అనుభవాలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
అనుభవాలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

27, మార్చి 2013, బుధవారం

పాత బట్టల పండుగ





పాతబట్టలతో ఎప్పుడూ ఎంతో కొత్త కొత్తగా ఉండే ఈ పండుగ నాకు పుట్టినప్పటి నుంచి ఇష్టం. ఎంతో ప్రాణం....

అవును మరి, నేను పుట్టిన సంవత్సరం లో హోళీ  రోజు అక్కడే ఉన్న ఓ కలర్ బకెట్లో పడిపోయానట. పసుపు రంగులో పడ్డనేను, అందుకేనేమో! అప్పటినుంచి ఆ రంగంటే చాలా ఇష్టం. పసుపులో అన్ని షేడ్స్ ఇష్టమే. పసుపు రంగు స్నేహానికి కూడా ఒక మంచి గుర్తు. కదూ!

అప్పటినుంచి ప్రతి సంవత్సరం ఏదో విధంగా హోళీలో మునిగి తేలుతూనే ఉన్నాను.హోళీ కోసం ఎక్కడెక్కడి రంగులో కొనుక్కొస్తున్నానని మా అమ్మ నాకు డబ్బులిచ్చేది కాదు. ఓ సారైతే బజార్లో సామాన్లు కొనే వాడొస్తే, మా ఇంట్లోంచి రెండు మూడు గిన్నెలు తీసుకెళ్ళి వాడికి అమ్మేసాను. తోచిన కలర్స్ అన్నీ కొనుక్కొచ్చేసాను. ఆ తరువాత జరగాల్సిందేదో జరిగిపోయిందనుకోండి. అది వేరే విషయం....

హోళీ కి కొత్త బట్టలు కావాలని ఒకటే గొడవ చేసేదాన్ని. పసుపు పచ్చటి పట్టు పరికిణీ, బ్లౌజు కుట్టించమనిఎంత గోల చేసేదాన్నో. ఇప్పుడైతే ఆ బట్టలు పాడైపోతాయి, శివరాత్రికి కుట్టిస్తాలే....అప్పుడు ఇంచక్కా నువ్వొక్కదానివే కొత్త బట్టలేసుకోవచ్చు అనే వాళ్ళు మా నాన్నగారు....:)

కుక్కపిల్ల లంటే భలే ఇష్టం ఉండేది. మేము నాగార్జున సాగర్ లొ ఉన్నప్పుడైతే, దారిలో కనిపించిన ప్రతి కుక్క పిల్ల ని ఇంటికి తీసుకొచ్చి పాలు పోసే దాన్ని. వాటిని మంచాల కింద దాచిపెట్టేదాన్ని.రకరకాల కుక్కపిల్లలు ఇంటినిండా గునగునా తిరుగుతూ ఉండేవి.హోళీ అప్పుడైతే ఒక్కో కుక్కపిల్లని ఒక్కో రంగులో ముంచేసేదాన్ని. అప్పుడైతే మా ఇంట్లోనే సప్తవర్ణాల ఇంద్రధనుస్సు గిరగిరా తిరుగుతున్నట్లుండేది. హోళీ కి పిల్లలందరం కలిసి డబ్బులేసుకుని రంగులు కొనుక్కుని అక్కడే ఉన్న పార్క్ లో ఆడుకునే వాళ్ళం.  ఎవరు ఎవరో కూడా గుర్తుపట్టలేనంతగా రంగులు పూసేసుకునేవాళ్ళం. నా కుక్కపిల్లలన్నీ నాతో పాటు వచ్చేస్తాయి కాబట్టి నా దగ్గిర ఎక్కువ డబ్బులు తీసుకునే వాళ్ళు.  హోళీ అప్పుడు నా కుక్కపిల్లల్ని చూట్టానికి, తెలియని వాళ్ళు కూడా ఎంత మందో వచ్చే వాళ్ళు. నా గొడవ పడలేక నేను స్కూల్ కెళ్ళిన టైం లో వాటన్నింటిని సాగర్ లో తిరిగే ట్రక్కుల్లో ఇంకెక్కడికో పంపించేసేది మా అమ్మ.చాలా గొడవ పెట్టేసేదాన్ని. కాని, మళ్ళీ మామూలే....ఎక్కడెక్కడినుంచో కుక్కపిల్లల్ని తీసుకొచ్చేస్తూ ఉండేదాన్ని. ఇప్పటికీ రంగులు పూసిన బుజ్జి బుజ్జి కోడిపిల్లల్ని దారిలో అమ్ముతున్న వాళ్ళను చూసినప్పుడు నా కుక్కపిల్లలే గుర్తొస్తాయి.

