5, డిసెంబర్ 2010, ఆదివారం

ఆలస్యం...అమృతం ....




వావ్!!! నేను కూడా ఒక మూవీ ప్రీమియర్ షో కి వెళ్ళానోచ్......ఆ మూవీ......"ఆలస్యం...అమృతం"....

ఎలా అంటారా...అసలీరోజు రేపటి ఫారన్ డెలిగేట్స్ మీట్ అరేంజ్మెంట్స్ కోసం కాలేజ్ కెళ్ళాలి. దారిలో అభినందన భవాని కనిపించారు. చాలారోజులయింది, ఎలా ఉన్నావు, ఏంటి...అని పలకరించి, నేను, ఇంకొంతమంది మన’ అప్నాఘర్’ మెంబర్స్ ఆలస్యం...అమృతం సినిమా స్త్రీలకోసం ఫ్రీ షో అని రామానాయుడు రమ్మన్నారు వెల్తున్నాం....దాని తర్వాత ప్రెస్ మీట్ ఉంటుంది. నువ్వూరా...అన్నారు. ఇలాంటి ఫ్రీ మూవీస్ నేనెప్పుడు చూడ్లేదు...కాలేజ్ పోవాలిగా...మా ప్రిన్సిపల్ గుర్తొచ్చారు. ఇప్పుడు కాదులే అని వెళ్ళబోయాను. ఫర్వాలేదు, మీ ఫ్రెండ్స్ ని కూడా తీసుకొని రా, ఇంకా చాలా టైం ఉందిగా అని వెళ్ళిపోయారు.

నేను కాలేజ్ కెళ్ళానే గాని మనసంతా ఆ సినిమా ధ్యాసే. ఎవరెవరొస్తారో చూడాలని ఆరాటం. తొందరగానే మా పనైపోవటం తో మా ఫ్రెండ్ కి చెప్పి మనం పోదామా అన్నాను. తను అంతకంటే హుషారుగా, మరి చెప్పవేం పోదాం పదా..వాళ్ళందరితో మనకెప్పుడు చాన్స్ వస్తుంది, అట్లా చూస్తే చాలా మజా వస్తుంది పోదాం పా అంది. ఇంకేముంది...ఇద్దరం ఆటో ఎక్కేసాం.... ఇంత వరకు ఆ సినిమా పేరు కూడా వినలేదు. నటీ నటులెవరో కూడా తెలీదు. హీరోయిన్ ఎలాగూ బాంబే అమ్మయేలే అని నవ్వుకున్నాం.

థియేటర్ కి పోగానే మా మహిళా సోదరీమణులందరూ అక్కడే ఉన్నారు. భవాని నన్ను చూసి నాకు తెలుసులే నువ్వొస్తావని, మీరిద్దరే వొచ్చారేంటి...ఇంకెవరూ రాలేదా అన్నారు. ఇవాళ కాలేజ్ కెళ్ళింది మేమిద్దరమేగా మరి అన్నాను:) సరే పదండి పైకి పోదాం అని తీసుకెళ్ళారు. ఐమాక్స్ లో నాకు తెలియని ఇంకో థియేటర్ ఉందని అప్పుడే తెలిసింది. ప్రీమియర్ షోలకి మాత్రమే ఆ థియేటర్ వాడుతారుట. ఇంతా చేస్తే లోపల అంతా లేడీసే, వేరే వాళ్ళెవ్వరూ లేరు. ఓహో..ఇది వుమన్ ఓరియెంటెడ్ మూవీ లా ఉందే అనుకున్నాం. మా అందరికీ పాప్కార్న్ కూడా ఇచ్చారు. అది తింటూ సినిమా చూట్టం మొదలుపెట్టాం.

హీరోయిన్ వైదేహి ఆటోలో రైల్వేస్టేషన్ కి రావటం తో మొదలైన సినిమా చివరివరకూ ఫ్లాట్ ఫాం మీదనే జరిగి పోయింది. ఒకటీ రెండూ పాటలకు మాత్రం వేరే లొకేషన్ లో తీసారు. మొత్తం అయిదు పాటలూ, కోటి సంగీతం లో బాగానే ఉన్నాయి. ఈ సినిమాకి సెట్టింగ్ ల ఖర్చు ఎక్కువలేనట్లే.

తల్లిదండ్రులు సెటిల్ చేసిన పెళ్ళి వద్దంటే తల్లి ఆత్మహత్య చేసుకుంటానన్నదని, తానే ఆత్మ హత్య చేసుకోటానికి అన్నవరం రైల్వే స్టేషన్ కి వస్తుంది. రాబోయే సింహాద్రి ట్రైన్ కింద పడి చనిపోవాలని ఈ అమ్మాయి ఆలోచన. స్టేషన్ లో కూర్చోని తాను చనిపోదలచుకున్నానని ఒక సూసైడ్ నోట్ రాస్తుంది. ఇంతలోనే అది గాలికి ఎగిరిపోతుంది. అక్కడినుంచి స్టేషన్ లో అనేక పాత్రలు పరిచయమౌతాయి. అక్కడి స్టేషన్ మాస్టర్, ఒక చిన్న ఫామిలీ, ఒక దొంగ, ఓ ప్రభువు కుమారుడు, ఇద్దరు జ్యోతిష్కులు, ఒక గ్రూప్ ఫాక్షనిస్ట్ లు, ఇద్దరు సన్యాసులు, అక్కడే ఒదిలేయబడ్డ ఒక చంటి బాబు క్రమంగా మనకి పరిచయమవుతారు.

స్టేషన్ లో వదిలేయబడ్డ ఆ చిన్న బాబును హీరో రాము, వైదేహి కొడుకనుకొని ఆమెకివ్వడానికి ప్రయత్నిస్తాడు. కాని ఆ బాబు ఆమె కొడుకు కాదని తెలుసుకొని ఇద్దరూ ఆ బాబు తల్లి కోసం వెతుకుతూ ఉంటారు. ఈ లోపల ఎగిరిపోయిన వైదేహి సూసైడ్ నోట్ దొరికి సన్యాసులు ఆమెని కాపాడాలని స్టేషన్ లో వెతుకుతూ ఉంటారు. కాని అనుకోకుండా ఆ నోట్ హీరోకి దొరుకుతుంది. అతడు కూడా ఆ అమ్మాయిని కాపాడి ఆత్మహత్య చేసుకోకుండా జీవితం విలువ గురించి చెప్పాలని ప్రయత్నిస్తూ ఉంటాడు ఆ అమ్మాయి కోసం వెతుకుతూ ఉంటాడు. ఆ అమ్మాయి దొరికేవరకూ ట్రైన్ లేట్ కావాలని కోరుకుంటూ ఉంటాడు. ఈ లోపల మిగతా పాత్రలతో హాస్యం పండించటానికి ప్రయత్నించారు దర్శకుడు చంద్ర మహేశ్. మధ్యలో కౌశ తో ఒక అయిటమ్ సాంగ్ కూడా వస్తుంది.

ఈ సినిమాలో కొన్ని సంఘటనలు బాగున్నాయి. స్టేషన్ కి వచ్చిన అనాధ బాలలను ఓదార్చిన విధానం బాగుంది. ఫాక్షనిస్ట్ ల తో హాస్యం కూడా బాగుంది. మధ్య మధ్య లో కొన్ని స్పెషల్ జోకు లొస్తాయి. అవికూడా బాగానే ఉన్నాయి.

ట్రైన్ లేట్ అయినా కొద్దీ కొన్ని సంఘటనలు జరుగుతూనే ఉంటాయి. ఇంతకీ ఆ బాబు ఎవరన్నది కూడా సస్పెన్స్ ని పెంచుతుంది. అన్నట్లు ఆ తల్లి మొదటి నుంచి మన కళ్ళముందే ఉంటుందండోయ్. మరి మీరు కనుక్కో గలరేమో చూడండి. అంతే కాదు, ఇంతకీ ఆత్మహత్య చేసుకోదలచిన అమ్మాయిని రాము కనుక్కొని కాపాడ గలడా! ఆత్నస్థైర్యాన్ని పెంచుకొని జీవితాన్ని సక్రమంగా మలచుకోవాలి గాని ఆత్మహత్య సరిఅయిన విధానం కాదు...అనే మెసేజ్ మీద ఈ సినిమా తీసారు. ఆత్మహత్య వద్దూ అన్న ఈ సినిమాలో ఒక ఆత్మ హత్య కూడా చూపించారు. ఈ సినిమా బాగుందా లేదా అన్నది మీరే తేల్చుకోండి. ఒకటే సెట్ మీద అనేక సినిమాలే వచ్చాయి. వాటన్నిటిలో ఇదికూడా ఒకటే. ఆ మధ్య వచ్చిన మొత్తం సినిమా ఎయిర్ పోర్ట్ లోనే జరిగిన ప్రయాణం చూసాను. ఫరవాలేదనిపించింది. ఈ సినిమా కూడా ఫరవాలేదు. అంతే.

సినిమా అయిపోయిన తరువాత ప్రెస్ మీట్ జరిగింది. ఫ్రీ గా సినిమా చూసిన ఈ మహిళలందరూ ఆ మీట్ లో పాల్గొనాలి. బయటకు రాగానే అక్కడ ఒక్కసారే బ్రైట్ లైట్స్ , కామెరాలతో, మైక్ లతో చానల్స్ వాళ్ళు కనిపించారు. కవిత,
సినిమా హీరో నిఖిల్, దర్శకుడు చంద్ర మహేష్, అశోక్ కుమార్, శివారెడ్డి మొదలైన వాళ్ళున్నారు. ఇంక మా వాళ్ళందరూ హుషారుగా నిర్మాత రామానాయుడుని,
సినిమా ని తెగ పొగిడేసారు. ఇదంతా ఇంక రోజూ టి.వి. లో కొంతకాలం వస్తూ ఉంటుందిట. నేను అందులో పాల్గొనలేదు కాని, అంతా అయిన తరువాత ఆ డైరెక్టర్ తో మాత్రం కాసేపు నా డౌట్స్ గురించి మాట్లాడాను. అంటే కుంజెం ఇంటర్వ్యూ చేసానన్నమాట. ఏమాటకా మాటే చెప్పుకోవాలి. హీరో కన్నా డైరెక్టరే బాగున్నాడు. హీరోయిన్ మదాలస కూడా బాగుంది.

మీరూ చూడండి మరి ఈ సినిమా. ఫ్రీ గా వచ్చింది నువ్వు చూసేసావ్ అంటారా. మరి ఇవాళ నా అదృష్టం అలా వచ్చింది. అన్నట్లు ఈ సినిమాలో "నీ కివాళ అదృష్టం కలిసొస్తుంది" అన్న వేయింగ్ మిషన్ కాప్షన్ చాలా సార్లే వస్తుంది. చూడాలి మరి నాకెంత కలిసొస్తుందో ఈ సినిమా తరువాత.:) ఆలస్యం మూలం గా అమృతం సంపాదించుకోవచ్చు మరి.


`ఏడవకే...ఏడవకే చంటిపాపాయి ...’




*******************************************************************************

1, డిసెంబర్ 2010, బుధవారం

సరికొత్త చీర ఊహించినాను......

ఎవరికైనా వెంకటగిరి చీరలు కావాలంటే చెప్పండి. ఈ చీరలు కట్టీ కట్టీ మా కలీగ్స్ తో బాగా తిట్లు తింటున్నాను. ఈ చీరలకు నేను బ్రాండ్ అంబాసిడర్నట. నేనే ప్రమోట్ చేస్తున్నానట. అన్నీ అవే కడ్తున్నాను కాబట్టి నా పేరు వెంకటమ్మట. అబ్బో చాలా మాటలే పడ్తున్నానులెండి. ఎవ్వరూ నామీద కొంచమైనా జాలిచూపించట్లేదు.

ఇంతకీ నీ గొడవేంటి అంటారా!!! ఏం లేదండి. చాలా కాలంగా వెంకటగిరి నుంచి అక్కడే చీరలు తయారు చేసే ఒకాయన ప్రతినెలా ఇక్కడికి వస్తున్నాడు. చీరలన్నీ తెలిసిన వాళ్ళకి అమ్ముకుని పోతాడు. గత కొంతకాలంగా ఈ పని జరుగుతోంది. వచ్చినప్పుడల్లా తప్పకుండా నాక్కూడా రెండో మూడో చీరలు అంటగట్టకుండా పోడు. దాంతో, నేను అన్నీ వెంకటగిరి చీరలే కట్టాల్సి వస్తోంది. ఎవరికన్నా పెట్టాల్సినా నేనివే చీరలు ఇస్తున్నాను. పెళ్ళిళ్ళకి పబ్బాలకి నేనే గిప్ట్ ఇస్తానో అందరికీ ముందే తెలిసి పోతోంది. మా అక్కా మా అమ్మా అయితే ఊరికే ఆ వెంకటగిరి చీర తీసుకొని రాకు మా దగ్గరికి అని నాకు గాట్ఠిగా వార్నింగ్ ఇచ్చేసారు కూడా. మా అత్తగారు కూడా ఒప్పుకోటం లేదు. ఎందుకులెండి...నా కడుపు చించుకుంటే నా కాలిమీదేగా పడేది.

వద్దయ్యా బాబూ ఈ చీరలు నాకింక, నే కూడా నీతోపాటు ఓ షాప్ పెట్టాల్సిందే ... అంటే అతను ఒప్పుకోటంలేదు. తెగ బతిమలాడుతున్నాడు. నా కష్టాలు చెప్పినా వినిపించుకోటం లేదు. పైగా తన కష్టాలు నాకు చెప్తాడు. మీకు చాలా తక్కువ రేట్ కిస్తాను తీసుకోమంటాడు. అక్కడ నేసిన చీరలు డైరెక్ట్ గా మీకే ఇస్తున్నాను అంటాడు. ఈ చీర మీకు చాలా బాగుంటుంది ... ఈ రంగు బాగుంటుంది అంటూ తెగ ఉబ్బేస్తాడు.ఈ చీర మీ కోసమే తెచ్చాను, ఇంకెవరికీ అడిగినా ఇవ్వలేదు అంటాడు. మరి కరిగి పోకుండా ఎలా ఉంటాను చెప్పండి. నా మనసేమో వెధవ మొహమాటం నువ్వూనూ....తీసుకో...అంటుంది. నేనేమో ఒకటే మొహమాటపడిపోతూ ఉంటాను. ఒక్కోసారి గట్టిగా చెప్పినా వినిపించుకోడు. అంత పెద్దమనిషిని కోప్పడలేంకదా. కానీ నాకు మాత్రం ఆ చీరలన్నీ చూడగానే రంగురంగుల తమాషా పిట్టలన్నీ రకరకాల రాగాలు తీసుకుంటూ నా చుట్టూ తిరుగుతు ఎంత హొయలు పోతున్నాయమ్మా అనిపిస్తుంది. నా కళ్ళల్లోంచి మెరుపుల జిలుగులు ఆ చీరలంతా పరుచుకుంటాయి.

అతడు ముస్లిం. కాని చక్కని తెలుగు మాట్లాడుతాడు. తన ఇద్దరు కొడుకులు కూడా ఈ పనిలోనే ఉన్నారట. ఏం చదువుకోలేదు అంటాడు. వేరే ఉద్యోగాలు ఏమీ చేయలేరు. స్వంత మరదలే పెళ్ళి చేసుకోను అందట. వాళ్ళకు ఎక్కడా పెళ్ళి సంబంధాలే కుదరట్లేదట. మా పిల్లలు చాలా అమాయకులు, సిటీలోకొచ్చి బతకలేరు. ఇప్పుడేమో ఈ చీరలెవరూ కొనటంలేదు, అని మొన్న కళ్ళనీళ్ళు పెట్టుకున్నాడు. అయ్యో పాపం అనిపించింది. కాని నేనేం చేయగలను. ఆ చీరలు కూడా చాలా ఖరీదైనవి. ఎవరైనా ఎన్నని కొనగలరు....ఆయన కొడుకులకు నేను పెళ్ళిసంబంధాలు ఎలాగూ కుదర్చలేను కదా....అందుకని చీరలైనా కొనాలికదా పాపం.

ఎలా నేను తప్పించుకోవాలో తెలియటం లేదు. కాని ఏ మాటకా మాటే చెప్పుకోవాలి. చీరలు మాత్రం అస్సలు వదులుకోబుద్ధికాదు. చాలా ముద్దుగుంటాయి. కావాలంటే మీరూ చూడండి. ఎంతబాగున్నాయో. నిజంగా ఏ చీరకుంది ఇంత అందం అనిపించటం లేదు.






























అబ్బాయిలూ నిజం చెప్పండి..."మీ కోసం" కొనేయాలనిపించటం లేదూ... అమ్మాయిలూ మీ మనసు దోచేయటంలేదూ...తప్పకుండా ఇప్పుడే కొనేస్తారు...నాకు తెలుసు

ఈ చీరలు చూస్తూంటె ఎంతో అందమైన ఈ పాటే నాకు గుర్తొస్తుంది.

సరికొత్త చీర ఊహించినాను
సరదాల సరిగంచునేయించినాను
మనసూ మమతా పడుగు పేక
చీరలో చిత్రించినాను
ఇది ఎన్నో కలల కలనేత
నా వన్నెల రాణికీ సరి జోత
అభిమానం గల ఆడపిల్లకు అలక కులుకు ఒక అందం
ఈ అందాలన్నీ కలబోసానే....కొంగుకు చెంగును ముడివేస్తానే
చుర చుర చూపుల ఒకమారు
నీ చిరు చిరు నవ్వుల ఒకమారు
మూతి విరిపుల ఒకమారు
నువ్వు ఈ కళనున్నా మా బాగే...ఈ చీర విశేషం అల్లాగే..........
సరికొత్త చీర ఊహించినాను..........

ఇంకా చూడండి...రంగురంగు చీరల వన్నెచిన్నెలు..........

చుట్టూ చెంగావి చీర కట్టావే చిలకమ్మా.........

Get this widget | Track details | eSnips Social DNA


****************************************************************************

20, నవంబర్ 2010, శనివారం

"పంతులమ్మల డే అవుట్"



ఇవేనండి...మా వంటలూ...వనభోజనాలూ... మరి మీ అందరు వస్తారా మాతో........



చాలా రోజులయింది. హాయిగా కబుర్లు చెప్పుకొని. అందరం తీరిక లేకుండా అయిపోయాం. ఏమన్నా ప్రోగ్రాం వేయండి, కాస్త అలా తిరిగేసి వద్దాం అన్నారు మా ప్రిన్సిపల్ మేడం. ఇంకేం దొరికిందే ఛాన్స్. వదలకూడదనుకొని అందరం ప్లానింగ్ మొదలుపెట్టాం. అక్కడున్న పదిమంది పది ప్రోగ్రాంస్ పెట్టారు.పొద్దున్న పోయి సాయంత్రానికి ఒచ్చేయొచ్చు, సిటీ లో గోల్కొండా ఫోర్ట్, మ్యూజియం చూసొచ్చేద్దాం అన్నారు ప్రిన్సిపల్. అబ్బా!!!అనుకొని అందరం ఒకరి మొఖాలు ఒకరం చూసుకున్నాం. కొందరికైతే బిక్కమొహాలే పడ్డాయి. ఎలా? ఏం చేయాలి?

కార్తీక మాసం కదా, హాయిగా మనకి దగ్గిరలోనే ఉన్న అనంతగిరి అడువుల్లో తిరిగొద్దాం. చక్కగా వనభోజనాలు కూడా చేసుకోవచ్చు. సైట్ సీయింగ్ బాగుంటుంది. చక్కటి పురాతన గుడి కూడా ఉంది. అక్కడే మా ఫాం హౌజ్ కి వెల్దాం అంది మా వంశీ. గుడి అనంగానే మా ప్రిన్సిపల్ వెంటనే ఒప్పేసుకొని, సరే అందర్నీ కనుక్కోండర్రా ఎవరెవరొస్తారో, మొత్తం ప్లాన్ చేయండి అన్నారు. హమ్మయ్యా, భలే ఒప్పించావ్, లేకపోతే అందరం ఆ సాలార్జంగ్ మ్యూజియం చుట్టూ తిరిగేవాళ్ళం అని వంశీ ని పొగిడేసి తెగ సంబరపడిపోయాం. మిగతా విషయాలేవీ మాకు సమస్యకాదు కాబట్టి వెంటనే ఏర్పాట్లన్నీ జరిగిపోయాయి. వర్కింగ్ డే పోనివ్వరు కనుక, సెకండ్ సాటర్ డే ప్లాన్ చేసుకున్నాం.

పొద్దున్నే ఆరు గంటల కల్లా బయలు దేరాలి. అందుకని మా హాస్టల్ లోనే పులిహోర, దద్దోజనం, పూరీ కూర లంచ్ గా తయారుచేయించుకొని వెళ్ళాలనుకున్నాం. రకరకాల తినుబండారాలెలాగూ తీసుకెల్తాం. చాల్లే అనుకున్నాం.

