4, ఏప్రిల్ 2010, ఆదివారం

వరుడు...




వరుడు...

నేను ఎంతో ఆశగా ఎదురు చూసిన చిత్రం. మొదట్లోనె చెప్పేస్తున్నానండి. ఊహూ...నాకు నచ్చలేదు....

ఇన్నాళ్ళకు మళ్ళీ మంచి ఓ కుటుంబ కథా చిత్రం తృప్తిగా చూడొచ్చు అన్న ఆశతో వెళ్ళాను. ఎక్కువ రష్ ఉండదు, చల్లటి వాతవరణం లో ఆనందంగా చూడొచ్చు అని మేము INOX(GVK) సినిమా కి వెళ్ళాము.

పబ్ లో యువత కేరింతలతో ఈ సినిమా మొదలౌతుంది. హీరో సందీప్ కి గర్ల్ ఫ్రెండ్స్ కూడా చాలా మందే ఉంటారు. ఇక్కడ పక్కా మోడర్న్ సాంగ్ పాడేస్తాడు కూడా. ఇతని తల్లి తండ్రులు ప్రేమ వివాహం చేసుకుంటారు. ఏ సమస్య లేకుండా ఆనందంగా ఉంటారు. వాళ్ళ కుమార్తె కూడా ప్రేమ వివాహమే చేసుకుంటుంది. అలాగే తమ కుమారుడు కూడా ప్రేమ వివాహమే చేసుకుంటాడనుకొని అతని కి వివాహం చేయాలని, అతని గర్ల్ ఫ్రెండ్స్ ఫొటో లన్నీ చూపించి, నీ కెవరిష్టమో చెప్పు, వారితోటే నీ వివాహం నిర్ణయిస్తాం అని సందీప్ ని అడుగు తారు. కాని వాళ్ళు ఎదురుచూడని సమాధానం ఇస్తాడు సందీప్. తల్లితండ్రులు కుదిర్చిన వివాహమే తనకిష్టమని, తమ పూర్వీకుల లాగా పదహారు రోజుల సంబరాలతో, అయిదు రోజుల పెళ్ళి కావాలి అంటాడు. లవ్ మాజిక్ పెళ్ళిపీటలమీదే అ౦టాడు.

తల్లితండ్రులు ఆ మాట నమ్మలేక పోయినా, క్రమంగా ఆ విషయం గ్రహించి పెళ్ళిళ్ళ పేరయ్య బ్రమ్హానందం తో మాట్లాడి అతను తెచ్చిన ఫొటోలు చూసి అదిరిపోతారు. అంత మోడర్న్ గా ఉంటారు ఆ అమ్మాయిలు. సందీప్ తన తల్లితండ్రులకు వారు ఏ అమ్మాయిని చూసినా తను ఇష్టపడ్తానని, తను ఆ అమ్మాయిని చూడాల్సిన అవసరం కూడా లేదని, పూర్తి బాధ్యత వారిదేనని వారికి నమ్మకంగా చెప్తాడు. చివరికి వాళ్ళు ఒక అమ్మాయిని మెచ్చి పెళ్ళి కుదిరిస్తారు. పెళ్ళికొడుకు ఫొటో కూడా చూడకుండానే పెళ్ళికి ఇష్టపడ్డాడని తెలిసిన ఆ అమ్మాయి కూడా తనూ పెళ్ళికొడుకును పీటల మీదనే చూస్తానంటుంది. అందరు బంధువులను ఆహ్వానించి అయిదు రోజుల వివాహానికి సంబరాలు ప్రారంభిస్తారు.

ఇక్కడ కృష్ణా జిల్లా ప్రస్తావన కూడా ఉంది. అమ్మాయి ఊరిలో కృష్ణా నదీ తీరానా పచ్చటి పొలాలలో, పెద్ద పందిరి వేసి ఆడంబరంగా పెళ్ళి ప్రారంభిస్తారు. ఇదంతా కూడా చూడటానికి చాలా ఆహ్లాదంగా ఉంటుంది. పెళ్ళి సాంప్రదాయాలు కూడా చూపించారు. కన్యాదానం చేయించారు. జీలకర్రాబెల్లం కూడా తలమీద పెట్టించారు. మధ్యలో తెర తీసి ఇద్దరూ ఒకరినొకరు మొదటిసారిగా చూసుకొన్న అనుభూతి కూడా చాలా బాగుంది.

