5, అక్టోబర్ 2009, సోమవారం

"బుర్రలేని పిల్ల"

మా ఇంటినుంచి కాలేజ్ కి నడచి పోతే అయిదు నిముషాలే. అదే కొంచెం దిక్కులు చూసుకుంటు పోతే పది నిముషాల టైం పడుతుంది. ఆ రోజు అలాగే దిక్కులు చూసుకుంటు పోతున్నాను. అది చాలా పీక్ టైం. మా కాలేజ్ దగ్గర ఒక బస్స్టాప్ ఉంది. కాలేజ్ పిల్లలు దిగుతారని కొంచెం కాలేజ్ గేట్ దగ్గిరే బస్సులు ఆపుతుంటారు. కరెక్ట్ గా నేను ఒచ్హే టైం కి అక్కడ ఒక బస్ ఆగిఉంది. చాలా మంది పిల్లలూ, పెద్దలూ తోసుకుంటూ ఎక్కుతున్నారు. ఆ రష్ లో పోవటమెందుకు, బస్ వెళ్ళేదాక ఒక పక్కకుందామని, బస్స్టాప్ దగ్గిరే నించున్నాను.

బస్ వెళ్ళిపోయింది. హమ్మయ్యా! ఇంక వెళ్ళి పోవచ్హు అని అక్కడినుంచి బయలు దేరాను. కాని అక్కడినుంచి ముందుకు వెళ్ళలేక పోయాను. ఒక పదేళ్ళ అమ్మాయి అక్కడే నుంచోని ఏడుస్తోంది. స్కూల్ యూనిఫార్మ్ లో, చేతికి స్కూల్ బాగ్ తగిలించుకొని ఉంది. దగ్గరికి వెళ్ళి ఎందుకు పాపా! ఏడుస్తున్నావు అని అడిగాను. బస్ వెళ్ళి పోయింది అని వెక్కి వెక్కి ఏడుస్తోంది. అయ్యో! చిన్న పిల్ల బస్ ఎక్క లేక పొయిందేమొ, ఇంత రష్ ల్లో చిన్న పిల్లలని అలా ఒంటరిగా ఎందుకు పంపుతారా అని ఒక నిముషం తల్లి,తండ్రుల మీద కోపం ఒచ్హింది. అయినా నా కోపానికి అది టైం కాదు. ఏడవకు నేను ఇంకో బస్ ఎక్కిస్తాలే అన్నాను. ఇంతలోనే నా చూపు అక్కడే కింద పడిపోయిన ఆ అమ్మాయి టిఫిన్ డబ్బా మీద పడింది. బస్ ఎక్కే తొందరలో చేతిలోనుంచి ఆ డబ్బా జారి కింద పడిపోయినట్లుంది. డబ్బా మూత విడిపోయి అందులోని పూరీలు, కూర కింద మట్టిలో పడి పోయాయి. నాకా అమ్మాయి ని చూస్తే జాలేసింది. ఒక పక్క స్కూల్ టైం అయిపోతుంది. పోన్లే పాపా, ఏడవకు, ఇదే మా కాలేజ్, లోపలికి రా, మా కాంటీన్ లో ఏదైనా నీ బాక్స్ లోకి తీసుకొని పోదువు గాని అన్నాను. ఆ అమ్మాయి అందుకు ఒప్పుకోలేదు. మా అమ్మ ఎవ్వరూ తెలియని వాళ్ళతోటి వెళ్ళద్దంది, అంది. నిజమే, పిల్లలకి ఆమాత్రం జాగ్రత్తలు ఈ రోజుల్లో తప్పని సరిగా చెప్పాల్సిందే.

