20, జూన్ 2011, సోమవారం

పక్షి గోల!!!

మనం రోజూ మాట్లాడుకొనే మాటల్లో పక్షులకు సంబంధించినవి చాలా ఉన్నాయి. అవి గుర్తుకు తెచ్చుకుంటె ఎంత తమాషాగా ఉంటుందో.... చూడండీ, మీకైతే ఇంకా చాలా తెలుసు. కలిపించి కల్పించి...కల్పించుకొనీ మరీ చెప్పుకోవచ్చు.

అబ్బా! ఏమిట్రా కాకిగోల, బయటికి వెళ్ళి ఆడుకో.
వాడి చూపులు మండ! గుడ్లగూబలా అలా చూస్తాడేం?
నీ డబ్బు వాడికి చూపించకురా వాడు చూసాడంటే డేగలా ఎత్తుకుపోతాడు.
వడ్రంగి పిట్టలా తలుపు టకటకా కొడతావెందుకురా?
ఆ వాళ్ళకేంటి హాయిగా చిలకా గోరింకల్లా ఎంత హాయిగా ఉన్నారో.
ఆహా ఏమిటా స్వరం, కోకిల స్వరంలా.
ఏమిటా అరుపులు ఊరపిచ్చుకలా.
నామీదనాండీ మీ కోపం పిచ్చుకపై బ్రహ్మాస్త్రంలా!
ఇది నలుగురికీ తెలిస్తే ఏమన్నా వుందా!!! లోకం కోడై కూస్తుంది.
ఇకచాల్లేవోయ్ కొంగ జపం.
ఆహా ఏమిటా నడక, హంస నడకలా....
పాపం అతన్ని చూడు రెక్కలు తెగిన పక్షిలా ఎలా విల విల్లాడుతున్నాడో...
వాళ్ళిద్దరికీ అస్సలు పడదండీ ఆ ఇంటి మీద కాకి ఈ ఇంటి మీద వాలదు.
చకోర పక్షిలా ఎదురుచూస్తునే ఉన్నాడు. అయినా పాపం ఇంకా ఉద్యోగం రాలేదు.

బాగున్నాయా....ఏవిటీ నీ పక్షి గోల అంటారా...సరేనండి...ఇంక ఆపేస్తాను:)

మీరు కూడా కొన్ని చెప్పొచ్చుగా!!!!!!
***********************************************************************************

9, జూన్ 2011, గురువారం

నింగికెగిసిన నవీనాంధ్ర

"దేశమంటే మట్టి కాదోయ్
దేశమంటే మనుషులోయ్
ముత్యాల సరాలల్లె ముచ్చటైన కవితలల్లిన
నవయుగ వైతాళీకుడు "గురజాడ".

"ఏదేశమేగినా ఎందుకాలిడినా
ఏ పీఠమెక్కినా ఎవ్వరెదురైనా
పొగడరా నీ తల్లి భూమి భారతిని"
అంటూ రమ్యలోకాన అమరప్రేమను చాటిన
మన యుగకర్త "రాయప్రోలు"

ఆంధ్ర కవితల అలరించి
గోదారి అలలపై నిదురపుచ్చి
అందమైన సొగసు తొడిగిన
ఎంకి పాటల "నండూరి".

ఆధునిక సమాజపు అలజడులపై
వేయిపడగలెత్తి బుసకొట్టి
రామాయణ కల్పవృక్ష శాఖల
జ్ఞానపీఠమెక్కాడు మన "కవిసామ్రాట్"

ఏదేశ చరిత చూసినా ఏమున్నది గర్వకారణం
అంటూ చరిత్రకు నూతన అర్ధాన్ని ఇచ్చి
"నేను సైతం ప్రపంచాగ్నికి
సమిధనొక్కటి ఆహుతిచ్చా"
అంటూ జగన్నాధ రధమధిరోహించి
మరో ప్రపంచ ’మహాప్రస్థానం’ చేసిన
విప్లవకవి శ్రీ శ్రీ.

"నా తెలంగాణ కోటి రతనాల వీణ"
అని "రుద్రవీణ"ను
అగ్ని ధారలు కురిపించిన
మహారధి "దాశరధి".

పుష్పవిలాపాన పూలబాధలు తెలిపి
అహింసా తత్వ భాష్యాన్ని ప్రవచించి
జగతిన సుస్థిరమై నిలిచాడు
కరుణారస కవి "కరుణశ్రీ".

