25, ఆగస్టు 2010, బుధవారం

నాస్టీ ఎక్స్పీరియన్సా!!! అడ్వంచరా!!!!




ప్రతి సంవత్సరం వరలక్ష్మీ వ్రతం తప్పకుండా చేస్తాను. ఈ వ్రతమంటే నాకెంతిష్టమో చెప్పలేను. ఎప్పటిలాగే, చక్కటి పీఠం మీద బియ్యంపోసి, తమలపాకులు పెట్టి, విఘ్నేశ్వరున్ని తలచుకొని, ఒక పెద్ద బిందె మీద చిన్న బింద పెట్టి, చేతులుగా ఒక హాంగర్ కట్టి అమ్మవారి విగ్రహం తయారు చేసాను. అమ్మవారికి కొత్తగా కొన్న పట్టుచీర కట్టి, పెద్ద అంచులు కనిపించేట్లుగా అందంగా సద్దాను. పైన కలశం పెట్టి, కళకళ లాడే పెద్ద వెండి మొహాన్ని పొజిషన్ లో పెట్టాను. శుభ్రంగా ఉతికి ఉంచిన సవరాన్ని వెనకాల భుజాలదాకా పరచి, అందమైన పూలతో అలంకరించాను. పైన జలతారు మేలిముసుగు కూడా వేసాను. చక్కటి పూల దండ వేసి, వివిధ అభరణాలతో అలంకరించాను. గిల్టు, అసలు...అన్ని రకాలు ఉంటాయిలెండి. గౌరమ్మను కూడా చేసి పెట్టాను. వెనక గోడకంతా రకరకాల సైజుల్లో, షేపులతో రంగు రంగుల ఎలెక్ట్రిక్ దీపాల వరుసలతో అలంకరించాను. అమ్మవారి చుట్టూ ఎన్నో పూలు అందంగా ఉంచాను. కలువ పూల అందమైతే మరీ ప్రత్యేకంగా ఉంది. మొగలిపూల సువాసనలు ఆ గదంతా విరజిమ్ముతు ఏదో లోకాలకు తీసుకెళ్ళిపోతోంది. ఇంకా పెద్ద నుంచి చిన్న సైజు వరకు వెండి దీపాలు చుట్టూ పెట్టాను. చిక్కటి రంగులతో వేసుకున్న రంగవల్లి కన్నుల పండుగగా ఉంది. ఇదంతా అయ్యాక చూసుకుంటే అబ్బా.. మా అమ్మవారు ఎంత దేదీప్యమానంగా వెలిగిపోతున్నారో. వెలుగు జిలుగుల మా అమ్మవారు ఎంత ముద్దొస్తున్నారో. చాలా సంతోషమనిపించింది. అబ్బో ఎంత బాగా చేసానో అని భలే గర్వం కూడా వచ్చేసింది. నేను చేస్తున్న ప్రతి అలంకరణ మా అత్తగారు కూడా మెచ్చుకుంటూ ఉండడంతో ఇంకా మురిసి ముప్పందమైపోయాను. ఈ 'ముప్పందం' అంటే ఏమిటో నిజ్జంగా నాకుతెలీదు. ఇది మా అత్తగారి దగ్గిర పట్టిన మాటన్నమాట. కావల్సిన మిగతా పూజా సామాన్లన్నీ కూడా పొందంగా సద్దేశాను. నేను కూడా చక్కగా కొత్త పట్టుచీర కట్టుకొని, హాయిగా వంటినిండా నగలన్నీ పెట్టేసుకున్నాను. ఈ సారి చేయించుకున్న పచ్చలసెట్ వేసుకున్నాను. అబ్బో ఎంత బాగున్నానో..నన్ను చూసి నేనే మురిసి పోయాను. తెలుగాడపడుచంటే ఇలా ఉండాలి. నన్ను నేనే శభాష్ అని మెచ్చుకున్నాను. చక్కగా ఎర్రగా పండిన చేతి గోరింటాకు, చేతినిండా వేసుకున్నగాజులతో, మోచేయి వరకు మాత్రమే కనిపించేట్లుగా అమ్మవారితో ఒక ఫొటో తీసుకొని నా బ్లాగ్ లో పెట్టుకోవాలనిపించింది. అసలే ఈ మధ్యనే గాజులేసుకోనని రాసుకున్నాను బ్లాగ్ లో. తనకు తాను మురిసె తాటాకు గుడిసె అంటే ఇదేనేమో!!!

