20, జనవరి 2011, గురువారం

ఈ కోరిక తీరాలా!!!

నాలోని నవరసాలు - కరుణ




పార్క్ లో అలా మెల్లిగా అన్నివైపులా చూసుకుంటూ, ఏదో లోకంలో ఆలోచించుకుంటూ ముందుకు పోతున్నాను. ఇంతలో చాలా గట్టిగా ఓ పాట వినిపిస్తోంది.. ...జీజమ్మ జీజమ్మా అమ్ముకున్నా చీకతిలో..తుమ్ముకొచ్చే ఎలుగువమ్మా...గజ్జ కత్తి కచ్చి పడితే...తిత్తు రేపీ పాడు అమ్మా.నీ కన్ను తురిమి చూడగానే ..జేజిమ్మా...మాయమ్మా....ఓయమ్మా...మాయమ్మా...జేజమ్మా...మా జోజమ్మా.... అంటూ. విన్న పాట లాగే ఉంది గాని ఆ పదాలేవిటో అర్ధం కాలేదు. మహా కర్ణకఠోరంగా ఉంది. వెనక్కి తిరిగి చూసాను. అక్కడే మూలకి ఒక అమ్మవారి గుడి ఉంది. గ్రిల్స్ మూసి ఉన్నాయి. వాటి సందుల్లోంచి, చేతులు ఇరికించి లోపలికి చాపి చాలా ఆవేశంగా జేజమ్మ పాట పాడుతున్నాడు ఓ ఏడెనిమిదేళ్ళ అబ్బాయి. ఎంతో బాగా ఖూనీ చేస్తూ మరీ పాడుతున్నాడు ఆ పాటని. వాడి చుట్టుపక్కల ఎవరూ లేరు. ఒకసారి వాడిమొహం చూడాలనిపించి దగ్గరికెళ్ళాను. వాడి మొహం గ్రిల్స్ లో ఇరికించి మరీ పాడుతున్నాడు. భుజం మీద చేయివేసి వెనక్కి తిప్పాను. గిర్రున తిరిగి చాలా కోపంగా నా వైపు చూసాడు. వాడు గుడ్లురిమి మరీ నన్ను చూస్తున్నాడు. అంత కోపమెందుకా అని తెల్లబోయి చూసాను. అంతే కాదు వాడి కళ్ళనిండా నీళ్ళు నిండి ఉన్నాయి. నా చేతులు బలంగా తోసేస్తూ...మా అమ్మను సంపేయాలా...అన్నాడు. అద్దిరిపోయాను. ఏమీ అర్ధం కాలేదు.

ఈ లోపలే ఇంకో ఇద్దరు ముగ్గురు చేరారు. ఎవరో ఓ పెద్దాయన అడిగారు, ఏమయింది బాబూ అని. నీ కెందుకు బే ...అన్నాడొక్కసారిగా. వాడి భాషకు పాపం ఆయన తల్లడిల్లి కొంచెం వెనక్కి తప్పుకున్నారు. వాడిలో అంత విసురు చూసాక ఇంక ఎవ్వరూ ధైర్యం చేయలేకపోయారు. వాడు మళ్ళీ గ్రిల్స్ లో చేతులు దూర్చేసి, ఈసారి ఇంకా గొంతు పెంచేసాడు. వాడికేదో చాలా పెద్ద సమస్యే ఉందనిపించింది.
ఇంతలో ఒకబ్బాయి, అంకుల్ వాళ్ళమ్మ అక్కడే ఉంది అన్నాడు. దూరంగా ఒకావిడ శూన్యంలోకి చూస్తూ చాలా అతీతంగా కనిపించింది. కూలీనాలీ చేసుకునే ఆవిడ లాగుంది. వాడి గొంతు భరించలేక ఒకాయన ఆవిడ్ని పిలిచారు. ఏంటమ్మా..ఏమయింది, ఏంటీ గోల అన్నారు. ఆవిడేం మాట్లాడలేదు. ఏంటమ్మా, చూడు వాడెట్లా గొడవ చేస్తున్నాడో...నువ్వేంచెప్పకపోతే ఎట్లా అంది ఒకావిడ. అప్పటికీ ఆమేం మాట్లాడలేదు. ఇంకా ఏం చేయాలో ఎవరికీ తెలీక ఒక నిముషం అక్కడ మౌనం రాజ్యమేలింది. కాని వాడి పాట భరించలేక పోతున్నాము.

