30, జూన్ 2013, ఆదివారం

పాకుడురాళ్ళు



 జ్ఞానపీఠ పురష్కారం పొందిన రావూరి భరద్వాజ గారి పుస్తకం పాకుడురాళ్ళు. చలన చిత్ర రంగంలో వెలుగు నీడలు, కష్టసుఖాలు, వడిదుడుకులూ...సినిమా వెనుక గల సినిమా చరిత్రని వివరించిన పుస్తకం ఇది. ఈ పుస్తకం చదవాలన్న ఏనాటి నా కోరికో, జ్ఞానపీఠ్ అవార్డ్ వచ్చి కొత్త ప్రింట్ విడుదలయినాక గాని తీరలేదు.

అట్టడుగు నుంచి సినిమా రంగం లో పైకి రావాలనుకునే మంగమ్మ లాంటి వాళ్ళ కథ సర్వ సాధారణం. పసితనం లోనే నాగమణి తో చేదు అనుభవం ఏర్పడింది. ఆ తరువాత చిన్నతనంలోనే నాటకరంగానికి వచ్చి అక్కడ తన ప్రతిభతో ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకుంది మంగమ్మ. రామచంద్రారావు, మాధవరావుల స్నేహంతో ఒక భద్రత ఏర్పరుచుకోటానికి ప్రయత్నిచటమే కాక నాగమణి నుంచి కూడా బయట పడగలిగింది. ఆ నాటక సమాజం మూతపడడంతో ఏమీ తోచని మంగమ్మ చలపతి పరిచయం తో సినిమా రంగం మీద ఆశ పెంచుకొంది. నాగమణి ని చూడాలన్న కోరికతో బయలుదేరిన మంగమ్మ తన నేస్తం రాజమణి ని కలుసుకొని వారి హీనబ్రతుక్కి చలించిపోయింది. వసంత ను ఇష్టపడి ఆమె చాలా బాగా పాడుతుందని తెలుసుకొని తనకి భవిష్యత్తులో సహాయం చేయటానికి ప్రయత్నిస్తానని మాట ఇచ్చింది. నాగమణి ఎంతటి దుర్భర పరిస్థితుల్లో ఉందో తెలుసుకుంటుంది. నాగమణి ని కలవలేక పోతుంది.

చివరికి చలపతితొ మద్రాస్ నగరానికి వచ్చి కొత్త జీవితాన్ని మొదలుపెట్టింది. మంగమ్మ మంజరిగా మారింది.మంగమ్మ ప్రతిపాదించిన మంజరి పేరును పరబ్రహ్మ శాస్త్రి సమర్ధిస్తూ చేసిన వ్యాఖ్యానం  సరదాగా అనిపిస్తుంది. చలపతి తెలివి తేటలతో తాను కూడా ఒక సమిధగా మారి పోతుంది. క్రమంగా అన్ని పరిస్థితులు తెలుసుకొని స్వయంగా అభివృద్ధి చెందే పథకాలను తానే సిద్ధం చేసుకోగలుగుతుంది. అందుకు హీరోయిన్ కళ్యాణి స్నేహం ఎంతో తోడ్పడింది. చివరికి సినీవినీలాకాశం లో ఓ మూల నుండి జారి పడిపోయింది ఈ మిణుకు తార కళ్యాణి. వెంకటేశ్వర్లు, మెహెతా, మొదిలియార్, రాజన్ వంటి వారి సహాయాన్ని అంచెలంచలుగా వాడుకుంది మంజరి. రాజమణి, వసంతలను తన దగ్గరికి రప్పించుకొంది. మంజరి క్రమంగా చలపతిని దూరం చేసినా, తన కు ఏర్పడిన అనేక సమస్యల్లో చలపతి మీదనే ఆధారపడక తప్పలేదు.తనకు నచ్చని శర్మని కూడా చాతుర్యం తో తన భవిష్యత్తు ప్రణాళికల్లో ఉపయోగించుకో గలిగింది. తన విదేశీ యాన కోరికను గౌరవప్రదంగా తీర్చుకో గలిగింది. మర్లిన్ మన్రో, ఎలిజబెత్ టేలర్ వంటి నటీమణులను కలుసుకొని, వారి అనుభవాలను తెలుసుకొని ప్రపంచమంతా'నటీమణి' పరిస్థితి ఒకటే, ఎంతటి విషాదం పేరుకొని పోయి ఉంటుందో  అని తీవ్రమైన వ్యధకు లోనౌతుంది .   బొంబాయ్ లో సక్సేనా పరిచయం మంజరి కలలను పండించి హిందీ సినీ పరిశ్రమలోకం లో యధేచ్చగా వీరవిహారం చేయించింది.  మంజరి పతనానికే దారి తీసింది. చివరికి మిగిలింది....పగిలిన అద్దం లో ముక్కలైన మంజరి జీవితం....

