మనస్వి లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
మనస్వి లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

29, మే 2013, బుధవారం

రవీంద్రుని చిత్రాలు






రవీంద్రనాథ్ ఠాగోర్ 150 వ జయంత్యుత్సవాల సందర్భంగా సాలార్జంగ్ మ్యూజియం లో ఏర్పాటు చేసిన ఆయన వేసిన చిత్రాల ప్రదర్శన మే 11 న ప్రారంభించారు. అది ప్రదర్శకులను అద్భుతంగా ఆకర్శిస్తోంది. ఠాగోర్ వివిధ సందర్భాలలోగీసిన చిత్రాలతో, మ్యూజియం వెస్టర్న్ బ్లాక్ లో రెండో అంతస్థులో ఈ ప్రదర్శన ఏర్పాటు చేసారు. జూన్ 10 వరకు ఈ ప్రదర్శన కొనసాగుతుంది.

ఢిల్లీ లోని నేషనల్ గ్యాలరీ ఆఫ్ మోడ్రన్ ఆర్ట్, సాలార్జంగ్ మ్యూజియంలు కలసి ఏర్పాటు చేసిన ఈ ఎగ్జిబిషన్ 'ద లాస్ట్ హార్వెస్ట్ ' పేరుతో ప్రముఖ చిత్రకారుడు పద్మశ్రీ జగదీశ్ మిట్టల్ ప్రారంభించారు. ఠాగోర్ ప్రకృతి అందాలను అద్భుతంగా చిత్రించి సహజ చిత్రకారునిగా, విశ్వగురువుగా గుర్తింపు పొందారని  అన్నారు. రవీంద్రుడు హైద్రాబాద్ లోనే (1934-1945) ఎక్కువ చిత్రాలను గీసారట. ఠాగూర్ తన 60 వ ఏట చిత్రాలు వేయటం ప్రారంభించారట.

శాంతినికేతన్ ఫైన్ ఆర్ట్స్ విభాగాధిపతి శ్రీ శివకుమార్ కూడా ఠాగోర్ చిత్రకళను వివరించారు. ఠాగోర్ గొప్ప రచయిత అయినప్పటికి ఆ ప్రభావం అతని చిత్రాల మీద పడలేదు. సాధారణ జన జీవితాలకు అద్దం పట్టే చిత్రాలు గీసారు. ప్రకృతి రమణీయత, బెంగాల్ రాష్ట్ర గ్రామీణ జీవితాన్ని ఈ చిత్రాలలో ఎక్కువగా చూడొచ్చు.

ఎన్.జి.ఎం.ఎ. శాంతినికేతన్ నుంచి 150 చిత్రాలను తెప్పించి ఈ ప్రదర్శనలో ఏర్పాటు చేసారు. మ్యూజియం డైరెక్టర్ శ్రీ నాగేందర్ రెడ్డి గారు ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి శ్రద్దగా ఎన్నో విషయాలను వివరిస్తున్నారు.

చిత్రకళ మీద అభిరుచి ఉన్న వాళ్ళు మాత్రమే కాదు, ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా చూడాల్సిన ప్రత్యేక ప్రదర్శన ఇది. ఈ చిత్రాలు మనకు ఠాగొర్ మనోభావాలు, సునిశిత పరిశీలన, సమాజం పట్ల అవగాహన, సృజనాత్మకత తెలియజేస్తుంది. ఠాగోర్ పూర్తి వ్యక్తిత్వాన్ని మనతో చదివిస్తుంది. ఒక విభిన్న వ్యక్తిని చూపిస్తుంది. ఊహాలోకాల్లో ఊపేస్తుంది.







***************************************************************************************************************************************************

1, మే 2012, మంగళవారం

బై...బై....










నేను సింగపూర్ వెల్తున్నానోచ్...అందుకే...టా టా అన్నమాట.....:)
వచ్చాక మళ్ళీ కలుస్తానన్నమాట....
ఇక్కడికి వస్తూ ఉండండేం.... ఊరికే వద్దులెండి.
ఇదిగో నాకు చాలా నచ్చే ఈ బుజ్జిగాడి యాడ్ మీకోసమే....




