28, ఫిబ్రవరి 2010, ఆదివారం

ఏమి సేతురా లింగా! ఏమీ సేతురా!!!





ధనమేరా అన్నిటికి మూలం. ధనం లేక పోతే మనుగడే లేదు. మరి ఈ ధనం ఎలా సంపాదించాలి. ఈ రోజుల్లో మారిపోతున్న అనేక పరిస్థితుల్లో, పెరిగిపోతున్న ధనపు విలువల్తో, కావాల్సినంత ధనం ఎలా సంపాదించాలి మరి?

ఏ చదువులు చదవాలి? ఏ వృత్తులు చేయాలి? ఏ వృత్తిలో ఎక్కువ ధనం సంపాదించి, కాలిమీద కాలేసుకొని తృప్తిగా జీవించగలం? ధనమిచ్చే ధైర్యం ఏ వృత్తిలో లభిస్తుంది?

ప్రస్తుతం వెయ్యి డాలర్ల ప్రశ్న ఇది. ఏ వృత్తిలో ఉన్నా, స్థిరత్వం లేదు. రక్షణ లేదు. కలకాలం అదే కొనసాగించగలమన్న ధీమా లేదు.

ప్రభుత్వ ఉద్యోగాల వైపు చాలా మంది మొగ్గు చూపుతున్నారు. జీతభత్యాలు సక్రమంగా ఉంటాయని, ఉద్యోగ భద్రత ఉంటుందని, టైం కి పోయి టైం కి రావటమే అని, హాయిగా తన కుటుంబంతో చీకూ చింతా లేకుండా జీవితం సంతోషంగా గడపొచ్చని వారి ఆశ. కాని ఎంతమంది ప్రభుత్వ ఉద్యోగాలు సంపాదించుకోగలుగుతున్నారు. ప్రస్తుతం గవర్న్మెంట్ రిక్రూట్మెంట్స్ అన్నది లేనే లేదు. క్రమంగా అంతా ప్రైవటేజేషనే కదా! ఎన్.టి.ఆర్. కాలంలోనే ఆపేశారు. ఇక్కడొక చిన్న విషయం గుర్తుకొస్తుంది. 1994 లో అప్పుడే ఉద్యోగాల్లో పార్ట్ టైం లెక్చరర్లు గా చేరిన మేము మా జాబ్స్ రెగ్యులరైజేషన్ కోసం స్ట్రైకులు, నిరాహార దీక్షలు మొదలు పెట్టాం. అప్పుడు ఎన్.టి.ఆర్. అపోజిషన్ పార్టీ లీడర్. అసెంబ్లీ లో మా ఇస్స్యూ ఉందంటే మేము కూడా కొంతమందిమి ఆ సెషన్స్ కి వెళ్ళాం. అనుకున్నట్లుగానే మా ఇస్స్యూ రైజ్ అయ్యింది. ఎన్.టి.ఆరే మాట్లాడారు.
ఏమీ...ఆ పార్ట్ టైం లెక్చరర్లూ...
ఏమీ...ఆ టెంటులు....
ఏమీ ...ఆ నిరాహార దీక్షలు...
ఈ అసమర్ధ నిరర్ధక ప్రభుత్వమేమి చేయుచున్నది...
ఉద్యోగులతో ఆటలాడుట మీకు ధర్మమేనా?... అని ఇంకా ఏదో తన ధొరణిలో ప్రభుత్వాన్ని ఆవేశంగా ఏదో అడగ బోతున్నారు. కాని అంతలోనే పక్కనే కూచున్న చంద్రబాబు గారు ఆయన చేతి మీద గోకుతూ, లాగి, గుంజి, కూచోపెట్టారు. అప్పటి విద్యాశాఖ మంత్రి జనార్ధనరెడ్డిగారు మాత్రం ఊరుకున్నారా? లేదు. వెంఠనే లేచి 1982 లో మీ ప్రభుత్వమే కదండి రిక్రూట్మెంట్స్ బాన్ చేసింది. ఇప్పుడు మేమేం చేయగలం. మీ తప్పులు సవరించటంతోటే మాకు సరిపోతోంది అన్నారు. సరే, మమ్మల్ని ఎన్నో తీవ్ర ప్రయత్నాల తరువాత, అతికష్టం మీద 1998 లో రెగులరైజ్ చేశారు. ఇప్పుడు ఆ అవకాశాలు కూడా లేవే?

