16, నవంబర్ 2011, బుధవారం

సలహా కావాలి !!!

ఎంతో అల్లారు ముద్దుగా చూసుకున్నారు. కాలు కింద పెట్టనీయకుండా కోరిన కోరికనెల్లా తీర్చారు. ముద్దూ మురిపాలందించారు. చక్కటి విద్యా సంస్థలో ఉన్నత విద్యకై చేర్చారు. చదువుల సరస్వతి గా విలసిల్లింది. ప్రతి పోటీలోనూ ఉన్నత బహుమతులు సంపాదించుకుంటోంది. ఉపాధ్యాయుల ప్రియతమ శిష్యురాలయింది. అంతేకాదు, ఎన్నో లలిత కళలను అభ్యసిస్తోంది. చక్కటి విజ్ఞానవంతురాలు. ప్రతిఒక్కరికీ తలలో నాలుక.

ఇంతటి ఆక్టివ్ అమ్మాయి ఉన్నట్లుండి స్తబ్దుగా మారిపోయింది. అన్నీ ఒదిలేసింది. ఒంటరిగా ఉంటోంది. పద్నాలుగేళ్ళ ఆ అమ్మాయి స్కూల్ మానేసింది. పుస్తకాలు ఒదిలేసింది. చక్కగా పాడే అమ్మాయి గొంతు ఎందుకో మూగబోయింది. అసలు ఉత్సాహం అనే పదానికి అర్ధమే మరిచిపోయింది.

తల్లిదండ్రులను మాత్రం ఎంతో గౌరవిస్తోంది. చాలా కృతజ్ఞత చూపిస్తోంది. ఎంతో ఒదిగి ఒదిగి ఉంటోంది. ఒక్క మాట ఎదురు మాట్లాడటం లేదు. ఆ పసిపిల్ల అల్లరి అంతా ఎక్కడ మాయమైపోయిందో. ఏమీ చాతకాని మూలనున్న ముసలమ్మకన్నా బలహీనమై పోయింది.

అర్ధం కాని తల్లిదండ్రులు అల్లాడిపోయారు. అమ్మాయిని ఎన్నోరకాలుగా బతిమలాడి ఈ మార్పుకు కారణం తెలుసుకోటానికి ప్రయత్నం చేసారు.

తట్టుకోలేని తల్లి నువ్వు నాకు ఏ కారణం చెప్పక పోతే ఈ నాటి నుంచి నేను పూర్తిగా ఆహారం మానేస్తానని పట్టుబట్టింది. ఆ రోజంతా ఏమీ తినలేదు కూడా.

అదే రోజు ఆ అమ్మాయి తల్లి పాదాలపై తలపెట్టి విపరీతంగా ఏడవసాగింది. తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. అక్కున చేర్చుకొని, కన్నీరు తుడిచి...కన్నీళ్ళతో ఎంతో బ్రతిమిలాడారు.

ఎన్నాళ్ళనుంచో భరిస్తున్న తన బాధను తట్టుకోలేక గుండెపగిలి అడిగింది. 'అమ్మా! నేను మీ బిడ్డను కాదా!!!' అని.

వారిద్దరూ నిశ్చేష్టులయ్యారు.

అవును. ఆ అమ్మాయి అడిగిన మాట నిజమే. తను వాళ్ళ స్వంత బిడ్డ కాదు. సంతానం లేని వారు, ఒక ప్రభుత్వ అనాధ శరణాలయం నుంచి కొన్ని రోజుల వయసున్న ఆ అమ్మాయిని దత్తత చేసుకున్నారు. ఎంతో అపురూపంగా చూసుకున్నారు. కాని ఈ రోజు చుట్టుపక్కలెవరి ద్వారానో ఆ అమ్మాయికి నిజం తెలిసిపోయింది. అప్పటినుంచి తట్టుకోలేక పోతోంది.