సాగర్ లో పెద్ద పెద్ద క్వాటర్స్, ఇంటిముందు రకరకాల చెట్లతో కాంపౌండ్ వాల్ తో అందంగా ఉండేవి. ప్రతిఒక్కరి ఇళ్ళల్లో మందార, బంతి, చేమంతి, రంగురంగుల జినియాలు,  పచ్చటి తంగేడు పూలు ఇంకా ఎన్నో చెట్లు ఉండేవి. ఇంక చెప్పేదేముంది...అన్ని పూలు తెంపేసి...నలిపేసి ఒంటినిండా పూసేసుకునేవాళ్ళం. సహజ రంగులన్నమాట. మందార ఎరుపు, చేమంతి పసుపు, అనేకరంగుల్లోని జినియాల, బంతుల రంగులు బట్టలకు అసలు వదిలేవేకావు. ఒంటికంటుకున్న ఆ రంగులు ఎన్నో రోజులకు కాని పోయేవి కావు. ఆ రంగులెక్కడ మాయమైపోతాయో అని సరిగ్గా స్నానం కూడా చేయకుండా కాపాడుకునేవాళ్ళం. ఎవరి వంటి మీద ఎక్కువ రోజులు ఆ రంగులుంటాయో వాళ్ళు గ్రేట్ అన్నమాట. మా అమ్మ కోపం చేసి ఆ రంగులు వదిలించేది. రహస్యంగా మళ్ళీ ఏవో రంగులు పూసేసుకోని కాంపిటీషన్ లో కొనసాగేదాన్ని:) అందమైన లోకమనీ....రంగు రంగులుంటాయనీ....మురిసిపోయే .... అమాయకమైన రోజులవి....

  పోన్లే ఇదేదో చిన్నప్పటి సరదాలే అనుకుంటే పెద్దయ్యాక కూడా అంతే...కాలేజీ చదువుల్లోను, హాస్టల్ రోజుల్లోనూ అంతే...ఇంకా పెరిగిందేగాని తగ్గలేదు. పెద్ద పెద్ద హోళీ గన్ లు, పిచ్ కారీలు కొనుక్కొని ఎన్నెన్నో రంగులు నింపుకొని చిన్న పిల్లల కంటే కూడా ఇంకా చిన్నపిల్లల్లాగా ఆడుకునే వాళ్ళం. 'అదిగో దెయ్యం' అనేంత భయంకరంగా తయరయ్యే వాళ్ళం. ఒకే ఒక్క డైలాగ్ తో సీరియల్ ఎపిసోడ్ మొత్తం లాగించేసినట్లే ఈ హోళీ తోనే జీవితమంతా లాగించేయాలనిపించేది.  నాకైతే మేమంతా సీతాకోక చిలుకల్లాగా, స్వర్గలోకపు నాట్యకత్తెల్లాగా అనిపించేది. ఎందుకో గాని ఎంతో గర్వంగా ఉండేది.  ఎందుకో అంత ఆనందం!!!

ఇప్పుడైనా అంతేకదా!!! ముందు రోజో వెనక రోజో పిల్లలందరూ వస్తే ఏదో, అయిష్టంగానే...కొంచెంగా కోపగించుకొని...వాళ్ళకీ నాకు కూడా తెలియకుండానే రంగుల వర్షం లో తడిసిపోతూనే ఉంటాను:)  చిన్నతనంలో ఎప్పుడెప్పుడు పెరిగి పెద్దైపోతామా అని ఒకటే ఆరాటం....పెరిగి పెద్దైపోయాకేమో మళ్ళీ పిల్లలమైపోతే బాగుండు అని ఎంత అల్లాడిపోతామో:) ఇదిగో, ఈ హోళీ మన కోరిక  మనసారా తీరుస్తుంది...

