27, జులై 2010, మంగళవారం

పరంజ్యోతి






మల్లాది వెంకట కృష్ణమూర్తి గారి కలం నుంచి వెలువడ్డ ఆధ్యాత్మిక నవల ఈ పరంజ్యోతి.

అనేక ఆధ్యాత్మిక అంశాలతో, కమర్షియల్ నవల లోని ముఖ్యమైన ఎలిమెంట్ అయిన ఉత్కంఠని జత చేసి రాసిన ఈ ఆధ్యత్మిక నవల పరంజ్యోతి లోని చిత్రమైన కథ అన్ని తరహా పాఠకులని సమానంగా అలరిస్తుంది.

మరణించిన మనిషి తిరిగి బ్రతుకుతాడా? అన్నది ఇందులోని ముఖ్యమైన అంశం.

చితిదాకా చేరిన మనిషి మళ్ళీ లేచికూచుంటాడా? అలాంటి మనిషికి సంబంధించిందే ఈ కథ.

ఇది ఓ సంస్థానం రాజకుమారుడు విజయ రామరాజు అనే చిన్న రాజావారి కథ. ఇదే ఒక సన్యాసి పరంజ్యోతి కథ కూడా. ఇది ఒక ఆధ్యాత్మిక జీవనానికి చెందిన కథ.

నెమలికొండ సంస్థానపు అధిపతి భూపతిరాజు నలుగురి సంతానంలో చివరి వాడుగా అతి గారాబంగా పెరిగి అన్నదమ్ములలో వైషమ్యాలకి కారకుడవుతాడు విజయ రామరాజు. అన్ని దురలవాట్లకు లోనవుతాడు. అతని భార్య అహల్య కూడా అతన్ని భరించలేని పరిస్థితి ఏర్పడుతుంది. తన సోదరుడు ప్రతాపవర్మ కి తన గోడు వెళ్ళబోసుకుంటుంది. అనేక జబ్బులతో ముదిరిపోయిన రామరాజుని ఇతడు కూడా ద్వేషిస్తూనే ఉంటాడు.
రామరాజు సోదరులు, ఇతర ఉద్యోగులు కూడా అతన్ని తట్టుకోలేకపోతారు.
తీవ్రమైన జబ్బులతో మంచానపడ్డ అతన్ని ఇంగ్లీష్ వైద్యం కూడా ఏమీ చేయలేదని తేల్చేస్తారు వైద్యులు. అటువంటి సమయంలో అతని మీద విషప్రయోగం జరిగి రామరాజు మరణిస్తాడు. అది విషప్రయోగమనీ తెలియదు, ఎవరు చేసారోకూడా తెలియదు. రామరాజు దహన సంస్కారాలు కూడా జరిగిపోతాయి.

ఇది తనకి విషం ఇచ్చి చంపాలని ప్రయత్నించిన వారి మీద ధ్వేషం పెంచుకున్న ఓ వ్యక్తి కథ.

"మరణం అంటే నాకు భయంలేదు. ఎందుకంటే నేను జీవించి ఉన్నంతకాలం మరణం నా సమీపంలోకి రాలేదు. అది వచ్చినప్పుడు నేనుండను. ఇంక చావంటే నాకు భయం దేనికి?" ఓ సందర్భంలో రామరాజు తనతండ్రితో అన్న మాటలివి. కాని మరణం తరువాత కూడా తాను ఉంటాడని, ఆ మాటలు అన్నప్పుడు రామరాజుకి తెలియదు. ఇది సాధ్యమా?

ఆ తరువాత ఎన్నో సంవత్సరాలకి ఓ వ్యక్తి నర్మదా పరిక్రమ లో సన్యాసి పరంజ్యోతి ని చూసి అతను పూర్తిగా రామరాజు పోలికలతో ఉండటంతో ఆశ్చర్యపడి, రామరాజు సోదరి కుముదినీదేవికి తెలియజేస్తాడు. ఆమె ఈ విషయాన్ని తన ఇతర సోదరులకు తెలియజేస్తుంది. వారు ఇతర అధికారులతో చర్చలు జరిపి, చనిపోయి దహనంచేసిన వ్యక్తి తిరిగిరావడం ఎలా జరుగుతుంది, ఇదేదో పొరపాటు అని భావిస్తారు. కాని క్రమంగా అదే సమాచారం చాలామందే పంపటంతో అతనిని వెతికి, వివరాలు తెలుసుకోటానికి ప్రయత్నిస్తారు.

