25, డిసెంబర్ 2011, ఆదివారం

బుక్ ఫెయిర్ లో నేను...




అయిపోతోంది బుక్ ఫెయిర్. ఈ సారి ఏవిటో అస్సలు వీలు కావటం లేదు. దానికి తోడు రెండురోజులనుంచి జ్వరం, ఒళ్ళునొప్పులు. మొహం పీక్కు పోయింది. ఓపిక ఎటో ఎగిరిపోయింది. లాభం లేదు. అయినా సరే వెళ్ళాల్సిందే. ఎప్పుడూ ఒకటో రెండో కొత్త పుస్తకాలు తెచ్చుకుంటూ ఉంటాను. ఈ సారి ఒక్కటన్నా తెచ్చుకోపోతే ఎలా!!!

సరే మొత్తానికి శనివారం శలవు కాబట్టి ఆ రోజు ప్లాన్ వేసాను. మిట్టమధ్యాహ్నం బుక్ ఫెయిర్ కి చేరుకున్నాము. ఎండ బాగానే ఉంది. కాని నాకెందుకో చలేస్తోంది. మా ఫ్రెండ్ ఫ్రీ పాసులు ఇచ్చింది. అయినా టికెట్ తీసుకునే పోవాలనిపించింది.

ఎంటర్ అవగానే లెఫ్ట్ సైడ్ మొదట్లోనే కనిపించింది...ఇ-తెలుగు స్టాల్. అక్కడ ఆగి లోపలున్న ఇద్దరిని చూసి పరిచయం చేసుకోవాలనుకున్నాను. ఒకరు చక్రవర్తి గారు ఒకరు కౌటిల్యగారు. నేను వాళ్ళ గురించి అడిగి వాళ్ళ బ్లాగ్ ల గురించి కనుక్కునే సరికి మీరు బ్లాగరా, బ్లాగ్ లు చదువుతారా అని అడిగారు చక్రవర్తి గారు. ఒక్క సారి గా నాకేం చెప్పాలో తెలియలేదు. మౌనంగానే కాదన్నాను. అక్కడే ఉన్న వైట్ పోస్టర్ మీద ఆనాడు విజిట్ చేసిన బ్లాగర్ల యూఆరెల్స్ కూడా రాసి ఉన్నాయి. నాక్కూడా వెంటనే అక్కడికి పోయి నా పేరు రాయాలనిపించింది. ఒద్దులే, ఏం గొప్ప బ్లాగర్ నని అనిపించి ఊరుకున్నాను. చక్రవర్తి గారు నాకు అంతర్జాలం గురించి ఒక పాంప్లేట్ ఇచ్చారు. కూడలి చూస్తారా అని అడిగారు. ఆయనకే అర్ధంకానంతగా తల అటో ఇటో ఎటో ఊపేసాను. చక్రవర్తి గారు నేను ఎన్నో వివరాలు అడగటంతో నా వైపు కొంచెం అనుమానంగా చూస్తున్నారు. నేను కౌటిల్య గారిని వారి బ్లాగ్ పేరు మళ్ళీ అడిగాను. ఈ సారి కౌటిల్య గారు కొంచెంగా తలతిప్పేసుకున్నారు. పాపం ఇంక ఇబ్బంది పెట్టొద్దులే అనుకొని ముందుకెళ్ళిపోయాను. కొంచెం దూరం వెళ్ళి ఒక సారి వెనక్కి తిరిగి చూసాను. చక్రవర్తి గారు ఇంకా అనుమానంగా చూస్తునే ఉన్నారు. చక్రవర్తి గారు,కౌటిల్య గారు సారీ అండీ.

ఎదురుగుండా మా స్టూడెంట్ కనిపించింది. వెంటనే మొహమింత చేసేసుకొని మేమ్ నాకు హెల్ప్ చేయారా అంది. నవ్వొచ్చింది. ఇక్కడేవిటి హెల్ప్, ఏమయింది, అని అడిగాను. నాకు గాన్ విత్ ద విండ్ బుక్ కావాలి అంది. సరే అని తనతో స్టాల్ లోకి వెళ్ళి ఆ బుక్ తో పాటు మిడ్ నైట్ చిల్డ్రెన్ బుక్ కూడా తీసి ఇచ్చాను. నాకు క్లాసిక్స్ కూడా కావాలి అంది. సరే అని, కొంచెం వెతికి ద గ్రేట్ వర్క్స్ ఆఫ్ విలియం షేక్స్పియర్, ద గ్రేట్ వర్క్స్ ఆఫ్ బి.జి.షా తీసిచ్చాను. కొంచెం సులభంగా చదువుకోకలదని. ఇంకా ఏదో అడగబోతోంది. ఒకపని చేయి, మెల్లిగా అన్ని బుక్స్ చూసి లేటెస్ట్ బుక్స్ కూడా తీసుకురా, నేను తెలుగు స్టాల్స్ చూడాలి అని అక్కడినుంచి బయటికొచ్చాను.

తెలుగు స్టాల్స్ చాలానే ఉన్నాయి కాని దాదాపు అన్నిట్లోనూ రిపీటెడ్గా చాలా బుక్స్ ఉన్నాయి. ఎప్పుడూ చూసేవే కాకుండా కొత్తవి కనిపిస్తాయేమో అని చూసాను. పిల్లల పుస్తకాలు చాలానే ఉన్నాయి. ఇన్ని సార్లు చూసినా అమరావతి కథలు నేనెప్పుడూ తెచ్చుకోలేదు. ఈ సారి తీసుకుందామనిపించింది. పంచతంత్రం ఒకటి కొనుక్కున్నాను. పెయింటింగ్ గురించి బుక్స్ ఉన్నాయి కాని అంతగా నచ్చలేదు. వంశీ బుక్స్, బాపూ రమణ పుస్తాకాలు కూడా తీసుకోలేదు. అన్నీ ఉన్నవే. జీవితచరిత్రలు ఉన్నాయి గాని హంపీ నుంచి హరప్పా వరకు మాత్రమే కొనుక్కున్నాను. దాదాపుగా అన్ని స్టాల్స్ లోనూ చలం బుక్స్ కనిపించాయి. ఒకచోట మాత్రం శరత్ సాహిత్యం కూడా కనిపించింది. అందరూ మిథునం పుస్తకం గురించి చెప్తున్నారుగా అని ఒకటి తీసుకున్నాను. ఈ బుక్ రెండు సైజుల్లో కనిపించింది. భానుమతి బుక్స్ కూడా కొనేసినవే.

ప్రతి స్టాల్ లో గరుడ పురాణం కనిపించింది. కాని ఎందుకో కనీసం చేయేసి చూద్దామన్నా భయమేసింది. అస్సలు ముట్టుకోను కూడా ముట్టుకోలేదు. పురాణ గ్రంధాలు తాత్విక గ్రంధాలు చాలా ఉన్నాయి. కాని నేను ఏవీ తీసుకోలేదు.
మొత్తం సినిమా వాళ్ళ గురించే ఉన్న స్టాల్ మాత్రం నన్ను కాసేపు నిలబెట్టింది. నాగేశ్వర రావ్ హీరోయిన్స్, నందమూరి, శొభన్ బాబు పుస్తకం, ఘంటసాల, సావిత్రి కి చెందిన పుస్తకాలు బాగనిపించాయి.

ప్రముఖ చరిత్ర కారులు వకుళాభరణం రామకృష్ణ గారు కనిపించారు. వారు నాకు తెలుసు. దగ్గరికి వెళ్ళి నమస్కరించి, పలకరించాను. చాలా రోజులయింది నువ్వు కనిపించి, బాగున్నావా అని చాలా ఆప్యాయంగా అడిగారు. ప్రజాశక్తి వారి, అమెరికా ప్రజల చరిత్ర, ప్రాచీన ప్రపంచ చరిత్ర పుస్తకాల ఆవిష్కరణకు వచ్చానని చెప్పారు. అమెరికా ప్రజల చరిత్ర పుస్తకం ఒక కాపీ నాక్కూడా ఇచ్చారు. నిజం చెప్పాలంటే, ఆ బుక్ తీసుకుంటున్నప్పుడు ఏదో బహుమతి పొందిన ఆనందం కలిగింది:)

పిల్లల కోసం కొన్ని ఫాన్సీ వస్తువుల షాప్ కూడా బాగుంది. రకరకాల పెన్నులు, పెన్సిల్స్, షార్ప్నర్స్, ఎరేజర్స్ గమ్మత్తుగా బాగున్నాయి. వేరుశనగ కాయల ఆకారం లో ఉన్న ఒక రబ్బర్, షార్ప్ నర్ తీసుకున్నాను. ఆరు రంగులతో ఉన్న ఫాన్సీ పెన్ కూడా తీసుకున్నాను. చేతిలోంచి ఎగురేసినప్పుడల్లా రంగులు మారే ఒక బంతి కూడా కొన్నాను. ఇవన్నీ మా సోనీ, చింటూ గాడి కోసమన్నమాట. నెహ్రూ డిస్కవరీ ఆఫ్ ఇండియా మా లక్ష్మి కిద్దామని కొన్నాను. ఇప్పుడు చాలా పుస్తకాలే చదువుతోంది.

పోయిన సారి కన్నా కూడా ఈ సారి బుక్స్ చాలా ఉన్నాయి. అప్పటికే తిరిగే ఓపిక అయిపోయింది. జ్వరం పెరుగుతున్నట్లుగా అనిపించింది. కళ్ళు మంటలుగా ఉన్నాయి. నోరెండిపోతోంది, నీళ్ళు తాగ బుద్ధి కావట్లేదు. ఇంక వెళ్ళిపోదామన్నాను. బయటికొస్తుంటే మా ఫ్రెండ్ వస్తూ కనిపించింది. చాలా బుక్స్ ఉన్నాయి. మీ అబ్బాయికి కొను. సిడీ లు ఒదిలేయ్. అని చెప్పి బయటి కొచ్చాను. అక్కడినుంచి ఈట్ స్ట్రీట్ కి వెళ్ళి వేడి వేడి కాఫీ తాగి కాసేపు కూర్చున్నాము. టాంక్ బండ్ మీంచి చల్లటి గాలి వస్తోంది గాని, వాసన భరించలేక పోయాను. మెల్లిగా ఇంటిదారి పట్టాము.



**************************************************************************************************************************

30, నవంబర్ 2011, బుధవారం

గోలీ మార్~*@*:(




ఒళ్ళుమండిపోతోంది. రగిలిపోతోంది. చంపేయాలనుంది. చాలా ఇరిటేటింగ్ గా ఉంది.
కాలేజ్ పై ఫ్లోర్ కిటికీ లోంచి ఇస్సిరి పారేస్తాను.
ఫాన్ కి హాంగ్ చేసేస్తా!!!
కొత్తగా కడుతున్న ఫ్లోర్ టెర్రస్ పైన సిమెంట్ లో కూరేస్తా!!!!
తొక్కలో వాడు...అడ్డగాడిదా....నక్కగాడు... విలన్ మొహం గాడు... జోకరోడు.... ఊరికే మంచం మీంచి ఠఫాఠఫా పడ్తాడేమో....మెదడు పూర్తిగా మాయమైపోయింది...కొంచమన్నా మిగల్లేదు.