అదండీ సంగతి. ఈనాటి వరకు ప్రభుత్వ ఉద్యోగాలే లేవే? మరి ఎలాగా? ఎన్నో నోటిఫికేషన్స్ ఒస్తాయే తప్ప రిక్రూట్మెంట్స్ లేవే? ప్రభుత్వ ఉద్యోగాల మీద ఏమని ఆశలు పెట్టుకోవాలి? ఓ.కే...ఒకవేళ సంపాదించుకున్నా, ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందో, ఏ కారణంతో ఊస్ట్ అయిపోతారో, సస్పెండ్ అవుతారో చెప్పటం కష్టం. ఏ ల౦చాలో తీసుకున్నార౦టారు. ఇంక జాబ్ సెక్యూరిటీ ఎక్కడ? ఇప్పటి చాలా ఉద్యమాలకి కారణాలు ఉద్యోగాలే కదా!!! ఐ.టి. ఉద్యోగాల్లో మొదలైన ఒడుదుడుకులూ తెలిసినవే! అ౦దరూ వలసపోయిన వారేగా!!! ఇక్కడి భద్రత మాత్ర౦ ఎ౦త?

పోనీ వ్యాపారాలు చేసి కోటీశ్వరులైపోదామన్నా, వ్యాపారాలు చేయగలిగే సామాన్యులు ఎంతమంది ఉన్నారు? వ్యాపారస్థులు ఎన్నో టెన్షన్స్ తో పగలూరేయి కష్టపడుతూ చివరికి కుటుంబాలకి దూరమై, తీవ్రమైన మనస్తాపంతో యాంత్రిక జీవితం గడుపుతారని, ఎన్నో విమర్శలు ఉన్నాయ్. వాళ్ళ జీవితాల్లో డబ్బు మానవ సంబంధాలకే విలువ లేకుండా చేస్తుందని ఒక నమ్మకం. ఎప్పుడు ఏ నష్టాన్ని ఎదుర్కొంటారో, ఓడలు బండ్లే అవుతాయో చెప్పలేరు. చిన్న వ్యాపారస్థులకు ఇ౦తకన్నా అస్థిరమైన జీవితమేగా? మరెలా!!!

పోనీ హాయిగా, అందమైన పల్లెటూళ్ళల్లో, తృప్తిగా, నీడపట్టున చక్కటి వ్యవసాయం చేసుకుంటూ, ఆనందమయమైన రైతన్న జీవితంతో, స్వతంత్ర్యంగా దేశాన్నే పోషిస్తూ రాజులాగా బతికితే ...ఏమో!!! అవీ కలలే అవుతున్నాయి. పట్టణాల్లో కన్నా పల్లెల్లోనే కరెంట్ ఉండటంలేదు. గొప్ప గొప్ప ప్రాజెక్టుల నుండి ప్రవహించే కెనాల్స్ తో వారికి ఒచ్చే నీటి సౌకర్యమెంత. ఆధునిక పద్ధతులతో చక్కటి వ్యవసాయం నిర్వహించే వసతులు ఎంతమంది కి అందుబాటులో ఉన్నాయి. ఊళ్ళకు ఊళ్ళే ఎండి పోతున్నాయి. ఎంతమంది అన్నదాతలు ఉన్న ఆస్థులను తెగనమ్మి వలసపోయి దుర్భర దారిద్ర్యాన్ని అనుభవిస్తున్నారో...గమనిస్తుంటే కంటినీరు ఆగదు. పల్లెటూళ్ళు ఖాళీ అవుతున్నాయట.

