25, ఆగస్టు 2010, బుధవారం
నాస్టీ ఎక్స్పీరియన్సా!!! అడ్వంచరా!!!!
ప్రతి సంవత్సరం వరలక్ష్మీ వ్రతం తప్పకుండా చేస్తాను. ఈ వ్రతమంటే నాకెంతిష్టమో చెప్పలేను. ఎప్పటిలాగే, చక్కటి పీఠం మీద బియ్యంపోసి, తమలపాకులు పెట్టి, విఘ్నేశ్వరున్ని తలచుకొని, ఒక పెద్ద బిందె మీద చిన్న బింద పెట్టి, చేతులుగా ఒక హాంగర్ కట్టి అమ్మవారి విగ్రహం తయారు చేసాను. అమ్మవారికి కొత్తగా కొన్న పట్టుచీర కట్టి, పెద్ద అంచులు కనిపించేట్లుగా అందంగా సద్దాను. పైన కలశం పెట్టి, కళకళ లాడే పెద్ద వెండి మొహాన్ని పొజిషన్ లో పెట్టాను. శుభ్రంగా ఉతికి ఉంచిన సవరాన్ని వెనకాల భుజాలదాకా పరచి, అందమైన పూలతో అలంకరించాను. పైన జలతారు మేలిముసుగు కూడా వేసాను. చక్కటి పూల దండ వేసి, వివిధ అభరణాలతో అలంకరించాను. గిల్టు, అసలు...అన్ని రకాలు ఉంటాయిలెండి. గౌరమ్మను కూడా చేసి పెట్టాను. వెనక గోడకంతా రకరకాల సైజుల్లో, షేపులతో రంగు రంగుల ఎలెక్ట్రిక్ దీపాల వరుసలతో అలంకరించాను. అమ్మవారి చుట్టూ ఎన్నో పూలు అందంగా ఉంచాను. కలువ పూల అందమైతే మరీ ప్రత్యేకంగా ఉంది. మొగలిపూల సువాసనలు ఆ గదంతా విరజిమ్ముతు ఏదో లోకాలకు తీసుకెళ్ళిపోతోంది. ఇంకా పెద్ద నుంచి చిన్న సైజు వరకు వెండి దీపాలు చుట్టూ పెట్టాను. చిక్కటి రంగులతో వేసుకున్న రంగవల్లి కన్నుల పండుగగా ఉంది. ఇదంతా అయ్యాక చూసుకుంటే అబ్బా.. మా అమ్మవారు ఎంత దేదీప్యమానంగా వెలిగిపోతున్నారో. వెలుగు జిలుగుల మా అమ్మవారు ఎంత ముద్దొస్తున్నారో. చాలా సంతోషమనిపించింది. అబ్బో ఎంత బాగా చేసానో అని భలే గర్వం కూడా వచ్చేసింది. నేను చేస్తున్న ప్రతి అలంకరణ మా అత్తగారు కూడా మెచ్చుకుంటూ ఉండడంతో ఇంకా మురిసి ముప్పందమైపోయాను. ఈ 'ముప్పందం' అంటే ఏమిటో నిజ్జంగా నాకుతెలీదు. ఇది మా అత్తగారి దగ్గిర పట్టిన మాటన్నమాట. కావల్సిన మిగతా పూజా సామాన్లన్నీ కూడా పొందంగా సద్దేశాను. నేను కూడా చక్కగా కొత్త పట్టుచీర కట్టుకొని, హాయిగా వంటినిండా నగలన్నీ పెట్టేసుకున్నాను. ఈ సారి చేయించుకున్న పచ్చలసెట్ వేసుకున్నాను. అబ్బో ఎంత బాగున్నానో..నన్ను చూసి నేనే మురిసి పోయాను. తెలుగాడపడుచంటే ఇలా ఉండాలి. నన్ను నేనే శభాష్ అని మెచ్చుకున్నాను. చక్కగా ఎర్రగా పండిన చేతి గోరింటాకు, చేతినిండా వేసుకున్నగాజులతో, మోచేయి వరకు మాత్రమే కనిపించేట్లుగా అమ్మవారితో ఒక ఫొటో తీసుకొని నా బ్లాగ్ లో పెట్టుకోవాలనిపించింది. అసలే ఈ మధ్యనే గాజులేసుకోనని రాసుకున్నాను బ్లాగ్ లో. తనకు తాను మురిసె తాటాకు గుడిసె అంటే ఇదేనేమో!!!
