సినిమాలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
సినిమాలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

5, డిసెంబర్ 2010, ఆదివారం

ఆలస్యం...అమృతం ....




వావ్!!! నేను కూడా ఒక మూవీ ప్రీమియర్ షో కి వెళ్ళానోచ్......ఆ మూవీ......"ఆలస్యం...అమృతం"....

ఎలా అంటారా...అసలీరోజు రేపటి ఫారన్ డెలిగేట్స్ మీట్ అరేంజ్మెంట్స్ కోసం కాలేజ్ కెళ్ళాలి. దారిలో అభినందన భవాని కనిపించారు. చాలారోజులయింది, ఎలా ఉన్నావు, ఏంటి...అని పలకరించి, నేను, ఇంకొంతమంది మన’ అప్నాఘర్’ మెంబర్స్ ఆలస్యం...అమృతం సినిమా స్త్రీలకోసం ఫ్రీ షో అని రామానాయుడు రమ్మన్నారు వెల్తున్నాం....దాని తర్వాత ప్రెస్ మీట్ ఉంటుంది. నువ్వూరా...అన్నారు. ఇలాంటి ఫ్రీ మూవీస్ నేనెప్పుడు చూడ్లేదు...కాలేజ్ పోవాలిగా...మా ప్రిన్సిపల్ గుర్తొచ్చారు. ఇప్పుడు కాదులే అని వెళ్ళబోయాను. ఫర్వాలేదు, మీ ఫ్రెండ్స్ ని కూడా తీసుకొని రా, ఇంకా చాలా టైం ఉందిగా అని వెళ్ళిపోయారు.

నేను కాలేజ్ కెళ్ళానే గాని మనసంతా ఆ సినిమా ధ్యాసే. ఎవరెవరొస్తారో చూడాలని ఆరాటం. తొందరగానే మా పనైపోవటం తో మా ఫ్రెండ్ కి చెప్పి మనం పోదామా అన్నాను. తను అంతకంటే హుషారుగా, మరి చెప్పవేం పోదాం పదా..వాళ్ళందరితో మనకెప్పుడు చాన్స్ వస్తుంది, అట్లా చూస్తే చాలా మజా వస్తుంది పోదాం పా అంది. ఇంకేముంది...ఇద్దరం ఆటో ఎక్కేసాం.... ఇంత వరకు ఆ సినిమా పేరు కూడా వినలేదు. నటీ నటులెవరో కూడా తెలీదు. హీరోయిన్ ఎలాగూ బాంబే అమ్మయేలే అని నవ్వుకున్నాం.

థియేటర్ కి పోగానే మా మహిళా సోదరీమణులందరూ అక్కడే ఉన్నారు. భవాని నన్ను చూసి నాకు తెలుసులే నువ్వొస్తావని, మీరిద్దరే వొచ్చారేంటి...ఇంకెవరూ రాలేదా అన్నారు. ఇవాళ కాలేజ్ కెళ్ళింది మేమిద్దరమేగా మరి అన్నాను:) సరే పదండి పైకి పోదాం అని తీసుకెళ్ళారు. ఐమాక్స్ లో నాకు తెలియని ఇంకో థియేటర్ ఉందని అప్పుడే తెలిసింది. ప్రీమియర్ షోలకి మాత్రమే ఆ థియేటర్ వాడుతారుట. ఇంతా చేస్తే లోపల అంతా లేడీసే, వేరే వాళ్ళెవ్వరూ లేరు. ఓహో..ఇది వుమన్ ఓరియెంటెడ్ మూవీ లా ఉందే అనుకున్నాం. మా అందరికీ పాప్కార్న్ కూడా ఇచ్చారు. అది తింటూ సినిమా చూట్టం మొదలుపెట్టాం.

హీరోయిన్ వైదేహి ఆటోలో రైల్వేస్టేషన్ కి రావటం తో మొదలైన సినిమా చివరివరకూ ఫ్లాట్ ఫాం మీదనే జరిగి పోయింది. ఒకటీ రెండూ పాటలకు మాత్రం వేరే లొకేషన్ లో తీసారు. మొత్తం అయిదు పాటలూ, కోటి సంగీతం లో బాగానే ఉన్నాయి. ఈ సినిమాకి సెట్టింగ్ ల ఖర్చు ఎక్కువలేనట్లే.

తల్లిదండ్రులు సెటిల్ చేసిన పెళ్ళి వద్దంటే తల్లి ఆత్మహత్య చేసుకుంటానన్నదని, తానే ఆత్మ హత్య చేసుకోటానికి అన్నవరం రైల్వే స్టేషన్ కి వస్తుంది. రాబోయే సింహాద్రి ట్రైన్ కింద పడి చనిపోవాలని ఈ అమ్మాయి ఆలోచన. స్టేషన్ లో కూర్చోని తాను చనిపోదలచుకున్నానని ఒక సూసైడ్ నోట్ రాస్తుంది. ఇంతలోనే అది గాలికి ఎగిరిపోతుంది. అక్కడినుంచి స్టేషన్ లో అనేక పాత్రలు పరిచయమౌతాయి. అక్కడి స్టేషన్ మాస్టర్, ఒక చిన్న ఫామిలీ, ఒక దొంగ, ఓ ప్రభువు కుమారుడు, ఇద్దరు జ్యోతిష్కులు, ఒక గ్రూప్ ఫాక్షనిస్ట్ లు, ఇద్దరు సన్యాసులు, అక్కడే ఒదిలేయబడ్డ ఒక చంటి బాబు క్రమంగా మనకి పరిచయమవుతారు.