పొద్దున్నే అందరం కాలేజ్ దగ్గరికి చేరుకున్నాం. మా వెహికల్ కూడా వచ్చేసింది. ఎవ్వరూ ఆలస్యం చేయలేదు. అహా, సాగింది ప్రజా రధం అని పాడటం మొదలు పెట్టారు. పదండి ముందుకు..పడండి ముందుకు..పద పద తోసుకు పదండి అని ఇష్టమొచ్చినట్లు కేకలు పాటలు. ఎన్ని రోజులయిందో ఇలా ఎంజాయ్ చేసి అనుకున్నాం. అదేంటర్రా...వెంకటరమణా గోవిందా..గోవిందా అనాలి అన్నారు మా ప్రిన్సిపల్. అలా అంటే గోవిందా అయితామేమో అని నవ్వుకున్నాం. అంత పొద్దున్నే ఖాళీ రోడ్ల మీద అలా పోతూఉంటే ఎంతో ప్రశాంతంగా అనిపించింది. మెల్లిగా ఊరి పొలిమేరలు కూడా దాటేసాం. ఆ సమయంలో రష్ లేని హైద్రాబాద్ చాలా అందంగా కనిపించింది.

మా అంత్యాక్షరీకి, అల్లరికీ అడ్డే లేకుండా ప్రయాణం కొనసాగింది. ఒక గంట తరువాత దారిలో కనిపించిన ధాభా దగ్గిర ఆగాం. అందరూ చాయ్..చాయ్ అని గొడవ పెట్టేసారు మరి. హాయిగా ఆ చుట్టుపక్కలే ఉన్న ప్రాంతాల్లో చెట్ల మధ్య తిరుగూతూనే టీ తాగాం. అక్కడ చుట్టూ చింత చెట్లు నిండా కాయలతో ఉన్నాయ్. ఆ కాయలన్నీ చింతపండుగా కూడా అయిపోయినై. అయినా సరే అందరం ఆ "చింతపండు కాయ" లే కోసుకొని పరమానందంగా చప్పరించాం. ఆహా! చెట్టుమీద చింతపండు ఎంత రుచో. ఇదీ నాచురల్ పూడ్ అంటే, మన వన భోజనాలు ఇంక మొదలైనట్లే అని సంబరపడిపోయాం.

మెల్లిగా అనంతగిరి అడువులకు చేరుకున్నాం. చిక్కటి ఆ అడువుల్లో పోతూ ఉంటే ఏదో దివ్యలోకాలకు వెళ్తున్న అనుభూతే కలిగింది. సుదూరంగా వ్యాపించిన పచ్చని గడ్డి బయలు, రెల్లు పొదలు, బూరుగు చెట్ల చిటారు కొమ్మల మీద నుంచి జారిపోతున్న బంగారు కాంతులీనే ఆ నీరెండ...పైన నీలాకాశం ఎంతోదూరం...చాలా దూరం వరకూ అంతే నీలాకాశం...ఒఠ్ఠి నీలం....పులులో చిరుతలో తిరుపతిలో లాగా ఇక్కడ కూడా తిరుగుతూ మాకడ్డమొచ్చేస్తే ఎలా అని ఒక నిముషం భయమేసింది. పులిలాంటిదేదో కనిపించింది కూడా. కాని మెల్లిగా అది కుక్క ఆకారంలో బయటపడింది:)

ముచుకుందా నది ఇక్కడే పుట్టిందట. అదే మూసీ నదిగా మారింది.ఈ అనంత గిరికి మార్కండేయ క్షేత్రమని, దామ సరోవరమని పేరట. ఇక్కడే మార్కండేయుడు తపస్సు చేసి అనంతపద్మనాభస్వామి ని సాక్షాత్కరింపచేసుకున్నాడట. అలాగే గంగా దేవిని కూడా ఇక్కడికి రప్పించుకున్నాడట. ఆ పేరుమీద సరోవరం ఏర్పడింది.

ఇక్కడి ప్రకృతికి, వాతావరణానికి ఆనందపడి, అక్కడ మృగాలు స్వేచ్చగా తిరగటం గమనించి నిజాం ప్రభువులు ఇక్కడికే వేటకొచ్చేవారట. ఇక్కడ దొరికే పచ్చటి గరిక తోటే తమ గుర్రాలని మేపేవారు. ఇక్కడ దొరికిన సాలగ్రామాలను చూసి, అనంతపద్మనాభ దేవాలయాన్ని నిర్మించారు. అది మాత్రం విచిత్రమే. ఆ తర్వాతనే ఎంతో మంది హిందువులు ఈ దేవాలయాన్ని దర్శించటంతో ఈ స్థలం ప్రసిద్ధిగాంచింది. ఇక్కడి స్థల పురాణం కూడా చాలా గొప్పగానే చెప్తారు. ఈ దేవాలయాన్నే మేము దర్శించుకొంది.

ఈ చుట్టు పక్కల ఎంత బాగుందో. ఈ గుడి నిర్మాణం కూడా మహ్మదీయ సాంప్రదాయాన్నే చూపిస్తోంది. కొంచెంలోయలోకి ఉన్న ఈ గుడి ని పైనుంచి చూస్తుంటే ఎంతో ఎత్తుకు పెరిగిన ఈ చెట్ల గుబురులే ఎండా వాన నుంచి ఈ గుడిని కాపాడుతున్నాయా అనిపిస్తుంది. ఈ గుళ్ళో పెళ్ళి చేసుకుంటే ఎటువంటి కష్టాలు కలగవంట. (పెళ్ళికూతురికి మాత్రమే ఇది వర్తిస్తుంది). ఎలా వాడుకలోకొచ్చిందో నాకు మాత్రం తెలీదు. కాబట్టి పెళ్ళి కాని అమ్మాయిలూ కొంచెం ఈ సంగతేంటో ఆలోచించండి. అసలు సంగతి అబ్బాయిలకి మాత్రం తెలియనియ్యకండేం. మేము వెళ్ళేటప్పటికే అక్కడ ఒక పెళ్ళి జరుగుతోంది.

ఈ గుడే లోయలోకి ఉందనుకుంటే, అక్కడినుంచి ఇంకా లోయలోకి మెట్లు, కాలి బాట ఉన్నాయి. సరోవరం అక్కడుందన్నమాట. ఈ నడక మాత్రం చాలా ఆహ్లాదాన్ని కలిగించింది. అవధుల్లేని ఆకాశంలో పరుచుకుంటున్న మేఘాల్ని అందుకోటానికి పైపైకి పాకి పోతున్నఆ పచ్చటి చెట్ల తోరణాలు ఎంత బాగున్నాయో. నేల మీద రాలిన వన్నెచిన్నెల పూలు కొత్త కొత్త రంగవల్లుల డిజైన్ల లా ఉన్నాయి. అక్కడే కూర్చుని కాపీ చేసుకుందా మనిపించింది. కాని, ఆ అల్లిక జిగిబిగి నా తరమయ్యేనా! 'ఎవరు నేర్పేరమ్మ ఈ కొమ్మకూ...పువులిమ్మనీ రెమ్మ రెమ్మకూ...ఎంత తొందరలే హరి సేవకూ...పొద్దు పొడవక ముందే పువులిమ్మనీ' అని మనసు లోనుంచి బయటకొచ్చింది ఈ అందమైన అనుభూతి. అసలు అలంకరణ అనే కళ ప్రకృతి దగ్గిరే మనం నేర్చుకోవాలి. పరలోకమంటే ఇదే! అక్కడి దాకా వెళ్ళిన వాళ్ళం కొంత మందిమే:)

అప్పటికే మధ్యాహ్నం అయిపోయింది. అందరి కడుపుల్లో ఎలుకలు కాదు...కాదు...గుర్రాలు..ఏనుగులు పెరేడ్ చేయటం మొదలుపెట్టాయి. బహుశ: అడువుల్లో ఉన్నందుకు ఇలా ఉందా అనిపించింది కాని, తొందరలోనే మాకర్ధమయ్యింది...ఆ జంతువుల్ని బయటకు తోలేయాల్సిన అవసరమేర్పడిందని.

పరిగి లో ఉన్న ఫామ్ హౌజ్ కెళ్ళి అక్కడి పొలాల్లో భోంచేద్దామనుకున్నాం. అక్కడి నుంచి మళ్ళీ ఓ అరగంట ప్రయాణం సాగించాం. ఈ పయనం అమేయం..అద్భుతం. దారంతా పచ్చటి పసుపు తోటలు. గాలి తెమ్మరలో తేలి వస్తున్న ఆ పసుపు లేలేత సువాసనలు ఇన్నాళ్ళ మా కాలుష్యాని పూర్తిగా వదిలించేసింది. దూరంగా కనిపిస్తున్న టేకు చెట్లు, వాటి మీద పరుచుకున్న తెల్లటి పూలు అంబరమంటిన హృదయాలను తలపించాయి. అంతేనా, కాలీ ప్లవర్, కాబేజ్ తోటలు నేల మీద పరచిన కొత్తరకం తివాచీలను చూపిస్తున్నాయి. ఇంక జొన్న చేలైతే పిల్లగాలులకు తలలూపుతూ మమ్మల్ని ఎంత ఆనందంగా ఆహ్వానించాయో చెప్పలేను. దారిలో కనిపించిన సన్నటి నీటి వాగు గలగల లాడుతూ స్వచ్చమైన నీటితో హొయలు ఒలకబోస్తూ సన్నటి రాగాలు తీసుకుంటూ మమ్మల్ని కూడా తనతో రమ్మని ఎంతగా పిలిచిందో!!!అక్కడే మత్తు గొలిపే మొగలి పొదలు ఆవరించుకొని ఉన్నాయి. హత్తుకునే చల్లని గాలి,ఆ పూల పరిమళంతో చేరి పరవశింప చేస్తున్నాయి. ఆ సౌందర్యపు అనుభూతే తప్ప, నేను అన్న ఉనికి పూర్తిగా మాయమైంది.

ఇన్ని ఆనందాలతో కొనసాగిన మా ప్రయాణం మాకే తెలియకుండా ఎంత తొందరగా గమ్యం చేర్చిందో. పొలాల మధ్య ఒంటరిగా ఉన్న ఆ ఫామ్ హౌజ్, చుట్టూ ఉన్న రక రకాల పూల తోటలు, కూరగాయ మొక్కలు అనేక రకాల పండ్ల చెట్లు ఏ చిత్ర కారుడూ చిత్రిం చలేని గొప్ప చిత్రాలనే మాకు చూపించాయి. చుట్టూ ఉన్న పొలాలు మమ్మల్ని చూసి సన్నగా తలలూపాయి. రండి..రండి అన్నాయి. గడ్డి పూలు కూడా అందంగా విచ్చుకొని నీటి తుంపరల ముసుగులో ఆకర్షిస్తున్నాయి. ఆకాశపుటంచున ఒక సన్నని మెరుపు మెరిసి, ఒక్క క్షణంలో ఇంద్రధనుస్సులోని రంగులన్నీ అక్కడ ఆరబోసింది. అప్పుడే మొదలైన సన్నటి వర్షపు వెండిపోగులు మమ్మల్నివానా వానా వల్లప్ప ఆడుకునేట్లు చేసాయి. తుమ్మచెట్లు తలలూపుతూ పూలను నీటిలో రాలుస్తున్నాయి. పిల్ల తెమ్మరలు పరవశింప జేస్తున్నాయి. అలా ఆడుకుంటూ పాడుకుంటూ తిన్న మా పులిహోర, దద్దోజనమే మాకు పంచభక్ష పరమాన్నాలు. అవే మా కార్తీక వన భోజనాలు.

విరిసిన ప్రతి పువ్వూ అమాయకంగా చేతులు చాచి మరీ మమ్మల్ని వెనక్కి పిలిచాయి...."అప్పుడే వెళ్ళిపోతారా, మీ లోకానికి"......




************************************************************************************

10, నవంబర్ 2010, బుధవారం

నా కోసం......




గగనాన హత్తుకున్న చంద్రునిలా
నీదరిని చేరని నన్నిలా
అప్పుడే ఆలపించిన గీతంలా...
నా మది గలగలా, సముద్రపు జీవనదిలా,
నీ దరహాసం చేరాలి నను గాలితరంగంలా
ఓ నా ప్రియ నేస్తమా, వెన్నెల్లా ఎల్లకాలం
నా గుండె గుడిలో దాగిపో...
తారలతోనే జీవిత కాలం గడిపే చంద్రునిలా
కడలితోనే మమైకమైన కెరటంలా కలకాలం
నీ కోకిల గానం, నా మూగ మదిలో నింపిపో...
ఎండల్లో, వానల్లో నా కోసం వేచి ఉంటానని మాటిచ్చిపో
ఎందుకంటే నా మనసంతా ఉండిపోయింది నీ చెంతనే
అందుకే ఈ దిగులంతా ఓ నా నేస్తమా!
మేఘమా కదలిపోకు
పవనం వచ్చే వేళయింది
పుష్పమా పుప్పొడి రాల్చకు
భ్రమరం వచ్చే వేళయింది
స్వప్నమా జారిపోకు
నిదుర వచ్చే వేళయింది
హృదయమా కన్నీరు రాల్చకు
స్పందన ఇంకా మిగిలే ఉంది.....
మాటలే రాని వేళ, పాట ఎలా పాడను
కళ్ళలోన కడలి సాకి, ఎంతసేపు ఆపను
నిన్ను మరచి పోవాలని
నా హృదయాన్ని ఒక శిలగా మార్చుకున్నా,
నీ జ్ఞాపకాలు వాటిని శిల్పంగా మార్చాయి,
ఆ శిల్పమే నువ్వైతే నిన్ను మరిచేదెలా.....


****************************************************************************

15, అక్టోబర్ 2010, శుక్రవారం

`అమ్మవారు’






అందమైన ఆహార్యం తో, ఆకర్షణీయమైన చిరునవ్వుతో సినీ అమ్మవారుగా పేరు ప్రఖ్యాతులు సంపాదించింది కె.ఆర్.విజయ. గుర్తుంది కదూ.
అమ్మవారు అనంగానే తనే గుర్తొస్తుంది.

'నమ్మ వీతు దైవం' అనే చిత్రంలో వేసిన అమ్మవారి పాత్ర ఆ తరువాత అనేక చిత్రాల్లో దేవత గ నిలబెట్టింది.

తెలుగు సిన్మాల్లో ఎందరో దేవతా మూర్తులుగా నటించినప్పటికి, కె.ఆర్.విజయ కొచ్చినంత గుర్తింపు ఎవరికి రాలేదు.

అమ్మవారు నవ్వితే ఇలాగే ఉంటుంది అనే నమ్మకాన్ని ఆమె నవ్వు నిరూపించింది.
"పున్నగై అరసి" (క్వీన్ ఆఫ్ స్మైల్స్) అనే బిరుదుని తనకే స్వంతం అని ఇప్పటికి కూడా నిలబెట్టుకో గలిగింది.

అమ్మవారి రకరకాల అవతారాల్లో ఎన్నో చిత్రాల్లో నటించింది.

దేవీ లలితాంబ, అష్టలక్ష్మీ వైభవం, జగన్మాత, మా ఇలవేల్పు, శుక్రవారం మహాలక్ష్మి, శ్రీ వినాయక విజయం, త్రినేత్రం, శ్రీ దత్త దర్శనం వంటి అనేక చిత్రాల్లో ఆమె అమ్మవారుగా నటించింది.

అనేక రకాల ఈ అమ్మవారి పాత్రలు మనమీద ఇప్పటికి కూడా ఎంతో ప్రభావాన్ని చూపిస్తాయి.

ఒక దేవతగా సుకుమార, సౌందర్య, శాంత, లాలిత్య స్వభావాలను మనలో పెంచుతుంది.

అంతేకాదు దీనికి అవతలి కోణాన్ని కూడా మనకి చూపిస్తుంది.

అవసరమైనప్పుడు ఒక పాలకురాలిగా, దుష్టశక్తి సంహారిగా, జ్ఞానిగా, చాముండిగా మారాలి అనే స్పూర్తినిస్తుంది.

సున్నిత మనస్కురాలైన స్త్రీ అవసరమైనప్పుడు రౌద్రమూర్తిగా, ఉగ్రస్వరూపాన్ని పొందే శక్తినిస్తుంది

అవరోధాలను అధిగమించి, మనలోని శక్తిని మనమే బయటికి తీసుకొని రావాలనే ఆవేశాన్ని కలిగిస్తుంది.

రౌద్రం, శౌర్యం, ఉత్సాహం మనలో పెంచుతుంది.

అతి సౌమ్యమైన, అందాల అంబిక రూపం నుంచి భయంకర కాళిగా మారగలిగే కఠినత్వాన్ని ఇస్తుంది.

భక్తి ద్వారా శక్తిని పొంది ముక్తి వైపు నడిపిస్తుంది.

స్త్ర్రీ అబల కాదు సబల.

ఇదే అమ్మవారి వివిధ రూపాల సందేశం.

ఓంకార రూపిణీ...జగదేక మోహినీ....ప్రకృతీ స్వరూపిణీ...... రక్ష రక్ష జగన్మాత! నమో! నమో:





"అందరికి దసరా శుభాకంక్షలతో" ............ జయ

" జయము నీయవే! అమ్మా! భవానీ "














**********************************************************************************

3, అక్టోబర్ 2010, ఆదివారం

"నీ ఉజ్వల భవిష్యత్తు కోరుతున్నానురా కన్నా!!! "

బుజ్జులు,

నిన్న, అదే అక్టోబర్ 2 న నీ పుట్టినరోజు. యాపీ యాపీ బర్త్ డే కన్నయ్యా....

స్కూల్ వాన్ దిగుతుంటే నేను ఎదురు రాకపోయినా, పక్కింటి ఆంటీ తో మాట్లాడుతూ ఒక్క నిముషం నిన్నుచూడక పోయినా ఎంత అలిగే వాడివో. స్కూల్ వాన్ తలుపులో నీ చేయి వేలు పడిందని, మన చుట్టు పక్కల వాళ్ళంతా వొచ్చి చేరేలా నువ్వేడ్చినా, నేను బయటికి రాలేదని, అసలు ఇంట్లోనే లేనని ఎన్ని రోజులు గొడవ పెట్టావో. నేనొచ్చేవరకూ, చేతిలో గడ్డి పరకలు, ఇంకా ఏవేవో పట్టుకొని, హకల్బెరీఫిన్ లాగా నీలోనువ్వే ఏవేవో మాట్లాడుకుంటూ ఆక్ట్ చేస్తూ ఉండే వాడివి. ఇంట్లో కూడా నీరూంలో నువ్వు చదివిన బుక్స్ అన్నింటిలో రకరకాల డైలాగ్స్ గట్టిగా మాట్లాడుతూ ఫైటింగ్స్ కూడా చేస్తూ ఉండే వాడివి. నీ గదిలోంచి రకరకాల శబ్దాలు వినిపించేవి. ఒకసారి ఎవరో మీకెంతమంది పిల్లలండీ చాలా గోలగా ఉంటుంది అని కూడా అడిగారు. ఒక్కడే అంటే వాళ్ళు నమ్మనేలేదు.

గాంధీ పుట్టినరోజే నువ్వూ పుట్టావు శాంతంగా ఉండాలి, నువ్వు పేరుకి మాత్రమే శాంతం అంటే...నేను గాంధీ కాదుకదమ్మా అని నవ్వేస్తావు.

నీ పుట్టిన రోజని హారతిచ్చి, తాతయ్యకు, నానికీ కాళ్ళకు దండం పెడితే నీ కాళ్ళక్కూడా దండం పెట్టాలని ఎంత గొడవ చేసే వాడివో గుర్తుందా.

చిన్నప్పుడు నీ పుట్టిన రోజంటే చాలా హడవిడి చేసే వాడివి. అందరూ రావాల్సిందే. ఇంటినిండా బలూన్లు నీ ఫ్రెండ్స్ తో కట్టించే వాడివి. చివరికి పనమ్మాయి కూతురు రాకపోయినా వాళ్ళ ఇంటిముందే నిలబడి, ఏడ్చి రాగాలు పెట్టి, బతిమలాడుకొని మరీ తీసుకొచ్చే వాడివి. ఆ పిల్లేమో భయంతో బిక్కమొహం వేసేది. మీ అందరికీ ఎన్నో రకాల గేంస్ పెట్టి రకరకాల బహుమతులిస్తే చాలా గొప్పగా ఫీలయ్యే వాడివి.

కిరీటాలు, రకరకాల పెద్ద పెద్ద రాజుగారి నగలు, ఆయుధాలు ఎన్ని కొనిపించేవాడివో. ఇంటి నిండా అవే.

పిలిచిన పేరుతో పిలవకుండా, రకరకాల పేర్లతో పిలుస్తావమ్మా, నా మొత్తం పేరుతో పిలిచావంటే మాత్రం నా మీద నీకు కోపం వచ్చినట్లు లెఖ్ఖ, అని ఇప్పటికీ నవ్వుతావ్.

నాతో కావాల్సిన లెసెన్స్ అన్నీ చెప్పించుకొని...నేనేమన్నా నీ స్టూడెంట్నా నా మీద అరుస్తున్నావు ...అనుకుంటూ దర్జాగా వెళ్ళిపోయేవాడివి.