ఎటువంటి ఆలోచనలు పెట్టుకోకుండా, చక్కటి లలిత కళల మీద ఆధారపడి ఓ అద్భుతమైన జీవితం గడిపేస్తే...ఎలా ఉంటుంది. తరాల తరబడి ఎంతోమంది ప్రసిధ్ధ కళాకారులు ఉన్నారుగా!!! నృత్యమో, సంగీతమో, చిత్రలేఖనమో, సాహిత్యమో, ఇతర ఏ కళనో చక్కటి సంపాదన ఇస్తే, కీర్తి ప్రతిష్టలతో దర్జాగా బ్రతికేయొచ్చు. అయ్యో! ఆయా ర౦గాలలో, పోటీ కన్నా అణగదొక్కే ఈర్ష్యాధ్వేషాలే ఎక్కువుగా ఉన్నాయే. ఎంత పరిపక్వత సాధించిన వారికైనా కేవలం వారి శక్తిసామర్ద్యాల మీద ఆధారపడి అవకాశాలు లభించవే... మరెలా!!!

భార్యా భర్తలిద్దరూ కష్టపడితే బాగుంటుందంటారా! అబ్బా...ఒద్దండీ...హాయిగా భర్త సంపాదిస్తే, భార్య ఇంట్లో ఉండి, పెద్దలను, పిల్లలనూ చూసుకుంటూ, అన్ని సౌకర్యాలతో...ఈ జీవితమే సఫలమూ.. అని పాడుకుంటుంటే...బాగుంటుందండి... హూష్...య్యా.....అ౦తా భ్రా౦తియేనా!!!

అసలు...డబ్బన్నదే లేని లోకము౦టే.... పోనీ కావాల్సినవన్నీ ఇచ్చే అక్షయపాత్ర దొరికితే!!!

చీకటిని చూసి భయపడుతూ ఉ౦టాము. ఎ౦దుక౦టే అక్కడ ఏము౦దో కనిపి౦చదు కాబట్టి. అదే ఒక చిన్న దీప౦ వెలిగి౦చుకు౦టే!!!

ఏమి సేతురా లింగా! ఏమీ సేతురా!!! అన్న తత్వమే పాడుకోవాలా?

గెలవాలన్న తపన బలీయంగా ఉన్న చోట ఓటమి కాలైనా పెట్టలేదు!!!!....







******************************************************************************

11 కామెంట్‌లు:

SRRao చెప్పారు...

జయ గారూ !
>>అసలు...డబ్బన్నదే లేని లోకము౦టే.... పోనీ కావాల్సినవన్నీ ఇచ్చే అక్షయపాత్ర దొరికితే!!!<<
బాగానే వుంటుందేమో ! కాకపోతే మరో ప్రత్యామ్నాయం తయారై.. అది మళ్ళీ ఏకు మేకై....... ఇవన్నీ పగటి కలలేనేమో జయ గారు. బ్రతకాలంటే డబ్బు సంపాదించక తప్పట్లేదు. దాని కోసం తిప్పలూ తప్పట్లేదు. అవసరాన్ని మించి సంపాదించాలనుకునే వాళ్ళతోనే సమాజానికి చిక్కంతా ! ఏమీ చెయ్యలేం !

Hima bindu చెప్పారు...

జయగారు
ప్రభుత్వ రిక్రూట్ మెంట్ లేదనడం సరికాదు .ఐ.టి రంగం లో ఈ మద్య ఒడిదుడుకులు వచ్చాయి కాని మరల రెక్కలు విదుల్చుకుంది .భారీగానే కాంపస్ రిక్రూట్మెంట్లు జరుగుతున్నాయి.ఎన్నో ఏళ్ళ తరువాత బ్యాంకింగ్ ఇన్సూరెన్స్ రంగాల్లో వేల సంఖ్యలో నోటిఫై చేసారు .అలాగే ఆల్ ఇండియా సర్వీసు లలో 1100 పైన ఖాళీలు నోటిఫై చేసారు .ఇంత భారీగా గతంలో చేయలేదు ,నిజానికి ఈ తరం వారికి మంచి అవకాశం .అలాగే appsc లెక్చరర్ ల ఎంపిక కొరకు పరీక్షా నిర్వహించ బోతుంది .బ్రతకడానికి 'ధనం' అవసరమే .....అదే లోకం అనుకుంటేనే చిక్కులు .

