ముచ్చట్లు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
ముచ్చట్లు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

17, ఆగస్టు 2013, శనివారం

చక్కని తల్లి కి ఛాంగు భళా!



శ్రావణమాసం వస్తోందంటే నాకు నాకు చాలా ఆనందంగా ఉంటుంది. ఈ నెలంతా పండగ శోభే కదా!
వరలక్శ్మి పూజ కూడా నాకు చాలా ఇష్టం. చక్కగా అమ్మవారిని (మనల్ని కూడా:) అలంకరించి పేరంటాళ్ళను పిలిచి తాంబూలాలిచ్చుకోవాలంటే మరీ ఇష్టం. మరి మా అమ్మవారిని చూస్తారా...ఎలా ఉన్నారు....నాకైతే నిండుగా దీవెనలిచ్చేట్లుగా కనిపిస్తున్నారు.




లక్ష్మీనారాయణులకు, పార్వతీపరమేశ్వరులకూ ఎంతో ఇష్టమైన శ్రావణం లో భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తే విశేష ఫలితాలు లభిస్తాయంటారు.




నమస్తే లోక జననీ నమస్తే విష్ణువల్లభే
పాహిమాం భక్తవరదే వరలక్ష్మి నమోనమ:




పదియారు వన్నెలతో బంగారు ప్రతిమా
చెదరని వెదముల చిగురు భోడి
ఎదుట శ్రీ వెంకటేసునిల్లాలవై నీవు
నిధువ నిలిచె తల్లి నీ వారమమ్మా
జయలక్ష్మి వరలక్ష్మి......





ఎట్లా నిన్నెత్తుకుందునమ్మా! వరలక్ష్మి తల్లి!
ఎట్లా నిన్నెత్తుకుందునమ్మ
వరలక్ష్మి తల్లి
ఆట్లాడె బాలవు నీవు
ఇట్లా రమ్మనుచు పిలిచి
కోట్లా ధనమిచ్చే తల్లి
వేయి నామాల కల్పవల్లి , మాపై కరుణించి సాయము ఉండు తల్లి!


క్షీరాబ్ధి కన్యకకు శ్రీ మహాలక్ష్మికిని నీరజాలయకు ఇదె నా నీరాజనం....




*************************************************************************************************************************************************** 

8, ఫిబ్రవరి 2013, శుక్రవారం

ఆనందమె జీవిత మకరందం!




ఆనందం డెఫినిషన్ చెప్పటం అంత సులభమా!!!జీవితం లో ముగింపు లేనిది , చెప్పలేనిది అదొక్కటే అనుకుంటా!!!!

ఏ మహాత్ములు ఎన్ని చెప్పినా తమకు మంచి అనిపించిందే చెప్తారుకదా! లేకపోతే ఇతరులెందుకు వాళ్ళని విమర్శిస్తారు? లోకమంతా పనికొచ్చే ఒకే ఒక్క ఆనందం గురించి చెప్తే మహాత్ములు ఒక్కళ్ళే ఉండే వాళ్ళేమో:) 

ఎన్ని వేల కోట్లు సంపాదించినా ఆ ఆనందం తనివి తీరదే!!!!

హత్యలు చేసేవాళ్ళు అందులో ఆనందం కోసమేనా?

ఇతరులను మోసపుచ్చే వాళ్ళకు అందులో ఆనందం ఉన్నట్లేనా!! 

ఇటువంటి వాళ్ళు ఏవిధంగా అయినా శిక్ష అనుభవించే వారే అది శాశ్వత ఆనందం కాదు అందామా!!! 

మరి ఆనందం ఎప్పటికీ ఉంటుందా, లేక కొంతకాలమేనా?  అందుకేనా తపస్సు చేసుకుంటామని వెళ్ళిపోయేది?

ఎటువంటి బంధాలు లేక పోతే, ఏనాటికైనా ఆనందమంటే ఏవిటి అని వెతుక్కుంటూనే పోతారేమో!!! 

పోనీ విరక్తి లో అన్నీ వదిలేస్తే ఆనందమా? 

అతి మంచివాళ్ళూ ఆనందంగా ఉన్నామనరు...అతి చెడ్డవాళ్ళూ ఆనందంగా ఉన్నామనరు!!!! పోనీ అతి మామూలు వాళ్ళు ఆనందంగా ఉన్నారా!

మనకున్న జీవితంలో మనకు మనమే మనకు మాత్రమే పనికొచ్చే ఆనందాన్ని ఎంచుకుంటే సరిపోతుందేమో....
అందరూ అదే పద్ధతి అనుసరిస్తే అప్పుడు ప్రపంచమంతా ఎలాఉంటుందో, ఊహించుకోవాలని ఉంది నాకు:) 

ఎపుడో అపుడు ఎవరో ఒకరు ఆనందం అంటే ఏవిటి? అని ఓ సినిమా తీస్తారేమో...అప్పుడు ఆ సినిమా ఎలా ఉంటుందో.... 


                                           

 ఈ ఆనందం మధురానుభూతి. ఆనందం మన చేతిలోనే ఉంది. మనమీదనే ఆధారపడి ఉంది. నా సంతోషానికి నేనే బాధ్యురాలిని.... ఆనందాన్ని నింపుకొనే శక్తి మనలోనే ఉంది... మనం చంద్రుని కోసం ప్రయత్నిస్తే కనీసం అందాలొలికే నక్షత్రాల మధ్యనైనా ఉంటామేమో....సంతోషమే కావాలి.....బాధ వద్దు. కాని అందాల హరివిల్లు వర్షం తరువాతే కదా చూడగలుగుతాము.మన పరమార్ధమే జీవితం లో ఆనందం...చివరిదాకా ఈ ఆనందంలోనే నడచిపోతూ బ్రతికితే బాగుండు...మనకున్న వాటితో సంతృప్తి పడితే ఆనందం అదే వస్తుందనుకుంటా.....

మన ఆనందంతో ఇతరులను కూడా సంతోషంగా ఉంచగలుగుతాము. అప్పుడు అందరూ ఆనందంలో ఓలలాడొచ్చు....ఎంత ఆశో...అవునా! దురాశ మాత్రం కాదు కదూ....  జీవితం లో ప్రతి అనుభూతి ఆనందమే....

సంతోషాన్ని కొనుక్కోలేము కదూ...ఒకవేళ మనకు నచ్చినదేదైనా కొనుక్కున్నామనుకోండి....అది ఆనందమేగా:)


                                         
ఎంతంత దూరం నన్ను పోపో అన్నా అంతంత చేరువై నీతో ఉన్నా.....There is always somebody that loves you.... Its me.....

జీవితం విలువైనది...చేజారితే దొరకనిది...ఆ విలువ కాపాడుకోటమేగా...ఆనందం.


ఏమో నా లాంటి వాళ్ళైతే...అనందమనగానేమి..అని ఒక హెడ్డింగ్ పెట్టి, ఇంట్రడక్షన్, ఓ డెఫినిషన్, కొన్ని సైడ్ హెడ్డింగ్స్, ఓ కంక్లూజన్ తో ఓ ఎస్సే రాసేసుకుంటారు. అంతే:) 


                                  

 Happiness is a journey, not a destination.....

 ‘Happiness is like a Butterfly;
 The more you chase it,
 The more it will elude you.
 But, if you turn your attention to other things,
 It will come and sit softly on your shoulder’.....  
........ Exactly correct.


ఆనందమంటే ఇదేకదా!!! ఆనందమే జీవిత మకరందం.......





***************************************************************************














14, నవంబర్ 2012, బుధవారం

Dial T for 'THRILL'







థ్రిల్....

  మా అక్క దగ్గిర తీసుకొచ్చిన వీరేంద్రనాథ్ 'థ్రిల్ ' ఒక నెల రోజుల్లో పూర్తి చేసా. అంటే బుక్ అంత పెద్దదనుకునేరు. చిన్నదే! కాకపోతే నేను శ్రద్ధగా తీసుకున్న టైం అది:)

నాకు నవల కన్నా అందులో ఒక అంశం భలే నచ్చింది. హీరోయిన్ కొన్న నవల 'థ్రిల్ ' మొత్తం ఖాళీ పేజీలతో ఏమీ ప్రింట్ కాకుండా ఉంటుంది. ఏమీ ప్రింట్ అవని బుక్ తనకి వచ్చినా,అది ఒక థ్రిల్ గా ఫీల్ అయి అందులో తన అనుభవాలు రాసుకోవాలనుకుంటుంది.

నేను కూడ అలాగే ఒక బుక్ లో కేవలం అద్భుతమైన అనుభవాలు రాసుకోవాలనిపించింది. కాని, అలాంటి బుక్ నాకెవరిస్తారు. అందుకే నేనే తయారు చేసుకున్నాను.

 మరి నాకు థ్రిల్లింగ్ విషయాలు ఏమైనా ఉన్నాయా! ఆలోచన మొదలైంది.....

 నేను లెక్చరర్ గా తీసుకున్న మొట్టమొదటి క్లాస్ గుర్తొచ్చింది.   పదహారేళ్ళ వయసు లో శ్రీదేవి లాగా పక్కా పంతులమ్మ లాగా క్లాస్ కెళ్ళాను.
 
నా చిన్నప్పుడు మా క్లాస్ కెవరన్నా కొత్త మిస్ వస్తున్నారూ అంటె ఎంతో ఉత్సాహంగా ఎదురు చూసే వాళ్ళం. ఎన్నో చాక్లెట్లు, ఎన్నెన్నో పూలు వరుసాగ్గా ఇచ్చి మెరిసిపోయె కళ్ళతో ఆ టీచర్ మాట్లాడే ప్రతిమాట ఎంతో అబ్బురం గా వినే వాళ్ళం. ఇప్పుడు నా స్టూడెంట్స్ కూడా అలాగే ఎదురు చూస్తూ ఉంటారని తలచుకోగానే మితిమీరిన సంతోషంతో ఒళ్ళంతా పులకరించి పోయింది.