తీరాలి నా కోపం తీరాలి...తీరాల్సిందే నా కోపం...
ఎట్లా...ఎలా..ఏవిధంగా అయినా సరే.... కోపంతో కొరికి కొరికి నా పళ్ళన్నీ అరిగిపోయాయి. తీసుకుపోయి ట్రాఫిక్ జాం లో తిండితిప్పలు లేకుండా వదిలేయాలి.

పెద్ద గొప్ప... బోడి గొప్ప....ఓ పిచ్చి సూట్ వేసుకొని... ఈ లోకంలో ఇంతోటి ఘనుడెవ్వరు లేరు పాపం.... క్రాక్ మాస్టర్... థర్డ్ డిగ్రీ ట్రీట్మెంట్ ఇప్పించాలి...లేకపోతే మమతా బెనర్జీ దగ్గరికి పంపించేయాలి. ఒట్ఠి భీభత్సం గాడు.
చి...చీ...ఇంక చచ్చినా ఈ ఉద్యోగం చేయను గాక చెయ్య్యను... చెయ్యను ... చేయ్యను...అంతే...నాకొద్దు. ఇంక అంతే...టాటా...బిర్లా...ఫో!!!!!

నేనింకా ఏమి రాసుకుంటే ఈ కసి, కోపం తీరాలి.... రామాయణం లో లంఖిణి గాడు.... బాగా ఒబెసిటే వచ్చేస్తుందిలే....

ఇదంతా నాకే లెండి....నా కచ్చకొద్దీ తిట్టుకుంటున్నాను. ఎక్కడంటే ఎవరూరుకుంటారు గనక.... దొరికిందిగా నా బ్లాగూ...నా యిష్టమని....

ఇట్లా తిట్టాలి బాగా....



*******************************************************************************************************************************************************************

16, నవంబర్ 2011, బుధవారం

సలహా కావాలి !!!

ఎంతో అల్లారు ముద్దుగా చూసుకున్నారు. కాలు కింద పెట్టనీయకుండా కోరిన కోరికనెల్లా తీర్చారు. ముద్దూ మురిపాలందించారు. చక్కటి విద్యా సంస్థలో ఉన్నత విద్యకై చేర్చారు. చదువుల సరస్వతి గా విలసిల్లింది. ప్రతి పోటీలోనూ ఉన్నత బహుమతులు సంపాదించుకుంటోంది. ఉపాధ్యాయుల ప్రియతమ శిష్యురాలయింది. అంతేకాదు, ఎన్నో లలిత కళలను అభ్యసిస్తోంది. చక్కటి విజ్ఞానవంతురాలు. ప్రతిఒక్కరికీ తలలో నాలుక.

ఇంతటి ఆక్టివ్ అమ్మాయి ఉన్నట్లుండి స్తబ్దుగా మారిపోయింది. అన్నీ ఒదిలేసింది. ఒంటరిగా ఉంటోంది. పద్నాలుగేళ్ళ ఆ అమ్మాయి స్కూల్ మానేసింది. పుస్తకాలు ఒదిలేసింది. చక్కగా పాడే అమ్మాయి గొంతు ఎందుకో మూగబోయింది. అసలు ఉత్సాహం అనే పదానికి అర్ధమే మరిచిపోయింది.

తల్లిదండ్రులను మాత్రం ఎంతో గౌరవిస్తోంది. చాలా కృతజ్ఞత చూపిస్తోంది. ఎంతో ఒదిగి ఒదిగి ఉంటోంది. ఒక్క మాట ఎదురు మాట్లాడటం లేదు. ఆ పసిపిల్ల అల్లరి అంతా ఎక్కడ మాయమైపోయిందో. ఏమీ చాతకాని మూలనున్న ముసలమ్మకన్నా బలహీనమై పోయింది.

అర్ధం కాని తల్లిదండ్రులు అల్లాడిపోయారు. అమ్మాయిని ఎన్నోరకాలుగా బతిమలాడి ఈ మార్పుకు కారణం తెలుసుకోటానికి ప్రయత్నం చేసారు.

తట్టుకోలేని తల్లి నువ్వు నాకు ఏ కారణం చెప్పక పోతే ఈ నాటి నుంచి నేను పూర్తిగా ఆహారం మానేస్తానని పట్టుబట్టింది. ఆ రోజంతా ఏమీ తినలేదు కూడా.

అదే రోజు ఆ అమ్మాయి తల్లి పాదాలపై తలపెట్టి విపరీతంగా ఏడవసాగింది. తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. అక్కున చేర్చుకొని, కన్నీరు తుడిచి...కన్నీళ్ళతో ఎంతో బ్రతిమిలాడారు.

ఎన్నాళ్ళనుంచో భరిస్తున్న తన బాధను తట్టుకోలేక గుండెపగిలి అడిగింది. 'అమ్మా! నేను మీ బిడ్డను కాదా!!!' అని.

వారిద్దరూ నిశ్చేష్టులయ్యారు.

అవును. ఆ అమ్మాయి అడిగిన మాట నిజమే. తను వాళ్ళ స్వంత బిడ్డ కాదు. సంతానం లేని వారు, ఒక ప్రభుత్వ అనాధ శరణాలయం నుంచి కొన్ని రోజుల వయసున్న ఆ అమ్మాయిని దత్తత చేసుకున్నారు. ఎంతో అపురూపంగా చూసుకున్నారు. కాని ఈ రోజు చుట్టుపక్కలెవరి ద్వారానో ఆ అమ్మాయికి నిజం తెలిసిపోయింది. అప్పటినుంచి తట్టుకోలేక పోతోంది.

తను అనాధనని, వీరు తనని పోషిస్తున్నారని, తనకెవరూ లేరని తల్లడిల్లిపోతోంది. ఎప్పటిలా వారితో ప్రవర్తించలేకపోతోంది. విపరీతమైన కృతజ్ఞత చూపిస్తోంది. అప్పటి గారాబాలు, అభిమానం, అధికారం స్థానం లో పూర్తి ఆత్మ న్యూనత పెరిగింది. ఆ ఇల్లు తనది కాదు. వారు తన వారు కారు అనే భావం పెరిగిపోయింది. ఈ చిన్న వయసులో ఒక్క సారిగ తన పరిస్థితిలో వచ్చిన ఆ మార్పుని తట్టుకోలేక పోతోంది. విపరీతమైన సంఘర్షణకు లోనవుతోంది. మనసువిప్పి, చనువుగా తల్లిదండ్రులతో ఉండలేకపోతోంది. విలువైన వస్తువులన్నీ పక్కన పెట్టేసింది. వారు తిన్నాకనే తను తింటోంది. ఇంట్లో పనంతా చేయటానికి ప్రయత్నిస్తోంది. ఆ సున్నిత మనస్సు నలిగిపోయింది. కోలుకోలేకపోతోంది.

తల్లిదండ్రులు ఎంత ప్రయత్నించినా సహజంగా ఉండలేకపోతోంది. ఆ అమ్మాయికి ఆ నిజం చెప్పినవారికి తృప్తి కలిగి ఉండొచ్చు, కాని దాని ద్వారా ఇక్కడ మూడు జీవితాలు అల్లకల్లోలమయిపోతున్నాయి.
స్నేహితులు, బంధువులు ఎన్నో రకాలుగా ఆ అమ్మాయి నిజం మరిచిపోయి స్వేచ్చగా ఉండటానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా అవన్నీ దండగే అవుతున్నాయి. ఉన్న వూరు, స్వంత ఇల్లు వదులుకొని ఎక్కడికి పోగలరు. ఆ అమ్మాయిని కొంత కాలం సరదాగా స్నేహితులతో వేరే ఎక్కడికన్నా పంపటానికి కూడా ప్రయత్నం చేసారు.

తను వాళ్ళకు ఎంతో ఋణపడి ఉన్నట్లుగా ప్రవర్తిస్తోంది. ఒకవేళ తన తల్లిదండ్రులెవరో తెలిస్తే వెళ్ళిపోతానంటోంది. పరాయి భావన పెరిగిపోయింది. దూరం పెరిగిపోతోంది. దగ్గిరయ్యేది ఎలా?

ఆ అమ్మాయి ఈ బాధ ఎలా తీరాలి? తిరిగి వారందరు ఎప్పటిలా సంతోషంగా కలిసి ఉండే అవకాశం ఇంక లేదా? దీనికి పరిష్కారం ఏవిటి? ఆ అమ్మాయి మీద ప్రాణాలు పెట్టుకొని ఎన్నో ఆశలతో బ్రతుకుతున్న ఆ తల్లిదండ్రులు ఏమవ్వాలి? వారికి కావాల్సింది ఆ అమ్మాయి కృతజ్ఞత కాదు. ఎప్పటిలాగే ఆ ప్రేమ, అభిమానం కావాలి. అప్పటి చనువు, ఆప్యాయత కావాలి. ఆమె భవిష్యత్ కావాలి. తమ గారాలపట్టి తమకు కావాలి. ఇప్పుడెలా!!!

ఆ పసి మనసు ఎలా తట్టుకోవాలి. ఎలా ఓదార్చాలి. ఇలాగే కొనసాగితే...ఆ అమ్మాయి ఏమయిపోతుంది.......


**************************************************************************************************

10, నవంబర్ 2011, గురువారం

విందు భోజనాలు




అక్కడ కేవలం పదేళ్ళ లోపు వయసున్న మొగపిల్లలు మాత్రమే ఉన్నారు. వాళ్ళకి పదహారు ఏళ్ళ వయసు వచ్చే వరకు అక్కడే ఉండి చదువుకుంటారు. ఏదో వృత్తివిద్య నేర్చుకుంటారు. అప్పుడప్పుడూ వారిని పలుకరిస్తూ ఉంటాను. అలాగే ఇవాళ కూడా కాసేపు సరదాగా కబుర్లు చెప్పుకుందామని వెళ్ళాను. ఇవాళ వాళ్ళకి తినటానికి ఏమీ తీసుకు పోలేదు. ఇవాళ ఏమీ తేలేదర్రా, ఇక్కడే ఏమన్నా చేసుకుందాం.తినుకుంటూ హాయిగా ఆడుకుందాం. పాటలు పాడుకుందాం, కథలు చెప్పుకుందాం... సరేనా!!! మీరే చెప్పండి, ఏమన్నా అని అడిగాను.
అక్కా, అక్కా నేను చెప్తాను అంటూ వచ్చాడు ఏడేళ్ళ శీను. (నేను నన్ను ఆంటీ అని పిలవమన్నా ఎందుకో అక్కా అనే పిలుస్తారు:) కన్నా వీడికంటే కొంచెం పెద్ద వాడు. అంతే. అయినా పేద్ద లీడర్ అనుకుంటాడు. నేను చెప్తానక్కా అన్నాడు. సరే అందరూ తోచినట్లు చెప్పండి. మన ఇష్టమొచ్చినట్లు చేసుకుందాం...సరేనా అన్నాను. అందరూ సరే సరే అంటూ ఏకధాటిగా ఏం చేయాలో చెప్పటం మొదలు పెట్టారు.
మూంపల్లీలు బాగుంటాయి దానితో చేసుకుందాం అన్నాడు కన్నా.
సరే అయితే చెప్పు, అని డబ్బాల్లో వెతికితే కనిపించాయి. చాలానే ఉన్నాయి.