జయ చెప్పారు...

రావ్ గారు డబ్బులోనే ఉన్నదిగా లోకమంతా.కనీస అవసరాలకు కూడా సంపాదించలేని వారి పర్సెంటేజ్ ఎక్కువ. వారి నిరాశా నిస్పృహల పరిశీలనతోనే నేను ఈ విధంగా రాయాల్సి వొచ్చింది. థాంక్యూ.

జయ చెప్పారు...

చిన్ని గారు థాంక్యూ. నేను చూస్తున్న చాలా మందిలో ఈ అవగాహన లేకనే పరిస్థితుల గురించి సరి అయిన అభిప్రాయాలకోసమే నేను ఇది రాయాల్సి ఒచ్చింది. జీవితమే డబ్బు కాదు, కాని డబ్బు అవసరమే కదా! లక్షల్లో ఉన్న యువతకు వేలల్లో జరిగే రిక్రూట్మెంట్స్ సరిపోవటం లేదు. నాకు తెలిసి లాస్ట్ టైం JL సెలెక్షన్ వొచ్చి కూడా లక్షల్లో లంచాలు ఇచ్చుకో లేక ఒదిలేసుకున్న వాళ్ళు ఉన్నారు. పైకి కనిపిస్తున్నదొకటి, అమలులో జరుగుతున్నది ఇంకొకటి. యువత లోని నిరాశ పూర్తిగా తొలగాలి అంటే వాళ్ళల్లో ప్రభుత్వం మీద ఆధారపడే తత్వం తగ్గాలి. విదేశాల్లోనే సుఖపడగలమనే భావం మారాలి. వాళ్ళే ముందుకు వొచ్చి సమష్యలకు పరిష్కారాం కనుగొనాలి. అంతేగాని, ఉద్యమాల ద్వారా, ఆత్మహత్యలద్వారా, విమర్శల ద్వారా సాధించేదేమి లేదు.

Hima bindu చెప్పారు...

మీరు చెప్పింది పూర్తిగా వ్యతిరేకించడం నా అభిమతం కాదు కాని అసలు అవకాశాలే లేవన్న కోణం గురించి ప్రస్తావించాను .గతం కంటే మెరుగు అని చెప్పడం నా ఉద్దేశం .కోట్ల మంది జనాభా వున్నా ఆంధ్రలో ప్రభుత్వ ఉద్యోగులు లక్షలోనే ,కాని ఎన్నో రంగాలు ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నాయి .ప్రైవేటు ,స్వయం ఉపాధి లో ఎన్నో అవకాశాలు. పూర్వం కంటే ఇప్పుడే ఎన్నో ఎన్నెన్నో. .

జయ చెప్పారు...

చిన్ని గారు మీరన్నది నిజం. ఎన్నోరకాల అవకాశాలు పెరిగాయి. పెరిగిన జనాభాని దృష్టిలో పెట్టుకున్నట్లైతే స్వయం ఉపాధి పధకాలు అన్ని విధాలా మంచిదనిపిస్తుంది. పది మంది లోన్ కి అప్లై చేసుకుంటే సరియైన స్యూరిటీ లేక, కనీసం నలుగురికైనా బాంక్ లోన్ లభిస్తుంది. ప్రైవేట్ లోన్ తీసుకోక పోవటమే మంచిది. నలుగురైదుగురు కలిసి పధకాలు ప్రారంభిస్తే, క్రమంగా నిలదొక్కుకోవచ్చు. ఇప్పటికీ స్త్రీల అభివ్రుద్ధి తమ సమస్యలకు కారణం అని భావించే యువకులు ఉన్నారు. ఇప్పటికీ, ఈ దేశం మాకేమిచ్చింది, అనే అంటున్నారు. పెరుగిపోతున్న ఈ అశాంతే ఎన్నో సమస్యలకు కారణం. అందుకే అన్నారు చుట్టూ చీకటికి భయపడకుండా చిన్ని దీపం వెలిగించుకోమని. మీ స్పందనకు నాకు చాలా ఆనందంగా ఉంది చిన్ని గారు. థాంక్యూ.