కాని, చిన్నప్పటి నా ఆనందం ఈ పిల్లల కళ్ళల్లో కనిపించలేదు. పైగా ఒక్కోళ్ళు మహా షొగ్గా ఉన్నారు. వస్తే వచ్చావులే అన్నట్లు చాలా నిర్లక్ష్యం గా కనిపించారు. ఇంకేం పూలు, ఇంకేం పళ్ళు...వాళ్ళందరి చేతులు ఖాళీ గానే ఉన్నాయి.:(

ఏదో కొంచెం ధైర్యం తెచ్చుకున్నాను.   మెల్లిగా  నేనెవరో, నా పేరేంటో చెప్పుకున్నాను.  ఆ సరేలే అన్నట్లు, ఎంతో చాలా మెకానికల్ గా ఏదో విష్ చేసారు.

  చాలా సినిమాల్లో పంతులమ్మలను, వాళ్ళ ఆదర్శాలను, మహోన్నత వ్యక్తిత్వాన్ని గుర్తు తెచ్చుకుంటూ మెల్లిగా మొదలు పెట్టాను......

 బోర్డ్ మీద చాక్పీస్ తో టైటిల్ వ్రాయబోతే అది పుటుక్కున మూడు ముక్కలైపోయింది...

వెంటనే వెనుతిరిగి అటెండన్స్ రిజిస్టర్ ఓపెన్ చేసాను.  అబ్బే, అందులో ఏం లేదు!!! అయ్యోరామా! పిల్లల పేర్లే రాసుకోలేదు. వెంఠనే క్లోజ్ చేసేసా.

ఒక గంట కోసం ప్రిపేర్ అయిన పాఠం ఓ పదిహేను నిమిషాలకే అయిపోయింది. ఇప్పుడెలా మిగతా టైం ఏం చేయాలి? కాళ్ళు చేతులు ఒణుకుతున్నాయి. మరీ అప్పచెప్పేసినట్లున్నాను. ఇప్పుడెలా! పిల్లలు గుడ్లు మిటకరిస్తూ నన్నే చూస్తున్నారు. ఇంకో నిమిషమైతే ఏదో చేసేట్లే ఉన్నారు. లాభం లేదు వెంటనే ఏదో ఒకటి నేనే చేసేయాలి.

     ఇంత లో ఒకమ్మాయి మేడం మీ శారీ చాలా బాగుంది,  రోజూ కాటన్ చీరలే కడ్తారా? అంది. ఇంకో అమ్మాయి మేడం సింగిల్ బ్యాంగిల్ వేసుకున్నారు, ఎంతో బాగుంది అంది.   ఇంకో వైపునుంచి ఓ అమ్మాయి మేడం మీ కళ్ళెంత బాగున్నాయో అంది. అప్పటి వరకు గుడ్లు మిటకరిస్తున్న నేను కూడా వెంటనే చలనం వచ్చి కళ్ళు మూసేసాను.
 ఓహో!!! వీళ్ళతో రోజూ కాసిన్ని కబుర్లు చెఫ్ఫాలి కాబోలు....   దేవుడా నా కళ్ళు తెరిపించావు.  జ్ఞానోదయమయింది.

 హమ్మయ్యా!! ఇంక వాళ్ళు నాకు క్లాస్ తీసుకోటం అయిపోయింది.   నేనెళ్ళిపోవచ్చు.

 అంటే!!! ఇంత వరకూ వాళ్ళు గమనించింది...నేను చెప్పిన పాఠం కాదు, నన్ను:))))

ఏ లెసన్ తీసుకోకుంటే ఇంత థ్రిల్ ఉంటుందన్నమాట:))))

 ఒక పని ఎట్లా చేయాలా అని   అధైర్య పడొద్దు. పని చెయ్యడం ప్రారంభించు...ఎట్లా చేసావని నువ్వే ఆశ్చర్య పోతావ్. - గెథే

 అక్షరం ఎప్పుడూ పుడుతూనే ఉంటుంది.(ఎవరూ పుట్టించకపోతే కొత్త మాటలెలా వస్తాయి:)అన్నారుగా ఎస్.వి.ఆర్.)

దానికి చావే లేదు ఓ కవి హృదయంలా....
ఉపయోగించని విజ్ఞానం నిష్ప్రయోజనం అనిపించింది....
అప్పటి నుంచి నా స్వంత పరిజ్ఞానమే పిల్లల్లొ నాకొక ప్రత్యేక స్థానాన్ని ఇచ్చి నా శ్రద్ధ కూడా పెంచుకుంటూ పోయింది...

ఓనమాలతో మొదలెట్టి జీవన విధానాన్ని నేర్పించి
విద్యార్ధి విజయానికి నాంది పలికిన
నిజమైన గురువుల ప్రతిభకు సాటి ఏది!!!!!

దీపావళి కి రెండు రోజులముందే నేను లెక్చరర్ అయ్యానన్నమాట! అందుకే ఇలా తలుచుకుంటున్నాను:)
కొత్త పంతులమ్మ లందరికీ ఇది అంకితం.....

  మితృలందరికీ హృదయపూర్వక దీపావళి పండుగ శుభాకాంక్షలు.

ఇవాళ పిల్లల పండుగ కదా! అందుకని మా పిల్లలకి, బ్లాగుల్లో ఉన్న  బాబులకి, పాపలకి....

బాలల దినోత్సవ శుభాకాంక్షలు......




*****************************************************************************************************************************************************

1, జనవరి 2012, ఆదివారం

కమ్మని కలలకు ఆహ్వానం




బొమ్మాళీ, నిన్నొదల... అంటున్నాయి నా వెంటనే ఉన్న ఈ చీకటి వెలుగులు....

డైలాగ్ ఇన్ ద డార్క్....చుట్టూ చిమ్మ చీకటి. అడుగులో అడుగు వేసుకుంటూ ముందుకెళ్తున్న మనకు లారీ శబ్దం వినిపిస్తుంది. మనమీదికే వస్తున్న భయం పెరిగిపోతుంది. గుండె ఆగిపోతుందేమో కూడా....ఆ లారీకి లై ట్స్ కూడా లేవు. ఆ చీకట్లో ఏమీ తెలియటం లేదు.

మనకిష్టమైన మెనూ ఆర్డర్ చేసి టేబుల్ దగ్గర కూచున్నాము. అన్నీ ఎదురుగ్గానే ఉన్నాయి. చిమ్మ చీకటి. ఏమీ కనిపించటం లేదు. కరెంట్ రాదు, అలాగే తినాలి. ఏదో భయం...

డాక్టర్ ఆండ్రియాస్ హెనెక్ అనే జర్మన్ ఎంటర్ ప్రెన్యూర్ ప్రారంభించిన ఈ వినూత్న కార్యక్రమాన్ని ప్రపంచమంతా దాదాపు 110 నగరాల వారు అభిమానించి అనుభవిస్తున్నారు. ఇది మనకి అంధుల పట్ల ఉన్న తక్కువ భావాన్ని పోగొట్టే రీతిలో రూపొందించిన ఫన్, ఎడ్వంచర్, లెర్నింగ్ ఎగ్జిబిషన్. ఇక్కడ మొత్తం నిర్వహించే వారు అంధులే. ఇక్కడ మన కంటికి అంతా చీకటే... ఇక్కడ తమ కళ్ళతో వారి లోకాన్ని మనకు చూపుతారు. ఆ చీకట్లోనే వారి లోని ఆత్మ శక్తిని తెలుసుకో గలుగుతాము. ఇక్కడ వారే మనల్ని రోడ్ దాటిస్తారు. సూపర్ మార్కెట్ కి వెళ్ళి సరకులు గుర్తుపట్టి మనతో కొనిపిస్తారు. చీకటిలోనే వాసన, స్పర్శల ద్వారా వాటిని మనం కనిపెట్టాల్సి ఉంటుంది. ఆ చీకటిలోనే అక్కడే ఉన్న రెస్టారెంట్ లో మనకి కావాల్సినవి ఆర్డర్ ఇచ్చి తినొచ్చు. చీకటిలో నడుస్తుంటే భయపడే మనకు దారి చూపే వెలుగవుతారు. తిరిగి మన గమ్యం చేరుస్తారు. ఎన్నో రకాల ప్రతిభ ఉన్న వీరికి అన్ని ఉద్యోగాలు లభ్యం కావు. వారు అనుభవించి ఆయా అంశాల గురించి తెలుసుకుంటారు. ఆ అనుభూతులనే సాధారణ ప్రజలకు కూడా అందించాలనే ఈ ప్రయత్నమే, మనల్ని ఒక గంట సేపు వారితో పాటు చీకటిలో ప్రయాణించేట్లు చేసింది. వాళ్ళు మనకన్నా బాగా చేయగలరు అనే అభిప్రాయం మనకి తప్పకుండా కలిగిస్తారు.

నాతో వచ్చిన ఆ అమ్మాయి నవ్వుతూ ఎంతో హుషారుగా నాకన్నీ వివరిస్తుంటే, నీ నవ్వు చెప్పింది నాతో నేనెవ్వరో ఏమిటో...నీ నీడ చూపింది నాలో ఇన్నాళ్ళ లోటేమిటో..అని పాడుకోవాలనిపించింది. ఎప్పటినుంచో ఈ "డైలాగ్ ఇన్ ద డార్క్" చూడాలన్న నా కోరిక ఈ సంవత్సరం తీర్చుకో గలిగాను.

నేనంటే అస్సలిష్టంలేని బుక్: థార్న్ బర్డ్స్ బుక్ ఇప్పటికి మూడు సార్లు కొనుక్కున్నాను.ఎన్నిసార్లు కొన్నా పోతోంది. ఈ ఇయర్ కూడా పోయింది. ఏవిటో నాకిది అచ్చి వచ్చేట్లు లేదు. ఏమీ సేతురా లింగా! ఏమీ సేతురా!!! ఇంక కొనకూడదనే నిర్ణయం తీసుకున్నాను.ఇది మాత్రం చాలా ఘాట్టి తీర్మానమే. ఎవరిదగ్గిరైనా ఉంటే నా కిచ్చేస్తారా!!! ప్లీజ్.