ఎట్లా నిన్నెత్తుకుందునమ్మా..వరలక్ష్మీ తల్లీ..ఎట్లా నిన్నెత్తుకుందునమ్మా...
ఇట్లా రమ్మనుచూ పిలిచీ కోట్లా ధనమిచ్చే నిన్ను....ఎట్లా నిన్నెత్తుకుందునమ్మా...అని పాడుకుంటూ వెళ్ళి నా డిజిటల్ కెమెరా తెచ్చాను. ముందుగా అక్కడే కూచుని అప్పటి దాకా నాకు సలహాలిస్తున్న మా అత్తగార్ని ఒక ఫొటో తీద్దామనుకున్నాను. ఆవిడకి ఫొటో దిగటమంటే చాలా ఇష్టం. ఫొటో అనంగానే చీర, అంచులూ, నగలూ అన్ని సద్దేసుకొని, నా వైపే కళ్ళర్పకుండా, నేనెప్పుడు ఫొటో తీస్తానా అని బిగించుకొని కళ్ళుకూడా తిప్పకుండా కూచున్నారు. తన ఫొటో ఏ కొంచెం బాగా రాకున్నా చాలా అలుగుతారు. కాని కెమెరా నుంచి చూస్తున్న నాకు అంతా ఎర్రగా కనిపిస్తోంది. ఎందుకబ్బా మా అత్తగారు ఎర్రచీర కట్టుకోలేదే అనుకుంటూ మళ్ళీ, మళ్ళీ చూసాను. ఊహూ... ఎర్రగానే కనిపిస్తున్నారు. ఇదేంటబ్బా, అనుకొని అమ్మవారి వైపు తిరిగి మళ్ళీ లెన్స్ నుండి చూసాను. అయ్యో! అమ్మవారు కూడా ఎర్రగానే కనిపిస్తున్నారు. అరె, అమ్మవారికి నేను ఎర్రచీర కాదే కట్టింది, అని మళ్ళీ చూసాను. లాభంలేదు, ఎర్రగానే ఉన్నారు. ఏంటబ్బా! అనుకొని, ఇంకో వైపున్న టి.వీ. వైపు లెన్స్ పెట్టి చూసాను. అంత పెద్ద నల్లటి స్క్రీన్ కూడా ఎర్రగానే ఉంది. అలా కాదని మిగతా రూమ్ ల్లోకి పోయి అన్ని చోట్లా చూసాను. మా ఇల్లంతా ఎర్రగానే ఉంది. ఎందుకు మా ఇల్లంతా ఎర్రగా అయిపోయిందో అర్ధం కాలేదు. ఈ లోపల మా అత్తగారు అసహనంతో, ఇంకెప్పుడమ్మాయ్, నన్ను ఫొటో తీసేదీ అని గట్టిగా పిలిచారు. అన్ని గదుల్లో సంచరిస్తున్న నేను, ఇంక ఆ ప్రయత్నాలు ఆపి మా అత్తగారి దగ్గరికెళ్ళి మళ్ళీ చూశాను. ఊహూ..ఇంకా ఎర్రగానే ఉన్నారావిడ. ఒక నిమిషం భయం వేసింది. కాని మెల్లిగా నా ట్యూబ్ లైట్ బుర్ర వెలిగి, కెమెరా పాడైంది అని అర్ధమైంది. వెంటనే గాలి తీసిన బెలూన్ లా అయిపోయాను. అయ్యో! ఫొటో తీసుకోలేనా..ఎంత దిగులేసిందో. దిగులెందుకు, రెండు లైన్ల అవతల ఒక ఫొటో స్టూడియో ఉంది. అక్కడికి పోతే నిముషాల్లో రిపేర్ చేసేసి ఇస్తాడు. తెలిసిన వాడే. మా కాలేజ్ కి ఆస్థాన ఫొటోగ్రాఫరే. ఇప్పుడే పోవాలి. సాయింత్రమైతే పేరంటాళ్ళందరూ ఒచ్చేస్తారు. ఇంకా చాలా పని ఉంది. తొందరగా వచ్చేస్తే సరి అని బయలుదేరాను.