తను అనాధనని, వీరు తనని పోషిస్తున్నారని, తనకెవరూ లేరని తల్లడిల్లిపోతోంది. ఎప్పటిలా వారితో ప్రవర్తించలేకపోతోంది. విపరీతమైన కృతజ్ఞత చూపిస్తోంది. అప్పటి గారాబాలు, అభిమానం, అధికారం స్థానం లో పూర్తి ఆత్మ న్యూనత పెరిగింది. ఆ ఇల్లు తనది కాదు. వారు తన వారు కారు అనే భావం పెరిగిపోయింది. ఈ చిన్న వయసులో ఒక్క సారిగ తన పరిస్థితిలో వచ్చిన ఆ మార్పుని తట్టుకోలేక పోతోంది. విపరీతమైన సంఘర్షణకు లోనవుతోంది. మనసువిప్పి, చనువుగా తల్లిదండ్రులతో ఉండలేకపోతోంది. విలువైన వస్తువులన్నీ పక్కన పెట్టేసింది. వారు తిన్నాకనే తను తింటోంది. ఇంట్లో పనంతా చేయటానికి ప్రయత్నిస్తోంది. ఆ సున్నిత మనస్సు నలిగిపోయింది. కోలుకోలేకపోతోంది.

తల్లిదండ్రులు ఎంత ప్రయత్నించినా సహజంగా ఉండలేకపోతోంది. ఆ అమ్మాయికి ఆ నిజం చెప్పినవారికి తృప్తి కలిగి ఉండొచ్చు, కాని దాని ద్వారా ఇక్కడ మూడు జీవితాలు అల్లకల్లోలమయిపోతున్నాయి.
స్నేహితులు, బంధువులు ఎన్నో రకాలుగా ఆ అమ్మాయి నిజం మరిచిపోయి స్వేచ్చగా ఉండటానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా అవన్నీ దండగే అవుతున్నాయి. ఉన్న వూరు, స్వంత ఇల్లు వదులుకొని ఎక్కడికి పోగలరు. ఆ అమ్మాయిని కొంత కాలం సరదాగా స్నేహితులతో వేరే ఎక్కడికన్నా పంపటానికి కూడా ప్రయత్నం చేసారు.

తను వాళ్ళకు ఎంతో ఋణపడి ఉన్నట్లుగా ప్రవర్తిస్తోంది. ఒకవేళ తన తల్లిదండ్రులెవరో తెలిస్తే వెళ్ళిపోతానంటోంది. పరాయి భావన పెరిగిపోయింది. దూరం పెరిగిపోతోంది. దగ్గిరయ్యేది ఎలా?

ఆ అమ్మాయి ఈ బాధ ఎలా తీరాలి? తిరిగి వారందరు ఎప్పటిలా సంతోషంగా కలిసి ఉండే అవకాశం ఇంక లేదా? దీనికి పరిష్కారం ఏవిటి? ఆ అమ్మాయి మీద ప్రాణాలు పెట్టుకొని ఎన్నో ఆశలతో బ్రతుకుతున్న ఆ తల్లిదండ్రులు ఏమవ్వాలి? వారికి కావాల్సింది ఆ అమ్మాయి కృతజ్ఞత కాదు. ఎప్పటిలాగే ఆ ప్రేమ, అభిమానం కావాలి. అప్పటి చనువు, ఆప్యాయత కావాలి. ఆమె భవిష్యత్ కావాలి. తమ గారాలపట్టి తమకు కావాలి. ఇప్పుడెలా!!!

ఆ పసి మనసు ఎలా తట్టుకోవాలి. ఎలా ఓదార్చాలి. ఇలాగే కొనసాగితే...ఆ అమ్మాయి ఏమయిపోతుంది.......


**************************************************************************************************

21 కామెంట్‌లు:

Padmarpita చెప్పారు...

ఇది ఆ అమ్మాయికి షాక్ న్యూస్ అయ్యివుండవచ్చు, కాని ఇన్నాళ్ళు పెంచి పెద్దచేసి అప్యాయతానురాగాలని పంచినవారిని కేవలం కనలేదు అన్న కారణంగా దూరంచేసుకోవడం అవివేకం!
"కన్నప్రేమకన్నా పెంచినప్రేమ గొప్పది"....తప్పకుండా ఆ అమ్మాయి మునపటికన్నా ఇంకా ప్రేమగా దగ్గరై వారితో హాయిగా జీవనం సాగించాలని కోరుకుంటున్నాను.

SRRao చెప్పారు...

