ్ళు, అందమైన పూలదండల అలంకారం నన్నక్కడినుండి కదలనివ్వలేదు. నా చేతిలో ఉన్న పొగడపూలను ఆ పాండురంగని పాదాల మీద పోస్తూ...నా శిరస్సు కూడా...ఆ దేవుని పాదాల మీద ఉంచాను. రెండు చేతులతోటి ఆ చల్లనయ్య ను శ్పృజించి పరవశించిపోయాను. ఆ దివ్యమంగళ రూపం వొదిలి రాలేక పోయాను. పదే పదే చూసుకుంటూ అక్కడే చాలా సేపు కూర్చున్నాము.

"నల్లనివాడా, నే గొల్ల కన్నెనోయ్..పిల్లన గ్రోవూదుమూ...
నా యుల్లము రంజిల్లగా ... వలపే నా నెచ్చెలియై...తోడి తెచ్చె నీ దరికీనాడు...పండిన నోములూ...
నీ తీయని పాటలకై రేతిరి ఒంటిగ ఒచ్చితినే. . .నా మనసు . . . తనువూ . . . ఈ మనికే నీదికదా. . . పిల్లనగ్రోవూదుము . . .నా యుల్లము రంజిల్లగా . . . నల్లని వాడా . . .
ఆకశాన మబ్బులనీ . . . చీకటులే మూసెననీ . . . నేనెరుంగనైతిని . . . నీ తలపే వెలుంగాయె..
పిల్లన గ్రోవూదుము . . . నా యుల్లము రంజిల్లగా . . .
అక్కడే కూర్చోని, మైమరుపుతో, ఆ స్వామిని చూసుకుంటూ లోలోనే పాడుకున్నాను . . . ఈ పాట.

కృష్ణా! నీ పేరు తలచినా చాలు. యెదలో పొంగు శతకోటి యమునా తరంగాలు ...గోపాలా...నందబాలా... ఏమిటీ పరవశం ... నేనెవరినో పూర్తిగా మరచిపోయాను.

మనసెంత ప్రశాంతంగా ఉంది. నమ్మలేని శాంతం. నిజమేనా......


ఇక్కడ ఎంత తాదాత్మ్యత... దివ్యధామం...ఈ పుణ్యక్షేత్రం...ఇక్కడి పాండురంగణ్ణి...అందరూ చూసి తరించాల్సిందే!

***************************************************************************


25, నవంబర్ 2009, బుధవారం

'గడప దాటని మా ఓటు'

ఈ సారి గ్రేటర్ ఎలెక్షన్స్ లో ఎలాగైనా ఓట్ చేయాలి అనుకున్నాను. కాని అనుకోకుండా, విజయవాడ, బందర్ వెళ్ళాల్సి వొచ్చింది. ఎలక్షన్ టైం కి నేను ఉండను. అయ్యో! అనిపించింది.

ఈ లోపల మా పనమ్మాయి, సుజాత ఒచ్చింది. నాకు వెంటనే, ఫ్లాష్ వెలిగింది. కనీసం, సుజాత ను ఓటు వేయమని చెప్పాలి అనుకున్నాను. వెంటనే సుజాత ని పిలిచి నీకు ఓటు కార్డ్ ఉందా అనడిగాను.
ఉన్నదమ్మా! నేను ఓటు ఏస్తను కదా, ఈ సారి అంది.

మంచిది, సుజాత..ఎవరికి వేస్తావు...అని అడిగాను.

నేను కాంగ్రేసు కి ఏస్తనమ్మా...అంది వెంటనే.

ఏ..ఎందుకు? అని వెంటనే అడిగాను.

అవునమ్మా..పరిపాలనలో ఉన్నోళ్ళకే ఓటు ఎయ్యాలె...అప్పుడే మనకి మంచిగైతది...అంది.

నేను ఊరుకోకుండా..ఎందుకలాగా! అనడిగాను.
అవునమ్మా! వాళ్ళు సగం డబ్బు తిన్నా...మిగతాది మా అసుమంటోళ్ళకు ఖర్చు పెడతరు...అదే, వెరే ఓళ్ళకు ఏస్తే, ఓటు దండగే...అండ్ల మాకేటొస్తది...అంది.

