3, మార్చి 2010, బుధవారం

నా రైలుబండికి యాభై పెట్టెలు చేరాయండి!!!

50...యాభై...అవునండి, మొత్తానికి...ఈ నాటికి నేను అర్ధశతాబ్ధి (శతాబ్ధి రైలుబండి లో సగం కాదండీ..కొత్త రైలుబండి కూడా అస్సలు కాదండి). అంటే వంద లో సహం అన్నమాట, అదేనండి..టపాలు ఠఫీ మనిపించానండి. అందరు వందేసి టపాలు పూర్తి చేస్తుంటే...బోడి..తొక్కలో యాభై కి కూడా చెప్పుకుంటావా? అంటారా! అండి. ఏం చేయనండి. మరి నా శక్తి అంతేనండి. అదికూడా, రెండు బ్లాగుల్లో రాసినవి కలిపండి. అందుకే ఇవ్వాళ స్వీటు చేసుకొని తిన్నానండి. ఇవన్నీ గంగగోవు పాలండీ...హ..హ..హ...!!! నేనెలాగు సెంచురీ కొట్టలేను కదండీ మరి...హి హి హి:) నా రైలుబ౦డికి యాభై పెట్టెలు చేరాయ౦డి. చా....లా...పొడుగాటి బ౦డి కద౦డి. ఇ౦కా ఎక్కువ పెట్టెలైతే... పట్టాలమీద నా రైలుబ౦డి పడిపోతు౦దేమోన౦డి. మరిహ ఇంతేనండి సంగతులు.
ఇది నాదే నండి...అంటే నేను కాదండి...నేను వేసుకున్న బొమ్మండి.

నా ప్రభూ! నా జీవన ప్రధాతా!
నా హృదయంలో నిలచిన ప్రతీ
క్షణం నీ ఊహల్నే కలిగిస్తుంది.
నీ పై భక్తిని రేకెత్తిస్తుంది.
నిన్ను నేనెలా మరువగలను ప్రభూ!
నేను తిరిగే ప్రతి అందమైన, మధురమైన
మలుపులో నీరూపే ప్రత్యక్షం అవుతుంది.
విరిసిన కలలా..అరవిరిసిన పూవులా
అంబరమైన నా హృదిలో రంగు వెలవని వర్ణ
చిత్రంగా నాలో నిలిచి పోయావే.
నిన్ను నేనెలా మరువగలను ప్రభూ!!!
గతం వర్తమానంలోకి జారిపోతోంది!
వర్తమానం భవిష్యత్తులోకి ఉరకలేస్తోంది.
వెలుగు నీడలలా మారిన జీవికలో,
నా మనస్సనే నిర్మల సరస్సులో ఉదయించిన పద్మంలా
నా బ్రతుకనే ఆకాశంలో వెలిగే సూర్యునిలా
ప్రతి ఉదయం నీ స్మరణతోనే మేల్కొంటాను
నిన్ను నేనెలా మరువగలను ప్రభూ!!!

ప్రభూ!!!ఇది నీకే అంకితం.....


మరి నా యాభయ్యవ టపా ఇదేన౦డి....

కనుక్కోగలరా?

క్రింద ఈయబడిన ఉదాహరణలు కొందరు ప్రముఖుల రచనలనుండి కోట్ చేయబడ్డాయి. ఆ యా భాగాల్లో భావనా వైవిధ్యము, శైలి, పాత్ర చిత్రణ, వీటి ఆధారంగా రచయిత లెవరో కనుక్కోగలరేమో ప్రయత్నించండి.

1. "విద్యవంటి వస్తువు లేదు.నిజమే--ఒకటి తప్ప. అదేవిటి? విత్తం. డబ్బు తా"ని విద్య దారిద్ర్య హేతువ. యీ వూళ్ళో నారదుడు వొచ్చి పాడితే నాలుగు దమ్మిడీ లివ్వరు. గనుక యీ వీణ యిటు పెడదాం, హెడ్డుకనిష్టీబు సౌజ్ణచేసి వెళ్ళాడు. అతడు యిచ్చేదీ, చచ్చేదీ లేదుగానీ, జట్టీలేవైనా వొస్తే ఓ వొడ్డు కాస్తాడు"
(ఇది చా....లా పాతది.అంటే దాదాపుగా ఓ వంద ఏళ్ళ క్రితం అన్నమాట.)