ఆకులో ఆకై పూవులో పూవై
ఊర్వశి హృదయ తరంగాలను తాకి
కవితా సుందరిలో వలపు రగిలించిన
భావుకుడు "కృష్ణశాస్త్రి"

కర్పూరవసంతాలతో
కమ్మని కవిత్వ మందించి
విశ్వంభరలో విశ్వమానవ పరిణామం
విపులంగా చూపించి
కవితా నర్తనమాడిన
నవ కవన చక్రవర్తి "సి.నా.రె".

తెలుగు భాషకు సాహిత్యానికి ఔన్నత్యాన్ని పెంపొందించి... గౌరవస్థానం కల్పించి, ఆంధ్రదేశం పట్ల మమకారాన్ని పెంచి, చక్కటి గుర్తింపు నిచ్చిన ఈ మహానుభావులు...ఎందరో,ఎందరో, ఇంకెందరో మహాను భావులు...అందరికీ వందనాలు......ఈ వైభవం కలకాలం నిలవాలి. ఎన్నో తరాలు తరించాలి. (ఈమధ్యే ఇవన్నీ చదువు.....తూ....ఉన్నాను)

*********************************************************************************

2, జూన్ 2011, గురువారం

మార్పు

అనాదిగా ఆడది అబల గానే చూడబడుతుంది.

కార్యేషు దాసి, భోజ్యేషు మాత, కరణేషు మంత్రి, శయనేశు రంభ...ఇలా స్త్రీ గురించి ఎంత చెప్పినా ఆమె స్థానం మాత్రం అట్టడుగునే. సహనం అణకువ పేరుతో స్త్రీ తనకుతానే పురుషునికి లొంగి ఉంటుంది.

అగ్నిప్రవేశం చేయమని సీతని రాముడు ఆజ్ఞాపించినప్పుడు నీ శీలాన్ని కూడా నిరూపించుకో అని ఆనాడే సీత అడిగి ఉంటే....జూదంలో ఓడింది నీవే, నాకెందుకీ శిక్ష అని ద్రౌపది ఎవరినో ధర్మసందేహాలడిగే బదులు, ఆనాడే ధర్మరాజుని నిలదీసి ఉంటే, ... సత్యాన్ని నిరూపించుకోవలసింది నీవు, కనుక నీవే అమ్ముడుపో, నన్నెందుకు అమ్ముతున్నావని ఆనాడే చంద్రమతి ఎదిరించి ఉంటే ....ఇప్పుడెలాఉండేది?

ఆ స్త్రీలను ఆదర్శంగా పెట్టుకున్న నేటి స్త్రీలకు ఈ దుస్థితి పట్టేదికాదు.

భర్త ప్రాణాల కోసం యముణ్ణే ప్రాధేయపడిన సావిత్రి ఉంది కాని....భార్యకోసం పోరాడిన ఒక్క పురుషుడున్నాడా?

కురూపి అయిన భర్తను నెత్తిన పెట్టుకొని తిరిగిన సుమతి ఉందిగాని అనాకారి అయిన భార్యకు సేవలుచేసే భర్త ఎక్కడున్నాడు?

సతికి పతియే ప్రత్యక్ష దైవమైనప్పుడు పతికి సతి ప్రత్యక్ష దేవత కాదా?

పురుషుని అవసరం స్త్రీకెంతో...స్త్రీ అవసరం పురుషునికీ అంతే కదా!!!!

ఇంత చూసినా, స్త్రీ తనను తక్కువగానే అంచనా వేసుకుంటుంది. పురుషునికి ప్రత్యేకతను ఆపాదించి పెడుతుంది.

భర్తల కోసం మనసులనే చంపుకున్న సీత, ద్రౌపది, చంద్రమతులను ఆదర్శంగా పెట్టుకున్నారెందుకో....

నరకాసురున్ని వధించిన సత్యభామ, ధీరుల్ని ఎదిరించిన పల్నాటి నాగమ్మ, రాణీ రుద్రమలను ఎందుకు స్త్రీలు ఆదర్శంగా చేసుకోరు.

పురుషులకు ఆధిక్యతను మనమే ఇస్తూ స్త్రీలను పురుషులు చిన్నచూపు చూస్తున్నారని వారిని నిందించడమెందుకు? ఒకరకంగా ఆస్థితిని వారికి మనమే కల్పిస్తున్నాం. మగవారిని అందలమెక్కిస్తున్నాం.

స్త్రీకి స్త్రీయే శతృవైనప్పుడు, ఎదుటి స్త్రీయొక్క ఆదిక్యతను ఓర్చుకోలేని స్త్రీలున్నప్పుడు...కట్నం కోసం కోడల్ని చంపే అత్తలున్నప్పుడు, స్త్రీని స్త్రీయే చిన్నచూపు చూస్తున్నప్పుడు... పురుషులు మాత్రం చిన్న చూపు ఎందుకుచూడరు? ఇంట్లో సమస్యలు స్త్రీల ద్వారా ఏర్పడవచ్చు....కాని, బయట స్త్రీకి సమస్యలేర్పడినప్పుడు, స్త్రీలే ముందడుగేస్తున్నారు. ఆ స్త్రీకి రక్షణ ఏర్పరుస్తున్నారు.