అదన్న మాట. నా హోళీ కథ. కాబట్టి రేప్పొద్దున్న ముసలి దాన్నయినా...ఎల్లుండెప్పుడో చనిపోయినా ....ఇప్పటికీ అప్పటికీ ఎప్పటికీ హోళీనే:)

త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ముగ్గురినీ దంపత సహితంగా పూజించే రోజు ఈ ఒక్కటే. అదే ఫాల్గుణ పూర్ణమి. ఈనాటి పూజలు కూడా భిన్నంగానే ఉంటాయి. వసంత పూర్ణిమ కి సంతోషాన్ని వ్యక్తం చేసుకుంటూ ఒకరిపై ఒకరు రంగు పొడులు, రంగు కలిపిన నీళ్ళు చల్లుకుంటారు. ' హోళి హోళీర రంగ హోళీ చమకేళిర హోళీ' అని పాడుకుంటూ ఆడుకునే ఈ ఆటలో ఎన్నో అర్ధాలు ఉన్నాయి. మోదుగపూలు తెచ్చి రోట్లో దంచి, కుండలో వేసి, రసంతీసి, వెదురు గొట్టాల్లో నింపాలి. ఆ రసం ఎర్రగా ఉంటుంది. దీనికే వసంతం అని పేరు. ఈ కషాయం ఒంటిమీద పడటం వల్ల శరీర కాంతి, వర్చస్సు ఎక్కువై ఆరోగ్యం ఇనుమడిస్తుంది. మానసిక వికారాలు, ఉద్రేకాలు కూడా తగ్గుతాయిట. ఎప్పుడో చదివిన విషయం ఇది. మన ఆయుర్వేదంలో ఉన్న గొప్పతనం ఇదే మరి....

 అటువంటి  ఈ వసంతోత్సవ కేళి ప్రతిఒక్కరి జీవితం లోనూ అన్ని రంగులూ కలకాలం చిలకరిస్తూనే ఉండాలని కోరుకుంటూ, మీ అందరికీ నా హృదయ పూర్వక హోళీ శుభాకాంక్షలు.

  'అజ్ఞానమనేది దట్టమైన చీకటిలాంటిది ' అన్నాడు షేక్ష్పియర్. ఎన్నో పరమార్ధాలు తెలిపే ఈ రంగులే మన అజ్ఞానాన్ని తొలగిస్తాయి. జగమంతా రంగులమయం.ఆ నీలి ఆకాశం, శత వర్ణాల పూలు,తెలియని రంగులను చూపించే సముద్రం, రంగులమయమైన ఈ ప్రకృతి....ఓహ్...మనజీవితమే రంగు రంగుల పూలసజ్జ....ఇందులోని ప్రతి రంగునీ మనం సద్వినియోగం చేయాలి.... అస్వాదించాలి ...అనుభవించాలి...ఈ పూల సుకుమారాన్ని సడలనీకుండా కాపాడుకోవాలి.....

హోళీ ఆయారే...దేఖో హోళీ ఆయారే....మస్తీ కరో....:)


   రంగ్ బరిసే హోళీ.....





  హోళీ కె దిన్ దిల్ ఖిల్ జాతే హై....





***************************************************************************************************************************************************

10, మార్చి 2013, ఆదివారం

కళా హృదయ సమ్మేళనం....



చల్లని పిల్ల గాలి తెమ్మరలు ఆహ్వానిస్తే ఎలా ఉంటుంది!
మినుకు మినుకు నక్షత్రాలు, ఇదిగో...నిన్నే... చందమామ నిన్నుకూడా రమ్మంటున్నాడు...రా... అంటే!!....
సుకుమార పారిజాత పుష్పాలు మాలాగే మొత్తం...అంతా...పరుచుకుందువుగాని....వచ్చేయ్...అని తొందర చేస్తూ ఉంటే.....ఎలా ఉంటుంది!!!
ఇదిగో అదే జరిగింది.....ఏ నాటి స్వప్నమో ఈనాడు నిజమయింది...జన్మ జన్మల సంబరం నా సొంత మయింది....ఆ ఆనందాన్ని మీతో కూడా పంచుకోనివ్వండి మరి...