ఇక్కడినుంచి, జరిగిన రకరకాల ప్రయత్నాలే కథని అనేక మలుపులు తిప్పి మనల్ని ఏకబిగిన చదివిస్తుంది.

ఎన్నోఆధ్యాత్మిక చర్చలు ఈ నవల నిండా ఉన్నాయి. అయినప్పటికీ అది ఇంకా చదవాలి అన్న కోరికని పెంచుతుందే కాని ఎటువంటి నిరాసక్తతను కలిగించదు. కొన్ని చక్కటి ఆధ్యాత్మిక గీతాలు కూడా మనకి ఈ గ్రంధంలో కనిపిస్తాయి. తేలికైన పదాలతో కూర్చిన ఈ పాటలు పాడుకోవాలనిపిస్తుంది. ఈ పాటలొచ్చినప్పుడు మనకే తెలియకుండా మనసులో పాడుకుంటాంకూడా.

తమ అనుమానాలు తీర్చుకోటానికి న్యాయస్థానం లో జరిగే అనేక వాదోపవాదాలు కూడా మనకి ఎన్నో కొత్త విషయాలను ఎంతో విపులంగా తెలియ జేస్తాయి. అనేక ఉదాహరణలు కూడా రచయిత మనకి చూపిస్తారు.

నర్మద, గోదావరి నదీ తీరాల్లో జరిగే ఈ కథ ఆధ్యాత్మిక పాఠకులని, సాధారణ పాఠకులని సమానంగా ఆకర్షిస్తుంది.

ఈ నవలకి ప్రేరణ చాలా సంవత్సరాల క్రితం బెంగాల్ లో జరిగిన ఒక నిజ సంఘటనే. ఇది భారతదేశంలో దీర్ఘకాలం కొనసాగి సంచలనాత్మక తీర్పు నిచ్చిన కేసుగా చాలా ప్రసిద్ధి చెందింది. దీని మీద ఆధారపడి ఎన్నో భాషల్లో సినిమాలు కూడా వచ్చాయి.


మే 2010 లో ముద్రించిన ఈ గ్రంధం వెల రూ 100/-. నవోదయా బుక్ హౌజ్, సుల్తాన్ బజార్, హైద్రాబాద్ లో లభిస్తాయి.


*****************************************************************************

17, జులై 2010, శనివారం

గాజులు-శఠగోపం!!!




నాకో అలవాటు ఉంది. ఏంలేదు, సాయంత్రం ఇంటికి రాగానే, చేతిగాజులు, మెడలోవి(మంగళసూత్రం తప్ప), చేతిలోవి, చెవివి ఆభరణాలు అన్నీ తీసిపెట్టేస్తానన్నమాట. మళ్ళీ మర్నాడు బయటికి వెళ్ళేప్పుడే అవి తిరిగి నా ఒంటిమీదకి చేరుతాయి. ఈ లోపల ఎటైనా బయటికి వెళ్ళినా హాయిగా అలాగే వెళ్ళిపోతాను. అవన్నీ తీసేసినాక నాకెంతో ఫ్రీ గా ఉంటుందిమరి.

