18, జూన్ 2010, శుక్రవారం

ఆమెన్......



O Lord, Jesus Christ, the Son of God
have mercy on us!


ఈ మధ్య అనుకోకుండా ఒక చర్చ్ కెళ్ళాను. అప్పుడే నా గత స్మ్రుతులు గుర్తుకొచ్చాయి. ఎందుకో ఒకసారి నా ’క్రైస్తవ మతం’ గురించి చెఫ్ఫాలనిపించింది....నా చిన్నప్పటి జ్ఞాపకాలు తరుముకొచ్చేసాయి.

నా చిన్నప్పుడు నేను చదివింది క్రిస్టియన్ స్కూల్లో. అది మామూలు క్రిస్టియన్ స్కూల్ కాదు. ప్రొటెస్టెంట్ స్కూల్. పూర్తిగా మత వ్యాప్తికి ప్రాధాన్యత ఇచ్చే స్కూల్ అది. అక్కడ స్కూల్ లోనే ఒక చాలా పెద్ద, ఎంతో అందమైన చర్చ్ ఉండేది. ప్రతిరోజు పొద్దున చర్చ్ లోనే మా ప్రేయర్. అన్ని స్కూళ్ళల్లో లాగా బయట గ్రౌండ్ లో మామూలు పద్ధతిలో ప్రేయర్ ఉండేది కాదు. అందరమూ తప్పని సరిగా ఒక గంట సేపు మోకాలి మీద కూర్చొని ప్రేయర్ చేయాల్సిందే. ఆ చర్చ్ లో జీసెస్ క్రైస్ట్ జీవిత చరిత్రకు సంబంధించి ఎన్నో పైంటింగ్స్ ఉండేవి. ప్రతిరోజు ఆ చిత్రాలు చూసే నా మనసు నిండా క్రీస్తు జీవితమే నిండిపోయేది.

అందరికీ ఏదో సహాయం చేయాలి అంటూ ఎటో వెళ్ళిపోతూఉండేదాన్ని. రోడ్డుమీద చిన్నకుక్కపిల్ల కనిపించినా ఇంటికి తెచ్చేదాన్ని. ఎక్కడ ముసలివాళ్ళు కనిపించినా వెళ్ళి కాళ్ళో, చేతులో వత్తేదాన్ని. చిన్నపిల్లలకి భక్తి గీతాలు నేర్పించేదాన్ని. ఇంట్లో ఏ మందులు కనిపించినా ఎవరోవొకరికి వద్దన్నా వినిపించుకోకుండా ఇచ్చేసేదాన్ని. ఇలా ఎంత సేవ చేసేదాన్నో ఇప్పుడు చెప్పటం చాలా కష్టం:)

మా మదర్ సుపీరియర్ ఎక్కడ కనిపించినా వెంటనే మోకాలిమీద కూర్చొని క్రాస్ చేసుకొని, ఆమె దీవించే వరకు కదిలేదాన్ని కాదు. ఆవిడకు కూడా నేనంటే చాలా అభిమానమే. ఎన్నో ముఖ్యమైన పనులే నాకు చెప్పేవారు. నేను చాలా బాధ్యత గలదాన్ని అని ఎప్పుడూ ఎంతో మెచ్చుకునేవారు.

చిన్నప్పుడు మనకు కొంత మంది టీచర్ల మీద ప్రత్యేక అభిమానం ఉంటుంది కదా!!! అలాగే అప్పుడు నాకు మా క్లాస్ టీచర్, సిస్టర్ ఫిలోమినా అంటే చాలా పిచ్చి ప్రేమ ఉండేది. ఆమె కేరళ నుండి వచ్చింది. ఒక్క రోజు ఆమెని చూడకపోయినా ఎంతో బాధపడిపోయేదాన్ని. ఆమె మా అందరికీ ఎప్పుడూ చిన్న చిన్న బైబిల్స్, రోజరీ లు బహుమతిగా ఇచ్చేది. అవన్నీ ఎంతో ప్రాణప్రదంగా దాచిపెట్టుకొనే దాన్ని. ఆమె చెప్పేకథలు నా మీద ఎంతో ప్రభావాన్ని చూపించేవి. జీసెస్ అంటే చాలా ఇస్టపడడం మొదలుపెట్టాను. మాకెప్పుడూ "టెన్ కమాండ్మెంట్స్" గురించి ఎక్కువగా చెప్పేది. రాత్రి బైబిల్ చదవకుండా ఎప్పుడూ పడుకోలేదు. నా దిండు కింద అన్ని సైజులల్లో బైబిల్స్ ఉండేవి. దిండు అడ్డదిడ్డంగా ఉండేది. సరిగ్గాపడుకోటానికే కుదిరేది కాదు. నాదిండు ఒక ఇండియా మాప్ లాగా ఉండేది.

