29, మే 2013, బుధవారం

రవీంద్రుని చిత్రాలు






రవీంద్రనాథ్ ఠాగోర్ 150 వ జయంత్యుత్సవాల సందర్భంగా సాలార్జంగ్ మ్యూజియం లో ఏర్పాటు చేసిన ఆయన వేసిన చిత్రాల ప్రదర్శన మే 11 న ప్రారంభించారు. అది ప్రదర్శకులను అద్భుతంగా ఆకర్శిస్తోంది. ఠాగోర్ వివిధ సందర్భాలలోగీసిన చిత్రాలతో, మ్యూజియం వెస్టర్న్ బ్లాక్ లో రెండో అంతస్థులో ఈ ప్రదర్శన ఏర్పాటు చేసారు. జూన్ 10 వరకు ఈ ప్రదర్శన కొనసాగుతుంది.

ఢిల్లీ లోని నేషనల్ గ్యాలరీ ఆఫ్ మోడ్రన్ ఆర్ట్, సాలార్జంగ్ మ్యూజియంలు కలసి ఏర్పాటు చేసిన ఈ ఎగ్జిబిషన్ 'ద లాస్ట్ హార్వెస్ట్ ' పేరుతో ప్రముఖ చిత్రకారుడు పద్మశ్రీ జగదీశ్ మిట్టల్ ప్రారంభించారు. ఠాగోర్ ప్రకృతి అందాలను అద్భుతంగా చిత్రించి సహజ చిత్రకారునిగా, విశ్వగురువుగా గుర్తింపు పొందారని  అన్నారు. రవీంద్రుడు హైద్రాబాద్ లోనే (1934-1945) ఎక్కువ చిత్రాలను గీసారట. ఠాగూర్ తన 60 వ ఏట చిత్రాలు వేయటం ప్రారంభించారట.

శాంతినికేతన్ ఫైన్ ఆర్ట్స్ విభాగాధిపతి శ్రీ శివకుమార్ కూడా ఠాగోర్ చిత్రకళను వివరించారు. ఠాగోర్ గొప్ప రచయిత అయినప్పటికి ఆ ప్రభావం అతని చిత్రాల మీద పడలేదు. సాధారణ జన జీవితాలకు అద్దం పట్టే చిత్రాలు గీసారు. ప్రకృతి రమణీయత, బెంగాల్ రాష్ట్ర గ్రామీణ జీవితాన్ని ఈ చిత్రాలలో ఎక్కువగా చూడొచ్చు.

ఎన్.జి.ఎం.ఎ. శాంతినికేతన్ నుంచి 150 చిత్రాలను తెప్పించి ఈ ప్రదర్శనలో ఏర్పాటు చేసారు. మ్యూజియం డైరెక్టర్ శ్రీ నాగేందర్ రెడ్డి గారు ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి శ్రద్దగా ఎన్నో విషయాలను వివరిస్తున్నారు.

చిత్రకళ మీద అభిరుచి ఉన్న వాళ్ళు మాత్రమే కాదు, ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా చూడాల్సిన ప్రత్యేక ప్రదర్శన ఇది. ఈ చిత్రాలు మనకు ఠాగొర్ మనోభావాలు, సునిశిత పరిశీలన, సమాజం పట్ల అవగాహన, సృజనాత్మకత తెలియజేస్తుంది. ఠాగోర్ పూర్తి వ్యక్తిత్వాన్ని మనతో చదివిస్తుంది. ఒక విభిన్న వ్యక్తిని చూపిస్తుంది. ఊహాలోకాల్లో ఊపేస్తుంది.







***************************************************************************************************************************************************
 

మనస్వి © 2008. Template Design By: SkinCorner