స్టేషన్ లో వదిలేయబడ్డ ఆ చిన్న బాబును హీరో రాము, వైదేహి కొడుకనుకొని ఆమెకివ్వడానికి ప్రయత్నిస్తాడు. కాని ఆ బాబు ఆమె కొడుకు కాదని తెలుసుకొని ఇద్దరూ ఆ బాబు తల్లి కోసం వెతుకుతూ ఉంటారు. ఈ లోపల ఎగిరిపోయిన వైదేహి సూసైడ్ నోట్ దొరికి సన్యాసులు ఆమెని కాపాడాలని స్టేషన్ లో వెతుకుతూ ఉంటారు. కాని అనుకోకుండా ఆ నోట్ హీరోకి దొరుకుతుంది. అతడు కూడా ఆ అమ్మాయిని కాపాడి ఆత్మహత్య చేసుకోకుండా జీవితం విలువ గురించి చెప్పాలని ప్రయత్నిస్తూ ఉంటాడు ఆ అమ్మాయి కోసం వెతుకుతూ ఉంటాడు. ఆ అమ్మాయి దొరికేవరకూ ట్రైన్ లేట్ కావాలని కోరుకుంటూ ఉంటాడు. ఈ లోపల మిగతా పాత్రలతో హాస్యం పండించటానికి ప్రయత్నించారు దర్శకుడు చంద్ర మహేశ్. మధ్యలో కౌశ తో ఒక అయిటమ్ సాంగ్ కూడా వస్తుంది.

ఈ సినిమాలో కొన్ని సంఘటనలు బాగున్నాయి. స్టేషన్ కి వచ్చిన అనాధ బాలలను ఓదార్చిన విధానం బాగుంది. ఫాక్షనిస్ట్ ల తో హాస్యం కూడా బాగుంది. మధ్య మధ్య లో కొన్ని స్పెషల్ జోకు లొస్తాయి. అవికూడా బాగానే ఉన్నాయి.

ట్రైన్ లేట్ అయినా కొద్దీ కొన్ని సంఘటనలు జరుగుతూనే ఉంటాయి. ఇంతకీ ఆ బాబు ఎవరన్నది కూడా సస్పెన్స్ ని పెంచుతుంది. అన్నట్లు ఆ తల్లి మొదటి నుంచి మన కళ్ళముందే ఉంటుందండోయ్. మరి మీరు కనుక్కో గలరేమో చూడండి. అంతే కాదు, ఇంతకీ ఆత్మహత్య చేసుకోదలచిన అమ్మాయిని రాము కనుక్కొని కాపాడ గలడా! ఆత్నస్థైర్యాన్ని పెంచుకొని జీవితాన్ని సక్రమంగా మలచుకోవాలి గాని ఆత్మహత్య సరిఅయిన విధానం కాదు...అనే మెసేజ్ మీద ఈ సినిమా తీసారు. ఆత్మహత్య వద్దూ అన్న ఈ సినిమాలో ఒక ఆత్మ హత్య కూడా చూపించారు. ఈ సినిమా బాగుందా లేదా అన్నది మీరే తేల్చుకోండి. ఒకటే సెట్ మీద అనేక సినిమాలే వచ్చాయి. వాటన్నిటిలో ఇదికూడా ఒకటే. ఆ మధ్య వచ్చిన మొత్తం సినిమా ఎయిర్ పోర్ట్ లోనే జరిగిన ప్రయాణం చూసాను. ఫరవాలేదనిపించింది. ఈ సినిమా కూడా ఫరవాలేదు. అంతే.

సినిమా అయిపోయిన తరువాత ప్రెస్ మీట్ జరిగింది. ఫ్రీ గా సినిమా చూసిన ఈ మహిళలందరూ ఆ మీట్ లో పాల్గొనాలి. బయటకు రాగానే అక్కడ ఒక్కసారే బ్రైట్ లైట్స్ , కామెరాలతో, మైక్ లతో చానల్స్ వాళ్ళు కనిపించారు. కవిత,
సినిమా హీరో నిఖిల్, దర్శకుడు చంద్ర మహేష్, అశోక్ కుమార్, శివారెడ్డి మొదలైన వాళ్ళున్నారు. ఇంక మా వాళ్ళందరూ హుషారుగా నిర్మాత రామానాయుడుని,
సినిమా ని తెగ పొగిడేసారు. ఇదంతా ఇంక రోజూ టి.వి. లో కొంతకాలం వస్తూ ఉంటుందిట. నేను అందులో పాల్గొనలేదు కాని, అంతా అయిన తరువాత ఆ డైరెక్టర్ తో మాత్రం కాసేపు నా డౌట్స్ గురించి మాట్లాడాను. అంటే కుంజెం ఇంటర్వ్యూ చేసానన్నమాట. ఏమాటకా మాటే చెప్పుకోవాలి. హీరో కన్నా డైరెక్టరే బాగున్నాడు. హీరోయిన్ మదాలస కూడా బాగుంది.

మీరూ చూడండి మరి ఈ సినిమా. ఫ్రీ గా వచ్చింది నువ్వు చూసేసావ్ అంటారా. మరి ఇవాళ నా అదృష్టం అలా వచ్చింది. అన్నట్లు ఈ సినిమాలో "నీ కివాళ అదృష్టం కలిసొస్తుంది" అన్న వేయింగ్ మిషన్ కాప్షన్ చాలా సార్లే వస్తుంది. చూడాలి మరి నాకెంత కలిసొస్తుందో ఈ సినిమా తరువాత.:) ఆలస్యం మూలం గా అమృతం సంపాదించుకోవచ్చు మరి.