నేను స్కూల్ కి వెళ్ళాలి అని మళ్ళీ ఏడుపు మొదలు పెట్టింది. సరే! మీ స్కూల్ ఎక్కడో చెప్పు, నేను ఆటో లో దింపుతాను, మీ స్కూల్లోనె ఏమన్నా కొనుక్కుందువు కాని అన్నాను. దీనిక్కూడా ఒప్పుకోలేదు. మా అమ్మ ఎవ్వరితోటి ఆటోల్లో పోవద్దంది అంది.
కరెక్టే, అదికూడా నిజమే! మరైతే ఎలాగా, ఇప్పుడేమి చేయాలి. ఆ అమ్మాయికి నా మీద నమ్మకం కుదిరితే ఒస్తుందేమొ! అనుకున్నాను. మీ ఇంటికి ఫోన్ చేసి మీ అమ్మ తోటి అసలు సంగతి చెప్పుదాం. మీ ఫోన్ నెంబర్ చెప్పు అన్నాను. ఒద్దు, మా అమ్మ తిడుతుంది. నేను ఒక్కదాన్నే స్కూల్ కి వెళ్ళిపోతాను, అని నడుచుకుంటూ వెళ్ళిపోతోంది.
వెంటబడి ఆ అమ్మాయి ని బలవంతానా ఆపాను. ఎంత దూరమని ఇలా నడిచిపోతావు. ఇప్పటికే ఆలస్యమైపోయింది. ఇక్కడ బస్ ఎక్కటానికి ఒచ్హావు కదా, మీ ఇల్లు దగ్గిరిలోనే ఉందా! ఇంటికెళ్ళిపో అన్నాను. కాదు, మా ఇంటిదగ్గర బస్ దొరక లేదు, అందుకే ఇక్కడిదాకా నడుచుకుంటూ ఒచ్హాను, అంది. ఒక నిమిషం నాకు ఏమి తోచలేదు.

ఈ అమ్మయిని ఇలా ఒదిలేస్తే లాభం లేదనిపించింది. చూడూ, నువ్వింక ఏమి మాట్లాడకు, మీ ఇంటి అడ్రస్ చెప్పు. నేను నిన్ను ఇంటిదగ్గర దింపికాని వెళ్ళను. నేను నీకంటే చాలా మొండిదాన్ని, అన్నాను. నేను ఆడదాన్నే కదా, కాబట్టి నువ్వు భయపడాల్సిన పనిలేదు, అని నచ్హచెప్పటానికి ప్రయత్నించాను. ఊహు, ఈ ప్రయత్నం కూడా ఫలించలేదు. మా అమ్మ ఆడవాళ్ళు పిల్లల్ని ఎత్తుకుపోయి అమ్మేస్తారు, ఆడవాళ్ళతోటి ఎక్కడికీ పోకు అని చెప్పింది, అంది. ఇన్ని జాగ్రత్తలు చెప్పిన వీళ్ళ అమ్మని నిజంగానే మెచ్హుకోవాలి.

ఇంకేం చేయాలి మరి. ఆ అమ్మాయిని అలా ఒదిలి వెళ్ళటానికి మనస్సంగీకరించటం లేదు. ఇంక లాభం లేదు, సామ, దాన, భేద, దండోపాయాలు ఉపయోగించాల్సిందే, అనుకున్నాను. నువ్విలాగే మొండితనం చేసావంటే నిన్ను పోలీస్ స్టేషన్ లో అప్పగించి వెళ్ళిపోతాను. వాళ్ళే చూసుకుంటారు. మీ అమ్మ పోలీస్ స్టేషన్ కి వెళ్ళద్దని చెప్పినా సరే! అన్నాను.

ఆ అమ్మాయి ఒక నిమిషం భయపడ్డట్లు కనిపించింది. ఇంకలొంగుతుందిలే అనుకున్నాను. ఇంక తప్పదనుకుందేమొ! వాళ్ళ ఇల్లు చూపిస్తానంది. కిందబడ్డ ఆ అమ్మయి టిఫిన్ బాక్స్ తీసి ఆమె బాగ్ లో పెట్టేసాను. అప్పటికే నాకు కూడా లేట్ అయిపోయింది. మా ప్రిన్సిపల్ కి నేను లేట్ గా ఒస్తానని ఒక ఫోన్ చేసి, ఆ అమ్మాయి ని వెంటబెట్టుకొని బయలు దేరాను. ఆటో పిలిచి మీ ఇల్లు ఎక్కడ అని అడిగాను. ఎందుకో గాని ఆ అమ్మాయి ఒక నిముషం అలోచనలో పడింది. నేను మళ్ళీ పిలిచే టప్పటికి ఠక్కున ముషీరాబాద్ అంది. సరే, ఇద్దరం ఆటోలో బయలుదేరాము. ఆ అమ్మాయి ఏదో అలోచనలొ ఉన్నట్లుగా అనిపించింది నాకు. ఒక నిముషం ఆ అమ్మాయి ని పలకరించాలని, నీ పేరేంటి, ఏ క్లాస్, ఏ స్కూల్ అని అడిగాను. కాని ఆ అమ్మాయి ఏమి పట్టించుకోకుండా చాలా ఉదాసీనంగా మారిపోయింది. నాకేం అర్ధం కాలేదు. ఏంటి ఈ అమ్మాయి అనుకున్నాను. పొన్లే చిన్న పిల్ల వాళ్ళ ఇంట్లో అప్పచెప్పేస్తే చాలనిపించింది.

