3, మే 2010, సోమవారం

నల్లమల లో... చెంచులతో...!!!



చెంచులతో రెండు రోజులు నల్లమలలో గడిపాము. అదొక వింతైన, గమ్మత్తైన అనుభూతి. ఆధునిక జీవితానికి పదడుగుల దూరంలో చాలా క్రొత్త ప్రపంచంలో అతికొత్త లోకానుభవం. నల్లమలలోని కొన్ని చెంచు గూడాలను చూడాలనిపించి బయలుదేరాము. వారి జీవనసరళి, ఇతర పద్ధతులూ తెలుసుకోవాలనిపించి...చెట్టులెక్కగలవా, ఒ నరహరి పుట్టలెక్క గలవా, చెట్టులెక్కి ఆ చిటారుకొమ్మన చిగురుకోయగలవా...ఓ చెంచిత....అనుకుంటూ ఝాం అని బయలుదేరాం...!!!

నల్లమల అడువుల్లో చాలా చిన్న చెంచు గూడెం ఒకటుంది. ఆధునిక నాగరికతకు దూరంగా బ్రతుకుతున్నారు. అందుకని, వారికి నాగరికత లేదనటానికి వీల్లేదు. వాళ్ళకు గోత్రాలు, సాంప్రదాయ బద్ధవివాహాలు ఉన్నాయి. చిన్న వయసులోనే పెళ్ళిళ్ళు జరుగుతాయి. అమ్మాయి కాని అబ్బాయి కాని వెళ్ళి గూడెం లో తమకు నచ్చిన వారిని ఎన్నుకొని ఊరిపెద్దైన పూజారి అనుమతితో వివాహం చేసుకోవచ్చు. అతడే గూడెం లోని వారినందరిని ఆహ్వానించి స్వయంగా వివాహం జరిపిస్తాడు. వీళ్ళల్లో బహుభార్యాత్వం ఉంది. అంతే కాదు బహు భతృత్వం కూడా ఉంది. అమ్మాయి కూడా తనకిష్టమైతే ఎన్ని వివాహాలైనా చేసుకోవచ్చు. ఈ మధ్యనే అమ్మాయి పలువివాహాల్ని మాత్రం వీరు వ్యతిరేకిస్తున్నారుట. అబ్బాయిలు మాత్రం బహుభార్యాత్వం కొనసాగిస్తునే ఉన్నారు. అంటే కొంత మన నాగరికత నేర్చుకున్నట్లే. తల్లిదండ్రుల పేర్లే మళ్ళీ పిల్లలకు కూడా కొనసాగిస్తారు. ఊరిమొత్తం మీద ఒక పదిపేర్లు మాత్రమే ఉన్నాయి. అందరి ఇళ్ళల్లోనూ అవే పేర్లు.

ఈ మధ్య ప్రభుత్వం వీరికి గృహాలు నిర్మించి ఇవ్వటానికి ప్రయత్నం చేసింది. కాని వీరు ససేమిరా వద్దనేసారు. కారణం ఏమిటో తెలుసా! నాలుగువైపులా గోడలున్న ఇళ్ళంటే వీరికి భయమంట. అంతేకాదు సమాంతరంగా ఉండే పై కప్పు కూడా వీరు ఇష్టపడరు. మూలల్లో దయ్యాలుంటాయని వీరి నమ్మకం. ఎత్తుతక్కువగా ఉండే పైకప్పు వీరిమీద పడిపోతుందని భయమట. అందుకే గుండ్రంగ ఉండే గుడిసెలు, బరువులేని చొప్పలతో త్రిభుజాకారంలో ఎత్తైన పైకప్పుతో తయారు చేసుకుంటారు. అంతేకాదు, ఇప్పటికి కూడా వీరు ఎప్పుడూ వలస పోతూనే ఉంటారు.గూడెంలో ఎవరైనా చనిపోతే, వెంటనే వేరొక చొటికి గూడెం జనమంతా కూడా వెళ్ళిపోతారు. కేవలం పది గుడిసెలే ఉన్న గూడాలు కూడా ఉండొచ్చు.

