13, ఫిబ్రవరి 2010, శనివారం

"అచ్చిపోయిండు"...




ప్రతి రోజు సాయంత్రం పార్క్ లోకి వెళ్ళి కాసేపు వాకింగ్, టాకింగ్ చేయటం నాకలవాటు. అక్కడ బోల్డు మంది ఫ్రెండ్స్. ఒకపట్టాన ఇంటికి పోబుద్ధి కాదు. ఈ మధ్యనే ఆంధ్రా నుంచి కొత్తగా పెళ్ళి చేసుకొని ఇక్కడికొచ్చిన ఒక అమ్మాయి ఇక్కడి భాషతో చాలా ఇబ్బందిగా ఉంది అని చెప్తోంది. ఏంటబ్బా అంత ఇబ్బంది, అని ఆగలేక ఏమయిందేంటి అన్నాను.

ఆ మధ్య ఎప్పుడో ఆఫీస్ కెళ్ళే హడావుడిలో వాళ్ళాయన షూస్ కనిపించలేదట. ఈ అమ్మాయికి కొత్తకదా, పాపం...హడావుడిగా ఇల్లంతా వెతికేస్తోందిట. అయినా ఎక్కడా కనిపించలేదు. వాళ్ళాయనేమొ టైమయిపోయిందని ఏవో ఒకటి వేసేసుకొని వెళ్ళిపోయాట్ట. వాళ్ళత్తగారు ఆమె కొడుకు చికాగ్గా వెళ్ళిపోయేప్పటికి మనసు నొచ్చుకున్నారట. "అందుకే నేనెప్పుడు సెప్తనే ఉంట. ఏడనో దూరం నుండి పిల్లను తోలుకురావద్దు. నా బిడ్డ బిడ్డని చేసుకొమ్మని ఎంత లొల్లిపెట్టినా ఇనలేదు.ఆడేమో, ఊకె నువ్వూకో, నువ్వూకో అంటడు. అదైతే, మంచిగ ఆర్చుకునేది. అన్నీ జల్ది సేయకుంటె ఎట్లైతది. ఏడున్నాయో సరిగ్గా దేవులాడు...అన్నారట."

ఆ మాటలన్నీ విన్నాక ఆ అమ్మాయికి అయోమయంతో ఇంకా గాభరా పెరిగిపోయిందిట. ఒక్క ముక్క కూడా అర్ధం కాలేదు ఎలాగండీ...అని దిగులు పడిపోయింది. అది విని అక్కడి వాళ్ళంతా ఒకటే నవ్వటం. ఆ నిమిషం లో నవ్వొచ్చినా, తరువాత ఆయ్యో, పాపం అనిపించింది. అనేక ప్రాంతాల్లో రకరకాల భాషలు కదా! అంతా తెలుగే...కాని ఎంత తేడానో!!! అందరూ ఆ అమ్మాయికి ఏవేవో సలహాలు చెప్తున్నారు. మెల్లగా నా మనసు మాత్రం గతం లోని నా అనుభవాన్ని తలచుకోటం మొదలు పెట్టింది.

నేను అప్పుడే నా రిసెర్చ్ అయిపోయి, థీసిస్ సబ్మిట్ చేసి హైద్రాబాద్ లో మా అత్తగారింటి కొచ్చాను. అప్పుడే నేనెంతో ఇష్టపడే ఉద్యోగం కూడా దొరికింది. ఒక పక్క ఇంట్లో కొత్త బాధ్యతలు.ఆ టైం లో ఇంట్లో ఎవరూ లేరు. హాయిగా, నా ఉద్యోగం లో నా కలలెలా నేరవేర్చుకోవాలో ఆలోచించుకుంటూ ఊహాలోకంలో కెళ్ళిపోయాను.

ఇంతలో టక్...టక్...టక్...మని తలుపు చప్పుడినిపించింది. ఎవరా అని ఆలోచిస్తూ తలుపు తీసాను. శ్రీ కృష్ణ పరమాత్ముడి స్టైల్లో దీవిస్తున్నట్లుగా చేయెత్తి మళ్ళీ తలుపు మీద కొట్టబోతున్నాడొకాయన. అక్కడున్నాయనెవరో నాకు తెలీదు. ఎవరు కావాలండీ అని మెల్లగా అడిగాను.