 సృష్టిలో తియ్యని పదం
మాట కందని కమ్మని భావం
చిరకాలం నిలిచిపోయే కమ్మని కావ్యం
ఎంతటి ఆత్మీయమైన అనురాగం
అమ్మ లోని ప్రేమ...ప్రకృతిలోని అందం...ప్రేమ లోని తియ్యదనం
 సృష్టి లోని మధురభావాలు ఇలాగే ఉంటాయి అనిపిస్తుంది, నాకైతే!!!
 నాకు ఎంతో నచ్చాడు ఈ బుజ్జి గాడు.  ఓ చందమామా...నీకో మాటమ్మా..నింగి దిగిరామ్మా....
ఇదిగో నీకు సాటి లేని పోటీ అని మరీ చూపించాలనిపిస్తుంది.
ఈ యాడ్ మీకు నచ్చుతుందా మరి.......


అంతేకాదండోయ్....మీ కోసం చక్కని పాట కూడా.....హాయిగా ఈ పాట విని మరీ వెళ్ళండేం.......
పగలే వెన్నెలా..జగమే ఊయలా...నాకు తెలుసులెండి....  మీక్కూడా ఈ పాట ఇష్టమే కదూ!!! చక్కగా వినండి మరి.



నాకెంతో ఇష్టమైన స్వచ్చమైన తెల్ల గులాబీ....మీ కోసమేనండి.....






 సయొనారా......

***********************************************************************************************************************************************************

1, ఏప్రిల్ 2012, ఆదివారం

మిత్రమా!





ప్రాణ మిత్రమా!

మరపురాని స్నేహమా, మరవలేని నేస్తమా
నీలో నేనుండిపోవాలి ఎప్పటికీ
నీతో కలసి చేరుకోవాలి గమ్యం
నా కళ్ళలో నీవెపుడూ కదలాడలి
నీ మనస్సులో నేనెపుడూ నిండిఉండాలి
స్నేహమనే స్వరం చేరాలి మనం
అందరికీ ఆదర్శం కావాలి మన స్నేహబంధం
మన ఈ స్నేహబంధం సాగిపోవాలి నిరంతరం....

ఈ ప్రశాంత వాతావరణంలో
నిశ్శబ్ధాన్ని చీల్చుకుంటూ వచ్చే కోయిలమ్మ పాటకి
ఎదలో కొత్తకొత్త భావాలు చిగురులు తొడుగుతున్న వేళ
నీవు అనే పదంలోకి
నేనుగా మారిన స్పందనతో ఇలా.......
అక్షరాలు ముత్యాల సరాల్లా జాలువారుతుంటే
నీవు నా పక్కన లేకపోవడం
చందమామ లేని ఆకాశంలా
స్నేహమా! వెన్నెల దీపమా!శూన్యంగా ఉన్నాను నేస్తం!
నా జీవితంలో ఎగిసిపడే భావతరంగం నీ పరిచయం...
నా గుండె లోగిలిలో...
మమతల మకరందాన్ని పంచి,
అనురాగపు జ్యోతుల్ని వెలిగించిన
నా స్నేహ సుప్రభాతమా! నువ్వెక్కడ?
నీ చిరునవ్వు కుసుమాల పరిమళం నన్నింకా వీడిపోకముందె
నా కనురెప్పల క్రింద
నీ జ్ఞాపకాల జలపాతాన్ని మిగిల్చి తరలిపోయావ్!

నిజం మిత్రమా!
ఏ అర్ధరాత్రో...
నీ అనురాగపు అలికిడి ఆర్తిగా వినిపించినప్పుడు
నువ్వు రావన్న దిగులుతో,
నా దు:ఖం ముక్కలై...ఏ ముత్యపు చిప్పలోనో!
ఎక్కడేక్కడో రాలి పడింది.....







అవునండి...ఇది నా సెంచురీ...అదేనండి...మూడు సంవత్సరాల క్రితం...ఏప్రిల్ లో బ్లాగ్ లో రాసుకోడం మొదలుపెట్టాను.
అంటే మూడేళ్ళు పూర్తి చేసిన సందర్భంలో....నాకు ఇష్టమైన స్నేహం గురించి.... వందో ఠఫా కూడా కట్టానన్నమాట!!! డబుల్ ధమాకా అన్నమాట...(ద.హా)
అవునండి....నిజమే నమ్మాలి మరి....



వంద అంటే నాకు చాలా చాలా ఎక్కువే సుమండి ...(వె.చి.న)

వంద పూర్తి చేయటానికి ఇంతకాలం పట్టిందా! నువ్వు దండగ ఫో అంటారా!! అయ్యయ్యో, అలా అనకండి మరి...ఏంచేద్దాం..నేనంతే.....