అక్కా బాగా ఉడకపెట్టాలి అన్నాడు. సరే వాడి గైడెన్స్ ఒప్పుకున్నాను కాబట్టి తప్పదు. నేనే చేస్తాను అని చక్కగా కుక్కర్ తెచ్చి అవన్నీ కడిగి ఓ గిన్నెలో పోసి నీట్ గా స్టవ్ మీద పెట్టాడు. ఏయ్, ఆ నీళ్ళల్లో కొంచెం ఉప్పువేయ్ అనరిచాడు శీను. అవునుకదా, అని అందరం నవ్వేసాం. మా లీడర్ గారు కుక్కర్ తెరిచి దానిలో చేతితో కొలుచుకుంటు రెండు మూడు చెంచాల ఉప్పు వేసేసాడు. అంత చిన్నవాడు, ఎంత జాగ్రత్తగా చేసాడో ఆ పని. అక్కా, దీన్ని అయిదు విజిల్స్ తరువాత ఆఫ్ చేయాలి అని అక్కడే కూర్చున్నాడు. సరే, ఇహ అందరం ఆ కుక్కర్ దగ్గిరే విజిల్స్ కోసం ఎదురు చూస్తూ కూర్చున్నాం. ఈ లోపల నాని వచ్చి నేనే బంద్ చేస్తా అన్నాడు. అందరూ నవ్వటం మొదలు పెట్టారు. ఎందుకురా అంటే, రోజూ బంద్ లన్నీ చూసి ఇక్కడ కూడా బంద్ చేద్దామని వచ్చాడు అని అంతా ఒక్కటే నవ్వు. నాని గాడి బుంగమూతి చూసి, ఊరుకోండిరా, అలా తమాషా చేయకూడదు, మనం స్టవ్ బంద్ చేయటమనే అంటాం కదా అన్నాను. మొత్తానికి వాడే స్టవ్ బంద్ చేసాడు:)

సరే ఎలా గయితేనేం ఈ మగపిల్లలంతా కలసి చివరికి ఉడికిన ఆ పల్లీలను బయటికి తీసారు. మరి ఇప్పుడేం చేయాలి అని అడుగుతూనే ఉన్నాను...ఈ లోపలే కన్నా చిన్న జల్లెడ తెచ్చి దానిలో పల్లీలను చాలా ఒడుపుగా దొర్లించి, అక్కా నీళ్ళన్నీ పోయే దాకా ఆగుదాం అన్నాడు. చక్కగా వడ గట్టిన ఆ పల్లీలను పెద్ద కంచం లో పోసాడు. కన్నా, నానీ, శీను కింద చతికిలబడి, కత్తిపీట తీసుకొని ఒకరి తరువాత ఒకరుగా చక చకా పచ్చి మిరపకాయలు, ఉల్లిగడ్డలు, టమాటాలు చిన్న చిన్న ముక్కలుగా కోసేసారు. మిగతా పిల్లలంతా చుట్టూ చేరారు. వాళ్ళతో మీరందరూ వీటిని చక్కగా అందంగా పల్లీలమీద చల్లండి అని ఆర్డర్ వేసి, తనేమో నిమ్మకాయ కోసి దానిమీదంతా సమానంగా పిండాడు. తర్వాత సన్నగా కొత్తిమీర కోసాడు. ఇదన్నా నేను చల్లుతానురా అని వాడి పర్మిషన్ తీసుకొని ఆ పని నేను చేసాను. నా దగ్గిర కొన్ని డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి కూడా చల్లేసాను. దీనిమీద కొంచెం సేవ్ చల్లుదాం అన్నాడు అప్పటి దాకా చూస్తూ కూచున్న రహీం గాడు. ఎక్కడ చూసినా సేవ్ కనిపించలేదు. ఏం చేద్దాం అని అలోచనలో పడ్డాం. పోనీ బయట షాప్ లో తొందరగా తీసుకొచ్చేస్తా అన్నాడు వాడే మళ్ళీ. అలా అయితే ఇది చల్లగా అయిపోయి ఏమాత్రం బాగుండదు అక్ఖర్లేదు అన్నాడు కన్నా గాడు. ఎలాగోలా వాడిని ఒప్పించి రహీం షాప్ కెళ్ళి వచ్చే వరకు ఓపిక పట్టాం. పెద్ద హీరో లాగా ఫీల్ అయిపోతూ, తానే మొత్తం పల్లీల మీద సన్నగా చల్లాడు. అబ్బా, ఒక్క సారిగా దాన్ని చూస్తుంటే రకరకాల రంగులతో ఎంతో అందంగా కనిపించింది.

హాయిగా ఆ పెద్ద పళ్ళెం తో బయటికొచ్చి, కింద గడ్డిమీద పెట్టి చుట్టూ కూర్చున్నాం. ఆనందంగా "విందు భోజనం...పసందు భోజనం, ఏటి గట్టు తోటలోన మేటి భోజనం" అహహ్హ హహ్హ హహ్హా...ఒహొహ్హొహొహ్హొ హొహ్హొ అహహహహ్హహా..వింతైన భోజనంబు...ఇవన్ని మాకె చెల్ల:))) అని పాడుకుంటూ... కబుర్లు, పాటలతో మొత్తం తినేసాం.

తెలిసిపోయిందిగా, మా అబ్బాయిలు చేసిన వంటకమేమిటో:)

కార్తీక వనభోజనాలతో అంతా భుక్తాయాసంతో ఉండి ఉంటారు. సాయంత్రం పూట హాయిగా మా చిన్నారులు కలిసిమెలిసి చేసి మీకు ప్రేమ మీర వడ్డించిన ’పీనట్ స్నాక్’ ఆనందంగా తినేసి, వేడి వేడిగా చాయ్ చేసుకొని తాగేసేయండేం:)))

జ్యోతి గారు మా వంట పనికి రాదంటే మాత్రం నేనొప్పుకోనంతే... చెమటోడ్చి, కష్టపడి చేసాం.

ఆహా!!! ఏమి రుచి...తినరా మైమరచి...రోజూ తిన్నా మరి మోజే తీరనిది...అని హాయిగా పాడుకోవాలి. సరేనా:)

(కెమెరా తీసుకు పోలేదుగా...అందుకని సొంత ఫొటో లేదన్నమాట)

మిత్రులందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు


**************************************************************************

28, అక్టోబర్ 2011, శుక్రవారం

ఆ తరువాత ఏమిటి!!!



ఈ మధ్య చనిపోతే ఏమవుతుంది....చదువుతున్నవి...వింటున్నవి...ఎన్నో రకాల ఈ విషయాలలో ఏవి నిజం. నిజమెలా తెలవాలి... ఇదీ ఈ మధ్య నా బుర్ర తొలుస్తున్న అంశం.

మనకెంతో ఇష్టమైన, ప్రాణప్రదమైన వస్తువు పాడైతే ఎంతో బాధపడ్తాం. నచ్చిన చిన్న కుండ విరిగిపోయినా...ఆ ముక్కల్ని గోడకతికించుకొని కలకాలం చూసుకోవచ్చు. అదే ప్రియాతి ప్రియమైన మనుషులు చనిపోతే ఏనాటికీ అలా చేయలేము. ....అంతేనా...అంతే కాదు ఏ జంతువు చనిపోయినా ఎరువుగా వాడొచ్చుట...ఒక్క మనిషి శరీరం తప్ప!!! కాల్చాలే తప్ప మనిషి శరీరం పాతిపెట్టటం కూడా మంచిది కాదట. మరి, సింధూ నాగరికత నుంచి, పిరమిడ్ల ఆచారం వరకు చనిపోయిన మనిషిని పాతి పెడుతూనే ఉన్నారుగా. మరి 'మమ్మీ' ల సంగతేమిటి.

ఇంతేనా మనిషి విలువ?

అనుకోకుండా, మా ఫ్రెండ్ ని అడిగాను. చనిపోయిన తరువాత ఏమౌతుందో తెలుసుకునే ఒక మంచి పుస్తకం నాకేదైనాచెప్పు, చదవాలి అన్నాను. గరుడపురాణం చదువు. చాలా వివరంగా చనిపోయిన తరువాత ఏమవుతుందో, అంచెలంచెలుగా ఉంటుంది అందులో అంది. ఆ బుక్ ఇంట్లో ఉంచుకో కూడదు చదవకూడదు, అంటారుగా. ఇంక అంత ధైర్యం నాకెక్కడిది? ఎప్పుడంటే అప్పుడు అది చదవకూడదుగా? మరెలా అన్నాను. ఎవరన్నా పోయినప్పుడే అది చదువుతారు, ఆ సందర్భం లో కూడా వినకూడదని అంటారుగా అన్నాను. అదేంలేదు. వింటూ భయపడ్తారని, అలా అంటారు. అంతే. చదవచ్చు అంది. నిజమేనా! చదివితే ఏమీ కాదా. అయినా నాకు భయం బాబూ, అది చదవనులే యండమూరి అంతర్ముఖం బుక్ లో అంతా ఆత్మ ల గురించే రాసాడట, మల్లాది కూడా జయం బుక్ లో ఆటువంటి విషయాలే రాసాడుట. అదే ఏదో ఒకటి చదివితే సరి. కాస్త కథా..సస్పెన్స్ ఉంటుంది అన్నాను.



అసలు చనిపోయినాక ఏమీ జరగదు. మనకసలు ఏమీ తెలియదు. అంతే, అంతటితో మనకథ సమాప్తం. ఆ మాత్రం కూడా తెలియదా...అంది, అప్పటివరకు మా కబుర్లు వింటున్న మా ఫిజిక్స్ లెక్చరర్. అంతేనా...అలా ఎలా...మనకేమీ తెలియదంటే ఎలా. అదెలా ఉంటుంది. ఎంతకాలం. ఎప్పటికీ ఏమీ తెలియదా. అలా అగమ్యగోచరంగా ఎలా ఉంటుంది. ఊహూ, ఊహకందటంలేదు. ఏమీ తెలియకుండానే ఉండిపోతాము అంటే, అలా ఎంత కాలం....బోర్....అలా ఎలా!!! అదేనా ముక్తి అంటే, మోక్షం అంటే!!! మరి బొంది తో మోక్షం అంటే?