మమ్మల్ని సాదరంగా ఆహ్వానించారు. వారితోటి ఉండమని బతిమిలాడారు. ఎంత మర్యాదస్తులో.చక్కటి తెలుగే మాట్లాడ్తారు.చాలా ప్రేమ, అభిమానం చూపిస్తారు. మన జీవిత విధానం వేరని వారికి బాగా తెలుసు. అందుకేనేమో, వీలైనంత సౌకర్యంగా ఉంచటానికి ప్రయత్నించారు. ఇప్పటికీ వంట అన్నది వాళ్ళకు లేనే లేదు. కేవలం కట్టెలపొయ్యిమీద అన్నం మాత్రం వండుకుంటారు. తినటానికి వెరే పాత్రలేవీ వాడరు. బండల మీద అన్నం కుమ్మరించుకొని, ఖారం మాత్రమే అందులో కలుపుకొని తింటారు. మాకోసమని అడవిలోని పెద్ద పెద్ద ఆకులు కోసుకొని వచ్చి అందులో మాకు భోజనం పెట్టారు . అవి కడగనేలేదు. మీరు కూరలు తింటారు, మాకు తెలుసు అని, రకరకాల ఆకులు కోసుకొచ్చి కూరవండి మాకు పెట్టారు. ముందు తినాలనిపించలేదుగాని, తిన్నాకొద్దీ ఎంతో రుచిగా అనిపించింది. ఆకు దొన్నెల్లో తేనె ఇచ్చారు. నాకైతే భక్త కన్నప్ప గుర్తుకొచ్చాడు. అన్నట్లు వీళ్ళకోసం ప్రభుత్వం కట్టించిన స్కూల్ పేరు 'భక్త కన్నప్ప గురుకులం’

ఇష్టకామేష్టి అమ్మవారి దేవాలయం కూడా ఉంది. చాలా చిన్నది. కొంచెం అండర్ గ్రౌండ్ లోకి కూడా ఉంటుంది. లోపలికి ఒంగి వెళ్ళాలి. ఈ గుడికి ఎక్కడెక్కడి చెంచులో వస్తారట. చాలా ప్రసిద్ధి అని చెప్పారు.పూర్తిగా హిందూ మతాన్నే నమ్ముతారు. చాలా మంది క్రైస్తవ మత వ్యాప్తి కోసం ఇక్కడ ప్రయత్నించినా వాళ్ళని హింసించి మరీ వెళ్ళగొట్టారుట. మేమెందుకు క్రైస్తవులుగా మారాలి అని అడుగుతారు.

మాకు అడివి చూపిస్తానని ఒక ముప్పై ఏళ్ళాయన మాతో వచ్చాడు. వన్నెచిన్నెల రంగులీనె ఏనాడూ చూడని పూలు, తీగలు, చెట్ల ఊడలు చూస్తున్నాకొద్దీ అదొక కొత్తబంగారు లోకమనిపించింది. ఆ చిక్కటి అడవిలో నడుస్తుంటే ఏ మూలనుంచి ఏ జంతువులొస్తాయో అని భయమేసింది. మేమంతా ఇక్కడున్నాం కదండి, అందుకే ఏ జంతువులు రావు అన్నాడాయన. ఒక్కసారిగా అక్కడున్న ఒక చెట్టు ఆకులు తీసి చివర్ల నుంచి పీల్చటం మొదలు పెట్టాడు. అదేంటి అంటే దాహమేస్తుంది నీళ్ళు తాగుతున్నా అన్నాడు. అంతే మరి, వాళ్ళు నీళ్ళు పట్టి ఇంట్లో పెట్టుకోటమన్నదే లేదు. ఇంతలో ఆకలేస్తుంది అని ఓ పక్కకి పోయి అయిదునిముషాల్లో వచ్చాడు. అతడి చేతిలో చచ్చిపోయిన జంతువొకటి వేలాడుతోంది. ఏ పులులో వాటిని చంపి, నీరు తాగటానికి వెళ్ళినప్పుడు వీళ్ళు వాటిని ఎత్తుకొస్తారట. ఆ పచ్చి మాంసం అలాగే తినటం మొదలు పెట్టాడు. నాకైతే కడుపులో తిప్పటం మొదలుపెట్టింది. ఇప్పటికీ ఈ విధంగా జీవించేవాళ్ళు ఉన్నారని ఎవరైనా చెప్పిఉంటే నమ్మేదాన్ని కాదు. కానీ నా కళ్ళతోటే చూస్తున్నాను కదా!