ఎట్లా నిన్నెత్తుకుందునమ్మా..వరలక్ష్మీ తల్లీ..ఎట్లా నిన్నెత్తుకుందునమ్మా...
ఇట్లా రమ్మనుచూ పిలిచీ కోట్లా ధనమిచ్చే నిన్ను....ఎట్లా నిన్నెత్తుకుందునమ్మా...అని పాడుకుంటూ వెళ్ళి నా డిజిటల్ కెమెరా తెచ్చాను. ముందుగా అక్కడే కూచుని అప్పటి దాకా నాకు సలహాలిస్తున్న మా అత్తగార్ని ఒక ఫొటో తీద్దామనుకున్నాను. ఆవిడకి ఫొటో దిగటమంటే చాలా ఇష్టం. ఫొటో అనంగానే చీర, అంచులూ, నగలూ అన్ని సద్దేసుకొని, నా వైపే కళ్ళర్పకుండా, నేనెప్పుడు ఫొటో తీస్తానా అని బిగించుకొని కళ్ళుకూడా తిప్పకుండా కూచున్నారు. తన ఫొటో ఏ కొంచెం బాగా రాకున్నా చాలా అలుగుతారు. కాని కెమెరా నుంచి చూస్తున్న నాకు అంతా ఎర్రగా కనిపిస్తోంది. ఎందుకబ్బా మా అత్తగారు ఎర్రచీర కట్టుకోలేదే అనుకుంటూ మళ్ళీ, మళ్ళీ చూసాను. ఊహూ... ఎర్రగానే కనిపిస్తున్నారు. ఇదేంటబ్బా, అనుకొని అమ్మవారి వైపు తిరిగి మళ్ళీ లెన్స్ నుండి చూసాను. అయ్యో! అమ్మవారు కూడా ఎర్రగానే కనిపిస్తున్నారు. అరె, అమ్మవారికి నేను ఎర్రచీర కాదే కట్టింది, అని మళ్ళీ చూసాను. లాభంలేదు, ఎర్రగానే ఉన్నారు. ఏంటబ్బా! అనుకొని, ఇంకో వైపున్న టి.వీ. వైపు లెన్స్ పెట్టి చూసాను. అంత పెద్ద నల్లటి స్క్రీన్ కూడా ఎర్రగానే ఉంది. అలా కాదని మిగతా రూమ్ ల్లోకి పోయి అన్ని చోట్లా చూసాను. మా ఇల్లంతా ఎర్రగానే ఉంది. ఎందుకు మా ఇల్లంతా ఎర్రగా అయిపోయిందో అర్ధం కాలేదు. ఈ లోపల మా అత్తగారు అసహనంతో, ఇంకెప్పుడమ్మాయ్, నన్ను ఫొటో తీసేదీ అని గట్టిగా పిలిచారు. అన్ని గదుల్లో సంచరిస్తున్న నేను, ఇంక ఆ ప్రయత్నాలు ఆపి మా అత్తగారి దగ్గరికెళ్ళి మళ్ళీ చూశాను. ఊహూ..ఇంకా ఎర్రగానే ఉన్నారావిడ. ఒక నిమిషం భయం వేసింది. కాని మెల్లిగా నా ట్యూబ్ లైట్ బుర్ర వెలిగి, కెమెరా పాడైంది అని అర్ధమైంది. వెంటనే గాలి తీసిన బెలూన్ లా అయిపోయాను. అయ్యో! ఫొటో తీసుకోలేనా..ఎంత దిగులేసిందో. దిగులెందుకు, రెండు లైన్ల అవతల ఒక ఫొటో స్టూడియో ఉంది. అక్కడికి పోతే నిముషాల్లో రిపేర్ చేసేసి ఇస్తాడు. తెలిసిన వాడే. మా కాలేజ్ కి ఆస్థాన ఫొటోగ్రాఫరే. ఇప్పుడే పోవాలి. సాయింత్రమైతే పేరంటాళ్ళందరూ ఒచ్చేస్తారు. ఇంకా చాలా పని ఉంది. తొందరగా వచ్చేస్తే సరి అని బయలుదేరాను.