ఆమె మెల్లిగా అక్కడినుంచి వెళ్ళిపోతోంది. ఎవరికీ ఏమీ అర్ధంకాలేదు. ఇంతలో వాచ్మన్ వచ్చి ఆమెతో, తుమ్హారా లడకాకో లేకే బాహర్ చలేజావ్, జల్దీ...అన్నాడు. ఆమె ఏమాత్రం పట్టించుకోకుండా, నిర్లిప్తంగా, మెల్లిగా నడుచుకుంటూ వెళ్ళిపోతోంది. ఎవరోవెళ్ళి ఆ అబ్బాయిని బలవంతాన గ్రిల్స్ లోంచి బయటికి లాగారు. వాడు విపరీతమైన కోపంతో, అరె ఓ సైతాన్...అంటూ, ఎగిరి ఒక్క తన్ను తన్నాడు. బిత్తరపోయి కిందపడిపోతున్న ఆయన్ని పక్కన వాళ్ళు అతి కష్టం మీద ఆపగలిగారు. ఇంక చూస్తున్న వాళ్ళ ఓపిక నశించిపోయింది. ఆయన వాడిని చేతులు వెనక్కి విరిచి పట్టుకొని, ఏవమ్మా...అలా వెళ్ళిపోతావ్. నీ మొగుడు బాగా తాగొచ్చి వీడ్ని కొట్టాడా ఏంటి....ఇట్లా ఊరిమీద పడ్డారు ఇద్దరూ...అని కోపంతో అరిచాడు.

ఒక్కసారిగా భళ్ళున పగిలిన ఆ తల్లి హృదయం బయట పడేసిన జీవన సత్యం ఇదే.....

వాళ్ళు ఉంటున్న స్లమ్ ఏరియా గవర్నమెంట్ ది. పొద్దున్నే వాళ్ళ గుడిసెలన్నీ కూల్చేసారు. ఉన్న ఒక్క పెట్టె, కొంచెం వంట సామాను పాడైపోయాయి. ఆ పెట్టెలో వాడినెంతో ప్రాణపదంగా చూసుకొనే...తన కళ్ళముందే భవంతి నిర్మాణం లో అనుకోకుండా పైనుంచి కిందపడి చనిపోయిన ... వాళ్ళ అయ్య ఫొటో ఉంది. అది ఎందుకూ పనికి రాకుండా పూర్తిగా చినిగిపోయింది. పొద్దుటినుంచి తినక పోయినా, ఉండటానికి చోటులేకున్నా వాడికి బాధేలేదు. వాళ్ళ నాన్న ఫొటో మళ్ళీ తేలేని తల్లిని చచ్చిపొమ్మంటున్నాడు. మాటలు కూడా సరిగా రాని వాడికి తన జీవితంలో మంచికీ చెడుకీ అన్నిటికీ , ఎప్పుడూ తన కళ్ళముందుండే తల్లే కారణమనుకుంటున్నాడు. కాని ఉన్న ఆ ఒక్క నీడకూడా వాడికి లేకుండా పోతే ...తరువాత ఏమిటి అన్న ఆలోచనే లేక వాళ్ళ నాన్న కోసం, అమ్మ మీది కోపంతో తనకు వచ్చిన పాటతో ఆ దేవతను వేడుకుంటున్నాడు. వాడికళ్ళల్లో బాధ...ఉక్రోషం...ధ్వేషం... ప్రజ్వరిల్లిపోతోంది.......

ఇపుడు ఎవరి తల్లో జేజమ్మ దిగివచ్చి వాడి బాధ తీర్చాలి? తాను క్షణాల్లో పోగొట్టుకున్నది జీవితమంతా ఎదురుచూసినా మళ్ళీ పొందగలడా!!!! ప్రేమరాహిత్యానికి మించిన శిక్ష మనిషికి ఉందా!!!!!

