8, మార్చి 2010, సోమవారం

నేనునేనుగానే!
పునర్జన్మ అ౦టూ ఉ౦టే---నేనునేనుగానే!

అవును ... పునర్జన్మ౦టూ ఉ౦టే నేను నేను గానే మళ్ళీ పుట్టాలని నా కోరిక.... అవునండీ...ఒక పంతులమ్మగానే...

చుట్టూ అ౦దమైన పసిహృదయాల పసిడి బాలల మధ్య, కల్మషమెరుగని, కల్లాకపటమే తెలియని, నూతన జీవిత౦లోకి అడుగిడబోతున్న...ముగ్ధబాలికల ప్రేమానురాగాలతో అలరారుతున్న... ఈ జీవితమే నేనుకోరుకున్న జీవిత౦.

సుఖ దు:ఖాలు, మ౦చీ చెడుల మేలుకలయికే ఈ జీవిత౦.

ఎక్కడో పుట్టి ఇక్కడచేరిన ఈ పిల్లల్లో పిల్లలుగా కలిసిపోయి, వారి అనుభూతులను ప౦చుకు౦టూ గడిపే పాల వ౦టి స్వచ్చమైన, కల్లాకపటమే లేని ఈ పసి జీవితమే నాకు మళ్ళీ కావాలి. అన్ని స౦స్కృతులు...సంప్రదాయాలు...ఆచారాలు కలగలిపిన వీరితో...సౌభ్రాతృత్వపు భావనలతో... కలిసి ఆడే ఆటపాటలు, సరదాల పండగ సంబరాలు, ఉత్సవాలు, విహార, విజ్ణాన యాత్రలు...ఓహ్...ఇంకా ఎన్నో...ఈ ప్రపంచాన్నే మరిపించే పునర్జన్మ ఇదే...

కొత్తగా వొచ్చిన పిల్లల్తో కలిసిపోయి ప౦చుకునే ఈ ఆన౦ద౦, వారికి ఎన్నో విద్యాబుద్ధులు, ధైర్యసాహసాలు, సక్రమమైన జీవిత నైపుణ్యాన్ని నెరపి... సంఘం లోకి పంపే ఆ పవిత్రమైన బాధ్యతే నాకిష్టం.

నా చేతిలో చేయి వేసి, నా అడుగులో అడుగులేస్తూ...చదువుస౦ధ్యల్లో...వీధిబాలల పాఠశాలలు, బాలనేరస్తుల కారాగారాలు, అనాధశరణాలయాలు, మానసిక వికలాంగుల పాఠశాలలో, స్త్రీ శిశు సంక్షేమ పథకాలకు తోడు వొచ్చి ఎంతో పెద్దరికంతో తమ సేవ లందించి, తమ చేతిలో ఉన్న ఒక్క రూపాయి కూడా తోటి పేద విద్యార్ధిని ఫీజ్ కిచ్చేసి, ఎవరికి ఏ కష్టమైనా ఎటువంటి ఆలోచనా లేక ఆదుకోటానికి ఉరకలు వేసే వారి దీక్ష, పట్టుదల ... తామే స్వయంగా మార్గ దర్శకులుగా మారిపోయె...ఇంత స్వచ్చమైన పూబాలల మధ్య గడిపే జీవితమే నా దృష్టిలో ఎంతో ఉన్నతమైన జీవితం. నేనూ నిత్య విద్యార్ధ్ధినిని. ఒక్కొక్క బాలిక జీవితం నాకు ఎన్నో నేర్పుతోంది. నాకు ఆదర్శమైన వీరి మధ్య గడిపే జీవితమే నాకు గర్వ కారణం. ఇంతకంటే ఉన్నతమైన జీవితం ఇంకేముంది? జన్మ జన్మల సాఫల్యాన్ని అందిస్తుంది.

ఎంతో ఎదిగిపోయిన ఆ పసికూనలు....ఎప్పుడో కళ్ళముందు కనబడితే...వారి పెరుగుదలకు సంతోషించి చెమ్మగిల్లే నా కళ్ళలోని తృప్తే నాకు పరమావధి. ఉన్నత స్థాయిలోని వారు, చిన్నపిల్లలై...లోకమే మరచి...నాపై గౌరవాన్నిచూపుతూ, మరొక పక్క గారాలు పోయే వాళ్ళ కళ్ళలో తళతళ మెరిసే ఆ వెలుగు నాదికాదా!!!