`ఏడవకే...ఏడవకే చంటిపాపాయి ...’




*******************************************************************************

4, ఏప్రిల్ 2010, ఆదివారం

వరుడు...




వరుడు...

నేను ఎంతో ఆశగా ఎదురు చూసిన చిత్రం. మొదట్లోనె చెప్పేస్తున్నానండి. ఊహూ...నాకు నచ్చలేదు....

ఇన్నాళ్ళకు మళ్ళీ మంచి ఓ కుటుంబ కథా చిత్రం తృప్తిగా చూడొచ్చు అన్న ఆశతో వెళ్ళాను. ఎక్కువ రష్ ఉండదు, చల్లటి వాతవరణం లో ఆనందంగా చూడొచ్చు అని మేము INOX(GVK) సినిమా కి వెళ్ళాము.

పబ్ లో యువత కేరింతలతో ఈ సినిమా మొదలౌతుంది. హీరో సందీప్ కి గర్ల్ ఫ్రెండ్స్ కూడా చాలా మందే ఉంటారు. ఇక్కడ పక్కా మోడర్న్ సాంగ్ పాడేస్తాడు కూడా. ఇతని తల్లి తండ్రులు ప్రేమ వివాహం చేసుకుంటారు. ఏ సమస్య లేకుండా ఆనందంగా ఉంటారు. వాళ్ళ కుమార్తె కూడా ప్రేమ వివాహమే చేసుకుంటుంది. అలాగే తమ కుమారుడు కూడా ప్రేమ వివాహమే చేసుకుంటాడనుకొని అతని కి వివాహం చేయాలని, అతని గర్ల్ ఫ్రెండ్స్ ఫొటో లన్నీ చూపించి, నీ కెవరిష్టమో చెప్పు, వారితోటే నీ వివాహం నిర్ణయిస్తాం అని సందీప్ ని అడుగు తారు. కాని వాళ్ళు ఎదురుచూడని సమాధానం ఇస్తాడు సందీప్. తల్లితండ్రులు కుదిర్చిన వివాహమే తనకిష్టమని, తమ పూర్వీకుల లాగా పదహారు రోజుల సంబరాలతో, అయిదు రోజుల పెళ్ళి కావాలి అంటాడు. లవ్ మాజిక్ పెళ్ళిపీటలమీదే అ౦టాడు.

తల్లితండ్రులు ఆ మాట నమ్మలేక పోయినా, క్రమంగా ఆ విషయం గ్రహించి పెళ్ళిళ్ళ పేరయ్య బ్రమ్హానందం తో మాట్లాడి అతను తెచ్చిన ఫొటోలు చూసి అదిరిపోతారు. అంత మోడర్న్ గా ఉంటారు ఆ అమ్మాయిలు. సందీప్ తన తల్లితండ్రులకు వారు ఏ అమ్మాయిని చూసినా తను ఇష్టపడ్తానని, తను ఆ అమ్మాయిని చూడాల్సిన అవసరం కూడా లేదని, పూర్తి బాధ్యత వారిదేనని వారికి నమ్మకంగా చెప్తాడు. చివరికి వాళ్ళు ఒక అమ్మాయిని మెచ్చి పెళ్ళి కుదిరిస్తారు. పెళ్ళికొడుకు ఫొటో కూడా చూడకుండానే పెళ్ళికి ఇష్టపడ్డాడని తెలిసిన ఆ అమ్మాయి కూడా తనూ పెళ్ళికొడుకును పీటల మీదనే చూస్తానంటుంది. అందరు బంధువులను ఆహ్వానించి అయిదు రోజుల వివాహానికి సంబరాలు ప్రారంభిస్తారు.

ఇక్కడ కృష్ణా జిల్లా ప్రస్తావన కూడా ఉంది. అమ్మాయి ఊరిలో కృష్ణా నదీ తీరానా పచ్చటి పొలాలలో, పెద్ద పందిరి వేసి ఆడంబరంగా పెళ్ళి ప్రారంభిస్తారు. ఇదంతా కూడా చూడటానికి చాలా ఆహ్లాదంగా ఉంటుంది. పెళ్ళి సాంప్రదాయాలు కూడా చూపించారు. కన్యాదానం చేయించారు. జీలకర్రాబెల్లం కూడా తలమీద పెట్టించారు. మధ్యలో తెర తీసి ఇద్దరూ ఒకరినొకరు మొదటిసారిగా చూసుకొన్న అనుభూతి కూడా చాలా బాగుంది.

వాళ్ళిద్దరి మధ్యా తొలగించిన తెర ఆ తరువాత నా ఆనందానికి తెర దించుతుందని అప్పుడు నేననుకోలేదు. మైమరచి చూస్తున్న మనసు అదిరిపోయేలా, అంత పెద్ద పెళ్ళి మండపం కూలిపోవటం మొదలైంది. గందరగోళం...అంతా గగ్గోలు...ఒక్కసారిగా కల్లోలం మొదలైపోతుంది. అంతా తేరుకున్న తరువాత తేలిన విషయం, హీరోయిన్ కిడ్నాప్ అయిందని.

ఇదిగో ఇక్కడినుంచే నండి, నేను సినిమా ఇంక ఏమాత్రం భరించ లేక పోయాను. అంత చల్లటి వాతావరణం లో కూడా నా బుర్ర వేడెక్కిపోయి, వేడి వేడి ఆవిరుల సెగల పొగలు మొదలైనై. ఎంతో గొప్పగా ఊహించుకొని ఒచ్చిన సినిమా అరగంటలోనే నాకు నిరాశా నిస్ప్రుహలను మిగులుస్తుందనుకోలేదు.