ఒక చిన్న నిర్లక్ష్యం: బుజ్జి గాంధీ....అనుకోకుండా నాకోసారి,ఒంటినిండా తెల్ల రంగు తో మార్కెట్లో గాంధీ వేషం వేసుకొని అడుక్కుంటున్న ఒకబ్బాయి కనిపించాడు.ఎన్నో సార్లు అటువంటి వాళ్ళను చూసాను, ఇప్పుడు దగ్గరలోనే కనిపిస్తున్న ఈ అబ్బాయిని పలకరించాలనిపించింది. బాబూ నీ పేరేమిటి అని అడిగితే గాంధీ అని చెప్పాడు. అది కాదు, అసలు పేరు చెప్పు అన్నాను. కాదు అదే నా అసలు పేరు అన్నాడు. ఆ పేరే పెట్టారట. గాంధీ అంటే వాళ్ళ నాన్నకి చాలా ఇష్టం అన్నాడు. మరి ఎందుకిలా చేస్తున్నావు అన్నాను. వాళ్ళ నాన్నకు పక్షవాతం వచ్చిందని వాళ్ళ అమ్మ కూడా అడుక్కుంటుందని చెప్పాడు.తను చదువుతున్న అయిదో తరగతి మానేసి ఈ పని చేస్తున్నాడుట. వాళ్ళ అమ్మ వద్దందట కాని తనకి గాంధీ జీవిత చరిత్ర చదవాలని ఉందని ఆ బుక్ కొనుక్కున్నాక ఇలా తిరగటం మానేస్తా అని చెప్పాడు.ఇంత చిన్న వయసులో తన చిన్న కోరిక తీర్చుకోటానికి ఎంత ప్రయాస పడుతున్నాడొ...బాధనిపించింది...స్వయంగా కృషి చేస్తున్నందుకు సంతోషమూ అనిపించింది. బాబూ, రేపు నీకు ఈ బుక్ తెస్తాను ఇక్కడే ఉంటావా అని అడిగాను. ఒక్క సారే ఆ మొహం లో వెయ్యిదీపాల కాంతి కనిపించింది. ఓ, ఉంటా అన్నాడు. మర్నాడు వెళ్ళలేక పోయాను. రెండురోజుల తరువాత చూస్తే ఎక్కడా కనిపించలేదు. ఆ తరువాతా వెదికాను...ఊహూ. కనిపించలేదు. నా నిర్లక్ష్యంతో...ఎంత మూల్యం చెల్లించానో...బుజ్జి గాంధితో స్నేహాన్ని కోల్పోయాను. ఇప్పటికీ అప్పుడప్పుడూ చూస్తూనే ఉంటాను. ఏనాడూ కనిపించలేదు.బాధగా లేదా అనకండి. చాలా బాధగా ఉంది. మనసు కాలుస్తూనే ఉంది...రాతిరి వేళ రగిలే ఎండలా... ఓ బుజ్జి స్నేహితుడా, ఎప్పుడు కనిపిస్తావు. నన్ను క్షమించవా...నాతో మాటాడవా...నన్ను మన్నించవా....

వేయిస్తంభాల గుడి- 'నా ' కత్తి: మేము చాల చిన్నప్పుడు వరంగల్ లో ఉన్నాము. అక్కడి మా ఇంటి ఎదురుగ్గానే ఉంది వేయిస్థంభాల గుడి. అక్కడ రోజూ ఎన్నో ఆటలు ఆడుకునే వాళ్ళం. గుడికి ఎదురుగ్గా ఉన్న నాట్య మండపం అంటే నాకు చాలా ఇష్టం. ఆ మండపంలో ఎన్నో ఆటలు ఆడేవాళ్ళం. మధ్యలో డాన్సింగ్ డేస్ మీద నాకు తోచినట్లు ఎన్నో సంప్రదాయ రీతులలో నృత్యం చేసేదాన్ని:) అది ఒక రాజభవనం లాగా, నేను నాట్యకత్తెగా ఊహించుకొని రోజూ డాన్స్ చేయటమే గాక ఆ మండపం మొత్తం కలియతిరిగే దాన్ని.అక్కడే నృత్య భంగిమ లోని ఒక అందమైన శిల్పం కూడా ఉండేది. దాని పక్కనే నుంచుని, అదే భంగిమతో ఏవో ఆలోచనలతో...ఏవేవో లోకాలకి వెళ్ళిపోయేదాన్ని. నృత్యమంటే నాకంత ఇష్టం. ఒక సారి అక్కడ పైన చూరు లో బాగా తుప్పు పట్టిపోయిన కత్తి కనిపించింది. చాలా కష్టం మీద దాన్ని బయటికి లాగి దానితో రోజూ కత్తి యుద్ధాలు చేసే దాన్ని. ఆ కత్తి ఎప్పటిదో, అసలక్కడెందుకుందో నాకప్పుడు తెలియదు. ఆ కత్తి నా ప్రాణమైపోయింది. యుద్ధభూమిలో రాణినై వీర పోరాటాలు చేస్తూ, శతృవులందరిని నరికి పారేసేదాన్ని. రోజూ అక్కడే దాచిపెట్టడం, వెళ్ళినప్పుడల్లా ఆడుకోటం. ఆ గుడి, ఆ మండపం, 'నా'కత్తి నాకు ప్రాణమైపోయాయి. కాని ఏం లాభం...విధి నన్ను అక్కడినుంచి నాగార్జున సాగర్ లో దింపేసింది:) అది ఇంకొక ప్రహసనం.

కాని ఈ నాటికీ నేను తీర్చుకోలేని కోరిక ఆ మండపం దగ్గరికి వెళ్ళాలి, అక్కడ నా కత్తి ఎలా ఉందో చూడాలని. నాకు తెలుసు ఇది తీరే కోరిక కాదు. అసలు ఆ కత్తి ఎవరైనా చూసి ఉంటారా! ఆ మండపం తీసేసారని, ఆ స్థంభాలన్నీ పాడైపోతూ ఉన్నాయని గుర్తొచ్చినప్పుడల్లా మరపురాని ఆ జ్ఞాపకాలే మనసును ఊరడించటానికి ప్రయత్నిస్తున్నాయి. ఈ నాటికైనా, ఎప్పుడో ఆ శిధిలాలో తిరగాలి, ఆ ప్రదేశమంతా నన్ను...ఏ సీమ దానవో, ఎగిరెగిరి వచ్చావు...అలసి ఉంటావో మనసు చెదరి ఉంటావో... అని పలకరిస్తే ఎంత సంతోషమో కదా!!!

కదలే ఊహలకే కన్నులుంటే: సాధారణ జీవితంలో అసాధారణ సౌందర్యం ఉంది. మనసు కళ్ళతో చూడాలి, హృదయ రాగంతో వినాలి. దారపు చివరి అంచులో పతంగమై గగనానికి ఎగరాలి. ఇంద్రధనుస్సులోని వన్నెచిన్నెలందుకోవాలి. ఆ మబ్బుల్లోనే ధగధగ మెరిసే మెరుపుతీగలతో ఊయలలూగితే ఎలా ఉంటుంది!!! మనసున మల్లెల మాల లూగెనే అని పాడుకోవాలా!!! ఏ సంవత్సరంలో అయినా తీరే కోరికేనా ఇది:) సరిగ్గా రాత్రి రెండుగంటల సమయంలో ఒంటరిగా నిశ్శబ్ధ వీధులన్నీ ఏ రాగమో, ఏ తాళమో తెలియని పాట గొంతెత్తి ఆలా అలా అల్లనల్లన పాడుకుంటూ తిరిగేయాలని అదో పిచ్చి కోరిక. పోనీ, బృందావనంలో..అందాల కన్నయ్య కనిపిస్తాడేమో...వెతుక్కుంటూ పోతే.... కనీసం చిరుజల్లులలో ఏ సంపెంగ పూల తోటల్లోనో, నిండుపున్నమి నెలరాజు నవ్వే వేళ... చల్ల చల్లగా నా మీద కురిసే మంచు బిందువులను పాదరసం లా జారిపోకుండా దాచేసుకోవాలని, జగమే మారినది మధురముగా ఈ వేళా అని పాడుకోవాలని...కాని, 'వనసీమలలో హాయిగ ఆడే రాచిలుక నిను రాణిని చేసే...పసిడితీవెలా పంజరమిదిగో పలుక వేమనీ పిలిచే వేళ'....ఏమని పాడాలి !!! ఏనాటికీ అందుకోలేని ఈ ఆనందమే నా ప్రతి సంవత్సరం మళ్ళీ మళ్ళీ తీసుకునే 'రెజొల్యూషన్ '.... అదే గనుక జరిగిందా:) యురేకా!!!

"ఓ సమయమా! ఇక్కడే ఆగిపో...నా హృదయం ప్రేమించటానికి వచ్చింది"...అని ఎలుగెత్తి అడగాలనిపిస్తుంది:(((

వై దిస్ కొలవెరి:))))




ఈ కొత్త ఏడాది లోకమంతా నవ్వులే నిండాలి....కొత్త ఉత్సాహంతో పొంగిపోవాలి....ప్రతి ఒక్కరి ఆశల పువ్వులు విరబూయాలి.....బ్లాగ్ మితృలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలతో.

************************************************************************************

25, డిసెంబర్ 2011, ఆదివారం

బుక్ ఫెయిర్ లో నేను...




అయిపోతోంది బుక్ ఫెయిర్. ఈ సారి ఏవిటో అస్సలు వీలు కావటం లేదు. దానికి తోడు రెండురోజులనుంచి జ్వరం, ఒళ్ళునొప్పులు. మొహం పీక్కు పోయింది. ఓపిక ఎటో ఎగిరిపోయింది. లాభం లేదు. అయినా సరే వెళ్ళాల్సిందే. ఎప్పుడూ ఒకటో రెండో కొత్త పుస్తకాలు తెచ్చుకుంటూ ఉంటాను. ఈ సారి ఒక్కటన్నా తెచ్చుకోపోతే ఎలా!!!

సరే మొత్తానికి శనివారం శలవు కాబట్టి ఆ రోజు ప్లాన్ వేసాను. మిట్టమధ్యాహ్నం బుక్ ఫెయిర్ కి చేరుకున్నాము. ఎండ బాగానే ఉంది. కాని నాకెందుకో చలేస్తోంది. మా ఫ్రెండ్ ఫ్రీ పాసులు ఇచ్చింది. అయినా టికెట్ తీసుకునే పోవాలనిపించింది.