ఇవాళ సీతమ్మ సమేతుడైన ఆ శ్రీరామచంద్రుడే సాక్ష్యమండి......

ఇంకపోతే ఏప్రిల్ ఫూల్ అస్సలే కాదండి....మీ అందరికీ హ్యాపీ హ్యాపీ ఏప్రిల్ ఫూల్ డే అండి...



**********************************************************************************************************************





8, మార్చి 2010, సోమవారం

నేనునేనుగానే!




పునర్జన్మ అ౦టూ ఉ౦టే---నేనునేనుగానే!

అవును ... పునర్జన్మ౦టూ ఉ౦టే నేను నేను గానే మళ్ళీ పుట్టాలని నా కోరిక.... అవునండీ...ఒక పంతులమ్మగానే...

చుట్టూ అ౦దమైన పసిహృదయాల పసిడి బాలల మధ్య, కల్మషమెరుగని, కల్లాకపటమే తెలియని, నూతన జీవిత౦లోకి అడుగిడబోతున్న...ముగ్ధబాలికల ప్రేమానురాగాలతో అలరారుతున్న... ఈ జీవితమే నేనుకోరుకున్న జీవిత౦.

సుఖ దు:ఖాలు, మ౦చీ చెడుల మేలుకలయికే ఈ జీవిత౦.

ఎక్కడో పుట్టి ఇక్కడచేరిన ఈ పిల్లల్లో పిల్లలుగా కలిసిపోయి, వారి అనుభూతులను ప౦చుకు౦టూ గడిపే పాల వ౦టి స్వచ్చమైన, కల్లాకపటమే లేని ఈ పసి జీవితమే నాకు మళ్ళీ కావాలి. అన్ని స౦స్కృతులు...సంప్రదాయాలు...ఆచారాలు కలగలిపిన వీరితో...సౌభ్రాతృత్వపు భావనలతో... కలిసి ఆడే ఆటపాటలు, సరదాల పండగ సంబరాలు, ఉత్సవాలు, విహార, విజ్ణాన యాత్రలు...ఓహ్...ఇంకా ఎన్నో...ఈ ప్రపంచాన్నే మరిపించే పునర్జన్మ ఇదే...

కొత్తగా వొచ్చిన పిల్లల్తో కలిసిపోయి ప౦చుకునే ఈ ఆన౦ద౦, వారికి ఎన్నో విద్యాబుద్ధులు, ధైర్యసాహసాలు, సక్రమమైన జీవిత నైపుణ్యాన్ని నెరపి... సంఘం లోకి పంపే ఆ పవిత్రమైన బాధ్యతే నాకిష్టం.

నా చేతిలో చేయి వేసి, నా అడుగులో అడుగులేస్తూ...చదువుస౦ధ్యల్లో...వీధిబాలల పాఠశాలలు, బాలనేరస్తుల కారాగారాలు, అనాధశరణాలయాలు, మానసిక వికలాంగుల పాఠశాలలో, స్త్రీ శిశు సంక్షేమ పథకాలకు తోడు వొచ్చి ఎంతో పెద్దరికంతో తమ సేవ లందించి, తమ చేతిలో ఉన్న ఒక్క రూపాయి కూడా తోటి పేద విద్యార్ధిని ఫీజ్ కిచ్చేసి, ఎవరికి ఏ కష్టమైనా ఎటువంటి ఆలోచనా లేక ఆదుకోటానికి ఉరకలు వేసే వారి దీక్ష, పట్టుదల ... తామే స్వయంగా మార్గ దర్శకులుగా మారిపోయె...ఇంత స్వచ్చమైన పూబాలల మధ్య గడిపే జీవితమే నా దృష్టిలో ఎంతో ఉన్నతమైన జీవితం. నేనూ నిత్య విద్యార్ధ్ధినిని. ఒక్కొక్క బాలిక జీవితం నాకు ఎన్నో నేర్పుతోంది. నాకు ఆదర్శమైన వీరి మధ్య గడిపే జీవితమే నాకు గర్వ కారణం. ఇంతకంటే ఉన్నతమైన జీవితం ఇంకేముంది? జన్మ జన్మల సాఫల్యాన్ని అందిస్తుంది.