నీ బర్త్ డే కి ప్రతిసారి హాలిడే వస్తుందని, స్కూల్లో శలవివ్వద్దని చెప్పమని ఎంత రభస చేసే వాడివో. చివరికి ఎసెంబ్లీ లో అనౌన్స్ చేయిస్తే, ఒక రోజు ముందుగానే అందరి విషెస్ తో, మహా ఆనందంగా ఇంటికొచ్చే వాడివి. అంతేనా! మర్నాడు స్వీట్స్ కూడా తీసుకెళ్ళే వాడివి. మొత్తానికి ప్రతిసారి నీ పుట్టిన రోజు రెండేసి రోజులు చేయించే వాడివి. గుర్తుందా, బేటా.

ఇప్పుడు పుట్టినరోజుకి ఇంట్లో పార్టీలు కాకుండా, నీ ఫ్రెండ్స్ తో బయటికి వెళ్ళి ఎంజాయ్ చేస్తున్నావు. కేక్ కటింగ్, అర్ధరాత్రి ఫ్రెండ్స్ విషెస్ మొదలయ్యాయి. హొటల్ కొద్దురా మటన్ కలుస్తుంది అంటే, మటన్ ముక్కలు మా ఫ్రెండ్ తో తీసేయిస్తాలే అంటావు. మోపెడ్ ఎక్కుతా అంటావు. కిందపడ్తావురా అంటే అస్సలు వినిపించుకోవు. ఇంటికొచ్చే వరకు ఎంత భయమేస్తుందో తెలుసా. మోపెడ్ కొనివ్వలేదని ఇంకా అలుగుతూనే ఉన్నావు. మోటర్ సైకిల్ మీద పోతున్న స్టూడెంట్స్, వాళ్ళ స్పీడ్ చూస్తే ఎంత భయమేస్తుందో, అదెంత డేంజరో చెప్తె వినవు. అన్నిటికీ ఇట్లా భయపడితే ఎట్లా అంటావు గాని, రోజూ చూస్తున్న ఆక్సిడెంట్స్ తో నా మనస్సు ఒప్పుకోటంలేదురా బాబులూ.

నువ్వు ఎదిగి ఎదిగి ఎంతో పెద్దవాడివై, నిండునూరేళ్ళు, సుఖశ్శాంతులతో, ఆనందమయ జీవితం గడపాలిరా, బంగారుతండ్రి..

చింటుగాడా, నీకు తెలియని విషయం ఒకటి చెప్పనా:) నీ పుట్టిన రోజునే నా "మనస్వి"లో కూడా రాయటం మొదలు పెట్టాను.

నీవు ధనరాశులు సంపాదించకపోయినా...మంచిపేరు సంపాదించుకో బాబా. నువ్వెంత అల్లరివాడివైనా, అమ్మ మాట నీకు ప్రాణమని నాకు తెలుసురా చిన్నా! వింటావు కదురా, అమ్మలూ!!!

ప్రేమతో అమ్మ.


***************************************************************

22, సెప్టెంబర్ 2010, బుధవారం

’ఎండమావిలో ఎడారి"!!!





మనిషి జీవిస్తూనే ఉన్నాడు. కాని, ఎలా!!! తన జీవితం సుఖమయం చేసే సాధనాలు శోధిస్తూ...ఈ పరిశోదన నాటికీ, నేటికీ కొనసాగుతూనేఉంది. శాంతియుతంగా, సులభంగా, నిశ్చింతగా జీవించటానికి మార్గాలు, ఆ నాటి రాతియుగం మానవుడు...నేటి అణుయుగం మానవుడూ వెదుకుతూనే ఉన్నారు. కృత్రిమంగా ఎన్నెన్నో సాధనాలు కనిపెడుతూనే ఉన్నాడు. కాని దేనికి!!! కేవలం నాలుగ్గోడల మధ్య బందీ కాకుండా ఎగిరిపోవాలనే. ఎన్నో కొత్త విషయాలు శోధించాలన్న ఉత్సాహమే, మానవుడ్ని చంద్రమండలం వరకూ తీసుకెళ్ళింది. అచిరకాలంలోనే ఈ మానవుడి తెలివి తేటలు, ఇంకా...ఇంకా..విస్తరిస్తున్న విశ్వంతోపాటు దూసుకెల్తూనే ఉన్నాయి. ఇంత ప్రగతి సాధిస్తున్న, అదే మానవుడు...తన అహంకారంతో అధ:పాతాళానికి పడిపోతున్న సంగతి మాత్రం తెలుసుకోలేక పోతున్నాడు. అంతులేని ఈ బ్రహ్మాండ భాండంలో పరమాణు తుల్యుడైన మానవుడెక్కడ? అతనికీ అహంకారమెందుకు?

సహజత్వాన్ని కృత్రిమంతో కలిపి నాశనం చేస్తున్నాడు. అన్నీ కృత్రిమాలే...ప్రేమా, అభిమానం, అనురాగం అన్నీ మేడిపండుపై మెరుగులే. గులాబీ కెంపుల అందాన్ని చూసి ఆనందించి అందుకోబోతే, చేతికి పెంకుల గులాబీ తగులుతుంది గట్టిగా. అప్పుడు కానీ అది కృత్రిమ గులాబీ అని తెలియటంలేదు. మన ఆనందం అంతా కేవలం దూరంగా ఉన్నంతవరకే....

సంఘీభావమే లేకపోతే మానవునికి ఆకాశంలోకి ఎగరటం సాధ్యమా? అతని తెలివి పెరిగి తారాపధాన్ని అందుకొనేదా? కానీ వ్యక్తిగతమైన విషయాల్లో మాత్రం, ఒకరితోఒకరు ఏకీభవించలేకపోతున్నారు. తన సంతోషం, సుఖం, అభివృద్ధి కోసం మరొకరి వినాశనానికి ఎన్నో కుతంత్రాలు ఉపయోగిస్తున్నాడు. ప్రస్తుతం ఇటువంటి అహంకారమే మనుషుల్లో ఎక్కువగా పాతుకుపోయి కనిపిస్తోంది. విజ్ఞాన శాస్త్ర పథంలో ఇతరులకు తోడ్పడి, సహకరించే మానవుని నైజం స్వవిషయాల్లో స్వార్ధపరత్వంతో నిండిపోతోంది. ఈ అహంకారం పోయిననాడే మానవుడు సంపూర్ణత్వాన్ని సాధించాడనిపిస్తుంది.

పురాణకాలంలో దేవదానవుల జాతిభేదమే వారిలో యుద్ధాలను ప్రేరేపించింది. ఆ కాలంలో జన్మత: శతృవులుగా ఉండి ఒకరినుంచి ఒకరు రక్షించుకోటానికి యుద్ధాలు చేసేవారు. చివరికి ఈ నాటికి మిగిలింది మాత్రం మనుషులే!!! ఇప్పుడు కేవలం ఒక్కరే అవటం మూలంగా ఎవరితో పోట్లాడాలి! తమ శక్తి సామర్ధ్యాలు ఎవరిమీద చూపించాలి? ఎవరిని జయించాలి? అన్నది అర్ధం కావటంలేదు. అందుకని మానవులే మానవులపై తమతమ ప్రభావాలు చూపించుకోవాలని, ఒక ప్రాంతపు ప్రజలు ఇంకోప్రాంతపు ప్రజలని లొంగదీసుకోవాలని ప్రయత్నిస్తున్నారు.

ఏ దేశ చరిత్ర పుటలు తిరగేసినా తేటతెల్లమయ్యేది ఈ విషయమే...వీరు మన పూర్వీకులు, ప్రత్యక్షంగా నీవు నా ఆధీనంలో ఉండాలి, లేకపోతే నా శతృవైన నీకు నాకు ఫలానా సమయంలో, ఫలానా చోట యుద్ధం జరుగుతుంది, అని ప్రకటించుకొని, ముఖాముఖి పోరాడుకొని, బలాబలాలు తేల్చుకునే వారు. ఒక విధంగా ఆ పద్ధతే నయమేమో!!!

కాని, ఈ నవీన కాలంలో...అణుయుగంలో, మానవుడు విశ్వంలోకి ఎగిరెగిరి పోతున్న ఈ సమయంలో, తన శతృవులెవరు..అన్నది ఒక సమస్యగా పీడిస్తోంది. మిత్రులలాగా సంచరిస్తూ వెన్నుపోటు పొడిచే వారొకరైతే... వీరు మన హితైషులు కారు అని తెలుసుకునే లోపలే భష్మం చేసేసే వారొకరు. అధికారం అనే ముల్లుకర్రతో పొడిచే వారొకరైతే, ఆశలు కల్పించి రంగుల వలలోకి రప్పించి ఉచ్చులు బిగించేవారొకరు. పైకి మటుకు అందరూ పెద్ద మనుషులే, సంస్కారవంతులే!!!! ఇటువంటి వారిని గుర్తుపట్టటమే కష్టమైతే, ఇంక వీరికి దూరంగా మసలటం అన్నది ఎలా సాధ్యం?

పదవి...అనే తన గొడుగును చేతిలో ఉంచుకొని, తన వారిని మాత్రమే ఆ నీడలో ఉంచి, పరులకు నీడలేకుండా చేయటమే తమ ధ్యేయంగా ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు. అందరూ అలాంటి వారేకాకపోయినా, కొందరైనా ఉన్నారు. చెదపురుగులు ఎన్ని ఉంటాయి. అవి ఎంత హాని కలుగచేస్తాయి? వాటిని గుర్తుపట్టటం అందరికీ సాధ్యమా? ఎవరికో...ఎక్కడో తప్ప సామాన్యంగా ఇలాంటివి కనిపించవు. ఇలాంటి పెద్దమనుష్యులను ఎలా గుర్తుపట్టాలి. ఒకవేళ గుర్తుపట్టినా...మనమేం చేయగలం? అటువంటి ప్రయత్నాల్లో మాడిపోవటమేనా చివరికి దక్కే ఫలితం?

ఈ ఆధునిక మానవుడు నాగరికత అనే వలువలను అధిక సంఖ్యలో ధరించాడు. విజ్ఞాన శాస్త్ర వినువీధిలో విహరిస్తున్నాడు. దశావతారాల్లో అయినా, " Organic evolution" చూపగల మేధా సంపన్నుడు. మరి నైతికంగా, సాంఘీకంగా సాధించిన ప్రగతి ఎంత? ఇప్పటి వరకు సాధించాను అనుకొన్న ప్రగతి ఎండమావేనా? తాను జీవితపుటెడారిలో, ఒయాసిస్ వైపుకు పురోగమించాననుకొన్న సమయంలో...అది కేవలం ఎండమావేనా? ఆ ఎండమావి చాటున దాక్కున్న అమానుషత్వమనే ఈ భయంకర ఎడారిని చూడగలితే....ఇప్పుడు కూడా బ్రహ్మదేవుడు, మానవులకు "శతృవు" ని సృష్టించి వీరే నీ శతృవు అని చూపించేసి ఉంటే బాగుండేదేమో!!!

"కవిని మాత్రం సూర్యునితో
ఖచ్చితంగా పోల్చవచ్చు
ఏడువన్నెలు జీర్ణించుకొని
ఏకవర్ణం చిమ్ముతాడు"
"ప్రమిదలో మినుకు మినుకు మనే తైల దీపం అంటుంది, నా చేతనైనంత సాయపడతాను ప్రభూ"!!! అని----ఠాగూర్.



****************************************************************************

25, ఆగస్టు 2010, బుధవారం

నాస్టీ ఎక్స్పీరియన్సా!!! అడ్వంచరా!!!!




ప్రతి సంవత్సరం వరలక్ష్మీ వ్రతం తప్పకుండా చేస్తాను. ఈ వ్రతమంటే నాకెంతిష్టమో చెప్పలేను. ఎప్పటిలాగే, చక్కటి పీఠం మీద బియ్యంపోసి, తమలపాకులు పెట్టి, విఘ్నేశ్వరున్ని తలచుకొని, ఒక పెద్ద బిందె మీద చిన్న బింద పెట్టి, చేతులుగా ఒక హాంగర్ కట్టి అమ్మవారి విగ్రహం తయారు చేసాను. అమ్మవారికి కొత్తగా కొన్న పట్టుచీర కట్టి, పెద్ద అంచులు కనిపించేట్లుగా అందంగా సద్దాను. పైన కలశం పెట్టి, కళకళ లాడే పెద్ద వెండి మొహాన్ని పొజిషన్ లో పెట్టాను. శుభ్రంగా ఉతికి ఉంచిన సవరాన్ని వెనకాల భుజాలదాకా పరచి, అందమైన పూలతో అలంకరించాను. పైన జలతారు మేలిముసుగు కూడా వేసాను. చక్కటి పూల దండ వేసి, వివిధ అభరణాలతో అలంకరించాను. గిల్టు, అసలు...అన్ని రకాలు ఉంటాయిలెండి. గౌరమ్మను కూడా చేసి పెట్టాను. వెనక గోడకంతా రకరకాల సైజుల్లో, షేపులతో రంగు రంగుల ఎలెక్ట్రిక్ దీపాల వరుసలతో అలంకరించాను. అమ్మవారి చుట్టూ ఎన్నో పూలు అందంగా ఉంచాను. కలువ పూల అందమైతే మరీ ప్రత్యేకంగా ఉంది. మొగలిపూల సువాసనలు ఆ గదంతా విరజిమ్ముతు ఏదో లోకాలకు తీసుకెళ్ళిపోతోంది. ఇంకా పెద్ద నుంచి చిన్న సైజు వరకు వెండి దీపాలు చుట్టూ పెట్టాను. చిక్కటి రంగులతో వేసుకున్న రంగవల్లి కన్నుల పండుగగా ఉంది. ఇదంతా అయ్యాక చూసుకుంటే అబ్బా.. మా అమ్మవారు ఎంత దేదీప్యమానంగా వెలిగిపోతున్నారో. వెలుగు జిలుగుల మా అమ్మవారు ఎంత ముద్దొస్తున్నారో. చాలా సంతోషమనిపించింది. అబ్బో ఎంత బాగా చేసానో అని భలే గర్వం కూడా వచ్చేసింది. నేను చేస్తున్న ప్రతి అలంకరణ మా అత్తగారు కూడా మెచ్చుకుంటూ ఉండడంతో ఇంకా మురిసి ముప్పందమైపోయాను. ఈ 'ముప్పందం' అంటే ఏమిటో నిజ్జంగా నాకుతెలీదు. ఇది మా అత్తగారి దగ్గిర పట్టిన మాటన్నమాట. కావల్సిన మిగతా పూజా సామాన్లన్నీ కూడా పొందంగా సద్దేశాను. నేను కూడా చక్కగా కొత్త పట్టుచీర కట్టుకొని, హాయిగా వంటినిండా నగలన్నీ పెట్టేసుకున్నాను. ఈ సారి చేయించుకున్న పచ్చలసెట్ వేసుకున్నాను. అబ్బో ఎంత బాగున్నానో..నన్ను చూసి నేనే మురిసి పోయాను. తెలుగాడపడుచంటే ఇలా ఉండాలి. నన్ను నేనే శభాష్ అని మెచ్చుకున్నాను. చక్కగా ఎర్రగా పండిన చేతి గోరింటాకు, చేతినిండా వేసుకున్నగాజులతో, మోచేయి వరకు మాత్రమే కనిపించేట్లుగా అమ్మవారితో ఒక ఫొటో తీసుకొని నా బ్లాగ్ లో పెట్టుకోవాలనిపించింది. అసలే ఈ మధ్యనే గాజులేసుకోనని రాసుకున్నాను బ్లాగ్ లో. తనకు తాను మురిసె తాటాకు గుడిసె అంటే ఇదేనేమో!!!

ఎట్లా నిన్నెత్తుకుందునమ్మా..వరలక్ష్మీ తల్లీ..ఎట్లా నిన్నెత్తుకుందునమ్మా...
ఇట్లా రమ్మనుచూ పిలిచీ కోట్లా ధనమిచ్చే నిన్ను....ఎట్లా నిన్నెత్తుకుందునమ్మా...అని పాడుకుంటూ వెళ్ళి నా డిజిటల్ కెమెరా తెచ్చాను. ముందుగా అక్కడే కూచుని అప్పటి దాకా నాకు సలహాలిస్తున్న మా అత్తగార్ని ఒక ఫొటో తీద్దామనుకున్నాను. ఆవిడకి ఫొటో దిగటమంటే చాలా ఇష్టం. ఫొటో అనంగానే చీర, అంచులూ, నగలూ అన్ని సద్దేసుకొని, నా వైపే కళ్ళర్పకుండా, నేనెప్పుడు ఫొటో తీస్తానా అని బిగించుకొని కళ్ళుకూడా తిప్పకుండా కూచున్నారు. తన ఫొటో ఏ కొంచెం బాగా రాకున్నా చాలా అలుగుతారు. కాని కెమెరా నుంచి చూస్తున్న నాకు అంతా ఎర్రగా కనిపిస్తోంది. ఎందుకబ్బా మా అత్తగారు ఎర్రచీర కట్టుకోలేదే అనుకుంటూ మళ్ళీ, మళ్ళీ చూసాను. ఊహూ... ఎర్రగానే కనిపిస్తున్నారు. ఇదేంటబ్బా, అనుకొని అమ్మవారి వైపు తిరిగి మళ్ళీ లెన్స్ నుండి చూసాను. అయ్యో! అమ్మవారు కూడా ఎర్రగానే కనిపిస్తున్నారు. అరె, అమ్మవారికి నేను ఎర్రచీర కాదే కట్టింది, అని మళ్ళీ చూసాను. లాభంలేదు, ఎర్రగానే ఉన్నారు. ఏంటబ్బా! అనుకొని, ఇంకో వైపున్న టి.వీ. వైపు లెన్స్ పెట్టి చూసాను. అంత పెద్ద నల్లటి స్క్రీన్ కూడా ఎర్రగానే ఉంది. అలా కాదని మిగతా రూమ్ ల్లోకి పోయి అన్ని చోట్లా చూసాను. మా ఇల్లంతా ఎర్రగానే ఉంది. ఎందుకు మా ఇల్లంతా ఎర్రగా అయిపోయిందో అర్ధం కాలేదు. ఈ లోపల మా అత్తగారు అసహనంతో, ఇంకెప్పుడమ్మాయ్, నన్ను ఫొటో తీసేదీ అని గట్టిగా పిలిచారు. అన్ని గదుల్లో సంచరిస్తున్న నేను, ఇంక ఆ ప్రయత్నాలు ఆపి మా అత్తగారి దగ్గరికెళ్ళి మళ్ళీ చూశాను. ఊహూ..ఇంకా ఎర్రగానే ఉన్నారావిడ. ఒక నిమిషం భయం వేసింది. కాని మెల్లిగా నా ట్యూబ్ లైట్ బుర్ర వెలిగి, కెమెరా పాడైంది అని అర్ధమైంది. వెంటనే గాలి తీసిన బెలూన్ లా అయిపోయాను. అయ్యో! ఫొటో తీసుకోలేనా..ఎంత దిగులేసిందో. దిగులెందుకు, రెండు లైన్ల అవతల ఒక ఫొటో స్టూడియో ఉంది. అక్కడికి పోతే నిముషాల్లో రిపేర్ చేసేసి ఇస్తాడు. తెలిసిన వాడే. మా కాలేజ్ కి ఆస్థాన ఫొటోగ్రాఫరే. ఇప్పుడే పోవాలి. సాయింత్రమైతే పేరంటాళ్ళందరూ ఒచ్చేస్తారు. ఇంకా చాలా పని ఉంది. తొందరగా వచ్చేస్తే సరి అని బయలుదేరాను.