అందుకే రావాలి మార్పు. అది ఎలా ఉండాలి? ఇటువంటి ధర్మోపన్యాసాలు వాసనలేని పూలు. మనసు అహంకారంతో నిండి ఉంటే అసూయ హింసిస్తుంది. నేటి వైఫల్యాన్ని రేపటి గుణపాఠంగా భావించాలి. కేవలం పుస్తకాలే చదువకుండా, మనుషులని చదవాలి. మనల్ని మనం చదువుకోవాలి. సరి అయిన ఆశయాన్ని ఏర్పరుచుకోవాలి. మన ఆశయమే మన విలువను తెలియజేస్తుంది. కృషితో నాస్తి దుర్భిక్షం. మహిళా ప్రపంచానికే మకుటాయమానమైన విశ్వమాత మదర్ థెరిసా లాంటి మహనీయులను అనుసరిస్తే ....ఇటువంటి మానవతా మూర్తులను యుగయుగాలు స్మరించుకుంటారు.

ఇది స్త్రీ వాదం కాదు ...ఆడామగ పోటీ అసలే కాదు. వితండవాదం కాదు కావాల్సింది. ప్రపంచానికే మకుటాయమానమైన ఆ స్త్రీమూర్తుల విజ్ఞత తెలుసుకోవాలి. మనలో వ్యక్తిత్వం పరిమళించాలి. పరిపూర్ణత సంపాదించుకోవాలి. ప్రయత్నిస్తే ప్రతి ఒక్కరూ ధృవతారలుగా వెలిగే అవకాశం లేదా? రామాయణ, భారతాలేగా సంఘానికి పునాది వేసింది. ప్రపంచంలోనే భారత స్త్రీకి ప్రత్యేకస్థానం ఉందంటే...ఒక గౌరవ స్థానం సంపాదించుకుంది అంటే కారణం, మనం నిత్యం కొలుచుకుంటున్నఈ దేవతా మూర్తులు కాదా!!!

కృత, త్రేతా, ద్వాపర, కలి యుగాల చతుస్పాదాలుగా గల ధర్మదేవత నేటి కలియుగమందు అంగవికలమయింది, కుంటి నడక సాగిస్తోంది. ఇంకా అప్పటి ఇప్పటి పోలికలెందుకు? అయినా...ఇంకా పెరిగిపోతున్న అంతరాలను ఎలా తొలగించాలి? ఎన్నో రంగాలలో అభివృద్ధి సాధించిన స్త్రీ ఎందుకు చులకనగా చూడబడుతోంది? ఎన్నో బాధ్యతలను నిర్వర్తిస్తున్న స్త్రీ గౌరవాన్ని ఎందుకు కాపాడుకోలేకపోతోంది? ఎన్నో విషయాల్లో పురుషులకన్నా స్త్రీలే ముందజలో ఉన్నా...సంఘంలో అణగదొక్కబడుతున్న స్త్రీలే ఇంకా ఎందుకు ఎక్కువగా ఉన్నారు? స్త్రీ అబల కాదు సబల...అని ఎలా నిరూపించాలి? ఎందుకు...ఎన్నో విధాలుగా ఇంకా బలి అవుతూనే ఉన్నారు? ఇవి నాకు కలుగుతున్న అనుమానాలు. ప్రతి రోజూ చూస్తున్న వింటున్న సంఘటనలు....నా బాధని పెంచుతున్నాయే కాని నా ప్రశ్నలకు సమాధానాలు దొరకటంలేదు. ఇంక పరిష్కారం అన్నదే లేదా!!!!

ఈనాటి స్రీల సమస్యలకు ముగింపు లేదా!!! అలా పెరిగిపోతూనే ఉండాలా!!!! సమస్యలను తీర్చుకోలేనివారు గతకాలాన్ని విమర్శించాల్సిందేనా?

(ఈ మధ్య మాలో మాకు జరిగిన ఇటువంటి వాదోపవాదాలు విన్నాక వ్రాయాలనిపించి, ఈ విధంగా మీ ముందు ఉంచుతున్నాను)

"All Nations have attained greatness, by
paying proper respect to women. That country
and nation which does not respect women
has never become great, nor will ever be in future".... Swami Vivekananda


***********************************************************************************************
 

మనస్వి © 2008. Template Design By: SkinCorner