17, ఏప్రిల్ 2013, బుధవారం

మా హ్యాపీకొండల విహారం

ఎలాగైన ఈ శెలవుల్లో తప్పకుండ ఎక్కడికన్నా వెళ్ళాలి సంధ్యా! ప్లాన్ చేయి కనీసం రెండు, మూడు రోజులన్నా వెల్దాం అన్నాను మా ఫ్రెండ్ తో. అవును ఎప్పుడు ఇదే ఊళ్ళో, ఈ రొటీన్ తో విసుగ్గా ఉంది. నువ్వే చెప్పు ఎక్కడికైనా తప్పకుండా వెల్దాం అంది. ఏదైనా ఊటీ లాంటి చోట్లకు వెల్దామా, మనిషన్నాక కొంతన్నా 'కళా పోషణ ' ఉండాలి కదా అన్నాను. బాగానే ఉంటుంది కాని ఎప్పుడంటే అప్పుడు ఎకామొడేషన్ దొరకదు, నీకు ఎప్పుడూ కొండలు, గుట్టలు పట్టుకుని తిరుగుదామనే, కాస్తన్న తీర్ధయాత్రలు చేద్దమని లేదు. పెద్దవాళ్ళమైతే తిరిగే ఓపిక ఉండదు. కేదారినాధ్ కో బదరీనాధ్ కో పొదాం పద అంది. సర్లే హిమాలయాల్లో తిరగొచ్చు అనుకున్నాను. వెంటనే ఒప్పేసుకున్నాను కూడ. కాని మనతో పాటు వేరే ఫ్రెండ్స్ నెవరినైనా తీసుకొని పోదాం, చాలాదూరం కదా అన్నాను.

ప్రియంవద, గాయత్రిలను తీసుకు పోదాం అని సలహా కూడ ఇచ్చాను. సర్లే నేను టీచర్, నువ్వు లెక్చరెర్ కాబట్టి మనకు శెలవులు, వాళ్ళకి అన్ని రోజులు రావలంటే ఎలావీలవుతుంది, ఒకరు జర్నలిస్ట్, ఇంకోరు జోనల్ ఆఫీసర్ అంది. అదిసరే ఎలావెళ్ళాలో ప్లాన్ చేసి తర్వాత వాళ్ళకు చెప్దాం, సదరన్ ట్రావెల్స్ కనుక్కుందాం, వాళ్ళు అరేంజ్మెంట్స్ బాగా చేస్తారట అన్నాను. వెంటనే ఫోన్ చేసి ట్రిప్ ఎప్పుడు ఉంది మాకు నాలుగు టికెట్స్ కావాలి అని అడిగాను. వాళ్ళు చాలా కూల్ గ నెక్ష్ట్ ఇయర్ కైతే దొరుకుతాయి మేడం, ఇప్పుడు అన్నీ బుక్ అయిపోయాయి అన్నారు. మాకు బిక్కమొహాలు పడ్డాయి. ఆలోచనల్లో పడ్డాం.

ఆ టైం కి నా చేతిలో ఈనాడు సండే మాగజైన్ ఉంది. అందులో పాపికొండల విహారం గురించి ఎవరో రాసిన ఒక ఆర్టికల్ ఉంది. నాకు వెంటనే అనిపించింది. మనం కూడా పాపికొండలకి వెళ్ళొచ్చుకదా, భద్రాచలం మనకంత దూరమేమి కాదు. గాయత్రి, మొన్నెప్పుడో అందికదా భద్రాచలం చెకింగ్ కి వెళ్ళాలి అని , తనతో వెళ్ళిపోదాం, ప్రియ కి అక్కడ ఏదో ఒక పని చేతికి తగుల్తుందిలే అన్నాను. ఔను, ఇంకాలస్యం ఎందుకు గాయత్రికి ఫోన్ కొట్టేస్తాను ఉండు, అని ఫోన్ చేసింది. ఏంటే, ఇప్పుడు ఫోన్ చేసావ్, నేను చాలా పన్లో ఉన్నాను, రేపసలే భద్రాచలం పోవాలి అంటూ లైన్లోకి వచ్చింది గాయత్రి. 'అయ్యాబాబొయ్,ఉండుండు, మాకు చెప్పకుండా వెళ్ళిపోదామనే, మమ్మల్ని కూడా నీతో తీసుకెళ్ళు, అక్కడ పాపికొండలు పోదాం, తలుచుకుందే తాత పెళ్ళిలాగ భలే దొరికావ్, అన్నాను. 'అబ్బ ఇప్పుడు మీతో నాకెక్కడ వీలైతుంది, అదేదో పిల్లిని చంకలో పెట్టుకొని పోయినట్లైతుంది నా పని ' అంది. మమ్మల్ని పిల్లులతో పోలుస్తావా, డామేజ్, నీతో మాట్లాడం పో అన్నాను. ఏడిశావ్లే, డ్రైవర్ వచ్చాక చెప్తాను. పొద్దున్నే నాలుగింటికల్ల రేడీ గ ఉండండి,మిమ్మల్ని పికప్ చేస్తాడు వెళ్ళిపోదాం అంది. ప్రియంవదకి చెప్తే నేను మా బాస్ పర్మిషన్ తీసుకోని వస్తాన్లే, అంది. ఇంక అప్పటినుంచి మేము నేలమీద నిలబడితే ఒట్టు.