కొంచెం కళ్ళు మూసుకోండి....ప్లీజ్...ఇది జరగకపోతే బాగుండు..........


***********************************************************************************

1, జనవరి 2011, శనివారం

జ్ఞాపకాల నీడలు....




మిత్రులందరికీ...మనసారా... హృదయపూర్వక... నూతనసంవత్సర శుభాకాంక్షలు.....

నూతన సంవత్సర వేడుకలు అంటే నాకు బ్లాక్ అండ్ వైట్ పాత సినిమాల్లో లా గిర గిరా గింగిరాలు తిరుగుతున్న ఆ చక్రాలు నన్ను తీసుకెళ్ళి నేను బరోడాలో రీసెర్చ్ చేస్తున్న రోజుల్లో ఆపేస్తుంది. హాస్టల్ జీవితం, మా స్నేహాలు నన్ను, గుర్తుకొస్తున్నాయి.....అంటూ అక్కడే ఆగిపొమ్మని వెనక్కి పిలుస్తూ ఉంటాయి....అదే అంతం...అదే ఆరంభం....

మేము అయిదుగురు ఫ్రెండ్స్ ఉండే వాళ్ళం. నేనూ, మంజు, జస్పాల్, నీహాల్, పురుషోత్తం. ఎమ్.ఎస్. యూనివర్సిటీలోరీసెర్చ్ చేస్తూ ఉండగా అక్కడే మాకు మంచి స్నేహం కలిసింది. మా సబ్జెక్ట్స్ ఒకటి కాకపోయినా మా స్నేహం ఎలా కలిసిపోయిందో నాకే గుర్తు లేదు. జస్పాల్ పంజాబ్ అమ్మాయి. మా ఇద్దరికి ఎక్కువగా బాంబే ట్రిప్స్ ఉండేవి. మంజు తమిళమ్మాయి. నా రూంమేట్. తెలుగు బాగా వచ్చు. పురుషోత్తం పక్కా తెలుగు. ఇంకపోతే నీహాల్ గుజ్జూ..అంటే గుజరాతీ. మంజూ, పురుషోత్తం పెళ్ళి చేసుకో బోతున్నారని నాకు మాత్రమే తెలుసు. రోజూ మంజు రాత్రిపూట మేము వర్క్ చేసుకుంటున్నప్పుడు రకరకాల టీలు చేసిచ్చేది. బ్లాక్ టీ..ఒక్కోసారి అందులో పల్లీలపొడి కలిపేది. ఇంకోసారి ఏలకులు కలిపేది. ఇలాగే చాలా ప్రయోగాలు చేసేది. అవన్నీ నాకు ఎంతో రుచిగా అనిపించేవి. ఇప్పటికీ తన చేతి టీ రుచి మళ్ళీ ఎక్కడా దొరకలేదు.

రోజూ సాయంత్రం కాగానే నీహాల్, పురుషోత్తం మా హాస్టల్ దగ్గరికొచ్చేవారు. రీసెర్చ్ స్కాలర్స్ ఏ టైం కయినా బయటికి పోవచ్చు. యూనివర్సిటీ పొడుగునా మధ్యలో రోడ్, అటువైపు ఎంతో అందమైన కమాటీ బాగ్ ఉండేది. రాత్రి పదింటికి అక్కడికి పోయి కూర్చుని కబుర్లేసుకునేవాళ్ళం. రోడ్ పక్కనే ఉన్న టీ బంక్ లో అక్కడే కూచుని వేడి వేడి టీ చేయించుకొని తాగేవాళ్ళం. ఆ పక్కనే ఒక చాట్ బండి కూడా ఉండేది. అది ఎంతో ఇష్టంగా తినేవాళ్ళం. ముఖ్యంగా ఉల్లిగడ్డను ఒడుపుగా పట్టుకొని ఒక చిన్న అబ్బాయి చకాచకా సన్నటి ముక్కలు కోసేయటం నాకు భలే నచ్చేది. ఎన్నోసార్లు ఆ అబ్బాయి దగ్గిర నేర్చుకోవాలని మేము ప్రయత్నించాం కాని, నీహాల్ ఒక్కడే చాలా చక్కగా ఆ టెక్నిక్ నేర్చుకున్నాడు.