ఎంత జీవిత సత్యం చెప్పావు సుజాతా...నా కళ్ళు తెరిపించావు, అనుకున్నాను. అంటే దానికర్ధం..ఎప్పుడు ఏ పార్టీ అధికారంలో ఉంటే దానికే ఓటు వేయాలన్నమాట...

నేను ఇంక ఏదో వేరే పార్టీకి వేద్దామనుకుంటున్నాను..కొత్త పరిపాలన లో ఏమన్నా బాగుంటుందేమో! అని నా ఆశ.

సరే, సుజాత, మీ ఆయనతో వెళ్ళి ఇద్దరూ ఓటేయండి, లేకపోతే మీ ఓట్లు వేరే ఎవరో వేసేస్తారు, అన్నాను.

మా ఆయన కూడా ఉండడమ్మా, అయ్య వెంట బయటకెల్తున్నడు, మా చింటు గాడిని తీసుకెల్తా...అంది.

సరే మర్చి పోకు, ఇంట్లో అందరూ జాగ్రత్త..అని చెప్పి నేను ఊరికెళ్ళిపోయాను.

తిరిగి రాంగానే సుజాతని అడిగాను ఓటేసావా! అని...

లేదమ్మా..చింటుగాడితోటి పెద్ద గొడవైపోయింది...అంది.

అదేంటి..వాడితో గొడవేముంది? నీ ఓటుకి వాడేమడ్డం ఒచ్చాడు? అన్నాన్నేను.

తను చెప్పింది వింటే..నిజంగా నేను నమ్మలేక పోయాను...

మా ఇంటికి దగ్గిర ఉన్న స్కూల్ లోనే మా ఓటింగ్ సెంటర్. పిల్లగాడిని తోడుతీసుకొని స్కూల్ కి వెళ్ళింది. ఆ స్కూల్లోనే మా వాడు కూడా చదువుతున్నాడు. తన స్కూళ్ళో అంతమంది, అన్ని రూం ల ముందు లైన్లల్లో నించోడం చూసి వాడికి చాలా ఉత్సాహం వొచ్చేసింది.

వాడికి ఓటు గురించి బాగానే తెలుసు. ప్రతిరోజు అన్ని పార్టీల ప్రచారాలు చక్కగా ఫాలో అవుతున్నాడు. ఎన్నో పాటలు కూడా నేర్చుకున్నాడు. వెంటనే గొంతెత్తి, గట్టిగా పాడ్డం మొదలుపెట్టాడు. వాడికి బాగా ఒచ్చిన పాట ఒకటుంది. మా ఇంటిచుట్టూ రోజూ ఇదే హోరు ఉండేది. వాడూ రోజూ ఈ పాటలు పాడుతూఉంటే, నేను కూడా సరదాగా వినేదాన్ని. ఆ రోజు ఎక్కడా పాట పాడే అవకాశం వాడికి రాలేదు. రోజూ ప్రచార రధం వెంట వొచ్చే పిల్లలకు రధం లోని వాళ్ళు చాక్లెట్లు ఇచ్చే వారు. ఇప్పుడుకూడా అక్కడున్నవాళ్ళు చాక్లెట్లు ఇస్తారనుకున్నాడేమో! ఇంక, హుషారుగా పాటందుకున్నాడు. వాడి గొంతుకూడా చాలా బాగుంటుంది.

ఆ పాటేంటో తెలుశా!
"మరసిపోయి ఓటేస్తే తమ్ముడూ!
మనల ఏట్ల ముంచుతారురా తమ్ముడూ..
ఇది మోసాలా కాంగిరేసు తమ్ముడూ...
పదవి కోసం గడ్డి తింటదిరా, తమ్ముడూ...
ఇసుంట రమ్మంటే... ఇల్లంతా నాదంటదిరా, తమ్ముడూ..." ఇలా ఈ పాట ఇంకా చాలా ఉంది.

రోజు మా ఇంటి చుట్టూ తిరిగే ప్రచార రధాల వెంట తిరిగి, తిరిగీ వాడు ఈ పాట చాలా బాగా నేర్చుకున్నాడు. ఆ స్కూళ్ళో ఈ పాటే గట్టిగా పాడడం మొదలుపెట్టాడు. దానితోటి, చాలా మంది వీడి చుట్టూ చేరారు. అక్కడే ఉన్న పార్టీ ఏజెంట్స్ కూడా ఒచ్చేసారు. అన్ని పార్టీల ఏజెంట్స్ సంతోషించినా...కాంగ్రేస్ ఏజెంట్ కి చాలా కోపంకోపం వొచ్చింది.