రకరకాల క్రాస్ లు మా ఇంట్లో ఎక్కడపడితే అక్కడ దాచిపెట్టేదాన్ని. పాపం ఒకసారి మా అమ్మ వత్తులడబ్బాలో చూసుకుంటే అందులో చక్కటి తెల్ల రాళ్ళతో మెరిసిపోయే క్రాస్ కనిపించింది. మా నాన్నగారి పర్స్ లో కూడా క్రాస్ పెట్టాను. అది నల్లటి క్రాస్. పాపం, అది తేలనుకొని భయపడ్డారుకూడా. అప్పుడప్పుడూ నన్ను మందలించేవారు. మా పనమ్మాయి కి మంచి రంగురంగుల పూసలతోటి, అందమైన క్రాస్ ఉన్న రోజరీ ఒకటి ఇస్తే ఎంతో మురిసిపోతూ వేసుకొంది. కాని మర్నాడు, ఆ రోజరీ లో క్రాస్ కి బదులు అమ్మవారి బొమ్మ ఉంది. వాళ్ళమ్మ కోప్పడి లాకెట్ మార్చేసిందిట. ఇంక, బజార్ లో రంగురంగుల కొవ్వత్తులు కనిపిస్తే అవి కొనిపించేదాకా వదిలేదే లేదు. బుక్స్ లో నెమలిఈకలు దాచి వాటికి మేత వేసుకునేవాళ్ళం కదా చిన్నప్పుడు. నేనైతే మేతతోపాటు రకరకాల క్రాస్ లు కూడా పెట్టేసేదాన్ని. అవన్నీ బాగా ఒత్తుకొని క్వాటర్లీ ఎక్జామ్స్ కల్లా నా బుక్స్అన్నీ చినిగిపోయేవి.

ఏదైనా పండగ వస్తే ఇంట్లో నాతోటి పెద్ద గొడవే జరిగేది. నాకు తెల్లటి పెద్ద లాంగ్ ఫ్రాక్ మాత్రమే కొనమనేదాన్ని. అన్ని వైట్ బట్టలే వేసుకోటం మొదలుపెట్టాను. ఇంట్లో ఏ పూజా పునష్కారం జరిగినా నేను ఆబ్సెంట్ అవటం మొదలుపెట్టాను. ఇంట్లో గనుక కోపం చేసి బలవంతాన కూచోపెడితే ఆ కార్యక్రమం పూర్తయ్యే వరకు కూడా మోకాలిమీద కూర్చొని, నెత్తిమీద తెల్లటి కాపో, కర్చీఫో, టవలో కప్పుకొని క్రాస్ చేసుకుంటూ, కళ్ళుమూసుకొనే ఉండేదాన్ని. అది సత్యనారాయణ వ్రతమైనా సరే ఇంకే పూజైనా సరే. నా పోస్ట్యర్ మాత్రం అదే. అంతేకాదు, అయిన దానికి కానిదానికి క్రాస్ చేసుకుని ఆమెన్ చెప్పుకొనే దాన్ని. నా పేరు సిస్టర్ ఫిలోమినా గా మార్చమని ఒకటే గొడవ చేసే దాన్ని.