నూతన సంవత్సరం అని అందరూ రకరకాల సందడితో ఎక్కడెక్కడికో పోతుంటే మేము మాత్రం ఆ గార్డెన్ లోనే గడపాలనుకున్నాం.
ఆరోజు కూడా అలాగే పార్క్ లోకి చేరుకున్నాం. మాకు ఎంతోనచ్చే కలర్ ఫౌంటెన్ దగ్గర కూచున్నాం. ఒక వైపు చక్కటి గడ్డి, ఇంకోవైపు ఇసుకతో చాలా బాగుంటుంది ఆ చోటు. అక్కడే గడ్డిమీద ఎత్తుగా ఒక గడియారం పెద్ద పెద్ద ముల్లులతో ఏర్పాటు చేసారు. ఆ రాత్రంతా రకరకాల ఆటలతో గడిపేయాలనుకున్నాం. వాళ్ళకే ఆటలు తెలియవు. అందుకే నేనూ మంజూ లీడింగ్ తీసుకున్నాం. తెలుగులో ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతూ వాళ్ళను నానా తికమక పెట్టేసాం. ఇంక మేమాడిన ఆటలు ఏంటో తెలుసా!!!

(ఈ పాటలన్నింటిలో కూడా దీర్ఘ వ్యాధులను తగ్గించే ఆయుర్వేద ఔషధాల గురించే ఉంటుంది (మెడిసినల్ ప్లాన్ట్స్.) గమనించండి)

