27, ఏప్రిల్ 2011, బుధవారం

ఈ కళ చాలా బాగుంటుంది...
(సమ్మర్ స్పెషల్ 3)

మీకోసం ఇంకో సమ్మర్ స్పెషల్. వేసవిలో ఎన్నో రకాల పళ్ళు వస్తాయి కదూ. అవి తినటమేకాకుండా కొంత 'కళాపోషణ’ కూడా చేయొచ్చు. ఇది అరవైనాలుగు కళల్లో ఉందో లేదో...లేకపోతే కలిపేద్దాం....

ఎలా అంటే...ఇలా అన్నమాట.

ఫ్రూట్ కార్వింగ్...ఇప్పుడు బాగా అభివృద్ధి లోకి వస్తోంది...దానిని వృత్తిగా స్వీకరిస్తున్న వారి సంఖ్య కూడా పెరుగుతోంది....
ప్రభుత్వ ఉద్యోగాలు కాకుండా..స్వయంఉపాధికి ఇది చాలా సహాయపడుతుంది. 'ఈవెంట్ మానేజ్ మెంట్’ ఇప్పుడు అందరికీ తెలిసిందే.
ఇది ఒక హాబీ గా ఎంజాయ్ చేయొచ్చు....లేదాఒక 'గృహిణ' కాదంటే 'హోంమేకర్'...దీనినే వృత్తిగా స్వీకరించి 'ఆర్ధికాభివృద్ధి’ కూడా సాధించవచ్చు. చిన్న చిన్న ఫంక్షన్స్ కి అంటే పుట్టిన రోజుల్లాంటివన్నమాట, తానే స్వయంగా అక్కడి అలంకరణ చేపడితే...అందరూ మెచ్చుకుంటుంటే ఆనందంగానూ ఉంటుంది....త్తృప్తిగా కూడా ఉంటుంది. కాదంటారా!!!

మనం పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు అక్కడ అలంకరణలో భాగంగా, ఫ్రూట్ కార్వింగ్...ఐస్ కార్వింగ్, చూస్తూనే ఉంటాము. చూడటానికి చాలా బాగుంటుంది కదూ. దీనికోసం ఎంత కష్టపడ్తారో కదా!!!అలా చూసీ చూసీ నాక్కూడా నేర్చుకోవాలనిపించింది. నెలా...మూడు నెలల్లో హోటల్ మానేజ్ మెంట్ ఇనిస్టిట్యూషన్స్ లో నేర్పిస్తారు. ఫీజ్ కూడా పెద్ద ఎక్కువేంకాదు. అలాగే ఒక సమ్మర్ లో నేను ఫ్రూట్ కార్వింగ్ నేర్చుకున్నాను. అలా తయారు చేసిందే ఇది. మా ఫ్రెండ్ కూతురి పుట్టిన రోజుకి వాళ్ళ ఇంట్లో ఇలా అలంకరించాను. బాగుందా!!!

ఇప్పుడు వాటర్ మిలన్ పళ్ళు చాలా దొరుకుతాయి. దీనికి కావాల్సిందల్లా కొంత ఓపిక, శ్రద్ధా, ఇంకొంచెం ఆలోచనా అంతే...చేతిలో ఒక చిన్న కత్తి ఉంటే చాలు. ఇంక ఆ 'చురకత్తితో' దీన్ని ఇష్టమొచ్చినట్లు పొడిచి పారేసి అంతం చూట్టమే:) వేరే పరికరాలు కూడా ఏం అఖ్ఖర్లేదు. ఆలోచించుకుంటూ అలా ఒడుపుగా చేసుకుంటూ పోవటమే. కాకపోతే, మొదట్లో కొన్ని పళ్ళు కుదరక పాడుచేస్తాంలెండి:) ఖర్చు కూడా చక్కగా సరిపోయే ఒక పెద్ద 'పుచ్చకాయ’ కొనుక్కోవటమే.

మరి మీకు నచ్చిందా... ఈ సమ్మర్ లో మీరు కూడా ఇలాటి ప్రయోగాలు చేస్తారు కదూ....చిన్నపిల్లల ఫంక్షన్ కయితే రకరకాల పళ్ళతో రూం అంతా ఇలా అలంకరిస్తే బలూన్స్ కన్నా, తళతళ లాడే రంగు కాగితాలకన్నా ఇవే పిల్లల్ని తమవైపు తిప్పేసుకుంటాయి. అప్పుడు జంక్ ఫుడ్ కన్నా ఇవే ఎక్కువ తినేస్తారు. పిల్లల ఆరోగ్యం సేఫ్ గా ఉంటుంది.... అదన్నమాట అసలు కథ. ఇవాళ స్టోరీ టెల్లింగ్ డే కదా! పిల్లలకి కథలు చెప్తూ ఈ పళ్ళన్నీ తినిపించేయండి...మీరుకూడా కొన్ని తినేయండేం:)


ఇదిగో ఇది చూడండి...ఎంత మజా వస్తుందో....మీకిప్పుడే ఇలా చేయాలనిపిస్తోంది కదూ...నాకు తెలుసు. మరెందుకాలస్యం....హాయిగా, హుషారుగా, మొదలెట్టేయండి....ఈ సమ్మర్ సఫలమవుతుంది:)

ఇదిగో ఇది కూడా చూసేయాలి మరి.....ఇంకా, చాలా చాలా చాలా ..ఎంతెంతో బాగుంటుంది. నా మాట నమ్మాలి మరి.....