ఆ వొచ్చినాయన "పెద్దయ్యున్నడా?" అనడిగాడు. లేరండి ఏదో పనిమీదెళ్ళారు అన్నాన్నేను.
"అరె, బయటకు పోయిండా! మల్ల నన్ను గిప్పుడే రమ్మన్నడు గందా! అయితె మానె, దొరొచ్చినంక గిట్లా అయితోలు సర్పంచి అచ్చిపోయిండని సెప్పుండ్రి. మళ్ళ ఒకటే ఒర్లుతడు. ఆడ బస్సుల కాడేమో పొద్దుగాల నుండె నూకుతుంటరు. నేను దబ్బున పోకుంటే ఊర్ల లొల్లి పెడ్తరు. ఊకె జబ్బర్దస్తి చేస్తుండ్రు. పుర్సత్ లేకుండైంది." అనేసి గబగబా వెళ్ళిపోయాడు.

తలుపు మూసి లోపలికి ఒస్తున్న నాకు ఇంతకీ ఆ వొచ్చిన వ్యక్తి ఎవరో ఏమిటో, అడగలేదే? ఎక్కడినుంచి ఒచ్చాడో ఏవిటో...ఇప్పుడేం చెప్పాలి నేను. అసలే ఆయన మాట్లాడింది గందరగోళంగా నాకేమి అర్ధం కాలేదు.

మా మామగారు రాగానే, మధ్యాన్నం ఒకాయన ఒచ్చారు. అయితోలు సర్పంచి చచ్చిపోయాడని చెప్పమన్నారు. అని జాగ్రత్తగా విన్న మాటలను గుర్తు చేసుకుంటూ చెప్పాను.

మా మామగారు ఒక్క సారిగా గాభరా పడిపోయారు. మా అత్తగారితో అదే మాట చెప్పారు. "అయ్యయ్యో! చాలా మంచి వ్యక్తి. కపటం లేనివాడు. నేనంటే ఎంతో గౌరవం. నేనక్కడ లేకపోయినా పొలాలన్నీ చాలా శ్రద్ధగా చూసుకుంటాడు. ఏదో నాలుగు మంచి పనులు చేద్దామని, మంచి పేరు సంపాదించుకుందామని అంటూ ఉంటాడు. వయసు కూడా ఎక్కువ లేదు. అప్పుడే పోయాడా! చూట్టానికి బాగానే ఉంటాడే? ఏ జబ్బులు గట్రా ఉన్నట్లు లేవు" అన్నారు. అని నిజంగానే చాలా బాధపడ్డారు. మా అత్తగారితో బయలు దేరండి. మనం తొందరగా వెళ్ళాలి. అబ్బాయి ఊర్లో లేడుగా, తరువాత చెప్పొచ్చులే. అమ్మాయ్, నువ్వు కూడా పదా. అందరం పోకపోతే బాగుండదు, అన్నారు. నాకు చాలా భయమేసింది. అప్పటివరకు నేను చనిపోయిన వాళ్ళను చూడలేదు. అయినా తప్పదుగా! అందరం బయలు దేరాం.

ఊరికి చేరేటప్పటికి తెల్లగా తెల్లారిపోయింది. సర్పంచి గారి ఇంటిముందు ఎటువంటి హడావుడి కనిపించలేదు. చక్కగా కళ్ళాపి చల్లి పెద్ద పెద్ద ముగ్గులు పెట్టిఉన్నాయి. మేము వాళ్ళ ఇంటిముందు కారు ఆపేటప్పటికి, అప్పటివరకు మా కార్ వెనకాలే పరిగెత్తుకొస్తున్న ఊరిపిల్లలంతా కార్ పట్టుకొని వేళ్ళాట్ట౦ మొదలుపెట్టారు. మా డ్రైవర్ కి౦దున్నకట్టెపుల్లల్ని ఏరి వాళ్ళమీద బాణాల్లాగా ప్రయోగి౦చట౦తో వాళ్ళు కాస్తా పారిపోయారు. అందరం మెల్లిగా కార్ దిగాం. వె౦టనే చల్లటి పిల్లగాలి పలకరించింది. ఇంటిలోపలినుంచి చక్కటి పల్లెపదాలినిపిస్తున్నాయి. వంటల ఘుమఘుమలు కూడా మమ్మల్ని పలకరించాయి. ఇంతటి మామూలు వాతావరణం చూసి మాకు చాలా అశ్చర్యమేసింది. మెల్లిగా ఇంట్లోకి అడుగుపెట్టాం.