ఇంకో జన్మేదో ఉందనుకుంటూ ఈ జన్మంతా పూజలూ పునస్కారాలు చేసుకుంటూ ఏదో స్టోర్ అప్ చేసుకుంటూ...ఈ జన్మలో ఏమీ అనుభవించక పోతే, ఉన్న ఈ జన్మ కూడా వేస్టే ఫో. కుక్కలూ, ఎలుకలూ లాగే మనకు కూడా.. ఏ జన్మా లేదు ... అంటారు కొంతమంది. అంతేకాదు, మేము ఎథిస్ఠ్ లం అంటారు ఇంకొంతమంది. ఏవిటో, నా మీద ఇవన్నీ ప్రభావం చూపిస్తూనే ఉన్నాయి. మనిషి స్వభావం మీదే సంతోషం ఆధారబడి ఉంటుందట. అవునా...నిజమే అనుకుంటా....

ఎన్నో విషయాలు చెప్తున్న మన ఆధ్యాత్మిక గ్రంధాలకి ఆధారం ఏవిటి మరి. ఎలా చెప్ప గలిగారు? ఋజువులు ఏమున్నాయి. 'అనుభవజ్ఞులు' ఎవరైనా వ్రాసారా!!! ఆత్మ శాశ్వతమనే చెప్తున్నారు. పునర్జన్మ కూడా ఉందంటున్నారు. నేను చదువుతున్న ఆధ్యాత్మిక బ్లాగ్ లు కూడా గుర్తొచ్చాయి. చిన్నప్పటి నుంచి జీర్ణించుకుపోయిన ఈ ఆధ్యాత్మికత... పురాణాలు, భగవద్గీత....అబద్ధమెలా అవుతాయి? భవసాగరాలన్నీ దాటి నేను సాధించే యోగం ఎలాంటిదో మరి!!! బుద్ధి కర్మానుసారిణి యా లేక కర్మ నా బుద్ధిననుసరిస్తుందా...

మనిషి సర్వజ్ఞుడు. సర్వశక్తిశాలి. తనలోని అంతర్గత శక్తిని గ్రహించి సాధన చేయగలిగితే బంధాల నుంచి విముక్తుడవుతాడు. అదే మానవుడి ధ్యేయం కావాలి. పరమాత్మా నీవేనా గొప్పవాడివి...నీ అంతటి వాళ్ళం ఏదో ఒక నాడు మేమూ కాబోతున్నామని ఆ దైవాన్ని సవాలు చేయగల మహత్తు మనలోనూ ఉంది అని నా నమ్మకం. మనలోని ఆత్మ ఆ పరమాత్మని చేరుకోవాలని ఎప్పుడూ ఆరాట పడుతూనే ఉంటుంది. ఇక్కడేగా జంతువులకీ మనకీ తేడా. ఒక వరాహము, ఓ చిలుక ఈ మధ్య దేవుని దగ్గర చూపిన భక్తి గుర్తొస్తోంది. అంటే, జంతువులకి కూడా, పరమాత్మ జ్ఞానం ఉందనేగా...

నిశ్చల మనస్తత్వం, సవాళ్ళను ఎదుర్కోగలిగే సామర్ధ్యాన్ని సంపాదించుకోటానికి....రవిశంకర్ 'ఆర్ట్ ఆఫ్ లివింగ్' కూడా నేర్చుకున్నాను. ఆ సుదర్శనక్రియ నాలో ఏ మార్పు తెచ్చినట్లు లేదు. ఈ శ్వాస మీద ధ్యాస ఊపిరి ఆపేస్తుందేమో....అయితే మిగిలేది శవమేగా!!! మరి ఆ తరువాతో....ఏమోమరి. పోనీ, స్వర్గమా...నరకమా? దేనికిపోతాను. అసలున్నాయా అవి?

మేము చిన్నప్పుడు అనుకునే వాళ్ళం. మంచివాళ్ళైతే మంచి దెయ్యాలు, చెడ్డ వాళ్ళైతే చెడ్డ దయ్యా లు గా మారుతారుట. దయ్యాలను పిలవటానికి Ouija Board ఆడేవాళ్ళం. ఏనాడు కనీసం ఒక పిల్ల దయ్యమైనా వచ్చిన గుర్తేలేదు. మరి దయ్యాలకి మళ్ళీ జన్మ ఉంటుందా? ఎప్పటికీ దయ్యాలేనా...అసలు దయ్యాలు ఉన్నాయా. నాకైతే ఏ దయ్యమైనా భయమే. నేను దయ్యమైతే ఎలా? నేను కూడా నిను వీడని నీడను నేనే....అని పాడుకుంటూ తిరగాలా... తెలుగు దయ్యం గానే పుట్టాలని ష్యూరిటీ ఏంటట!!!! ఒకవేళ హిందీ దయ్యం అయితే...బాత్ పురానీ హై...అబ్ సోచూం తూ నహి భూలే...అనుకుంటూ ఏదో పాడాలనుకుంటా...

ఎన్నో సినిమాల్లో చూస్తూనే ఉన్నాంగా, దయ్యాల గురించి. ఎవరినైనా పట్టుకున్నా వాళ్ళు మన చేతికి తగలరు. వాళ్ళల్లోంచే గాలి లాగా రయ్యిన వెళ్ళిపోవచ్చు. అందరినీ మనం చూడగలం. గోడల్లోంచి కన్నాల్లోంచి చాలా ఈజీ గా వెళ్ళిపోవచ్చు. ఎవరికీ కనబడం. కనబడ్డా, మనమంటె వాళ్ళకి చాలా భయం. మాయలు మంత్రాల శక్తి ఉంటుంది. ఇంద్రజాల మహేంద్ర జాలాలు గిర్రుగిర్రున చూపించొచ్చు. మనుషుల్ని ఆవహించి మన ఇష్టమొచ్చినట్లు చేసేయొచ్చు. కాళ్ళు పొయ్యిలో పెట్టి వంట చేసేయొచ్చు. అందమైన అమ్మాయిగా మారి పోవచ్చు. లేకపోతే విఠలా చార్య చూపించినట్లు హంస గానో, ఏ వన్నెచిన్నెల నెమలి గానో మారిపోవచ్చు, ఏవేవో పిచ్చి రూపాల్లోకి కాకుండా. మనకి నచ్చని వాళ్ళని దెయ్యం పాటలతో భయపెట్టొచ్చు. మన వాళ్ళకి కావాల్సిన హెల్ప్ లన్నీ చేసుకోవచ్చు కూడా. కొన్నిసార్లు అలా దయ్యం గా ఉంటేనే బాగుంటుందేమో అనిపిస్తుంది కూడా. మనిషి కంటే దయ్యమే బెటరా!!!

ఏది ఏమైనా, నాకు దయ్యం అవటం ఎంత మాత్రం ఇష్టం లేదు.....మరి నేను చనిపోయిన తర్వాత.....ఆ తరవాత ఏంటి!!!!!!

బదులు తోచని ఈ ప్రశ్నలు....ఏమిటో...ఇలా.



"ఆత్మే ప్రపంచమైంది. ఏకంగా ఉన్న ఆత్మ అనేకంగా అవ్వాలని కోరుకుని అసంఖ్యాక రూపాలలో అంతరాత్మగా వచ్చింది. పదార్ధస్థాయి నుంచీ మనసు వరకు పరిణామంలో పెరిగింది. రూపాలలోని అంతరాత్మ పరిపూర్ణమైన ఆత్మగా ఎదగాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఆత్మ ఎంత సత్యమో అంతరాత్మ అంతే. ఉపనిషత్తులలో సత్యం, పరస్పర వైరుధ్యాల ద్వారా ప్రకటన అయింది. వ్యక్తికి, విశ్వానికీ, ఆత్మకి గల సంబంధం తెలిస్తేనే సర్వం తెలుస్తుంది. జన్మల పరంపర ద్వారా అంతరాత్మ అనేక అనుభవాలు పొంది, ఆత్మగా ఎదుగుతుంది. ఆత్మ శాశ్వతం. లేదా తన ఇష్టమైన రూపం పొందగలుగుతుంది." చివరికి నేను స్థిరపడింది..దివ్యఋషుల ఉవాచ ఉపనిషత్తుల తోనే.....



******************************************************************************************************

30, సెప్టెంబర్ 2011, శుక్రవారం

’నే చూసిన దసరా మంటపం ’

సకల జనుల సమ్మె......
రాజధాని బంద్......
నేను కూడా ఫ్రీ:)
చక్కగా దొరికిన ఈ అవకాశం. ఏం చేయాలి. అవునూ...ఎంతో అందమైన అమ్మవారి మంటపాలు చూసి రావచ్చుకదా! అనుకున్నాను. ఇదిగో, నేను చూసిన ఒక అందమైన దసరా మంటపాన్ని మీరు కూడా చూడండి మరి. నాకు తెలుసు...మీకు తప్పకుండా నచ్చుతుంది. ఈ పాటికే మీరు చాలా చూసేసే ఉంటారు. అయినా సరే, ఇది కూడా చూసేయండి మరి.


ఎంతో అందమైన ఈ దీప తోరణాలు మనల్ని ఆహ్వానిస్తాయి. అందమైన స్వాగతాలు పలుకు తాయి.


అదిగో అల్లంత దూరాన ఎత్తైన ఆ గుడి గోపురం మనల్ని పలకరిస్తుంది. అనంత పద్మనాభ దేవాలయం సొగసులు ఇక్కడ పొందుపరిచారు. ఆ నేలమాళిగలు ద్వారాలుగా రూపుదిద్దుకున్నాయి. చూడండి, ఎంత అందంగా ఉందో!!!


ఇదే ఆ నేల మాళిగ తలుపు. పక్కనే నాగబంధం, వినాయకుడు, గోడమీద దేవతా విగ్రహం కూడా చూడొచ్చు.









మెట్లెక్కి లోనికి ప్రవేశించాలి. అక్కడే మనకు నిలువెత్తు అనంత పద్మనాభ స్వామి దర్శనమిస్తాడు. ఆ పక్కనే మునులు యజ్ఞ యాగాలు నిర్వహిస్తున్నారు.





ఇక్కడినుంచి సన్నటి ద్వారం గుండా లోనికి ప్రవేశించాలి. ఇక్కడ మనకి అగ్నిపరీక్ష. అంటే నిప్పులమీద నడచిపోవాలన్న మాట:) ఇదిగో ఇలాగ.



మెలికలు తిరిగిన ఆ దారిలో ఒక పులి కూడా ఉంది. మనల్ని పలకరిస్తోందా!!!! తస్మాత్, జాగ్రత్త అంటోందా!!!!!