ముషీరాబాద్ ఒచ్హింది. ఆటో స్లో చేయించి, వాళ్ళ ఇల్లు ఎటువైపో చూపించమన్నాను. కాసేపు అటూ, ఇటూ దిక్కులు చూసింది. నాకు ఒక నిమిషం భయం వేసింది. ఈ "బుర్ర లేని పిల్ల" ఇల్లు మరచిపోలేదు కదా అనిపించింది. నా మొహం చూసి ఏమనుకుందో ఏమో, ఒక ఇంటిముందు ఆపించి ఇదే మా ఇల్లు అంది. పోన్లే , ఇల్లు చూపించింది, అదే చాలు అనుకొని, దిగి ఆటో ని పంపించేసాను. ముందుకు వెళ్ళి ఆ ఇంటి కాలింగ్ బెల్ నొక్కాను. అది ఇండిపెండెంట్ హౌస్, ఇంటిముందు మంచి పూల మొక్కలు కూడా ఉన్నాయి. ఇల్లు చాలా బాగుంది అనుకున్నాను.

ఇంతలో ఒకావిడ తలుపు తెరిచి నా వైపు చాలా అనుమానంగా చూసింది. ఈ పిల్లకి తల్లి పోలికే ఒచ్హినట్లుంది అనుకున్నాను. ఇంక ఆమె చూపులు భరించ లేక, మీ అమ్మాయండి, బస్ తప్పిపోయి ఏడుస్తుంటే తీసుకొచ్హాను. పాపం ఏమి అనకండి, లొపలికి తీసుకు పోయి ఏమన్నా పెట్టండి అన్నాను. ఆమె నన్నో పిచ్హిదాన్ని చూసినట్లు చూస్తూ, 'ఎవరు! ఏ అమ్మాయి ' అని అడిగింది. ఇదిగోండి! మీ అమ్మాయె, అని పక్కనే ఆ అమ్మాయిని చూపించ పోయాను. కాని అక్కడ ఆ అమ్మాయి లేదు. అరె ఈ లోపలే ఎక్కడికి వెళ్ళిపోయింది అని చుట్టూ చూసాను. కాని కనిపించలేదు. 'ఎవరమ్మా నువ్వు, పొద్దున్నే మా ఇంటికొచ్హి గొడవ ఏంటి! ఏ పిల్ల, మాకు అసలు అమ్మాయిలే లేరు. నేను చాలా పనిలో ఉన్నాను. దొంగతనాలకి రకరకాల దార్లు, చూస్తే గొప్పగా కనిపిస్తున్నావు, ఈ బుద్ధేంటి నీకు, ముందిక్కడినుంచి వెళ్ళిపో ' అని నామీద అరవటం మొదలు పెట్టింది.

నేనెక్కడున్నానొ, అసలేం జరుగుతోందో అర్ధం గాని అగమ్య గోచర పరిస్థితిలో పడిపోయాను. ఇంకా నమ్మలేక ఆ ఇంటి చుట్టూ చూసుకుంటూ బయటికి ఒచ్హాను. ఇంటిముందూ నిలబడి చాలా దూరం వరకు మెడ సారించి మరీ చూసాను. కాని ఆ అమ్మయి కనిపించలేదు. అసలు ఒక్క నిముషంలో అంతలా కనిపించకుండా ఆ అమ్మాయి ఎలా మాయమైందో నాకేమి అర్ధం కాలేదు. మెల్లగా అలోచించుకుంటు, ఒక ఆటో చూసుకొని వెళ్ళిపోయాను. నా కదేదో ఒక మిస్టరీ పిక్చర్ చూస్తున్నానా, అన్న ఫీలింగ్ కలిగింది. జరిగింది తలచుకుంటుంటే అసలు నమ్మలేక పోయాను. మెల్లగా నా రొటీన్ లో పడిపోయాను.