ఆ కాంగ్రేస్ ఏజెంట్ చాలా కోపం తోటి, పోలింగ్ అయితోంటే, ఇప్పుడు నువ్వు ఇక్కడ ప్రచారం చేస్తావా? అలా చేయకూడదని తెలీదా? ఎవరు పంపారు నిన్ను, పేరు చెప్పు? అని చింటుగాడిని పట్టుకొని దులిపేసాడు.

మా సుజాత చాలా భయపడిపోయి, వానికేం తెలియదయ్యా..ఊరికే అట్ల పాడిండు..అంతే..అంది.

ఊరికే ఎట్లా పాడతాడు..పద పోలిస్ స్టేషన్ కి అన్నాడు..ఆ ఏజెంట్. మిగతా ఏజెంట్లు ఎందుకయ్యా..అట్లా గొడవ పెడ్తావు...చిన్న పిల్లగాడు..ఊరుకో..అని అడ్డం పడి, ఆ ఏజెంట్ ని శాంతింప చేసారు.

మా సుజాత బ్రతుకు జీవుడా అనుకొని...వెళ్ళి మళ్ళీ లైన్లో నుంచుంది. ఇంక అయిదునిముషాల్లో..వీళ్ళు లోపలికి వెల్తారనగా..అక్కడున్న అభ్యర్ధుల పోస్టర్ వీడి కంట పడింది. అందులో ఉన్న లోకసత్త జెండా వీడికి చాలా పరిచయమే. ఆ పార్టీ ప్రచార రధం వెనకాల కూడా తిరుగుతూనే ఉండే వాడు. వాళ్ళదగ్గిర కూడా ఒక పాట నేర్చుకున్నాడు. లోకసత్తా జెండా చూడంగానే వాడి కళ్ళు మిళమిళా మెరిసిపోయాయి. వీళ్ళ దగ్గిర నేర్చుకున్న పాట వాడి ఫేవరెట్ సాంగ్. ఆ పాట చాలా రాగయుక్తంగా పాడుతాడు వాడు. వాళ్ళ దగ్గిర నేర్చుకున్న పాట గట్టిగా, ఎంతో పరవశంతో, ఆవేశంగా, జనరంజకంగా, అక్కడి జెండా చింపి మరీ చేతిలో పట్టుకొని..ఊపుకుంటూ... పాడడం మొదలు పెట్టాడు.

"ఏమి ప్రభుత్వం ఇది ఓరి నాయనో!
దీనికెట్ల పెట్టేది నిప్పు నాయనో!
ఎన్నాళ్ళీ అన్యాయం..అవినీతి...అక్రమం".....అంటూ, ఊగిపోతూ డాన్స్ కూడా మొదలుపెట్టాడు.

ఈ సారి ఏజెంట్స్ తో పాటు, పోలీసులు కూడా ఒచ్చేసారు. వాడిని పట్టుకొని గట్టిగా గదమాయించి, ప్రశ్నల మీద ప్రశ్నలు మొదలుపెట్టారు. వాడు అంతకంటే ధైర్యంగా..నాకింకా చాలా పాటలొచ్చు...అని మళ్ళీ, ఇంకో పాట అందుకున్నాడు.

పోలీసులు, మా సుజాతని నువ్వు దేనికొచ్చావు..నిజం చెప్పు...లేకపోతే ఇప్పుడే మీ ఇద్దరిని పోలీస్ స్టేషన్ లో పెడ్తాము...పదండి..మీరు ఎక్కడుంటున్నారు...ఏమి చేస్తున్నారు...మీ ఆయనెవరు...ఏ పార్టీ వాళ్ళు పంపారు మిమ్మల్ని ...చిన్న పిల్లలతోటి ప్రచారం చేయిస్తారా. ఇది పెద్ద నేరం తెలుసా? నీ కు పెద్ద శిక్ష పడుతుంది...లాఠీ తగిలితే గాని మీకు తెలిసిరాదు...ఒకసారి చెప్పితే అర్ధంకాదా! అని లాఠీ తీసుకొని ఒచ్చారు.