నా దగ్గిరున్న ఒక కాడ్బరీ చాక్లెట్ ఇచ్చి తినమన్నాను. మొత్తం బాగానే తిని, ఛీ..మేమైతే ఇట్ల చుంచెలుకలు తియ్యగ తినం, అన్నాడు. అంటే నేనిచ్చిన కాడ్బరీ, ఎలుక అనుకున్నాడు. ఖర్మ...నేను చివరికి ఎలుకలు తినేదానిలాగ కనిపించానా! హతోస్మి...గమ్మత్తేంటంటే, మేము వొచ్చేసేటప్పుడు నాదగ్గిరున్న కాడ్భరీ పాకెట్ మొత్తం అడిగి మరీ తీసుకున్నాడు.

చెట్ల ఊడలు పట్టుకోని చాలా స్పీడ్ గా ముందుకెళ్ళిపోతున్నాడు. మన వెహికల్స్ తో పోటీ పెట్టొచ్చనిపించింది. నేనూ ప్రయత్నించాను అలా పోవటానికి. కాని తరువాత ఏం జరిగిందో చెప్పకపోవటమే మంచిది. నాకు మంచిగా నేర్పిస్తానని మాటిచ్చాడు లెండి:)

అక్కడి ఫారెస్ట్ ఆఫీసర్ చెప్పిన ఒక సంఘటన తెలుసుకుంటే వీళ్ళెంత అమాయకులో కూడా అర్ధమౌతుంది. ఒకసారి ఒకాయనకి కలలో తన స్నేహితుడు తన భార్యని తీసుకెళ్ళిపోతున్నట్లుగ కలవచ్చిందిట. అంతే, మర్నాడే అతన్ని బాణం వేసి చంపేసాడట. పోలీసులు ఎందుకలా చంపావు, నీకు ఋజువేంటి అనడిగితే నాకు కల వచ్చిందిగా అన్నాడుట. చివరికి వీళ్ళ వ్యవసాయం కూడా వాళ్ళ అమాయకత్వాన్నే చూపిస్తుంది. వరి పంటలు పండిస్తారు. కొంచెం భూమిలో అయిదువేల రూపాయల ఖర్చుతో పంట పండిస్తే వారికి వచ్చేది మూడు మూటల ధాన్యం మాత్రమే. మూడు మూటల్లో ధాన్యం ఉందని సంబరపడిపోతారే కాని తాము ఖర్చు పెట్టిన అయిదువేలకు వచ్చింది పదిహేను వందలే అన్న ధ్యాస మాత్రం వాళ్ళకుండదు. ఇప్పటికీ వీళ్ళు బార్టర్ సిస్టమే అనుసరిస్తున్నారు.

ఈ అడవి మొత్తం మీద కొన్ని వేల మంది చెంచులున్నారు. వాళ్ళకి విద్యాబుద్దులు నేర్పాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. వీరందరిలో పదిమంది గ్రాడ్యుయేట్లున్నారుట. వీళ్ళు మాత్రం ఎంతో ఆధునికంగా బయటిప్రపంచంలో జీవిస్తున్నారు. వీళ్ళని చెంచులంటే నమ్మలేము. వీళ్ళ తల్లితండ్రులు మాత్రం ఇంకా అలానే ఉన్నారు. దగ్గరి గ్రామాల్లో వీళ్ళకి హాస్టల్స్, ఉచితవిద్యా సౌకర్యాలు కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఒక యాభైమంది చెంచు విద్యార్ధులు మాత్రమే విద్యనభ్యసించటానికి ముందుకు వచ్చారు.

అన్నట్లు వీళ్ళల్లోనే పచ్చగడ్డి లింగన్న అనే ఒకబ్బాయికి ఆర్చరీలో నేషనల్ అవార్డ్ కూడా వచ్చింది. అక్కడున్న వెదురుచెట్లనుంచి విల్లు, బాణాలు తయారు చేసాడు. బాణాలకి చివర రాతిని అరగ దీసి కట్టాడు. అంతేకాకుండా బాణం చివర నెమలి ఈకలు కట్టాడు. అటువంటి బాణం చాలా దూరం పోతుందిట.గూడెం లోని వాళ్ళందరూ ఇలాటి బాణాలుపయోగించే వేటాడుతారు. ఈ బాణంతోటే అతడు అవార్డ్ గెల్చుకున్నది. ఢిల్లీ లో అధికారులు ఇతని దగ్గరున్న బాణాలు తీసుకొని అక్కడ మ్యూజియం లో పెట్టారుట. ఇతడుకూడా ఉచిత విద్యనభ్యసించినవాడే. నేనుకూడా ఆ బాణం తీసుకొని ప్రయత్నించాను. వెంటనే మా ఫ్రెండ్ అది నీకు సరిపోదులే, "నువ్వేనా...నువ్వులాఉన్న ఎవరోనా..." అని పాడటం మొదలుపెట్టింది. నాకు రోషం, ఆవేశం వచ్చేసాయి. కాని ఏంలాభం, నేను వేసినబాణం పదడుగుల దూరానికి కూడా పోలేదు. కొంచెం నువ్వేసి చూపించవా అంటే వేసాడు. ఆ బాణం పోయినదూరం కొలవటం చాలా కష్టం. అతను దాన్ని తిరిగి తీసుకురాటానికి పదినిముషాల పైనే పట్టింది. ఆ బాణం వేస్తే మనుషులు రెండుగా చీలిపొతారని చెప్పాడు.అది వినగానే నా చేతిలోని విల్లు, బాణం జారి పడిపోయాయి.