ఈ నవలలో ఏ ప్రాంతం మాటలో కాని చాలా పదాలు నాకు కొత్తగా అనిపించాయి.
దత్తి, పిక్కట బిర్రుగా వచ్చారు, రెక్కొట్టింది, అపనయించుకుంటూ, ఆకాయ పోకాయ వెధవలు, తెక్కట్లాడుతూ, అలవసులవలకు, గనుపు, ఠాలా ఠోలీ రకం, లాయలాస, నిప్పచ్చరం, రొళ్ళగొట్టడం, మైదు .... ఇలాంటివి. ఇంకా చాలానే ఉన్నాయి,

ఈ పుస్తకం  రచించిన విధానం, శైలి, పరిశీలనా శక్తి  చాలా బాగుంది.  ఇటువంటి కథ సినిమా చరిత్ర లో మామూలే అనిపిస్తుంది. కాలువేస్తే జారిపోయే పాకుడురాళ్ళు,జీవనపోరాట గమనాన్ని, తన భావజాలం తో రచయిత బాగా వ్యక్తీకరించారు. ఆయా ఘట్టాలను చిత్రించిన విధానం బాగుంది. అట్టడుగు నుంచి జీవితం ప్రారంభించి ఆకాశమంత ఎత్తుకు ఎదిగిన ప్రతిభాశాలి మంజరి గురించి, తన ధ్యేయాన్ని సాధించుకోటానికి చేసిన కృషిని, అందివచ్చిన ప్రతి అవకాశాన్ని ఎలా సద్వినియోగం చేసుకున్నది చక్కటి మామూలు తెలుగు భాషలో రాసారు.
ఒక మహానటి జీవితంలో కొన్ని అనుభవాలను ఆధారంగా తీసుకున్నట్లు రచయిత వివరించారు. కథాక్రమంలో హీరోలతో వచ్చే బేధాభిప్రాయాలలో వేరే నటి కూడా మదిలో తళుక్కుమంటుంది. సినీ పరిశ్రమలో నటిగా కాలుపెట్టి, పునాదులేర్పరుచుకొని, జీవిత నిర్మాణాన్ని పూర్తిచేసుకోవటానికి ఆ నటి పడే మానసిక వ్యధ మాత్రమే కాకుండా ఎంతటి దుర్భర జీవితాన్ని ఎదుర్కోవాలో, ఎన్ని వ్యసనాలకు లోబడుతుందో తన స్వయం పరిశీలనతొ రచయిత వివరించారు. సస్పెన్స్ అని కాదు గాని ఎంతో ఉత్సుకతతో చదువుతాం. మనం ఇష్టపడే నటీమణుల జీవితం లో రహస్యాలు మన కళ్ళముందు అలా అలా పరుచుకొని పోతూనే ఉంటాయి.

ఎలాగైనా పైకి రావటమే ముఖ్యం. కన్నీరుకు విలువలేదు.మన హోదా కీర్తి ప్రతిష్టలు మాత్రమే జనం చూస్తారు. నిజాయితి తో దరిద్రమే తప్ప ఏమీ లేదు.ఏదో విధంగా డబ్బు సంపాదించాలి.  .....ఇదీ చివరికి మంజరిలో వచ్చిన మార్పు.

  తనను తరిమి కొట్టిన వారి మీద, అపవాదులు వేసిన వారి మీద విపరీతమైన ధ్వేషం పెంచుకుంటుంది.  ఇది మంజరికి సినీపరిశ్రమ మీద ఏర్పడిన కసి. చివరికి అటువంటి వారిని తన దయాదాక్షిణ్యాల కోసం వెంపర్లాడే పరిస్థితి ఏర్పరుస్తుంది. విపరీతం గా నిర్లక్ష్యం చేస్తుంది. తనకు తగిలిన దెబ్బలు, అనుభవించిన నరకయాతన ఆమె బతుకును తీర్చిదిద్దాయి. అనుభవాలనుండి వ్యక్తిత్వాన్ని వికసింప చేసుకుంది. మానవతా హృదయంతో అంతులేని సంఘసేవ చేసింది.

 సినీ జగత్తునే తన పాదాక్రాంతం చేసుకున్న మంజరి జీవితపు  అమానుషమైన  ముగింపును తట్టుకోటం మాత్రం మానవమాత్రుడి తరం కాదు!!!!

 ఇది ఒక  'Dance of Death ' .



*************************************************************************************************************************************************** 

 

మనస్వి © 2008. Template Design By: SkinCorner