************************************************************************

22, ఏప్రిల్ 2011, శుక్రవారం

చీరలోని సింగారం...(సమ్మర్ స్పెషల్స్ 2)

అదిరేటి చీర చూపిస్తాను.....బెదిరేటి లుక్ లు మాత్రం ఇయ్యకండేం.....

ఏంలేదండీ...ఇంకో క్రియేషన్ మీ మీద వదిలేద్దామని:)

ఇవన్నీ నేనే నా చీరలమీద మాత్రమే నేను చేసిన ప్రయోగాలన్నమాట....వేరే కొంచెం జిగ్రీ దోస్తులకి కూడా వేసిచ్చాను కాని...పాపం ఎంతైనా ఫ్రెండ్స్ కదా, ఏ భావం వ్యక్తం చేయలేక పోయారు. కాని చీరలు మాత్రం తీసేసుకున్నారులెండి.

సింగారమనే రంగులద్ది ఆనందంగా తయారు చేసిన చీరలండి ఇవి...

మొన్నామధ్య ,వొద్దు వొద్దు నాకీ చీర చాలా ఇష్టం అన్నా కూడా వినిపించుకోకుండా...ఇచ్చిపుచ్చుకుంటే బాగుంటుంది, ఇచ్చేయ్ ఆ చీరా..అంటూ, .జయప్రద..అదిగో ఆ ఎల్లో చీర తీసేసుకుంది...
.
సుహాసిని కూడా నండి...మరీను, అస్సలు మర్యాద లేకుండా...నల్లచీర కట్టుకున్నా...నవ్వాలి చిన్నమ్మా...నలుపు నవవిధాల లాభం అంటూ....ఆ నల్ల చీర తీసుకెళ్ళిపోయింది....నా కెంత బాధేసిందో....మీకు కాకపోతే, ఇంకెవరికి చెప్పుకోమంటారు చెప్పండి....

ఆ స్కైబ్లూ చీర...నాకు చాలా ఇష్టమండి...వెండి వెన్నెల పోగుల్లాంటి చీర అది....చాలా బాగుందని, నేనెటొ చూస్తుంటే..ఇట్నుంచిటే తీసుకెళ్ళిపోయి....మళ్ళీ ఈనాటి వరకూ కనిపించలేదు. ఎవరనుకుంటున్నారు....వాణిశ్రీయే!!!....

నా బంగారు జలతారు చీర....అదేనండి ఆ ఎర్రచీరన్నా ఎవరూ చూడకముందే దాచేద్దామనుకున్నానండి. మరేమో....నా ప్లాన్ ముందే తెలిసిపోయినట్లుంది.....నీకు నేనంటే ఇష్టంగా.....నేను ఏనాటికైనా ఈ చీరే కట్టుకుంటానంటూ....గోదారీ గట్టుందీ...అని పాడుకుంటూ, జమున జబర్దస్తీగా తీసుకెళ్ళిపోయిందండి....

ఆ పర్పుల్ చీరేమో....మా ప్రిన్సిపల్ అండీ...మొన్నేదో మీటింగ్ కి నేను రాలేదని, నేను చెప్పిన మాటినటం లేదంట...చాలా కోపంతో, ఆ చీర పట్కెళ్ళిపోయారు.....ప్లీజ్ ప్లీజ్ నేను మీతో చెప్పానని మాత్రం ఎక్కడా అనకండేం.....కావాలంటే మీక్కూడా ఓ చీర చాలా షోగ్గా చేసిస్తాను...సరేనా...

ఇంక మిగిలిందేముంది లెండి....జగమే మాయ...నా చీరలేమాయె...

ఎప్పటికైనా ఎవర్ గ్రీన్ కాస్ట్యూమ్...మన చీరే కదండి....మన జాతీయ జెండాకి సమానంగా నిలిచేది మన చీరేనట:)
ఈ సారి రాజమండ్రీనో...కేరళానో వెల్దామనుకుంటున్నా....అక్కడినుంచి వాళ్ళ స్పెషల్ చీరలేవో కూడా తెచ్చుకుంటాలెండి:)

ఇదిగో...పనిలో పనిగా...ఎంత చక్కని పాటో....ఇదికూడా వినేసి...ఆ చీరలు కూడా చూసేయండి....

చీరలోని గొప్పతనం తెలుసుకో......