జయ గారూ !
లోకం తెలియని చిన్నారి మనసును ఇలా గందరగోళ పరిచే వాళ్ళు ఎప్పుడూ వుంటారు. ఒకవేళ కావాలని ఎవరూ చెప్పకపోయినా ఎప్పటికైనా ఈ విషయం తెలియాల్సిన పరిస్తితి ఎదురవుతుంది. కనుక తల్లిదండ్రులతో బాటు సన్నిహితులు కూడా ఆ అమ్మాయికి మానసిక స్థైర్యాన్ని ఇవ్వవలసిన అవసరం వుంది. అప్పటికీ సర్దుకోకపోతే అనవసరమైన సందేహాలకు పోకుండా మంచి మానసిక వైద్య నిపుణుడి చేత కౌన్సెల్లింగ్ ఇప్పించడం మంచిది.

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

జయ గారు ఎదుటివాళ్ళు సంతోషంగా వుంటే ఆ సంతోషాన్ని ఎలాగైనా దూరం చేయటమే నేటి సమాజంలొ వున్న పరిస్థితి.

ఇప్పుడు మనం మన సొంత వాళ్ళు అనుకున్నవాళ్ళే మనకి పరాయి వాళ్ళు కావచ్చు..
మనం పరాయి వాళ్ళు అనుకున్న వాళ్ళే కొన్ని పరిస్థితుల్లో మనకి అత్యంత ఆప్తులుగా మారవచ్చు.
ఈ విషయాలన్నీ ఆ అమ్మాయికి అర్ధమయ్యేలా కొన్ని ఉదాహరణలతో సహా చెప్పటం వలన ఆ అమ్మాయి మనసు మార్చొచ్చేమో...

Sravya V చెప్పారు...

హ్మ్ ! ఏమి చెప్పాలో తెలియటం లేదండి , ఆ అసలు సంగతి చెప్పిన వాళ్ళు తన మనస్సు నొప్పించేట్లు గా ఎమన్నా అన్నారేమో :((

Sujata M చెప్పారు...

Counseling counseling.. !! shows the way.

అజ్ఞాత చెప్పారు...

Go to Counselling IMMEDIATELY! This will lead to depression very soon.

Mauli చెప్పారు...

hmm, ee vaaram lo nenu vrayaalanukumtunna tapaaa...

లత చెప్పారు...

జయగారు,ఒక్కసారి ఆ పాప మనసులోకి వీళ్ళకీ (తల్లిదండ్రులకి) నేను తప్ప ఎవరున్నారు అన్నీ నేనే కద అన్న ఆలోచన వస్తే మార్పు రావొచ్చు.ఆ దిశగా ప్రయత్నిస్తే మంచిదేమో

అజ్ఞాత చెప్పారు...

జయగారు, ఇక్కడ ఆ అమ్మాయి వయసును కూడా దృష్టిలో ఉంచుకోవాలి. అటు పెద్దా ఇటు చిన్నా కాని వయసు. ఈ వయసులో ఆమె విన్నదాన్ని జీర్ణించుకోవటం అంత సులభమేం కాదు . తనని జాగ్రత్తగా కనిపెట్టుకుని వుండి ఇంతకు ముందుకంటే ఎక్కువ ప్రేమగా చూసుకొంటూ కౌన్స్ లింగ్ ఇప్పిస్తూ , కొంత కాలం గడవనివ్వాలి. కాలం గడిచేకొద్దీ తన ప్రవర్తనలో మార్పు వస్తుంది . ఈలోగా చదువు పోతుందని ఆమెని బలవంతంగా స్కూల్ కి పంపే ఆలోచన చెయ్యకపోవటం మంచిది .

జయ చెప్పారు...

@ అవును పద్మర్పిత గారు, కన్న ప్రేమ కన్న పెంచిన ప్రేమే గొప్పది. ఆ అమ్మాయికి ఇంకా కొంచెం టైం పడుతుందనుకుంటాను. తప్పకుండా తన తల్లిదండ్రులతో మెల్ల మెల్లగా కలిసిపోతుందనే కోరుకుందాము. థాంక్సండి.

@ రావ్ గారు ధన్యవాదాలండి. ముఖ్యంగా ఇటువంటి సమస్యలు చుట్టుపక్కల వారి నుంచే వస్తాయండి. వారూ వీరూ అనే మాటలు ఆ అమ్మాయిని కౌన్సిలింగ్ కి దూరం చేస్తున్నాయి. నిజం మరీ చిన్న వయసులోనే తెలిసిపోవటం తో తట్టుకోలేని పరిస్థితిలో ఉంది.