లోపలికి వెళ్ళాం. అక్కడ కుర్చీలో కాళ్ళుచాపుకొని, కళ్ళు అరమోడ్పుతో, బారెడు పొడుగున్న లావుపాటి చుట్ట కాల్చుకుంటు,తన్మయత్వం లో,చేత్తో కుర్చీ మీద దరువేస్తూ, ముసిముసి నవ్వులతో పరవశమౌతు నిన్న మాయింటికొచ్చినాయన కూర్చోని ఉన్నాడు.

ఆయన్ని చూసిన మా అత్తగారు, మామగారు బిత్తరపోయారు. ఒక్కసారిగా మమ్మల్ని చూసిన ఆయన కూడా బిత్తరపోయాడు. అలా ఒకరినొకరు బిత్తరచూపులు చూసుకుంటూ చాలా సేపే ఉన్నారు. ముందుగా ఆయనే బిత్తరచూపులు ఆపి, అయ్యో, మీరే వొచ్చిండ్రా దొరా. నిన్ననే మీ ఇంటికాడకొచ్చిన. చిన్నమ్మను కూడా తోలుకొచ్చిండ్రా. నేనే మళ్ళ అస్తుంటి గందా! అన్నాడు.

మా మామగారు వెంటనే తేరుకున్నారు. ఏమయ్యా సర్పంచి ఎలా ఉన్నావ్. మనూరు ఒకసారి చూద్దామని మేమందరం ఒచ్చాం, అన్నారు. వెంటనే నా కర్ధమైంది. మా ఇంటికొచ్చినాయనే సర్పంచి అని. ఒక్కసారిగా ప్రప౦చమ౦తా గిరగిరా తిరగిపోతో౦ది. దిక్కులు మరిచిపోయిన నా కళ్ళు టుయ్ టుయ్ మని ఆడుతూ నిట్టనిలువుగా నిలిచి పోయాయి. మా అత్తగారే, చల్లబడిన నా చేయి గు౦జి కుర్చీలో కూలేసారు. ఆవిడకి అర్ధమైపోయి౦ది, నేను ఎక్కడోపప్పులో కాలేసానని, అ౦దుకే ఆ ఊరి ను౦చి జుయ్యిన జారి ఈ ఊరికొచ్చామని.

ఇంతకీ, ఆ సర్పంచి తను ఒచ్చి వెళ్ళినట్లుగా చెప్పమన్న "అచ్చిపోయిండని" చెప్పమన్న మాట నాకు "చచ్చిపోయాడని" అర్ధమవటంతో వొచ్చిన తిప్పలివన్నీ. హతవిధీ! ఇదంతా నా భాషా పరిజ్ణానం వల్ల ఒచ్చిన ప్రమాదమే కదా! ఈ "తారే జమీన్ పర్" గ౦దరగోళ౦ ను౦చి ఎలా బయట పడాలి? అప్పటినుంచి ఆశావాదినై, నిరుత్సాహ పడక ఎంతో పట్టుదలతో శ్రమించి భాషమీద పట్టు సంపాదించాను.హు...ఏం లాభం...ఇంత కష్ట పడ్డా ఇప్పటికీ ఉన్నాయనుకోండి కొన్ని సమస్యలు.

నెహ్రూ గారు చెప్పినట్లు ఆశావాది గులాబీని చూస్తే, నిరాశావాది దానికింద ముల్లుని చూస్తాడట. ఇదే సంగతి మా పార్క్ లో ఆ అమ్మాయికి కూడా చెప్పాను. చూడాలి, ఆ అమ్మాయి ఎలా నిలదొక్కుకు౦టు౦దో మరి!!!...



.....తెలుగు జాతి మనది, నిండుగ వెలుగు జాతి మనది.....


*************************************************************************

17 కామెంట్‌లు:

రాము చెప్పారు...

మన తెలుగు లొ అందరు చాలా చిత్ర విచిత్రంగా మాట్లాడుతుంటారు! నేను ఇలాంటి అనుభవాన్ని చవిచూసాను.

నాగప్రసాద్ చెప్పారు...

మా తెలంగాణా ఫ్రెండ్స్ కొద్దిమంది, వాళ్ళ భాష మాట్లాడుతున్నప్పుడు మొదట్లో నేను కూడా ఇబ్బంది పడ్డాను. తర్వాత్తర్వాత నా భాషలోకి కూడా తెలంగాణా పదాలు వచ్చాయి. :))

శేఖర్ పెద్దగోపు చెప్పారు...