ఎంటర్ అవగానే లెఫ్ట్ సైడ్ మొదట్లోనే కనిపించింది...ఇ-తెలుగు స్టాల్. అక్కడ ఆగి లోపలున్న ఇద్దరిని చూసి పరిచయం చేసుకోవాలనుకున్నాను. ఒకరు చక్రవర్తి గారు ఒకరు కౌటిల్యగారు. నేను వాళ్ళ గురించి అడిగి వాళ్ళ బ్లాగ్ ల గురించి కనుక్కునే సరికి మీరు బ్లాగరా, బ్లాగ్ లు చదువుతారా అని అడిగారు చక్రవర్తి గారు. ఒక్క సారి గా నాకేం చెప్పాలో తెలియలేదు. మౌనంగానే కాదన్నాను. అక్కడే ఉన్న వైట్ పోస్టర్ మీద ఆనాడు విజిట్ చేసిన బ్లాగర్ల యూఆరెల్స్ కూడా రాసి ఉన్నాయి. నాక్కూడా వెంటనే అక్కడికి పోయి నా పేరు రాయాలనిపించింది. ఒద్దులే, ఏం గొప్ప బ్లాగర్ నని అనిపించి ఊరుకున్నాను. చక్రవర్తి గారు నాకు అంతర్జాలం గురించి ఒక పాంప్లేట్ ఇచ్చారు. కూడలి చూస్తారా అని అడిగారు. ఆయనకే అర్ధంకానంతగా తల అటో ఇటో ఎటో ఊపేసాను. చక్రవర్తి గారు నేను ఎన్నో వివరాలు అడగటంతో నా వైపు కొంచెం అనుమానంగా చూస్తున్నారు. నేను కౌటిల్య గారిని వారి బ్లాగ్ పేరు మళ్ళీ అడిగాను. ఈ సారి కౌటిల్య గారు కొంచెంగా తలతిప్పేసుకున్నారు. పాపం ఇంక ఇబ్బంది పెట్టొద్దులే అనుకొని ముందుకెళ్ళిపోయాను. కొంచెం దూరం వెళ్ళి ఒక సారి వెనక్కి తిరిగి చూసాను. చక్రవర్తి గారు ఇంకా అనుమానంగా చూస్తునే ఉన్నారు. చక్రవర్తి గారు,కౌటిల్య గారు సారీ అండీ.

ఎదురుగుండా మా స్టూడెంట్ కనిపించింది. వెంటనే మొహమింత చేసేసుకొని మేమ్ నాకు హెల్ప్ చేయారా అంది. నవ్వొచ్చింది. ఇక్కడేవిటి హెల్ప్, ఏమయింది, అని అడిగాను. నాకు గాన్ విత్ ద విండ్ బుక్ కావాలి అంది. సరే అని తనతో స్టాల్ లోకి వెళ్ళి ఆ బుక్ తో పాటు మిడ్ నైట్ చిల్డ్రెన్ బుక్ కూడా తీసి ఇచ్చాను. నాకు క్లాసిక్స్ కూడా కావాలి అంది. సరే అని, కొంచెం వెతికి ద గ్రేట్ వర్క్స్ ఆఫ్ విలియం షేక్స్పియర్, ద గ్రేట్ వర్క్స్ ఆఫ్ బి.జి.షా తీసిచ్చాను. కొంచెం సులభంగా చదువుకోకలదని. ఇంకా ఏదో అడగబోతోంది. ఒకపని చేయి, మెల్లిగా అన్ని బుక్స్ చూసి లేటెస్ట్ బుక్స్ కూడా తీసుకురా, నేను తెలుగు స్టాల్స్ చూడాలి అని అక్కడినుంచి బయటికొచ్చాను.

తెలుగు స్టాల్స్ చాలానే ఉన్నాయి కాని దాదాపు అన్నిట్లోనూ రిపీటెడ్గా చాలా బుక్స్ ఉన్నాయి. ఎప్పుడూ చూసేవే కాకుండా కొత్తవి కనిపిస్తాయేమో అని చూసాను. పిల్లల పుస్తకాలు చాలానే ఉన్నాయి. ఇన్ని సార్లు చూసినా అమరావతి కథలు నేనెప్పుడూ తెచ్చుకోలేదు. ఈ సారి తీసుకుందామనిపించింది. పంచతంత్రం ఒకటి కొనుక్కున్నాను. పెయింటింగ్ గురించి బుక్స్ ఉన్నాయి కాని అంతగా నచ్చలేదు. వంశీ బుక్స్, బాపూ రమణ పుస్తాకాలు కూడా తీసుకోలేదు. అన్నీ ఉన్నవే. జీవితచరిత్రలు ఉన్నాయి గాని హంపీ నుంచి హరప్పా వరకు మాత్రమే కొనుక్కున్నాను. దాదాపుగా అన్ని స్టాల్స్ లోనూ చలం బుక్స్ కనిపించాయి. ఒకచోట మాత్రం శరత్ సాహిత్యం కూడా కనిపించింది. అందరూ మిథునం పుస్తకం గురించి చెప్తున్నారుగా అని ఒకటి తీసుకున్నాను. ఈ బుక్ రెండు సైజుల్లో కనిపించింది. భానుమతి బుక్స్ కూడా కొనేసినవే.

ప్రతి స్టాల్ లో గరుడ పురాణం కనిపించింది. కాని ఎందుకో కనీసం చేయేసి చూద్దామన్నా భయమేసింది. అస్సలు ముట్టుకోను కూడా ముట్టుకోలేదు. పురాణ గ్రంధాలు తాత్విక గ్రంధాలు చాలా ఉన్నాయి. కాని నేను ఏవీ తీసుకోలేదు.
మొత్తం సినిమా వాళ్ళ గురించే ఉన్న స్టాల్ మాత్రం నన్ను కాసేపు నిలబెట్టింది. నాగేశ్వర రావ్ హీరోయిన్స్, నందమూరి, శొభన్ బాబు పుస్తకం, ఘంటసాల, సావిత్రి కి చెందిన పుస్తకాలు బాగనిపించాయి.

ప్రముఖ చరిత్ర కారులు వకుళాభరణం రామకృష్ణ గారు కనిపించారు. వారు నాకు తెలుసు. దగ్గరికి వెళ్ళి నమస్కరించి, పలకరించాను. చాలా రోజులయింది నువ్వు కనిపించి, బాగున్నావా అని చాలా ఆప్యాయంగా అడిగారు. ప్రజాశక్తి వారి, అమెరికా ప్రజల చరిత్ర, ప్రాచీన ప్రపంచ చరిత్ర పుస్తకాల ఆవిష్కరణకు వచ్చానని చెప్పారు. అమెరికా ప్రజల చరిత్ర పుస్తకం ఒక కాపీ నాక్కూడా ఇచ్చారు. నిజం చెప్పాలంటే, ఆ బుక్ తీసుకుంటున్నప్పుడు ఏదో బహుమతి పొందిన ఆనందం కలిగింది:)

పిల్లల కోసం కొన్ని ఫాన్సీ వస్తువుల షాప్ కూడా బాగుంది. రకరకాల పెన్నులు, పెన్సిల్స్, షార్ప్నర్స్, ఎరేజర్స్ గమ్మత్తుగా బాగున్నాయి. వేరుశనగ కాయల ఆకారం లో ఉన్న ఒక రబ్బర్, షార్ప్ నర్ తీసుకున్నాను. ఆరు రంగులతో ఉన్న ఫాన్సీ పెన్ కూడా తీసుకున్నాను. చేతిలోంచి ఎగురేసినప్పుడల్లా రంగులు మారే ఒక బంతి కూడా కొన్నాను. ఇవన్నీ మా సోనీ, చింటూ గాడి కోసమన్నమాట. నెహ్రూ డిస్కవరీ ఆఫ్ ఇండియా మా లక్ష్మి కిద్దామని కొన్నాను. ఇప్పుడు చాలా పుస్తకాలే చదువుతోంది.

పోయిన సారి కన్నా కూడా ఈ సారి బుక్స్ చాలా ఉన్నాయి. అప్పటికే తిరిగే ఓపిక అయిపోయింది. జ్వరం పెరుగుతున్నట్లుగా అనిపించింది. కళ్ళు మంటలుగా ఉన్నాయి. నోరెండిపోతోంది, నీళ్ళు తాగ బుద్ధి కావట్లేదు. ఇంక వెళ్ళిపోదామన్నాను. బయటికొస్తుంటే మా ఫ్రెండ్ వస్తూ కనిపించింది. చాలా బుక్స్ ఉన్నాయి. మీ అబ్బాయికి కొను. సిడీ లు ఒదిలేయ్. అని చెప్పి బయటి కొచ్చాను. అక్కడినుంచి ఈట్ స్ట్రీట్ కి వెళ్ళి వేడి వేడి కాఫీ తాగి కాసేపు కూర్చున్నాము. టాంక్ బండ్ మీంచి చల్లటి గాలి వస్తోంది గాని, వాసన భరించలేక పోయాను. మెల్లిగా ఇంటిదారి పట్టాము.



**************************************************************************************************************************

13, ఆగస్టు 2011, శనివారం

వరమహాలక్ష్మి దీవించవమ్మా...



మీ అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు.

బాగున్నారా....మా అమ్మవారు.

పోయిన సారి ఫొటో తీసుకోలేకపోయాను. పైగా కొన్ని కష్టాలు కూడా ఎదుర్కున్నాను. అందుకే ఈ సారి జాగ్రత్తగా, అసలెక్కడికీ పోకుండా శ్రద్ధగా ఇంట్లోనే అన్నీ చేసుకుంటూ ఉండిపోయాను. మా సుజాత కొడుకు చింటు గాడు, ఈ సారి నాకు అసిస్స్టెంట్. వాడి అక్క సోనీ నా కుడిచెయ్యి. ఆ పిల్ల ఎప్పుడూ నా వెనకాల ఉండాల్సిందే. ఈ పిల్ల నా పెంపుడుకూతురన్నమాట.