@ ఇటువంటి పరిస్థితులు ఏకాలంలోనైనా ఉండేవే రాజీ. లోకరీతి తెలుసుకోటానికి తనకి కొంత టైం తప్పదనుకుంటా.

జయ చెప్పారు...

@ శ్రావ్య గారు మీరన్నట్లుగా అదే జరిగిఉంటుందండి. లేకపోతే పూర్తిగా కృతజ్ఞతా దారిలోనే పోతోంది, కుంచించుకుపోతోందే తప్ప, వేరే విధంగా ఆలోచించలేక పోతోంది, అర్ధం చేసుకోలేక పోతోంది. థాంక్సండి.

@ సుజాత గారు థాంక్సండి. చుట్టుపక్కల వారి కౌన్సిలింగ్ ఎక్కువైపోతోందండి. అసలెవరు ఆ విధంగా చేస్తున్నారన్నది కూడా అర్ధం కావట్లేదు. కొన్నిరోజులు వేరే ఊరికి వెళ్ళి అక్కడ కౌన్సిలింగ్ ప్రయత్నం చేద్దామనుకుంటున్నారండి.

@ అజ్ఞాత గారు థాంక్సండి. ఇన్నాళ్ళు ఎంతో గారాబంగా పెరిగి యువరాణి లాగా జీవితం గడిపిన పిల్ల ఈ షాక్ తట్టుకోలేకుండా ఉంది. అంతా తనే అనుకుంది. ఆ తల్లిదండ్రుల బాధని కూడా తట్టుకోలేక పోతోంది. అంతేనండి కౌన్సిలింగే తనని డిప్రెషన్ బారి పడకుండా కాపాడాలి.

@ మౌళి గారు తప్పకుండా రాయండి. ఇటువంటి సమస్య గురించి ఇంకా చాలా విషయాలు తెలుసుకోవాలని ఉంది. అది ఎంతోమందికి దారి చూపిస్తుంది.

జయ చెప్పారు...

@ లత గారు చాలా చక్కటి ఉపాయం. తనులేకపోతే వాళ్ళు అనాధలైపోతారని అర్ధం చేసుకున్న నాడు, తానే వారికి సర్వస్వం అని తెలుసుకున్ననాడు తన బాధ్యతను కూడా చక్కగా తెలుసుకోగలుగుతుంది. ఆ వైపుకు తప్పకుండా అడుగేస్తుంది.

@ లలిత గారు ధన్యవాదాలండి. అవునండి చిన్న పిల్ల కనుకే కొంచెం సమస్య అవుతోంది. మీరన్నట్లు మెల్లిమెల్లిగా మార్పు రావాల్సిందే. చాలా తెలివైన పిల్ల. కొన్ని పుస్తకాలు కూడా తనకిచ్చి చదవమన్నాము.

జయ చెప్పారు...

శ్రమ తీసుకొని తమ అభిప్రాయాలను తెలియచేసి సహృదయంతో తరుణోపాయం చూపించిన మితృలందరికి హృదయపూర్వక కృతజ్ఞతలు.

అన్వేష్ చెప్పారు...