మనది రెండు రోజుల ప్రయాణమే కాబట్టి ఎక్కువ సద్దుడు-గిద్దుడు పెట్టకు అన్నాను సంధ్యతో. నువ్వు చీరలు-గీరలు పెట్టకు ఒక్క పట్టు చీర పెట్టుకొ చాలు భద్రాచలం లో గుడికి కట్టుకోవచ్చు. ఒక్క నైటీ, నాలుగు షల్వార్,కుర్తాలు పెట్టుకో, బొట్ట్లు-గిట్లు అన్ని హండ్బాగ్ లో పెట్టేసుకుందాం అంది. తనకన్నీ జంట పదాలు మాట్లాడటం అలవాటు. సర్లే 'లెస్ లగ్గేజ్ ఈజ్ మోర్ కంఫర్టబుల్ ' అలాగే చేద్దాం అని ఇంటికి వెళ్ళిపోయాను.

ఇంక మొదలయింది అప్పటినుంచి నా హడావుడి. ఇంట్లో మా అత్తగారికి, మామగారికి, మా వారికి డిక్లేర్ చేసేసాను, నేను ఇంట్లోంచి మూడు రోజులు మాయమైపోతున్నాను, ఎవరిపన్లు వాళ్ళు చేసుకొండి అని. మా వాడు ఎలాగు ఇక్కడ లేడు. వాడికీ ఫోన్ చేసి నేను మాఫ్రెండ్స్ తో పాపికొండలు పోతున్నాననీ చెప్పేశాను. అమ్మా! నీకసలే తొందరెక్కువ జాగ్రత్త అన్నాడు వాడు. నాకు తెల్సులేర పిల్ల కాకివి నువ్వేంటి నాకు చెప్పేది అన్నాను. ఇంక మా అత్తగారు, మామాగారి జాగ్రత్తల లిస్ట్ చాలా పెద్దది. ఇంకపోతే మా Mr. శ్రీ రాజా రఘువీరేంద్ర ప్రతాప్ రాఠోర్ సాబ్   ఏవిటో పెద్దగా పట్టించుకోలేదు. శూన్యం లోకి ఒక చూపు చూసి, ఎవరితో వెల్తున్నానో మాత్రం కనుక్కొని ఎప్పటికప్పుడు గుర్తుపెట్టుకొని ఫోన్లు చేస్తుండు అని మాత్రం చెప్పి ఊరుకున్నారు.

     
                                           
ఇంక తెల్లారిందండి. కార్ వచ్చింది. అందరం కార్లో చేరి్పోయాం. ఆ తెల్లవారుఝామున, చీకట్లు తొలిగిపోతు, ఊరుదాటుకుంటు విశాలమైన ఆ నిశ్శబ్ధ ప్రపంచంలొ అందమైన సూర్యోదయం, ఆకాశంలో మారుతున్న అనేక రంగులు చూస్తూ నన్ను నేనే మర్చిపోయాను. ఆహా! ఎన్నాళ్ళ తర్వాతో కదా ఇంత అందమైన దృశ్యాన్ని చూస్తున్నాను అని పరవశించి పోయాను. చిన్నప్పుడు నాగార్జున సాగర్ లో ఉండే వాళ్ళం. అప్పటి ప్రకృతి కాంత అందాలన్నీ తిరిగి నా మనసులోకి రావటం మొదలైంది. ఆ రోజులన్నీ 'గుర్తుకొస్తున్నాయి 'అని పాడుకోవాలనిపించేట్లు ఉంది. తెచ్చుకున్న రకరకాల తినుబండారాలు దారిపొడుగునా తింటూనే పోయాం. ప్రయాణం లో ఏ సమస్యలు రాకుండానే సాయంత్రానికల్లా భద్రాచలం చేరుకున్నాం.