అప్పుడు నాకో కోరిక ఉండేది. అదేంటంటే ఎప్పటికైనా సరే ఒకసారి రోమ్ వెళ్ళాలి, పోప్ ని చూడాలి అని. పోప్ ని చూడటం జీవితంలో చాలా పెద్ద అచీవ్మెంట్ అని నాకు గొఫ్ఫ నమ్మకం. క్రిస్మస్ కైతే మా ఫ్రెండ్స్ ని పోగేసి "మాస్" చేసేదాన్ని. బయట తలుపుకి పొడగాటి సాక్స్ వేలాడేసి, మర్నాడు శాంతాక్లాజ్ ఇచ్చిన బహుమతుల కోసం తెగవెతుక్కొనేదాన్ని. అమ్మ వెంటపడి మరీ మంచి కొత్త డ్రెస్ కొనిపించుకొనేదాన్ని. న్యూఇయర్ కి కూడా ఇలాగే చేసేదాన్ని. ఇంక గుడ్ ఫ్రైడే వచ్చిందంటే, మన ఇంట్లో చచ్చిపోయినవాళ్ళెవరు, ప్రేయర్ చేద్దాం రా, ఇవాళంతా మనం ఏడవాలి...అని మాఅమ్మ వెంట పడి పిచ్చి తిట్లుతినేదాన్ని. ఈస్టర్ రోజైతే ఇంటినిండా రకరకాల కొవ్వొత్తులు వెలిగించి పెట్టేసేదాన్ని.

మెల్లిగా ఇంట్లో వాళ్ళకి నా సంగతి అర్ధమైపోయింది. మాది అసలే నిప్పులు కూడా కడిగే శుద్ధ బ్రాహ్మణ కుటుంబం.
ఒకసారి మా అమ్ముమ్మ వచ్చింది మా దగ్గరికి. మా అమ్ముమ్మ దేవుడికి పూజ చేసుకుంటూ, హారతిచ్చే సమయానికి నన్ను పిలిచి మంగళ హారతి పాడమని అడిగింది. నేను వెంటనే మోకాలి మీద కూర్చొని, ఎంతో భక్తితో కళ్ళుమూసుకొని, క్రైస్తవ భక్తి గీతం పాడడం మొదలుపెట్టాను. ఒక్కసారిగా మా అమ్ముమ్మ అదిరిపోయింది. నా చేయిపట్టి గుంజుకోని పోయి, అదేవిటే, పిల్లని కిరస్తాని దాన్ని చేస్తారా ఏవిటి. దాని సంగతి అసలు ఎవరైనా గమనిస్తున్నారా? అని మా అమ్మను నిలదీసింది. ఈ పిల్లని ఇంకో బళ్ళో వేస్తారా, లేకపోతే నేను తీసుకెళ్ళిపోనా? అని మా నాన్న గారి వెంట పడింది.

అప్పటి వరకు నా వ్యవహారం ఎవరూ సీరియస్ గా తీసుకోలేదు. ఇప్పుడింక తప్పలేదు పాపం. నన్ను ఆ ఊరినుంచి మార్చేసి వేరే రెసిడెన్సియల్ స్కూల్ లో వేసేసారు. టెన్త్ క్లాస్ కొచ్చేటప్పటికి, అక్కడి హాస్టల్ వాతావరణం లో, కొత్త ఫ్రెండ్స్ మధ్య క్రమంగా నా క్రైస్తవమతం నన్నొదిలేసి వెళ్ళిపోయింది. లేకపోతే ఈపాటికి నేను నా బ్రాహ్మణత్వం వదిలేసి, క్రైస్తవ మత ప్రవచనాలు చెప్పుకుంటూ, ఏ చర్చ్ లోనో ఒక క్రైస్తవ సన్యాసిని గా బ్రతుకు గడుపుతూ ఉండేదాన్నేమో:) ఆమెన్!

ఇప్పటికీ అల్లంతదూరాన, క్రిష్ణమ్మ ఒడిలోని సాగర్ డామ్ కనిపిస్తూ, అందమైన ప్రక్రుతిలో, కొండల మధ్య ఉన్న నా చిన్నప్పటి పాఠశాలని తలచుకుంటూనే ఉంటాను.

**************************************************************************************************
 

మనస్వి © 2008. Template Design By: SkinCorner