కొంచెం దూరంలో ఒక జంక్షన్ ఉంది. రోడ్ దాటాలి. ఇటు పక్కగా కొన్ని కార్లు వరుసగా ఆగి ఉన్నాయి. నేను రోడ్ దాటాలి అంటే ట్రాఫిక్ కంట్రోల్ అయితే తప్ప దాటనన్నమాట. అందుకని అక్కడే ఒక కార్ కానుకుని నించుని సరిఅయిన చాన్స్ కోసం చూస్తున్నాను. మిగతావాళ్ళంతా, వాళ్ళ రెండు చేతులు ఊపేసుకుంటూ, వెహికల్స్ ఆపేసుకుంటూ చకచకా రోడ్ దాటేస్తున్నారు. చీ..నాకీ పిరికితనం ఎప్పుడుపోతుందో. అయినా ఈ మాత్రం జాగ్రత్త ఉండాలిలే...నేనే కరెక్ట్, అనుకున్నాను. ఇలా నా అలోచనా తరంగాల్లో నేనుండంగానే, నా పక్కనే నించున్న ఒకాయన, మేడం, మీ గాజనుకుంట, పడిపోయింది...చూసుకోండి అన్నాడు. అసలే నావి కొత్త గాజులు. పైగా చిన్న క్లిప్ తోటి ఉంటాయి అవి. ఆ క్లిప్ తీసి చేతికి వేసుకొని మళ్ళీ క్లిప్ పెట్టేయటమే. అలా అయితే ఎవరికైనా వేసుకోటానికి సైజ్ ప్రాబ్లం ఉండదు. నేను తరువాత ఈ గాజులు నా కోడలికివ్వాలనుకుంటున్నాను. మరి తన సైజేంటో, ఇప్పుడు తెలీదుగా...అందుకన్నమాట. ఆ క్లిప్ ఊడి పడిపోయాయేమో!!నేను సరిగ్గా పెట్టుకోలేదు అనుకుంటూ, నా చుట్టూ చూసాను. కాని అక్కడ నాకు ఏ గాజులు కనిపించలేదు. ఇక్కడ కాదు మేడం, ఆ కార్ పక్కన పడింది అన్నాడాయన. వెంటనే ఆ కారు పక్కన ఉన్న సందులో ఒక అడుగేసి చూసాను. కార్ చివర ఒకాయన నుంచుని నన్నే చూస్తున్నాడు. మేడం, ఇక్కడ ఉంది గాజు అన్నాడు. ఒక్క అడుగు లోపలికి వేయబోతున్న దాన్ని, ఎందుకో నా చేతుల కేసి చూసుకున్నాను. గాజులు చేతికే ఉన్నాయి. ఎక్కడో కార్ కి ఒక చివర నించున్నతనికి నా గాజు గురించేం తెలుసు! నా మట్టిబుర్రలో ఒక్కసారిగా ప్లాష్ వెలిగింది. చటుక్కున వెనక్కి తిరిగేసాను. నా పక్కనే నించున్న మనిషి నాకు దగ్గరిగా వచ్చేస్తున్నాడు. కారుకు అటు చివర ఉన్న మనిషికూడా నేను వెనక్కి తిరగటంతో నా వైపే మేడం..మేడం అని పిలుస్తూ స్పీడ్ గా వచ్చేస్తున్నాడు. ఏదో ప్రమాదం జరగబోతోందని అప్పుడు కాని నా కర్ధం కాలేదు. గట్టిగా అరుద్దామన్నా నోరు పెగల్లేదు. నా ఎదురుగా వస్తున్న మనిషిని ఒక్క తోపు తోసి కారు సందులోంచి బయటకు దూకేసాను. ఆ మాత్రం చేయటమే నాకెక్కువ. ఆ మనిషి ధఢాల్ మని కిందపడిపోయాడు పాపం. రోడ్ దాకా వచ్చేసి ఒకసారి వెనక్కి తిరిగి చూసాను. ఆ ఇద్దరూ నాకు దరిదాపుల్లో కనిపించలేదు. ఒక్క సారిగా నా గుండె ఆగిపోయింది. బాబోయ్..వాళ్ళు దొంగలు, అని అప్పుడనుకున్నాను. ఒళ్ళు చల్లబడిపోయి, గొంతు తడారిపోయి, అలాగే ఉండిపోయాను.