ఆ తరువాత మనం ఈ 'లక్ష్మణ ఝూలా' కూడా దాటాలి. ఇక్కడ కొంతమంది మునీశ్వరులు తపస్సు కూడా చేసుకుంటున్నారు.




ఆ తరువాత ఒక సన్నని గుహ లోకి ప్రవేశించాలి. పాపం ఆయనెవరో!!! ఆయనకి తెలీదు ఆయన ఫీట్ నేను ఫొటో తీస్తున్నానని:)


హు: అప్పుడే ఎక్కడయిందండీ, బాబు. ఇప్పుడు మనం ఈ వైతరిణి దాటితే తప్ప ఆ అమ్మవారు మనకి దర్శనమివ్వదు.


ఈ దీర్ఘ ప్రయాణం తర్వాత, ఇంక మనం గర్భ గుడిలోకి ప్రవేశించినట్లే. అదిగో, చూడండి. ఆ జగజ్జనని శ్రీమతా దుర్గాదేవి దివ్యమంగళ స్వరూపం. అక్కడి దీపాల వెలుగులో, రకరకాల రంగులలో, మిరుమిట్లు గొలిపే ఈ ప్రాంతం, దివ్యలోకాన్ని చూపిస్తోంది.


ఇంతటి దివ్యమంగళ స్వరూపం మనలో భక్తి భావాలను తట్టి లేపుతుంది. ఈ హారతులు, ఇక్కడ ఆలాపించే కీర్తనలు పరవశింప చేస్తాయి.






పవిత్రమైన ఈ తపోవనాలను దాటుకుంటూ, మెల్లిగా...బయటి ప్రపంచంలో మళ్ళీ ప్రవేశిస్తాం.....



ఇక్కడ మనల్ని రకరకాల సాంస్కృతిక కార్యక్రమాలు అలరిస్తాయి.


ఇక్కడే మనకు ప్రసాదాలు, కావలసిన వారికి చల్లటి నీరు, శీతలపానీయాలు లభిస్తాయి.






ఈ గుడి ప్రాంగణంలో కూర్చుని, కార్యక్రమాలను వీక్షిస్తూ, ఫలహారాలు, పానీయాలు సేవిస్తూ......ఎంతకాలమైనా హాయిగా గడిపేయొచ్చు కదూ....



బాగుందా! నా తీర్ధయాత్ర.:)
దసరా పండుగలోని ఈ సరదాలు ఎంతో తృప్తినిస్తాయి. అలరిస్తాయి. అలసిన మనసును సాంత్వన నిస్తాయి. ఈ తొమ్మిది రోజులు స్వర్గలోకాన్నే చూపిస్తాయి. మీరందరు కూడా నవరాత్రు లు బాగా సరదాగా, జరుపుకోవాలి. శుభాకాంక్షలు........

******************************************************************************************

13, ఆగస్టు 2011, శనివారం

వరమహాలక్ష్మి దీవించవమ్మా...



మీ అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు.

బాగున్నారా....మా అమ్మవారు.

పోయిన సారి ఫొటో తీసుకోలేకపోయాను. పైగా కొన్ని కష్టాలు కూడా ఎదుర్కున్నాను. అందుకే ఈ సారి జాగ్రత్తగా, అసలెక్కడికీ పోకుండా శ్రద్ధగా ఇంట్లోనే అన్నీ చేసుకుంటూ ఉండిపోయాను. మా సుజాత కొడుకు చింటు గాడు, ఈ సారి నాకు అసిస్స్టెంట్. వాడి అక్క సోనీ నా కుడిచెయ్యి. ఆ పిల్ల ఎప్పుడూ నా వెనకాల ఉండాల్సిందే. ఈ పిల్ల నా పెంపుడుకూతురన్నమాట.

ఈ సారి పూజకి నాతోపాటు, మా స్నేహాలయ అమ్మాయిలు నలుగురిని, మా లక్ష్మిని కూడా పిలిచి, అందరం కలసి చేసుకున్నాం. వాళ్ళు ఎంత సంతోషించారో. హుషారుగా అన్ని పనులు వాళ్ళే చేసిపెట్టారు కూడా. చక్కగా తోరణాలు కట్టారు. ముగ్గులేసారు. ఎంతముద్దుగా ఉన్నాయో.

అమ్మవారిని తయారుచేసుకోటానికి చాలా సహాయం చేసారు. ఈ చిన్ని పిల్లలే ఈ సారి నాకు ముత్తైదువులు. వేరే ఎవ్వరినీ నేను పేరంటానికి పిలువలేదు. వాళ్ళే ఒకరికొకరు తాంబూలాలు ఇచ్చుకున్నారు. వ్రతకథ చక్కగా విన్నారు. నాక్కూడా వాళ్ళే భోజనాలు వడ్డించారు. అందరం సరదాగా అమ్మవారి కీర్తనలు పాడుకుంటూ భోంచేసాం. ఆ పిల్లల ఆనందం చూస్తుంటేనే నాకు కడుపు నిండిపోయింది.

సాయంత్రం కూడా చక్కగా మేమందరం కలిసి గుడికి వెళ్ళాం. ఈ రోజంతా చాలా సరదాగా గడిచిపోయింది.

వరలక్ష్మీ దేవి నా ఈ పిల్లలందరినీ కలకాలం సుఖంగా ఉండేట్లు దీవించుతల్లి.....

మీరు కూడా నా పిల్లల్ని దీవిస్తారు కదూ!!!!


వరలక్ష్మీ రావే మా ఇంటికి...క్షీరాబ్ధి పుత్రి...వరలక్ష్మి రావే మా ఇంటికీ.....



***********************************************************************************************************************************************************

7, ఆగస్టు 2011, ఆదివారం

స్నేహమా!



స్నేహమా! వెన్నెల దీపమా!
నా అల్ప జీవితంలో ఎగిసిపడే
భావతరంగం నీ పరిచయం

నా గుండె లోగిలిలో.....
మమతల మకరందాన్ని పంచి,
అనురాగపు జ్యోతుల్ని వెలిగించిన
నా స్నేహ సుప్రభాతమా!....నువ్వెక్కడ?

నీ చిరునవ్వు కుసుమాల పరిమళం,
నన్నింకా వీడిపోకముందే
నా కనురెప్పల క్రింద
నీ జ్ఞాపకాల జలపాతాన్ని మిగిల్చి తరలిపోయావ్!

నిజం మిత్రమా!
ఏ అర్ధరాత్రో.......
నీ అనురాగపు అలికిడి ఆర్తిగా వినిపించినప్పుడు
నువ్వు రావన్న దిగులుతో,
నా దు:ఖం ముక్కలై ...ఏ ముత్యపుచిప్పలోనో
ఎక్కడెక్కడో రాలిపడింది......




**********************************************************************************************************************************************

3, ఆగస్టు 2011, బుధవారం

Intellectually Challenged!!!

'Mentally Retarded' అనేకన్నా 'Intellectually Challenged' అంటే ఇంకా బాగుంది కదూ.
ఇదిగో వీళ్ళతోటే మేము Friendship Day చేసుకున్నాం. ఎంతమాత్రం మంచీచెడూ తెలియదు. ఎవరెలాంటివారో అసలే తెలీదు... తమగురించి తమకే తెలీదు...పూర్తి మానసిక వైకల్యమే...అయినా అదేవిటో వారికే తెలీదు.... ఎప్పుడూ నవ్వుతూ తుళ్ళుతూ ఆనందంగానే గడుపుతారు. ఏమైనా నేర్పిద్దామని ప్రయత్నిస్తే నవ్వుతూ చూస్తారు. ఆ...బా...వా....అని నవ్వుకుంటూ వెళ్ళిపోతారు. కానీ, మళ్ళీ నవ్వుకుంటూ మనదగ్గిరికే వచ్చేస్తారు. ఎంతమంచివాళ్ళో, ఎంత అమాయకులో....వాళ్ళు పిచ్చిపిల్లలట. కాదు...ఎంతమాత్రం కాదు. సరి అయిన శ్రద్ధ చూపించి ముద్దారా నేర్పిస్తే, అన్నీ తెలుసనుకునే మనకన్నా చాలా తెలివితేటలే చూపించగలరు. వీరే హైద్రాబాద్ లోని "మానస" స్కూల్ విద్యార్ధులు. నాకు తెలిసిన వారు.

ఈ రోజు వారి ఆటపాటలతో చాలా సంతోషంగా ’స్నేహితుల దినోత్సవం’ చేసుకున్నాం. ఎంతో చక్కగా డాన్స్ లు, పాటలు పాడారు.



ఈ పాప ఎంత చెప్పినా, స్టేజ్ మూలకి వెళ్ళిపోయి చేస్తోంది. కాని చక్కటి క్లాసికల్ స్టెప్స్ ఎక్కడా తప్పకుండా చేసింది, తెలుసా!!!!

ఇదిగో ఇక్కడ నించుంది చూసారా! ఈ పాపే డాన్స్ చేసింది. తెల్లగులాబీ లాగ ఎంత అందంగా, అమాయకంగా నవ్వుతోందో....




ఈ అబ్బాయి వయసెంతనుకుంటున్నారు? మీరు చెప్పలేరు. నాకు తెలుసు. ఎంతోకాదు. కేవలం పదిసంవత్సరాలు మాత్రమే. నమ్మగలరా!!!
చూడండి. హృదయమెక్కడున్నది....అంటూ ఎంతబాగా డాన్స్ చేసాడో....అంతేకాదు, మిగతా పిల్లలందరినీ క్రమశిక్షణ మీరకుండా కాపాలాకాసాడుకూడా. నా కళ్ళతో చూడకపోతే నేనస్సలు నమ్మేదాన్నేకాదు....



ఈ పాప ఎంత చక్కగా రామదాసు కీర్తన పాడిందో...స్పస్టత లేకపోయినా, చక్కటి నిష్ట, ఏకాగ్రతా ఉన్నాయి. సో గ్రేట్.




చక్కటి Friendship Day Bands తయారు చేసారు. అంతేకాదు అందమైన రాఖీలు కూడా తయారు చేసారు. అవన్నీ తీసుకొచ్చి మాకు పంచిపెట్టారు. ఎంతో కళాత్మకంగా చక్కటి గ్రీటింగ్ కార్డ్స్ కూడా తయారు చేస్తారు.

ఇంతతెలివైన పిల్లల్ని చులకన చేసి అందరినుంచి దూరంచేయకుండా మనలోనే కలుపుకుంటే.....అదే అసలైన ఎంతో విలువగల జీవితం...
"చూపులతోనే చులకన భావం వద్దు!
మంచిమాటలతో స్నేహభావం ముద్దు....."