కొంచెం దూరంలో ఒక జంక్షన్ ఉంది. రోడ్ దాటాలి. ఇటు పక్కగా కొన్ని కార్లు వరుసగా ఆగి ఉన్నాయి. నేను రోడ్ దాటాలి అంటే ట్రాఫిక్ కంట్రోల్ అయితే తప్ప దాటనన్నమాట. అందుకని అక్కడే ఒక కార్ కానుకుని నించుని సరిఅయిన చాన్స్ కోసం చూస్తున్నాను. మిగతావాళ్ళంతా, వాళ్ళ రెండు చేతులు ఊపేసుకుంటూ, వెహికల్స్ ఆపేసుకుంటూ చకచకా రోడ్ దాటేస్తున్నారు. చీ..నాకీ పిరికితనం ఎప్పుడుపోతుందో. అయినా ఈ మాత్రం జాగ్రత్త ఉండాలిలే...నేనే కరెక్ట్, అనుకున్నాను. ఇలా నా అలోచనా తరంగాల్లో నేనుండంగానే, నా పక్కనే నించున్న ఒకాయన, మేడం, మీ గాజనుకుంట, పడిపోయింది...చూసుకోండి అన్నాడు. అసలే నావి కొత్త గాజులు. పైగా చిన్న క్లిప్ తోటి ఉంటాయి అవి. ఆ క్లిప్ తీసి చేతికి వేసుకొని మళ్ళీ క్లిప్ పెట్టేయటమే. అలా అయితే ఎవరికైనా వేసుకోటానికి సైజ్ ప్రాబ్లం ఉండదు. నేను తరువాత ఈ గాజులు నా కోడలికివ్వాలనుకుంటున్నాను. మరి తన సైజేంటో, ఇప్పుడు తెలీదుగా...అందుకన్నమాట. ఆ క్లిప్ ఊడి పడిపోయాయేమో!!నేను సరిగ్గా పెట్టుకోలేదు అనుకుంటూ, నా చుట్టూ చూసాను. కాని అక్కడ నాకు ఏ గాజులు కనిపించలేదు. ఇక్కడ కాదు మేడం, ఆ కార్ పక్కన పడింది అన్నాడాయన. వెంటనే ఆ కారు పక్కన ఉన్న సందులో ఒక అడుగేసి చూసాను. కార్ చివర ఒకాయన నుంచుని నన్నే చూస్తున్నాడు. మేడం, ఇక్కడ ఉంది గాజు అన్నాడు. ఒక్క అడుగు లోపలికి వేయబోతున్న దాన్ని, ఎందుకో నా చేతుల కేసి చూసుకున్నాను. గాజులు చేతికే ఉన్నాయి. ఎక్కడో కార్ కి ఒక చివర నించున్నతనికి నా గాజు గురించేం తెలుసు! నా మట్టిబుర్రలో ఒక్కసారిగా ప్లాష్ వెలిగింది. చటుక్కున వెనక్కి తిరిగేసాను. నా పక్కనే నించున్న మనిషి నాకు దగ్గరిగా వచ్చేస్తున్నాడు. కారుకు అటు చివర ఉన్న మనిషికూడా నేను వెనక్కి తిరగటంతో నా వైపే మేడం..మేడం అని పిలుస్తూ స్పీడ్ గా వచ్చేస్తున్నాడు. ఏదో ప్రమాదం జరగబోతోందని అప్పుడు కాని నా కర్ధం కాలేదు. గట్టిగా అరుద్దామన్నా నోరు పెగల్లేదు. నా ఎదురుగా వస్తున్న మనిషిని ఒక్క తోపు తోసి కారు సందులోంచి బయటకు దూకేసాను. ఆ మాత్రం చేయటమే నాకెక్కువ. ఆ మనిషి ధఢాల్ మని కిందపడిపోయాడు పాపం. రోడ్ దాకా వచ్చేసి ఒకసారి వెనక్కి తిరిగి చూసాను. ఆ ఇద్దరూ నాకు దరిదాపుల్లో కనిపించలేదు. ఒక్క సారిగా నా గుండె ఆగిపోయింది. బాబోయ్..వాళ్ళు దొంగలు, అని అప్పుడనుకున్నాను. ఒళ్ళు చల్లబడిపోయి, గొంతు తడారిపోయి, అలాగే ఉండిపోయాను.

మెల్లిగా తేరుకున్నాను. రోజూ ఎన్నో వింటున్నాను. ఈ మాత్రం కూడా నాకు తెలివి లేదేంటని తిట్టుకున్నాను. రోడ్ మీద అంతమంది జనం ఉన్నా కూడా ఎంత ధైర్యం వీళ్ళకి!!! నా చేతులు తెగ్గోసేవాళ్ళా...మెడ నరికేసేవాళ్ళా... అమ్మో!!! వాళ్ళెంతోదూరం పోయుండరు. పర్లేదు, నాకు ధైర్యం చాలానే ఉందని ఒక నిమిషం సంబరపడ్డాను. అక్కడ ట్రాఫిక్ పోలీస్ కి చెప్పాలి. లేకపోతే...నా లాగా ఇంకా ఎందరో....ఇవాళ నా అదృష్టం బాగుంది. లేకపోతే ఏమైపోయేదాన్నో!!! మా ఇంట్లో నక్కైతే లేదుకాని తోక తొక్కి రావటానికి, బహుశ: ఆ వరలక్ష్మీ దేవే నన్ను కాపాడింది అనిపించింది. ఎంత చూసినా అక్కడ ట్రాఫిక్ పోలీస్ కనిపించలేదు. అక్కడ ఎక్కువ సేపు ఉండే ధైర్యం మాత్రం లేదు. కెమెరా వద్దు ఏం వద్దు అనుకోని, తల గిరగిరా అన్ని వైపులా తిప్పి చూసుకుంటూనే, మెల్లిగా ఇంటి దారి పట్టాను. వాళ్ళు ఇంకా నా వెనుకే ఎక్కడో రహష్యంగా వస్తూనే ఉన్నారని నా అనుమానం. వాళ్ళకి మా ఇల్లెక్కడ తెలిసి పోతుందో అని భయపడుతూనే, అన్ని వైపులా జాగ్రత్తగా చూసి కాని ఇంట్లో కాలు పెట్టలేదు. ఆ రోజు సాయంత్రం కనీసం ఒక్క పేరంటానికైనా ఇల్లు దాటి బయటికి పోతే ఒట్టు. మనసులోంచి పండగ సంబరం మాయమైపోయింది. మా అత్తగారు ఎంతడిగినా ఎందుకుపోవటం లేదో చెప్పలేదు. అసలేమైందో కూడా ఎవ్వరికీ చెప్పలేదు. అంతేకాదు ఓ రెండు మూడు రోజులు ఆ రోడ్ మీద ఒంటరిగా అస్సలు పోనేలేదు. ఎన్నడూ లేనిది, ఎంతో దగ్గిరలో ఉన్న మా కాలేజ్ కి మావార్నడిగి లిఫ్ట్ ఇప్పించుకున్నాను. ఈ నగరాల్లో ఇంత బాధలు పడుతూ ఉండే బదులు హాయిగా ఏదో ఒక చిన్న పల్లెటూళ్ళో ఏదో ఒక చిన్న పొలంలో పనిచేసుకుంటూ బతికితే, ఎంత శాంతంగా ఉండచ్చో అనిపించింది, ఆ క్షణంలో నాకు. అదీ కాకపోతే గోదారొడ్డున కె. విశ్వనాథ్ వేసేలాంటి ఒక చిన్న గుడిసె వేసుకొని బతికేసినా ఎంత సుఖమో!!!! నాకేమన్నా అయిఉంటే...బహుశ: బ్లాగ్ లోకం నుంచి ఒక బ్లాగ్ ఎగిరిపోయుండేదేమో!!!!! మిమ్మల్నందర్నీ మళ్ళీ పలకరించే యోగం నాకున్నట్లే ఉంది. అందమైన మా అమ్మవారి ఫొటో వచ్చే సంవత్సరం బ్లాగ్ లో పెడ్తాను లెండి. మరి ఈ సారి కుదరలేదుగా:)

మన మహిళలందరికీ శ్రావణమాస శుభాకాంక్షలు. పురుషులందరికీ ప్రత్యేక అభినందనలు. మరి మా పూజలన్నీ మీ కోసమేకదా:)
మాకోసం మీకే పూజలు లేవెందుకో. అందుకే...మా కిలాంటి కష్టాలు.....


********************************************************************************

15, ఆగస్టు 2010, ఆదివారం

జగతి శిగలో జాబిలమ్మకు వందనం



జగతి శిగలో జాబిలమ్మకు వందనం......
మమతలెరిగిన మాతృ భూమికి వందనం...

"ఐ లవ్ మై ఇండియా"...ఈ పదాలు పలుకుతుంటేనే మనసు ఎంత పులకరించిపోతుందో...శరీరం మీద రోమాలు నిక్కబొడుచుకుంటాయి...

స్కూల్ లోని ఆ జ్ఞాపకాలు ఇటువంటి రోజుల్లో ఇంకా, ఇంకా తలచిన కొద్దీ గిలిగింతలు పెడుతూనే ఉంటాయి.
గుర్తుకొస్తున్నాయి...అంటూ ముందుకు తోసుకొస్తాయి.ఆగస్ట్ పదిహేను వస్తోంది అంటే ఎంత హడావుడి..ఎంతసంబరం...
ఎప్పుడూ వేసుకొనే వైట్ డ్రెస్సే అయినా...ఇంకా ఎంతో ప్రత్యేకంగా ఉతికించి, తెల్లగా ధగధగ లాడుతోందో లేదో అన్ని కోణాల్లోంచి పరిశీలించి చూస్తే తప్ప తృప్తే కలిగేది కాదు.
తెల్లటి కాన్వాష్ షూష్, సాక్స్ ని కూడా మళ్ళీ మళ్ళీ కళ్ళు జిఘేల్ మనేలా ఉన్నాయోలేదో ఒకటికి పదిసార్లు చూసుకోవాల్సిందే కదా...
నల్లటి రిబ్బన్లు తెల్లగా ఉతుక్కోని అవి మాత్రం నేనే ఇస్త్రీ చేసుకోని చక్కగా మడతపెట్టుకొంటే ఎంతో పనిచేసిన ఆనందం:)
చక్కగా తయారైపోయి, డ్రెస్ కి జెండా పెట్టుకోని...ఓహ్..ఎదో మహా ప్రపంచాన్నే గెలిచేశామన్న ఆ గర్వం ఎప్పటికీ మరువలేనిదేకదా...
పాఠశాల లోని జెండా వందనం, పెరేడ్ ఎంత గొప్పగా అనిపించేవో....ఎంతటి ఉద్వేగం...ఎంత ఉత్తేజం..
స్టేజ్ మీద దేశభక్తి గీతం పాడుతూ, చేతిలో పెద్ద పెద్ద జెండాలు ఊపుతూఉంటే...ఎవరెస్ట్ శిఖరం ఎక్కినంత ఆ పరవశం ఎప్పటికైనా తీరేదా...
చేతినిండా రకరకాల పూలతో అమరవీరులకు వందనం అర్పిస్తుంటే, భరతభూమి వన్నెచిన్నెల సోయగాలన్నీ తలపుకొచ్చేవి కాదా....
పొరపాటున, ఏదైనా బహుమతి వచ్చిందంటే, కాశ్మీరం నుంచి కన్యాకుమారి దాకా ఊరేగిన సంబరమే....
తెలిసీతెలియని ఆ మైమరపే నిజమైన ఆనందం అనిపిస్తుంది. ఆ అమాయకత్వంలోనే ఈ దేశభక్తి, తల్లిమీద ప్రేమ లాగా స్థిరపడుతుంది. ఈ నాడు కలిగే భావాలను ఎప్పటికీ కొనసాగించగలగాలి.

పెరిగి పెద్దైనా కొద్దీ ఆ సంబరాల ముచ్చట్లు ఏవి? ఉన్నత విద్యా స్థాయిలో ఇది ఒక శలవు దినం మాత్రమే.....ఇంక రీసెర్చ్ చేసినంత కాలం అసలే సంబంధం లేకుండా.. ఆరోజున ఎక్కడ ఉంటామో..ఏ పని పూర్తి కాలేదన్న టెన్షన్ లో ఉంటామో....మామూలు రోజులకి ఆ రోజుకీ తేడా తెలియకుండానే గడచిపోయేది.

కాని...ఇప్పుడో..అలా లేదు. చిన్నప్పటి ఆ ఉత్సాహం తిరిగి మొలకలు వేస్తోంది. ఈనాటి..ఈ చిన్నారి విద్యార్ధులను చూస్తుంటే.....గుర్తుకొచ్చే బాధ్యత ఎంతో మహోన్నతంగా కనిపిస్తుంది. వీరికి ప్రగతిమార్గం చూపించాలి అని గుండెలోతుల్లోంచి పొంగివచ్చే భావాలెన్నో... వాళ్ళ కళ్ళల్లో కనిపించే ఆ ఉద్వేగపు నిర్ణయాలు...వారి భవిష్యత్తుకి నేను వేసే పునాదులని గుర్తు చేస్తున్నాయి. వీరిమీదే ఆధారపడిన దేశభవిష్యత్తుకి వీరికొక స్పూర్తిని కలిగించాలి. వీరి భావాలను గౌరవించి... మనోధైర్యాన్ని పెంచాలి ...తప్పదు... మళ్ళీ మళ్ళీ జరుపుకునే ఈ పండుగ, వారికి దేశభక్తిని పెంచి మాతృభూమి పట్ల విపరీతమైన అభిమానాని పెంచుతోంది. అందుకు ఉదాహరణే ఈరోజు వారాలాపించిన ఈ గీతం.
ఏదేశమేగినా, ఎందు కాలిడినా
పొగడరా నీ తల్లి భూమి భారతిని
నిలుపరా నీ జాతి నిండు గౌరవము.......

ఎన్ని విప్లవాలు వచ్చినా...సమస్యలు ఏర్పడినా....కష్టాలు నష్టాలు కలిగినా...ఎన్ని మార్పులొచ్చినా సరే, ఈ సంబరాలను మరచిపోవాల్సిన అవసరమే లేదు. ఈ విజయగీతిక ఆలాపనే వచ్చే తరాలవారి బాధ్యతను కూడా కొనసాగిస్తుంది. మనమే కాదనుకుంటే ...ఆ వీరుల త్యాగఫలానికి అర్ధమేలేదు. ఏం సాధించాం...అని కనుక అడిగినట్లైతే..ఆ ప్రశ్న మనకే వర్తిస్తుంది. అభివృద్ధే లేదని మనస్పూర్తిగా ఎవరైనా చెప్పగలరా? పెరిగిన అరాచకాలకి ఎవరు బాధ్యులు? స్వాతంత్ర్యసంబరాలకి దీనికి ఏమిటి సంబంధం? ఇంత పెద్ద ప్రజాస్వామ్య దేశంలో బాధ్యతలు విస్మరించి స్వార్ధం పెరిగితే ఎవరిది నేరం. పాపప్రక్షాళణకు ప్రయత్నాలు జరగాలి గాని, ఈ పండగలవల్ల లాభం ఏంటి...అంటే అది మూర్ఖత్వం కాదా? అరబిందుని, వివేకానందుని బోధనలు కలకాలం నెమరువేసుకోవాల్సిందే.... ఎన్నో ఇతర పండుగలు, వేల రూపాయలు ఖర్చు పెట్టి జరుపుకుంటూనే ఉన్నముగా? వాటి పరమార్ధం ఏం సాధిస్తున్నాం? ఎప్పుడో కొద్దిగా దేశభక్తిని ప్రేరేపించే ఇటువంటి చిన్న పండుగలతో వచ్చే నష్టమేమిటి? ప్రపంచంలో అన్ని దేశాలలో ఇంతకంటే ఘోరమైన విపత్తులే సంభవిస్తున్నాయి. వారికి దేశభక్తి లేదా? స్వాతంత్ర్యదినోత్సవాలు జరుపుకోటం లేదా? తనకంటే ఎంతో చిన్న దేశమైన ఇంగ్లాండ్ సంకెళ్ళనుంచి విడిపోయిన అమెరికా స్వాతంత్ర్యదినోత్సవం ఇంకా ఎంతో గర్వంగా జరుపుకుంటూనే ఉంది. ఏం... వారికి ఏ సమస్యలూ లేవా?

మంచి దేశం నిర్మించాలి అంటే ముందు మంచి పౌరులను తయారుచేయాలి....

భారతీయ సంస్కృతిని ప్రపంచమే గౌరవిస్తున్న ఈ రోజుల్లో...మనలోనే ఎన్నో వ్యతిరేక భావాలను వింటున్న నాకు ఇలా రాయాలనిపించింది.

సంపదలతో సొంపులొసగే భారతీ జయహో...మంగళం.. వందేమాతరం...

ప్రతి ఒక్కరికీ నా హృదయపూర్వక స్వాతంత్ర్యదినోత్సవ శుభాకాంక్షలు.




*******************************************************************

27, జులై 2010, మంగళవారం

పరంజ్యోతి






మల్లాది వెంకట కృష్ణమూర్తి గారి కలం నుంచి వెలువడ్డ ఆధ్యాత్మిక నవల ఈ పరంజ్యోతి.

అనేక ఆధ్యాత్మిక అంశాలతో, కమర్షియల్ నవల లోని ముఖ్యమైన ఎలిమెంట్ అయిన ఉత్కంఠని జత చేసి రాసిన ఈ ఆధ్యత్మిక నవల పరంజ్యోతి లోని చిత్రమైన కథ అన్ని తరహా పాఠకులని సమానంగా అలరిస్తుంది.

మరణించిన మనిషి తిరిగి బ్రతుకుతాడా? అన్నది ఇందులోని ముఖ్యమైన అంశం.

చితిదాకా చేరిన మనిషి మళ్ళీ లేచికూచుంటాడా? అలాంటి మనిషికి సంబంధించిందే ఈ కథ.

ఇది ఓ సంస్థానం రాజకుమారుడు విజయ రామరాజు అనే చిన్న రాజావారి కథ. ఇదే ఒక సన్యాసి పరంజ్యోతి కథ కూడా. ఇది ఒక ఆధ్యాత్మిక జీవనానికి చెందిన కథ.

నెమలికొండ సంస్థానపు అధిపతి భూపతిరాజు నలుగురి సంతానంలో చివరి వాడుగా అతి గారాబంగా పెరిగి అన్నదమ్ములలో వైషమ్యాలకి కారకుడవుతాడు విజయ రామరాజు. అన్ని దురలవాట్లకు లోనవుతాడు. అతని భార్య అహల్య కూడా అతన్ని భరించలేని పరిస్థితి ఏర్పడుతుంది. తన సోదరుడు ప్రతాపవర్మ కి తన గోడు వెళ్ళబోసుకుంటుంది. అనేక జబ్బులతో ముదిరిపోయిన రామరాజుని ఇతడు కూడా ద్వేషిస్తూనే ఉంటాడు.
రామరాజు సోదరులు, ఇతర ఉద్యోగులు కూడా అతన్ని తట్టుకోలేకపోతారు.
తీవ్రమైన జబ్బులతో మంచానపడ్డ అతన్ని ఇంగ్లీష్ వైద్యం కూడా ఏమీ చేయలేదని తేల్చేస్తారు వైద్యులు. అటువంటి సమయంలో అతని మీద విషప్రయోగం జరిగి రామరాజు మరణిస్తాడు. అది విషప్రయోగమనీ తెలియదు, ఎవరు చేసారోకూడా తెలియదు. రామరాజు దహన సంస్కారాలు కూడా జరిగిపోతాయి.

ఇది తనకి విషం ఇచ్చి చంపాలని ప్రయత్నించిన వారి మీద ధ్వేషం పెంచుకున్న ఓ వ్యక్తి కథ.

"మరణం అంటే నాకు భయంలేదు. ఎందుకంటే నేను జీవించి ఉన్నంతకాలం మరణం నా సమీపంలోకి రాలేదు. అది వచ్చినప్పుడు నేనుండను. ఇంక చావంటే నాకు భయం దేనికి?" ఓ సందర్భంలో రామరాజు తనతండ్రితో అన్న మాటలివి. కాని మరణం తరువాత కూడా తాను ఉంటాడని, ఆ మాటలు అన్నప్పుడు రామరాజుకి తెలియదు. ఇది సాధ్యమా?

ఆ తరువాత ఎన్నో సంవత్సరాలకి ఓ వ్యక్తి నర్మదా పరిక్రమ లో సన్యాసి పరంజ్యోతి ని చూసి అతను పూర్తిగా రామరాజు పోలికలతో ఉండటంతో ఆశ్చర్యపడి, రామరాజు సోదరి కుముదినీదేవికి తెలియజేస్తాడు. ఆమె ఈ విషయాన్ని తన ఇతర సోదరులకు తెలియజేస్తుంది. వారు ఇతర అధికారులతో చర్చలు జరిపి, చనిపోయి దహనంచేసిన వ్యక్తి తిరిగిరావడం ఎలా జరుగుతుంది, ఇదేదో పొరపాటు అని భావిస్తారు. కాని క్రమంగా అదే సమాచారం చాలామందే పంపటంతో అతనిని వెతికి, వివరాలు తెలుసుకోటానికి ప్రయత్నిస్తారు.

ఇక్కడినుంచి, జరిగిన రకరకాల ప్రయత్నాలే కథని అనేక మలుపులు తిప్పి మనల్ని ఏకబిగిన చదివిస్తుంది.

ఎన్నోఆధ్యాత్మిక చర్చలు ఈ నవల నిండా ఉన్నాయి. అయినప్పటికీ అది ఇంకా చదవాలి అన్న కోరికని పెంచుతుందే కాని ఎటువంటి నిరాసక్తతను కలిగించదు. కొన్ని చక్కటి ఆధ్యాత్మిక గీతాలు కూడా మనకి ఈ గ్రంధంలో కనిపిస్తాయి. తేలికైన పదాలతో కూర్చిన ఈ పాటలు పాడుకోవాలనిపిస్తుంది. ఈ పాటలొచ్చినప్పుడు మనకే తెలియకుండా మనసులో పాడుకుంటాంకూడా.

తమ అనుమానాలు తీర్చుకోటానికి న్యాయస్థానం లో జరిగే అనేక వాదోపవాదాలు కూడా మనకి ఎన్నో కొత్త విషయాలను ఎంతో విపులంగా తెలియ జేస్తాయి. అనేక ఉదాహరణలు కూడా రచయిత మనకి చూపిస్తారు.