మెల్లిగా తేరుకున్నాను. రోజూ ఎన్నో వింటున్నాను. ఈ మాత్రం కూడా నాకు తెలివి లేదేంటని తిట్టుకున్నాను. రోడ్ మీద అంతమంది జనం ఉన్నా కూడా ఎంత ధైర్యం వీళ్ళకి!!! నా చేతులు తెగ్గోసేవాళ్ళా...మెడ నరికేసేవాళ్ళా... అమ్మో!!! వాళ్ళెంతోదూరం పోయుండరు. పర్లేదు, నాకు ధైర్యం చాలానే ఉందని ఒక నిమిషం సంబరపడ్డాను. అక్కడ ట్రాఫిక్ పోలీస్ కి చెప్పాలి. లేకపోతే...నా లాగా ఇంకా ఎందరో....ఇవాళ నా అదృష్టం బాగుంది. లేకపోతే ఏమైపోయేదాన్నో!!! మా ఇంట్లో నక్కైతే లేదుకాని తోక తొక్కి రావటానికి, బహుశ: ఆ వరలక్ష్మీ దేవే నన్ను కాపాడింది అనిపించింది. ఎంత చూసినా అక్కడ ట్రాఫిక్ పోలీస్ కనిపించలేదు. అక్కడ ఎక్కువ సేపు ఉండే ధైర్యం మాత్రం లేదు. కెమెరా వద్దు ఏం వద్దు అనుకోని, తల గిరగిరా అన్ని వైపులా తిప్పి చూసుకుంటూనే, మెల్లిగా ఇంటి దారి పట్టాను. వాళ్ళు ఇంకా నా వెనుకే ఎక్కడో రహష్యంగా వస్తూనే ఉన్నారని నా అనుమానం. వాళ్ళకి మా ఇల్లెక్కడ తెలిసి పోతుందో అని భయపడుతూనే, అన్ని వైపులా జాగ్రత్తగా చూసి కాని ఇంట్లో కాలు పెట్టలేదు. ఆ రోజు సాయంత్రం కనీసం ఒక్క పేరంటానికైనా ఇల్లు దాటి బయటికి పోతే ఒట్టు. మనసులోంచి పండగ సంబరం మాయమైపోయింది. మా అత్తగారు ఎంతడిగినా ఎందుకుపోవటం లేదో చెప్పలేదు. అసలేమైందో కూడా ఎవ్వరికీ చెప్పలేదు. అంతేకాదు ఓ రెండు మూడు రోజులు ఆ రోడ్ మీద ఒంటరిగా అస్సలు పోనేలేదు. ఎన్నడూ లేనిది, ఎంతో దగ్గిరలో ఉన్న మా కాలేజ్ కి మావార్నడిగి లిఫ్ట్ ఇప్పించుకున్నాను. ఈ నగరాల్లో ఇంత బాధలు పడుతూ ఉండే బదులు హాయిగా ఏదో ఒక చిన్న పల్లెటూళ్ళో ఏదో ఒక చిన్న పొలంలో పనిచేసుకుంటూ బతికితే, ఎంత శాంతంగా ఉండచ్చో అనిపించింది, ఆ క్షణంలో నాకు. అదీ కాకపోతే గోదారొడ్డున కె. విశ్వనాథ్ వేసేలాంటి ఒక చిన్న గుడిసె వేసుకొని బతికేసినా ఎంత సుఖమో!!!! నాకేమన్నా అయిఉంటే...బహుశ: బ్లాగ్ లోకం నుంచి ఒక బ్లాగ్ ఎగిరిపోయుండేదేమో!!!!! మిమ్మల్నందర్నీ మళ్ళీ పలకరించే యోగం నాకున్నట్లే ఉంది. అందమైన మా అమ్మవారి ఫొటో వచ్చే సంవత్సరం బ్లాగ్ లో పెడ్తాను లెండి. మరి ఈ సారి కుదరలేదుగా:)

మన మహిళలందరికీ శ్రావణమాస శుభాకాంక్షలు. పురుషులందరికీ ప్రత్యేక అభినందనలు. మరి మా పూజలన్నీ మీ కోసమేకదా:)
మాకోసం మీకే పూజలు లేవెందుకో. అందుకే...మా కిలాంటి కష్టాలు.....


********************************************************************************

15, ఆగస్టు 2010, ఆదివారం

జగతి శిగలో జాబిలమ్మకు వందనం



జగతి శిగలో జాబిలమ్మకు వందనం......
మమతలెరిగిన మాతృ భూమికి వందనం...

