14, నవంబర్ 2012, బుధవారం

Dial T for 'THRILL'థ్రిల్....

  మా అక్క దగ్గిర తీసుకొచ్చిన వీరేంద్రనాథ్ 'థ్రిల్ ' ఒక నెల రోజుల్లో పూర్తి చేసా. అంటే బుక్ అంత పెద్దదనుకునేరు. చిన్నదే! కాకపోతే నేను శ్రద్ధగా తీసుకున్న టైం అది:)

నాకు నవల కన్నా అందులో ఒక అంశం భలే నచ్చింది. హీరోయిన్ కొన్న నవల 'థ్రిల్ ' మొత్తం ఖాళీ పేజీలతో ఏమీ ప్రింట్ కాకుండా ఉంటుంది. ఏమీ ప్రింట్ అవని బుక్ తనకి వచ్చినా,అది ఒక థ్రిల్ గా ఫీల్ అయి అందులో తన అనుభవాలు రాసుకోవాలనుకుంటుంది.

నేను కూడ అలాగే ఒక బుక్ లో కేవలం అద్భుతమైన అనుభవాలు రాసుకోవాలనిపించింది. కాని, అలాంటి బుక్ నాకెవరిస్తారు. అందుకే నేనే తయారు చేసుకున్నాను.

 మరి నాకు థ్రిల్లింగ్ విషయాలు ఏమైనా ఉన్నాయా! ఆలోచన మొదలైంది.....

 నేను లెక్చరర్ గా తీసుకున్న మొట్టమొదటి క్లాస్ గుర్తొచ్చింది.   పదహారేళ్ళ వయసు లో శ్రీదేవి లాగా పక్కా పంతులమ్మ లాగా క్లాస్ కెళ్ళాను.
 
నా చిన్నప్పుడు మా క్లాస్ కెవరన్నా కొత్త మిస్ వస్తున్నారూ అంటె ఎంతో ఉత్సాహంగా ఎదురు చూసే వాళ్ళం. ఎన్నో చాక్లెట్లు, ఎన్నెన్నో పూలు వరుసాగ్గా ఇచ్చి మెరిసిపోయె కళ్ళతో ఆ టీచర్ మాట్లాడే ప్రతిమాట ఎంతో అబ్బురం గా వినే వాళ్ళం. ఇప్పుడు నా స్టూడెంట్స్ కూడా అలాగే ఎదురు చూస్తూ ఉంటారని తలచుకోగానే మితిమీరిన సంతోషంతో ఒళ్ళంతా పులకరించి పోయింది.

కాని, చిన్నప్పటి నా ఆనందం ఈ పిల్లల కళ్ళల్లో కనిపించలేదు. పైగా ఒక్కోళ్ళు మహా షొగ్గా ఉన్నారు. వస్తే వచ్చావులే అన్నట్లు చాలా నిర్లక్ష్యం గా కనిపించారు. ఇంకేం పూలు, ఇంకేం పళ్ళు...వాళ్ళందరి చేతులు ఖాళీ గానే ఉన్నాయి.:(

ఏదో కొంచెం ధైర్యం తెచ్చుకున్నాను.   మెల్లిగా  నేనెవరో, నా పేరేంటో చెప్పుకున్నాను.  ఆ సరేలే అన్నట్లు, ఎంతో చాలా మెకానికల్ గా ఏదో విష్ చేసారు.

  చాలా సినిమాల్లో పంతులమ్మలను, వాళ్ళ ఆదర్శాలను, మహోన్నత వ్యక్తిత్వాన్ని గుర్తు తెచ్చుకుంటూ మెల్లిగా మొదలు పెట్టాను......

 బోర్డ్ మీద చాక్పీస్ తో టైటిల్ వ్రాయబోతే అది పుటుక్కున మూడు ముక్కలైపోయింది...

వెంటనే వెనుతిరిగి అటెండన్స్ రిజిస్టర్ ఓపెన్ చేసాను.  అబ్బే, అందులో ఏం లేదు!!! అయ్యోరామా! పిల్లల పేర్లే రాసుకోలేదు. వెంఠనే క్లోజ్ చేసేసా.