నర్మద, గోదావరి నదీ తీరాల్లో జరిగే ఈ కథ ఆధ్యాత్మిక పాఠకులని, సాధారణ పాఠకులని సమానంగా ఆకర్షిస్తుంది.

ఈ నవలకి ప్రేరణ చాలా సంవత్సరాల క్రితం బెంగాల్ లో జరిగిన ఒక నిజ సంఘటనే. ఇది భారతదేశంలో దీర్ఘకాలం కొనసాగి సంచలనాత్మక తీర్పు నిచ్చిన కేసుగా చాలా ప్రసిద్ధి చెందింది. దీని మీద ఆధారపడి ఎన్నో భాషల్లో సినిమాలు కూడా వచ్చాయి.


మే 2010 లో ముద్రించిన ఈ గ్రంధం వెల రూ 100/-. నవోదయా బుక్ హౌజ్, సుల్తాన్ బజార్, హైద్రాబాద్ లో లభిస్తాయి.


*****************************************************************************

17, జులై 2010, శనివారం

గాజులు-శఠగోపం!!!




నాకో అలవాటు ఉంది. ఏంలేదు, సాయంత్రం ఇంటికి రాగానే, చేతిగాజులు, మెడలోవి(మంగళసూత్రం తప్ప), చేతిలోవి, చెవివి ఆభరణాలు అన్నీ తీసిపెట్టేస్తానన్నమాట. మళ్ళీ మర్నాడు బయటికి వెళ్ళేప్పుడే అవి తిరిగి నా ఒంటిమీదకి చేరుతాయి. ఈ లోపల ఎటైనా బయటికి వెళ్ళినా హాయిగా అలాగే వెళ్ళిపోతాను. అవన్నీ తీసేసినాక నాకెంతో ఫ్రీ గా ఉంటుందిమరి.

రోజూ సాయంత్రం పార్క్ కెళ్ళి కాసేపు వాకింగ్ చేసి అక్కడి ఫ్రెండ్స్ తో కాసేపు హస్క్ వేసుకునే అలవాటు కూడా నాకుంది. పార్క్ కెళ్ళి ఓ నాలుగైదు రౌండ్స్ నడిచాక, నాకోసం చూస్తున్న నా ఫ్రెండ్ దగ్గరికెళ్ళి కూచున్నాను. రోజూ ఈ రోడ్డు దాటి వచ్చేటప్పటికి నా తలప్రాణం తోక కొస్తోంది తల్లీ, ఈ సర్కస్ ఇంక నేను చేయలేను... మా ఇంటి చుట్టే రౌండ్స్ కొట్టుకుంటానమ్మ, ఇంక నేను పార్క్ కి రాను గాక రాను అని అన్నాను మా ఫ్రెండ్ తో. తను నాగోడు ఏమాత్రం వినిపించుకోకుండా, నీ ధైర్యసాహసాలు తెలియందెవరికి గాని గుడికిపోదాం కొంచెం తోడురా అంది. మొత్తం మనిషినైతే రాగలనమ్మ, కొంచెం మనిషినెలా వస్తాను...అయినా ఈ రాత్రిపూట ఇప్పుడు గుడికెందుకు అనడిగాను. అబ్బా, యక్షిణి ప్రశ్నలేయకుండా ఏ పని చేయవు కదా నువ్వు. మాట్లాడకుండా రా అంది. యక్షిణి ప్రశ్నలు అన్నది యక్షప్రశ్నలకు స్త్రీలింగం కాదనుకుంటా, అని నా అనుమానం వ్యక్తం చేశాను. ఇంక కామెంట్స్ మాని ఉరిమి చూడ్డం మొదలుపెట్టింది. బాబోయ్, నీ ఉరుములు మెరుపులతో మళ్ళీ వర్షం వచ్చేట్లుంది, పద తొందరగా పోయొచ్చేద్దాం. ఇప్పటికే చాలా చీకటి పడింది, అని బయిలు దేరాను. అబ్బో నిన్నెవ్వరెత్తుకెళ్ళరులే ఈ చీకట్లొ అని తనూ నడక మొదలుపెట్టింది. అక్కడే దగ్గిర్లో ఉన్న ఆంజనేయస్వామి గుడికెళ్ళాం.

హనుమాన్ చాలీసా మనసులో చదువుకుంటూ, భక్తిగా తనతోపాటే నేను కూడా ప్రదక్షిణలు చేశాను. ఓ పదకొండు ప్రదక్షిణాలు చేసాక ఆగింది. తీర్థప్రసాదాలు కూడా తీసుకున్నాం. గుడిలో అయ్యగారు, శ్రద్ధగా కళ్ళుమూసుకొని, రెండు చేతులూ కలిపి దండాలు పెట్టుకుంటున్న మాకు శఠగోపం పెట్టటానికి వచ్చారు. మా ఫ్రెండ్ కి శఠగోపం పెట్టారు. ఇంక నా వంతు. నేనింకా చేతులెత్తి దేవుడివైపే పరవశంగా, మైమరచి చూస్తూ దండాలు పెట్టుకుంటున్నాను. అయ్యవారు ఎంత సేపైనా నాకు శఠగోపం పెట్టకపోవటం తో అయ్యగారి వైపు తిరిగి చూశాను. నా నెత్తిన శఠగోపం తగలగానే కోరుకునే కోరికతో నేను సిద్ధమయ్యాను. అయినా అయ్యగారు శఠగోపం పెట్టలేదు. నా రెండు కళ్ళూ దేవుడి నుంచి మరల్చి అయ్యగారి వైపు తిప్పి ప్రశ్నార్ధకంగా, ఇంకా పెట్టరేం అన్నట్లు చూశాను. ఆయనెందుకో నా వైపు పరమ కోపంగా చూస్తున్నారు. నాకస్సలర్ధం కాలేదు. ఏంటమ్మా, ఇది ముత్తైదు పిల్ల గాజులు లేకుండా గుడికి వస్తారా. ఇంటికెళ్ళి గాజులేసుకురా! అన్నారు. అయ్యోరామా! గాజులకోసమా, ఈ కోపమంతా..ఇప్పుడేం చేయాలి. ముత్తైదు పిల్లో...పండు ముత్తైదువో, ఇప్పుడెలాగా? ఇంటికెళ్ళి గాజులేసుకొని నేనెప్పుడు రావాలి.

ఆంజనేయస్వామి దగ్గిర గాజులు లేకపోతే ఏంటట, పోనీ అమ్మవారైనా కాదుగా అనటానికి. లాభంలేదు. గుడికొచ్చి శఠగోపం లేకుండా ఎలా పోవాలి? అందునా నా ఫ్రెండ్ కి పెట్టి నాకు పెట్టక పోతే ఎంతవమానం. ఏమైనా సరే, నేను శఠగోపం పెట్టించుకోవాల్సిందేనని, ఆ నిముషమే...భీష్మణి ప్రతిజ్ఞ, మంగమ్మ శపధం లాంటివి దబదబా చేసేసుకున్నాను. ఈ అయ్యగారేమో వినిపించుకునేటట్లు లేరు. అదేంటి అయ్యగారు, గుడి కి ఎన్నో రకాల వాళ్ళు వస్తారుకదా! నన్నలా అంటే ఎలా? అన్నాను. ఉహూ.. నా పప్పులేమి ఉడకలేదు, కాదుకదా కనీసం నాననైనా లేదు. చూడమ్మా నీకు గాజుల అర్హత ఉందని నాకు తెలుసు కదా! ఈ గుడికి నువ్వు చాలాసార్లే వచ్చావు కదా! అన్నారు. ఇంతమాటన్నాక ఇంకేం మాట్లాడాలి నేను. ఎవరైనా ఆంజనేయస్వామికి గాజులివ్వకపోతారా!!! అవి ఓ రెండేసుకుందాం అని చుట్టూ చూశాను. ఎక్కడా ఒక్క గాజు కూడా కనిపించలేదు. బహుశా: ఆంజనేయస్వామికి గాజులివ్వరనుకుంట. అయినా ఘోటక బ్రహ్మచారి గుళ్ళో గాజులెతకటం నాదే తప్పు. లాభంలేదని అయ్యగార్ని బతిమిలాట్టం మొదలుపెట్టాను. ఎప్పుడూ పొద్దున్నే ఫ్రెష్ గా తయారయి గుడికి వెళ్ళేదాన్ని. ఇవాళ రాత్రిపూట ఇలా వెళ్ళాను ఏంచేస్తాం...ప్లీజ్ అయ్యగారు, ఇంకెప్పుడిలా రాను. ఈ ఒక్క సారికి క్షమించేయండి, అని ఏడుపుమొహం పెట్టాను.

ఇహ, నేను ఇంతగా కాళ్ళా వేళ్ళా గోళ్ళా పడ్డాక తప్పదనుకున్నట్లున్నారు. నా నెత్తిమీద శఠగోపం ఠఫీ మని పెట్టారు. అంత ఘాట్టి దీవెనకి తట్టుకోలేక నెత్తిమీద బరాబరా రాసుకుంటూ, మా ఫ్రెండ్ ని, వీలైనంత కోపం గా చూసుకుంటూ బయట పడ్డాను. తనకేమో నన్ను చూస్తున్నా కొద్దీ ముసిముసి నవ్వులొస్తున్నాయి. గుళ్ళో కూచోవాలిగా మరి. అక్కడ ఒక అయిదు నిముషాలు కూర్చోని ఇంటి దారి పట్టాం. "కరముల పైడి కంకణములతో నిను కొలిచెదమమ్మా! తల్లీ, మము కాపాడగ రావమ్మా" అని అమ్మవారి కీర్తన రాగాలాపన మొదలుపెట్టింది మా ఫ్రెండ్. నాకు ఇంకా పుండు మీద ఖారం, ఇంకా ఏవో ఏవో కెమికల్స్ పోసినట్లనిపించింది. ఇప్పుడర్దమయ్యిందనుకుంటా, గాజుల్లేకుండా ఇంకెప్పుడు గుడికి రాకు, అని మా ఫ్రెండ్ నాకు హితోపదేశం మొదలుపెట్టింది. ఔనౌను, నిజమే! నా కర్ధమైందేమిటయ్యా అంటే వేళా పాళా లేకుండా ఫ్రెండ్ మాట వినకూడదని. చాలా ఉక్రోషంతో, కసిగా అనేసాను తనతో....

అంతేనంటారా? గాజులేసుకోకుండా గుడికెళ్ళకూడదా!!!! ఈ అయ్యగారు నన్నెప్పుడూ చూస్తూనే ఉంటారుగా, అందుకనే అలా అనిఉంటారులే. అందర్నీ అనరు. అని సర్దిచెప్పుకుని....నన్ను నేనే ఓదార్చుకున్నాను.....





****************************************************************************

18, జూన్ 2010, శుక్రవారం

ఆమెన్......



O Lord, Jesus Christ, the Son of God
have mercy on us!


ఈ మధ్య అనుకోకుండా ఒక చర్చ్ కెళ్ళాను. అప్పుడే నా గత స్మ్రుతులు గుర్తుకొచ్చాయి. ఎందుకో ఒకసారి నా ’క్రైస్తవ మతం’ గురించి చెఫ్ఫాలనిపించింది....నా చిన్నప్పటి జ్ఞాపకాలు తరుముకొచ్చేసాయి.

నా చిన్నప్పుడు నేను చదివింది క్రిస్టియన్ స్కూల్లో. అది మామూలు క్రిస్టియన్ స్కూల్ కాదు. ప్రొటెస్టెంట్ స్కూల్. పూర్తిగా మత వ్యాప్తికి ప్రాధాన్యత ఇచ్చే స్కూల్ అది. అక్కడ స్కూల్ లోనే ఒక చాలా పెద్ద, ఎంతో అందమైన చర్చ్ ఉండేది. ప్రతిరోజు పొద్దున చర్చ్ లోనే మా ప్రేయర్. అన్ని స్కూళ్ళల్లో లాగా బయట గ్రౌండ్ లో మామూలు పద్ధతిలో ప్రేయర్ ఉండేది కాదు. అందరమూ తప్పని సరిగా ఒక గంట సేపు మోకాలి మీద కూర్చొని ప్రేయర్ చేయాల్సిందే. ఆ చర్చ్ లో జీసెస్ క్రైస్ట్ జీవిత చరిత్రకు సంబంధించి ఎన్నో పైంటింగ్స్ ఉండేవి. ప్రతిరోజు ఆ చిత్రాలు చూసే నా మనసు నిండా క్రీస్తు జీవితమే నిండిపోయేది.

అందరికీ ఏదో సహాయం చేయాలి అంటూ ఎటో వెళ్ళిపోతూఉండేదాన్ని. రోడ్డుమీద చిన్నకుక్కపిల్ల కనిపించినా ఇంటికి తెచ్చేదాన్ని. ఎక్కడ ముసలివాళ్ళు కనిపించినా వెళ్ళి కాళ్ళో, చేతులో వత్తేదాన్ని. చిన్నపిల్లలకి భక్తి గీతాలు నేర్పించేదాన్ని. ఇంట్లో ఏ మందులు కనిపించినా ఎవరోవొకరికి వద్దన్నా వినిపించుకోకుండా ఇచ్చేసేదాన్ని. ఇలా ఎంత సేవ చేసేదాన్నో ఇప్పుడు చెప్పటం చాలా కష్టం:)

మా మదర్ సుపీరియర్ ఎక్కడ కనిపించినా వెంటనే మోకాలిమీద కూర్చొని క్రాస్ చేసుకొని, ఆమె దీవించే వరకు కదిలేదాన్ని కాదు. ఆవిడకు కూడా నేనంటే చాలా అభిమానమే. ఎన్నో ముఖ్యమైన పనులే నాకు చెప్పేవారు. నేను చాలా బాధ్యత గలదాన్ని అని ఎప్పుడూ ఎంతో మెచ్చుకునేవారు.

చిన్నప్పుడు మనకు కొంత మంది టీచర్ల మీద ప్రత్యేక అభిమానం ఉంటుంది కదా!!! అలాగే అప్పుడు నాకు మా క్లాస్ టీచర్, సిస్టర్ ఫిలోమినా అంటే చాలా పిచ్చి ప్రేమ ఉండేది. ఆమె కేరళ నుండి వచ్చింది. ఒక్క రోజు ఆమెని చూడకపోయినా ఎంతో బాధపడిపోయేదాన్ని. ఆమె మా అందరికీ ఎప్పుడూ చిన్న చిన్న బైబిల్స్, రోజరీ లు బహుమతిగా ఇచ్చేది. అవన్నీ ఎంతో ప్రాణప్రదంగా దాచిపెట్టుకొనే దాన్ని. ఆమె చెప్పేకథలు నా మీద ఎంతో ప్రభావాన్ని చూపించేవి. జీసెస్ అంటే చాలా ఇస్టపడడం మొదలుపెట్టాను. మాకెప్పుడూ "టెన్ కమాండ్మెంట్స్" గురించి ఎక్కువగా చెప్పేది. రాత్రి బైబిల్ చదవకుండా ఎప్పుడూ పడుకోలేదు. నా దిండు కింద అన్ని సైజులల్లో బైబిల్స్ ఉండేవి. దిండు అడ్డదిడ్డంగా ఉండేది. సరిగ్గాపడుకోటానికే కుదిరేది కాదు. నాదిండు ఒక ఇండియా మాప్ లాగా ఉండేది.

రకరకాల క్రాస్ లు మా ఇంట్లో ఎక్కడపడితే అక్కడ దాచిపెట్టేదాన్ని. పాపం ఒకసారి మా అమ్మ వత్తులడబ్బాలో చూసుకుంటే అందులో చక్కటి తెల్ల రాళ్ళతో మెరిసిపోయే క్రాస్ కనిపించింది. మా నాన్నగారి పర్స్ లో కూడా క్రాస్ పెట్టాను. అది నల్లటి క్రాస్. పాపం, అది తేలనుకొని భయపడ్డారుకూడా. అప్పుడప్పుడూ నన్ను మందలించేవారు. మా పనమ్మాయి కి మంచి రంగురంగుల పూసలతోటి, అందమైన క్రాస్ ఉన్న రోజరీ ఒకటి ఇస్తే ఎంతో మురిసిపోతూ వేసుకొంది. కాని మర్నాడు, ఆ రోజరీ లో క్రాస్ కి బదులు అమ్మవారి బొమ్మ ఉంది. వాళ్ళమ్మ కోప్పడి లాకెట్ మార్చేసిందిట. ఇంక, బజార్ లో రంగురంగుల కొవ్వత్తులు కనిపిస్తే అవి కొనిపించేదాకా వదిలేదే లేదు. బుక్స్ లో నెమలిఈకలు దాచి వాటికి మేత వేసుకునేవాళ్ళం కదా చిన్నప్పుడు. నేనైతే మేతతోపాటు రకరకాల క్రాస్ లు కూడా పెట్టేసేదాన్ని. అవన్నీ బాగా ఒత్తుకొని క్వాటర్లీ ఎక్జామ్స్ కల్లా నా బుక్స్అన్నీ చినిగిపోయేవి.

ఏదైనా పండగ వస్తే ఇంట్లో నాతోటి పెద్ద గొడవే జరిగేది. నాకు తెల్లటి పెద్ద లాంగ్ ఫ్రాక్ మాత్రమే కొనమనేదాన్ని. అన్ని వైట్ బట్టలే వేసుకోటం మొదలుపెట్టాను. ఇంట్లో ఏ పూజా పునష్కారం జరిగినా నేను ఆబ్సెంట్ అవటం మొదలుపెట్టాను. ఇంట్లో గనుక కోపం చేసి బలవంతాన కూచోపెడితే ఆ కార్యక్రమం పూర్తయ్యే వరకు కూడా మోకాలిమీద కూర్చొని, నెత్తిమీద తెల్లటి కాపో, కర్చీఫో, టవలో కప్పుకొని క్రాస్ చేసుకుంటూ, కళ్ళుమూసుకొనే ఉండేదాన్ని. అది సత్యనారాయణ వ్రతమైనా సరే ఇంకే పూజైనా సరే. నా పోస్ట్యర్ మాత్రం అదే. అంతేకాదు, అయిన దానికి కానిదానికి క్రాస్ చేసుకుని ఆమెన్ చెప్పుకొనే దాన్ని. నా పేరు సిస్టర్ ఫిలోమినా గా మార్చమని ఒకటే గొడవ చేసే దాన్ని.

అప్పుడు నాకో కోరిక ఉండేది. అదేంటంటే ఎప్పటికైనా సరే ఒకసారి రోమ్ వెళ్ళాలి, పోప్ ని చూడాలి అని. పోప్ ని చూడటం జీవితంలో చాలా పెద్ద అచీవ్మెంట్ అని నాకు గొఫ్ఫ నమ్మకం. క్రిస్మస్ కైతే మా ఫ్రెండ్స్ ని పోగేసి "మాస్" చేసేదాన్ని. బయట తలుపుకి పొడగాటి సాక్స్ వేలాడేసి, మర్నాడు శాంతాక్లాజ్ ఇచ్చిన బహుమతుల కోసం తెగవెతుక్కొనేదాన్ని. అమ్మ వెంటపడి మరీ మంచి కొత్త డ్రెస్ కొనిపించుకొనేదాన్ని. న్యూఇయర్ కి కూడా ఇలాగే చేసేదాన్ని. ఇంక గుడ్ ఫ్రైడే వచ్చిందంటే, మన ఇంట్లో చచ్చిపోయినవాళ్ళెవరు, ప్రేయర్ చేద్దాం రా, ఇవాళంతా మనం ఏడవాలి...అని మాఅమ్మ వెంట పడి పిచ్చి తిట్లుతినేదాన్ని. ఈస్టర్ రోజైతే ఇంటినిండా రకరకాల కొవ్వొత్తులు వెలిగించి పెట్టేసేదాన్ని.

మెల్లిగా ఇంట్లో వాళ్ళకి నా సంగతి అర్ధమైపోయింది. మాది అసలే నిప్పులు కూడా కడిగే శుద్ధ బ్రాహ్మణ కుటుంబం.
ఒకసారి మా అమ్ముమ్మ వచ్చింది మా దగ్గరికి. మా అమ్ముమ్మ దేవుడికి పూజ చేసుకుంటూ, హారతిచ్చే సమయానికి నన్ను పిలిచి మంగళ హారతి పాడమని అడిగింది. నేను వెంటనే మోకాలి మీద కూర్చొని, ఎంతో భక్తితో కళ్ళుమూసుకొని, క్రైస్తవ భక్తి గీతం పాడడం మొదలుపెట్టాను. ఒక్కసారిగా మా అమ్ముమ్మ అదిరిపోయింది. నా చేయిపట్టి గుంజుకోని పోయి, అదేవిటే, పిల్లని కిరస్తాని దాన్ని చేస్తారా ఏవిటి. దాని సంగతి అసలు ఎవరైనా గమనిస్తున్నారా? అని మా అమ్మను నిలదీసింది. ఈ పిల్లని ఇంకో బళ్ళో వేస్తారా, లేకపోతే నేను తీసుకెళ్ళిపోనా? అని మా నాన్న గారి వెంట పడింది.