వీళ్ళల్లోను రాజకీయాలున్నాయి. కాని అవి వాళ్ళకే పరిమితం. ఇప్పసారా అలవాటు చాలా ఉంది. బాగా తాగుతారు, వాళ్ళల్లో వాళ్ళే కొట్టుకుంటారు. ఎందుకలా అంటే. అదంతే అంటారు.

ప్రస్తుతం ఎంతో అభివృద్ధి చెందుతున్న ఇకో టూరిజం ద్వారా ఇక్కడి ప్రజల సహకారం తో వారిని ఆర్ధికంగా, సామాజికంగా ఉన్నత స్థాయికి తీసుకెళ్ళచ్చనిపిస్తోంది. ప్రభుత్వానికి, ఇక్కడిప్రజలకి ఆదాయం పెరిగే అవకాశం కూడా చాలాఉంది. జూలాజికల్ పార్క్స్, జియొలజి, ఆర్చరీ, ట్రెక్కింగ్, బోటింగ్, స్విమ్మింగ్, మెడిసినల్ ప్లాంట్స్, తెనె పరిశ్రమల వంటి అనేక ఇతర వృత్తివిద్యలకు వీళ్ళేకదా అధినాయకులు. ప్రభుత్వం వీరితోటే ఇవన్నీ నిర్వహించవచ్చు.

కొంతమంది వీరిని ఆధునిక ప్రపంచంలోకి తీసుకు రావటానికి ఇష్ట పడటం లేదట. కారణమేమిటి అంటే,అది ఈ గిరిజన సంస్కృతిని మరుగున పడేస్తుంది, మన ప్రాచీన సంస్కృతిని కాపాడాలి, అన్నది వీరి వాదన. అలా అంటే ఎలా? అందరం ఈ పరిణామ దశ నుంచి వచ్చిన వారమే కదా!!! అభివృద్ధి లేక పోయినట్లైతే, ఇప్పటికీ అందరం ఆది మానవులమేగా!!! అవే ఆకులు అలములు తినాల్సి వచ్చేది కదా...!!!




*************************************************************************

13 కామెంట్‌లు:

శిశిర చెప్పారు...

చాలా విలువైన విషయాలు చెప్పారు జయగారు. ధన్యవాదాలు.

durgeswara చెప్పారు...

chaalaa samtosham mamchi postchadivaamu

durgeswara చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
కొత్త పాళీ చెప్పారు...

జయగారు, పొద్దున్నే ఎక్కడెక్కడి జ్ఞాపకాల్నీ తట్టి లేపి చాలా బాధపెట్టేశారు!!! Too much.
నా కథల పుస్తకం తెలుసుగా, రంగుటద్దాల కిటికీ - అందులో చివ్వరి కథ "ఖాండవ వనం" చదవండి. చదివాక మాట్లాడుకుందాం.

శేఖర్ పెద్దగోపు చెప్పారు...

వెరీ వెరీ ఇంటరెస్టింగ్.....
మాతో ఇంత చక్కని విషయాలు, ఎంతో చక్కగా, కళ్ళకు కట్టినట్టు వివరించిన మీకు బోల్డన్ని థాంకులండీ..
అసలు మీరు ఎదురుగా ఉంటే మిమ్మల్ని చెంచుల గురించి ప్రశ్నల మీద ప్రశ్నలు వెయ్యాలని ఉంది...

నేస్తం చెప్పారు...