కొంచెం దూరంలో ఒక జంక్షన్ ఉంది. రోడ్ దాటాలి. ఇటు పక్కగా కొన్ని కార్లు వరుసగా ఆగి ఉన్నాయి. నేను రోడ్ దాటాలి అంటే ట్రాఫిక్ కంట్రోల్ అయితే తప్ప దాటనన్నమాట. అందుకని అక్కడే ఒక కార్ కానుకుని నించుని సరిఅయిన చాన్స్ కోసం చూస్తున్నాను. మిగతావాళ్ళంతా, వాళ్ళ రెండు చేతులు ఊపేసుకుంటూ, వెహికల్స్ ఆపేసుకుంటూ చకచకా రోడ్ దాటేస్తున్నారు. చీ..నాకీ పిరికితనం ఎప్పుడుపోతుందో. అయినా ఈ మాత్రం జాగ్రత్త ఉండాలిలే...నేనే కరెక్ట్, అనుకున్నాను. ఇలా నా అలోచనా తరంగాల్లో నేనుండంగానే, నా పక్కనే నించున్న ఒకాయన, మేడం, మీ గాజనుకుంట, పడిపోయింది...చూసుకోండి అన్నాడు. అసలే నావి కొత్త గాజులు. పైగా చిన్న క్లిప్ తోటి ఉంటాయి అవి. ఆ క్లిప్ తీసి చేతికి వేసుకొని మళ్ళీ క్లిప్ పెట్టేయటమే. అలా అయితే ఎవరికైనా వేసుకోటానికి సైజ్ ప్రాబ్లం ఉండదు. నేను తరువాత ఈ గాజులు నా కోడలికివ్వాలనుకుంటున్నాను. మరి తన సైజేంటో, ఇప్పుడు తెలీదుగా...అందుకన్నమాట. ఆ క్లిప్ ఊడి పడిపోయాయేమో!!నేను సరిగ్గా పెట్టుకోలేదు అనుకుంటూ, నా చుట్టూ చూసాను. కాని అక్కడ నాకు ఏ గాజులు కనిపించలేదు. ఇక్కడ కాదు మేడం, ఆ కార్ పక్కన పడింది అన్నాడాయన. వెంటనే ఆ కారు పక్కన ఉన్న సందులో ఒక అడుగేసి చూసాను. కార్ చివర ఒకాయన నుంచుని నన్నే చూస్తున్నాడు. మేడం, ఇక్కడ ఉంది గాజు అన్నాడు. ఒక్క అడుగు లోపలికి వేయబోతున్న దాన్ని, ఎందుకో నా చేతుల కేసి చూసుకున్నాను. గాజులు చేతికే ఉన్నాయి. ఎక్కడో కార్ కి ఒక చివర నించున్నతనికి నా గాజు గురించేం తెలుసు! నా మట్టిబుర్రలో ఒక్కసారిగా ప్లాష్ వెలిగింది. చటుక్కున వెనక్కి తిరిగేసాను. నా పక్కనే నించున్న మనిషి నాకు దగ్గరిగా వచ్చేస్తున్నాడు. కారుకు అటు చివర ఉన్న మనిషికూడా నేను వెనక్కి తిరగటంతో నా వైపే మేడం..మేడం అని పిలుస్తూ స్పీడ్ గా వచ్చేస్తున్నాడు. ఏదో ప్రమాదం జరగబోతోందని అప్పుడు కాని నా కర్ధం కాలేదు. గట్టిగా అరుద్దామన్నా నోరు పెగల్లేదు. నా ఎదురుగా వస్తున్న మనిషిని ఒక్క తోపు తోసి కారు సందులోంచి బయటకు దూకేసాను. ఆ మాత్రం చేయటమే నాకెక్కువ. ఆ మనిషి ధఢాల్ మని కిందపడిపోయాడు పాపం. రోడ్ దాకా వచ్చేసి ఒకసారి వెనక్కి తిరిగి చూసాను. ఆ ఇద్దరూ నాకు దరిదాపుల్లో కనిపించలేదు. ఒక్క సారిగా నా గుండె ఆగిపోయింది. బాబోయ్..వాళ్ళు దొంగలు, అని అప్పుడనుకున్నాను. ఒళ్ళు చల్లబడిపోయి, గొంతు తడారిపోయి, అలాగే ఉండిపోయాను.