అందర్నీ కాళ్ళు జాపుకొని కూచోమని...కాళ్ళ గజ్జి కంకాళమ్మా...
వేగూ చుక్కా వెలగా మొగ్గా
మొగ్గా కాదూ మోదుగ నీరు
నీరూ కాదు నిమ్మల వాయ
వాయా కాదు వాయింట కూర
కూరా కాదు గుమ్మడి పండు
పండూ కాదూ పాపాయి కాలు....లింగూ లిటుకూ పందమేల పటుకూ...
కాలూ తీసీ కడగా పెట్టుకో.....అని ఆడించి వాళ్ళందరితో ఒక్కో కాలే మడత పెట్టించి, మేము మాత్రం మా దగ్గిరికొచ్చే సరికి మా కాళ్ళమీద చేయి ఆనించకుండా..చివరికి ఆ ముగ్గురితో నీల్డౌన్ చేయించాం. మేము చెప్పినట్లల్లా ఆడుతున్న ఆ ముగ్గురినీ చూసి మాకు భలే సరదా వేసింది. అందుకని ఇంకో ఆట మొదలుపెట్టాం. అదే....
చెమ్మా చెక్కా చారడేసి మొగ్గా
అట్లుపోయంగ ఆరగించంగా
ముత్యాల చెమ్మచెక్క ముగ్గులేయంగా
రాత్నాల చెమ్మచెక్క రంగులేయంగా
పగడాల చెమ్మచెక్క పందిరేయంగా
పందింట్లొ మా బావ పెళ్ళి చేయంగ
సుబ్బరాయుడి పెళ్ళి...చూచి వత్తము రండి
మా ఇంట్లొ పెళ్ళి..మళ్ళీ వత్తము రండి....
దొరగారింట్లో పెళ్ళి దోచుకు వద్దాం రండి....అని చక్కగా వాళ్ళతో చెమ్మచెక్క ఆడించాం. నీహాల్ అయితే ఎంత ముద్దుగా ఆడాడో:)
ఊహూ.. మాకు తృప్తి కలగ లేదు. వీళ్ళతో బిస్తి గీయిద్దామా మంజూ అని మెల్లిగా అడిగితే తను అంతకంటే హుషారుగా ఒప్పుకుంది. ఇంకేముంది మళ్ళీ ఇంకో ఆట మొదలయ్యింది. అదేనండి.....
ఒప్పులకుప్పా వయారి భామా
మినపా పప్పు.. మెంతీ పిండి
తాటీ బెల్లం ...తవ్వెడు నెయ్యి
గుప్పెడు తింటే ...కులుకూలాడి
నడుమూ గట్టె... నా మాట చిట్టి
సన్నబియ్యం.. చాయ పప్పు
కొబ్బరికోరు..బెల్లపు అచ్చు
చిన్ని మువ్వ... సన్నగాజు
రోట్లో రూపాయ్ నీ మొగుడు సిపాయ్
రోట్లో తవుడు...నీ మొగుడెవరూ....అని చేతులు పట్టుకొని గిర గిరా తిరిగాం. జస్పాల్ కి ఈ ఆట భలే నచ్చింది. నీ మొగుడెవరూ అంటూ నీహాల్ వెంట పడింది. మేము నవ్వలేక చచ్చాం.ఎంతో ఆనందంగా మనమయిదుగురం మా పంజాబ్ లోని అయిదు నదులం కదూ అంది...పరవశంగా కళ్ళు మూసుకొని. పురుషోత్తం ఊరుకుంటాడా...నేనే నదో చెప్పవా..జీలమా..చీనాబా....కాదు కాదు నేను సట్లెజ్ అని నిహాల్ అంటూ నవ్వుకోటం మొదలుపెట్టారు. పాపం జస్పాల్ చాలా ఉడుక్కొంది. అప్పటికే గిరగిరా తిరిగిన నీహాల్ కళ్ళు తిరగటం తో ఇంక కూచొని ఆడుకొందాం అని డిసైడ్ అయ్యాం.
గుడు గుడు కుంచెం గుండే రాగం
పాములపట్నం పడగే రాగం
చిన్నన్న గుర్రం చిట్టికి పోయే
పెద్దన గుర్రం పెళ్ళికి పోయె
మా అన్న గుర్రం మా ఇంటికొచ్చే ...అని ఒకళ్ళ చేతిమీద ఇంకోళ్ళు గుప్పిట్లు మడిచిపెట్టుకొని ఆ ఆట అడుకున్నాం. ఇంతలో దూదూ పుల్ల ఆట ఆడదాం అంది మంజు. ఇంకేముంది..హాయిగ ఇసుక దగ్గరగా పోగుచేసి పొడుగ్గా చేసాం. దూదూపుల్ల...దురాయ్ పుల్ల...చూడాకుండా జాడా తీయ్....ఊదాకుండా పుల్లా తీయ్....అని వాళ్ళకు తెలియకుండా పుల్లను అందులో దాచేసి, రెండు చేతుల వేళ్ళు మడిచి ఎక్కడో అక్కడ మూయాలి. వాళ్ళు మూసిన చోట పుల్ల ఉంటే వాళ్ళు గెలిచినట్లు లేకపోతే వాళ్ళ కళ్ళు మూసి దోసిట్లో ఇసుక పోసి అందులో మళ్ళీ ఒక పుల్ల ఉంచి, ఎంతెంత దూరం అని వాళ్ళతోటి అడిగిస్తూ మేమేమొ కూసింత దూరం అని పాడుకుంటూ ఎక్కడో అక్కడ వాళ్ళ చేతిలో ఇసుక పోసేసి, ఆ తరువాత మళ్ళీ మొదటికే వచ్చి ఆ చోటు కనుక్కోమన్నాం. పాపం వాళ్ళకి ఈ ఆట తెలియదు. కాని పురుషోత్తం మాత్రం వేళ్ళ సందుల్లోంచి చూసేసి కనుక్కున్నాడు. అందుకని మా కళ్ళు మూసి, వీరీ వీరి గుమ్మడిపండు..వీరీ పేరేమి అని మా తోటి ఆడించాడు. ఈ ఆట నీహాల్ కి చాలా నచ్చింది. తనకు కళ్ళు మూయమని మమ్మల్ని ఎదురుగ్గా కూచోమని చేయిపెట్టి ఊపుతూ భలే ఆడాడు. అందరు ముక్కు గిల్లుతుంటే బాగుందంట. కాని మొత్తానికి మా అందరినీ కూడా బాగానే గుర్తుపట్టాడు. ఒక రాత్రిపూట రీసెర్చ్ స్కాలర్స్ అలా చిన్న పిల్లలాటలాడుతోంటే మాకే గమ్మత్తుగా అనిపించింది:)