అప్పటి వరకు నా వ్యవహారం ఎవరూ సీరియస్ గా తీసుకోలేదు. ఇప్పుడింక తప్పలేదు పాపం. నన్ను ఆ ఊరినుంచి మార్చేసి వేరే రెసిడెన్సియల్ స్కూల్ లో వేసేసారు. టెన్త్ క్లాస్ కొచ్చేటప్పటికి, అక్కడి హాస్టల్ వాతావరణం లో, కొత్త ఫ్రెండ్స్ మధ్య క్రమంగా నా క్రైస్తవమతం నన్నొదిలేసి వెళ్ళిపోయింది. లేకపోతే ఈపాటికి నేను నా బ్రాహ్మణత్వం వదిలేసి, క్రైస్తవ మత ప్రవచనాలు చెప్పుకుంటూ, ఏ చర్చ్ లోనో ఒక క్రైస్తవ సన్యాసిని గా బ్రతుకు గడుపుతూ ఉండేదాన్నేమో:) ఆమెన్!

ఇప్పటికీ అల్లంతదూరాన, క్రిష్ణమ్మ ఒడిలోని సాగర్ డామ్ కనిపిస్తూ, అందమైన ప్రక్రుతిలో, కొండల మధ్య ఉన్న నా చిన్నప్పటి పాఠశాలని తలచుకుంటూనే ఉంటాను.

**************************************************************************************************

26, మే 2010, బుధవారం

అమ్మ చెప్పిన కథ...."ఏడు గడియల రాజు"



కల్పనా రెంటాల గారి పోస్ట్ చూసాక నాక్కూడా చిన్నప్పుడు మా అమ్మ చెప్పిన కథ రాయాలనిపించింది. రామాయణం, భారతం, ఎన్నో జానపద కథలతో పాటు మామూలు కథలు నేను చాలా పెద్దగయ్యే వరకూ వింటూనే ఉన్నాను. పదేళ్ళ వయసులో పథేర్ పాంచాలి చదివాను. ఆ తరువాత చందమామ, బాలమిత్రలు అలవాటయ్యాయి. నాకు ఇప్పటికీ నచ్చిన కథ ఒకటుంది. అదే కథ నా ఏడో తరగతి తెలుగు పుస్తకం లో కూడా మళ్ళీ చూసాను. అప్పుడు ఈ కథ చూసి చాలా సంతోషమేసింది. ఆ కథ మా అబ్బాయికి కూడా చెప్పేదాన్ని. అదే ’ఏడు గడియల రాజు” కథ.

*****************************************************************

అనగనగనగా ఒక చిన్న ఊళ్ళో ఒక నిరుపేద కుటుంబం ఎన్నో కష్టాల్లో బ్రతుకుతూ ఉండే వారు. తమకున్న కొంచెం భూమి లో సాగుచేసుకుంటూ జీవితం వెళ్ళబుచ్చేవారు. వాళ్ళబ్బాయే రాజు. ఎన్నో కోరికలతో అవి తీరక నిరాశ తో గడుపుతూ ఉండే వాడు.ఎలాగైనా గొప్ప ధనవంతుడ్ని కావాలని ఆశ పడుతూ ఉంటాడు. కొంచెం పెద్దయ్యాక ఇలా ఈ పల్లెటూల్లో లాభం లేదు, ఏదైనా పెద్ద ఊరికి వెళ్ళిపోతె ధనవంతుడై సుఖంగా ఉండొచ్చు అనుకుంటాడూ. ఇంట్లో ఎవరికీ చెప్పకుండా బయలుదేరుతాడు.

దారి మధ్యలో ఒక పెద్ద అడివి ఉంది. అలసిపోయి కాసేపు విశ్రాంతి తీసుకోవాలని ఒక చెట్టుకింద పడుకుంటాడు. చల్లటి గాలికి హాయిగా నిద్రపోతాడు. ఇంతలో ఒక పెద్ద పాము అతని వెనుకగా వచ్చి పడగ విప్పి ఆడుతూ ఉంటుంది. అటువేపే వెల్తున్న కొంతమంది బాటసారులది చూసి అబ్బురంగా రాజుని లేపుతారు. నీకు మహారాజ యోగం ఉంది. చాలా గొప్పవాడివౌతావు. అని చెప్పి ఆ బాటసారులెళ్ళిపోతారు. అది విని రాజు చాలా ఆనందపడి తిరిగి తన ఊరికి వెల్తాడు. తనకు మహారాజ యోగముంది, రాజు నౌతానని అందరికీ చెప్తాడు.

ఇలా అనుకుంటే కాదు, ఎదో ఒక రాజుని ఓడించి వెంటనే రాజైపోవాలనుకుంటాడు. తనకు సైనికులుగా ఉంటే తరువాత మంత్రి పదవులిస్తానని ఆశ పెట్టి పదిమంది స్నేహితులను పోగేస్తాడు. తన పొలం, ఉన్న రెండు పశువులను అమ్మి కొన్ని పెద్ద పెద్ద కత్తులు కొని, పొరుగు రాజుని ఓడించటానికి బయలుదేరుతాడు. అక్కడ కోట ద్వారం దగ్గరున్న కాపలా వారు పదిమందితో వచ్చిన రాజు ఆ కోట ఆక్రమించటానికొచ్చాడని తెలుసుకొని ఆశ్చర్య పోతారు. ఈ వార్త మహారాజు కి తెలియజేస్తారు. అదివిని మహారాజు కూడా ఇతని ధైర్యానికి ఆశ్చర్యపోయి వివరాలు కనుక్కొని రమ్మని తమ మంత్రులని పంపిస్తాడు. మంత్రులు రాజుని కలిసి వివరాలు తెలుసుకుంటారు. మంత్రులతో ఉన్న ఒక జ్యోతిష్కుడు, అవును ఇతనికి ఇప్పటినుంచి ఏడు గడియలు మహారాజ యోగం ఉంది, అతనిని ఎవ్వరూ ఆపలేరు అని చెప్తాడు. అది తెలుసుకొని మహారాజు తన మంత్రులతో అతనిని అడ్డగించవద్దని, మహారాజుని చెయ్యమని చెప్తాడు. తనపని ఇంత సులువుగా అయిపోయినందుకు రాజు కూడా సంతోషిస్తాడు.

అప్పటినుంచి రాజభోగాలనుభవిస్తూఉంటాడు. విందువినోదాలు, నృత్యవిలాసాలు కలలో కూడా కనివినీ ఎరుగని సకల వైభోగాలు అనుభవిస్తాడు. తన అదృష్టానికి ఎంతో సంతోషంతో తన గొప్పతనానికి ఆనంద పడిపోతూఉంటాడు. తన అభివృద్ధికి ఎంతగానో గర్వపడతాడు.

ఏడు గడియలు గడవగానే మహారాజు, రాజు ని అక్కడినుంచి తరిమేస్తాడు. రాజు ఏమీ చేయలేకపోతాడు. కోట బయటకు తరిమివేయబడ్డ తనను తానే చూసుకొని నమ్మలేకపోతాడు. ఇంతసేపు అనుభవించిన సంతోషం, సంపదా వైభోగాలు ఏమైపోయాయో అర్ధం కాదు. తిరిగి నిరాశ లో మునిగిపోతాడు. కాని, క్రమంగా తనున్న పరిస్థితికి కారణం తెలుసుకుంటాడు.

తన దురాశే తన దు:ఖానికి కారణం అని తెలుసుకుంటాడు. రాశే ఫలి కాదు, కష్టే ఫలి అని అర్ధం చేసుకుంటాడు. కష్టపడి సంపాదించిన దానిలోనే శాశ్వత ఆనందం, తృప్తి లభిస్తుంది కాని అడ్డదారులలో ఎప్పుడూ పరిపూర్ణత లేదు అని భావిస్తాడు. మన జీవితాలను నిర్దేశించేది మన ప్రయత్నాలే కాని జాతకాలు కాదు. ఈ విధంగా జ్ణానోదయమయిన రాజు తిరిగి తన ఊరికి వెళ్ళి తన బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తూ, జీవితం లో తృప్తిని అనుభవిస్తాడు.

*************************************************************************************

24, మే 2010, సోమవారం

!దడిగా డువా నసిరా





ఊహలు-ఊసులు బ్లాగ్ లో, ’కాకతాళీయమా/ యాధృచ్ఛికమా’ అని అనురాధ గారు వ్రాసింది చదివాక నాకు కూడా ఇలా రాద్దామనిపించింది:-) అక్కడో కమెంట్ రాసేసి, ఇక్కడిలా మొదలెట్టాను.

ఇది కొన్ని సబ్జెక్ట్స్ లో నా పరిజ్ఞానమన్నమాట.

మొదటగా ఇంగ్లీష్:

ఇక్కడొక చిన్న tongue twister:

When I was in Arkansaw I saw a saw that could out saw any other saw I ever saw; if you’ve got a saw that can out saw the saw I saw then I’d like to see your saw the saw.

ఇప్పుడేమో నా ప్రయోగం:

What is Life?

Life is neither a ‘Tempest’ nor a ‘Mid Summer Nights’ ‘Dream’. It is a ‘Comedy of Errors’ you may take it,.... ‘As you like it’.

PUN OF POETS

A poet who can shake the spear : Shakes Peare
A marvelous poet: Marvel
A dry poet living in a den: Dryden
A poet made out of steel: Richard Steel
A poet whose words are worthy: Wordsworth
A poet who always stands on a cool ridge: Coleridge
A poet who plays Tennis: Tennyson
A poet who is brown in color: Robert Browning
A poet who lives long: Longfellow

ఇప్పుడు చరిత్ర:

నెపోలియన్ పుట్టింది 1760, హిట్లర్ 1889 లో పుట్టాడు.-తేడా 129 సంవత్సరాలు.
నెపోలియన్ అధికారంలోకి 1804 లో వస్తే, హిట్లర్ 1933 లో వచ్చాడు- తేడా 129 సంవత్సరాలు.
నెపోలియన్ రష్యా మీద 1812 లో దండెత్తితే, హిట్లర్ 1941 లో దండెత్తాడు.- తేడా 129 సంవత్సరాలు
నెపోలియన్ వియన్నా 1809 లో ఆక్రమిస్తే, హిట్లర్ 1938 లో ఆక్రమించాడు.- తేడా 129 సంవత్సరాలు.
నెపోలియన్ 1816 లో ఓడిపోతే, హిట్లర్ 1945 లో ఓడిపోయాడు. - తేడా 129 సంవత్సరాలు....బాగుంది కదూ!!!!


ఇండియా లో జనవరి 26:
అదే రోజు 1530: బాబర్ చనిపోయాడు
1534: జహంగీర్ పుట్టినరోజు.
1730: నాదిర్ షా ఢిల్లీ మీద దండయాత్ర చేసాడు
1792: టిప్పుసుల్తాన్ బ్రిటిష్ వారితో యుద్థం చేసాడు.
1853: భారతదేశం లో మొదటిసారిగా రైలు ప్రయాణం చేసింది.
1863: బాంబే హైకోర్ట్ ప్రారంభించబడింది.
1885: భారత జాతీయ కాంగ్రెస్ ప్రారంభించబడింది.
1950: భారత్ గణతంత్ర దేశం అయింది.

ఇక్కడొక చిన్న జోక్ అన్నమాట:

శేఖర్: అమ్మా! ఇక్కడి నా షర్ట్ ఏం చేసావ్.
అమ్మ: అబ్బా, ఏవిట్రా ఆ హడావిడి. లాండ్రీ కి పంపించాను.
శేఖర్: చంపావ్ పొ, నా మొత్తం హిస్టరీ స్లిప్స్ అన్నీ దాని పాకెట్స్ లోనే ఉన్నాయ్. ఇప్పుడు నేను ఎక్జామ్ కి ఎలా వెళ్ళాలి.

మరో జోక్:
మేరీ ఆంటియోనేట్: నేను ప్రాచీన యుగం లో పుట్టిఉంటే బాగుండేది.
అలెగ్జాండర్: ఎందుకో?
మేరీ ఆంటియోనేట్: అప్పుడైతే నేర్చుకోవాల్సిన చరిత్ర ఇంత ఉండేది కాదు కదా:)

(చాలా సంవత్సరాలు రాసాను కదూ. అయితే, ఈ చరిత్ర అంతా వేణూ శ్రీకాంత్, శేఖర్ పెద్దగోపులకి అంకితం:)

ఫైనల్ గా మాథ్స్:

WHY DO WE STUDY MATHEMATICS?

To Add noble qualities.
To Subtract evil habits.
To Divide what we have with others.
To multiply love and mercy.
To Root out dowry and caste system.
To Equate men and women in society.
To Differentiate good from evil.
To integrate joy and happiness in Angle.
To maximize our knowledge.
To expand our noble achievement.
To simplify our life.
To solve problems with ease and grace.
To be Rational in our outlook.
To practise the positive approach always.
To be a Dynamic person.
To maintain three Dimensions.
Duty…..Dignity….Discipline......

ఇప్పుడింక ఎక్జాంస్ . తప్పదు కదండి మరి. పరీక్షలు ఒక క్రికెట్ మాచ్ అనుకుంటే ఎలా ఉంటుంది? ఇదిగో ఇలాగే:)

A class room is a "Criket Field"
The Examination is a "Test Match"
Where the student is the "Batsman"
The Paper Setters are the "Bowlers"
The invigilators are the "Umpires"
And the pen is the "Bat"
Questions are the "Balls"
And difficult questions are "Bouncers"
Good questions are "Boundaries & Sixers"
Distinction is 'Century"
And a case of cheating is "Caught out"
And talking in the hall is "Run out"
Where report is the "Score Board"
The highest scores is the "Man of the Match"....

ఇంకా చాలా సబ్జెక్ట్స్ నాకొచ్చండి. ఇప్పటికింక చాల్లెండి పాపం:) మిగతావన్నీ మీకే వదిలేసాను. సరేనా!!!!!.

ఇప్పుడు మా కాలేజ్ గురించి:

If I could pull down the rainbow
I would like to write my college name on it.
And set it back,
To show the people
How colorful our college is.....

ఇంతకీ "దడిగా డువా నసిరా" అంటే మీకు తెల్సా?


*****************************************************************

17, మే 2010, సోమవారం

నివేదన




చమత్కారమున చంపకమాల లల్లగలేను
నీదు గళమలంకరింపగ

కమనీయమగు
కందరీతి నేనెరుగ
నీదు ప్రసన్నత వేడ

ఉత్పన్నమగు నాదు భావసరళి
ఉత్పలయందు జేర్ప శక్తియు నొకించుక లేదు

వేయేల! వేరొండు నేనెరుగ
మ్రోలనిలచి నీదుపూజసేతు

ఏమని?

రవంత నన్ను నీదరినిల్పి
ఆవంత శక్తి ననుగ్రహింపుమమ్మ

సాహితీ నందనమందు
కలుపుమొక్కను నేను

విదిలించి పెకలించకుమమ్మ
సాహిత్య వల్లీ!

నా నివాళులివిగో!!!


(Your heart is a very beautiful garden. And my friendship is a small rose in your garden. Please don't pluck the rose for any reason.....)

నా మనసు లో మనసైన, మనసున్న నా మనస్వి మనసు నొప్పించాను. పుట్టి సంవత్సరం దాటినా, పాపం నా పిచ్చి బ్లాగ్, దానికి నేను హ్యాపీ బర్త్ డే చేయనే లేదు. అందుకే నా మనసులోని ఈ మనసైన భావాలు, నా బంగారుతల్లి మనస్వికే అంకితం.

ఏవిటో, ఈ సంవత్సర కాలం వెనక్కి తిరిగి చూసుకుంటే అంతా పిచ్చి పిచ్చి గానే రాసాననిపిస్తుంది.నేను రాసుకున్నవి ఒక్కటైనా నాకు నచ్చటం లేదు. ఏనాటికైనా, కనీసం ఒక్కసారైనా మంచిగా రాయగలనా అనిపిస్తోంది. ఎవరికైనా నచ్చిన ఒక్క పోస్టన్నా ఉందా!!! నేనేమీ రాయలేననిపిస్తోంది. నా ఈ తపనకు తగ్గ సామర్ధ్యం నాకులేదనిపిస్తోంది. ఆ నిష్పృహ ఫలితమే ఇది.


***************************************************************************

9, మే 2010, ఆదివారం

భరతమాత దత్తపుత్రిక




ఎందరో మహానుభావులకు జన్మనిచ్చిన మన భరతమాతకు ముద్దుల దత్తపుత్రిక మదర్ థెరిసా...

యుగోస్లేవియాలో జన్మించిన ఆగ్నస్ గోన్ష్ బొజాక్సువూ, అనే పువ్వు పుట్టగానే పరిమళించింది.
మానవ సేవకు అంకితమైన త్యాగశీలి.
భారతదేశ అందానికి అద్దం పట్టే హిమాలయాలు ఆగ్నస్ కు స్వాగతం పలికాయి.
ఈ ప్రశాంత ప్రకృతిపట్ల ముగ్ధురాలయింది.
భారత పౌరసత్వం పొంది మదర్ థెరిసా గా రూపుదాల్చింది.
ఉపాధ్యాయ వృత్తికి స్వస్తి చెప్పి సేవాకార్య క్రమాలకు శ్రీకారం చుట్టింది.
పేదరికం రాజ్యమేలుతున్న ప్రాంతాల సముద్ధరణకు కంకణం కట్టుకున్న పుణ్యశీలి.
సమాజం నుంచి బహిష్కరింపబడిన రోగపీడితులకు, అనాధ శిశువులకు తన జీవితం అంకితం చేసిన కరుణామూర్తి.
మానవసేవయె మాధవ సేవ అన్న నానుడికి ప్రతిరూపమే ఈ తల్లి.
భారత ప్రభుత్వం ఈమెకు అందించిన గౌరవ పురష్కారాలు అనంతం.
ఈమె విశ్వప్రజలకు ఆచంద్రార్కం నిత్యస్మరణీయురాలే...
మహిళా ప్రపంచానికే మకుటాయమానమైన విశ్వమాత థెరిసా ఆశలను, ఆశయాలను అనుసరించి ఆచరించిన వారి జన్మ ధన్యం. అదే మన నివాళి.
ఒక నిరాడంబర మానవతా మూర్తి ఈ మదర్....

మదర్స్ డే రోజున ఒకసారి, ఈ అమ్మను తలచుకోవాలనిపించింది. ఎవరి సంతానం కోసం వారు ఎన్ని కష్ట నష్టాల నైనా ఎదుర్కోవచ్చు. త్యాగాలు చేయొచ్చు. కాని ప్రపంచాన్నే తన సంతానం గా భావించి అంకితమైన ఆ విశ్వమాతకు మాత్రం ఏది సాటి రాదు.

ఆ అవతారపురుషుడైనా ఒక అమ్మకు కొడుకే....అంత గొప్పటి అమ్మతనానికి, ప్రతి తల్లికీ ఈ రోజు నా శుభాకాంక్షలు.....


M - Mother for everyone
O - Offered everything she had
T - Took care of every poor child
H - Honored by all
E - Embraced the dying destitute
R - Really loved the orphans
T - Trusted in God
E - Earned her living for others
R - Rejoined with the poor
E - Ever to help you
S - Served the Nation with love
A - Addressed and admired by all



Mother Teresa Prayer in her handwriting:






I have found the paradox, that if you love until it hurts, there can be no more hurt, only more love.
Mother Teresa



******************************************************************

3, మే 2010, సోమవారం

నల్లమల లో... చెంచులతో...!!!



చెంచులతో రెండు రోజులు నల్లమలలో గడిపాము. అదొక వింతైన, గమ్మత్తైన అనుభూతి. ఆధునిక జీవితానికి పదడుగుల దూరంలో చాలా క్రొత్త ప్రపంచంలో అతికొత్త లోకానుభవం. నల్లమలలోని కొన్ని చెంచు గూడాలను చూడాలనిపించి బయలుదేరాము. వారి జీవనసరళి, ఇతర పద్ధతులూ తెలుసుకోవాలనిపించి...చెట్టులెక్కగలవా, ఒ నరహరి పుట్టలెక్క గలవా, చెట్టులెక్కి ఆ చిటారుకొమ్మన చిగురుకోయగలవా...ఓ చెంచిత....అనుకుంటూ ఝాం అని బయలుదేరాం...!!!

నల్లమల అడువుల్లో చాలా చిన్న చెంచు గూడెం ఒకటుంది. ఆధునిక నాగరికతకు దూరంగా బ్రతుకుతున్నారు. అందుకని, వారికి నాగరికత లేదనటానికి వీల్లేదు. వాళ్ళకు గోత్రాలు, సాంప్రదాయ బద్ధవివాహాలు ఉన్నాయి. చిన్న వయసులోనే పెళ్ళిళ్ళు జరుగుతాయి. అమ్మాయి కాని అబ్బాయి కాని వెళ్ళి గూడెం లో తమకు నచ్చిన వారిని ఎన్నుకొని ఊరిపెద్దైన పూజారి అనుమతితో వివాహం చేసుకోవచ్చు. అతడే గూడెం లోని వారినందరిని ఆహ్వానించి స్వయంగా వివాహం జరిపిస్తాడు. వీళ్ళల్లో బహుభార్యాత్వం ఉంది. అంతే కాదు బహు భతృత్వం కూడా ఉంది. అమ్మాయి కూడా తనకిష్టమైతే ఎన్ని వివాహాలైనా చేసుకోవచ్చు. ఈ మధ్యనే అమ్మాయి పలువివాహాల్ని మాత్రం వీరు వ్యతిరేకిస్తున్నారుట. అబ్బాయిలు మాత్రం బహుభార్యాత్వం కొనసాగిస్తునే ఉన్నారు. అంటే కొంత మన నాగరికత నేర్చుకున్నట్లే. తల్లిదండ్రుల పేర్లే మళ్ళీ పిల్లలకు కూడా కొనసాగిస్తారు. ఊరిమొత్తం మీద ఒక పదిపేర్లు మాత్రమే ఉన్నాయి. అందరి ఇళ్ళల్లోనూ అవే పేర్లు.