మెల్లిగా తేరుకున్నాను. రోజూ ఎన్నో వింటున్నాను. ఈ మాత్రం కూడా నాకు తెలివి లేదేంటని తిట్టుకున్నాను. రోడ్ మీద అంతమంది జనం ఉన్నా కూడా ఎంత ధైర్యం వీళ్ళకి!!! నా చేతులు తెగ్గోసేవాళ్ళా...మెడ నరికేసేవాళ్ళా... అమ్మో!!! వాళ్ళెంతోదూరం పోయుండరు. పర్లేదు, నాకు ధైర్యం చాలానే ఉందని ఒక నిమిషం సంబరపడ్డాను. అక్కడ ట్రాఫిక్ పోలీస్ కి చెప్పాలి. లేకపోతే...నా లాగా ఇంకా ఎందరో....ఇవాళ నా అదృష్టం బాగుంది. లేకపోతే ఏమైపోయేదాన్నో!!! మా ఇంట్లో నక్కైతే లేదుకాని తోక తొక్కి రావటానికి, బహుశ: ఆ వరలక్ష్మీ దేవే నన్ను కాపాడింది అనిపించింది. ఎంత చూసినా అక్కడ ట్రాఫిక్ పోలీస్ కనిపించలేదు. అక్కడ ఎక్కువ సేపు ఉండే ధైర్యం మాత్రం లేదు. కెమెరా వద్దు ఏం వద్దు అనుకోని, తల గిరగిరా అన్ని వైపులా తిప్పి చూసుకుంటూనే, మెల్లిగా ఇంటి దారి పట్టాను. వాళ్ళు ఇంకా నా వెనుకే ఎక్కడో రహష్యంగా వస్తూనే ఉన్నారని నా అనుమానం. వాళ్ళకి మా ఇల్లెక్కడ తెలిసి పోతుందో అని భయపడుతూనే, అన్ని వైపులా జాగ్రత్తగా చూసి కాని ఇంట్లో కాలు పెట్టలేదు. ఆ రోజు సాయంత్రం కనీసం ఒక్క పేరంటానికైనా ఇల్లు దాటి బయటికి పోతే ఒట్టు. మనసులోంచి పండగ సంబరం మాయమైపోయింది. మా అత్తగారు ఎంతడిగినా ఎందుకుపోవటం లేదో చెప్పలేదు. అసలేమైందో కూడా ఎవ్వరికీ చెప్పలేదు. అంతేకాదు ఓ రెండు మూడు రోజులు ఆ రోడ్ మీద ఒంటరిగా అస్సలు పోనేలేదు. ఎన్నడూ లేనిది, ఎంతో దగ్గిరలో ఉన్న మా కాలేజ్ కి మావార్నడిగి లిఫ్ట్ ఇప్పించుకున్నాను. ఈ నగరాల్లో ఇంత బాధలు పడుతూ ఉండే బదులు హాయిగా ఏదో ఒక చిన్న పల్లెటూళ్ళో ఏదో ఒక చిన్న పొలంలో పనిచేసుకుంటూ బతికితే, ఎంత శాంతంగా ఉండచ్చో అనిపించింది, ఆ క్షణంలో నాకు. అదీ కాకపోతే గోదారొడ్డున కె. విశ్వనాథ్ వేసేలాంటి ఒక చిన్న గుడిసె వేసుకొని బతికేసినా ఎంత సుఖమో!!!! నాకేమన్నా అయిఉంటే...బహుశ: బ్లాగ్ లోకం నుంచి ఒక బ్లాగ్ ఎగిరిపోయుండేదేమో!!!!! మిమ్మల్నందర్నీ మళ్ళీ పలకరించే యోగం నాకున్నట్లే ఉంది. అందమైన మా అమ్మవారి ఫొటో వచ్చే సంవత్సరం బ్లాగ్ లో పెడ్తాను లెండి. మరి ఈ సారి కుదరలేదుగా:)
మన మహిళలందరికీ శ్రావణమాస శుభాకాంక్షలు. పురుషులందరికీ ప్రత్యేక అభినందనలు. మరి మా పూజలన్నీ మీ కోసమేకదా:)
మాకోసం మీకే పూజలు లేవెందుకో. అందుకే...మా కిలాంటి కష్టాలు.....