"టీచర్ అంటే నడిచే పుస్తకం. కొండంత సహనం. టీచర్ అంటే చీకటి తెరలను తొలగించే దీపం. ఒడుపుగా మనలోకి తెలివిని ఎక్కించే తేజం. మంచి టీచర్ కావాలంటే మాటలు కాదు. చదువునే సర్వస్వంగా భావించి ... జీవితాన్ని వెతుక్కోవటం ఎలాగో .... తెలియ చేసేది ఉపాధ్యాయుడే.... ఎందరో భావి పౌరులను తయారు చేసే బరువు బాధ్యతలను తన భుజస్కంధాలపై మోస్తున్న భారత నిర్మాతలు 'పంతులుగారు '. చీకట్లో మగ్గిపోతున్న ఒక మారుమూల ప్రాంతంలో కూడ ....ఒక పదిమంది పిల్లలు బిలబిల మంటూ పలక, బలపం చేతబట్టుకొని వొస్తే..... భళ్ళున వెలుతురు నింపగల శక్తి ఒక్క ఉపాధ్యాయునుకి మాత్రమే ఉన్నదంటే అతిశయోక్తి కాదు. రేయింబవళ్ళు కష్టపడి, జీవిత చరమ దశలో వెనక్కి తిరిగి చూసుకుంటే తన వెనుక కనపడే వేలాది విద్యర్ధులను చూసుకొని గర్వంతో మురిసిపొయే ఒక సామాన్య టీచర్ జీవితం ఎంత ధన్యమో! టీచర్ అంటే పిల్లలకు పాఠాలు చెప్పటం తోటే బాధ్యత తీరిపోదు. కన్నబిడ్డల భవిష్యత్తు గురించి తల్లిదండ్రులు ఆలోచించినట్లే టీచర్లు కూడా విద్యార్ధుల గురించి తపనపడతారు. తన స్వంత సంపాదననుంచి పిల్లలకు పలకలు, నోటుబుక్కులు, పెన్నులు, డిక్షనరీలు అందించే ఉపాధ్యాయులు ఎంతో మంది ఉన్నారు. పేదవిద్యార్ధులకు, అనాధ పిల్లలకు తామే ఫీజులు కట్టి చదివించే ఉన్నత టీచర్లు కూడా ఉన్నారు. తన దగ్గర చదువుకున్న విద్యార్ధులు మంచి స్థానంలో ఉన్నారంటే ఒక టీచర్ కి అంతకన్నా ఇంకేం కావాలి? చదువుకుంటేనే ఈ దేశం అభివృద్ధికి ప్రయోజనం అని ప్రతి గురువు తన విద్యార్ధికి బోధిస్తాడు. వీధిలో గురువుగారు కనిపిస్తే 'మాస్టారు వొస్తున్నారు ఇంటికి తీసుకు రండి ' అంటు తమ పిల్లలకు తల్లిదండ్రులు చెబితే, ఆ గౌరవం చాలనిపిస్తుంది. ప్రతి విద్యర్ధిని చిటికెన వేలు పట్టుకొని ఆప్యాయంగా గమ్యం చేర్చే శక్తి వంతుడు ఒక టీచర్ మాత్రమే! ఎందరో విద్యార్ధుల భవితకి పునాది వేస్తూ, ప్రపంచానికి వెలుతురునందిస్తున్న ధన్యజీవి. నిజమైన టీచర్ కి రిటైర్మెంటే లేదు." .....

పరిపూర్ణమైన జీవితాన్ని చూపి, హృదయ౦ ని౦డా తృప్తి ని ని౦పిన...ఇదిగో ఇటువ౦టి...ఈ ప౦తులమ్మ జీవితమే నాకు మళ్ళీ కావాలి.

మన౦దరికీ మహిళాదినోత్సవ శుభాకాంక్షలు.