అసలే అడుగడుగునా బందోబస్తుతో, అతి జాగ్రత్తల తో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఇంక అక్కడనుంచి బయట పడటానికి, మా సుజాత వాళ్ళను అన్నిరకాలుగా బతిమలాడుకొని...మా ఇంటి అడ్రస్ ఇచ్చిందిట. అప్పుడే అనుకోకుండా..అక్కడికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి చెకింగ్ కి రావటం తోటి...పోలీసులంతా అటువైపు వెళ్ళిపోయారు.

సమయం చూసుకొని, మా సుజాత...చింటుగాడి చేయిపట్టుకొని...బరబరా ఈడ్చుకుంటూ ఇంటి కొచ్చి పడింది... మా అత్తగారికి చెప్పి భయంతోటి ఏడవడం మొదలుపెట్టింది. మా అత్తగారు, తనకి కాస్త ధైర్యం చెప్పి, అయ్య ఒచ్చాక చూద్దంలే..అని ఓదార్చారు. ఇంక చింటుగాడికేమొ...చాలా పెద్ద క్లాసే పీకారు.

మా అత్తగారికి అసలే ఒంట్లో బాగుండక ఈ సారి ఇష్టం లేకపోయిన ...మా బలవంతంతోటి ఓటు వేయకుండా, ఇంట్లో ఉండి పోయారు. ఇప్పుడు వీడి గొడవతోటి, పోలీసులు ఎక్కడ మా ఇంటిమీదికొస్తారో అని మా అత్తగారు కూడా చాలా భయపడిపోయారు.

దీని మూలంగా మొత్తానికి...మా సుజాత కూడా ఓటు వేయలేదు.

ఇందుఫలితంగా జరిగిందేంటయ్యా అంటే...అధికార పార్టీకి కాని, అనధికార పార్టీకి కాని మా ఇంట్లోనుంచి ఒక్క ఓటు కూడా పడలేదు.

మా ఓట్లు మా గడప దాటలేదు....

మా ఓట్లు వేరే ఎవరైనా వాళ్ళకిష్టమైన పార్టీల కేసుకున్నారేమో...అదికూడా మాకు తెలియదు.



************************************************************************************

24, నవంబర్ 2009, మంగళవారం

ప్రత్యేక అవార్డ్స్?



స్త్రీలకు ఇచ్చిన 'సేఫ్ రన్నింగ్' అవార్డ్స్ అట ఇవి. మొదటి బహుమతి నుంచి, పదవ బహుమతి వరకు ఎన్నిక చేసిన లిస్ట్ అట.

చూడండి మరి...

ఈ అవార్డ్స్ 2006 లో ఇచ్చినవి. ప్రత్యేకంగా స్త్రీల డ్రైవింగ్ కి మెచ్చి, ఇచ్చిన అవార్డ్స్ ఇవి. ఎలా ఉన్నాయి!

బాగున్నాయి కదూ....

"ముద్దార నేర్పించిన, ముదితలు నేర్వని విద్య కలదే"...అన్నట్లే ఉంది కదూ.

ఇవి నిజంగా పోటీల కోసం చేసినవే అనుకుంటున్నారా?

చాలా రోజుల క్రితం ఒకసారి చూశాను. గమ్మత్తుగా అనిపించింది.

దీని ప్రత్యేకత ఏంటంటారు?





















************************************************************************************





17, నవంబర్ 2009, మంగళవారం

స్పెషల్ బంపర్ ఆఫర్!


అవకాశం ముందుగా ఒచ్చిన 2000 మందికి మాత్రమే!

ఇంగ్లీష్ లో సులభంగా మాట్లాడండి.

లెటర్ రైటింగ్ ప్రాక్టీస్ మా ప్రత్యేకత (ఇంగ్లీష్ లో ఉత్తరాలు వ్రాసే పద్ధతి).

స్పెషల్ బంపర్ ఆఫర్ కూపన్ ఇస్తున్నాము...దీన్ని నింపి పంపండి...అంతే!

రూ 200/- పంపినచొ మీకు ఉచిత పోస్టల్ శిక్షణ ఇవ్వబడును.