ఈ మధ్య ప్రభుత్వం వీరికి గృహాలు నిర్మించి ఇవ్వటానికి ప్రయత్నం చేసింది. కాని వీరు ససేమిరా వద్దనేసారు. కారణం ఏమిటో తెలుసా! నాలుగువైపులా గోడలున్న ఇళ్ళంటే వీరికి భయమంట. అంతేకాదు సమాంతరంగా ఉండే పై కప్పు కూడా వీరు ఇష్టపడరు. మూలల్లో దయ్యాలుంటాయని వీరి నమ్మకం. ఎత్తుతక్కువగా ఉండే పైకప్పు వీరిమీద పడిపోతుందని భయమట. అందుకే గుండ్రంగ ఉండే గుడిసెలు, బరువులేని చొప్పలతో త్రిభుజాకారంలో ఎత్తైన పైకప్పుతో తయారు చేసుకుంటారు. అంతేకాదు, ఇప్పటికి కూడా వీరు ఎప్పుడూ వలస పోతూనే ఉంటారు.గూడెంలో ఎవరైనా చనిపోతే, వెంటనే వేరొక చొటికి గూడెం జనమంతా కూడా వెళ్ళిపోతారు. కేవలం పది గుడిసెలే ఉన్న గూడాలు కూడా ఉండొచ్చు.

మమ్మల్ని సాదరంగా ఆహ్వానించారు. వారితోటి ఉండమని బతిమిలాడారు. ఎంత మర్యాదస్తులో.చక్కటి తెలుగే మాట్లాడ్తారు.చాలా ప్రేమ, అభిమానం చూపిస్తారు. మన జీవిత విధానం వేరని వారికి బాగా తెలుసు. అందుకేనేమో, వీలైనంత సౌకర్యంగా ఉంచటానికి ప్రయత్నించారు. ఇప్పటికీ వంట అన్నది వాళ్ళకు లేనే లేదు. కేవలం కట్టెలపొయ్యిమీద అన్నం మాత్రం వండుకుంటారు. తినటానికి వెరే పాత్రలేవీ వాడరు. బండల మీద అన్నం కుమ్మరించుకొని, ఖారం మాత్రమే అందులో కలుపుకొని తింటారు. మాకోసమని అడవిలోని పెద్ద పెద్ద ఆకులు కోసుకొని వచ్చి అందులో మాకు భోజనం పెట్టారు . అవి కడగనేలేదు. మీరు కూరలు తింటారు, మాకు తెలుసు అని, రకరకాల ఆకులు కోసుకొచ్చి కూరవండి మాకు పెట్టారు. ముందు తినాలనిపించలేదుగాని, తిన్నాకొద్దీ ఎంతో రుచిగా అనిపించింది. ఆకు దొన్నెల్లో తేనె ఇచ్చారు. నాకైతే భక్త కన్నప్ప గుర్తుకొచ్చాడు. అన్నట్లు వీళ్ళకోసం ప్రభుత్వం కట్టించిన స్కూల్ పేరు 'భక్త కన్నప్ప గురుకులం’

ఇష్టకామేష్టి అమ్మవారి దేవాలయం కూడా ఉంది. చాలా చిన్నది. కొంచెం అండర్ గ్రౌండ్ లోకి కూడా ఉంటుంది. లోపలికి ఒంగి వెళ్ళాలి. ఈ గుడికి ఎక్కడెక్కడి చెంచులో వస్తారట. చాలా ప్రసిద్ధి అని చెప్పారు.పూర్తిగా హిందూ మతాన్నే నమ్ముతారు. చాలా మంది క్రైస్తవ మత వ్యాప్తి కోసం ఇక్కడ ప్రయత్నించినా వాళ్ళని హింసించి మరీ వెళ్ళగొట్టారుట. మేమెందుకు క్రైస్తవులుగా మారాలి అని అడుగుతారు.

మాకు అడివి చూపిస్తానని ఒక ముప్పై ఏళ్ళాయన మాతో వచ్చాడు. వన్నెచిన్నెల రంగులీనె ఏనాడూ చూడని పూలు, తీగలు, చెట్ల ఊడలు చూస్తున్నాకొద్దీ అదొక కొత్తబంగారు లోకమనిపించింది. ఆ చిక్కటి అడవిలో నడుస్తుంటే ఏ మూలనుంచి ఏ జంతువులొస్తాయో అని భయమేసింది. మేమంతా ఇక్కడున్నాం కదండి, అందుకే ఏ జంతువులు రావు అన్నాడాయన. ఒక్కసారిగా అక్కడున్న ఒక చెట్టు ఆకులు తీసి చివర్ల నుంచి పీల్చటం మొదలు పెట్టాడు. అదేంటి అంటే దాహమేస్తుంది నీళ్ళు తాగుతున్నా అన్నాడు. అంతే మరి, వాళ్ళు నీళ్ళు పట్టి ఇంట్లో పెట్టుకోటమన్నదే లేదు. ఇంతలో ఆకలేస్తుంది అని ఓ పక్కకి పోయి అయిదునిముషాల్లో వచ్చాడు. అతడి చేతిలో చచ్చిపోయిన జంతువొకటి వేలాడుతోంది. ఏ పులులో వాటిని చంపి, నీరు తాగటానికి వెళ్ళినప్పుడు వీళ్ళు వాటిని ఎత్తుకొస్తారట. ఆ పచ్చి మాంసం అలాగే తినటం మొదలు పెట్టాడు. నాకైతే కడుపులో తిప్పటం మొదలుపెట్టింది. ఇప్పటికీ ఈ విధంగా జీవించేవాళ్ళు ఉన్నారని ఎవరైనా చెప్పిఉంటే నమ్మేదాన్ని కాదు. కానీ నా కళ్ళతోటే చూస్తున్నాను కదా!

నా దగ్గిరున్న ఒక కాడ్బరీ చాక్లెట్ ఇచ్చి తినమన్నాను. మొత్తం బాగానే తిని, ఛీ..మేమైతే ఇట్ల చుంచెలుకలు తియ్యగ తినం, అన్నాడు. అంటే నేనిచ్చిన కాడ్బరీ, ఎలుక అనుకున్నాడు. ఖర్మ...నేను చివరికి ఎలుకలు తినేదానిలాగ కనిపించానా! హతోస్మి...గమ్మత్తేంటంటే, మేము వొచ్చేసేటప్పుడు నాదగ్గిరున్న కాడ్భరీ పాకెట్ మొత్తం అడిగి మరీ తీసుకున్నాడు.

చెట్ల ఊడలు పట్టుకోని చాలా స్పీడ్ గా ముందుకెళ్ళిపోతున్నాడు. మన వెహికల్స్ తో పోటీ పెట్టొచ్చనిపించింది. నేనూ ప్రయత్నించాను అలా పోవటానికి. కాని తరువాత ఏం జరిగిందో చెప్పకపోవటమే మంచిది. నాకు మంచిగా నేర్పిస్తానని మాటిచ్చాడు లెండి:)

అక్కడి ఫారెస్ట్ ఆఫీసర్ చెప్పిన ఒక సంఘటన తెలుసుకుంటే వీళ్ళెంత అమాయకులో కూడా అర్ధమౌతుంది. ఒకసారి ఒకాయనకి కలలో తన స్నేహితుడు తన భార్యని తీసుకెళ్ళిపోతున్నట్లుగ కలవచ్చిందిట. అంతే, మర్నాడే అతన్ని బాణం వేసి చంపేసాడట. పోలీసులు ఎందుకలా చంపావు, నీకు ఋజువేంటి అనడిగితే నాకు కల వచ్చిందిగా అన్నాడుట. చివరికి వీళ్ళ వ్యవసాయం కూడా వాళ్ళ అమాయకత్వాన్నే చూపిస్తుంది. వరి పంటలు పండిస్తారు. కొంచెం భూమిలో అయిదువేల రూపాయల ఖర్చుతో పంట పండిస్తే వారికి వచ్చేది మూడు మూటల ధాన్యం మాత్రమే. మూడు మూటల్లో ధాన్యం ఉందని సంబరపడిపోతారే కాని తాము ఖర్చు పెట్టిన అయిదువేలకు వచ్చింది పదిహేను వందలే అన్న ధ్యాస మాత్రం వాళ్ళకుండదు. ఇప్పటికీ వీళ్ళు బార్టర్ సిస్టమే అనుసరిస్తున్నారు.

ఈ అడవి మొత్తం మీద కొన్ని వేల మంది చెంచులున్నారు. వాళ్ళకి విద్యాబుద్దులు నేర్పాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. వీరందరిలో పదిమంది గ్రాడ్యుయేట్లున్నారుట. వీళ్ళు మాత్రం ఎంతో ఆధునికంగా బయటిప్రపంచంలో జీవిస్తున్నారు. వీళ్ళని చెంచులంటే నమ్మలేము. వీళ్ళ తల్లితండ్రులు మాత్రం ఇంకా అలానే ఉన్నారు. దగ్గరి గ్రామాల్లో వీళ్ళకి హాస్టల్స్, ఉచితవిద్యా సౌకర్యాలు కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఒక యాభైమంది చెంచు విద్యార్ధులు మాత్రమే విద్యనభ్యసించటానికి ముందుకు వచ్చారు.

అన్నట్లు వీళ్ళల్లోనే పచ్చగడ్డి లింగన్న అనే ఒకబ్బాయికి ఆర్చరీలో నేషనల్ అవార్డ్ కూడా వచ్చింది. అక్కడున్న వెదురుచెట్లనుంచి విల్లు, బాణాలు తయారు చేసాడు. బాణాలకి చివర రాతిని అరగ దీసి కట్టాడు. అంతేకాకుండా బాణం చివర నెమలి ఈకలు కట్టాడు. అటువంటి బాణం చాలా దూరం పోతుందిట.గూడెం లోని వాళ్ళందరూ ఇలాటి బాణాలుపయోగించే వేటాడుతారు. ఈ బాణంతోటే అతడు అవార్డ్ గెల్చుకున్నది. ఢిల్లీ లో అధికారులు ఇతని దగ్గరున్న బాణాలు తీసుకొని అక్కడ మ్యూజియం లో పెట్టారుట. ఇతడుకూడా ఉచిత విద్యనభ్యసించినవాడే. నేనుకూడా ఆ బాణం తీసుకొని ప్రయత్నించాను. వెంటనే మా ఫ్రెండ్ అది నీకు సరిపోదులే, "నువ్వేనా...నువ్వులాఉన్న ఎవరోనా..." అని పాడటం మొదలుపెట్టింది. నాకు రోషం, ఆవేశం వచ్చేసాయి. కాని ఏంలాభం, నేను వేసినబాణం పదడుగుల దూరానికి కూడా పోలేదు. కొంచెం నువ్వేసి చూపించవా అంటే వేసాడు. ఆ బాణం పోయినదూరం కొలవటం చాలా కష్టం. అతను దాన్ని తిరిగి తీసుకురాటానికి పదినిముషాల పైనే పట్టింది. ఆ బాణం వేస్తే మనుషులు రెండుగా చీలిపొతారని చెప్పాడు.అది వినగానే నా చేతిలోని విల్లు, బాణం జారి పడిపోయాయి.

వీళ్ళల్లోను రాజకీయాలున్నాయి. కాని అవి వాళ్ళకే పరిమితం. ఇప్పసారా అలవాటు చాలా ఉంది. బాగా తాగుతారు, వాళ్ళల్లో వాళ్ళే కొట్టుకుంటారు. ఎందుకలా అంటే. అదంతే అంటారు.

ప్రస్తుతం ఎంతో అభివృద్ధి చెందుతున్న ఇకో టూరిజం ద్వారా ఇక్కడి ప్రజల సహకారం తో వారిని ఆర్ధికంగా, సామాజికంగా ఉన్నత స్థాయికి తీసుకెళ్ళచ్చనిపిస్తోంది. ప్రభుత్వానికి, ఇక్కడిప్రజలకి ఆదాయం పెరిగే అవకాశం కూడా చాలాఉంది. జూలాజికల్ పార్క్స్, జియొలజి, ఆర్చరీ, ట్రెక్కింగ్, బోటింగ్, స్విమ్మింగ్, మెడిసినల్ ప్లాంట్స్, తెనె పరిశ్రమల వంటి అనేక ఇతర వృత్తివిద్యలకు వీళ్ళేకదా అధినాయకులు. ప్రభుత్వం వీరితోటే ఇవన్నీ నిర్వహించవచ్చు.

కొంతమంది వీరిని ఆధునిక ప్రపంచంలోకి తీసుకు రావటానికి ఇష్ట పడటం లేదట. కారణమేమిటి అంటే,అది ఈ గిరిజన సంస్కృతిని మరుగున పడేస్తుంది, మన ప్రాచీన సంస్కృతిని కాపాడాలి, అన్నది వీరి వాదన. అలా అంటే ఎలా? అందరం ఈ పరిణామ దశ నుంచి వచ్చిన వారమే కదా!!! అభివృద్ధి లేక పోయినట్లైతే, ఇప్పటికీ అందరం ఆది మానవులమేగా!!! అవే ఆకులు అలములు తినాల్సి వచ్చేది కదా...!!!




*************************************************************************

27, ఏప్రిల్ 2010, మంగళవారం

యమునా తీరమున....

నాలోని నవరసాలు - అద్భుతం

ఉత్తరా౦చల్ లో ఉన్న కేదారీనాధ్, బద్రీనాధ్, యమునోత్రి, గ౦గోత్రి...ఈ నాలుగు పుణ్య క్షేత్రాలు చూడాలని నాకు ఎప్పటిను౦చో కోరిక. భక్తి తో కాదు..రక్తి తోటే..ఆ మహోన్నతమైన హిమాలయాల సౌ౦దర్య౦ తనివితీర ఆస్వాది౦చాలన్న కోరిక మాత్రమే. మామూలు జీవితాలకి దూరంగా స్వర్గలోకాన్ని చూపే ఈ యాత్ర నా చిరకాల వాంఛ. పోయినసంవత్సరం వెళ్ళిన ఈ యాత్ర నాకు ఇంకా కొత్తగానే నిలిచిపోయింది. నాకు అన్నిటికన్నా నచ్చిన యాత్ర యమునోత్రి. మరచిపోయిందేలేదు. ఇంకోసారి తలుచుకోవాలనిఉంది. నా బ్లాగ్ మితృలందరితో మరొక సారి ఈ అనుభవాలు పంచుకోవాలనే ఆశతో....

చార్ ధాం యాత్ర అంటేనే ఎంతో ప్రత్యేకమైంది. గంగోత్రి, బద్రినాధ్ దాకా వాహనాల్లో వెళ్ళిపోవచ్చు. కేదారినాధ్ రానూపోను ఇరవైఎనిమిది కిలోమీటర్లు ప్రయాణం చేయాలి. డోలీలు, గుర్రాలు మేము ఎక్కదలుచుకోలేదు. అక్కడ హెలికాప్టర్ ఎక్కేసాం. ఆ అనుభవం ఇంకోసారి. యమునోత్రి మాత్రం ఇటువంటి సౌకర్యం లేదు కాబట్టి ఏదోఒకటి ఎక్కాల్సిందే...లేదంటే రానూపోనూ పదహారు కిలోమీటర్ లు నడవాలి. సరస్వతి, సంధ్యా నడుద్దామన్నారు. కాని అంతదూరం నడిచే నమ్మకం నామీద నాకు లేదు. నేను పోనీ ఎక్కేస్తానన్నాను. సంధ్య కూడా అదే ఫాలో అయిపోయింది. కాని సరస్వతి నడిచొస్తానంది. ముగ్గురమూ పక్కపక్కనే వెళ్ళే అవకాశం ఎలాగూ లేదు. సరే ఇంక పైనే కలుసుకోవాలని అనుకున్నాం. సరస్వతి నడక మొదలుపెట్టి వెళ్ళిపోయింది. ఒక గుర్రం సంధ్య ఇంకోటి నేను ఎక్కాం. చాలామందే ప్రయాణం చేస్తున్నారు. క్రమంగా ముగ్గురం వేరే అయిపోయాం.



ఇక్కడి నుంచి ఒంటరి ప్రయాణం తప్పలేదు. భయపడకూడదు అనినాకు నేను ధైర్యం చెప్పుకున్నాను. మళ్ళీ ఇటువంటి అవకాశం రాదు. కోరికతీరేవేళ భయపడితే ఎలా అనుకున్నాను. ముందూ వెనకా ఇంతమంది వెళ్తూనే ఉన్నారుగా....ఏమన్నా అయితుందేమో...ఊహూ...ఇంక ఏ ఆలోచనలూ ఒద్దు...అంతే...అన్నీ మర్చిపోయాను. దానికి కారణం చుట్టూఉన్న ఆ అందమైన ప్రక్రుతే...నా గుర్రం తో ఉన్న అబ్బాయి చిన్నవాడు. హుషారుగా ఉన్నాడు. ఏదో భాషలో పాట పాడుతున్నాడు. వినటానికి చాలా బాగుంది. సన్నటి రహదారి. ఒకవైపు చేతికి కొండలు తగులుతున్నాయి. ఇంకోవైపు అగాధం. ఒక్కసారి కొంచెం తలవొంచి కిందకి చూశాను. అమ్మో! అంతపెద్ద లోయ నేనెప్పుడూ చూడలేదు. ఒక్కనిమిషం భయం వేసినా..మరుక్షణమే అన్నీ మరిచిపోయాను. ఆ లోయలో ప్రవహిస్తున్న నది, దూరంగా కనబడుతున్న మంచుపరచుకున్న ఎత్తైన పర్వతాలు, ఆ పర్వతాలమీంచే దోబూచులాడుతూ మెల్లగా కదిలిపోతున్న దూదిపింజాల్లాంటి తెలతెల్లని మబ్బుతెరలు, మబ్బులమధ్య అక్కడక్కడా నీలి ఆకాశం...ఎంత అందంగా ఉందో ప్రక్రుతి. ఇంత తక్కువ ఆకాశమా! అంత ఎక్కువ మబ్బులా! చాలా ఆశ్చర్యం! అంతేకాదు..ఆ తెల్లతెల్లని మబ్బులన్ని సయ్యటలాడుతున్నాయి. నా చేతికి దొరుకుతానంటూ..ఎంతో చేరువలోకి ఒస్తున్నాయి. కాని..మరుక్షణమే దూరమైపోతున్నాయి. మబ్బుల మధ్య నేను తేలిపోతున్నాను...నిజమేనా!!! ఇంకోసారి చేయి చాపాలనుకున్నాను. కాని గుర్రాన్ని ఒదలాలంటే భయం వేసి బిగించి పట్టుకొని అలాగే కూచున్నాను. నాపని "ఊపర్ సే షేర్వాణి, అందర్ సే పరేషానీ..." లాగా ఉంది.




ఎంత చల్లటి వాతావరణం. ఎక్కడా సూర్యభగవానుని జాడేలేదు. మెల్లి మెల్లిగా పైకి పోతున్నాము. కొంచెం కొంచెంగా పైకి పోతున్నా కొద్దీ హిమవన్నగమే ఎక్కుతున్న ఆనందం కలుగుతోంది. కొంచెం సేపు కిందికి దిగాలనిపించింది. పాపం నేనెక్కిన గుర్రం చిన్నపిల్ల. కొన్ని చోట్ల నన్నుమోసుకుంటూ మెట్లు కూడా ఎక్కుతోంది పాపం. కానీ ఎలా దిగాలి! ఆ అబ్బాయే ఒక చిన్న కొండదగ్గిర ఆపి నేను తిగటానికి సహాయం చేసాడు. మెల్లిగా ఆ అబ్బాయి చెప్పే కబుర్లు వింటూ ఇద్దరం నడక సాగించాం. దారిలో ఒక చోట వేడివేడి టీ తాగాం. టీ తాగుతూ అక్కడి పరిసరాలు చూస్తు మైమరచిపోయాను. సన్నటి జల్లు ప్రారంభమైంది. ఆ చల్లటి వాతావరణం లో, ఆ చిరుజల్లులలో....ఇది నిజమేనా! అక్కడ ఉన్నది నేనేనా!!! చిన్నపిల్లలా గిరగిరా తిరుగుతూ వానావానా వల్లప్పా అని ఆడుకోవాలనిపించింది. ఒంటరితనంలో ఇంత ఆనందమా!!!