"ఐ లవ్ మై ఇండియా"...ఈ పదాలు పలుకుతుంటేనే మనసు ఎంత పులకరించిపోతుందో...శరీరం మీద రోమాలు నిక్కబొడుచుకుంటాయి...

స్కూల్ లోని ఆ జ్ఞాపకాలు ఇటువంటి రోజుల్లో ఇంకా, ఇంకా తలచిన కొద్దీ గిలిగింతలు పెడుతూనే ఉంటాయి.
గుర్తుకొస్తున్నాయి...అంటూ ముందుకు తోసుకొస్తాయి.ఆగస్ట్ పదిహేను వస్తోంది అంటే ఎంత హడావుడి..ఎంతసంబరం...
ఎప్పుడూ వేసుకొనే వైట్ డ్రెస్సే అయినా...ఇంకా ఎంతో ప్రత్యేకంగా ఉతికించి, తెల్లగా ధగధగ లాడుతోందో లేదో అన్ని కోణాల్లోంచి పరిశీలించి చూస్తే తప్ప తృప్తే కలిగేది కాదు.
తెల్లటి కాన్వాష్ షూష్, సాక్స్ ని కూడా మళ్ళీ మళ్ళీ కళ్ళు జిఘేల్ మనేలా ఉన్నాయోలేదో ఒకటికి పదిసార్లు చూసుకోవాల్సిందే కదా...
నల్లటి రిబ్బన్లు తెల్లగా ఉతుక్కోని అవి మాత్రం నేనే ఇస్త్రీ చేసుకోని చక్కగా మడతపెట్టుకొంటే ఎంతో పనిచేసిన ఆనందం:)
చక్కగా తయారైపోయి, డ్రెస్ కి జెండా పెట్టుకోని...ఓహ్..ఎదో మహా ప్రపంచాన్నే గెలిచేశామన్న ఆ గర్వం ఎప్పటికీ మరువలేనిదేకదా...
పాఠశాల లోని జెండా వందనం, పెరేడ్ ఎంత గొప్పగా అనిపించేవో....ఎంతటి ఉద్వేగం...ఎంత ఉత్తేజం..
స్టేజ్ మీద దేశభక్తి గీతం పాడుతూ, చేతిలో పెద్ద పెద్ద జెండాలు ఊపుతూఉంటే...ఎవరెస్ట్ శిఖరం ఎక్కినంత ఆ పరవశం ఎప్పటికైనా తీరేదా...
చేతినిండా రకరకాల పూలతో అమరవీరులకు వందనం అర్పిస్తుంటే, భరతభూమి వన్నెచిన్నెల సోయగాలన్నీ తలపుకొచ్చేవి కాదా....
పొరపాటున, ఏదైనా బహుమతి వచ్చిందంటే, కాశ్మీరం నుంచి కన్యాకుమారి దాకా ఊరేగిన సంబరమే....
తెలిసీతెలియని ఆ మైమరపే నిజమైన ఆనందం అనిపిస్తుంది. ఆ అమాయకత్వంలోనే ఈ దేశభక్తి, తల్లిమీద ప్రేమ లాగా స్థిరపడుతుంది. ఈ నాడు కలిగే భావాలను ఎప్పటికీ కొనసాగించగలగాలి.

పెరిగి పెద్దైనా కొద్దీ ఆ సంబరాల ముచ్చట్లు ఏవి? ఉన్నత విద్యా స్థాయిలో ఇది ఒక శలవు దినం మాత్రమే.....ఇంక రీసెర్చ్ చేసినంత కాలం అసలే సంబంధం లేకుండా.. ఆరోజున ఎక్కడ ఉంటామో..ఏ పని పూర్తి కాలేదన్న టెన్షన్ లో ఉంటామో....మామూలు రోజులకి ఆ రోజుకీ తేడా తెలియకుండానే గడచిపోయేది.