మురళి చెప్పారు...

సమస్య చూసే దృష్టిని బట్టి కూడా ఉంటుందండీ.. ఇప్పటికీ "ఆ ఉద్యోగం అయితేనే చేస్తాను" అని భీష్మించుకుని కూర్చునే వాళ్ళు ఉన్నారు.. పిల్లలని చిన్న ఉద్యోగాలకి పంపడాన్ని చిన్నతనంగా భావించే తల్లిదండ్రులు ఉన్నారు.. ఇక డబ్బు.. ప్రాధాన్యతా క్రమం లో డబ్బుకి ఎన్నో స్థానం ఇవ్వాలన్నది ఎవరికి వాళ్ళు నిర్ణయించుకోవాల్సిన విషయం.. వారి నిర్ణయాన్ని బట్టే జీవితం సాగుతుంది..

జయ చెప్పారు...

మురళి గారు ధన్యవాదాలండి. నిజమే కదా. ఆ ఉద్యోగమే కావాలి అని భీష్మించుకొని, అది లభించక...దొరికిన వాటితో సర్ధుకో లేక చాలా మంది సతమతమౌతున్నారు. నిరాశానిష్పృహలే తప్ప వేరే ప్రయత్నాలే చేయటం లేదు. ధనానికే ప్రాధాన్యత ఇస్తూ, తమ గౌరవం అందులోనే ఉందని భావించేవాళ్ళు ఉన్నారు. జీవితపు విలువలే మారిపోతున్నాయి. సరయిన పంధాలో స్పందించి, తన కుటుంబంతో ఆనందమయ జీవితానికి ప్రాధాన్యత ఇస్తే బాగుంటుంది.

భావన చెప్పారు...

చాలా బాగుంది జయ మీ టపా. మిస్ అయ్యాను. అవును తృప్తి కి నిర్వచనం మారి పోతోంది. నేను ఎప్పుడూ ఇలానే అనుకుంటూ వుంటా, మా తాత వాళ్ళు పిల్లలు ఎదగాలని మూడూ కాలాలు కష్ట పడే వ్యవసాయం వద్దు అని మా నాన్న పెదనాన్న వాళ్ళను మిరపకాయలు అమ్మి వడ్ల బస్తాలు అమ్మి అప్పటీకప్పుడూ డబ్బు కావాలంటే చదివించారు. మా అమ్మ వాళ్ళు వాళ్ళ జీవితం కంటే పిల్లలు ఇంకా ఎదగాలని మమ్ములను వాళ్ళు ప్రతి పైసా లెక్క చూసుకుని జాగర్త చేసి చదివించి ఇలా రెక్కలు కట్టేరు. మేము మా అబ్బాయి మాకు లా మొదటి జెనెరేషన్ ఇండియన్స్ కు మల్లే ప్రతి దానికి తడూము కోకూడదు అని వాడు ఇంకా ఎదగాలని వో తాపత్రయ పడుతున్నాము. దీనికి అంతమెక్కడరా స్వామి అనిపిస్తుంది నాకు, నాకు తెలిసి మా నాయనమ్మ వున్నంత సంతోషం గా నేను లేను మరి నా కోడలు మనవరాలు వుంటారా.. ఏమో.. అర్రులు చాచి పరుగెడుతున్నాము ఎవడికి తెలుసు.

జయ చెప్పారు...

భావనా, తారాల మార్పు ఈ విధంగా తెలుస్తోంది. కోడలి గురించి భయం వొద్దులే...మనిద్దరికి మంచి కోడళ్ళే వొస్తారని డిసైడ్ అయిపోయాంగా. ఇంక మనవళ్ళు కూడా మంచి వారే. వారి కాలానికి ఎన్ని మార్పులో!!! "ఉందిలే మంచి కాలం ముందు ముందునా"....:( అన్ని తరాలకీ ఇదే పాట.

HarshaBharatiya చెప్పారు...

చాలా బాగా చెప్పారు........

 

మనస్వి © 2008. Template Design By: SkinCorner