ఒక చిన్న కొసమెరుపు: అలహాబాద్ లోని త్రివేణి సంగమం లో పునర్జన్మ లో ఏమి కావాలని కోరుకుని మునిగితే ఆ కోరిక తీరుతుందట. ఒక సారి ఒక పేద బ్రాహ్మణుడు త్రివేణీ సంగమం లో మునిగి చావటానికి వెల్తే అప్పటికే అక్కడ ముగ్గురు స్త్రీలు ఉన్నారట. ఒకరు తాను ఒక మహారాజుకి భార్యకావాలని కోరుకుంది. ఇంకొకరు తాను ఒక మంచి విద్యావేత్తకు భార్య కావాలని కోరుకుంటే, ఇంకోకరు ఘనకీర్తి కలవానికి తనను భార్యను చేయమని కోరుకుంటూ చనిపోయారట. అది చూసిన ఈ పేద బ్రాహ్మణుడు మరుజన్మలో ఆ ముగ్గురికీ తనని పతిని చేయమని కోరుకుంటూ తాను కూడా త్రివేణీ సంగమం లో మునిగాడట. అతడే మరుజన్మలో విక్రమాదిత్యుడు గా జన్మి౦చాడుట. ఇది మా అమ్మ చెప్పిన చ౦దమామ కథ.
ఎక్కడో పుట్టి, ఎక్కడో పెరిగి...చదువులమ్మ చెట్టునీడలో కలిసాము....
*************************************************************************

3, మార్చి 2010, బుధవారం

నా రైలుబండికి యాభై పెట్టెలు చేరాయండి!!!

50...యాభై...అవునండి, మొత్తానికి...ఈ నాటికి నేను అర్ధశతాబ్ధి (శతాబ్ధి రైలుబండి లో సగం కాదండీ..కొత్త రైలుబండి కూడా అస్సలు కాదండి). అంటే వంద లో సహం అన్నమాట, అదేనండి..టపాలు ఠఫీ మనిపించానండి. అందరు వందేసి టపాలు పూర్తి చేస్తుంటే...బోడి..తొక్కలో యాభై కి కూడా చెప్పుకుంటావా? అంటారా! అండి. ఏం చేయనండి. మరి నా శక్తి అంతేనండి. అదికూడా, రెండు బ్లాగుల్లో రాసినవి కలిపండి. అందుకే ఇవ్వాళ స్వీటు చేసుకొని తిన్నానండి. ఇవన్నీ గంగగోవు పాలండీ...హ..హ..హ...!!! నేనెలాగు సెంచురీ కొట్టలేను కదండీ మరి...హి హి హి:) నా రైలుబ౦డికి యాభై పెట్టెలు చేరాయ౦డి. చా....లా...పొడుగాటి బ౦డి కద౦డి. ఇ౦కా ఎక్కువ పెట్టెలైతే... పట్టాలమీద నా రైలుబ౦డి పడిపోతు౦దేమోన౦డి. మరిహ ఇంతేనండి సంగతులు.
ఇది నాదే నండి...అంటే నేను కాదండి...నేను వేసుకున్న బొమ్మండి.

నా ప్రభూ! నా జీవన ప్రధాతా!
నా హృదయంలో నిలచిన ప్రతీ
క్షణం నీ ఊహల్నే కలిగిస్తుంది.
నీ పై భక్తిని రేకెత్తిస్తుంది.
నిన్ను నేనెలా మరువగలను ప్రభూ!
నేను తిరిగే ప్రతి అందమైన, మధురమైన
మలుపులో నీరూపే ప్రత్యక్షం అవుతుంది.
విరిసిన కలలా..అరవిరిసిన పూవులా
అంబరమైన నా హృదిలో రంగు వెలవని వర్ణ
చిత్రంగా నాలో నిలిచి పోయావే.
నిన్ను నేనెలా మరువగలను ప్రభూ!!!
గతం వర్తమానంలోకి జారిపోతోంది!
వర్తమానం భవిష్యత్తులోకి ఉరకలేస్తోంది.
వెలుగు నీడలలా మారిన జీవికలో,
నా మనస్సనే నిర్మల సరస్సులో ఉదయించిన పద్మంలా
నా బ్రతుకనే ఆకాశంలో వెలిగే సూర్యునిలా
ప్రతి ఉదయం నీ స్మరణతోనే మేల్కొంటాను
నిన్ను నేనెలా మరువగలను ప్రభూ!!!

ప్రభూ!!!ఇది నీకే అంకితం.....


మరి నా యాభయ్యవ టపా ఇదేన౦డి....

కనుక్కోగలరా?