ఈ సారి పూజకి నాతోపాటు, మా స్నేహాలయ అమ్మాయిలు నలుగురిని, మా లక్ష్మిని కూడా పిలిచి, అందరం కలసి చేసుకున్నాం. వాళ్ళు ఎంత సంతోషించారో. హుషారుగా అన్ని పనులు వాళ్ళే చేసిపెట్టారు కూడా. చక్కగా తోరణాలు కట్టారు. ముగ్గులేసారు. ఎంతముద్దుగా ఉన్నాయో.

అమ్మవారిని తయారుచేసుకోటానికి చాలా సహాయం చేసారు. ఈ చిన్ని పిల్లలే ఈ సారి నాకు ముత్తైదువులు. వేరే ఎవ్వరినీ నేను పేరంటానికి పిలువలేదు. వాళ్ళే ఒకరికొకరు తాంబూలాలు ఇచ్చుకున్నారు. వ్రతకథ చక్కగా విన్నారు. నాక్కూడా వాళ్ళే భోజనాలు వడ్డించారు. అందరం సరదాగా అమ్మవారి కీర్తనలు పాడుకుంటూ భోంచేసాం. ఆ పిల్లల ఆనందం చూస్తుంటేనే నాకు కడుపు నిండిపోయింది.

సాయంత్రం కూడా చక్కగా మేమందరం కలిసి గుడికి వెళ్ళాం. ఈ రోజంతా చాలా సరదాగా గడిచిపోయింది.

వరలక్ష్మీ దేవి నా ఈ పిల్లలందరినీ కలకాలం సుఖంగా ఉండేట్లు దీవించుతల్లి.....

మీరు కూడా నా పిల్లల్ని దీవిస్తారు కదూ!!!!


వరలక్ష్మీ రావే మా ఇంటికి...క్షీరాబ్ధి పుత్రి...వరలక్ష్మి రావే మా ఇంటికీ.....



***********************************************************************************************************************************************************

1, డిసెంబర్ 2010, బుధవారం

సరికొత్త చీర ఊహించినాను......

ఎవరికైనా వెంకటగిరి చీరలు కావాలంటే చెప్పండి. ఈ చీరలు కట్టీ కట్టీ మా కలీగ్స్ తో బాగా తిట్లు తింటున్నాను. ఈ చీరలకు నేను బ్రాండ్ అంబాసిడర్నట. నేనే ప్రమోట్ చేస్తున్నానట. అన్నీ అవే కడ్తున్నాను కాబట్టి నా పేరు వెంకటమ్మట. అబ్బో చాలా మాటలే పడ్తున్నానులెండి. ఎవ్వరూ నామీద కొంచమైనా జాలిచూపించట్లేదు.

ఇంతకీ నీ గొడవేంటి అంటారా!!! ఏం లేదండి. చాలా కాలంగా వెంకటగిరి నుంచి అక్కడే చీరలు తయారు చేసే ఒకాయన ప్రతినెలా ఇక్కడికి వస్తున్నాడు. చీరలన్నీ తెలిసిన వాళ్ళకి అమ్ముకుని పోతాడు. గత కొంతకాలంగా ఈ పని జరుగుతోంది. వచ్చినప్పుడల్లా తప్పకుండా నాక్కూడా రెండో మూడో చీరలు అంటగట్టకుండా పోడు. దాంతో, నేను అన్నీ వెంకటగిరి చీరలే కట్టాల్సి వస్తోంది. ఎవరికన్నా పెట్టాల్సినా నేనివే చీరలు ఇస్తున్నాను. పెళ్ళిళ్ళకి పబ్బాలకి నేనే గిప్ట్ ఇస్తానో అందరికీ ముందే తెలిసి పోతోంది. మా అక్కా మా అమ్మా అయితే ఊరికే ఆ వెంకటగిరి చీర తీసుకొని రాకు మా దగ్గరికి అని నాకు గాట్ఠిగా వార్నింగ్ ఇచ్చేసారు కూడా. మా అత్తగారు కూడా ఒప్పుకోటం లేదు. ఎందుకులెండి...నా కడుపు చించుకుంటే నా కాలిమీదేగా పడేది.

వద్దయ్యా బాబూ ఈ చీరలు నాకింక, నే కూడా నీతోపాటు ఓ షాప్ పెట్టాల్సిందే ... అంటే అతను ఒప్పుకోటంలేదు. తెగ బతిమలాడుతున్నాడు. నా కష్టాలు చెప్పినా వినిపించుకోటం లేదు. పైగా తన కష్టాలు నాకు చెప్తాడు. మీకు చాలా తక్కువ రేట్ కిస్తాను తీసుకోమంటాడు. అక్కడ నేసిన చీరలు డైరెక్ట్ గా మీకే ఇస్తున్నాను అంటాడు. ఈ చీర మీకు చాలా బాగుంటుంది ... ఈ రంగు బాగుంటుంది అంటూ తెగ ఉబ్బేస్తాడు.ఈ చీర మీ కోసమే తెచ్చాను, ఇంకెవరికీ అడిగినా ఇవ్వలేదు అంటాడు. మరి కరిగి పోకుండా ఎలా ఉంటాను చెప్పండి. నా మనసేమో వెధవ మొహమాటం నువ్వూనూ....తీసుకో...అంటుంది. నేనేమో ఒకటే మొహమాటపడిపోతూ ఉంటాను. ఒక్కోసారి గట్టిగా చెప్పినా వినిపించుకోడు. అంత పెద్దమనిషిని కోప్పడలేంకదా. కానీ నాకు మాత్రం ఆ చీరలన్నీ చూడగానే రంగురంగుల తమాషా పిట్టలన్నీ రకరకాల రాగాలు తీసుకుంటూ నా చుట్టూ తిరుగుతు ఎంత హొయలు పోతున్నాయమ్మా అనిపిస్తుంది. నా కళ్ళల్లోంచి మెరుపుల జిలుగులు ఆ చీరలంతా పరుచుకుంటాయి.

అతడు ముస్లిం. కాని చక్కని తెలుగు మాట్లాడుతాడు. తన ఇద్దరు కొడుకులు కూడా ఈ పనిలోనే ఉన్నారట. ఏం చదువుకోలేదు అంటాడు. వేరే ఉద్యోగాలు ఏమీ చేయలేరు. స్వంత మరదలే పెళ్ళి చేసుకోను అందట. వాళ్ళకు ఎక్కడా పెళ్ళి సంబంధాలే కుదరట్లేదట. మా పిల్లలు చాలా అమాయకులు, సిటీలోకొచ్చి బతకలేరు. ఇప్పుడేమో ఈ చీరలెవరూ కొనటంలేదు, అని మొన్న కళ్ళనీళ్ళు పెట్టుకున్నాడు. అయ్యో పాపం అనిపించింది. కాని నేనేం చేయగలను. ఆ చీరలు కూడా చాలా ఖరీదైనవి. ఎవరైనా ఎన్నని కొనగలరు....ఆయన కొడుకులకు నేను పెళ్ళిసంబంధాలు ఎలాగూ కుదర్చలేను కదా....అందుకని చీరలైనా కొనాలికదా పాపం.

ఎలా నేను తప్పించుకోవాలో తెలియటం లేదు. కాని ఏ మాటకా మాటే చెప్పుకోవాలి. చీరలు మాత్రం అస్సలు వదులుకోబుద్ధికాదు. చాలా ముద్దుగుంటాయి. కావాలంటే మీరూ చూడండి. ఎంతబాగున్నాయో. నిజంగా ఏ చీరకుంది ఇంత అందం అనిపించటం లేదు.






























అబ్బాయిలూ నిజం చెప్పండి..."మీ కోసం" కొనేయాలనిపించటం లేదూ... అమ్మాయిలూ మీ మనసు దోచేయటంలేదూ...తప్పకుండా ఇప్పుడే కొనేస్తారు...నాకు తెలుసు

ఈ చీరలు చూస్తూంటె ఎంతో అందమైన ఈ పాటే నాకు గుర్తొస్తుంది.

సరికొత్త చీర ఊహించినాను
సరదాల సరిగంచునేయించినాను
మనసూ మమతా పడుగు పేక
చీరలో చిత్రించినాను
ఇది ఎన్నో కలల కలనేత
నా వన్నెల రాణికీ సరి జోత
అభిమానం గల ఆడపిల్లకు అలక కులుకు ఒక అందం
ఈ అందాలన్నీ కలబోసానే....కొంగుకు చెంగును ముడివేస్తానే
చుర చుర చూపుల ఒకమారు
నీ చిరు చిరు నవ్వుల ఒకమారు
మూతి విరిపుల ఒకమారు
నువ్వు ఈ కళనున్నా మా బాగే...ఈ చీర విశేషం అల్లాగే..........
సరికొత్త చీర ఊహించినాను..........

ఇంకా చూడండి...రంగురంగు చీరల వన్నెచిన్నెలు..........

చుట్టూ చెంగావి చీర కట్టావే చిలకమ్మా.........

Get this widget | Track details | eSnips Social DNA


****************************************************************************

26, మే 2010, బుధవారం

అమ్మ చెప్పిన కథ...."ఏడు గడియల రాజు"



కల్పనా రెంటాల గారి పోస్ట్ చూసాక నాక్కూడా చిన్నప్పుడు మా అమ్మ చెప్పిన కథ రాయాలనిపించింది. రామాయణం, భారతం, ఎన్నో జానపద కథలతో పాటు మామూలు కథలు నేను చాలా పెద్దగయ్యే వరకూ వింటూనే ఉన్నాను. పదేళ్ళ వయసులో పథేర్ పాంచాలి చదివాను. ఆ తరువాత చందమామ, బాలమిత్రలు అలవాటయ్యాయి. నాకు ఇప్పటికీ నచ్చిన కథ ఒకటుంది. అదే కథ నా ఏడో తరగతి తెలుగు పుస్తకం లో కూడా మళ్ళీ చూసాను. అప్పుడు ఈ కథ చూసి చాలా సంతోషమేసింది. ఆ కథ మా అబ్బాయికి కూడా చెప్పేదాన్ని. అదే ’ఏడు గడియల రాజు” కథ.