రోజూ సాయంత్రం పార్క్ కెళ్ళి కాసేపు వాకింగ్ చేసి అక్కడి ఫ్రెండ్స్ తో కాసేపు హస్క్ వేసుకునే అలవాటు కూడా నాకుంది. పార్క్ కెళ్ళి ఓ నాలుగైదు రౌండ్స్ నడిచాక, నాకోసం చూస్తున్న నా ఫ్రెండ్ దగ్గరికెళ్ళి కూచున్నాను. రోజూ ఈ రోడ్డు దాటి వచ్చేటప్పటికి నా తలప్రాణం తోక కొస్తోంది తల్లీ, ఈ సర్కస్ ఇంక నేను చేయలేను... మా ఇంటి చుట్టే రౌండ్స్ కొట్టుకుంటానమ్మ, ఇంక నేను పార్క్ కి రాను గాక రాను అని అన్నాను మా ఫ్రెండ్ తో. తను నాగోడు ఏమాత్రం వినిపించుకోకుండా, నీ ధైర్యసాహసాలు తెలియందెవరికి గాని గుడికిపోదాం కొంచెం తోడురా అంది. మొత్తం మనిషినైతే రాగలనమ్మ, కొంచెం మనిషినెలా వస్తాను...అయినా ఈ రాత్రిపూట ఇప్పుడు గుడికెందుకు అనడిగాను. అబ్బా, యక్షిణి ప్రశ్నలేయకుండా ఏ పని చేయవు కదా నువ్వు. మాట్లాడకుండా రా అంది. యక్షిణి ప్రశ్నలు అన్నది యక్షప్రశ్నలకు స్త్రీలింగం కాదనుకుంటా, అని నా అనుమానం వ్యక్తం చేశాను. ఇంక కామెంట్స్ మాని ఉరిమి చూడ్డం మొదలుపెట్టింది. బాబోయ్, నీ ఉరుములు మెరుపులతో మళ్ళీ వర్షం వచ్చేట్లుంది, పద తొందరగా పోయొచ్చేద్దాం. ఇప్పటికే చాలా చీకటి పడింది, అని బయిలు దేరాను. అబ్బో నిన్నెవ్వరెత్తుకెళ్ళరులే ఈ చీకట్లొ అని తనూ నడక మొదలుపెట్టింది. అక్కడే దగ్గిర్లో ఉన్న ఆంజనేయస్వామి గుడికెళ్ళాం.

హనుమాన్ చాలీసా మనసులో చదువుకుంటూ, భక్తిగా తనతోపాటే నేను కూడా ప్రదక్షిణలు చేశాను. ఓ పదకొండు ప్రదక్షిణాలు చేసాక ఆగింది. తీర్థప్రసాదాలు కూడా తీసుకున్నాం. గుడిలో అయ్యగారు, శ్రద్ధగా కళ్ళుమూసుకొని, రెండు చేతులూ కలిపి దండాలు పెట్టుకుంటున్న మాకు శఠగోపం పెట్టటానికి వచ్చారు. మా ఫ్రెండ్ కి శఠగోపం పెట్టారు. ఇంక నా వంతు. నేనింకా చేతులెత్తి దేవుడివైపే పరవశంగా, మైమరచి చూస్తూ దండాలు పెట్టుకుంటున్నాను. అయ్యవారు ఎంత సేపైనా నాకు శఠగోపం పెట్టకపోవటం తో అయ్యగారి వైపు తిరిగి చూశాను. నా నెత్తిన శఠగోపం తగలగానే కోరుకునే కోరికతో నేను సిద్ధమయ్యాను. అయినా అయ్యగారు శఠగోపం పెట్టలేదు. నా రెండు కళ్ళూ దేవుడి నుంచి మరల్చి అయ్యగారి వైపు తిప్పి ప్రశ్నార్ధకంగా, ఇంకా పెట్టరేం అన్నట్లు చూశాను. ఆయనెందుకో నా వైపు పరమ కోపంగా చూస్తున్నారు. నాకస్సలర్ధం కాలేదు. ఏంటమ్మా, ఇది ముత్తైదు పిల్ల గాజులు లేకుండా గుడికి వస్తారా. ఇంటికెళ్ళి గాజులేసుకురా! అన్నారు. అయ్యోరామా! గాజులకోసమా, ఈ కోపమంతా..ఇప్పుడేం చేయాలి. ముత్తైదు పిల్లో...పండు ముత్తైదువో, ఇప్పుడెలాగా? ఇంటికెళ్ళి గాజులేసుకొని నేనెప్పుడు రావాలి.