********************************************************************************
లేబుళ్లు:
అనుభవాలు
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
40 కామెంట్‌లు:
happy that nothing bad happened to you.
hmmm మరే ఫోటోలదేముంది లెండి వచ్చే ఏడు తీసుకోవచ్చు. ఈ గ్యాడ్జెట్స్ ఒకోసారి ఇంతేనండీ అవసరం ఉన్నపుడే రిపేర్ వస్తాయి. ఎర్రగా ఉన్నా అలానే తీసేయాల్సింది కేవలం డిస్ప్లే ప్యానల్ పాడై ఉంటే ఫోటోలు బాగానే వచ్చే అవకాశం ఉంది.
మీరు క్షేమంగా బయటపడినందుకు సంతోషం. జాగ్రత్తండి.
ఎంత ప్రమాదం తప్పిందీ. నిజంగానె ఆ అమ్మవారే మిమ్మల్ని కాపాడారు. ఫొటోలదేముంది లెండి. మళ్ళీ తీసుకోవచ్చు.
మొత్తానికి వీరనారీమణి అయ్యారన్న మాట, పండగపూట. నేరేషను మట్టుకు మల్లాది సస్పెన్సు కథలంత బిగితో రాశారు. మీకు ఏమీ కానందుకూ, మీ మనస్ఫూర్తికీ, పండగ జరుపుకున్నందుకూ, అన్నిటికన్నా ముఖ్యంగా మీ కథనానికీ - అభినందనలు!
Same comment as kotta paali gaaru
మై గాడ్! పట్టపగలు ఇంత దారుణమా? పోనీలెండి మీరు తప్పించుకున్నారు...ఫోటోదేముంది..ఈ సారి కాకపోతే మరోసారి...కానీ మీరు పోలీసులకి (100 నెం.కి)తెలియజేసుంటే బాగుండేదేమో! అలాంటి పరిస్థితిలో అలా చేయలన్న ఆలోచన రావటం కష్టమే అనుకోండి..
>>>బహుశ: బ్లాగ్ లోకం నుంచి ఒక బ్లాగ్ ఎగిరిపోయుండేదేమో!!!!!
మనందరికీ బ్లాగంటే ఎంత అభిమానమో ఈ ఒక్క వాక్యంతో చెప్పొచ్చు..:)
>>>మరి మా పూజలన్నీ మీ కోసమేకదా:)
:-)
జయ గారూ !
మొత్తానికి సాహసం చేశారు, ముందే ఊహించి తప్పించుకుని. మొత్తానికి పండుగ 'జయ'ప్రదం గా జరుపుకున్నందుకు అభినందనలు.
జయ గారూ,
పెద్ద ప్రమాదం నించి తప్పించుకున్నందుకు హృదయపూర్వక అభినందనలు. ఆ అనుభవాన్ని పంచుకున్నందుకు ఇంకా ధన్యవాదాలు. ఒకరినొకరం ఇలా హెచ్చరించుకుంటూ వుంటేనే అప్రమత్తంగా వుంటాం.
శారద
Jaya garu,
thank God u r safe. nijamgaa telivigaa respond ayyaru. u r really brave girl.
ayyoe? enta pedda pramaadam tappindee.poeneelaenDi anta Tenshan loenoo vaalhlhanu gamaninchagaligaaru. phoeToeladaemundi vacchaesaari teesukoevacchu.
జయ గారు,
తల్చుకుంటేనే భయమేస్తుంది, మా ఇంటి ప్రక్కన ఒక ఆవిడ మధ్యాహ్నం మూడు గంటలకు వెళుతోంటే గొలుసు లాగితే ఆవిడ ముందుకి పడి కాలు విరగింది. వాడు మాత్రం దొరకలేదు.
@ డియర్ రాణి థాంక్యూ. ఇప్పటికీ భయమేస్తూనే ఉందండి.
@ వేణూ శ్రీకాంత్ గారు ఎన్నాళ్ళకు కనిపించారో! థాంక్సండి. ఏవిటో...ఫొటో తీసుకోవాలన్న ఆరటమే తప్ప కెమేరా నాలెడ్జ్ లేదుకదా:) అయినా,అట్లా రోడ్ మీద పడి పోయే కన్నా, ఇంట్లో ఉన్న ఏదో ఓ మొబైల్ తో కూడా ఫొటో తీసుకోవచ్చు కదండి. అప్పుడు వెలగలేదంటే...నా బుర్ర అంత షార్ప్ అన్నమాట.