*****************************************************************

అనగనగనగా ఒక చిన్న ఊళ్ళో ఒక నిరుపేద కుటుంబం ఎన్నో కష్టాల్లో బ్రతుకుతూ ఉండే వారు. తమకున్న కొంచెం భూమి లో సాగుచేసుకుంటూ జీవితం వెళ్ళబుచ్చేవారు. వాళ్ళబ్బాయే రాజు. ఎన్నో కోరికలతో అవి తీరక నిరాశ తో గడుపుతూ ఉండే వాడు.ఎలాగైనా గొప్ప ధనవంతుడ్ని కావాలని ఆశ పడుతూ ఉంటాడు. కొంచెం పెద్దయ్యాక ఇలా ఈ పల్లెటూల్లో లాభం లేదు, ఏదైనా పెద్ద ఊరికి వెళ్ళిపోతె ధనవంతుడై సుఖంగా ఉండొచ్చు అనుకుంటాడూ. ఇంట్లో ఎవరికీ చెప్పకుండా బయలుదేరుతాడు.

దారి మధ్యలో ఒక పెద్ద అడివి ఉంది. అలసిపోయి కాసేపు విశ్రాంతి తీసుకోవాలని ఒక చెట్టుకింద పడుకుంటాడు. చల్లటి గాలికి హాయిగా నిద్రపోతాడు. ఇంతలో ఒక పెద్ద పాము అతని వెనుకగా వచ్చి పడగ విప్పి ఆడుతూ ఉంటుంది. అటువేపే వెల్తున్న కొంతమంది బాటసారులది చూసి అబ్బురంగా రాజుని లేపుతారు. నీకు మహారాజ యోగం ఉంది. చాలా గొప్పవాడివౌతావు. అని చెప్పి ఆ బాటసారులెళ్ళిపోతారు. అది విని రాజు చాలా ఆనందపడి తిరిగి తన ఊరికి వెల్తాడు. తనకు మహారాజ యోగముంది, రాజు నౌతానని అందరికీ చెప్తాడు.

ఇలా అనుకుంటే కాదు, ఎదో ఒక రాజుని ఓడించి వెంటనే రాజైపోవాలనుకుంటాడు. తనకు సైనికులుగా ఉంటే తరువాత మంత్రి పదవులిస్తానని ఆశ పెట్టి పదిమంది స్నేహితులను పోగేస్తాడు. తన పొలం, ఉన్న రెండు పశువులను అమ్మి కొన్ని పెద్ద పెద్ద కత్తులు కొని, పొరుగు రాజుని ఓడించటానికి బయలుదేరుతాడు. అక్కడ కోట ద్వారం దగ్గరున్న కాపలా వారు పదిమందితో వచ్చిన రాజు ఆ కోట ఆక్రమించటానికొచ్చాడని తెలుసుకొని ఆశ్చర్య పోతారు. ఈ వార్త మహారాజు కి తెలియజేస్తారు. అదివిని మహారాజు కూడా ఇతని ధైర్యానికి ఆశ్చర్యపోయి వివరాలు కనుక్కొని రమ్మని తమ మంత్రులని పంపిస్తాడు. మంత్రులు రాజుని కలిసి వివరాలు తెలుసుకుంటారు. మంత్రులతో ఉన్న ఒక జ్యోతిష్కుడు, అవును ఇతనికి ఇప్పటినుంచి ఏడు గడియలు మహారాజ యోగం ఉంది, అతనిని ఎవ్వరూ ఆపలేరు అని చెప్తాడు. అది తెలుసుకొని మహారాజు తన మంత్రులతో అతనిని అడ్డగించవద్దని, మహారాజుని చెయ్యమని చెప్తాడు. తనపని ఇంత సులువుగా అయిపోయినందుకు రాజు కూడా సంతోషిస్తాడు.

అప్పటినుంచి రాజభోగాలనుభవిస్తూఉంటాడు. విందువినోదాలు, నృత్యవిలాసాలు కలలో కూడా కనివినీ ఎరుగని సకల వైభోగాలు అనుభవిస్తాడు. తన అదృష్టానికి ఎంతో సంతోషంతో తన గొప్పతనానికి ఆనంద పడిపోతూఉంటాడు. తన అభివృద్ధికి ఎంతగానో గర్వపడతాడు.

ఏడు గడియలు గడవగానే మహారాజు, రాజు ని అక్కడినుంచి తరిమేస్తాడు. రాజు ఏమీ చేయలేకపోతాడు. కోట బయటకు తరిమివేయబడ్డ తనను తానే చూసుకొని నమ్మలేకపోతాడు. ఇంతసేపు అనుభవించిన సంతోషం, సంపదా వైభోగాలు ఏమైపోయాయో అర్ధం కాదు. తిరిగి నిరాశ లో మునిగిపోతాడు. కాని, క్రమంగా తనున్న పరిస్థితికి కారణం తెలుసుకుంటాడు.

తన దురాశే తన దు:ఖానికి కారణం అని తెలుసుకుంటాడు. రాశే ఫలి కాదు, కష్టే ఫలి అని అర్ధం చేసుకుంటాడు. కష్టపడి సంపాదించిన దానిలోనే శాశ్వత ఆనందం, తృప్తి లభిస్తుంది కాని అడ్డదారులలో ఎప్పుడూ పరిపూర్ణత లేదు అని భావిస్తాడు. మన జీవితాలను నిర్దేశించేది మన ప్రయత్నాలే కాని జాతకాలు కాదు. ఈ విధంగా జ్ణానోదయమయిన రాజు తిరిగి తన ఊరికి వెళ్ళి తన బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తూ, జీవితం లో తృప్తిని అనుభవిస్తాడు.

*************************************************************************************

9, మే 2010, ఆదివారం

భరతమాత దత్తపుత్రిక




ఎందరో మహానుభావులకు జన్మనిచ్చిన మన భరతమాతకు ముద్దుల దత్తపుత్రిక మదర్ థెరిసా...

యుగోస్లేవియాలో జన్మించిన ఆగ్నస్ గోన్ష్ బొజాక్సువూ, అనే పువ్వు పుట్టగానే పరిమళించింది.
మానవ సేవకు అంకితమైన త్యాగశీలి.
భారతదేశ అందానికి అద్దం పట్టే హిమాలయాలు ఆగ్నస్ కు స్వాగతం పలికాయి.
ఈ ప్రశాంత ప్రకృతిపట్ల ముగ్ధురాలయింది.
భారత పౌరసత్వం పొంది మదర్ థెరిసా గా రూపుదాల్చింది.
ఉపాధ్యాయ వృత్తికి స్వస్తి చెప్పి సేవాకార్య క్రమాలకు శ్రీకారం చుట్టింది.
పేదరికం రాజ్యమేలుతున్న ప్రాంతాల సముద్ధరణకు కంకణం కట్టుకున్న పుణ్యశీలి.
సమాజం నుంచి బహిష్కరింపబడిన రోగపీడితులకు, అనాధ శిశువులకు తన జీవితం అంకితం చేసిన కరుణామూర్తి.
మానవసేవయె మాధవ సేవ అన్న నానుడికి ప్రతిరూపమే ఈ తల్లి.
భారత ప్రభుత్వం ఈమెకు అందించిన గౌరవ పురష్కారాలు అనంతం.
ఈమె విశ్వప్రజలకు ఆచంద్రార్కం నిత్యస్మరణీయురాలే...
మహిళా ప్రపంచానికే మకుటాయమానమైన విశ్వమాత థెరిసా ఆశలను, ఆశయాలను అనుసరించి ఆచరించిన వారి జన్మ ధన్యం. అదే మన నివాళి.
ఒక నిరాడంబర మానవతా మూర్తి ఈ మదర్....

మదర్స్ డే రోజున ఒకసారి, ఈ అమ్మను తలచుకోవాలనిపించింది. ఎవరి సంతానం కోసం వారు ఎన్ని కష్ట నష్టాల నైనా ఎదుర్కోవచ్చు. త్యాగాలు చేయొచ్చు. కాని ప్రపంచాన్నే తన సంతానం గా భావించి అంకితమైన ఆ విశ్వమాతకు మాత్రం ఏది సాటి రాదు.

ఆ అవతారపురుషుడైనా ఒక అమ్మకు కొడుకే....అంత గొప్పటి అమ్మతనానికి, ప్రతి తల్లికీ ఈ రోజు నా శుభాకాంక్షలు.....


M - Mother for everyone
O - Offered everything she had
T - Took care of every poor child
H - Honored by all
E - Embraced the dying destitute
R - Really loved the orphans
T - Trusted in God
E - Earned her living for others
R - Rejoined with the poor
E - Ever to help you
S - Served the Nation with love
A - Addressed and admired by all



Mother Teresa Prayer in her handwriting:






I have found the paradox, that if you love until it hurts, there can be no more hurt, only more love.
Mother Teresa



******************************************************************

9, జనవరి 2010, శనివారం

రంగవల్లుల సంక్రాంతి



పళ్ళెటూరయినా...మహానగరమైనా...మనస౦ప్రదాయాలు..సంస్కృతి నిరాట౦క౦గా కొనసాగుతూనే ఉ౦టాయి.
స౦క్రా౦తి ర౦గవల్లుల స౦గతి చెప్పవలసిన పనేలేదు.
ఈ ధనుర్మాసమ౦తా ఎన్నో అ౦దమైన ర౦గవల్లులతో ప్రతి ఇల్లు అలరారుతు౦ది.
చుక్కల ముగ్గుల కన్నా ఫ్రీ హా౦డ్ డిజైన్స్ చాలా ఆకర్షిస్తున్నాయి. ముఖ్య౦గా నగరాలలో ప్లాట్స్ లో ఉ౦డే వారు ఈ డిజైన్ల తోటి ప్రయత్న౦ చేయవచ్చు.
అలా౦టివే కొన్ని డిజైన్లు ఇవి.
ఈ డిజైన్లు వేసి చక్కటి ర౦గులతో ని౦పితే స౦క్రా౦తి కళకళ లాడుతూ మన ఇ౦టిము౦దే ఎప్పటికీ నిలిచిపోతు౦ది. ఈ డిజైన్ల మీద మన౦ గొబ్బెమ్మలని కూడా పెట్టుకోవచ్చు












ఈ స౦క్రా౦తికి అ౦దరు గోదావరి ఈ ఒడ్డుకి, ఆ ఒడ్డుకి వెళ్ళి పోతున్నారు కదా!
స్వ౦త ఊళ్ళకి వెళ్ళిపోయి ఆన౦ద౦గా ఈ ప౦డుగ స౦బరాలు జరుపుకోవాలను కు౦టున్నారు కదా!
ప౦డుగ రోజుల్లో మీరెవ్వరు దొరకరు కదా!
అ౦దుకే మీ అ౦దరికీ....ము౦దుగానే నా స౦క్రా౦తి ఆన౦దపూర్వక శుభాకా౦క్షలు.