*******************************************************************************

3, ఏప్రిల్ 2011, ఆదివారం

ఇలా బాగుంటుంది కదూ!!! (ఇది అమ్మాయిల కోసమేలెండి)

(సమ్మర్ స్పెషల్స్ 1)


ఎన్ని రకాల చీరల గురించి చెప్పుకోవచ్చో ....అలాగే అన్ని రకాల నగల గురించి కూడా చెప్పుకోవచ్చుకదా....
ఆభరణాలంటే ఇష్టపడని అతివలుంటారా అసలు.
వెండి బంగారాలు, వజ్రవైడూర్యాలు కొనే రోజులు పోయాయిగా...అందుకే ఉన్నవాటినే రకరకాలుగా తయారు చేసుకొని మన నగల ముచ్చట తీర్చుకోవచ్చు.
కొంత క్రియేటివిటీ చూపించామంటే ఎటువంటి ఖర్చు లేకుండా, ఉన్నవాటినే ఆకర్షణీయంగా రూపొందించుకొని సంతోషపడొచ్చు.....
నేను చేసిన ఒక చిన్న క్రియేషన్ చెప్పనా...
ఏంలేదండి...కొన్ని నగలకి వెనకాల బంగారు గొలుసుకి బదులుగా...పొడుగాటి ఒక కుచ్చుల తాడు కూడా వాడుతుంటాంకదా...ఇదిగో ఇలాంటివి.మన నగలు ముందు వైపు ఎంత అందంగా ఉంటాయో చూసుకొని మురిసిపోతుంటాం, అంతేగాని కొన్ని నగలకు వెనకాల వేలాడే తాడు గురించి మాత్రం పట్టించుకోము. ఈ తాడు చివరన ఉన్న కుచ్చులు కొన్నాళ్ళకి పాతపడిపోతాయి. అంతే కాకుండా చూడటానికి అస్సలు బాగుండకుండా అయిపోతాయి. అలా కాకుండా మనం ఆ కుచ్చులకి కొంత అలంకారం చేసామనుకోండి...ఎంత చూడ ముచ్చటగా ఉంటాయో. అస్సలు పాడవ్వవుకూడా. వెరైటీగా కూడా ఉంటుంది. చందమామ కథలో చూశా ఎంత బాగుందో...అంటూ పాటలు పాడుకోవచ్చు:)
ఇట్లాంటి పనులు చాలా ఈజీ గా చేసుకోవచ్చు.ఎలా అంటే...ఇలా....


మన దగ్గిర ఆర్టిఫిషియల్ గొలుసులు, గాజులు ఉంటాయి కదా. అలాంటివి పాతపడినప్పుడు పారేయకుండా దాచిపెట్టుకోవాలి. వాటికుండే రంగు రంగుల గోల్డెన్ బీడ్స్, రకరకాల రాళ్ళతో చేసిన చిన్న, పెద్ద బిళ్ళలు...కుందన్స్...అలాగే గాజులకి ఉండే చిన్న చిన్న హాంగింగ్స్ లాంటివి ఈ పనికి ఉపయోగించుకోవచ్చు. ఇలాంటి వాటిని తాడువెనకాల ఉండే కుచ్చుకి ఒడుపుగా కట్టేయటమే. అప్పుడు అది చూడ టానికి కొత్తరకంగా అందరినీ ఆకట్టుకుంటుంది. అబ్బా...ఎంత బాగుందో, ఎక్కడ కొన్నారండీ అని అడుగుతారుకూడా. పైగా ఆ తాడు గాలికి ఎగరకుండా...ఆ తరువాత తాడు పాతబడ్డా కూడా కుచ్చుగురించితెలియకుండా నిత్యనూతనంగా ఉండిపోతుంది.

నేను ఎలా చేసుకున్నానో చూడండి....అసలు గొలుసుకన్నా....వెనకాల వేలాడే ఈ తాడునే అందరూ ఇష్టపడ్తున్నారు. అంతేకాదు...మిమ్మల్ని బాగా పొగుడ్తారు కూడా:) అబ్బాయిలు కూడా అమ్మాయిలకి ఇలా తయారుచేసి ఇవ్వచ్చు. కావాలంటే...అబ్బాయిలు కూడా...ముత్యాలు, పగడాలు వేసుకుంటునేఉంటారు కాబట్టి, వాళ్ళు కూడా ఇలా తయారు చేసుకొని వేసుకోవచ్చు. షర్ట్ మీంచి వెనకాల వేలాడుతూ తమాషాగా....బాగుంటుంది:)కాబట్టి అందరూ కూడా ఈ ఉగాదికి చక్కటి పట్టుచీర కొనిపించుకొని, వెనకాల అందంగా వేలాడే తాడున్న నగలతో ఆనందంగా జరుపుకుంటారని,......అందరికీ హృదయపూర్వక ఉగాది శుభాకాంక్షలతో........మీ అందరికోసం ఉగాది పచ్చడి ....ఇలా చేసుకొని తినేయండేం......ఇదిగో..రంగోలికూడా ఇలా, మంచిగా వేసుకోవాలి మరి.ఇంకేంలేదండి చూడటానికి, ఇంతే...ఇహ మొదలుపెట్టేయండి.......


***********************************************************************
 

మనస్వి © 2008. Template Design By: SkinCorner