ఒక గంట కోసం ప్రిపేర్ అయిన పాఠం ఓ పదిహేను నిమిషాలకే అయిపోయింది. ఇప్పుడెలా మిగతా టైం ఏం చేయాలి? కాళ్ళు చేతులు ఒణుకుతున్నాయి. మరీ అప్పచెప్పేసినట్లున్నాను. ఇప్పుడెలా! పిల్లలు గుడ్లు మిటకరిస్తూ నన్నే చూస్తున్నారు. ఇంకో నిమిషమైతే ఏదో చేసేట్లే ఉన్నారు. లాభం లేదు వెంటనే ఏదో ఒకటి నేనే చేసేయాలి.

     ఇంత లో ఒకమ్మాయి మేడం మీ శారీ చాలా బాగుంది,  రోజూ కాటన్ చీరలే కడ్తారా? అంది. ఇంకో అమ్మాయి మేడం సింగిల్ బ్యాంగిల్ వేసుకున్నారు, ఎంతో బాగుంది అంది.   ఇంకో వైపునుంచి ఓ అమ్మాయి మేడం మీ కళ్ళెంత బాగున్నాయో అంది. అప్పటి వరకు గుడ్లు మిటకరిస్తున్న నేను కూడా వెంటనే చలనం వచ్చి కళ్ళు మూసేసాను.
 ఓహో!!! వీళ్ళతో రోజూ కాసిన్ని కబుర్లు చెఫ్ఫాలి కాబోలు....   దేవుడా నా కళ్ళు తెరిపించావు.  జ్ఞానోదయమయింది.

 హమ్మయ్యా!! ఇంక వాళ్ళు నాకు క్లాస్ తీసుకోటం అయిపోయింది.   నేనెళ్ళిపోవచ్చు.

 అంటే!!! ఇంత వరకూ వాళ్ళు గమనించింది...నేను చెప్పిన పాఠం కాదు, నన్ను:))))

ఏ లెసన్ తీసుకోకుంటే ఇంత థ్రిల్ ఉంటుందన్నమాట:))))

 ఒక పని ఎట్లా చేయాలా అని   అధైర్య పడొద్దు. పని చెయ్యడం ప్రారంభించు...ఎట్లా చేసావని నువ్వే ఆశ్చర్య పోతావ్. - గెథే

 అక్షరం ఎప్పుడూ పుడుతూనే ఉంటుంది.(ఎవరూ పుట్టించకపోతే కొత్త మాటలెలా వస్తాయి:)అన్నారుగా ఎస్.వి.ఆర్.)

దానికి చావే లేదు ఓ కవి హృదయంలా....
ఉపయోగించని విజ్ఞానం నిష్ప్రయోజనం అనిపించింది....
అప్పటి నుంచి నా స్వంత పరిజ్ఞానమే పిల్లల్లొ నాకొక ప్రత్యేక స్థానాన్ని ఇచ్చి నా శ్రద్ధ కూడా పెంచుకుంటూ పోయింది...

ఓనమాలతో మొదలెట్టి జీవన విధానాన్ని నేర్పించి
విద్యార్ధి విజయానికి నాంది పలికిన
నిజమైన గురువుల ప్రతిభకు సాటి ఏది!!!!!

దీపావళి కి రెండు రోజులముందే నేను లెక్చరర్ అయ్యానన్నమాట! అందుకే ఇలా తలుచుకుంటున్నాను:)
కొత్త పంతులమ్మ లందరికీ ఇది అంకితం.....

  మితృలందరికీ హృదయపూర్వక దీపావళి పండుగ శుభాకాంక్షలు.

ఇవాళ పిల్లల పండుగ కదా! అందుకని మా పిల్లలకి, బ్లాగుల్లో ఉన్న  బాబులకి, పాపలకి....

బాలల దినోత్సవ శుభాకాంక్షలు......
*****************************************************************************************************************************************************
 

మనస్వి © 2008. Template Design By: SkinCorner