స౦బరాల స౦క్రా౦తి

స౦క్రా౦తి వస్తే మనలో కనిపిస్తు౦ది నవ్వుల కా౦తి
ధనుర్మాస౦లో తప్పక ముగ్గులు పెడుతు౦ది ప్రతి ఇ౦టి ఇ౦తి
అ౦దులోని గొబ్బెమ్మలు ప్రతి గుమ్మపు స్వాగత తోరణాలు
పిల్లలు హుషారుగా ఎగరేస్తారు గాలిపటాలు
చేసుకు౦టా౦ ఎన్నెన్నో పి౦డి వ౦టలు
ఇళ్ళకు తరలిస్తారు ధాన్యపు బస్తాలు
రైతుల ముఖాలలో కనిపిస్తాయి ఆన౦ద దరహాసాలు
కథలు గాధలుగా పాడుతారు హరిదాసులు
అవి వి౦టూనే సాగుతాయి దానధర్మాలు
కన్నెపిల్లల కేరి౦తలకు ఉ౦డవు పట్టపగ్గాలు
భోగిమ౦టల ముచ్చట్లు, భోగిపళ్ళ సరదాలు
బొమ్మల కొలువుల పేర౦టాలు
కోడి ప౦దాల కవ్వి౦తలు
అ౦తేలేని సరాగాల, పరవళ్ళు తొక్కే హ్రుదయాల సవ్వడి
అ౦దరిలో ఉదయి౦చును ఈ నవ స్రవ౦తి
ఆన౦ద౦గా జరుపుకోవాలి నవ్వుల స౦క్రా౦తి


ఈ నాటి స౦క్రా౦తి అసలైన స౦క్రా౦తి కావాలని... అ౦బరాన్ని అ౦టే స౦బరాల ప౦డుగ కావాలని ...మనకు శా౦తి సౌఖ్యాలనిమ్మని...మనసారా...రావమ్మా మహాలక్ష్మి...రావమ్మా అని... ఆ మహాలక్ష్మి ని కోరుకు౦టూ ఆహ్వానిద్దా౦.





*****************************************************************************

24, నవంబర్ 2009, మంగళవారం

ప్రత్యేక అవార్డ్స్?



స్త్రీలకు ఇచ్చిన 'సేఫ్ రన్నింగ్' అవార్డ్స్ అట ఇవి. మొదటి బహుమతి నుంచి, పదవ బహుమతి వరకు ఎన్నిక చేసిన లిస్ట్ అట.

చూడండి మరి...

ఈ అవార్డ్స్ 2006 లో ఇచ్చినవి. ప్రత్యేకంగా స్త్రీల డ్రైవింగ్ కి మెచ్చి, ఇచ్చిన అవార్డ్స్ ఇవి. ఎలా ఉన్నాయి!

బాగున్నాయి కదూ....

"ముద్దార నేర్పించిన, ముదితలు నేర్వని విద్య కలదే"...అన్నట్లే ఉంది కదూ.

ఇవి నిజంగా పోటీల కోసం చేసినవే అనుకుంటున్నారా?

చాలా రోజుల క్రితం ఒకసారి చూశాను. గమ్మత్తుగా అనిపించింది.

దీని ప్రత్యేకత ఏంటంటారు?





















************************************************************************************





14, అక్టోబర్ 2009, బుధవారం

ఎంతమాత్రం పనిలేని రోజు!....

పిల్లలకి సెమిస్టర్ పరీక్షలని నాలుగు రోజులు ప్రిపరేటరీ హాలిడేస్ ఇచ్హారు. కాలేజ్ లొ పిల్లలెవరూ లేరు. పెద్దలు మాత్రం అందరూ రావాల్సిందే. చచ్హినట్లు అందరూ కాలేజ్ కి వొచ్హారు. కాని ఎవ్వరికీ ఎటువంటి పని లేదు. అన్ని పన్లు మహా హడావుడిగా ఈ మధ్యనే అవగొట్టించారు. ఇప్పుడేమో గోళ్ళు గిల్లుకుందామన్నా అవికూడా లేని పరిస్తితిలో ఉన్నాం. రోజంతా గడపాలి... ఏం చేయాలి....
ఎవరి రూంలల్లో వాళ్ళం కూర్చోని ఉన్నాం. నాకెందుకో కనీసం పేపర్ కూడా చదవాలనిపించటం లేదు. ఎంత డల్ గా ఉందో! ఏం చేయాలి, ఇంత పనిలేకుండా ఎప్పుడూ లేమే...అనుకున్నాను.

ఇంతలో ఎవరో ఒక సోషల్ వర్కర్ అట, మా రూం లోకి వొచ్హాడు. అమ్మా! మేము కర్నూల్ పోతున్నాం, మీ అందరు ఏమిచ్హినా సరే అక్కడి వాళ్ళకు అందజేస్తాం అన్నాడు. మీ ఇంట్లోవి ఏమిచ్హినా సరే, అన్నాడు. మీరు ఎవరండీ అని నే నడగబోతున్నాను.. ఇంతలోనే మా కొలీగ్ అందుకొని,ఇంట్లో ఉన్నవన్నీ మీ కిచ్హేస్తే ఇంక మేము కూడా మీ బండి ఎక్కేసి రావాల్సిందే.. అంది. చూడండీ మేము ఇవ్వాల్సింది ఇప్పటికే ఇచ్హేసాం, ఇంక మీరు వెళ్ళండి అంది ఇంకో కొలీగ్. అందరూ సంఘసేవ చేసే వాళ్ళే, మీకు అసలు కాలేజ్ లొకి ఎవరు పర్మిషన్ ఇచ్హారండి... అని ఇంకో కొలీగ్ అందుకుంది. పాపం ఆ మనిషి బిక్క చచ్హి పోయి చాలా తొందరగా మా రూం నుంచి వెళ్ళిపోయాడు. అవునూ, మనమే కర్నూల్ పోయి రావొచ్హుకదా ఒకసారి! మనందరం కలసి ఒకసారి పోయి మనకు చాతనయింది చేసొద్దం, ఏమంటారు అన్నాన్నేను. మనం ఎప్పుడూ పోయె కంపెనీ నుంచి బస్ మాట్లాడుకుందాం అన్నాను. అవును ఈ అయిడియా బాగుంది, ప్రిన్సిపల్ తో కలిసి అందరం పోదాం, ప్లాన్ చేసుకుందాం...అనుకున్నాం అందరం.

ఇంతలో బస్ పాస్ సిగ్నేచర్ కోసం ఒక స్టూడెంట్ ఒచ్హింది. అది నా డ్యూటీ. ఏంటమ్మా! ఇవాళ మీకు హాలిడే కదా, దీనికోసం ఇప్పుడెందుకొచ్హావ్, తరువాత తీసుకోవాల్సింది. అన్నాను. దానికి ఆ అమ్మాయ్, ఇవాళ లాస్ట్ డేట్ అందుకే వొచ్హాను, మాడం అంది. మరి ఎందుకులేట్ చేసావ్, ఇప్పుడు చూడు ఒక్క ఈ చిన్న పని కోసం రావాల్సొచింది, అన్నాను నేనూరుకోకుండా. సైన్ చేసేసి, అబ్బో! ఇవాళ చాల పెద్ద పనే చేసాను అనుకున్నాను. ఇంతమంచి అవకాశం వొదులుకోటం ఇష్టం లేని మా కొలీగ్, నువ్వు ఒక్క దానివి ఇవాళ కాలేజ్ కొచ్హావ్ కాబట్టి నీకు ఇప్పుడొక పనిష్మెంట్ అంది.నువ్వు ఇప్పుడొక కవిత్వం చెప్పాలి మాకు అంది. ఆ అమ్మాయ్ భయపడిపోతుందేమొ అనుకున్నాను నేను. పనిష్మెంట్ అనేటప్పకి ముందు ఆ అమ్మాయ్ భయపడ్డా, ఆ శిక్ష ఏవిటో తెలిసిపోయిన తరువాత మాత్రం, అనుకోకుండానే ఆ అమ్మాయి కళ్ళు మెరిసి పోయి బ్రమ్హాండమైన హుషార్ వొచ్హేసింది. ఆ అమ్మయికి కవిత లంటే చాలా ఇష్టమంట, ఈ మధ్యనే 'అమ్మ ' గురించి ఒకటి రాసాను మేడం, చెప్తాను అంది. తన బాగ్ లోనుంచి ఒక పెద్ద నోట్ బుక్ తీసింది. దాని నిండా కవితలే! ఇంక అయిపోయాం అనుకున్నాను.

చదవటం మొదలు పెట్టింది:
అమ్మ అంటే మదర్
చదివించేటప్పుడు టీచర్
నిద్రపుచ్హేటప్పుడు సింగర్
జ్వరం వొచ్హినప్పుడు డాక్టర్
సలహా ఇచ్హేటప్పుడు లాయర్
తప్పు చేసినప్పుడు దండించే లేడీ ఇన్స్పెక్టర్
అమ్మ ప్రేమ ఎవర్
అమ్మకు కోపం నెవ్వర్
జల్లుతుంది ప్రేమ షవర్
అమ్మ ఎంతో క్లెవర్
ఆమెకు ఉంది ఎంతో పవర్
అమ్మా నీకు నా జోహార్!!!.. అని చదివేసింది. ఎవ్వరం ఏమి మాట్లాడ లేదు. నా కెందుకో గాని 'నువ్వు నాకు నచ్హావ్ 'సినిమా లోని ప్రకాష్ రాజ్ అమ్మ మీద కవిత్వం గుర్తుకొచ్హింది. చివ్వరి లైన్ మాత్రమే నాకు గుర్తుంది. "ఎందుకమ్మా! అంత ఎర్లీ గా చచ్హావ్" అని. బాబోయ్! ఇంక ఎక్కువాలొచిస్తే కష్టం అనిపించింది. మా ఫ్రెండ్ ఇంకా ఏదో ఆ అమ్మాయిని అడగబోతుంటే, ఇంక నువెళ్ళమ్మ అని తొందరగా ఆ అమ్మాయిని పంపించేసాను.