ఫ్రెంచ్ సంగీత కారుడు పియర్ తిల్వా. ఆఫ్రికా, మధ్య ఆసియా తూర్పు దేశాలు పర్యటించి వివిధ రకాల సంగీతాన్ని అధ్యయనం, పరిశీలనా చేశాడు.   ’ప్రపంచ సంగీత పరిమళానికి నేను వివశుడనై తిరిగాను’ అని చెప్పుకున్నాడు. సంగీతం ఒక్కటే, వేరు వేరు పేర్లతో ఉంది, సంగీత జ్ఞానాన్ని సమన్వయం చేయాలి అని భావించాడు. అనేక సంగీత కార్యక్రమాలకు స్వర రచన చేసాడు.  ఇతను స్వర పరచిన సంగీత విభావరి పేరు 'అనంత ఓపస్ 195'. సంస్కృత పదం 'అనంతం' తీసుకొని తన స్వరరచనకు ’అనంతమైన సృజన” అనే పేరు పెట్టుకున్నారు. అనేక దేశాల్లో పర్యటించి ఈ అనంతమైన విశ్వ సంగీతాన్ని వ్యాపింప చేసారు. ఎందరో కళాకారులు ఇతని సంగీత విభావరిలో పాల్గొన్నారు. అనంతమైన ఆనందాన్ని అనుభవించారు. సంగీతం ఒక మహా సాగరం, పాశ్చాత్యమైనా...భారతీయమైనా అని నిరూపించారు.  ప్రెంచ్, భారత సంగీత సమ్మేళనంతో భారత దేశంలో కూడా అనేక ఆధునిక,  శాస్త్రీయ సంగీత కార్యక్రమాలను నిర్వహించారు.  ప్రపంచ పర్యటనలో భాగంగా భారత శాస్త్రీయ సంగీత వేత్తల తో కూడా చర్చించారు. వారి   అభిప్రాయాలతో, సలహాలతో భారతీయ విజ్ఞాన సంపదతో  ఏర్పడినదే ఈ సంగమ ఫలితమం.  ఇదే ’ఇండో-ఫ్రాన్స్' స్నేహపూర్వక ఉత్సవాలకు వన్నె తెచ్చింది.

 ఇంతటి మహోన్నతమైన సంగీత కార్యక్రమాన్ని మనసారా ఆస్వాదించే అదృష్టం హైద్రాబాదీయులను వరించింది. అది మామూలు అదృష్టం కాదు. యాభై మంది ఫ్రెంచ్ కళాకారులతో శిల్ప కళా వేదిక పై పియర్ తిల్వా స్వరపరిచిన వాద్య సంగీత సమ్మేళనం. వయొలిన్, సెలో, గిటార్ తదితర పరికరాల స్వరాలు సంగీత ప్రియుల వీనుల విందు చేసాయి. చల్లని మలయ మారుతం లా, వెన్నెల జల్లుల్లా హృదయాలకు 'అనంత మైన సృజన ' ఇచ్చింది.   ఈ విభావరిని శామ్యూల్ జాన్ నిర్వహించారు.

  అక్కడే, ఈ సంగీత అనంత వాహిని లో ఒక అద్భుతమైన మలుపు హృదయాలను పూర్తిగా మైమరపింపచేసింది. ఉస్తాద్ అంజాద్ అలీ ఖాన్,  తన ఇద్దరు సంగీత వారసులైన కుమారులు అమానలీ ఖాన్, అయాన్ అలీ ఖాన్ లతో వేదిక మీదకి విచ్చేసారు. ముగ్గురూ తమ సరోద్ లను సవరించుకొని కూర్చున్నారు. అప్పటి వరకూ విన్న ఫ్రెంచ్ క్లాసికల్ సంగీతాన్ని సరోద్ ల పై సవ్వడిస్తూ, ఓ ప్రభంజనంలా, ఓ జలపాతంలా మధురమైన సంగీత పరిమళాన్ని అందరి మనసుల్లో ప్రవహింపచేసారు. కొమ్మ కొమ్మ కూ కోయిలలు పరిగెత్తుకొచ్చాయి....కొత్త కొత్త రాగాలు తీయతీయగా ఉన్నాయని... గ్వాలియర్  సంస్థానంలో  హిందూస్థానీ సంగీత కళాకరుల కుటుంబానికి చెందిన అంజద్ అలీఖాన్ ఈ సంగీత కార్యక్రమం కోసం యువకుడైన తిల్వా తో రెండు మూడు నెలలు రిహార్సల్స్ చేసారు.