బూర్గుంపహాడ్ అనే చిన్న గ్రామానికి భద్రాచలానికి మధ్య నిర్మించిన వంతెన దాటుతుంటే ఆ చల్లని గాలికి కింద గోదావరి నదీమతల్లి అందానికి పరవశించిపోయాను. ఎప్పుడు ఏ నది దాటుతున్నా అందులో ఒక రూపాయి నాణెం వేయటం నాకలవాటు. అలాగే చేసి దండం పెట్టుకున్నాను. ఆ వంతెన మీద కాసేపు ఆగాము. అక్కడినుంచి నదికి, గుడికి దగ్గరలోనే ఉన్న ఒక గెస్ట్ హౌస్ కి చేరుకున్నాం. మా నలుగురికి కలిపి రెండు ఏ.సి. రూంలిచ్చారు. అక్కడ ఫ్రెషప్ అయ్యాం. అక్కడి నుంచి రాముల వారి గుడికి నడుచుకుంటు బయలు దేరాం. రాత్రి ఏడు గంటల సమయంలో గుట్టమీద, ఆ గుడి మీద అందమైన దీపాలు ఆకాశంలో చుక్కల్లాగా మెరిసిపొతూ మమ్మల్ని ఆహ్వానిస్తున్నట్లనిపించింది. గుళ్ళో నిశ్శబ్దం చాలా ప్రశాంతంగ అనిపించింది. సులభంగానే దర్శనం అయింది.అక్కడి మ్యూజియం లో అమ్మవారి వివిధ నగలు చూసాం. చూస్తున్నంతసేపు నాకు రామదాసు పడ్డకష్టాలు, అతను పాడుకున్న 'ఎవడబ్బ సొమ్మని ' పాటే గుర్తుకొచ్చింది ఎందుకో. చుట్టుపక్కల పరిసరాలు చూస్తు అక్కడే చాలాసేపు గడిపాం. తీరిగ్గ హోటల్ లో తోచింది తిని మా గెస్ట్ హౌస్ చేరుకున్నాం. తీరా చూస్తే నేను, సంధ్య ఉన్న రూం లో ఏ.సి. పని చేయటం లేదు. మమ్మల్ని కూడ వాళ్ళ రూం లోకి వచ్చేయమన్నారు. సరే, ఈ నలుగురం ఒక రూం లోనే చేరి చెప్పుకున్న ఆ కబుర్లని రాత్రి ఎక్కువసేపు భరించలేక వెళ్ళిపోయింది. 

                                                

మనం పొద్దున్నే బయలుదేరి కూనవరం చేరుకోవాలి. అక్కడినుంచి బోట్లల్లో వెళ్ళాలి, వెళ్ళిపోదాం, బోట్లల్లో వాళ్ళు వేడి వేడి ఉప్మా పెడుతారు, చాలా బాగుంటుంది, అక్కడే మన బ్రేక్ ఫాస్ట్ పదండీ అని గాయత్రి మమ్మల్ని కదిలించింది. కార్లోనే కూనవరం వరకు వెళ్ళాం. గాయత్రి 24 ఘంటలు ఫోన్లో ఏదో మాట్లాడుకుంటు బిజీ గా ఉంది. మేము మాత్రం అక్కడి ప్రకృతి అందాలకి పరవశించి పోయాం. దారి పొడుగూతున చిన్న చిన్న నీటి మడుగులు, అందులో తెల్లని, ఎర్రని కలవపూలు, అన్ని పూలు, ఆచెట్లు ,కోయిలల కుహు కుహూ రాగాలు, ఆ సన్నటి పిల్లగాలి- ఓహ్- పరవశించకుండా ఎలా ఉండగలం. దారిలో చిన్న చిన్న పిల్లలు పెద్ద పెద్ద కలువపూల గుత్తులు చేతిలో పెట్టుకొని అమ్ముతున్నారు. చాలా పూలే కొనుక్కున్నాం. మా కార్ అంతా చక్కటి సువాసనలతో నిండిపోయి
 ఒకలాంటి మత్తులో పడిపోయాం. 