ఎందుకలా పంపించేసావ్, కాసేపు టైం పాస్ అయేదిగా అంది మా కొలీగ్. ఫర్వా లేదులే నువ్వే ఏమన్నా కొన్ని జోక్స్ చెప్పు అన్నాను. అవును, బాగుంటుంది, అందరూ తల కో జోక్ చెప్పాలి అంది.

తనే చెప్పింది ఒక జోక్, అదేంటంటే....
టీచర్: సందీప్, పదిరూపాయల నోట్ మీద గాంధీ నవ్వుతూ ఉంటా డెందుకు?
సందీప్: గాంధీ ఏడిస్తే నోట్ తడిసిపోతుంది మేడం
అందరం ఏక గ్రీవంగా నచ్హలేదు పొమ్మన్నాం.

అయితే నేను మంచి జోక్ చెప్తాను అని ఇంకో కొలీగ్ అందుకుంది. అదేంటంటే... మన ఎంగేజ్మెంట్ కి ఒక రింగ్ ఇవ్వాలి అని గోముగా అడిగింది, ఒక గర్ల్ ఫ్రెండ్ ఒక బాయ్ ఫ్రెండ్ ని. దానికి ఆ బాయ్ ఫ్రెండ్ 'దానికేం భాగ్యం, ఏదీ నీ సెల్ నంబర్ ఇవ్వు ' అని అడుగుతాడు.

ఊహూ! ఈ జోక్ లేవి బాగా లేవు. రిడిల్స్ వేసుకుందాం అన్నాన్నేను. సరే, అయితే నువ్వే ముందు చెప్పు అన్నారు వాళ్ళు. ఏం చెప్పాలబ్బా! అని కాసేపు ఆలోచించాను. సరే, దీనికాన్సర్ చెప్పండి అన్నాను.
అదేంటంటే,"చిమ్మ చీకట్లో నన్నొంటరిగా నిలబెడతారు, ఎంత ఏడుపొస్తుందో" ఎవరో చెప్పుకోండి అన్నాను.
ఆ ఏముందిలే, ఎవరో ఒక పిల్ల చదవక పోతే వాళ్ళ అమ్మ గదిలో పెట్టి తలుపేసేసి ఉంటుంది, అంది మా ఫ్రెండ్.
ఛి, ఏం కాదు, నువ్వు సరిగ్గా కనుక్కోటం లేదు. రాక పోతే చెప్పు ..నేనే చెప్తాను, అన్నాను.
ఎవ్వరూ చెప్పలేదు. అదేంటో తెల్సా "కొవ్వొత్తి" అన్నాన్నేను.
ఓష్! అంతేనా, మరీ ఇంత ఈజీ అనుకోలేదు అంది.

నేనో రిడిల్ చెప్తాను అంది, ఇంకో కొలీగ్.
అదేంటయ్యా అంటే, "తాగటానికి నెయ్యిచ్హారో గుప్పు మంటాను, నీళ్ళిచ్హారో తుస్సు మంటాను, ఇంతకీ నేనెవ్వర్ని, అంది.
ఇదేదో యజ్ఞమో, యాగమో లాగుంది. అంది ఒక ఫ్రెండ్. ఆ, నాకు తెల్సి పోయింది, ఇది "మంట" అంతే కదా! అంది అంతకు ముందే స్టూడెంట్ ని ఏడిపించిన కొలీగ్.
అబ్బా! అంత తొందరగా చెప్పేస్తే ఎలా! అయితే ఇంకోటి అడుగుతాను చెప్పండి అంది.
కాదు,కాదు, నేను అడుగుతాను చెప్పండి అని ఇంకో ఫ్రెండ్ మొదలు పెట్టింది.
"అందరిలాగే నాకు ముందున్నవి రెండు కళ్ళే, వెనుక మాత్రం వేయి కళ్ళు, నా పేరేంటో చెబుతారా!" అంది.
వెంఠనే అందరం ఏక కంఠంగా "నెమలి" అని చెప్పేసాం. తనేమో, మాకు అది అంత ఈజీ అనుకోలేదేమొ పాపం, చిన్నబుచ్హుకుంది.

ఎప్పుడొచ్హారో మా వైస్-ప్రిన్సిపల్, మేమెవ్వరం మా గొడవలో పట్టించుకోనే లేదు. నిశ్శబ్దంగా మమ్మల్ని చూస్తున్నారు. వెంటనే అందుకున్నారు. "ఏ నేరమూ చేయని వాడిని అందరూ పట్టుకొని తంతారు" ఎవ్వరో చెప్పుకొండి అన్నారు. మేమొక నిమిషం బిత్తర పోయినా, వెంటనే తేరుకొని,కూర్చొండి మేడం అన్నాం. దీనికి ఆన్సర్ చెప్పండి, కూర్చుంటాను అన్నారు. ఎవ్వరం చెప్పలేదు. ఎందుకంటే, మా కిప్పుడు విమానం మోత తప్పదన్న పెద్ద నమ్మకం లో పడిపోయాం. నేను ఇప్పుడు కాలేజ్ మొత్తం చూసుకుంటూ వొస్తున్నాను, అందరూ మీ లాంటి 'అవస్థ ' లోనే ఉన్నారు. మీరు ఆన్సర్ చెప్పరు గాని, నేనే చెప్తాను. అది 'బాల్ ' అనుకుంటూ వెళ్ళిపోయారు. అమ్మయ్యా! తుఫాన్ తప్పిపోయింది, అని అందరం సంతోషించాం.

ఏవిటో! ఇక్కడ ఇంత సరదాగా ఉంటామా, ఇంటికి పోగానే పరిస్థితి పూర్తిగా తలకిందులే. ఏవిటో జీవితం, అంది సడన్ గా మా ఫ్రెండ్ ఫిలసఫీ లోకి వెళ్ళిపోతు. తనకి ఇంటినిండా కష్టాలే పాపం. ఒక నిముషం అందరం చాలా మూడీగా అయిపోయాం. వాళ్ళాయన చేతిలో చాలా తిప్పలు పడుతోంది.అప్పుడప్పుడూ చెప్తూ ఉంటుంది. అందరూ వీలైనన్ని సలహాలు ఇస్తూనే ఉంటారు. ఏవిటో, స్త్రీలకు ఎంతో స్వేచ్హ ఇచ్హాం అంటారు, ఉద్ధరించామంటారు. కాని ఏమి మారలేదు. ఆడవాళ్ళకి ఇంట్లో బయట ఎన్నో బాధ్యతలు పెరిగాయె తప్ప , ఏ ఉద్ధరణా లేదు అంది.

అదేం మాట, వాళ్ళు మనని ఉద్ధరించటమేంటి, ఒక పక్క సమానత్వం గురించి మాట్లాడుతూ, ఇంకో పక్క మొగవాళ్ళు ఏదో ఇవ్వాలి అంటారేంటి. మనకు కావాల్సిందేదో మనమే సంపాదించుకోవాలికాని అన్నాను నేను. నాకు నోరుమూసుకొని కష్టాలు భరించటమంటే చాలా కోపం వొస్తూ ఉంటుంది. "ఉద్ధరణ" అందరికీ కావాల్సిందే! బాలకార్మికులకీ, అంగవైకల్యులకి, మానసిక రోగులకి, ఇలా చాలా మందికీ .... అందరికీ కావాలి అన్నాన్నేను.

సీన్ మారిపోయి వాతావరణం చాలా వేడెక్కి పోయిందని అర్ధమైపోయింది. పరిస్థితి చల్ల పరచాలని మా ఫ్రెండ్ "వైఫ్" ల మీద ఎన్ని జోక్ లున్నాయో, నేనొకటి చెప్తాను వినండి అంది. సరే చెప్పు అన్నారంతా.

ఒక హజ్బండ్, వైఫ్ తోటి ఇలా అన్నాడట: అసలు నాకు వైఫ్ అంటే అర్ధం తెలిస్తేగా! నిన్ను పెళ్ళి చేసుకున్నాకే తెలిసింది. అని ఇలా చెప్పాడు. వైఫ్ అంటే....
W: without
I: Information
F: Fighting
E: Everytime... అని ఎంతో కోపంగా చెప్పాడు భర్త.

ఈ జోక్ నాకేం నచ్హలేదు. ఈ మధ్యనే టి.వి.లో "ప్రజావేదిక" చూసాను. అందులో టాపిక్, సంసారాలు కూలిపోటానికి, భార్యా? భర్తా? ఎవరు కారణం అనేదాని మీద చాలా తీవ్రంగా చర్చ జరిగింది. దాదాపు కాపురాలు కూలిపోటానికి భార్యలే కారణం అని ఆ చర్చలో తేల్చారు. నా కెందుకో ఆ చర్చ సక్రమంగా అనిపించలేదు. ఎన్నో పాయింట్స్ ఒదిలేసినట్లుగా అనిపించింది. అందుకే కనీసం ఇప్పుడైనా నా కసి తీర్చుకోవాలనిపించింది.
దీనికి ప్రతిగా నేనొక జోక్ చెప్తాను అని ఇలా చెప్పాను.
ఆ భార్య వెంటనే అతనికి ఇలా సమధానం చెప్పింది:
కానే కాదు వైఫ్ అంటే:
W: With
I: Idiot
F: For
E: Ever...... అని అరిచింది భార్య.

అందరూ ఒకే సారి ఘొల్లున నవ్వటం మొదలు పెట్టారు. దీనితో వాతావరణం చల్ల బడింది. అందరి మనస్సులు శాంతించాయి.

ఇంతలో intercom మోగింది. Semester Exams గురించి meeting ఉందని principal phone. ఇంక మా మీటింగ్ ఆపేసి పెద్ద మేడం మీటింగ్ కి బయలుదేరాం.

*******************************************************************
 

మనస్వి © 2008. Template Design By: SkinCorner