@ హాయ్ శిశిరా థాంక్యూ. ఏమి జాగ్రత్తా...ఏం చెప్పగలం, ఏ నిమిషానికి ఏమి జరుగునో:)
@ శ్రీ లలిత గారు ధన్యవాదాలు. నిజంగా ఆ అమ్మవారే కాపాడారేమో..ఫొటో ఇంక నెక్స్ట్ ఇయరేనండి.
@ కొత్తపాళీ గారూ డబుల్ థాంక్స్. ఎందుకంటే ఇప్పటి వరకు నన్ను 'వీరనారీమణి' అన్నవాళ్ళే లేరు మరి:) ఊరికే కట్టె, కొట్టె, తెచ్చె.. అని రాస్తే ఎవరు చదవరు కదండి. మల్లాది గారితో నాకు పోలికేంటండి బాబోయ్. ఆ నిమిషానికి తోచిందేదో రాసేసాను.అంతే.
@ నాగార్జున... సో మీరుకూడా కొత్తపాళీ గారి కామెంటే నా. అయితే నా ఆన్సర్ కూడా అదే మరి:) థాంక్యూ.
@ హాయ్ శేఖర్, హౌ ఆర్ యూ . చాలా రోజులయింది కనిపించి. అంటే ఇలా ఏమన్నా అయితే తప్ప కనిపించేదిలేదన్నమాట. అయ్యో రామా! ఆ నిమిషంలో తోచినా 100 కి పొరపాటున కూడా ఫోన్ చేసే దాన్ని కాదేమొ. సినిమాల్లో లాగా దొంగ దొరికితే, గుర్తు పట్టటానికి పోలిస్ స్టేషన్ కి పిలిస్తే, నేను వెళ్ళి గుర్తు పడితే...ఆ తర్వాత నా గతేం కాను. వాడు జీవితమంతా నా మీద పగపట్టడూ. ఇంక నా బతుకు గోదారే.
అంతే కదా మరి. కోతిపిల్ల కోతికి ముద్దు. అంటే నా బ్లాగ్ అంటే నాకు ప్రాణమన్నమాట. అప్పగింతలు పెట్టే టైం అయినా వాడు నాకిచ్చే వాడు కాదేమొ:)
ఆ..ఎంత పూజలు చేసినా ఏం లాభంలే...ఈ మగవారికి దయ రాదుకదా!!!
@ రావ్ గారు, థాంక్యూ. సాహసమేముందిలెండి. అది 'అసంకల్పిత ప్రతీకార చర్య ' అన్నమాట. అంతే:)
@ శారద గారు, థాంక్యూ. నిజమేనండి. నేనిది రాయటంలో ముఖ్య ఉద్దేశ్యం అదే. రోజూ ఎన్నో వింటాం. కాని సమయానికి ఏమీ చేయలేము. అందరూ ఎంతో జాగ్రత్తగా ఉండాల్సిన రోజులివి. అయినా జరిగేవి జరుగుతూనే ఉన్నాయి.
@ శిరీష గారూ, థాంక్యూ. ఆ బ్రేవ్ అన్న పదం బహుశ: నాకు పనికి రాదనుకుంటా. ఏదో అదృష్టం కొద్దీ బతికి బయట పడ్డాను.
@ సునిత గారు, బాగున్నారా. థాంక్యూ. నా నూకలింకా చాలా ఉన్నాయ్ భూమ్మీద. అవన్నీ అయిపోవాలిగా. అందుకే మరి, ఆ హేమాహేమీలతో పోరాడి, ఎదిరించి, బతికిపోయాను.
@ నీహరిక గారు, థాంక్యూ. అవునండి చా...లా భయంకరం. ఎప్పటికీ మర్చిపోలేను. కొన్నేళ్ళ క్రితం పొద్దున్నే గుడికి వెల్తున్న మా అమ్మగారికి కూడా అలాగే జరిగింది. ఎవరో సైకిల్ మీద వచ్చి మెళ్ళో గొలుసు లాగాడు. కొంత మా అమ్మ ఒళ్ళో ఉండి కొంత వాడి చేతిలో వెళ్ళిపోయింది. పాపం మా అమ్మ కూడా చాలా భయపడిపోయింది. ఆ రోజంతా మా అమ్మ దగ్గిరే ఉన్నాను. ఇప్పటికీ మర్చిపోలేని సంఘటన అది. ఇలాంటి దురాగతాలు మాత్రం తగ్గవనే అనిపిస్తుంది.