కాని ఈ కథ కు ముగింపు అది కాదని తొందరలోనే నాకు అర్ధమయ్యింది. పది రోజుల తరువాత నేను కొఠీ కి ఏదొ షాపింగ్ కోసం వెళ్ళాను. ఒక షాప్ లోనుంచి బయటికి ఒస్తుంటే ఒక చిన్న పిల్ల ఒక రేకుడబ్బా నా ముందు పెట్టి అడుక్కుంటోంది. నేను తలెత్తి చూసాను. ఆ అమ్మయిని ఎక్కడో చూసినట్లనిపించింది. చినిగిపోయి, మాసిపోయిన బట్టలు, దుమ్ముకొట్టుకొని పోయిన చింపిరి జుట్టు .... అయినా, ఆ అమ్మాయి ని నేను గుర్తు పట్టాను. ఎవరో కాదు, ఆ రోజు బస్ తప్పిపోయి నన్ను ముప్ప తిప్పలు పెట్టిన పిల్ల. ఆ అమ్మాయి కూడా నన్ను చూసి వెంటనే గుర్తు పట్టినట్లుంది. మా ఇద్దరికీ కూడా అది ఒక పెద్ద షాకే.

పారిపోబోతున్న ఆ అమ్మాయి ని ఆపి, మెల్లగా విషయం కనుక్కోటానికి ప్రయత్నించాను. ఈ సారి ఆ అమ్మాయి ఏమాత్రం వ్యతిరేకించకుండా నాకు అన్ని విషయాలు వివరంగా చెప్పటం మొదలు పెట్టింది. ఒక్కొక్కటి వింటున్న కొద్దీ నా కాళ్ళకింద భూమి కదిలి పోతోందా! అనిపించింది. సినిమాల్లో ఫ్లాష్ బాక్ లాగా ఆ అమ్మాయి చెప్పే కథ నా కళ్ళ ముందు గింగిరాలు తిరుగుతూ పోయింది.

అసలు ఆ అమ్మయికి ఎవరూ లేరు. ఒక అనాధ. ఎక్కడ పుట్టిందో తెలియదు. ఒంటరిగా బజార్లల్లో అడుక్కొంటు, దొరికింది తిని, ఎక్కడో పడుకుంటు, దుర్భర జీవితం గడుపుతోంది. ఆ అమ్మయి, రోజూ బస్ స్టాండ్లల్లో స్కూల్కి పోతున్న పిల్లలను చూసి, తనుకూడా, వాళ్ళలాగే, స్కూల్ డ్రెస్స్ వేసుకొని, స్కూల్ బాగ్ తో, స్కూల్కి పోవాలి అన్న కొరిక విపరీతంగా పెంచుకుంది. దాని పరిణామమే జరిగిన ఈ కథంతా కూడా. అక్కడే ఫుట్పాత్ మార్కెట్ మీద కొన్ని షాప్స్ లో మెల్ల మెల్లగా, ఒక డ్రెస్స్, బాగ్, బాక్స్ మొదలైనవి దొంగతనం చేసింది. ఆ రోజు తన కోరిక తీర్చుకోటానికి ఒచ్హి అనుకోకుండా నా కళ్ళ బడింది. పసి తనం లోని ఆ అమాయకత్వం నా కంట నీరు తెప్పించింది. అన్ని విషయాలు తెలుసుకున్నాక ఆ అమ్మయిని అలా వొదిలి వెళ్ళిపోవటం మానవత్వం కాదు అనిపించింది. ముగిసి పోయింది అనుకున్న ఈ కథ మొదటికొచ్హింది. నా బాధ్యతను గుర్తు చేసింది.

అక్కడే షాప్ లో లక్ష్మి (ఈ సారి తన పేరు లక్ష్మి అని చెప్పింది. తనే పెట్టుకుందిట ఆ పేరు) కి రెండుజతల బట్టలు కొన్నాను. అక్కడినుంచి మా ఇంటికి పోయాం. మా అత్తగారు నా చీర మీద ఎంబ్రాయిడరీ చేస్తూ ఉన్నారు. జరిగిందంతా చెప్పాను. ఆవిడా జాలి పడ్డారు. కాని ఏదో ఒక దారి చూడాలి కదా అన్నారు. ఔను, లక్ష్మి కి ఒక దారి చూడాలి. చాలా అలోచించాను.