ఆంజనేయస్వామి దగ్గిర గాజులు లేకపోతే ఏంటట, పోనీ అమ్మవారైనా కాదుగా అనటానికి. లాభంలేదు. గుడికొచ్చి శఠగోపం లేకుండా ఎలా పోవాలి? అందునా నా ఫ్రెండ్ కి పెట్టి నాకు పెట్టక పోతే ఎంతవమానం. ఏమైనా సరే, నేను శఠగోపం పెట్టించుకోవాల్సిందేనని, ఆ నిముషమే...భీష్మణి ప్రతిజ్ఞ, మంగమ్మ శపధం లాంటివి దబదబా చేసేసుకున్నాను. ఈ అయ్యగారేమో వినిపించుకునేటట్లు లేరు. అదేంటి అయ్యగారు, గుడి కి ఎన్నో రకాల వాళ్ళు వస్తారుకదా! నన్నలా అంటే ఎలా? అన్నాను. ఉహూ.. నా పప్పులేమి ఉడకలేదు, కాదుకదా కనీసం నాననైనా లేదు. చూడమ్మా నీకు గాజుల అర్హత ఉందని నాకు తెలుసు కదా! ఈ గుడికి నువ్వు చాలాసార్లే వచ్చావు కదా! అన్నారు. ఇంతమాటన్నాక ఇంకేం మాట్లాడాలి నేను. ఎవరైనా ఆంజనేయస్వామికి గాజులివ్వకపోతారా!!! అవి ఓ రెండేసుకుందాం అని చుట్టూ చూశాను. ఎక్కడా ఒక్క గాజు కూడా కనిపించలేదు. బహుశా: ఆంజనేయస్వామికి గాజులివ్వరనుకుంట. అయినా ఘోటక బ్రహ్మచారి గుళ్ళో గాజులెతకటం నాదే తప్పు. లాభంలేదని అయ్యగార్ని బతిమిలాట్టం మొదలుపెట్టాను. ఎప్పుడూ పొద్దున్నే ఫ్రెష్ గా తయారయి గుడికి వెళ్ళేదాన్ని. ఇవాళ రాత్రిపూట ఇలా వెళ్ళాను ఏంచేస్తాం...ప్లీజ్ అయ్యగారు, ఇంకెప్పుడిలా రాను. ఈ ఒక్క సారికి క్షమించేయండి, అని ఏడుపుమొహం పెట్టాను.

ఇహ, నేను ఇంతగా కాళ్ళా వేళ్ళా గోళ్ళా పడ్డాక తప్పదనుకున్నట్లున్నారు. నా నెత్తిమీద శఠగోపం ఠఫీ మని పెట్టారు. అంత ఘాట్టి దీవెనకి తట్టుకోలేక నెత్తిమీద బరాబరా రాసుకుంటూ, మా ఫ్రెండ్ ని, వీలైనంత కోపం గా చూసుకుంటూ బయట పడ్డాను. తనకేమో నన్ను చూస్తున్నా కొద్దీ ముసిముసి నవ్వులొస్తున్నాయి. గుళ్ళో కూచోవాలిగా మరి. అక్కడ ఒక అయిదు నిముషాలు కూర్చోని ఇంటి దారి పట్టాం. "కరముల పైడి కంకణములతో నిను కొలిచెదమమ్మా! తల్లీ, మము కాపాడగ రావమ్మా" అని అమ్మవారి కీర్తన రాగాలాపన మొదలుపెట్టింది మా ఫ్రెండ్. నాకు ఇంకా పుండు మీద ఖారం, ఇంకా ఏవో ఏవో కెమికల్స్ పోసినట్లనిపించింది. ఇప్పుడర్దమయ్యిందనుకుంటా, గాజుల్లేకుండా ఇంకెప్పుడు గుడికి రాకు, అని మా ఫ్రెండ్ నాకు హితోపదేశం మొదలుపెట్టింది. ఔనౌను, నిజమే! నా కర్ధమైందేమిటయ్యా అంటే వేళా పాళా లేకుండా ఫ్రెండ్ మాట వినకూడదని. చాలా ఉక్రోషంతో, కసిగా అనేసాను తనతో....

అంతేనంటారా? గాజులేసుకోకుండా గుడికెళ్ళకూడదా!!!! ఈ అయ్యగారు నన్నెప్పుడూ చూస్తూనే ఉంటారుగా, అందుకనే అలా అనిఉంటారులే. అందర్నీ అనరు. అని సర్దిచెప్పుకుని....నన్ను నేనే ఓదార్చుకున్నాను.....





****************************************************************************
 

మనస్వి © 2008. Template Design By: SkinCorner