అయితే జయ గారు కర్తవ్యం లో విజయ శాంతి అయిపోయారన్నమాట ఎంత ప్రమాదం తప్పిందీ. నిజంగానె ఆ అమ్మవారే మిమ్మల్ని కాపాడారు.
Wow, Shivaani...Really!!!:)))))
ఒళ్ళు గగుర్పొడిచే అనుభవం.. చాలా రోజులు మర్చిపోలేరు మీరు...
మురళి గారు ధన్యవాదాలు. ఇటువంటి సంఘటనలు ధైర్యాన్ని పెంచుతాయని విన్నాను కాని నాకు మాత్రం పిరికితనం పెరిగిపోయింది. మరిచిపోవటమేమో కాని ఎటుచూసినా అనుమానస్పదం గానే ఉంటోంది:)
జయగారు, ముందుగా కొద్దిపాటి ఆలస్యంగా స్పందించినా మీ అవేర్నెస్ కు అభినందనలు. అదే మిమ్మల్ని రక్షించింది...అలాగే లక్ష్మి కటాక్షం తోడుగా ఉండటం వల్ల ! మొత్తానికి పెద్ద ప్రమాదం నుండి తప్పించుకోగలిగారు.
పరిమళం గారు, ధన్యవాదాలండి. మిమ్మల్నందర్నీ మళ్ళీ మళ్ళీ కలుసుకునే అదృష్టం నాకుంది.
జయ గారూ మీ బ్లాగ్ ఇవాళే చూసాను.
మీ పొస్టింగ్ మొదట చదవగానే వరలక్ష్మీ వ్రతం ఎంత చక్కగా చేసుకున్నారో అనుకున్నాను. కానీ మిగతా పొస్ట్ చూసిన తర్వాత చాలా బాధ అనిపించింది.
మీరు క్షేమంగా బయటపడినందుకు సంతోషం.
ఆ అమ్మవారే మిమ్మల్ని కాపాడారు.
థాంక్యూ రాజీ. ఇది వరలక్ష్మీ వ్రతమే మరి:)
అమ్మో జయ గారు ,ఎంత గండం గడిచింది .నిజంగా ఆ వరలక్ష్మీ దేవే మిమ్మల్ని కాపాదిందేమో.పట్టపగలు ఎంత దారుణం అండి .చాలా సంతోషం మీరు క్షేమంగా ఉన్నారు .
శివరంజని బ్లాగు ని మీరు
తీసుకోకపోవడం వల్లనే ఇదంతా జరిగింది
హ్మ్మ్!
మీరు పడిన భయం సంగతేమో కాని
మీరు రాసిన విధానం చాలా బావుంది జయ గారు
చాలా భయపడే ఉంటారు :( :(
@ రాధిక గారు థాంక్యూ. ఇప్పుడనిపిస్తుంది ఆ దొంగలకే గండం తప్పిందేమో అని. అదే ఇంకోళ్ళైతే ఈ పాటికి పోలీస్ సన్మానం తో సుఖంగా ఉండే వాళ్ళు.
@ అజ్ఞాత గారికి, అజ్ఞాత శాపాలు పనిచేయవండి. అందుకే బతికిపోయానేమో, అది చూడండి:)
@ హరే కృష్ణ గారు థాంక్యూ. నిజ్జంగానే భయపడ్డానండి. ఒట్టు. అదే ఇంకెవరన్నా అయుంటే అందరికీ చెప్పేదాన్ని:)
మీకు చాలా లేట్ గా టీచర్స్ డే విషెస్ అలాగే ఒక రోజు ముందు గా వినాయక చవితి శుభాకాంక్షలు
థాంక్యూ వంశీకృష్ణ, మీకు కూడా యాపీ వినాయక చవితి. వాళ్ళింట్లో, వీళ్ళింట్లో ఆకులూ, పూలు కోసేసి ఎవరికీ సుత్తి పెట్టకండేం:)
మీకు, మీ కుటుంబానికి
వినాయక చతుర్థి మరియు రంజాన్ శుభాకాంక్షలు
SRRao
శిరాకదంబం
జయ గారూ...,మీకు మీ కుటుంబ సభ్యులకు వినాయక చతుర్థి పర్వదిన శుభాభినందనలు
హారం
@రావ్ గారు, ధన్యవాదాలు. మీరు పూజ బాగా చేసుకున్నారనుకుంటాను. శుభాకాంక్షలు.