భాష అర్ధం కాకపోవటం వల్ల ఎంత పొరపాటు జరిగింది మీ విషయంలో...
హైదరాబాదే కాకుండా మిగిలిన ప్రాంతాల్లో చిన్న చిన్న పల్లెటూళ్ళకి వెళ్ళినప్పుడు కూడా అక్కడ వాళ్ళ భాష అర్ధం అవ్వటానికి కొంచెం టైం పడుతుందండి ఎవరికైనా. కాకపోతే భాష మీద ఏవగింపు/చిన్నచూపు తెచ్చుకోకుండా నేర్చుకోడానికి/తెలుసుకోడానికి ప్రయత్నిస్తే సులువుగానే అధిగమించొచ్చనుకుంటా.

SRRao చెప్పారు...

జయ గారూ !
ఎంత భాషా పండితులకైనా జానపదుల మాండలికాలతో ఇబ్బందులు తప్పవు. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క మాండలికం. అర్థం చేసుకోవడానికి సమయం పడుతుంది మరి ! అచ్చమైన, స్వచ్చమైన భాష. అర్థం చేసుకోగలిగితే వాటిలో అందం కనబడుతుంది.

Tirupati చెప్పారు...

చెత్త తెలుగు పుస్తకాల వల్ల నేను మా యాస ని సరిగా ఆస్వాదించలేక పొతున్నా.. మా వాళ్ళ తెలుగు ఎంత అందం గా ఉంటుంది... మాది వరంగల్ అయినా కరీం నగర్ బాబాయ్ వాళ్ళింటికి వెళ్ళినపుడు... ఆయన గట్ల గట్ల అన్నప్పుడు గిట్లకెల్లి .. గాడికెల్లి అన్నప్పుడు.. విని ఎంతగానో పులకరించిపోయా... ఈ చెత్త కామన్ తెలుగు వల్ల నేను మాత్రం వాళ్ళలో ఒకడిని కాలేకపోతున్నా...

రాధిక(నాని ) చెప్పారు...

మా ఊరు తూర్పు నుండి(ఉత్తరాంద్రా) ఈమద్య పొలంపనులు చేయడానికి చాలామంది వలస వస్తున్నారు . వాళ్లమాటలు ఇలాగే ఉంటాయి .సగమర్దమవుతుంది ,సగమర్దమవదు .గబగబా మాట్లాడేస్తూ ఉంటారు .మళ్ళీ రండోసారి అడిగతేనేగానీ అర్దమవదు . కానీ వాళ్ళమాటలువింటుంటే చాలా సర్దాగా ఉంటుంది .

మురళి చెప్పారు...

కొత్తలో ఇబ్బంది ఉన్నా, నేర్చుకోడం పెద్ద కష్టమేమీ కాదండీ.. నాకు చాలా వరకు అర్ధమవుతాయి.. చిన్న చిట్కా ఏమిటంటే, అవతలి వాళ్ళు మాట్లాడేటప్పుడు వాళ్ళ ఎక్స్ ప్రెషన్స్ గమనించడం.. దీనివల్ల విషయం పూర్తిగా అర్ధం కాకపోయినా, వాస్తవానికి దగ్గరగా వెళ్ళగలుగుతాం :):)

సవ్వడి చెప్పారు...

నేను కూడా హైదరాబాద్ వచ్చిన కొత్తలో చాలా ఇబ్బంది పడ్డాను. పెద్ద సమస్య ఏంటంటే సగం హిందీ పదాలు మాట్లాడుతారు. ఈమధ్యనే మా ఆఫీస్ లో " శనివారం బంద్ కదా!" అన్నాడు. "ఇప్పుడెందుకు బంద్ " అన్నాను. "అదే ఆఫీస్ లేదు కదా!" అన్నాడు. సెలవుకి బంద్ కి తేడా తెలీదురా అని మనసులోనే తిట్టుకున్నాను.

శిశిర చెప్పారు...

బాగుందండి మీ అనుభవం. :)

జయ చెప్పారు...

రాము గారు, అందరికీ ఏదో ఒక టైం లో ఇలాంటివి ఎదురవుతూనే ఉంటాయనుకుంటా. థాంక్యూ.

నాగప్రసాద్ గారు, అంతేనేమో మరి. మనమెక్కడుంటే అక్కడి భాషా ప్రభావం మనమీద పడక తప్పదు. ధన్యవాదాలు.

జయ చెప్పారు...