వాళ్ళిద్దరి మధ్యా తొలగించిన తెర ఆ తరువాత నా ఆనందానికి తెర దించుతుందని అప్పుడు నేననుకోలేదు. మైమరచి చూస్తున్న మనసు అదిరిపోయేలా, అంత పెద్ద పెళ్ళి మండపం కూలిపోవటం మొదలైంది. గందరగోళం...అంతా గగ్గోలు...ఒక్కసారిగా కల్లోలం మొదలైపోతుంది. అంతా తేరుకున్న తరువాత తేలిన విషయం, హీరోయిన్ కిడ్నాప్ అయిందని.

ఇదిగో ఇక్కడినుంచే నండి, నేను సినిమా ఇంక ఏమాత్రం భరించ లేక పోయాను. అంత చల్లటి వాతావరణం లో కూడా నా బుర్ర వేడెక్కిపోయి, వేడి వేడి ఆవిరుల సెగల పొగలు మొదలైనై. ఎంతో గొప్పగా ఊహించుకొని ఒచ్చిన సినిమా అరగంటలోనే నాకు నిరాశా నిస్ప్రుహలను మిగులుస్తుందనుకోలేదు.

కిడ్నాప్ అయిన పెళ్ళికూతుర్ని మర్చిపొమ్మని, తాళి ఇ౦కా కట్టలేదు కాబట్టి, ఇ౦కో పెళ్ళిచేసుకొమ్మని అక్కడి వారు సలహా ఇస్తారు. జరిగిన కన్యాదానానికి విలువలేకపోతే స౦ప్రదాయాలకే విలువ పోతు౦దని, తనకి వివాహ౦ జరిగిపోయి౦దని, భార్యని కాపాడట౦ తన ధర్మమని చెప్తాడు. కిడ్నాపర్ దివాకర్ అని తెలుసుకొని అతన్ని వెతుక్కుంటూ వెళ్ళిన హీరో, రోజూ ఆమె బస్ ఎక్కే చోట ఒక చిన్న అమ్మాయి చెప్పిన అనుభవంతో సంతోషిస్తాడు. చిన్న వయసులో చదువుకోకుండా కష్ట పడుతున్న ఆ అమ్మాయిని స్కూల్లో చేర్పిస్తుంది. ఒక గులాబి మొక్క ని ఇస్తుంది. ఆ మొక్కకు పూసిన గులాబిని చూసి సందీప్ సంతోషిస్తాడు.

ఆమె స్నేహితురాలైన ఒక టీచర్ని కలుసుకుంటాడు. ఇది ప్రస్తుతం జరుగుతున్న ఆసిడ్ అటాక్ లకు ఒక ఉదాహరణ. ఆ టీచర్ మీద ఆసిడ్ పోయబొతున్న విలన్ అనుచరుడినుంచి ఆమెని రక్షిస్తాడు. ఆమె దగ్గరినుంచె విలన్ వివరాలు, హీరోయిన్ సమస్య తెలుసుకుంటాడు. అప్పటినుంచి సినిమా చివరి వరకు కావల్సినంత, రకరకాల వయొలెన్స్ చూడొచ్చు. సినిమా ఎంతగా డైవర్ట్ అయిపోయిందో మనకి కూడా బాగానే అర్ధమైపోతుంది.

మామూలు క్రైం మూవీ కి ఏమాత్రం తీసిపోదు. కావాల్సినన్ని మసాలాలు దట్టించారు. ఒక హాలీవుడ్ లెవెల్ కిస్సింగ్ సీన్ కూడా చూపి౦చారు. తెలుగు సినిమాలో ఇటువంటి సీన్ నేను మొదటిసారిగా చూస్తున్నాను. అంతేకాదు ఆడపిల్లకు ఇష్టమైతే ఎంతకైనా తెగిస్తుంది అని హీరోయిన్ తో దర్శకుడు చెప్పించాడుకూడా. ఏమో, ఇది మాత్రం నాకు నచ్చలేదు.

అంతేకాదండోయ్, హీరోయిన్ చేతికి సెలైన్ బాటిల్ పెట్టి, బాటిల్ అడ్డ౦గా పట్టుకొని, కొండల మీంచి, వాగుల్లోంచి, వీర లెవల్ల్లో, ఏ మాత్రం చెదిరిపోకుండా తీసుకొచ్చేస్తాడు.హీరోయిన్ కూడా తరువాత ఆ సూదిని టక్కున చేత్తో చాలా ఈజీ గా తీసేసు కుంటుంది.