కిడ్నాప్ అయిన పెళ్ళికూతుర్ని మర్చిపొమ్మని, తాళి ఇ౦కా కట్టలేదు కాబట్టి, ఇ౦కో పెళ్ళిచేసుకొమ్మని అక్కడి వారు సలహా ఇస్తారు. జరిగిన కన్యాదానానికి విలువలేకపోతే స౦ప్రదాయాలకే విలువ పోతు౦దని, తనకి వివాహ౦ జరిగిపోయి౦దని, భార్యని కాపాడట౦ తన ధర్మమని చెప్తాడు. కిడ్నాపర్ దివాకర్ అని తెలుసుకొని అతన్ని వెతుక్కుంటూ వెళ్ళిన హీరో, రోజూ ఆమె బస్ ఎక్కే చోట ఒక చిన్న అమ్మాయి చెప్పిన అనుభవంతో సంతోషిస్తాడు. చిన్న వయసులో చదువుకోకుండా కష్ట పడుతున్న ఆ అమ్మాయిని స్కూల్లో చేర్పిస్తుంది. ఒక గులాబి మొక్క ని ఇస్తుంది. ఆ మొక్కకు పూసిన గులాబిని చూసి సందీప్ సంతోషిస్తాడు.

ఆమె స్నేహితురాలైన ఒక టీచర్ని కలుసుకుంటాడు. ఇది ప్రస్తుతం జరుగుతున్న ఆసిడ్ అటాక్ లకు ఒక ఉదాహరణ. ఆ టీచర్ మీద ఆసిడ్ పోయబొతున్న విలన్ అనుచరుడినుంచి ఆమెని రక్షిస్తాడు. ఆమె దగ్గరినుంచె విలన్ వివరాలు, హీరోయిన్ సమస్య తెలుసుకుంటాడు. అప్పటినుంచి సినిమా చివరి వరకు కావల్సినంత, రకరకాల వయొలెన్స్ చూడొచ్చు. సినిమా ఎంతగా డైవర్ట్ అయిపోయిందో మనకి కూడా బాగానే అర్ధమైపోతుంది.

మామూలు క్రైం మూవీ కి ఏమాత్రం తీసిపోదు. కావాల్సినన్ని మసాలాలు దట్టించారు. ఒక హాలీవుడ్ లెవెల్ కిస్సింగ్ సీన్ కూడా చూపి౦చారు. తెలుగు సినిమాలో ఇటువంటి సీన్ నేను మొదటిసారిగా చూస్తున్నాను. అంతేకాదు ఆడపిల్లకు ఇష్టమైతే ఎంతకైనా తెగిస్తుంది అని హీరోయిన్ తో దర్శకుడు చెప్పించాడుకూడా. ఏమో, ఇది మాత్రం నాకు నచ్చలేదు.

అంతేకాదండోయ్, హీరోయిన్ చేతికి సెలైన్ బాటిల్ పెట్టి, బాటిల్ అడ్డ౦గా పట్టుకొని, కొండల మీంచి, వాగుల్లోంచి, వీర లెవల్ల్లో, ఏ మాత్రం చెదిరిపోకుండా తీసుకొచ్చేస్తాడు.హీరోయిన్ కూడా తరువాత ఆ సూదిని టక్కున చేత్తో చాలా ఈజీ గా తీసేసు కుంటుంది.

ఇంకా ఫైటింగ్ కోరిక తీరక పోతే, చివర్లో ఒక అరగంట సేపు రకరకాల కుస్తీలు, కావాల్సినన్ని గ్రాఫిక్స్, మాయలు మంత్రాలు కూడా చూడొచ్చు. బహుశా, తన సిక్స్ పాకో, జీరో పాకో...ఆ బాడీ ఏదో చూపిద్దామని, వరుడుగా వచ్చినట్లున్నాడు.

నేను మాత్రం దర్శకత్వం, రచన, సంగీతం ఇతర ఏ సాంకేతిక అంశాల గురించి మాట్లాడ దలుచుకో లేదు. ఈ సినిమా లో కావాల్సినంత శిరోభారాన్ని పెంచిన ఈ అంశాల ప్రత్యేకత నాకేం కనిపించలేదు. హేమచంద్ర పాడిన ఒక పాట బాగుంది. రేలారె పాటకూడా బాగానే ఉంది. అ౦త రాకీ సా౦గ్స్ అయితే ఏ౦లేవు.

చక్కటి కుటు౦బకథా చిత్ర౦, పదహారు రోజుల పెళ్ళి స౦బరాలు కళకళ లాడుతూ చూసేద్దామనుకు౦టే మాత్ర౦ పప్పులో కాలేసినట్లే... ఈ సినిమా కి ఇచ్చిన పబ్లిసిటీ ఒకటైతే, మనకు చూపించేది మాత్రం వేరొకటి. హీరోయిన్ ఒక పంజాబీ అమ్మాయి. నాకైతే ఏం బాగా లేదు. ప౦జాబీ అమ్మాయి తెలుగు పెళ్ళికూతురి అల౦కార౦, కట్టిన చీర స౦ప్రదాయబద్ధ౦గా లేవు. అల్లు అర్జున్ కూడా బాగాలేడు. ఒత్తి ఒత్తి పలికిన ఆ డైలాగ్స్ కూడా ఏం బాగా లేవు. సినిమా మొత్తం మీద నాకు ఎంతో నచ్చిన వారు ఒకరు ఉన్నారు. అదేనండి, నా ఫేవొరెట్ హీరోయిన్ సుహాసిని. ఇందులో హీరో తల్లి ఈమెనే. ఎంత బాగుందో చెప్పలేను.