ఈ రోజు నాకనిపిస్తుంది....
"నేను సైతం ప్రపంచాగ్నికి సమిధ నొక్కటి ఆహుతిచ్చాను.
నేను సైతం విశ్వ సృష్టికి అశ్రువొక్కటి ధారపోశాను.
నేను సైతం భువన ఘోషకు వెర్రిగొంతుకనిచ్చి మ్రోశాను......."

నేర్చుకుంటూ ఉన్న వీరి దగ్గిరే నేను ఇంకా నేర్చుకోవాలి. వెలుగుతున్న ఈ దీపమే నన్ను వెలిగించగలదు.వీళ్ళు ఎన్ని సార్లో విఫలమైనా సఫలం కావటానికి మార్గం వెతుక్కుంటూనే ఉంటారు. విజయమే వీరి గమనం.
వీరిపై అపారమైన ప్రేమ కుండపోతగా కుమ్మరించాలనిపిస్తోంది.
నా జీవిత పయనం లో మహోన్నతమైన మజిలీ ఇదే.....మౌనంగా జారే మంచుబిందువులా ఉంది.... కాలగమనంలో......ఈ అందమైన కల కరిగి పోకుండా కలకాలం దాచిపెట్టుకుంటాను.
మనసులో బాధ...గుండెలో వ్యధ....
తోసివేసిన ఈ రాళ్ళను మూల విరాట్టులు చేయటానికి నేనూ చేయూతనిస్తాను.

గొప్పగా మరణించాలి అంటే...గొప్పగా జీవించాలి కదూ.... కనీసం ఒక మనిషిగా నైనా !!!

అందరికీ నా హృదయపూర్వక స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు.
తొందరపడి కూసానా. మేమివాళే కూసేసాం మరి:)



************************************************************************************

25, జులై 2011, సోమవారం

మా అక్క పుట్టింరోజండీ ఇవాళ...





అక్కా!!! హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.

పేరుకు అక్కే అయినా తల్లి కన్నా నాకు ఎక్కువే.
ఎన్నో సలహాలు....ఎన్నో సహాయాలు...ఎంతెంతో ప్రేమా అభిమానం చూపిస్తావు.....
కోపమొచ్చినప్పుడు తిట్టినా....సరి అయిన మార్గం చూపిస్తావు....
నా పిరికి తనానికి కోపం తెచ్చుకొని....నన్ను సరిదిద్దుతావు.......
ఊరికే ఏడ్చేసే నాకు లోకాన్ని తెలియచేసావు......
ఆవేశపడిపోతానని.....తొందరపాటుతో నేనేం చేసేస్తానో అని భయపడిపోతావు......
నేను సంతోషంగా ఉంటే...నా చిన్న నవ్వుకే పులకించి పోతావు.....
నాకు చిన్న కష్టమొస్తే చాలు.....విలవిలలాడిపోతావు......
ప్రేమ చూపి, తోడునీడగా నిలచి, బ్రతుకు నేర్పిన నీకు ఏమిచ్చి రుణం తీర్చుకోగలను....

చిన్నప్పుడు ఇంటిపట్టునుండకుండా, ఎక్కడెక్కడో తిరిగి పిచ్చి ఆటలన్నీ ఆడి వచ్చే నన్ను అమ్మ తిడితే....ఎంత ఆదుకునే దానివో....
నాకోసం చిన్న చిన్న త్యాగాలు కూడా చేసేదానివి....నాకు ఇంకో అక్కకూడా ఉండేది. కాని నేను తనని చూడనుకూడాలేదు. నేను పుట్టకముందే చనిపోయింది. తనుకూడా ఉంటే నాకు ఇద్దరు అక్కలుండే వారు. కాని ఆ లోటేం తెలియకుండా అందరికన్నా నువ్వే ఎక్కువనిపించావు.....

నా చదువంతా నీ దగ్గిరేగా.....నీ పిల్లలతో సమానంగా చూసుకున్నావు....వాళ్ళతోపాటూ నాకూ అన్నీ కొనిచ్చావు...నాకు బావగారంటే చాలా భయం....కాని ఆ భయమంతా పోగొట్టేసావ్......ఇప్పుడైతే...కొన్నిసార్లు పోట్లాడే స్థాయికొచ్చాను......బావగారంటే నాకెంత గౌరవమో చెప్పలేను...ఏం చెప్పినా...వెంటనే మాట్లాడకుండా చేసేస్తాను:) చివరికి నా పెళ్ళి కూడా మీ ఇద్దరి చేతుల మీదేగా జరిగింది.......

నాకు డాక్టరేట్ అవార్డ్ అయితే నీకే డిగ్రీ ఇచ్చినంత గర్వపడిపోయావ్....అందరికీ ఎంత గొప్పగా చెప్పావో......

నాకు ఉద్యోగం వచ్చినప్పుడు ఎంత సంబరపడిపోయావో....నేను ఉన్నత శిఖరాలు అందుకోవాలని...ఎంతమంది దేవుళ్ళకు ఎన్ని మొక్కులు మొక్కావో...అవి తీర్చటానికి ఎన్ని అవస్థలు పడ్డావో....నేనెలా మరచిపోగలను....

ప్రతి సంవత్సరం ఓ రెండుమూడు రోజులెక్కడికన్నా పోవాలి అని ప్లాన్ వేసుకున్నామ్. కాని నువ్వేమో గుళ్ళూ గోపురాలు అంటావ్...నేనేమో చెట్లూ తోటలూ అంటాను.....మెల్లిమెల్లిగా మనం దూరమైపోతున్నామేమో అనిపిస్తోంది కొన్ని సార్లు.

బ్లాగులంటే తెలియని నన్ను బ్లాగ్ మొదలుపెట్టమన్నావ్. నేనూ గుడ్డిగానే దూకేసాను....ఆ తరువాత తెలిసింది లోతు....బ్లాగ్ జోలికి పోను అని మొండికేసిన నన్ను....ఎన్నో మురిపాల కబుర్లు చెప్పేసి...ఏదేదో చేసేసి... ఉబ్బేసి..స్వీట్స్ పెట్టేసి...ఎలాగో మళ్ళీ దింపేసావ్. ఇదిగో ఇప్పుడిలా ఈదుతున్నాను.

నీ చేయూత నాకు బలమివ్వాలి.....ప్రతి విషయమూ నీ తోనే చెప్పుకోవాలి. అన్నిటికీ నువ్వే అండ కావాలి. ఎప్పుడూ అక్కా...అక్కా అంటుంది....అని నన్ను ఎవ్వరేమన్నా సరే....నీ నీడనే నేను.....నీ దీవెనలు...ఆశీస్సులు ఎప్పటికీ కావాల్సిందే......

నేనేమివ్వాలి....ఏమివ్వగలను.....
ఎదుటివారి సంతోషాన్ని కోరే నీవు...జీవితమంతా సంతోషంగా గడపాలి.
అపకారికి కూడా ఉపకారాన్ని కోరే నీ ఉన్నత మనస్సు తో గొప్ప ఆనందాన్ని పొందాలి....

ఇవాళ మా అక్కకు అరవై ఏళ్ళు వచ్చాయండి....ఎంతో ఆనందంగా పండగ జరగాలి....మా అక్క ఫ్రెండ్స్ ..చాటింగ్...ప్రమదావనం...ఇంకా బజ్జు ఫ్రెండులు....అందరూ ఇక్కడికే వచ్చి తప్పకుండా మీ శుభాకాంక్షలందించాలి... బ్లాగ్ లోకంలోని నా ఫ్రెండ్స్....మా అక్క ఫ్రెండ్స్.....అందరూ వచ్చేయాలి....రాకపోతే నేను చాలా ఫీల్ అయిపోతానన్నమాట..



సత్యవతి గారి ఇంట్లో ఈ సీజన్ లో పూసిన మొదటి బ్రహ్మకమలం పుష్పాన్ని మా అక్కకి ఇచ్చేస్తున్నాను. ఎందుకంటే తనకిష్టం కాబట్టి....అక్కా, సత్యవతి గారేమన్నా అంటే మాత్రం నువ్వే జవాబు చెప్పేసుకో:)

ఇంతకీ మీ అక్క ఎవరు తల్లీ అంటారా...మీ అందరికీ బాగా తెలుసులెండి.....’సాహితీ మాల’. కేకులు, చాకలెత్తులు, బిసెకత్తులు, గట్రా గట్రా ఏమన్నా కావాలంటే మాత్రం మా అక్కనే అడగండేం:

అవునూ..అక్కా, ఇంతకీ నీ బర్త్ డే కి నాకేమిస్తున్నావ్.....

యాపీ యాపీ బర్త్ డే టు యూ......




***********************************************************************************************************************************************

4, జులై 2011, సోమవారం

బాధ్యత...




ఓ కండెమ్డ్ క్రిమినల్ మీద హత్యా ప్రయత్నం జరిగింది. రివాల్వర్ తో పాయింట్ బ్లాంక్ లో కాల్చబడ్డాడతను. ఎమెర్జెన్సీ ట్రీట్మెంట్ కోసమని చావు బతుకుల్లో ఉన్న ఆ ముద్దాయిని పోలీసులు ప్రభుత్వ హాస్పిటల్ లో తగిన సదుపాయాలు లేవని ఓ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కి తీసుకొచ్చారు.

"ప్లీజ్ డాక్టర్! ఇతన్ని ఎలాగైనా బతికించాలి మీరు. ఎంత ఖర్చయినా సరే" అంటూ ప్లీజ్ చేస్తున్న జైలర్ వంక వింతగా చూసారు డాక్టర్లు. "మాకు చాతనయినంత కృషి చేస్తున్నాం. ఆ పైన ఇతగాడి అదృష్టం, ఆయుష్షూనూ"...అని జవాబిచ్చారు.

ఎమెర్జెన్సీ ఆపరేషన్ చేసి బుల్లెట్ తీసేశారు. ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో ఉంచి స్పెషలైజ్డ్ ట్రీట్మెంట్ ఇచ్చారు. అతను బతికి బయటపడగానే మరోవారం రోజులు స్పెషల్ వార్డ్ లో ఉంచి ప్రత్యేకంగా చూసుకున్నారు. దాంతో మనిషి బాగా ఆరోగ్యంగా తయారయ్యాడు.

సాధారణం గా కస్టడీలో ఉన్న ముద్దాయిల గురించి పెద్దగా పట్టించుకోదు ప్రభుత్వం. వాళ్ళు చస్తూ ఉన్నా, ఆ జైలు డాక్టరూ, ఆ రంగునీళ్ళూ, ఆ కల్తీ మందులే తప్ప మరో దిక్కుండదు. హ్యూమన్ రైట్స్ వాళ్ళు ప్రభుత్వం నెత్తిమీద మొట్టినా అతీగతీ ఉండదు.