నాకు తెలిసిన "స్నేహాలయం" అని ఒక అనాధ శరణాలయం ఉంది. అది కేవలం ఆడ పిల్లలకి మాత్రమే. వాళ్ళు ఆడపిల్లలని 10త్ క్లాస్ వరకు చదివిస్తారు. ఈ లోపల ఆ పిల్లలు వేరే ఏదో ఒక వృత్తి విద్యను కూడా నేర్చుకుంటారు. ఆ తరువాత వాళ్ళు శరణాలయం ఒదిలేసి వెళ్ళిపోయి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బ్రతకాలి. నేను అప్పుడప్పుడు అక్కడికి వెల్తూనే ఉంటాను. లక్ష్మి ని అక్కడ చేర్పిస్తే బాగుంటుంది అనిపించింది. అంతే, వెంటనే ఆచరణలో పెట్టేసాను.

ఇంకా లక్ష్మి అక్కడే ఉంది. ప్రస్తుతం 4త్ క్లాస్ చదువుకుంటోంది. నేనెప్పుడు వెళ్ళినా వెంటనే వొచ్హేస్తుంది. నేను తీసుకెళ్ళిన చాక్లెట్స్, స్వీట్స్ అన్నీ తనే మిగతా పిల్లలకి పంచుతుంది. చక్కగా సంగీతం నేర్చుకుంటోంది. రోజు ఒక గంట ఇప్పటినుంచే అన్ని రకాల బట్టలు కుట్టటం నేర్చుకుంటోంది. అక్కడి కిచన్ లో చురుకుగా పనిచేస్తూ ఉంటుంది. తోటలొ చెట్లకి నీళ్ళు పోస్తూ ఉంటుంది. చిన్న పిల్లలకు పద్యాలు నేర్పిస్తుంది. నేను తీసుకుపోయె చందమామ కథలు వాళ్ళకు చెప్ప్తుంది.

ఇంత చురుకుగా ఉన్న లక్ష్మి ని చూస్తుంటే ఒకప్పటి లక్ష్మి తను కాదేమొ! అనిపిస్తుంది. ఒక ఆడపిల్ల జీవితం ముళ్ళకంప మీద పడిపోయి, చిందరవందర అయిపోకుండా ఆ దేవుడు ఒకదారి చూపించినందుకు నేనెప్పుడూ సంతోషిస్తు ఉంటాను. ఎంతో శుచీ-శుభ్రతతో, మంచి- మర్యాదలతో, సంస్కారానికి ప్రతిబింబంగా, ఎప్పుడూ ఆనందంగా వెలిగి పోయే ఆ చక్కటి ఆడపిల్లని చూస్తుంటే, ఎంతో ఎదిగి పోయిన ఈ పిల్లనేనా నేను ఒకప్పుడు "బుర్రలేని పిల్ల" అన్నాను!!!
ఔనా !!!

********************************************************************

25 కామెంట్‌లు:

SRRao చెప్పారు...

మానవత్వం అంటే ఇదే ! అభినందనలు !!

తృష్ణ చెప్పారు...

"Its great to be great,but its greater to be human".

well done.You are really human!hats off to you madam !!

సిరిసిరిమువ్వ చెప్పారు...

మీరు తీసుకున్న శ్రద్దకి వేవేల అభినందనలు. మీరు చేసిన ఈ ఉపకారం ఆ అమ్మాయి జీవితానికి ఎంత భరోసా ఇచ్చి ఉంటుందో!

భావన చెప్పారు...

very nice of you Jaya.సమాజం లో పేద్ద సంస్కరణలే చెయ్యనక్కర్లేదు ఇలాంటి సహాయాలే చాలు మార్పు కు నాది భావన పడటానికి అని నమ్మేదానిలో నేను మొదలు... Hat's off to you Madam.. :-)

సృజన చెప్పారు...

very nice of you!!!

Padmarpita చెప్పారు...

అభినందనలు...

నేస్తం చెప్పారు...

మిమ్మల్ని ఎలా అభినందించాలో కూడా తెలియడం లేదు.చాలా ఆనందంగా ఉంది.కళ్ళలో నీళ్ళు వచ్చాయి.

జయ చెప్పారు...

రావ్ గారు,
తృష్ణ గారు
సిరిసిరిమువ్వ గారు
భావన గారు
సృజన గారు
పద్మర్పిత గారు
నేస్తం గారు,
మీ కందరికీ పేరు, పేరు నా నా కృతజ్ఞతలు. మా లక్ష్మికి మంచి భవిష్యత్ ఉండాలని అందరూ దీవించండి.

సుభద్ర చెప్పారు...