కాని...ఇప్పుడో..అలా లేదు. చిన్నప్పటి ఆ ఉత్సాహం తిరిగి మొలకలు వేస్తోంది. ఈనాటి..ఈ చిన్నారి విద్యార్ధులను చూస్తుంటే.....గుర్తుకొచ్చే బాధ్యత ఎంతో మహోన్నతంగా కనిపిస్తుంది. వీరికి ప్రగతిమార్గం చూపించాలి అని గుండెలోతుల్లోంచి పొంగివచ్చే భావాలెన్నో... వాళ్ళ కళ్ళల్లో కనిపించే ఆ ఉద్వేగపు నిర్ణయాలు...వారి భవిష్యత్తుకి నేను వేసే పునాదులని గుర్తు చేస్తున్నాయి. వీరిమీదే ఆధారపడిన దేశభవిష్యత్తుకి వీరికొక స్పూర్తిని కలిగించాలి. వీరి భావాలను గౌరవించి... మనోధైర్యాన్ని పెంచాలి ...తప్పదు... మళ్ళీ మళ్ళీ జరుపుకునే ఈ పండుగ, వారికి దేశభక్తిని పెంచి మాతృభూమి పట్ల విపరీతమైన అభిమానాని పెంచుతోంది. అందుకు ఉదాహరణే ఈరోజు వారాలాపించిన ఈ గీతం.
ఏదేశమేగినా, ఎందు కాలిడినా
పొగడరా నీ తల్లి భూమి భారతిని
నిలుపరా నీ జాతి నిండు గౌరవము.......

ఎన్ని విప్లవాలు వచ్చినా...సమస్యలు ఏర్పడినా....కష్టాలు నష్టాలు కలిగినా...ఎన్ని మార్పులొచ్చినా సరే, ఈ సంబరాలను మరచిపోవాల్సిన అవసరమే లేదు. ఈ విజయగీతిక ఆలాపనే వచ్చే తరాలవారి బాధ్యతను కూడా కొనసాగిస్తుంది. మనమే కాదనుకుంటే ...ఆ వీరుల త్యాగఫలానికి అర్ధమేలేదు. ఏం సాధించాం...అని కనుక అడిగినట్లైతే..ఆ ప్రశ్న మనకే వర్తిస్తుంది. అభివృద్ధే లేదని మనస్పూర్తిగా ఎవరైనా చెప్పగలరా? పెరిగిన అరాచకాలకి ఎవరు బాధ్యులు? స్వాతంత్ర్యసంబరాలకి దీనికి ఏమిటి సంబంధం? ఇంత పెద్ద ప్రజాస్వామ్య దేశంలో బాధ్యతలు విస్మరించి స్వార్ధం పెరిగితే ఎవరిది నేరం. పాపప్రక్షాళణకు ప్రయత్నాలు జరగాలి గాని, ఈ పండగలవల్ల లాభం ఏంటి...అంటే అది మూర్ఖత్వం కాదా? అరబిందుని, వివేకానందుని బోధనలు కలకాలం నెమరువేసుకోవాల్సిందే.... ఎన్నో ఇతర పండుగలు, వేల రూపాయలు ఖర్చు పెట్టి జరుపుకుంటూనే ఉన్నముగా? వాటి పరమార్ధం ఏం సాధిస్తున్నాం? ఎప్పుడో కొద్దిగా దేశభక్తిని ప్రేరేపించే ఇటువంటి చిన్న పండుగలతో వచ్చే నష్టమేమిటి? ప్రపంచంలో అన్ని దేశాలలో ఇంతకంటే ఘోరమైన విపత్తులే సంభవిస్తున్నాయి. వారికి దేశభక్తి లేదా? స్వాతంత్ర్యదినోత్సవాలు జరుపుకోటం లేదా? తనకంటే ఎంతో చిన్న దేశమైన ఇంగ్లాండ్ సంకెళ్ళనుంచి విడిపోయిన అమెరికా స్వాతంత్ర్యదినోత్సవం ఇంకా ఎంతో గర్వంగా జరుపుకుంటూనే ఉంది. ఏం... వారికి ఏ సమస్యలూ లేవా?

మంచి దేశం నిర్మించాలి అంటే ముందు మంచి పౌరులను తయారుచేయాలి....

భారతీయ సంస్కృతిని ప్రపంచమే గౌరవిస్తున్న ఈ రోజుల్లో...మనలోనే ఎన్నో వ్యతిరేక భావాలను వింటున్న నాకు ఇలా రాయాలనిపించింది.

సంపదలతో సొంపులొసగే భారతీ జయహో...మంగళం.. వందేమాతరం...

ప్రతి ఒక్కరికీ నా హృదయపూర్వక స్వాతంత్ర్యదినోత్సవ శుభాకాంక్షలు.




*******************************************************************
 

మనస్వి © 2008. Template Design By: SkinCorner