చక్కగా సాగిపోతున్న జీవితాల్లో చిచ్చు పెట్టే వాళ్ళున్నంత కాలం పాపం అలాంటి తల్లిదండ్రులకు, అలాంటి పిల్లలకు ఈ కష్టాలు తప్పవు...
ఇది ఆ అమ్మాయిలో ఉన్న ఆత్మన్యూనతా భావం తప్ప మరేమీ లేదు.
బంధం అనేది మనసులకు తప్ప శరీరాలకు కాదు. "కనలేదు" అనే ఒక్క కారణం తప్ప ఆ తల్లిదండ్రులు ఈ అమ్మాయికి చేసిన లోటు ఏమీ లేదు... నిజానికి "కన్నప్రేమకన్నా పెంచినప్రేమే గొప్పది". కన్న తల్లిదండ్రులకు "బాధ్యత" ఉంటుంది కానీ పెంచిన తల్లిదండ్రులకు ఆ బాధ్యతని మించిన "ప్రేమ" ఉంటుంది ఆ ప్రేమలో బాధ్యత తప్పనిసరిగా ఉంటుంది. కానీ బాధ్యతలో ప్రేమ ఉండకపోవచ్చు(బాధ్యతతో పాటు ప్రేమ ఉండొచ్చు). మనల్ని ప్రేమించే వాళ్ళు మనం చేసే "గారాన్ని" కోరుకుంటారు కానీ "గౌరవాన్ని" మాత్రం కాదు. గౌరవం దూరాన్ని పెంచుతుంది గారం(గారంతో కూడిన అధికారం) ప్రేమని పెంచుతుంది. ఆ తల్లిదండ్రులకు మాత్రం ఎవరున్నారు మురిపెంగా పెంచుకున్న ఈ ముద్దుల పాప తప్ప....
ఈ వ్యాఖ్యను అర్థం చేసుకొనే వయసు ఆ అమ్మాయికి ఉండకపోవచ్చు కానీ ఆ అమ్మాయికి ఇది అర్థం చేయగలిగితే తప్పకుండా ఆ అమ్మాయిలో మార్పు రావచ్చు.
"కన్నప్రేమకన్నా పెంచినప్రేమే గొప్పది" అనడానికి నాకు అధికారం ఉంది ఎందుకంటే నేను ఆ ప్రేమని అనుభవించి రుచి చూసినవాణ్ణి కనుక.

జయ చెప్పారు...

ఇది మా అదృష్టం అన్వేష్ గారు. తప్పకుండా మీ గురించి చెప్తాను. నాకిప్పుడు నమ్మకం కుదిరింది. ఇంకెంతోకాలం పట్టదు, ఆ పాప మనసు కుదుటపడటానికి. మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు.

శిశిర చెప్పారు...

>>>మనల్ని ప్రేమించే వాళ్ళు మనం చేసే "గారాన్ని" కోరుకుంటారు కానీ "గౌరవాన్ని" మాత్రం కాదు.<<<
well said అన్వేష్.
జయగారు,
నేను అన్వేష్ వ్యాఖ్య కోసమే ఆగాను. తన గురించి నాకు తెలుసు. మీ టపా చదివాక తనకి చూపించి తన రెస్పాన్స్ అడిగాను. తనూ అలా పెరిగినవాడే కాబట్టి తను చెప్తే సరిగా చెప్తాడనిపించింది. తనకీ, తనని పెంచిన తల్లిదండ్రులకీ మధ్య ఉన్న బంధం నాకు తెలుసు. వారి నుండి తనేం పొందాడో కూడా నాకు తెలుసు.
అలాగే నా గురించి కూడా మీకు తెలుసు. ఇంకా పూర్తిగా ఎదగని వయసులో ఉన్న ఆ అమ్మాయికి మా ఇద్దరి గురించీ చెప్పండి. ప్రేమని పంచడానికి కన్నవారైనా, పరాయివారైనా ఒక్కటే అని నచ్చచెప్పండి. ఎంతో మందికి కన్నవారే ఇవ్వనిది ఆ అమ్మాయికి పెంచుతున్నవారు ఎలా అందిస్తున్నారో అర్థమయ్యేలా చెప్పండి. తను చూపించాల్సింది కృతజ్ఞత కాదు, దానిని మించిన దగ్గరితనం అని నచ్చచెప్పండి.

శిశిర చెప్పారు...

ఈ రెండు ఉదాహరణలూ ఆ అమ్మాయి ఆలోచనలని ప్రభావితం చేయగలవేమో! చెప్పి చూడండి. తనకీ, తనద్వారా తన తల్లిదండ్రులకీ ఏమైనా ఉపయోగపడితే సంతోషం.

జయ చెప్పారు...

What a constructive work Sisira!!! No words. Thank you.

Mauli చెప్పారు...

ilaa modalu ayyindi :)

http://teepi-guruthulu.blogspot.com/2011/12/1.html

జయ చెప్పారు...

Mouli gaaru thanks.

Mauli చెప్పారు...

please check the 2nd post on this series

http://teepi-guruthulu.blogspot.co.uk/2012/05/2.html

 

మనస్వి © 2008. Template Design By: SkinCorner