ఈ సినిమాకి వరుడు అన్న పేరు కాకు౦డా..'కూష్మాండా' అన్నపేరు పెడితే బాగుండేది. ఎందుకంటే...అది చూసిన వాళ్ళకే అర్ధం అవుతుంది లెండి:) ఇప్పటి వరకు ఈ సినిమా చూడని వారెవరైనా ఉంటే చూడాలన్న ఆ ఉత్సాహాన్ని తగ్గి౦చుకుంటే మీకే మంచిదనుకుంట. బతికుంటే బలిసాకు తిని బతకొచ్చు. కనీస౦ రాబోయె ప్రప౦చ ఆరోగ్యదిన౦ వరకైనా హెల్దీగా ఉ౦డొచ్చు. చూసేసిన వాళ్ళున్నారనుకొండి...నా లాగే తొ౦దరపడి... ఇది వాళ్ళ ఖర్మ. మంచి థియేటర్ ఎంచుకొని మరీ పోతారేమొ నాలాగా...ఒద్దండి బాబూ.. ప్లీజ్...

మొత్తానికి ఆహ్లాదం తక్కువ...భీభత్సం ఎక్కువ:)

*************************************************************************

12, డిసెంబర్ 2009, శనివారం

'కథ'...



కథ
ఇది నిజ౦గా జరిగి౦దా?

ఇవాళ పొద్దున్నే ఈ సినిమా కి వెళ్ళాను. సినిమా రిలీజ్ అవగానే మొట్టమొదటి ఆట చూడడ౦ నా కిదే మొదటి సారి. మీ అ౦దరి క౦టే నేనే ము౦దు చూసేసి ఉ౦టాను. మీరెవ్వరు ఇ౦కా చూసిఉ౦డరు లె౦డి. కాబట్టి దాని రివ్యూ రాస్తాను...మీరు చదవాలి.

జార్ఖండ్ రాష్టృంలో రెండు సంవత్సరాల క్రితం జరిగిన సంఘటనతో ఈ సినిమా మొదలౌతుంది. ఒక కుటుంబం కార్ మీద దుండుగుల దాడి, ఆ తర్వాత న్యూస్ పేపర్ లో "అంధ్రా కుటుంబం ఆత్మహత్య" అని ఒక వార్త ఒస్తుంది. ఆ తరువాతనే టైటిల్స్. టైటిల్స్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి.

హీరోయిన్ జెనీలియా(చిత్ర), వాలీ స్కూల్ అరకు లో టీచరుగా ఒస్తుంది. తను జార్ఖండ్ నుంచి ఒచ్చానని చెప్పటం తో అంత దూరం నుంచి ఇక్కడికి రావటానికి కారణం అడుగుతుంది ప్రిన్సిపాల్. తనకు తల్లీ, తండ్రి, అక్కా, చెల్లి, అన్నా, తమ్ముడు అందరు ఉన్నారని, తాను చాలా పిరికిదని, తనవాళ్ళు గేలి చేయటం తో తన ధైర్యం చూపించటానికే ఇక్కడిదాకా ఒచ్చానని చెప్తుంది. ప్రిన్సిపల్ కు ఉన్న వేరొక ఇంటిలో అమెని ఉండమంటుంది ప్రిన్సిపల్. తన మేనకోడలు సుగుణను తోడిచ్చి ఆ ఇంటికి పంపిస్తుంది.

తన లగ్గేజ్ సద్దుతానన్న సుగుణను పంపించి వేసి తనే సూట్కేస్ తెరిచి సద్దుకుంటుంది. అందులో చాలా మందులు, ఒక టార్చ్, ఒక కత్తి కూడా ఉంటాయ్... .

టీచరు గా మొదటిరోజు స్కూల్ అనుభవం చూడడానికి సరదాగా ఉంటుంది. పిల్లలంతా తనేమి చేస్తే అదే వాళ్ళు చేస్తారు. అల్లరి పిల్లలు. అందుకే వాళ్ళని లొంగదీసుకోటానికి మర్నాడు ఒక తేలుపిల్లను చిన్న సీసాలో పట్టుకొచ్చి అది తన ఫ్రెండ్ సీతామహాలక్ష్మి అని, తన మాట వినని వారెవరన్నా ఉంటే అది కరిచేస్తుందని పిల్లల్ని భయపెడ్తుంది. కావాలంటే అది మాట్లాదుతుందని కొంచెం వెంట్రిలాక్విజం ప్రయోగిస్తుంది. పిల్లలు నిజమే అనుకుంటారు. ఇటువంటి కొన్ని సంఘటనలు సరదాగా అనిపిస్తాయి.

ఈ సినిమా హీరో కృష్ణ ( అరుణాదిత్యా, నూతన పరిచయం) ఒక పెద్ద సస్పెన్స్ థ్రిల్లర్ కథకి దర్సకత్వం వహించాలని దాని కోసం చాలా కష్టపడుతుంటాడు. ఇతనితో పాటుగా సినీ ఫీల్డ్ లోని వారే ఇంకా నలుగురు ఫ్రెండ్స్ కలిసి ఒక ఇంట్లోనే ఉంటూ ఉంటారు. బయట నేం బోర్డ్ వీళ్ళ పేర్లు ఉండకుండా...మర్డరర్ 1, మర్డరర్ 2, అని అలా అయిదు నంబర్ల వరకు పెట్టుకుంటారు...