 ఇంతటి అద్భుత రసాస్వాదనను, ఇటీవలే దివంగతులైన పండిట్ రవిశంకర్ కు అంకిత మిచ్చారు.  ఇరు సంస్కృతుల సమ్మేళనమిది. ఎంతో ముచ్చటైన సన్నివేశం. అంతేలేని ఓ అద్భుతం. సంగీత ప్రియులకు ఇచ్చిన మహారాజ విందు ఇది. ఇండియా లో జరిగిన ఫ్రెంచ్ పండుగ. ఎంతో మంది దేశ విదేశీ ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.    నేను మొదటిసారి, నా అభిమాన దర్శకుడు 'కళా తపస్వి' కె. విశ్వనాధ్ గారిని ఇక్కడ చూసే అదృష్టం కూడా కలిగింది. ఆ కళాకారుల దగ్గరికి ఎన్నో కళా హృదయాలు ఆటోగ్రాఫుల కోసం, ఫొటోగ్రాఫుల కోసం పరుగులెత్తాయి.....ఈ బుల్లెట్లను మాత్రం ఎవ్వరూ ఆపలేక పోయారు. ఇది ఒక  Fusion అంతే.

“It is a harmonious blend of Hindustani Classical Music and Divine French Compositions”…..





Bonjour India 2013 festival - Ananta Opus 195







***************************************************************************************************************************************************










3, మార్చి 2013, ఆదివారం

'పూజ్యుల సేవ '








మా కాలేజ్ కి  యు.జి.సి. ఎక్ష్పర్ట్ కమిటీ  విజిట్ డేట్ డిసైడ్ అయ్యింది.  ఈ టైం లో మా కాలేజ్ లో ఎంత హడావుడో చెప్పలేము. ఈ నెల యు.జి.సి. ఎక్ష్పర్ట్ కమిటీ విజిట్ ఉందని, స్టాఫ్ మీటింగ్ పెట్టి అందరికి ఏమేమి తయారీలు చేసుకోవాలో చెప్పారు. మర్నాడు సెకండ్ సాటర్ డే. అయినా కాలేజ్ ఉంటుందని అందరు తప్పకుండా రావల్సిందే నని ఎవరు లీవ్ పెట్టటానికి వీలు లేదని, ఆ రోజు బదులు దసరా మర్నాడు హాలిడే ఇస్తామని,మా ప్రిన్సిపాల్ ఘాఠి వార్నింగ్ ఇచ్చేసారు. ఆ రోజు అందరికి కమిటీలు వేసి డ్యూటీ లు వేస్తామని చెప్పారు. మాకిది మామూలే. ఇంక నాకేమి డ్యూటీ ఇస్తారో అని నా ఆలోచన మొదలైంది. నాకెప్పుడు కూడా చాలా గొట్టు గొట్టు డ్యూటీ లే వేస్తారు. అనుకున్నట్లుగా మర్నాడు మీటింగ్ మొదలైంది. ఎన్నో రకాల కమిటీలు వేసారు. మొట్టమొదట ప్రిన్సిపాల్ నా పేరుతోనే మొదలుపెట్టారు. జయా! అయాం టేకింగ్ యు ఇన్ రిఫ్రెషర్ కమిటీ, యు కన్ టేక్ గ్రేస్ అండ్  నైనా అగర్వాల్ ఇన్ యువర్ టీం. యు ఆర్ ద కన్వీనర్ అన్నారు. ఇంకేముంది, అనుకున్నంతా అయ్యింది. ఇంక నేను పొద్దుటినుంచి సాయంత్రం వరకు చాయ్..చాయ్...చై చై చాయ్.. చెయ్య్య్.. చాయ్.. అనుకుంటు, టిఫినీలు తిన్నారా, కాఫీలు తాగారా! అంటూ తిరగాలి కాబోలు.

వాళ్ళిద్దరు నాకన్న సీనియర్స్, అటువంటప్పుడు వాళ్ళను మెంబర్స్ గా నాకు నచ్చలేదు. ఆమాటే ప్రిన్సిపాల్ తో చెప్పి గ్రేస్ కన్వీనర్ గా ఉంటుంది అన్నాను. అట్లా కాదు, ఇది యు.జి.సి. విజిట్, నువ్వు 'రీడర్ ', హెడ్ అఫ్ ది డిపార్ట్మెంట్ 'కాబట్టి ఇవన్నీ కూడా చూడాలి అన్నారు. ఇంక తప్పదు, ముగ్గురం కలసి అన్నీ చూసుకుందామని డిసైడ్ అయిపోయాం. మీకు పని చాలా ఉంటుంది కాబట్టి రేపు సెక్రటరీ సార్ తోటి మీట్ అయి మొత్తం ప్రోగ్రాం చాకౌట్ చేద్దాం అన్నారు మా ప్రిన్సిపాల్.