ఎంతో ఎదిగిపోయిన ఆ పసికూనలు....ఎప్పుడో కళ్ళముందు కనబడితే...వారి పెరుగుదలకు సంతోషించి చెమ్మగిల్లే నా కళ్ళలోని తృప్తే నాకు పరమావధి. ఉన్నత స్థాయిలోని వారు, చిన్నపిల్లలై...లోకమే మరచి...నాపై గౌరవాన్నిచూపుతూ, మరొక పక్క గారాలు పోయే వాళ్ళ కళ్ళలో తళతళ మెరిసే ఆ వెలుగు నాదికాదా!!!

"టీచర్ అంటే నడిచే పుస్తకం. కొండంత సహనం. టీచర్ అంటే చీకటి తెరలను తొలగించే దీపం. ఒడుపుగా మనలోకి తెలివిని ఎక్కించే తేజం. మంచి టీచర్ కావాలంటే మాటలు కాదు. చదువునే సర్వస్వంగా భావించి ... జీవితాన్ని వెతుక్కోవటం ఎలాగో .... తెలియ చేసేది ఉపాధ్యాయుడే.... ఎందరో భావి పౌరులను తయారు చేసే బరువు బాధ్యతలను తన భుజస్కంధాలపై మోస్తున్న భారత నిర్మాతలు 'పంతులుగారు '. చీకట్లో మగ్గిపోతున్న ఒక మారుమూల ప్రాంతంలో కూడ ....ఒక పదిమంది పిల్లలు బిలబిల మంటూ పలక, బలపం చేతబట్టుకొని వొస్తే..... భళ్ళున వెలుతురు నింపగల శక్తి ఒక్క ఉపాధ్యాయునుకి మాత్రమే ఉన్నదంటే అతిశయోక్తి కాదు. రేయింబవళ్ళు కష్టపడి, జీవిత చరమ దశలో వెనక్కి తిరిగి చూసుకుంటే తన వెనుక కనపడే వేలాది విద్యర్ధులను చూసుకొని గర్వంతో మురిసిపొయే ఒక సామాన్య టీచర్ జీవితం ఎంత ధన్యమో! టీచర్ అంటే పిల్లలకు పాఠాలు చెప్పటం తోటే బాధ్యత తీరిపోదు. కన్నబిడ్డల భవిష్యత్తు గురించి తల్లిదండ్రులు ఆలోచించినట్లే టీచర్లు కూడా విద్యార్ధుల గురించి తపనపడతారు. తన స్వంత సంపాదననుంచి పిల్లలకు పలకలు, నోటుబుక్కులు, పెన్నులు, డిక్షనరీలు అందించే ఉపాధ్యాయులు ఎంతో మంది ఉన్నారు. పేదవిద్యార్ధులకు, అనాధ పిల్లలకు తామే ఫీజులు కట్టి చదివించే ఉన్నత టీచర్లు కూడా ఉన్నారు. తన దగ్గర చదువుకున్న విద్యార్ధులు మంచి స్థానంలో ఉన్నారంటే ఒక టీచర్ కి అంతకన్నా ఇంకేం కావాలి? చదువుకుంటేనే ఈ దేశం అభివృద్ధికి ప్రయోజనం అని ప్రతి గురువు తన విద్యార్ధికి బోధిస్తాడు. వీధిలో గురువుగారు కనిపిస్తే 'మాస్టారు వొస్తున్నారు ఇంటికి తీసుకు రండి ' అంటు తమ పిల్లలకు తల్లిదండ్రులు చెబితే, ఆ గౌరవం చాలనిపిస్తుంది. ప్రతి విద్యర్ధిని చిటికెన వేలు పట్టుకొని ఆప్యాయంగా గమ్యం చేర్చే శక్తి వంతుడు ఒక టీచర్ మాత్రమే! ఎందరో విద్యార్ధుల భవితకి పునాది వేస్తూ, ప్రపంచానికి వెలుతురునందిస్తున్న ధన్యజీవి. నిజమైన టీచర్ కి రిటైర్మెంటే లేదు." .....

పరిపూర్ణమైన జీవితాన్ని చూపి, హృదయ౦ ని౦డా తృప్తి ని ని౦పిన...ఇదిగో ఇటువ౦టి...ఈ ప౦తులమ్మ జీవితమే నాకు మళ్ళీ కావాలి.

మన౦దరికీ మహిళాదినోత్సవ శుభాకాంక్షలు.