ఇతనికి మదర్ సెంటిమెంట్, (అమ్మ, ఒకప్పటి శంకరాభరణం బేబీ తులసి, ఏవిటో అప్పుడే చాలా ముసలిదానిలాగా అయిపోయింది.) పొద్దున్నే గుడికి పోయే అలవాటు ఉంది. అక్కడే చిత్ర ను చూస్తాడు. హీరో కి హీరోయిన్ ని చూపించిన విధానం బాగుంది...

ఇద్దరూ షాపింగ్ లో కూడా కలుసుకుంటారు. అక్కడి దిష్టి బొమ్మను చూసి భయపడుతుంది. అక్కడినుంచి ఇద్దరికీ స్నేహం కలుస్తుంది. ఏమి చదువు రాని వారే సినీ ఫీల్డ్ లో కి ఒస్తారని చిత్ర నమ్మకం. అందుకే కృష్ణని, టెంత్ ఫైలయ్యారా, ఇంటర్ ఫైల్ అయ్యారా? అని అడుగుతుంది. కాని తను ఇంజినీర్ అని చెప్తాడు.
ఇద్దరి మధ్య మెల్లిగా ప్రేమ చిగురిస్తుంది. తను తీయ బోయె 'హత్య ' సినిమా గురించి చెప్తాడు. చిత్ర చాలా తీవ్రంగా భయపడుతుంది. కొన్ని యువతరానికి నచ్చే సంఘటనలు కూడా ఇక్కడ చోటుచేసుకున్నాయి.

అరకులో ఒక సర్కల్ ఇన్స్పెక్టర్ (ప్రకాష్ రాజ్) కూడా ఉంటాడు. అతని స్నేహశీలత, ఉద్యోగ నిబధ్ధత మనల్ని ఆకర్షిస్తుంది.
తన మనవళ్ళతో సరదాగా గడుపుతూ ఉంటాడు. వాళ్ళు ఇతని దగ్గిరే ఉండి అక్కడే చదువుకుంటూ ఉంటారు. అతని భార్య కూడా అతని అడుగుజాడల్లోనే నడుస్తూ ఉంటుంది. పిల్లల్ని స్కూల్లో దింపటానికి ఒచ్చిన సి.ఐ., చిత్రని చూసి ఎక్కడో చూసినట్లుంది అనుకుంటాడు...

మర్నాడు పేపర్ లో చిత్ర ఫొటో తోటి, 'ఈమె ఎవరు?' అనే హెడ్డింగ్ తో వార్త ఒస్తుంది.దానితో సి.ఐ. కి అనుమానం ఒస్తుంది. సి.ఐ. కి చిత్రని ఎక్కడ చూసాడో కూడా గుర్తుకు ఒస్తుంది... హీరో కి కూడా తనకు తెలిసిన ఆమె గురి౦చి చెప్తాడు. అప్పటిను౦చి ఇద్దరూ ఆమె కదలికలని గమనిస్తూ ఉ౦టారు. రాత్రి ఒ౦టరిగా చాలా భయపడుతు, చిత్ర౦గా ప్రవర్తిస్తూఉ౦టు౦ది. కారణ మేంటో?

తరువాత ఒక సాయంత్రం చిత్ర ఒక ప్రియుడు ప్రియురాలిని హత్య చేయటం చూసి సి.ఐ. కి రిపోర్ట్ చేస్తుంది. హీరో కి కూడా ఆ విషయం చెప్తుంది. అందరూ వెతుకుతారు కాని అక్కడ ఏమి కనిపించదు. మర్నాడు దొరికిన ఒక స్త్రీ శవాన్ని మార్త్యురీ లో ఆమెకి చూపిస్తారు. ఈమె, ఆమె కాదంటుంది చిత్ర...

చిత్ర, హీరో ని తన ఇంటికి తీసుకువెళ్ళి తన గతం "చూపిస్తుంది". ఏవిటది?

అక్కడినుంచి కథ ఎన్నో మలుపులు తిరుగుతుంది.

చిత్ర ఇంట్లో ఎన్నో భయానక సంఘటనలు చోటు చేసుకుంటాయి. దీనికి కారణ మెవరు?

ఆ హత్య అసలు నిజంగా జరిగిందా? జరిగితే హంతకుడెవరు?

పోలీస్ కానిస్టేబుల్ హ౦తకుడెవరో కనుక్కోవటానికి చిత్ర చేసే ప్రతీ ప్రయత్నాన్ని అడ్డుకు౦టూ ఉ౦టాడు. ఎ౦దుకు?

హీరో, చిత్రకి భయమెక్కువ కాబట్టి ఇవన్నీ ఊహించుకుంటుంది అంతే! అవన్ని నిజాలు కావు అని సద్దిచెప్పటానికి ప్రయత్నిస్తాడు. తనకి భయాలు ఉన్నాయి కాని ఇది భ్రాంతి కాదు అని చెప్పటానికి ప్రయత్నిస్తుంది, చిత్ర..

విలన్ మొదటిను౦చి మన కళ్ళము౦దే ఉ౦టాడు. సస్పెన్స్, డిటెక్టివ్ కథలు ఇష్ట పడే వారికి విలన్ ఎవరో సులభంగానే కనుక్కో గలరు. సస్పెన్స్ బాగా కోరుకునే వారికి మాత్ర౦ ఇది నిరాశనే మిగులుస్తు౦ది. సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలు ఈ మధ్య చాలానే ఒచ్చాయి. కాని వాటిము౦దు ఇది సరిపోదు.