(రోజుకు ఖర్చు రూ 3/- మాత్రమే! ఇంకా ఇతర కోర్స్ లు కూడా కలుపుకొని)

ఎంతో సులభంగా సందర్భంలో నైనా తడబడకుండా, మంచి నీళ్ళు తాగుతున్నట్లుగా మంచి ఇంగ్లీష్ నేర్పబడుతుంది.

ఇంగ్లీష్ రాయుటకు కావలసిన ఆంగ్ల వ్యాకరణం పరిపూర్ణంగా సూత్రాలతో చాలా ఈజీ గా నేర్పబడుతుంది.


***********పూర్తి డబ్బు వాపస్***********

మీ డబ్బుకి 100 శాతం గ్యారంటీ. కోర్స్ మీకు పూర్తి సంత్రుప్తిని ఇస్తుంది. మనస్పూర్తిగా మీకు కోర్స్ నచ్చలేదనిపిస్తే... కోర్స్ పుస్తకాలని బరబరా చింపివేసి, ముక్కల్ని పదిహేను రోజుల్లోపల మాకు పంపించండి. మీ పూర్తి డబ్బు తిరిగి పంపుతాము.(పోస్టల్ చార్జెస్ మినహాయించుకొని).

మీరీ కోర్స్ లో చేరినందువల్ల లాభమే తప్ప ఎటువంటి నష్టము లేదు.

ఇంకా ఎన్నో ఇతర కోర్స్ లు కలవు.

త్వరపడండి...మంచితరుణం, మించిన దొరకదు...

*******************************************


ఒక వార్తా పత్రికలో ఇది చదివి సంబర పడిపోయాను. ఆహా! రకరకాలుగా ఇంగ్లీష్ లో ఉత్తరాలు రాయటం నేర్చుకోవచ్చు కదా అని ఆనందమేసింది. రెండువందల రూపాయలలో ఎన్నో ఇతర ఇంగ్లీష్ కోర్స్ లు కూడా నేర్పిస్తారట. మనకు నచ్చక పోతే డబ్బులు కూడా వాపస్ చేసేస్తారు.

వెంటనే కూపన్ నింపేసి, మని ఆర్డర్ కూడా చేసేసాను. తిరుగు టపాలో ఇన్స్టిట్యూషన్ నుంచి నాకు ఎన్నో కోర్స్ పుస్తకాలు ఒచ్చేసాయి. అవన్ని కష్టపడి నేర్చుకొని నా ఇంగ్లిష్ పరిజ్ఞానాన్ని పెంచుకున్నాను.

చక్కగా, కొత్తరకంగా ఎన్నో అప్లికేషన్లు రాయటం నేర్చుకున్నాను.

కావాలంటే మీకూ నేర్పిస్తాను...

నాకు ఫీజ్ ఒద్దులెండి !!!

నేను నేర్చుకున్న కొన్ని ఇంగ్లీష్ అప్లికేషన్స్, లీవ్ లెటర్స్ చూసి మీరు కూడా తప్పకుండా అభివృద్ధి చేసుకొండి...

మచ్చుకి కొన్ని:


ఇది ఒక అభ్యర్ద్ధి అప్లికేషన్:

"This has reference to your advertisement calling for a 'Typist' & 'Acountant' -Male or Female' ...As I am both for the past several years and I can handle both, I am applying for the post."


ఇది ఒక ఉద్యోగి లీవ్ లెటర్:

"Since I have to go to my village to sell my land along with my wife. Please sanction one week leave".


ఇంకొక ఉద్యోగి అప్లికేషన్:

"Since I have to go to cremation ground and I may not return, please grant half day leave".

ఒక విద్యార్ధి లీవ్ లెటర్:

"As I am studying in this college, I am suffering from head-ache. I request you to leave me today".


ఇంకో ఉద్యోగి లీవ్ లెటర్:

"As my mother-in-law has expired and I am responsible for it, please grant me 10 days leave".


చూసారా! నేను ఎంతో ఆత్మ విశ్వాసం తోటి పోస్టల్ కోచింగ్ లో పరిపూర్ణత సంపాదించానో!

బాగుంది కదు నా 'లెటర్ రైటింగ్ ప్రాక్టీస్'.

********************************************************************

 

మనస్వి © 2008. Template Design By: SkinCorner