ఒక చిన్న కొసమెరుపు: అలహాబాద్ లోని త్రివేణి సంగమం లో పునర్జన్మ లో ఏమి కావాలని కోరుకుని మునిగితే ఆ కోరిక తీరుతుందట. ఒక సారి ఒక పేద బ్రాహ్మణుడు త్రివేణీ సంగమం లో మునిగి చావటానికి వెల్తే అప్పటికే అక్కడ ముగ్గురు స్త్రీలు ఉన్నారట. ఒకరు తాను ఒక మహారాజుకి భార్యకావాలని కోరుకుంది. ఇంకొకరు తాను ఒక మంచి విద్యావేత్తకు భార్య కావాలని కోరుకుంటే, ఇంకోకరు ఘనకీర్తి కలవానికి తనను భార్యను చేయమని కోరుకుంటూ చనిపోయారట. అది చూసిన ఈ పేద బ్రాహ్మణుడు మరుజన్మలో ఆ ముగ్గురికీ తనని పతిని చేయమని కోరుకుంటూ తాను కూడా త్రివేణీ సంగమం లో మునిగాడట. అతడే మరుజన్మలో విక్రమాదిత్యుడు గా జన్మి౦చాడుట. ఇది మా అమ్మ చెప్పిన చ౦దమామ కథ.




ఎక్కడో పుట్టి, ఎక్కడో పెరిగి...చదువులమ్మ చెట్టునీడలో కలిసాము....




*************************************************************************

2, అక్టోబర్ 2009, శుక్రవారం

"మనస్వి" గా మారిన "మయూఖ"

అక్టోబర్ రెండవ తారీఖు, ఇది నా బుజ్జిగాడు, వరాల కొండ, బంగారు తండ్రి, నా రాజా బేటా, (మా అబ్బాయి) పుట్టిన రోజు.
ఇదిగో, ఇప్పుడే పన్నెండు దాటింది, రెండో తారీఖు వొచ్హింది. మా వాడికి 'హాపీ బర్త్ డే ' చెప్పి ఈ టపా పంపేస్తున్నాను ...

ఈ రోజే నాకు కూడా పునర్జన్మ నిచ్హింది. మయూఖ నుంచి మనస్వి గా మారాను. నేనేనండి జయని.

మయూఖ నాది కాకూడదు అన్న కూడలి లోని టపా చూసిన తరువాత ఒక్క నిముషం నాకేమి తోచలేదు. ఇంక నన్ను ఎంతమంది తిట్టేస్తారో అన్న భయం మొదలైంది.

ఎప్పుడూ నాకు సలహాలు ఇచ్హే మా అక్క అరగంట క్రితమే హాయిగా కర్ణాటక టూర్ వెళ్ళిపోయింది.

కిం కర్తవ్యం!

ఒక సారి రమణా రెడ్డి గారి బ్లాగ్ లోకి తొంగి చూసాను. అక్కడొక టపాలో వెరే లింక్ కనిపించింది. అందులోని వ్యాఖ్యల పరంపర చూసాక ఇంత ఘోరంగా కూడా ఉంటుందా పరిస్తితి అని కాళ్ళు గజగజ వణికాయి. పూర్తిగా చూడకుండానే నా బ్లాగ్ లోకి వొచ్హేసాను.

అలాగే అలోచిస్తు ఉండిపోయాను.సమాధానం చెప్పాల్సిన బాధ్యత నాకుందని గుర్తించాను. మయూఖ నుంచి ఇప్పుడేమి చేయలేను, నాకేమొ బ్లాగ్ మార్చటం రావట్లేదు. అందుకే ఆపేయటం మంచిది. బతికుంటే బలిసాకు తిని బతకొచ్హు అనుకున్నాను. అందుకే నేనిక రాయను అని, వివరంగా నేను కూడా కూడలి ముఖం గా ఒక టపా రాసేసి, నా కంప్యూటర్ ఆఫ్ చేసేసాను.

కాని, మనసూరుకోదే! మళ్ళీ నా మయూఖ లొ చూసుకున్నాను.

అదే రోజు నేను రాసిన " జయ శుభకారిణి ' కి ఏమి టపాలు లేవు. అందరు నన్ను తప్పుపడుతున్నారనిపించింది. దాని కారణం, ఎవరో 'కెల్లీ' అని జపానొ, చైనా నో తెలియని భాషలో ఒక పెద్ద కామెంట్ కనిపించింది. తెలుగు చదవ గలిగిన వాళ్ళు, తెలుగులోనో లేకపోతే ఇంగ్లీష్ లోనో కామెంట్ ఇవ్వాలి. ఈ భాష ఏమిటి! దీనికి కారణం ఏమిటి! అన్నది నాకు అర్ధం కాలేదు.