మర్నాడు సర్, ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్, మేము ముగ్గురం సర్ రూం లో మీటింగ్ పెట్టుకున్నాం. సర్ ఇచ్చిన ప్రోగ్రాం చూస్తే నాకు కళ్ళు తిరిగిపోయాయి. మొత్తం వచ్చే మెంబర్స్ అయిదుగురు. అందులో ఇద్దరు ఇక్కడినుంచే. ఆ ఇద్దరు నాకు తెలిసినవాళ్ళే. అందులో ఒకాయన మా డిపార్ట్మెంటే. యు.జి.సి. డీన్ గా ఉన్నాడు. ఇక పోతే అందులో ఒకరు కోల్కత్త, ఒకరు చెన్నై, ఇంకొకరు కేరళ నుంచి. వీళ్ళు రిటైర్డ్ వి.సి. లు. అందరు డెబ్బై ఏళ్ళ పైవాళ్ళే. మరి వాళ్ళకోసం ఇచ్చిన ప్రోగ్రాం చూస్తే కళ్ళు తిరగక ఏమైతుంది.

పన్లో పనిగా ఆరోజు మేం ఏం చీరలు కట్టుకోవాలో కూడా నిర్ణయించేసుకున్నాం. నేను, మన ముగ్గురం ఆ రోజు 'వెంకటమ్మ' లైపోదం అన్నాను. మేము వెంకటగిరి చీర కట్టుకుంటే వెంకటమ్మలని, పోచంపల్లి చీరలు కట్టుకుంటే 'పోచమ్మ' లని, ఇలా చాల పేర్లు మా వాడుకలో ఉన్నై లెండి. నేను ఆ మధ్యనే మంచి పెద్ద జరీ బోర్డర్ తోటి గోల్డ్, సిమెంట్ కలర్ కలనేతలో వెంకటగిరి చీర కొనుక్కున్నాను. రోజూ సింపిల్ గా వెల్తాం కాబట్టి ఆరోజు కొంచెం గ్రాండ్ గా వద్దాం అన్నాను. మా వాళ్ళు వెంటనే ఒప్పేసుకున్నారు. ఎందుకంటే వాళ్ళు కూడా గ్రాండ్ గా తయారయ్యే అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు మరి.(నగలూ నాణ్యాలూ ఉండవులెండి...ఓన్లీ చీర:)

సరే, ఈ ఎక్ష్పర్ట్ కమిటీ ఆ రోజు పొద్దున్న మా కాలేజ్ కి పది గంటలకు వచ్చారు. ఎన్.సి.సి. స్టూడెంట్స్ తోటి 'గార్డ్ ఆఫ్ ఆనర్ ' ఉంది. తరువాత ప్రిన్సిపాల్ రూం లో ఇంటరాక్షన్. కాలేజ్ రిపోర్ట్ అంతా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఉంది. ఆ టైం లో మేము వాళ్ళకి స్నాక్స్, టీలు ఇవ్వాలి (రెండు రకాల కాజూలు, కాజు బర్ఫీ, బిస్కెట్స్, నంకిన్ etc.) . ఆ తరువాత 11 టు 12 డిపార్ట్మెంట్స్ విజిట్ ఉంది. పదకొండు గంటల తరువాత వాళ్ళు ఏ డిపార్ట్మెంట్లో ఉంటే అక్కడికి ఫ్రెష్ ఫ్రూట్ జ్యూష్ పంపించాలి. మాది మూడంతస్తుల కాలేజ్. మైన్ గేట్ నుంచి ఎంట్రన్స్ కు మధ్యలో మంచి దారి, రెండువైపులా అందమైన బొటానికల్ గార్డెన్స్, ఎడమ వైపు కాంటీన్, కుడివైపు పెద్ద పార్కింగ్ ప్లేస్, వెనకాల పెద్ద ఆడిటోరియం ఉన్నాయి. దానికి వెనకాల పెద్ద పి.జి. బ్లోక్ ఉంది. మధ్యలో పెద్ద స్పోర్ట్స్ గ్రౌండ్, జిమ్, ఇంకోవైపు మూడంతస్తుల హాస్టల్ ఉంది. ఇవి గాక  అన్ని డిపార్ట్మెంట్స్. ఈ మొత్తం లో వాళ్ళెక్కడ ఉన్నారో కనుక్కోని మేము సర్వ్ చేయాలి. 12 నుంచి ఒంటిగంటవరకు ఆఫీస్, సైన్స్ లాబ్స్ విజిట్ ఉంది. అప్పుడు వాళ్ళకి మళ్ళీ కాఫీలు, టీలు పంపాలి. అంటే ఒక్క అరగంట తేడాలో వాళ్ళు కాఫీలు, టిఫినీలు,  ఇంకా కూల్ డ్రింక్స్ తాగుతారన్న మాట.