ఇవన్నీ చూసుకుంటు కూనవరం చేరేసరికి 9 అయిపోయింది. 10 గంటల తరువాత అక్కడినుంచి బోట్లు బయలు దేరవు. ఎందుకంటే నదిమీద వెళ్ళిన బోట్లు సాయంత్రం 6 గంటల కల్లా తిరిగి వచ్చేయాలి. నదిమీద అయిదుగంటల ప్రయణం చేస్తాం.కాని అక్కడ చాల రష్ గా ఉంది. మాకు అసలు ఏ బోట్ అయినా దొరుకుతుందా అనిపించింది. అయినా పర్వాలేదు, గాయత్రి ఉందిగా. మాతోపాటు భద్రాచలం నుంచి వాళ్ళ అసిస్టెంట్ ఒకరు మాతోనే వచ్చారు. ఎందుకు గాయత్రి మనతోటి ఆయన, అసలే సిలిండర్ లాగా, ముందు సీట్ మొత్తం అయనకే ఇచ్చి మనం నలుగురం వెనక ఇరుక్కోవాలి, వొద్దులే అన్నాను. నీకు తెలీదులే రానీ అంది. ఇప్పుడర్ధమైంది ఎందుకు రమ్మందో. ఆయన చాలా అందమైన 'గోదావరి ' అనే ఒక బోట్ లో మాకు టికెట్స్ సంపాదించి మమ్మల్ని బోట్ ఎక్కించారు. చూసావా, ఆయన్ని సిలిండర్ అన్నావు. ఆయనే లేకపోతే నువ్వు అక్కడే గోళ్ళు గిల్లుకుంటూనో, దిక్కులుచూసుకుంటూనో ఉండాల్సి వచ్చేది అంది. నిజమేనే బాబూ! ఏదో అనుకోకుండ అనేసాను అని ఫీల్ అయిపోయాను. ఇంకానయం ఆయన విన్లేదు అనుకున్నాను.

ఇసుక తిన్నెలో చిన్న చెక్క నిచ్చెన మీదనుంచి మేము బోట్లోకి ప్రవేశించాము. ఆ సన్నటి వంతెన మీద నడుస్తుంటే ఏదో బ్యూటీ కాంటెస్ట్ లో రాంప్ మీద ప్రాక్టీస్ చేస్తున్న ఫీలింగ్ వచ్చింది నాకైతే. మేము లాంచ్ లోపల కూర్చోకుండా పైకి వెళ్ళాము. అక్కడ కింద అంతా కార్పెట్ పరిచిఉంది. హాయిగా కాళ్ళుచాపుకొని అక్కడ కూర్చున్నాము. మాలాగే ఇంకా కొంతమంది అక్కడ చేరారు. పెద్ద సైరన్ తోటి లాంచ్ బయలు దేరింది. నాకైతే 'శంకరాభరణం ' టైటిల్స్లో సైరన్ గుర్తుకొచ్చింది. ఇంకా ఎప్పుడు ఉప్మా ఇస్తారు నాకు చాలా అకలిగా ఉంది అంది సంధ్య. తను పైకి అన్నా అందరి ఫీలింగ్ అదే. నూరేళ్ళ అయుశ్శు పోసుకోని తలచుకున్నదే తడవుగా అప్పుడే పెద్ద ట్రే లో ఉప్మా ప్లేట్స్ పెట్టుకొని చిన్న నిక్కర్ వేసుకొని బుడుగు లాంటి ఒక అబ్బాయి వచ్చి మా చేతుల్లో ఆ వేడి వేడి ఉప్మా ప్లేట్స్, వాటర్ బాటిల్స్ పెట్టి పోయాడు. అయ్యో! పసివాడే అని బాధనిపించింది. నేను ఇంట్లో చేసుకున్న ఉప్మాలొ ఎప్పుడు ఇంతరుచి అనుభవించి ఎరుగను. వేడి వేడి కాఫీ లు కూడా ఇచ్చారు. 


ఆ పాల కొండలలొ అనేక మలుపులు తిరుగుతూ పోతున్న ఆ గొదావరి సోయగాలు చూస్తు మైమరచి పోయాను. దారి పొడుగునా ఆ కొండలు, మీద చెట్లు, పక్షుల కిలకిలా రావాలు, రకరకాల పూల వాసనలు, ఆకాశం లో తేలియాడే పిల్ల మబ్బుతెరలు, ఎండ అన్నదే లేకుండ, మధ్య మధ్యలో సన్నటి వాన జల్లులు- ఆహా- ఎంతటి కవికూడ వర్ణించలేని ఆ అనందం, ఆ అనుభవం -- కిన్నెరసాని, నండూరి ఎంకి మాతోటే ఉన్నారనిపించింది. 