ఈ సినిమా లో ప్రిన్సిపల్ కుమారుడు "కార్తిక్" పాత్ర కూడా ఉ౦ది. మొదటిను౦చి అతడు చిత్రని ప్రేమిస్తూఉ౦టాడు. వెంటాడుతూ ఉంటాడు. ఇతనొక టి.వి. నటుడట. బాగానే ఉన్నాడు. అతను కూడా సినిమాకి ఒచ్చాడు. మా ఫ్రెండ్ అతన్ని చూపించింది.

శ్రీనివాస రాగా దీని దర్శకుడు. పాటలెక్కువగా లేకున్నా ఏం గొప్పగా లేవు.

ఖాళీగా, ఏ౦ పనిలేక పోతేచూసి రావొచ్చు.







"టక టక టక టక ఎవరో! నా మది గది తలుపు తడితే....!"





*********************************************************************

30, నవంబర్ 2009, సోమవారం

"అ ఆ ఇ ఈ"



అతను ఆమె ఇంతలో ఈమె

రెండు రోజుల క్రితమే చూశానండి ఈ సినిమా. బహుశా: రేపో, ఎల్లుండో ఈ సినిమా వెళ్ళిపోవచ్చుకూడా. ఏం చేయను, అందరూ చూసేసారు. ఇప్పటిదాకా నాకు వీలవ్వలేదు. అయినా సరే, నేను చూసాను కాబట్టి ఈ సినిమా గురించి రాస్తాను.

ఇ౦కా ఎవరైనా చూడని వాళ్ళు ఉ౦టారులె౦డి. ఇది వాళ్ళ కోసమన్న మాట. ఒకవేళ చాలా రోజుల క్రితం చూసిఉంటే కొంచెం గుర్తు చేసుకోవచ్చని, నా ఉద్దేశం.

ముఖ్యంగా ఈ సినిమా మొదటి భాగం లో నాకు రెండు సినిమాలు గుర్తుకొచ్చాయి. అవేంటంటే, రాజేంద్ర ప్రసాద్, యమున నటించిన చాదస్తపు మొగుడు. రెండవది నాగార్జున, రమ్యకృష్ణ నటించిన చంద్రలేఖ.

బామ్మా, మనవళ్ళ చేజింగ్ తోటి ఈ సినిమా మొదలవుతుంది. చంద్రం (శ్రీకాంత్) వాళ్ళ బామ్మ (తెలంగాణ శకుంతల) కి చాలా దేశభక్తి. దేశనాయకుల పుట్టిన రోజులకి వాళ్ళ వేషాలు వేసి ఫొటోలు తీయిస్తూ ఉంటుంది వాళ్ళ బామ్మ. అప్పటికే గోడ మీద చంద్రం ఫొటోలు వివిధ దేశనాయకుల వేషాలలో తగిలించి ఉంటాయి. ఆ రోజు గాంధీ పుట్టిన రోజు. గాంధీ వేషం వేయటానికి, గుండు చేయాలిగా మరి. అందుకే బామ్మ, మనవడి వెంట పరుగులు తీస్తూ ఉంటుంది. వొచ్చే వేమన పుట్టిన రోజుకి వేమన వేషంలో కూడా ఫొటో తీయిస్తానని అంటుంది కూడా. చివరికి మనవడు తప్పించుకొని మంగలి వాడే గుండు గీసుకొని, గాంధీ లాగా అహింస ప్రచారానికి వెళ్ళిపోతాడు. ఇటువంటి కొన్ని తమాషా సంఘటనలు మనల్ని బాగానే నవ్విస్తాయి.

చంద్రం, కల్యాణి (మీరా జాస్మిన్) లది అన్యోన్య జంట. 'మేడ్ ఫర్ ఈచ్ అదర్ ' లాగా ఉంటారు. వాళ్ళ ఫామిలీ ఫ్రెండ్ కృష్ణ భగవాన్. పని దొరకని ఒక ప్లీడర్. ఈ సినిమా లో కొంచెం కీలక మైన పాత్రే.. చంద్రం శ్రీ కల్పనా డ్రైవింగ్ కంపెనీ లో ఒక కాబ్ డ్రైవర్ గా పనిచేస్తూ ఉంటాడు.

ఈ ఇద్దరు దంపతులకి సంతానం లేదు. తనతోటి ఇతర డ్రైవర్ల పిల్లలు ఎప్పుడూ ఇతని ఇంట్లోనే ఆడుకుంటూ ఉంటారు. అంతేకాకుండా,అ పిల్లల ఫీజులు, బర్త్ డే ఫంక్షన్ ల వంటివి తన ఖర్చుతోటే చేస్తూ ఉంటాడు.

ఈ సినిమాలో స్త్రీలకి నచ్చే కొన్ని రమ్యమైన దృశ్యాలు కూడా ఉన్నాయి. చంద్రం మెడపట్టుకొని నొప్పితోటి ఇంటికి వొచ్చినప్పుడు అతని భార్య, ఎదురు కాళ్ళతో పుట్టిన వాళ్ళు, పాదం తోటి మెడ మీద మెల్లగా రాస్తే ఆ నొప్పి పోతుందని, అతని మెడ మీద తన పాదం తోటి రాస్తుంది. ఈ విషయం నేనెక్కడో చదివాను కూడా. కల్యాణి పిల్లలు కలగాలని గుడి మెట్లకు పూజ చేస్తూ ఒక్కొక్క మెట్టే ఎండలో ఎక్కుతున్నప్పుడు, తన షర్ట్ విప్పి ఆమెకి గొడుగులాగా పట్టి తోడుగా చివరి దాకా వెల్తాడు. ఇలాంటి కొన్ని దృశ్యాలు బాగానే ఆకర్షిస్తాయి.