మా ఆటల సందడి లో గమనించనేలేదు. ఆ గడ్డిగడియారం ముల్లులు పన్నెండు దగ్గరికొచ్చేస్తున్నాయి. మరి మేము హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకోవాలికదా! ఇంతలో మా జస్పాల్..జోయా..ప్లీజ్ ప్లే రుద్రవీణ అంది. ఏ మాత్రం దీర్ఘాలు, కొమ్ములు, వత్తులు వంటివి లేని నా పేరుని తను జోయా అని బెంగాలి వాళ్ళలాగా పిలిచేది. మా వాళ్ళు కూడా నన్నేడిపించటానికి అలాగే పిలిచేవాళ్ళు.తనకి తెలుగు నేర్పించటానికి నేనూ మంజూ చాలా ట్రై చేసాం కాని తనకి, వాడు..అది... అనే పదాలు తప్ప ఇంకేం రాలేదు. మమ్మల్ని కూడా వాడూ, అది అనే పిలిచేది. నేర్పించిన ఖర్మకి మాకు పలకక తప్పలేదు. అక్కడ ఫైన్ అర్ట్స్ డిపార్ట్మెంట్ చాలా ఫేమస్. నేనూ మంజూ అక్కడ రుద్రవీణ నేర్చుకునేవాళ్ళం. మంజు దాన్ని కూడా తీసుకొచ్చింది. ఇద్దరం వంతుల వారిగా పలికిస్తూ ఉండగానే న్యూ ఇయర్ ఒచ్చేసింది. రుద్రవీణ మీద హ్యాపీ న్యూ ఇయర్ ప్లే చేస్తూ మా ఫ్రెండ్స్ ని విష్ చేసాం. ఆ నాద తరంగాలు గాలిలో తేలిపోతుంటే మాకు చాలా సంతోషమేసింది. మేమందరం రీసెర్చ్ అయిపోయి వెళ్ళిపోయేటప్పుడు వీణ తను తీసుకొని వాయించే షటిల్ మాత్రం నాకిచ్చింది మంజు:)

వెంటనే ఆకలి గుర్తొచ్చింది. నిజమే ..మేము తినటానికి ఏమీ తెచ్చుకోలేదు. ఇప్పుడెలా!!!అందరం పార్క్ బయటికెళ్ళాం. మా బండి ఉంది గాని ఇక్కడ ఒక ఆరేళ్ళ పిల్ల తప్ప ఎవ్వరు లేరు. ఆ పిల్ల కునికిపాట్లు పడుతోంది. వెంటనే నిహాల్ ఉల్లిగడ్డలు తీసుకొని చకచకా కట్చేసి ఆ బండి మీద చాట్ చేసి మా కందరికీ పెట్టాడు.ఎంత రుచిగా ఉందో నేను చెప్పలేను. ఆ పిల్లని లేపి చేతిలో డబ్బులు పెడితే ఆశ్చర్యంగా నోరు తెరిచేసింది పాపం. మేము ఏ హోటల్ కెళ్ళలేదు. కాని మేమాడుకున్న ఆటలు..తిన్న ఆ చాట్ ఎప్పటికీ మరిచిపోలేని తీపిగుర్తులుగా మాకు మిగిలిపోయాయి. మాకు ఏమాత్రం చెప్పకుండానే కాలచక్రం గిర్రున తిరిగిపోయింది.