లంచ్ కోసం మధ్యలో ఒక ఇసుకతిన్నెల మీద దిగాము. చక్కటి భోజనం తర్వాత ఆ చుట్టూ తిరిగాము. అంతటి ప్రశాంత వాతావరణం వదిలి మళ్ళీ రణగొణధ్వనుల హైద్రాబాద్ కి వెళ్ళాలి అని తలచుకోగానే ఎంతో దిగులేసింది. తిరుగుప్రయాణం మొదలైంది. దారిలో ఒక చిన్న ఐలండ్ లో అపారు. అక్కడ సీతమ్మ వారు గోరింటాకు పెట్టుకున్నారట. అక్కడి వెదురు చెట్లనుంచి రకరకాల బొమ్మలు చేసి అమ్ముతున్నారు. చాల అందంగా ఉన్నాయి. ఒక పర్ణశాల బొమ్మ కొనుక్కున్నాను.మొగలి పూలు కూడ అమ్ముతున్నారు. అక్కడినుంచి మళ్ళీ బయలు దేరాము. ఈసారి వేరే విశాలమైన ఇసుక తిన్నెల దగ్గిర అపారు. ఎవరైన స్నానాలు చేసేవాళ్ళు చేయండి అన్నారు. ఆహా, మళ్ళీ అవకాశం దొరికింది. ఇంకాసేపు ఇక్కడ గడపొచ్చు అని ఆనందంగా దిగాం. స్వచ్చమైన ఆ నీళ్ళల్లో నడుచుకుంటు కాస్తదూరం వెళ్ళాం. దూరంగా నల్లటి కారు మబ్బులు మావైపే వస్తున్నాయి. ఎక్కడో దూరంగా వాన మొదలైంది. పడుతున్న వానకూడా ఆకాశమనే విశాల వేదిక మీద అందాల వనకన్య నృత్యం లాగా కనిపిస్తోంది నాకు.

                                              

మామీద పడని దూరంగా కనిపిస్తున్న ఆ వానని చూస్తుంటే చిన్నప్పుడు నేర్చుకున్న, నాకు నచ్చిన పాట గుర్తొచ్చి పరవశంతో అంతా మరచిపోయి ఆ పాట పాడుకోవటం మొదలు పెట్టాను. 

' మబ్బులు మబ్బులు మబ్బులొచ్చినై, తబ్బిబ్బయింది నా మనసు, తళుక్కుమన్నది నీ సొగసు '

వర్షం వచ్చేస్తోంది, అందరు తొందరగా వచ్చేయండి, వెనక్కి వెళ్ళి పోవాలి, అయిదయితోంది, అని లాంచ్ డ్రైవర్ అరచిన అరుపులతో ఈ లోకంలోకి వచ్చాను. ఇంక తప్పదంటు అందరూ లాంచ్ లోకి చేరుకున్నారు. దూరంగా చూసిన ఆ వాన మా దగ్గరికి వచ్చి మమ్మల్ని కూడ పలకరించటం మొదలు పెట్టింది. నేను నిజంగా 'నువ్వొస్తానంటే నేనొద్దంటాన ' అన్న ఆ అనుభవాన్ని వదులుకో దలచుకోలేదు. అందుకే ఎందరు రమ్మన్నా కిందకి పోలేదు. మంచు ముత్యాల లాంటి ఆ వాన చినుకులు నా చేతులలో పట్టుకుంటుంటే నేనే ముత్యపుచిప్పనేమో అనిపించింది. ఈ సంతోషం ఎంతసేపులే, ఇంక మురిసిపోయింది చాలు అని అక్కడి కొండలన్నీ నన్నుచూసి నవ్వినట్లుగా నదీతీరం వచ్చేసింది. కిందకి దిగక తప్పలేదు. వెనక్కి తిరిగి చూసుకుంటూనే, ఆ అందమైన లోకాన్ని ఒదిలి చివరికి కార్ లో కాలు పెట్టాను. తిరుగు ప్రయాణం మొదలైనా , చాలా సేపు మాట్లాడ కుండానే ఉండిపోయాను. ఎవరి మాటలు నా చెవుల దాక రావటం లేదు. 

ఏముంది! కూనవరం నుంచి భద్రాచలం అక్కడి నుంచి హైద్రాబాద్ వచ్చేసాము. మరచిపోలేని ఆ అనుభవం మాత్రం నాకు ఎప్పుడు తోడుగానే ఉంటోంది.

నాతోపాటు ఈ అనుభవం మీరుకూడా పంచుకోవాలన్న నా తపన మీరు అర్ధం చేసుకుంటారు కదూ!

మీకోసం ఈ ఉప్పొంగిన గోదావరి- పాపి కొండలు-అందాలు....


***************************************************************************************************************************************************


 

మనస్వి © 2008. Template Design By: SkinCorner