2. "ఆమె ఏడుస్తూ కూర్చుంది. బాల చాలా అందమైనది. అదొక విలక్షణమైన ఉజ్వలమైన అందం. అటువంటి అందం అన్ని చోట్లా కనిపించదు. నాకు బాధగావుంది. నిజమే కాని యెంతమందిని ఎదిరించి, ఎన్ని అడ్డంకుల్ని దాటి నా భవిష్యత్తుని ఏం చేసి ఈమెని నాదాన్ని చేసుకోగలను? కోపంతో మరీ ఎరుపెక్కిన జీరలుగల కళ్ళుకల నాన్న మొహం, నిరసనతో చూసే అమ్మ మొహం, పద్దెనిమిదివేల కట్నంతో జడ్జీగారి సంబంధం, రాజకీయంగా వేసుకున్న ప్లానులు....యివన్నీ ఏమవుతాయి? "
(ఇది మరీ పాతదేం కాదు, ఆ మధ్య కాలందన్నమాట...అంటే సుమారుగా, యాభై ఏళ్ళక్రితం)


3. "శ్యామలకి చాలా కోపమొచ్చింది. అతను ఎందుకిలా మాట్లాడుతున్నాడో అర్ధం కాలేదు. అర్నెల్ల దాంపత్యంలో ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ రాలేదు. ఎవరన్నా వూరికే తననంటే పడుండే స్వభావం కాదు శ్యామలది. తిరిగి అతన్ని దులిపేద్దామనుకుంది మొదట. ఐనా అత్తగారు ఏమనుకుంటుందోనని తమాయించుకుంది. సుధాకర్ మాత్రం అనాల్సిందేదో అనేసి, తన కప్పులో కేసరి ఒక్క పిసరు కూడా మిగల్చకుండా మెక్కేసి, వెళ్ళి టీ.వీ. ముందు సెటిలయ్యాడు. శ్యామల స్వీటుని ముట్టుకోకుండానే ప్లేట్లు వంటింట్లోకి తీసుకెళ్ళడం సీతాలక్ష్మి దృష్టిని దాటిపోలేదు."
(ఇది మరీ ఇవాల్టి కథల సంపుటే)

చూశారా! ఆంకర్ సుమ లాగా ఎంతబాగా క్లూ లిచ్చేసానో:) నాకు తెలుసు మీరు తప్పకుండా కనుక్కో గలరని... అంతగా అయితే మళ్ళీ ఇక్కడే సమాధానాలు కూడా రాస్తాలెండి....


హాయ్! ఇవండీ సమాధానాలు......

1. p. 80 రామప్ప పంతులు ఇంట్లో పడక గదిలో...మధురవాణి, గురజాడ అప్పారావు గారి కన్యాశుల్క౦.

2. p.102. "ఓడిపోయిన మనిషి" ...దేవరకొండ బాలగంగాధర తిలక్ గారి, తిలక్ కథలు లో.

3. p.108. ఎస్. నారాయణస్వామి గారి రంగుటద్దాల కిటికీ-కథలస౦పుటి... 'అత్తగారితో కొత్త కాపురం '.


*****************************************************************************

17 వ్యాఖ్యలు:

భావన చెప్పారు...

Congratulations Jaya. మీ బ్లాగు ప్రయాణం లో మొత్తానికి 50 పెట్టెలు తగిలించారు మీ బ్లాగు బండి కి. పర్లేదు లెండి. మా లాంటోళ్ళు బోల్డు మంది వున్నాము మీ తోడు. తోడూ ఏమిటి మీ వెనుక. ఏమి బాధ పడకండి. అబ్బ మీరు వేసిన బొమ్మ చాలా బాగుంది మిమ్ములను అడగకుండానే సేవ్ చేసేసుకున్నా.

ప్రభూ ఆదరించిన నీ గానం వేయి రాగాలు గా చీలి భువనాంతరాళను నింపుతోంటే నే నడిచే ప్రతి తోవా నీ పద మాధుర్యం తో ముందే పూల దారి చేసి నన్ను నువ్వు స్వాగతిస్తుంటే, సిగ్గుపడ్డ ఈ పధకురాలిని సేద తీర్చి నీ ప్రేమ సుధా రాగం లో ముంచి లేపుతుంటే నువ్వు నేన వేరు కాదని ఈ పిచ్చి మీరా తలపులను నువ్వు సుస్వరం గా అవునని చెపుతుంటే నిను మరిచేదెలా. మరవనేల. :-)

నిషిగంధ చెప్పారు...