అటువంటిది ఓ కండెమ్డ్ క్రిమినల్ ని బతికించటం కోసం అంతగా తహ తహ లాడుతూ ఖర్చులకు సయితం వెరవకుండా రూల్స్ నతిక్రమించి ప్రత్యేక వైద్య సదుపాయాన్ని కలిగించడం....అతనికి నయమయేంతవరకూ స్వంత మనుషులకంటే ఎక్కువగా ఆతృత, ఆందోళనా చూపడం....ఆ డాక్టర్లకి, తాము కలగంటున్నామా లేక పోలీసులలో నిజంగానే మార్పు వచ్చిందా అన్న సందేహం కూడా కలిగింది.

ముద్దాయిని డిశ్చార్జ్ చేస్తూ అదేమాట అడిగారు వాళ్ళు. "ముద్దాయిలను జీవంలేని మట్టి సుద్దల్లా ట్రీట్ చేసే వాళ్ళు....ఓ నేరస్తుడి పట్ల ఇంత శ్రద్ద, కన్సర్న్ చూపిస్తున్న మీ సహృదయాన్నీ, మానవతా దృక్పథాన్ని మనసారా అభినందించలేకుండా ఉండలేకపోతున్నాం. మీ లాంటి అధికారులు మరికొందరుంటే మన వ్యవస్థే మారిపోతుంది"...అని ప్రశంసించారు. ఆ జైలర్ కాస్త ఇబ్బందిగా కదిలి...ఆ తరువాత మెల్లగా అన్నాడు...."సార్! ఇది నా బాధ్యత. ఇతను మల్టిపుల్ మర్డర్ కేసులో మరణశిక్ష పడిన ఖైదీ. వచ్చేవారమే ఇతనికి ఉరిశిక్ష. ఉరితీసేలోగా చావకుండా చూడటం మా భాద్యత. అందుకే ఈ పాట్లన్నీ!"....ఆ....అంటూ, నోళ్ళు వెళ్ళబెట్టారు డాక్టర్స్.

( ఆ మధ్య చదివిన ఒక న్యూస్ ప్రేరణ తో......ఈ మధ్యనే నేను జువెనైల్ హోమ్ లో బాల నేరస్తుల కష్టాలు కళ్ళారా చూసిన ఆవేదనతో....)





*****************************************************************************************************

20, జూన్ 2011, సోమవారం

పక్షి గోల!!!





మనం రోజూ మాట్లాడుకొనే మాటల్లో పక్షులకు సంబంధించినవి చాలా ఉన్నాయి. అవి గుర్తుకు తెచ్చుకుంటె ఎంత తమాషాగా ఉంటుందో.... చూడండీ, మీకైతే ఇంకా చాలా తెలుసు. కలిపించి కల్పించి...కల్పించుకొనీ మరీ చెప్పుకోవచ్చు.

అబ్బా! ఏమిట్రా కాకిగోల, బయటికి వెళ్ళి ఆడుకో.
వాడి చూపులు మండ! గుడ్లగూబలా అలా చూస్తాడేం?
నీ డబ్బు వాడికి చూపించకురా వాడు చూసాడంటే డేగలా ఎత్తుకుపోతాడు.
వడ్రంగి పిట్టలా తలుపు టకటకా కొడతావెందుకురా?
ఆ వాళ్ళకేంటి హాయిగా చిలకా గోరింకల్లా ఎంత హాయిగా ఉన్నారో.
ఆహా ఏమిటా స్వరం, కోకిల స్వరంలా.
ఏమిటా అరుపులు ఊరపిచ్చుకలా.
నామీదనాండీ మీ కోపం పిచ్చుకపై బ్రహ్మాస్త్రంలా!
ఇది నలుగురికీ తెలిస్తే ఏమన్నా వుందా!!! లోకం కోడై కూస్తుంది.
ఇకచాల్లేవోయ్ కొంగ జపం.
ఆహా ఏమిటా నడక, హంస నడకలా....
పాపం అతన్ని చూడు రెక్కలు తెగిన పక్షిలా ఎలా విల విల్లాడుతున్నాడో...
వాళ్ళిద్దరికీ అస్సలు పడదండీ ఆ ఇంటి మీద కాకి ఈ ఇంటి మీద వాలదు.
చకోర పక్షిలా ఎదురుచూస్తునే ఉన్నాడు. అయినా పాపం ఇంకా ఉద్యోగం రాలేదు.

బాగున్నాయా....ఏవిటీ నీ పక్షి గోల అంటారా...సరేనండి...ఇంక ఆపేస్తాను:)

మీరు కూడా కొన్ని చెప్పొచ్చుగా!!!!!!




***********************************************************************************

9, జూన్ 2011, గురువారం

నింగికెగిసిన నవీనాంధ్ర

"దేశమంటే మట్టి కాదోయ్
దేశమంటే మనుషులోయ్
ముత్యాల సరాలల్లె ముచ్చటైన కవితలల్లిన
నవయుగ వైతాళీకుడు "గురజాడ".

"ఏదేశమేగినా ఎందుకాలిడినా
ఏ పీఠమెక్కినా ఎవ్వరెదురైనా
పొగడరా నీ తల్లి భూమి భారతిని"
అంటూ రమ్యలోకాన అమరప్రేమను చాటిన
మన యుగకర్త "రాయప్రోలు"

ఆంధ్ర కవితల అలరించి
గోదారి అలలపై నిదురపుచ్చి
అందమైన సొగసు తొడిగిన
ఎంకి పాటల "నండూరి".

ఆధునిక సమాజపు అలజడులపై
వేయిపడగలెత్తి బుసకొట్టి
రామాయణ కల్పవృక్ష శాఖల
జ్ఞానపీఠమెక్కాడు మన "కవిసామ్రాట్"

ఏదేశ చరిత చూసినా ఏమున్నది గర్వకారణం
అంటూ చరిత్రకు నూతన అర్ధాన్ని ఇచ్చి
"నేను సైతం ప్రపంచాగ్నికి
సమిధనొక్కటి ఆహుతిచ్చా"
అంటూ జగన్నాధ రధమధిరోహించి
మరో ప్రపంచ ’మహాప్రస్థానం’ చేసిన
విప్లవకవి శ్రీ శ్రీ.

"నా తెలంగాణ కోటి రతనాల వీణ"
అని "రుద్రవీణ"ను
అగ్ని ధారలు కురిపించిన
మహారధి "దాశరధి".

పుష్పవిలాపాన పూలబాధలు తెలిపి
అహింసా తత్వ భాష్యాన్ని ప్రవచించి
జగతిన సుస్థిరమై నిలిచాడు
కరుణారస కవి "కరుణశ్రీ".

ఆకులో ఆకై పూవులో పూవై
ఊర్వశి హృదయ తరంగాలను తాకి
కవితా సుందరిలో వలపు రగిలించిన
భావుకుడు "కృష్ణశాస్త్రి"

కర్పూరవసంతాలతో
కమ్మని కవిత్వ మందించి
విశ్వంభరలో విశ్వమానవ పరిణామం
విపులంగా చూపించి
కవితా నర్తనమాడిన
నవ కవన చక్రవర్తి "సి.నా.రె".

తెలుగు భాషకు సాహిత్యానికి ఔన్నత్యాన్ని పెంపొందించి... గౌరవస్థానం కల్పించి, ఆంధ్రదేశం పట్ల మమకారాన్ని పెంచి, చక్కటి గుర్తింపు నిచ్చిన ఈ మహానుభావులు...ఎందరో,ఎందరో, ఇంకెందరో మహాను భావులు...అందరికీ వందనాలు......ఈ వైభవం కలకాలం నిలవాలి. ఎన్నో తరాలు తరించాలి. (ఈమధ్యే ఇవన్నీ చదువు.....తూ....ఉన్నాను)

*********************************************************************************

2, జూన్ 2011, గురువారం

మార్పు

అనాదిగా ఆడది అబల గానే చూడబడుతుంది.

కార్యేషు దాసి, భోజ్యేషు మాత, కరణేషు మంత్రి, శయనేశు రంభ...ఇలా స్త్రీ గురించి ఎంత చెప్పినా ఆమె స్థానం మాత్రం అట్టడుగునే. సహనం అణకువ పేరుతో స్త్రీ తనకుతానే పురుషునికి లొంగి ఉంటుంది.

అగ్నిప్రవేశం చేయమని సీతని రాముడు ఆజ్ఞాపించినప్పుడు నీ శీలాన్ని కూడా నిరూపించుకో అని ఆనాడే సీత అడిగి ఉంటే....జూదంలో ఓడింది నీవే, నాకెందుకీ శిక్ష అని ద్రౌపది ఎవరినో ధర్మసందేహాలడిగే బదులు, ఆనాడే ధర్మరాజుని నిలదీసి ఉంటే, ... సత్యాన్ని నిరూపించుకోవలసింది నీవు, కనుక నీవే అమ్ముడుపో, నన్నెందుకు అమ్ముతున్నావని ఆనాడే చంద్రమతి ఎదిరించి ఉంటే ....ఇప్పుడెలాఉండేది?

ఆ స్త్రీలను ఆదర్శంగా పెట్టుకున్న నేటి స్త్రీలకు ఈ దుస్థితి పట్టేదికాదు.

భర్త ప్రాణాల కోసం యముణ్ణే ప్రాధేయపడిన సావిత్రి ఉంది కాని....భార్యకోసం పోరాడిన ఒక్క పురుషుడున్నాడా?

కురూపి అయిన భర్తను నెత్తిన పెట్టుకొని తిరిగిన సుమతి ఉందిగాని అనాకారి అయిన భార్యకు సేవలుచేసే భర్త ఎక్కడున్నాడు?

సతికి పతియే ప్రత్యక్ష దైవమైనప్పుడు పతికి సతి ప్రత్యక్ష దేవత కాదా?

పురుషుని అవసరం స్త్రీకెంతో...స్త్రీ అవసరం పురుషునికీ అంతే కదా!!!!

ఇంత చూసినా, స్త్రీ తనను తక్కువగానే అంచనా వేసుకుంటుంది. పురుషునికి ప్రత్యేకతను ఆపాదించి పెడుతుంది.

భర్తల కోసం మనసులనే చంపుకున్న సీత, ద్రౌపది, చంద్రమతులను ఆదర్శంగా పెట్టుకున్నారెందుకో....

నరకాసురున్ని వధించిన సత్యభామ, ధీరుల్ని ఎదిరించిన పల్నాటి నాగమ్మ, రాణీ రుద్రమలను ఎందుకు స్త్రీలు ఆదర్శంగా చేసుకోరు.

పురుషులకు ఆధిక్యతను మనమే ఇస్తూ స్త్రీలను పురుషులు చిన్నచూపు చూస్తున్నారని వారిని నిందించడమెందుకు? ఒకరకంగా ఆస్థితిని వారికి మనమే కల్పిస్తున్నాం. మగవారిని అందలమెక్కిస్తున్నాం.