క్రింద ఈయబడిన ఉదాహరణలు కొందరు ప్రముఖుల రచనలనుండి కోట్ చేయబడ్డాయి. ఆ యా భాగాల్లో భావనా వైవిధ్యము, శైలి, పాత్ర చిత్రణ, వీటి ఆధారంగా రచయిత లెవరో కనుక్కోగలరేమో ప్రయత్నించండి.

1. "విద్యవంటి వస్తువు లేదు.నిజమే--ఒకటి తప్ప. అదేవిటి? విత్తం. డబ్బు తా"ని విద్య దారిద్ర్య హేతువ. యీ వూళ్ళో నారదుడు వొచ్చి పాడితే నాలుగు దమ్మిడీ లివ్వరు. గనుక యీ వీణ యిటు పెడదాం, హెడ్డుకనిష్టీబు సౌజ్ణచేసి వెళ్ళాడు. అతడు యిచ్చేదీ, చచ్చేదీ లేదుగానీ, జట్టీలేవైనా వొస్తే ఓ వొడ్డు కాస్తాడు"
(ఇది చా....లా పాతది.అంటే దాదాపుగా ఓ వంద ఏళ్ళ క్రితం అన్నమాట.)


2. "ఆమె ఏడుస్తూ కూర్చుంది. బాల చాలా అందమైనది. అదొక విలక్షణమైన ఉజ్వలమైన అందం. అటువంటి అందం అన్ని చోట్లా కనిపించదు. నాకు బాధగావుంది. నిజమే కాని యెంతమందిని ఎదిరించి, ఎన్ని అడ్డంకుల్ని దాటి నా భవిష్యత్తుని ఏం చేసి ఈమెని నాదాన్ని చేసుకోగలను? కోపంతో మరీ ఎరుపెక్కిన జీరలుగల కళ్ళుకల నాన్న మొహం, నిరసనతో చూసే అమ్మ మొహం, పద్దెనిమిదివేల కట్నంతో జడ్జీగారి సంబంధం, రాజకీయంగా వేసుకున్న ప్లానులు....యివన్నీ ఏమవుతాయి? "
(ఇది మరీ పాతదేం కాదు, ఆ మధ్య కాలందన్నమాట...అంటే సుమారుగా, యాభై ఏళ్ళక్రితం)


3. "శ్యామలకి చాలా కోపమొచ్చింది. అతను ఎందుకిలా మాట్లాడుతున్నాడో అర్ధం కాలేదు. అర్నెల్ల దాంపత్యంలో ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ రాలేదు. ఎవరన్నా వూరికే తననంటే పడుండే స్వభావం కాదు శ్యామలది. తిరిగి అతన్ని దులిపేద్దామనుకుంది మొదట. ఐనా అత్తగారు ఏమనుకుంటుందోనని తమాయించుకుంది. సుధాకర్ మాత్రం అనాల్సిందేదో అనేసి, తన కప్పులో కేసరి ఒక్క పిసరు కూడా మిగల్చకుండా మెక్కేసి, వెళ్ళి టీ.వీ. ముందు సెటిలయ్యాడు. శ్యామల స్వీటుని ముట్టుకోకుండానే ప్లేట్లు వంటింట్లోకి తీసుకెళ్ళడం సీతాలక్ష్మి దృష్టిని దాటిపోలేదు."
(ఇది మరీ ఇవాల్టి కథల సంపుటే)

చూశారా! ఆంకర్ సుమ లాగా ఎంతబాగా క్లూ లిచ్చేసానో:) నాకు తెలుసు మీరు తప్పకుండా కనుక్కో గలరని... అంతగా అయితే మళ్ళీ ఇక్కడే సమాధానాలు కూడా రాస్తాలెండి....


హాయ్! ఇవండీ సమాధానాలు......

1. p. 80 రామప్ప పంతులు ఇంట్లో పడక గదిలో...మధురవాణి, గురజాడ అప్పారావు గారి కన్యాశుల్క౦.

2. p.102. "ఓడిపోయిన మనిషి" ...దేవరకొండ బాలగంగాధర తిలక్ గారి, తిలక్ కథలు లో.

3. p.108. ఎస్. నారాయణస్వామి గారి రంగుటద్దాల కిటికీ-కథలస౦పుటి... 'అత్తగారితో కొత్త కాపురం '.


*****************************************************************************
 

మనస్వి © 2008. Template Design By: SkinCorner