నన్ను తిట్టక పోయినా నా పేరు మార్చేసుకొని రాయమని (ఒకరు మాత్రం బాగానే తలంటి పోసారు) ప్రొత్సహిస్తూ కొన్ని టపాలు కనిపించాయి. ఎప్పుడూ రాని శ్రీకర్ గారు, మంచుపల్లకి గారు కూడా కనిపించారు. ఇంకాసేపటికి మళ్ళీ చూసాను. కొత్తపాళీ గారు, జ్యోతి గారు కనిపించారు. కొంచెం ధైర్యమొచ్హింది. అయ్యో! మురళిగారి టపా కనిపించలేదే అని కొంచెం చిన్నబుచ్హుకున్నాను. ఇంకా వెరే ఎవరైనా కూడా కామెంట్ ఇస్తే బాగుండేది, అనిపించింది.

ఇంకొక్కసారి రమణా రెడ్డి గారి మయూఖ లోకి తొంగి చూసాను. అక్కడ మా ఇద్దరికన్న ముందే ఇంకొ మయూఖ ఉన్న సంగతి కనిపించింది. ఆ లింక్ లోకి చూసాను. నిజమే! పాపం, వాగ్దేవి గారు మా ఇద్దరి కన్న ఎంతో ముందునుంచే మయూఖ తో నిశ్శబ్దంగా రాసుకుంటున్నారు.

జ్యోతి గారు సహాయం చేస్తానన్నారుగా, అడుగుదాం! అని వెంటనే మైల్ చేసేసాను. తిరుగు టపా లో నన్నేమి దిగులు పడొద్దని తెల్ల కాగితమైపోయిన నా మనస్వి ని అలంకరించి ఇస్తానని, నన్ను హాయిగా రాసేసుకొమని, ఒక టేంప్లేట్ తో వెంటనే రెడీ చేసి ఇచ్హేసారు కూడా. ఉహూ, నాకు ఈ టేంప్లట్ వొద్దు ఇంకోటి కావాలి అని అడిగాను. పాపం ఏమి అనుకోకుండా తనదగ్గిరున్న లిస్ట్ అంతా పంపించి నన్నే సెలెక్ట్ చేసుకోమన్నారు. వెంటనే అంతా గాలించి నాకు నచ్హిన టేంప్లేట్ చూపించాను. మర్నాడు సాయంత్రం నేను ఇంటికి రాగానే, ముందు చేసిన పని కంప్యూటర్ చూడటం. ఎంతో అందంగా అలంకరించిన నా మనస్వి కనిపించింది. జ్యోతి గారికి పార్టీ ఇస్తానన్నాను, కాని జ్యోతిగారు పట్టించుకోలేదు. జ్యోతిగారు, మీకు నా క్రుతజ్ఞతలు.

ఒక పెద్ద తుఫాను వెలసి మనసు ప్రశాంతం గా అనిపించింది. రాత్రికి నాకు చిక్మగలూర్ నుంచి మా అక్క ఫోన్ చేసింది. ఇంకేముంది, ఒక గంటసేపు అన్నీ 'ఏ ' నుంచి 'జెడ్ ' వరకు చెప్పేసాను.

రమణా రెడ్డి గారికి, వాగ్దేవి గారికి నా క్రుతజ్ఞతలు

ప్రశాంతంగా ఒకసారి నా మయూఖ చూసుకున్నాను. ఈ సారి మురళి గారి కామెంట్ కనిపించింది. హమ్మయ్య! అనుకున్నాను. రవి, ఇప్పుడే భావన గారు కూడా వొచ్హారు.

ఇంక నా ఈ పునర్జన్మ ఎలా ఉంటుందో చూడాలి!


తపన

అజ్ఞానపు చీకటిలో నేనున్నప్పుడు
అంధకార మావరించి
అశక్తను చేసినప్పుడు
విజ్ఞాన దీపం వెలిగి వెన్నుతట్టింది
ఆ దీపం జ్వాలయై
జగమంతా నింపాలనే
తపన రగిల్చింది
నేను మెల్లగా నడిచినా
వెనుకకు అడుగు వేయను .......


****************************************
 

మనస్వి © 2008. Template Design By: SkinCorner