స్త్రీకి స్త్రీయే శతృవైనప్పుడు, ఎదుటి స్త్రీయొక్క ఆదిక్యతను ఓర్చుకోలేని స్త్రీలున్నప్పుడు...కట్నం కోసం కోడల్ని చంపే అత్తలున్నప్పుడు, స్త్రీని స్త్రీయే చిన్నచూపు చూస్తున్నప్పుడు... పురుషులు మాత్రం చిన్న చూపు ఎందుకుచూడరు? ఇంట్లో సమస్యలు స్త్రీల ద్వారా ఏర్పడవచ్చు....కాని, బయట స్త్రీకి సమస్యలేర్పడినప్పుడు, స్త్రీలే ముందడుగేస్తున్నారు. ఆ స్త్రీకి రక్షణ ఏర్పరుస్తున్నారు.

అందుకే రావాలి మార్పు. అది ఎలా ఉండాలి? ఇటువంటి ధర్మోపన్యాసాలు వాసనలేని పూలు. మనసు అహంకారంతో నిండి ఉంటే అసూయ హింసిస్తుంది. నేటి వైఫల్యాన్ని రేపటి గుణపాఠంగా భావించాలి. కేవలం పుస్తకాలే చదువకుండా, మనుషులని చదవాలి. మనల్ని మనం చదువుకోవాలి. సరి అయిన ఆశయాన్ని ఏర్పరుచుకోవాలి. మన ఆశయమే మన విలువను తెలియజేస్తుంది. కృషితో నాస్తి దుర్భిక్షం. మహిళా ప్రపంచానికే మకుటాయమానమైన విశ్వమాత మదర్ థెరిసా లాంటి మహనీయులను అనుసరిస్తే ....ఇటువంటి మానవతా మూర్తులను యుగయుగాలు స్మరించుకుంటారు.

ఇది స్త్రీ వాదం కాదు ...ఆడామగ పోటీ అసలే కాదు. వితండవాదం కాదు కావాల్సింది. ప్రపంచానికే మకుటాయమానమైన ఆ స్త్రీమూర్తుల విజ్ఞత తెలుసుకోవాలి. మనలో వ్యక్తిత్వం పరిమళించాలి. పరిపూర్ణత సంపాదించుకోవాలి. ప్రయత్నిస్తే ప్రతి ఒక్కరూ ధృవతారలుగా వెలిగే అవకాశం లేదా? రామాయణ, భారతాలేగా సంఘానికి పునాది వేసింది. ప్రపంచంలోనే భారత స్త్రీకి ప్రత్యేకస్థానం ఉందంటే...ఒక గౌరవ స్థానం సంపాదించుకుంది అంటే కారణం, మనం నిత్యం కొలుచుకుంటున్నఈ దేవతా మూర్తులు కాదా!!!

కృత, త్రేతా, ద్వాపర, కలి యుగాల చతుస్పాదాలుగా గల ధర్మదేవత నేటి కలియుగమందు అంగవికలమయింది, కుంటి నడక సాగిస్తోంది. ఇంకా అప్పటి ఇప్పటి పోలికలెందుకు? అయినా...ఇంకా పెరిగిపోతున్న అంతరాలను ఎలా తొలగించాలి? ఎన్నో రంగాలలో అభివృద్ధి సాధించిన స్త్రీ ఎందుకు చులకనగా చూడబడుతోంది? ఎన్నో బాధ్యతలను నిర్వర్తిస్తున్న స్త్రీ గౌరవాన్ని ఎందుకు కాపాడుకోలేకపోతోంది? ఎన్నో విషయాల్లో పురుషులకన్నా స్త్రీలే ముందజలో ఉన్నా...సంఘంలో అణగదొక్కబడుతున్న స్త్రీలే ఇంకా ఎందుకు ఎక్కువగా ఉన్నారు? స్త్రీ అబల కాదు సబల...అని ఎలా నిరూపించాలి? ఎందుకు...ఎన్నో విధాలుగా ఇంకా బలి అవుతూనే ఉన్నారు? ఇవి నాకు కలుగుతున్న అనుమానాలు. ప్రతి రోజూ చూస్తున్న వింటున్న సంఘటనలు....నా బాధని పెంచుతున్నాయే కాని నా ప్రశ్నలకు సమాధానాలు దొరకటంలేదు. ఇంక పరిష్కారం అన్నదే లేదా!!!!

ఈనాటి స్రీల సమస్యలకు ముగింపు లేదా!!! అలా పెరిగిపోతూనే ఉండాలా!!!! సమస్యలను తీర్చుకోలేనివారు గతకాలాన్ని విమర్శించాల్సిందేనా?

(ఈ మధ్య మాలో మాకు జరిగిన ఇటువంటి వాదోపవాదాలు విన్నాక వ్రాయాలనిపించి, ఈ విధంగా మీ ముందు ఉంచుతున్నాను)

"All Nations have attained greatness, by
paying proper respect to women. That country
and nation which does not respect women
has never become great, nor will ever be in future".... Swami Vivekananda


***********************************************************************************************

15, మే 2011, ఆదివారం

" GREAT ESCAPE"

కేరళ లో నేను......

హాయ్ ఫ్రెండ్స్.....బాగున్నారా...నేను చూసినవన్నీ మీరూ చూసేయాలని నా కోరిక....మీరు అంతకుముందు చూసేసినా సరే....ఎప్పుడూ చూడనేలేదనుకొని...నా కనులు మీవిగా చేసుకొని మంచి పిల్లల్లాగా చూసేయాలి:)......ఇన్ని ఫొటోలా...అనకండి....ఎందుకంటే అన్ని ఫొటోలు తీసానన్నమాట......ఇంక చాలానే వదిలేసానులెండి....











కొచ్చిన్ నుంచి మున్నార్ దారిలో, కలడీ గ్రామం దగ్గరి పూర్ణా నదీ తీరంలో శ్రీ ఆది శంకరాచార్యులవారి జన్మస్థలం. కేదారీనాథ్ లో వీరి సమాధి ఉంది. అది దర్శించే భాగ్యం కూడా నాకు కలిగింది. (కాకపోతే ముందు సమాధి ఆ తరువాత జన్మస్థలం చూసానన్నమాట)



మున్నార్ అడవుల్లో జలపాతాలు....."వర్షం లో వాటర్ ఫాల్స్"



ఇంత చిక్కటి అడివి....ఏ దిక్కు ఏవిటో......దిగి కింద దాకా వెళ్ళిపోతే నాచురల్ పూల్ కూడా ఉంది. స్విమ్మింగ్ కూడా చేయొచ్చు. కాకపోతే ఎప్పుడు ఎటునుంచి ఎటువంటి జంతువులొస్తాయో చెప్పటం మాత్రం కొంచెం కష్టం. కాని, చుట్టూ ఉన్న సుగంధ ద్రవ్యాల చెట్లు...వాటి సువాసన మాత్రం మిమ్మల్ని అక్కడే కట్టేస్తుంది:)



ఇదే మున్నార్ అడవుల్లోని ఫారెస్ట్ హెవెన్ రిసార్ట్...




ఇక్కడినుంచి బాగుంది కదూ.....ఇలా అయితే ఏ జంతువులూ మన దగ్గిరికి రావు.




మున్నార్ లోని స్పైసీస్ గార్డెన్ లో ఎన్నో సుగంధ ద్రవ్యాల చెట్లు. ఇవి ఇలాచీలు. ఇంకా చాలా ఉన్నాయి. ఈ తోటలో కాసేపుతిరిగామంటే చాలు ఏ రోగాలూ రావనిపిస్తాయి. ఆ సువాసనలు ఎన్నటికీ మరిచిపోలేముకూడా. నేనైతే ఎన్నో స్పైసీస్ తెచ్చుకున్నాను. రకరకాల పులావ్ రైస్ లు చేసుకోవచ్చు....



ఇది టచ్ మి నాట్....చూడండి ఎంత బాగుందో....ముట్టుకుంటేనే ఎలా ముడుచుకుపోతోందో....పూలు చూడండి, ఎంత మురిపెంగా ఉన్నాయో.....





ఇదిగో ఇవే చాలా ఫేమస్ టీ ఎస్టేట్స్......నేను కూడానెత్తికి బుట్ట తగిలించుకొని వాళ్ళకి చాలా హెల్ఫ్ చేసానన్నమాట.....ఎంతమంచిదాన్నో కదా:)







నేను చూసిన పూలతోటల్లోని కొన్ని పూలు....అబ్బో ఎన్ని రంగులో....ఎన్ని పూలో....నేను చెప్పలేను. ఫ్రకృతి అంతా ఎంతో దూరం అలా అలా పరుచుకొని...ఎన్నో అందమైన తివాచీల మీద కొత్తకొత్త డిజైన్స్ చిత్రిస్తోంది.....



Eravikulam National Park కొండల మీద దారిలో జింకలు.....






నేషనల్ పార్క్ కొండల మీద అలా అలా పోతూఉంటే మేఘాలు కూడా ఇలా ఇలా మాతోటే వచ్చాయి.....



తెక్కడీ లో ఏనుగులు......





తెక్కడి లో నేను చూసిన కథకళీ.....





అలెపీ లో నేనున్న చిన్న ఐలాండ్ లోని బ్యాక్ వాటర్ హెరిటేజ్ రిసార్ట్.....బయటి ప్రపంచంతో సంబంధమే లేదు.







ప్రపంచమే మరపించిన బాక్ వాటర్స్ విహారం....





ఎంత అందంగా ఉందో....అదిగో బోట్ హౌజ్ కూడా ఉంది.....ఎన్ని రకాల బోట్ హౌజ్ లో...ఎన్నిసౌకర్యాలో...





పోర్ట్ సిటీ కొచ్చిన్ లో సెంట్ ఫ్రాన్సిస్ చర్చ్ (వాస్కోడగామా)....ఇక్కడ ఒక పెద్ద Old Jews Street, వాళ్ళ Cemetery కూడా ఉంది. ఇక్కడి బజార్లో పాత Antique వస్తువుల దుకాణాలు వరుస పెట్టి ఉన్నాయి. చివరికి పాత Snake Boats కూడా ఇక్కడ అమ్ముతున్నారు. 16 వ శతాబ్దం లోని Jewish Synagogue, ఈ చర్చ్ కూడా బాగుంది.




చైనీస్ ఫిషింగ్ నెట్......అబ్బే ఇక్కడ మాత్రం అస్సలు బాలేదు.....సముద్రపుటంచులలో తెగిపోయిన కోళ్ళ కాళ్ళు ఎన్ని ఉన్నాయో......ఇంకా కొట్టుకొస్తూనే ఉన్నాయి కూడా....



భూమి గుండ్రముగా ఉండును...అంతేగా మరి...బ్యాక్ టు ది పెవిలియన్...:(...:(...:(..









************************************************************************************



 

మనస్వి © 2008. Template Design By: SkinCorner