ఇంకా ఫైటింగ్ కోరిక తీరక పోతే, చివర్లో ఒక అరగంట సేపు రకరకాల కుస్తీలు, కావాల్సినన్ని గ్రాఫిక్స్, మాయలు మంత్రాలు కూడా చూడొచ్చు. బహుశా, తన సిక్స్ పాకో, జీరో పాకో...ఆ బాడీ ఏదో చూపిద్దామని, వరుడుగా వచ్చినట్లున్నాడు.

నేను మాత్రం దర్శకత్వం, రచన, సంగీతం ఇతర ఏ సాంకేతిక అంశాల గురించి మాట్లాడ దలుచుకో లేదు. ఈ సినిమా లో కావాల్సినంత శిరోభారాన్ని పెంచిన ఈ అంశాల ప్రత్యేకత నాకేం కనిపించలేదు. హేమచంద్ర పాడిన ఒక పాట బాగుంది. రేలారె పాటకూడా బాగానే ఉంది. అ౦త రాకీ సా౦గ్స్ అయితే ఏ౦లేవు.

చక్కటి కుటు౦బకథా చిత్ర౦, పదహారు రోజుల పెళ్ళి స౦బరాలు కళకళ లాడుతూ చూసేద్దామనుకు౦టే మాత్ర౦ పప్పులో కాలేసినట్లే... ఈ సినిమా కి ఇచ్చిన పబ్లిసిటీ ఒకటైతే, మనకు చూపించేది మాత్రం వేరొకటి. హీరోయిన్ ఒక పంజాబీ అమ్మాయి. నాకైతే ఏం బాగా లేదు. ప౦జాబీ అమ్మాయి తెలుగు పెళ్ళికూతురి అల౦కార౦, కట్టిన చీర స౦ప్రదాయబద్ధ౦గా లేవు. అల్లు అర్జున్ కూడా బాగాలేడు. ఒత్తి ఒత్తి పలికిన ఆ డైలాగ్స్ కూడా ఏం బాగా లేవు. సినిమా మొత్తం మీద నాకు ఎంతో నచ్చిన వారు ఒకరు ఉన్నారు. అదేనండి, నా ఫేవొరెట్ హీరోయిన్ సుహాసిని. ఇందులో హీరో తల్లి ఈమెనే. ఎంత బాగుందో చెప్పలేను.

ఈ సినిమాకి వరుడు అన్న పేరు కాకు౦డా..'కూష్మాండా' అన్నపేరు పెడితే బాగుండేది. ఎందుకంటే...అది చూసిన వాళ్ళకే అర్ధం అవుతుంది లెండి:) ఇప్పటి వరకు ఈ సినిమా చూడని వారెవరైనా ఉంటే చూడాలన్న ఆ ఉత్సాహాన్ని తగ్గి౦చుకుంటే మీకే మంచిదనుకుంట. బతికుంటే బలిసాకు తిని బతకొచ్చు. కనీస౦ రాబోయె ప్రప౦చ ఆరోగ్యదిన౦ వరకైనా హెల్దీగా ఉ౦డొచ్చు. చూసేసిన వాళ్ళున్నారనుకొండి...నా లాగే తొ౦దరపడి... ఇది వాళ్ళ ఖర్మ. మంచి థియేటర్ ఎంచుకొని మరీ పోతారేమొ నాలాగా...ఒద్దండి బాబూ.. ప్లీజ్...

మొత్తానికి ఆహ్లాదం తక్కువ...భీభత్సం ఎక్కువ:)

*************************************************************************

15 కామెంట్‌లు:

కంది శంకరయ్య చెప్పారు...

Dhanyavaadaalu.

శేఖర్ పెద్దగోపు చెప్పారు...

:-)
మొత్తానికి ఆహ్లాదంగా గడుపుదామనుకున్న వారాంతం ఇలా శిరోభారంతో గడిచిందన్నమాట మీకు...అల్లు అర్జున్ ఇలాంటి కాన్సెప్ట్ ఎంటబ్బా ఎంచుకున్నాడు...ఇమేజ్ గిమేజ్ గట్రా పట్టించుకోకూడదని డిసైడ్ అయ్యాడేమో..పోనీలే మంచి పరిణామం అని అనుకున్నాన్నేను...ఊహు..ఇమేజ్ ఎక్కడా డేమేజ్ అవ్వకుండా ఈ కాన్సెప్ట్ ని తీసుకున్నారన్నమాట... మన హీరోలకి అంత గట్స్ రావాలంటే కష్టమేమో!!

SRRao చెప్పారు...