పాడాలని ఉంది..మాటలే రాని వేళ పాట ఎలా పాడను...
కళ్ళలోన కడలి సాకి...ఎంతసేపు ఆపను...
ఓ గగనాన హత్తుకున్న మేఘమా..నీ దరిని చేరనీ నన్నిలా
నా మది గలగలా ఈ జీవనదిలా
దరహాసమంటి ఈ చిరు చినుకు లా
చేరాలి నను గాలి తరంగంలా
ఓ ప్రియ నేస్తమా! మేఘమా...కదలిపోకు...
స్వప్నమా జారిపోకు....ఈ ఆనందాన్ని నా మూగ మదిలో నింపిపో
నా గుండె గుడిలో దాగిపో
నా కోసం మళ్ళీ వస్తానని మాటిచ్చిపో
ఎందుకంటే నా మనసంతా ఉండిపోయింది నీ చెంతే!!!
అందుకే ఈ దిగులంతా ఓ ప్రియ నేస్తమా...
నా హ్రుదయస్పందన ఇంకా మిగిలే ఉంది....
ఈ ఆహ్లాద ప్రక్రుతిలో లీనమైన నాకు పైకి ఎప్పుడు చేరుకున్నానో తెలియనేలేదు.
నాకంటే ముందే అక్కడ చేరిన నా స్నేహితులను చూచి, మెల్లగా నా ఆలోచనలు జారుకున్నాయి.

అక్కడున్న చిన్నచిన్న దుకాణాల్లో చాలా మందే సేదదీరుతున్నారు. మేమూ అక్కడే వేడివేడి పరాటాలు, ఆలూ కర్రీ తో తిన్నాం. ఎంతో రుచిగా అనిపించింది. అక్కడి నుంచి మెల్లిగా కిందికి దిగుతూ పోతే అందమైన యమునమ్మ స్వాగతం చెపుతూ ఎదురయింది.



హిమాలయల్లోంచి సన్నని పాయగ మొదలైన యమున అక్కడ మందగమనంతో వయ్యారంగా వంపులు తిరుగుతూ మలుపుల్లో కలిసిపోతోంది. అది దాటటానికి చిన్న వంతెన. ఆ వంతెన దాటుతుంటె సన్నటి నీటితుంపరలు మీద పన్నీటిని చిలకరిస్తూ పవిత్రభావాన్ని కలిగిస్తున్నాయి. అక్కడే ఒక చిన్నగుడి. ఆ గుడికి చేరటానికి మధ్యలో చిన్న చిన్న కొండలు దాటుకుంటూ పోవాలి. ఆ పక్కనే వేడినీటి కొలను(హాట్ స్ప్రింగ్) ఉంది. అందులో స్నానం చేసి అమ్మవారి దర్శనానికి వెళ్ళాలి. కాని అది నాకిష్టం లేదు. అంతమంది ఆ నీటిలో స్నానం చేస్తుంటే భక్తి ఏమోకాని రోగాలొస్తాయనిపించింది. ఆ వేడివేడి నీటిదగ్గరికి వెళ్ళి కాళ్ళు తడిపాను. గోరువెచ్చటి నీళ్ళే, కాని ఆ నీరు సెగలుపొగలు కక్కుతోంది. మెల్లిగా పక్కకి వెళ్ళాను. అక్కడ ఇంకో చిన్న వేడినీటి కుండం ఉంది. ఆ నీరు మాత్రం మసిలి పోతున్నాయి. మనం కొన్న పూజాద్రవ్యాల్లో చిన్న బియ్యం మూట కూడా ఉంటుంది. ఆ చిన్న మూటని ఆ నీటిలో ముంచితే క్షణాల్లో అన్నం ఉడికిపోతుంది. అది అమ్మవారికి ప్రసాదం పెట్టాలి. అక్కడినుంచి గుళ్ళోకి వెళ్ళాం.

ముఖ్యంగా ఉత్తరభారతదేశంలో దేవాలయాల్లో అమ్మవారి విగ్రహాలు నాకెందుకోగాని నచ్చదు. పాలరాతి విగ్రహానికి, చెమ్కీ బట్టలేసి, విగ్గుతో రెండుజెడలేసి, రబ్బరుబాండ్లు పెట్టి, ప్లాస్టిక్ పూలు పెడతారు. దక్షిణ భారతదేశపు గుళ్ళల్లో ఉండే భక్తిభావం బహుశా నాకందుకే అక్కడ కలగదేమో మరి.



అక్కడినుంచి ఒకగంటసేపు చుట్తూతిరుగుదామనుకున్నాము. అంత చల్లటి వాతావరణంలో కూడా నాకు ఆ నీటిలొ నడవాలనిపించింది. లోతు లేదు. నీరు చాలా స్వచ్చంగా, కింద నేల కనిపిస్తూ సనసన్నటి తుంపరలతో సాగిపోతోంది. చిన్న బండలమీంచి వెళ్లి నీటి మధ్యలో కూచున్నాను. కాలు తీసి నీటిలో పెట్టాను. ఆ చల్లదనానికి కాలు జివ్వుమని వెంటనే పక్కకి అడుగేసాను. ఈ సారి కాలు చుర్రుమంది. నాకు ఒక పక్క గడ్డకట్టే చల్లటి నీరు, ఇంకోవైపు వేడినీరు. గమ్మత్తుగా ఉంది. ఒకేసారి రెండుకాళ్ళు రెండువైపులా పెట్టాను. కాని అదే స్పీడ్ తో నా కాళ్ళు తిరుగు టపాలో పైకొచ్చేసాయి. ఇంక లాభం లేదని నీటి అంచులకి పైపైన కాళ్ళు తాటిస్తూ కూచున్నాను.

ఎంతో అందమైన పాట...యమునా తీరమున ...సంధ్యా సమయమునా..వేయికనులతో రాధా వేచియున్నది కాదా!!! అని పాడుకున్నాను. నిజంగా నా కోసం ఆ నల్లనయ్య ఒస్తే బాగుండు.
ఓ కన్నయ్యా! నా దగ్గరికి రావా!!
చిరునవ్వుల పూలవాన కురిపించవా
కమ్మటి కలలు అందించవా
బ్రతుకు అనే పయనంలో పడిపోయిన నన్ను
నీ ప్రేమ బంధంలో ఓలలాడించవా
ప్రక్రుతినే ఆహ్లాదపరిచే, సర్వ కాలాల్లోను చిగుళ్ళు తొడిగే
రాగడోలికల్లొ ఊగించే ఈ మధురస్మ్రుతిని నాకు కలకాలం నిలుపు.

ఒక్క క్షణం ప్రేమిస్తావా,
చితినుండి లేచి వస్తాను...
మరుజన్మకు మనసిస్తావా,
ఈ క్షణమే మరణిస్తాను....
నా హృదయమంతా నీ జ్ఞాపకాలే....

వెంటనే ఒక మెరుపు మెరుస్తూ చెప్పింది. ఉండేది క్షణమైనా ఉజ్వలంగా ఉండమని
ఆ పక్కనే ఒక ఆకు రాలుతూ చెప్పింది ఈ జీవితం శాశ్వతం కాదని
ఈ పక్క ఒక పువ్వు వికసిస్తూ చెప్పింది, జీవించేది ఒకరోజైనా గౌరవంగా జీవించమని
ఇక్కడి యమునమ్మ జలజల పారుతూ చెప్పింది, తనలాగే కష్టసుఖాల్లో చలించకుండా సాగిపొమ్మని.

ఇప్పుడు నాకర్ధమైంది...ఎందుకింతగా ఈ యమునోత్రి యాత్ర నన్నాకర్షించిందో!!!
అద్భుతం ....మహాద్భుతం....

**********************************************************

8, ఏప్రిల్ 2010, గురువారం

తప్పుచేసానా!





పరీక్షలు...హడావుడి. ఇప్పుడు ఆ యముడొచ్చి పిలిచినా తరువాత రావోయ్...అనే పరిస్థితి.

ఇంతలో ఎక్షాంస్ రాయాల్సిన ఒక బ్లైండ్ గర్ల్ ఒచ్చింది. అందరు ఇన్విజిలేటర్స్ రూంస్ కి వెళ్ళిపోయారు. ఈ అమ్మాయి రావటం లేట్ అయింది. ఇప్పుడు వెంటనే తన ఎక్షాం రాయటానికి ఎవరైనా వెళ్ళాలి. ఇక్కడొక చిన్న విషయం. స్టాలిన్ సినిమా లాగా బ్లైండ్ స్టూడెంట్స్ తమ ఎక్షాం రాయటానికి తామే కష్టపడి ఎవరినో తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. అలా ఎక్కడ కూడా జరగదు. ఎక్కడైనా సరే ఆ స్టూడెంట్ కాంబినేషన్ కాని ఎవరో ఒక లెక్చరర్ ని స్క్రైబర్ గా అలాట్ చేస్తారు.

అప్పటికే పది నిమిషాలైపోయింది. ఇప్పుడెలా! ఎవర్ని పంపాలి? కంట్రోల్ రూం లో ఉన్నది నలుగురమే. మధ్యాహ్నం డ్యూటీ ఉన్నవాళ్ళు ఇప్పుడే రారు. ఆ అమ్మాయి అక్కడే నిలబడి ఉంది. అప్పటికే ఆ అమ్మాయిని చూడంగానే నా మనసు కరిగి నీరై ఆ అమ్మాయి దగ్గరికెళ్ళిపోయింది. నేనే తన ఎక్షాం రాయాలని డిసైడై పోయాను. ఆ సంగతి నాతోటి వాళ్ళకు చెప్పాను. అక్కడ ఒకళ్ళు తక్కువైనా పని ఎంత కష్టమో తెల్సి కూడా వాళ్ళు సరే అన్నారు.

ఇప్పుడున్నది సెకండ్ లాంగ్వేజ్ ఎక్షాం. ఆ అమ్మాయిది తెలుగు పరీక్ష. ఆన్సర్ షీట్, క్వెశ్చన్ పేపర్ తో పాటు ఆ అమ్మాయిని తీసుకొని కారిడార్ లో ఒకపక్క కి వెళ్ళాను. ఆ అమ్మాయిని వేరు గానే కూచోపెట్టాలి. వాళ్ళు బయటకి అన్నీ చెప్తూ ఉంటారు కాబట్టి అందరితో పాటు ఒకే రూం లో ఉంచరు.

టేబల్ కి అటూ ఇటూ గా ఇద్దరం కూచున్నాం. హాల్ టికెట్ తీసుకొని తన డిటైల్స్ అన్నీ ఫిల్ చేసేసాను. అప్పటికే చాలా ఆలష్యమయ్యింది. ఆ అమ్మాయికి పేపర్ మొత్తం చదివి వినిపించి...చెప్పమ్మా ఏ ప్రశ్నలు రాస్తావో...అన్నాను. ఆ అమ్మాయి ఏమీ మాట్లాడలేదు. వినలేదేమో...అని మళ్ళీ అడిగాను. ఇప్పటకీ ఏ జవాబు రాలేదు. ఇదేంటి? నాకేం అర్ధం కాలేదు. ఆ అమ్మాయి ఏం చెప్తే అదే కదా నేను రాయాలి. ఇప్పుడు ఈ అమ్మాయి ఏం మాట్లాడట్లేదు. ఎలా!

ఇప్పటికే ఆలష్యమైంది. నువ్వేమి చెప్పక పోతే ఎలా? పేపర్ మళ్ళీ చదవ మంటావా? అని అడిగాను. ఊహూ...ఏం కదలిక లేదు. ఒక నిమిషం చుట్టూ చూసాను. కారిడార్ లో కూచున్నాం కదా, బయట గాలి చల్లగ తగులుతోంది. కిందనుంచి పైదాకా పెరిగిన ఉడన్ రోజ్ తీగ, దాని ఆకులు మెల్లగ తలలూపుతున్నాయి. అప్రయత్నంగా నా చేయి ఓ చిన్నారి రోజ్ మీదకెళ్ళింది. ఎంతందంగా ఉంటాయి కదా ఈ పూలు అనిపించింది. ఇంతలో మేడం, మీరు నాకు తెలుసు...అన్న ఆ అమ్మాయి మాటలు వినిపించాయి. తలతిప్పి తనని చూసాను. చూసుండొచ్చు రోజూ కాలేజ్ అంతా తిరుగుతూనే ఉంటానుగా అనుకున్నాను.

చూడు టైం ఎలా గడిచిపోతోందో. ఇలా ఎంతసేపు కూచుందాం అన్నాను. ఈ మొదటి క్వెశ్చన్ బాగున్నట్లుంది. దీనితో స్టార్ట్ చేయి, అని ఓ ఉచిత సలహా ఇచ్చాను. వెంటనే, మీరే రాసేయండి మేడం అంది. నేనే రాసేయాలా...తనేం చెప్పకుండానే? అదిరిపోయి, ఆ అమ్మాయి మొహం లోకి చూసాను. కళ్ళు చాలా అందంగా ఉన్నాయి. చూపు లేదంటే నమ్మలేను. ఆ కలువరేకుల్లోనుంచి ఒక్కొక్క కన్నీటి చుక్క మెల్లగా బయటికి ఒచ్చి ఆ లేత బుగ్గ్గల మీదికి జారిపోతున్నాయి. ఒక నిమిషం నాకేం అర్ధం కాలేదు. మెల్లగా ఏంటమ్మ ఎందుకేడుస్తున్నావు ఏమయ్యింది, అనడిగాను.

మెల్లిగా అన్ని విషయాలు చెప్పింది. తనొక అనాధ. ఎక్కడో దూరంగా ఒక అనాధ శరణాలయంలో పెరుగుతోంది. ఎప్పటినుంచి ఉందో తనకే తెలియదు. చదువు మీద ఉన్న కోరికతో శ్రద్ధగా చదువుకుంటోంది. అంతే కాకుండా అక్కడున్న చిన్న పిల్లలకు తనే అక్షరాలు నేర్పించి, తను తెలుసుకున్న విషయాలన్నీ చెప్పుతూ ఉండేది. కళ్ళు లేక పోయినా ఎన్నో పనుల్ని హుషారుగా చేసేది. ఆ అమ్మాయి తెలివితేటలకి అక్కడి అధికారులు సంతోషించి అక్కడే తనకి ఒక ఉపాధి కల్పించాలనుకున్నారు. అక్కడే చిన్న పిల్లలకి టీచర్ గా నియమిస్తే తనకి ఒక ఆధారం దొరుకుతుందని భావించారు. కాబట్టి డిగ్రీ చదువు పూర్తి చేస్తే తనకి ఆ ఉద్యోగం ఇస్తామని చెప్పారు. అప్పటినుంచి ఆ అమ్మాయి కష్టపడి చదువుకొని, అక్కడే స్థిరపడాలనుకుంది. కాని, లోకమంతా పాతుకుపోయిన కుత్సితపు బుద్ధి అక్కడ కూడా బాగానే స్థిరపడింది. ఈ అమ్మాయికి ఆ ఉద్యోగం రావటం ఇష్టం లేని మిగతావారి మూలంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఒచ్చింది. తనమీద కంప్లైంట్స్ చేసేవారు. ఎప్పుడు చదువుకోటానికి ప్రయత్నం చేసినా ఏదొవిధమైన విఘ్నాలు కల్పించే వాళ్ళు. అక్కడ దుర్భర పరిస్థితులు కల్పించారు. అడుగడుగునా సమష్యలు ఎదుర్కొంటోంది. ఉద్యోగం మీది దిగులుతో, ఏమి చదువుకోలేని పరిస్థితుల్లో ఇవాళ ఎక్జాం రాయటానికి ఒచ్చింది.

నాకు అసలే నెత్తిమీద ఎప్పుడూ స్థిరంగా ఉండే నీళ్ళ కుండ కదిలిపోయి ఆ నీరంతా నా మొహం మీద పరుచుకోటం మొదలుపెట్టింది. ఈ అమ్మాయి పాస్ అయితే తను స్థిరపడి సంతోషంగా ఉంటుంది. కేవలం అక్కడి చిన్న పిల్లల చదువుకి ఈ అమ్మాయి చదివే డిగ్రీ చదువుకి ఏం సంబంధం లేదు. నేను గనుక హెల్ప్ చేస్తే సంతోషిస్తుంది. ప్రతిరోజు ఎన్ని రకాలుగా అరికట్టటానికి ప్రయత్నిస్తున్నా కాపీలు కొట్టే స్టూడెంట్స్ నా కళ్ళముందు మెదిలారు. వాళ్ళు పెద్దపెద్ద ఉద్యోగాలు సంపాదించుకుంటారు. ఈ అమాయకురాలికి నేను సహాయం చేస్తే ఏం ముంచుకు పోతుంది గనుకా! అనిపించిందొక క్షణం. ఈ తెలుగు పేపర్ నేనెలా రాయాలి. పేపర్ నిండా ఉన్న ప్రశ్నలు ఒక్కటికూడా నాకు తెలియవు. అంతే కాదు, పద్యాలు...ప్రతిపదార్ధాలు, వ్యాకరణం..అలంకారాలు...చందస్సు... బాబోయ్..ఇవన్నీ నేనెలా రాయాలి. నా తరంకాదు. టైం ఏమో రన్నింగ్ కాంపిటీషన్ లో ఉంది. ఇదొక్కటేనా..ఈ అమ్మాయి పాస్ అవ్వాలంటే రేపటినుంచి అన్నీ నేనే రాయాలి. అటువంటి పని నేను చేయగలనా? వెంటనే నేనో పెద్ద అద్దాల గదిలో ఉన్నట్లు..అందులోని నా ప్రతిబింబాలన్నీ నన్ను నిలదీస్తున్నట్లు అనిపించింది. అంతేనా...నా మనస్సాక్షి కూడా అప్పటివరకు నేను చూసి మురిసిపోయిన ఉడ్రోజ్ పక్కనే కూచొని నన్ను నిలువునా కోరచూపులతో దహించేస్తున్నట్లనిపించింది.

ఏం చేయాలి...ఇప్పుడు నేనేం చేయాలి...
నాకే తెలియకుండా తెలుగు పరీక్ష జరుగుతున్న రూం ముందుకెళ్ళాను.
అక్కడ అన్నీ ఒకే రకం తెలుగు గైడు లన్నీ ఓ పెద్ద పర్వతం లాగా ఉన్నాయి. అక్కడే ఒక ఆయా కూడా ఉంది. చాలా మంది గైడ్లు మాత్రమే చదువుతారని నా కర్ధమయ్యింది. మెల్లిగా ఒక బుక్ తీసుకున్నాను. తిరిగి ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళాను. కొన్ని ఆన్సర్లు అందులో వెతికి రాసాను. వ్యాకరణం సరిగ్గా రాయలేక పోయాను. పద్యం చందస్సు విభజన కష్టపడి చేసాను. అది ’నజభజజజర” అనుకుంట. అవును చంపక మాల. పద్ధతి ప్రకారం రాయలేక పోయినా మొత్తానికి పరీక్ష రాసేసాను.

రేపటినుంచి ఆ మర్నాటి ఎక్షాం బుక్స్ తీసుకొచ్చుకో. ఎక్షాం కాంగానే ఇక్కడే సాయంత్రం వరకు చదువుకొని పోవచ్చు, నేను ఎవరికన్నా చెప్తాను, నీకు హెల్ప్ చేస్తారన్నాను. తన బుక్స్ అన్నీ ఎత్తుకుపోయారుట. ఏదో విధంగా ఇక్కడే చదవొచ్చు. సాయంత్రం వరకు ఇక్కడే ఉండు. రేపటి ఎక్షాం నీకు చెప్పటానికి ట్రై చేస్తాను అని ఆ పేపర్ తీసుకొని వెళ్ళిపోయాను.

ఇవాళ నేను చేసిన పని ఎవరూ హర్షించరు.నా మనసు నాకే ఎదురుతిరుగుతోంది. డబుల్ యాక్షన్ లాగా నాకు నేనే సమాధానం చెప్పుకోటానికి ప్రయత్నం చేస్తున్నాను. నన్ను నేనే క్షమించుకో లేక పోతున్నాను. రేపటినుంచి ఎవరైనా కాపీ కొడుతుంటే అడ్డుకునే మనస్థైర్యం పోయింది. ఈ అమ్మాయికి నేను చేసిన సహాయం మూలంగా ఎవరికీ అన్యాయం జరుగదు కదా...

ఈ అమ్మాయి జీవితం నిలబడుతుంది కదా...ఎక్కడో తన జీవితాన్ని గడుపుతుంది....అంతే కదా!

నేను తప్పు చేసానా!!! ఈ తప్పుకు నాకు శిక్షేంటి?

అసలు ఇంత పవిత్రమైన ఉద్యోగం చేసే అర్హత ఇంకా ఉందా నాకు?

రేపటినుంచి ఆ అమ్మాయికి నేనేం చేయాలి? మిగతా పరీక్షలు నేనే రాయాలా...వద్దా?

నాకు ఇంకా అనుమానమే!!! ఈ అమ్మాయిని అక్కడ బ్రతకనిస్తారా?

********************************************************************
 

మనస్వి © 2008. Template Design By: SkinCorner