జయగారు,
మీకు చప్పట్లు,
మీకు,మీ అత్తగారికి నా అభిన౦దనలు.చాలా చాలా స౦తోష౦ వేసి౦ది.తప్పకు౦డా లక్ష్మిని అడిగానని చెప్ప౦డి.

మాలా కుమార్ చెప్పారు...

చాలా మంచి పని చేసావు. అభినందనలు .

జయ చెప్పారు...

సుభద్ర గారు, అక్కా, థాంక్యూ వెరీ మచ్.

తృష్ణ చెప్పారు...

can i have your mail id?

మురళి చెప్పారు...

చాలా చాలా చాలా చాలా మంచి పని చేశారండి... ఆ అమ్మాయి చిరు కోరిక కదిలించింది.. మీ కంటబడడం తన అదృష్టమే..

Kranthi M చెప్పారు...

మనసు చప్పుడు వినగల గుండె మీకుంది.

మీరిచ్చిన ఈ చేయూత రేపు పదిమందికిచ్చే స్థాయికి ఆ బుడత ఎదగాలని కోరుకుంటూ..

మీ విశాలమైన ఉదారతకు హేట్సాఫ్!!!!

జయ చెప్పారు...

తృష్ణ గారు, గుప్పిటమూసి ఉన్నంతవరకే కదండి, తెరిస్తే ఏముంది? 'వెన్నెల్లో ఆడపిల్ల ' మీరు చదివేఉంటారు. ఈ బుక్ ముగింపు నచ్హినంతగా నాకు ఇంకే ఇతర బుక్స్ ముగింపులు నచ్హలేదు. అర్ధం చేసుకున్నారనుకుంటాను. దయచేసి తప్పుపట్టకండి.

మురళిగారు, ఎంతో కష్టపడితే గాని లక్ష్మి కి స్నేహాలయా లో అడ్మిషన్ దొరకలేదు. వాళ్ళ టార్గెట్ నంబర్ దాటిపోయిందని, కనుక ఖర్చులు నేను భరిస్తానంటేనే ఇస్తామని, ఇచ్హారు. ఇందులో ఆ అమ్మాయికి నేను చేసింది ఏమి లేదు.

క్రాంతి కుమార్ గారు, ఆ అమ్మాయి ఎవరి కళ్ళ పడ్డా అదే పని చేసుండే వాళ్ళు. మీరనుకున్న అభివృద్ధి లక్ష్మి లో తప్పకుండా రావాలని కోరుకుందాం.

Vinay Chakravarthi.Gogineni చెప్పారు...

mmm gud.......

sreenika చెప్పారు...

జయ గారూ,
very nice. u r lucky. Once I had a similar experience too, but I didnt find the girl..It was a great despair.
మీ అదృష్ఠం అమ్మాయి దొరికింది. ఆమె తలరాతని మార్చేరు. good job.

జయ చెప్పారు...

వినయ్ గారు, శ్రీనిక గారు- థాంక్యు వెరీ మచ్.

psm.lakshmi చెప్పారు...

మానవత్వం పరిమళించిన మంచి మనసుకు జోహార్
మీ శైలి చాలా బాగుంది.
psmlakshmi
4psmlakshmi.blogspot.com

జయ చెప్పారు...

లక్ష్మీ గారు థాంక్యు.

baleandu చెప్పారు...

You have done a great job. Really, you saved her life and given great support. God saved her through you. May God bless her.

జయ చెప్పారు...

బాలేందు గారు మీ దీవెనలు తప్పకుండా లక్ష్మి కి అందుతాయి.

జయ చెప్పారు...

బాలేందు గారు మీ దీవెనలు తప్పకుండా లక్ష్మి కి అందుతాయి.

శిశిర చెప్పారు...

పాత టపాలు చదువుతూ ఇప్పుడే ఈ టపా చదివాను. మనిషి కి పెట్టని కోట వంటిది వ్యక్తిత్వం అన్న మీ మాట అక్షరసత్యం. మీరే దానికి ఉదాహరణ. Really Hats Off to You. లక్ష్మి మీ నీడలో నిండైన వ్యక్తిత్వంతో ఎదుగుతుంది.

జయ చెప్పారు...

శిశిరా, అదంతా భగవంతుడి దయ. ఇందులో నేను చేసిందేమి లేదు.

 

మనస్వి © 2008. Template Design By: SkinCorner