అభినందలు జయగారు :-)

మీ బొమ్మ మాత్రం చాలా చాలా బావుందండి! దానిపై భావన భావనలు కూడా అదుర్స్ :)

మా ఊరు చెప్పారు...

మొత్తానికి 50లో అడుగేసేసారా.
కంగ్రాట్స్

మాలా కుమార్ చెప్పారు...

అమ్మయ్య , యాభై అడుగులేసావన్న మాట . అభినందనలు .
బొమ్మ , కవిత సూపర్ .

చిన్ని చెప్పారు...

స్వీటు చేసుకుని ఒక్కరే తినేసారా ? ఇది న్యాయం కాదు -:(
పైగా పరీక్షలా ...ఎక్కడో చదివిన వాక్యాలు కనబడుతున్నాయి .హ్మం..మరల కేసరి ,ఫుడ్ గోల మన మల్లాది లోనే కనబడుతుంది ,కాని ఇది వారిది కాదు .
అభినందనలు .

SRRao చెప్పారు...

జయ గారూ !
బ్లాగాభినందనలు. యాభై వంద కావాలి త్వరలోనే! మీ బొమ్మ అద్భుతం. ఇక క్విజ్ 1)గురజాడ అప్పారావు గారు - కన్యాశుల్కం 2) & 3) కొంచెం సందేహాలున్నాయి. ప్రయత్నిస్తాను.

శిశిర చెప్పారు...

మీ రైలు బండి పెట్టెల సంఖ్య నిరంతరాయంగా పెరగాలని ఆశిస్తూ శుభాభినందనలండి.

మురళి చెప్పారు...

ముందుగా అభినందనలు జయగారూ.. బొమ్మ, కవిత చాలా బాగున్నాయి.. ఇక ప్రశ్నలకి జవాబులు. 1. గురజాడ అప్పారావు (కన్యాశుల్కం లో మధురవాణి డైలాగు) 2. విశ్వనాథ వారి వచనం లా ఉంది. 3. పీవీ శేషారత్నం గారి కథేమో అని సందేహం.. మొత్తం మీద మొదటి జవాబు కి మాత్రం మీరు పక్కా గా లాక్ చేసుకోవచ్చు. ఇంతకీ బహుమతి ఏమిటి? ఒక ప్రశ్నకి సరైన సమాధానం చెబితే ఏం బహుమతి? రెంటికైతే ఏమిటి? మూడూ సరైన జవాబులు చెబితే ఏమిస్తారు? ఇవి చెప్పండి ముందు..

జయ చెప్పారు...

భావనా థాంక్యూ. పర్లేదులే మీవి యాభై దాటిపోయాయి. నేను వేసిన బొమ్మ సేవ్ చేసుకున్నారా:) మీ చక్కటి భావాలు, ఇంకా ఎన్ని భావనలు కలిగించాయో తెల్సా!!! నువ్వు నేను వేరు కాదని చెప్పిన భావతరంగాల లో తేలిపోయాను.


ధన్యవాదాలండీ నిషిగంధ గారు. భావన, భావనల ద్వారానే నా బొమ్మకు జీవం పోసిందండీ... ఇక్కడ భావోద్రేకాలు పెరిగిపోయాయి కూడాను :(

జయ చెప్పారు...

మా ఊరు గారు ధన్యవాదాలండీ. మొత్తానికి నాతో కూడా యాభై అడుగులేయించారు.


బొమ్మా, కవితా బాగుందా అక్కా, థాంక్యూ. బ్లాగ్ "సంవత్సరీకానికి" ముందే 50 అడుగులైతే ఏసేసాను. హమ్మయ్యా...

జయ చెప్పారు...

ఏం చేయమంటారు చిన్ని గారు. హైద్రాబాద్ నుంచి విజయవాడకి స్వీట్ ఎలా పంపగలను. పైగా మీరు ప్రస్తుతం ఏ హైవే మీద ఉన్నారో ఏవిటో?
లాభం లేదు చిన్నిగారు. మీరు ఈ పరీక్షలో వొద్దులెండి. అసలే హాయిగా Alumni లో ఎంజాయ్ చేసి ఉన్నారు. ప్రస్తుతం ఈ సిలబస్ మీరు చదవలేరు. కాని ఇందులో చివరి ప్రశ్నకి మీరు తప్పకుండా జవాబివ్వగలరే... మరి ?