జయ గారూ !
' వరుడు ' గండంనుంచి మమ్మల్ని రక్షించినందుకు శతకోటి వందనాలు.

Padmarpita చెప్పారు...

చూసారా...ఎంతో ఆశగా ఎదురుచూసి ఎక్స్పెక్ట్ చేసారు బాగుంటుందని...ప్చ్! ప్చ్

నేస్తం చెప్పారు...

హ్మ్మ్ జయ గారు ఏంటీ ఇలా చప్పగా తీసిపాడేసారు..నేను బోలెడు బోలెడు ఆశలు పెట్టేసుకున్నానే ..:( కాక పోతే నా మొహానికి ఎంత మంచి సినిమా అయినా థియేటర్ లో చూసే భాగ్యం లేదు.. డబ్బులు వేస్ట్ అవ్వవు లెండి

ఆ.సౌమ్య చెప్పారు...

ముందే చెప్పి పుణ్యం కట్టుకున్నారు
లేకపోతే మాకు కూడా కూష్మాండం బద్దలయిపోయేది :)

శిశిర చెప్పారు...

మీరింత చెప్పాక కూడా ధైర్యం చేస్తామా!!! రక్షించారు. :)

భావన చెప్పారు...

హి హి హి నేను తెలివి గా ముందే డిసైడ్ అయ్యా మా వూర్లో పైరేటడ్ డీవీడి వచ్చాక ఎవరైనా కొంటే వాళ్ళ దగ్గర ఒక రోజు తీసుకుని చూసి ఇచ్చేద్దాము అంతకు మించి సీను లేదు అని మా వూర్లో ధియేటర్ లో వేస్తే ఒక 30 మంది వచ్చారట ఒక షో కు. ఇక్కడ రైట్స్ కొనుక్కున్నాళ్ళు ఐపోయారే. పాపం జయ.

మురళి చెప్పారు...

సినిమా చూసిన మిత్రులంతా కొంచం ఇంచుమించు ఇవే మాటలు చెప్పారండీ.. కథంతా దాదాపుగా రాసేశారంటేనే మీరెంత ఆవేశంగా ఈ టపా రాశారో అర్ధమవుతోంది..

జయ చెప్పారు...

కంది శంకరయ్యగారు ధన్యవాదాలు.

శేఖర్ గారు, తన ఇమేజ్ కి తగ్గట్లే ఉన్నాడులెండి. ఎక్కువ కష్టపడకుండా గ్రాఫిక్ ఫైటింగ్స్ పాపం బాగానే చేసాడు.

రావ్ గారు, గండం నుంచి బయట పడ్డారుగా అంతే చాలు:)

జయ చెప్పారు...

పద్మర్పిత గారు అవునండి. చాలా ఆశాభంగం.

నేస్తం గారు దురాశకు పోతే డబ్బులలాగే పోతాయి. డబ్బులు పోతే పోయాయిలెండి. నేను మామూలు మనిషినెప్పుడవుతానా అని చాలా భయపడ్డాను.


సౌమ్య గారు ధన్యవాదాలు. హి...హి..హి...

జయ చెప్పారు...

శిశిర గారు థాంక్స్. ఇంతకీ మీ బ్లాగ్ తాళం ఎప్పుడు తీస్తున్నారు?

హాయ్ భావనా, నేను కూడా హి...హి...హి...
ఇలాంటి సినిమాలు పైరేటెడే చేయాలి.


అయ్యో! మురళి గారు, అసలు మొత్తం చెప్పేయటానికి అక్కడ ఉన్న కథేంటండి బాబూ! మీరు చూడాల్సినవి ఇంకా చాలా ఉన్నాయి. నాకు కొంచెం ఆవేశం ఎక్కువే లెండి ఒప్పుకుంటాను. కాకపోతే, దాదాపు నెల రోజులుగా బ్లాగ్ ముట్టుకోని నా "బద్ధకం" దెబ్బకి ఒదిలించింది.

శిశిర చెప్పారు...

త్వరలోనే నా బ్లాగుని మళ్ళీ చూస్తారు జయగారు. ధన్యవాదాలు.

అజ్ఞాత చెప్పారు...

సినిమా చూడొద్దన్నారు సరే ... మొత్తం సినిమాని చెప్పేసారు గా ... :P

జయ చెప్పారు...

అయ్యో! మీరు చూడాల్సింది సినిమాలో ఇంకా చాలా మిగిలే ఉందండి:)

 

మనస్వి © 2008. Template Design By: SkinCorner