బ్రమ్హానందం, కోవై సరళల హాస్యం కొన్ని చోట్ల శ్రుతి మించినా, కొంతమేర బాగానే అనిపిస్తుంది. కోవై సరళ తండ్రి తన ముగ్గురు భార్యలు లేచిపోయిన సందర్భంగా, తన కూతురికి మొగవాళ్ళే కనిపించకుండా, కళ్ళకు గంతలు కట్టి పెంచుతాడు. మొదటిసారిగా చూసిన భర్త మొహమే ఆమెకి అందరిలో కనిపించటమే ఈ సినిమా లోని కామెడీ.

చంద్రం భార్య గర్భవతి అవుతుంది. ఆమెకి గుండెజబ్బు ఉందని, ఆపరేషన్ కి కొన్ని లక్షలు కావాలని చెప్పట౦తో కథ మలుపుతిరుగుతుంది. అప్పటివరకు సరదాగా సాగే సినిమాలో కొంత గంభీరత చోటుచేసుకుంటుంది.

అనుకోకుండా రైలు పట్టాల మీద మరణించిన స్త్రీ, ఆమె దగ్గిర ఉన్న బాగ్ లో లక్షల డబ్బు, ఆమె ఫొటో ఇతని కంట పడుతాయి. అదంతా పోలీసుల కప్పచెప్పిన చంద్రం, తరువాత తన స్నేహితుడి బలవంతంతో ఆమె తన భార్యేనని పోలీస్ ఆఫీసర్ కి చెప్పి, అతనికి కొంత లంచమిచ్చి మిగతాడబ్బు తన భార్య ఆపరేషన్ కోసం కడుతాడు. మర్నాడు పేపర్ లో ఆత్మహత్య చేసుకున్నట్లుగా ఆ స్త్రీ ఫొటో వొస్తుంది. ఆమె ఒక గొప్ప ధనికుని కుమార్తె రమ్య (సదా). ఆమె తండ్రి (తనికెళ్ళ భరణి) ఆ వార్తతో, గుండె పోటు వొచ్చి ఆసుపత్రిలో చేరుతాడు. మళ్ళీ స్నేహితుడి ప్రోద్భలంతో, తానే అల్లుడినని చెప్పి అతనికి సేవలు చేస్తాడు చంద్రం.

అప్పుడే చనిపోయిందనుకున్న రమ్య తిరిగి ఒస్తుంది. కాని చంద్రం తన భర్త కాదని చెప్పకుండా, అతను తన భర్తలాగానే ప్రవర్తిస్తుంది. ఎందుకని?

తనభర్త ప్రేమ క్రమంగా తరిగిపోతొందని భయపడుతుంది కల్యాణి. తన శీమంతానికి రాని భర్త ఎక్కడున్నాడో తెలుసుకొని అక్కడికి వెల్తుంది. కాని అక్కడ తన భర్తని ఇంకో స్త్రీ తో చూసికూడా, అతనిని ఏమీ అనకుండా, అతడు తన భర్త కాదని తాను పొరపడ్డానని చెప్పుతుంది. ఎందుకని?

పోస్ట్ మార్టం చేసిన డాక్టర్ తరువాతి కథలో కొంత ముఖ్య పాత్రే నిర్వహిస్తాడు. కథ మలుపుకి అతను ఎలా కారణమవుతాడు?

ఇందులో ఒక జేంస్ బాండ్ 000 కూడా ఉన్నాడు. అతని పరిశోధనలు చంద్రం కి ఏమన్నా సహకరించాయా?

కథను క్లైమాక్స్ కి తీసుకెళ్ళే మతిమరుపు ఆలీ కూడా ఇందులో ఉన్నాడు. అతడు చెప్పిన రహస్యమేమిటి?

రమ్య ఫ్లాష్ బాక్ ఏంటి? కల్యాణి భవిష్యత్తు ఏంటి?

ఇవన్నీ వెండితెర మీద చూడాల్సిందే!

ఎందుకూ పనికిరాని రఘుబాబు పాత్ర కూడా ఇందులో ఉంది.

ఈ సినిమాలో అడుగడుగునా ఇంతవరకు వొచ్చిన అనేక సినిమాల్లోని పాటలు బాక్ గ్రౌండ్లో అప్పుడప్పుడూ వొస్తూఉంటాయి. ముఖ్యంగా హృదయమెక్కడున్నది అన్న పాట చాలా సార్లు ఒస్తుంది.

"ఎంత నరకం ఎంత నరకం నా కళ్ళ ముందు నువ్వుంటే ఎంత నరకం" అనే పాట చాలా బాగుంది. "అచ్చట...ఇచ్చట..." అన్న ఇంకో పాట కూడా వినటానికి బాగానే ఉంది.

ఈ సినిమాలో మీరా జాస్మిన్ బొద్దుగా లేకుండా, ముద్దుగా ఉంది. సదా తన పాత్రలో ఎటువంటి భావాలు సరిగ్గా పలికించలేక పోయింది. శ్రీకాంత్ బాగానే ఉన్నాడు. సినిమా లొ ఒక క్లబ్ డాన్స్ ఉన్నా, అన్ని సినిమాల కన్నా, చాలా నీట్ గా ఉ౦దని చెప్పొచ్చు. అ౦దరు కలిసి చూడొచ్చు.

స్క్రీన్ ప్లే, దర్శకత్వం ఎన్. శ్రీనివాస రెడ్డి. బాగానే ఉంది. స౦గీత౦ ఎమ్.ఎమ్. శ్రీలక్ష్మి


*********************************************************




 

మనస్వి © 2008. Template Design By: SkinCorner