జరిగిపోయిన ఆ కాల గమనంలో చివరకు మాకు మిగిలిందేమిటి? ఎంతో తెలివైన మా అందరికంటే చిన్నవాడైన డా. నిహాల్ చావ్డా చిన్నతనంలోనే కదలలేని పరిస్థితిలో, గొప్ప శాస్త్రజ్ఞుడవ్వాలని కలలు గని, భవిష్యత్తన్నదే లేకుండా మంచాని కంటుకుపోయాడని చెప్పటానికి గుండెగొంతుకడ్డుపడుతోంది. ఎన్నో ఆశలు నింపుకున్న ఆ అమాయక ముఖాన్ని ఎలా మర్చిపోను.... ఆకేసి ఉప్పేసి, పప్పేసి అన్నంపెట్టి నెయ్యేసి..అమ్మకో ముద్ద, నాన్నకో ముద్ద, చెల్లికో ముద్ద అని తినిపించాలని ఉంది. భవిష్యత్తులో ఎంతో ఎత్తుకు ఎదగాలని కలలు కన్న నా ప్రియ స్నేహితురాలు డా. జస్పాల్ కౌర్ దత్ పంజాబ్ లో, పెళ్ళిచేసుకొని ఒక మారు మూల గ్రామంలో ..వంటింటిలో మగ్గిపోతోందని చెప్పనా. ‘దాని’ దగ్గిరికెళ్ళి కొండాపల్లి కొయ్యాబొమ్మా....నీకో బొమ్మా నాకో బొమ్మా...నక్కాపల్లి లక్కా పిడత...నీకో పిడత నాకో పిడత ....నిర్మల పట్నం బొమ్మల పలకలు...నీకో పలక నాకో పలక...చూస్తూ ఉండు ఇచ్చేదాకా.... అని పాడాలని ఉంది. ఏడవకు ఏడవకు వెర్రిపాపాయి...ఏడిస్తె నీ కళ్ళ నీలాలు కారు..నీలాలు కారితే నే చూడలేను...పాలైన కారవే బంగారు కళ్ళ...అని తనివి తీరా ఓదార్చాలని ఉంది.

ప్రొఫెసర్ మంజూ పి. రావ్ కీర్తి కిరీటాలు పెంచుకుంటూ ఒంటరిగా బెంగళూరు లో కాలం గడుపుతోందని చెప్పనా. లేకపోతే...బుర్రుపిట్ట బుర్రు పిట్ట తుర్రు మన్నది...పడమటింటి కాపురం చేయనన్నది...అని పాడనా. మల్లెమొగ్గల నవ్వులారబోసే భార్యకన్నా మించిన ఎంతో గొప్ప కీర్తి కిరీటాల కోసం... ప్రొఫెసర్ పురుషోత్తమ రావ్ ఆస్ట్రేలియా నుంచి తిరిగి రావట్లేదని చెప్పనా..... ఉడతా ఉడతా వెంటనే రా...చక్కని ఉడతా వెంటనే రా..జామ చెట్టు ఎక్కిరా..సగం పండు నీకు...సగం పండు మంజుకు....కలసి మెలసి ఉండు ...రా....అని పాడానా. ఇప్పుడు ఏ పాట పాడాలి. గడప లన్నింటి లోన ఏ గడప మేలు...అని వెతక్కు...అన్ని గడపల్లోన నీ మహలక్ష్మి నివసించు గడప మేలు...అని ఎప్పుడు తెలుసుకుంటావయ్యా....పురుషోత్తమా!!!!

నా మదిలోని ఆ జ్ఞాపకాలే నా జీవితాంతం నా నూతన సంవత్సర సంబరాలు. అది దాటి ముందుకు రాలేక పోతున్నాను. అక్కడే ఆగి పోయాను. అడుగు ముందుకు పడటం లేదే...మరి ఏం చేయను. మేమయిదుగురం ఎప్పటికైనా కలవాలి. అదే నా ప్రతి నూతన సంవత్సరపు ఆకాంక్ష...తీరని కోరిక. నిజమైన ఆనందం స్నేహమే... కదా......

***************************************************************************
 

మనస్వి © 2008. Template Design By: SkinCorner