నాది శేఖర్ మాటే

swapna@kalalaprapancham చెప్పారు...

chala chala baga rasaru. chala interesting ga undi. ippatiki ila unnara ante nammalekapotunna. naku kuda velli chudalanipistondi :)

Hima bindu చెప్పారు...

మొన్నేమో వెదురుపూలు ...ఇప్పుడేమో అద్బుతమైన అడవుల్లో ....మీ పనే బాగుందండీ( .జలసీ ) :-(

తృష్ణ చెప్పారు...

ఎంతబాగా రాసారండీ...చాలా విలువైన విషయాలు చెప్పారు.నాకు ఈ టపా చాలా నచ్చేసింది..!!

జయ చెప్పారు...

శిశిరా థాంక్యూ.


దుర్గేశ్వర గారు ధన్యవాదాలు.

జయ చెప్పారు...

కొత్తపాళి గారు, మీ కథ అప్పుడే చదివేశాను.

ప్రభుత్వం ఎన్ని సౌకర్యాలు సమకూరుస్తున్నా వారి సహకారం కూడా ఉండాలి. ఇప్పటికీ వారు ఆముదం దీపాలే వాడుతున్నారు. చదువుకొని బయటకొచ్చిన వారిపిల్లలు పెద్దలకి నచ్చచెప్పి పరిస్థితిలో మార్పు తేవటానికి కొంచమైనా ప్రయత్నిస్తే బాగుండేది. వాళ్ళు ఇంకా కూపస్థమండూకాల్లాగా, వారి ఆచారాలు, నమ్మకాలు వదలటం లేదు. కనీసం వారి పిల్లలను చదువుకోటానికి కూడా పంపటం లేదు. నేను చూసిన గురుకులం దాదాపు ఖాళీనే. వారిమీద ప్రభుత్వం పెడుతున్న ఖర్చుకు కొంతైనా ఫలితం కనిపించటంలేదు. వాళ్ళల్లో మార్పు వొస్తే తప్ప అభివృద్ధికి అవకాశం లేదు.

వారి అన్ని రకాల విద్యలు బయటి లోకానికి కూడా తెలిస్తే బాగుంటుందని నా అభిప్రాయం. ఈ నాటికీ మనకి తెలియని ఎన్నో విద్యలు వారి దగ్గర ఉన్నాయి. కొన్ని విషయాలను తెలుపటానికి వాళ్ళే ఇష్టపడటం లేదు. ప్రభుత్వ అధికారులు వచ్చినా సహకరించటం లేదు.

అలాగే వారు కూడా తెలుసుకోవాల్సిన అంశాలు ఎన్నో ఉన్నాయి. పరస్పర సహకారం తప్పదు.

ఈ అడవులు నాకు మాత్రం కొత్త విజ్ఞానాన్నే అందించాయి కొత్తపాళిగారు. మీకు ధన్యవాదాలు.

జయ చెప్పారు...

శేఖర్ గారు, నేస్తం గారు మీకు స్పెషల్ థాంక్స్.

ఏవిటబ్బా నన్నడిగే అన్ని ప్రశ్నలు. అడగండడగండీ. అడిగేవాడికి చెప్పేవాడు లోకువేగా. ఫరువాలేదు. రోజంతా మాట్లాడి అవతల వాళ్ళను పారిపోయేటట్లు చేయటం నాకలవాటే. మీ ఎదురుగ్గా నేను లేకపోవటం మీకే మంచిది. అయినా మన బ్లాగులున్నది అందుకే కదా:)

జయ చెప్పారు...

స్వప్న గారు థాంక్స్. మీరు కూడా ఒక సారి వెళ్ళి చూడాల్సిందే. వాళ్ళ జీవితాల గురించి మీరు రాస్తే చదవాలని ఉంది.

చిన్నిగారు, మీకు జెలసీ ఏంటండి, మరీను. మిమ్మల్ని చూసి నేనే జెలసాలి. ఎంచక్కా ఎన్నో ఊళ్లు తిరుగుతు రకరకాల అనుభవాలతో, ఎన్నో 'రుచులతో'....వావ్

తృష్ణ గారు థాంక్యు. ఇప్పుడు మాత్రం, ఇంకొంత కాలం చెంచులను చూడకండేం:) అయినా పాతకాలం లాంటి చెంచుల లాగా అంటే ఆఫ్రికన్స్ లాగా అన్నమాట, వారు లేరులెండి.

 

మనస్వి © 2008. Template Design By: SkinCorner