@భాస్కర రామి రెడ్డి గారు, ధన్యవాదాలండి. మీకు కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు. మీ దగ్గిర పెద్దపెద్ద వినాయకుళ్ళను పెడతారా మరి. ఇక్కడ మేము చాలా ఎంజాయ్ చేస్తాం.
జయ.. వీర నారీమణి అయ్యారన్న మాట, తప్పదు జయ ఈ బాధ లన్ని,అందుకే ఏ గోల లేకుండా నాకు లా హాయి గా ఖాళి మెడ ఖాళి చేతులతో తిరగాలి. :-) ఈ మధ్య న మాకు కూడా ఇక్కడ్ ఇండియన్స్ ఇళ్ళలో దొంగతనాలుఎక్కువ ఐపోయాయి. తెలిసి పోయింది దొంగలకు మన దగ్గర బంగారం ఎక్కువ అని. లక్ష్మి ఎంత గొప్పదో అంత చెడ్డదికూడా మరి (ఆమె చెడ్డది కాదు ఆమె మీది మన ఆశ అంటారా?). ఎనీ వే మీకు అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు.
హాయ్ భావనా, ఏదోలే,ఒక్క రోజు...నేను కూడా అమ్మవారిలా తయారవుదామనుకున్నా... అమ్మవారి నలంకరించాలి గాని, మనం అలంకరించుకుంటే అంతే మరి:) వినాయకుడి పుట్టిన రోజూ బాగా చేసారా మరి. ఈరోజు నగలతో పనిలేదు కాబట్టి బాధే లేదు.
ఈ మధ్యన చాల రోజులైంది మీ postల్లేవని ఇటు వచ్చానండీ...అమ్మో భలే భయం వేసింది చదువుతూంటేనే...ఆ మాత్రమ్ ధైర్యమ్ చేసారంటే మీరు ధైర్యస్థులేనండి...క్షేమంగా ఇల్లు చేరారు.సంతోషం.
Thanq Trishna.
@ మీరు క్షేమంగా బయటపడినందుకు సంతోషం.
ఇది మాత్రం వాస్థవం. నా అభినందనలుకూడా.
@ఆ అమ్మవారే మిమ్మల్ని కాపాడారు.
ఇదిమాత్రం సహేతుకం కాదు. నా ఉద్దేశ్యంలో మీ అప్రమత్తతే మిమ్మల్ని కాపాడింది. ఏదైనా మంచి జరిగినప్పుడు ఆ దేవుడు/ దేవత కాపాడిందని, చెడు జరిగితే మన ప్రారబ్ధం అని సరిపెట్టుకోవడం మనలో (నన్ను నేను మినహాయించుకుంటున్నానులెండి) చాలా కామన్. కానీ, రోజూ దేవుని దర్శణాలకై వెల్తూ రోడ్డు ప్రమాదాల్లో చనిపోతున్న వారిని మరి ఆ దేవుడు ఎందుకు కాపాడట్లేదు. ఇదేదో నేను నమ్మను కాబట్టి ఇలా వ్రాయడం లేదు, లేదా మీ నమ్మకాన్ని ప్రశ్నించడనూలేదు. కాకపోతే మీరు దేవతకు థ్యాంక్స్ చెబుతున్నారు, నేను మీకు అభినందనలు తెలుపుతున్నాను.
RSReddy గారు ధన్యవాదాలు. అన్ని గొప్ప తనాలు నావే అనుకుంటే అహంకారం పెరుగుతుందేమో నండి. ఆ దేవుడి మూలంగానే అన్నీ జరుగుతున్నాయనుకుంటే అవసరమైనప్పుడు దేవుడ్ని తప్పుబట్టచ్చు, లేకపోతే మెచ్చుకోవచ్చు కదండి:)
:) మొత్తమ్మీద దేవుణ్ణి నమ్మని నాలాంటివాణ్ణి కూడా ఆయన మీద భారం వేస్తే హాయిగా తప్పించేసుకోవచ్చంటూ మీరు భలేగా తప్పించుకున్నారండీ!
కామెంట్‌ను పోస్ట్ చేయండి