జయ చెప్పారు...

రావ్ గారు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు. యాభై నుంచి వందే!!! అమ్మ బాబోయ్ నేను వందేళ్ళు ఉండనేమోనండీ:) నా బొమ్మ నచ్చినందుకు థాంక్స్. మీరు ఇచ్చిన మొదటి ప్రశ్న జవాబు కి మీకు 100 మార్కులు పడిపోయాయండి. మిగతావి మళ్ళీ ప్రయత్నిస్తా నన్నారుగా? మూడవ ప్రశ్న కు మీరు చెప్పగలరు చూడండి...ఇలా అయితే మీరింక సప్లిమెంటరీ యే:)

హాయ్ శిశిరా, థాంక్యూ. ఏంటి బిజీ యా? బ్లాగ్ కి మూత పెట్టేసారు. రైలు బండి కి బోగీలు పేంచేస్తూ పోతే కష్టమనుకుంటా?

జయ చెప్పారు...

మురళి గారూ థాంక్యూ. బొమ్మా, కవితా బాగుందా? అయితే ఇంకో థాంక్స్.
మీ మొట్టమొదటి జవాబు పక్కా కరెక్ట్ అండీ. దీనికి 100 మార్క్స్ పడిపోయాయి. ఊహూ...రెండు...మూడూ పప్పులో కాలేసేసారు. ఇలా అయితే ఎలాగండీ, అసలే పప్పు ఆకాశంలోకి వెళ్ళిపోతానంటోంది. అసలు రెండో ప్రశ్నకి మీరు ఠాఫీ మని ఆన్సర్ చెప్పేస్తారనుకున్నానే? ఇది మీరు చేసిన పుస్తక పరిచయాలలోదే :)
ఏంటండి మీరు మరీను, రావ్ గోపాల్ రావ్ ని గుర్తు చేస్తున్నారు. దీనికైతే ఎంత, దాని కైతే ఎంత, అని బేరమాడేస్తున్నారేంటి. నేనేదో మామూలు బడి పంతులమ్మని. పరీక్షలు పెట్టి మార్కులు మాత్రమే ఇస్తాను. నాన్స్టాప్ లో లాగా హీరో నో, విలనో చెప్తే ఏ కారో ఇచ్చినట్లు నన్నుకూడా ఇమ్మంటే ఎలాగండి.
ఆ రెండో ప్రశ్నకి సమాధానం రేపు చెప్తాను:) ఎందుకంటే , నాకు సీరియల్స్ రాయటం రాదు గా...కనీసం ఇలా మైంటైన్ చేద్దామని:)

శేఖర్ పెద్దగోపు చెప్పారు...

అమ్మో ఎభై పెట్టేలే...కంగ్రాట్స్...బొమ్మ చాలా బాగుందండి...చిన్ని గారికి విజయవాడ అని స్వీటు ఇవ్వకుండా తప్పించేసుకున్నారు...మరి నా మాటేమిటండి..నాకు స్వీటు ఇవ్వలేదేమరి...మీరిచ్చిన ప్రశ్నా పత్రం లోని ప్రశ్నలుకు ఆన్సర్ చేయాలంటే కనీసం తక్కువలో తక్కువ ఓ వంద సార్లు సప్లమెంటరీ ఎగ్జామ్స్ రాయాలండి నేను...:)

జయ చెప్పారు...

శేఖర్ గారు థాంక్యూ, ఎక్జాం కీ కూడా రిలీజ్ అయిపోయింది. ఇంకేం ఎక్జాం రాస్తార్లెండి. శ్రీకాకుళం అయినా విజయవాడైనా స్వీట్ చేరుకోటం కష్టమే కదండి. మీరు హాయిగా మన చెకుముకిపియ అదేనండి షణ్ముఖ ప్రియ తీయటి పాటలతో కడుపునింపేసుకోవచ్చు.

రాధిక(నాని ) చెప్పారు...

జయగారూ,మీ రైలుబండి యాభై పెట్టెలుకి జతగా మరిన్ని పెట్టెలు కలపడానికి బుల్లెట్ రైల్లాగా దూసుకు పోవాలని ఆశిస్తూ అభినందనలు .మీబొమ్మా మీకవితా కూడా చాలాబాగున్నాయి.

జయ చెప్పారు...

రాధిక గారు థాంక్యూ.

 

మనస్వి © 2008. Template Design By: SkinCorner