శేఖర్ గారు, నిజమేనండి. తెలుగు ఎన్నిరకాలో వివిధ ప్రాంతాల్లో మనకి అర్ధమైపోతుంది. రకరకాల తెలుగు తెలుసుకోటం కూడా సరదాగానే ఉంటుంది కదండీ. థాంక్యూ.


రావ్ గారు మీరు చెప్పింది కరెక్ట్. అన్ని ప్రాంతాల భాషలు అందంగానే వినిపిస్తాయి. థాంక్యూ.

జయ చెప్పారు...

తిరుపతి గారు మీ బాధ అర్ధం చేసుకోగలనండి. ఏదైనా మిస్ అవుతే నిజంగా ఎంత బాధో కదా! మీ స్నేహితులతో మీ కిష్టమైన భాషలో మాట్లాడండి. వాల్లు కూడా సరదాగా నేర్చుకుంటారు.


రాధిక గారు, పొలం పన్లు చేసుకుంటు వాళ్ళు పాడే పాటలు, మాటలు ఎంతబాగుంటాయొ. వాళ్ళ దగ్గిర నేను కొన్ని పల్లెపదాలు నేర్చుకున్నాను. వాళ్ళు కూడా చాలా సరదాగా మనతో కలిసిపోతారు. ముచ్చటేస్తుంది.

జయ చెప్పారు...

మురళి గారు మీ చిట్కా బాగుందండి. కాని చాలా మంది ముఖకవళికలు కూడా గమ్మత్తుగానే పెడ్తారు. కాని క్రమక్రమంగా భాష తెలుసుకుంటున్నా కొద్దీ సరదాగానే ఉంటుందిలెండి. ఇప్పుడు ఆల్మోస్ట్ ఇటువంటి భాషే నేను కూడా వాడేస్తున్నాను:) థాంక్యూ.


సవ్వడి గారు బంద్ గురించి మీ అనుభవం చదువుతుంటే నవ్వొస్తుంది. పర్లేదు నా లాంటి అనుభవాలు మీకు కూడా ఉన్నందుకు ఇప్పుడు నాక్కూడా తృప్తిగా ఉంది.:)

శిశిరా! థాంక్యూ.

ప్రణీత స్వాతి చెప్పారు...

జయగారూ..నవ్వాపుకోలేకపోయానండీ..(నవ్వానని ఏమి అనుకోకండి) చాలా బాగుంది టపా. నేను ఇక్కడే (హైదరాబాద్) పుట్టి పెరిగినా నాకూ అర్ధం కాక చాలా సార్లు ఇలాగే అవస్థ పడ్డానండీ.

భావన చెప్పారు...

సరే నాకు కొత్త లో రోజు ఒక పెద్ద కొస్చన్ మార్క్ మొహమే మా వర్క్ లో లంచ్ టేబుల్ దగ్గర.. ఈ వర్క్ లో అందరు (అంటే మనోళ్ళు) తెలంగాణా వాళ్ళే... ఇలానే ఏదో ఒక పంచ్ వదులుతారు, ఇండియాలో తెలంగాణా తో పరిచయం లేని నా మొహం ఎప్పుడూ తెల్ల మొహమే.. మొత్తానికి జయ చంపేసేరన్నమాట సర్పంచ్ గారిని ;-)

తృష్ణ చెప్పారు...

నాక్కూడా ఈ భాష అస్సలు అర్ధం కాదండీ..చిత్రం ఎంతంతే స్కుల్నుంచి వచ్చి మా అమ్మాయి ఆమె వెళ్తది,ఈమె వస్తది అంటూంటే ఇప్పటిదాకా తెలుగువాళ్ళైయ్యుండీ ఈ భాషేమిటి అని అందర్నీ వేళాకోళం చేసే నేను బుర్ర గోక్కుంటున్నాను ...బాబోయ్ అని.. వీలైనన్ని సార్లు దాని భాషను కరక్ట్ చేస్తూనే!

జయ చెప్పారు...

ప్రణీత గారు, అనుకోటానికేముందిలెండి. మీకూ అనుభవమే అంటున్నారుగా:)

ఏం చేయాలి భావనా పరిస్థితి అలా వొచ్చి సర్పంచి ని చంపేయాల్సొచ్చింది.

తృష్ణా! హైద్రాబాద్ లో ఉండి భాష కరెక్ట్ చేయాలనుకోటం పొరపాటే. గొంగళ్ళో భోంచేస్తూ వెంట్రుకలు ఏరేసినట్లే ఉంటుంది. అయినా, ఏభాష అందం దానిదే.

 

మనస్వి © 2008. Template Design By: SkinCorner