వన్ టు వన్ థర్టీ పేరెంట్స్, అల్లుమిని, స్టూడెంట్స్ తోటి ఆడియొ విజుయల్ రూం లో ఇంటరాక్షన్ ఉంది. ఆ టైం లో మేము వీళ్ళందరికి స్నాక్స్, కాఫీలు పంపాలి.వీళ్ళతో పాటు మళ్ళీ యు.జి.సి. ఎక్స్పర్ట్ కమిటీ కి కూడా పంపాలి. ఏ.వి. రూం లో పేరెంట్స్, ఆ పక్కన రూం  లో అల్లుమిని స్టూడెంట్స్, ఆ పక్కనే ఉన్న  లాబ్ లో మా స్టూడెంట్స్ (మేము సెలెక్ట్ చేసిన పిల్లలు, అంటే మాకు పాజిటివ్ గా మాట్లాడే పిల్లలు మాత్రమే) ఉంటారు. మాకు తోడుగా మొత్తం కాలేజ్ అటెండర్స్, ఆయాలు ఉన్నారు. అంతే కాదు కొంత మంది జూనియర్ లెక్చరర్స్ ని కూడా తీసుకోమన్నారు. ఒ.కే. అన్నీ దిగ్విజయం గానే పూర్తి చేసాం. ఎక్కడా కూడా వాళ్ళు ఏది తిరస్కరించకుండా ఎంతో పెద్ద హృదయంతో   మేము ఇచ్చిన వన్నీ ఆరగించి, సహకరిస్తూనే ఉన్నారు పాపం. వీళ్ళ వెనకాలే వాళ్ళ కో ఆర్డినేటర్ అట, మొదటినుంచి మా వెనకాల కూడా తిరుగుతూ వాళ్ళకు ఏమేమి ఇవ్వాలో మాకు ఉచిత సలహాలు ఇస్తూనే ఉన్నాడు.

ఇంక అప్పటికి వాళ్ళు బాగా అలసిపోతారు కాబట్టి ఒన్ థర్టీ టు టు థర్టీ లంచ్ బ్రేక్ అండ్ డిస్కషన్స్ విత్ మానేజ్మెంట్. వాళ్ళ కో ఆర్డినటర్ నా దగ్గరికి ఒచ్చి  లంచ్ మెనూ ఏవిటో ఆరా తీసాడు. మా సర్ ఎప్పటిలాగే మా హాస్టల్ లో వాళ్ళ కొసం చాలా స్పెషల్సే ప్రత్యేకంగా చేయించారు. ఎన్నో స్పెషల్ స్వీట్స్ కూడా చెప్పారు. ఇవన్నీ విని ఆయన అదోలా తల ఊపేసి, నాన్ వెజ్ ఏమీ లేదా అన్నాడు. నేను వెంటనే మా సార్ దగ్గరికి వెళ్ళిపోయి, ఈ వార్త చేరేసాను. ఆయన ఖంగారు పడిపోతు మా అటెండర్ ని పిలిచి హైద్రాబాద్ బిర్యాని, రెండు స్పెషల్ నాన్ వెజ్ కర్రీస్ వెంటనే తెమ్మని తరిమేశారు. మా సర్ రూం చాలా బాగుంటుంది కాబట్టి అక్కడే లంచ్ ఏర్పాటు చేసాం. మా ముగ్గురిని సర్ అక్కడే ఉండమన్నారు. మాకు రెండు, మూడు రకాల చాలా కాస్ట్లీ, ఇంపోర్టెడ్ క్రోకరీ సెట్స్ ఉన్నాయి. అవన్నీ తెచ్చి  టేబల్ మీద పెట్టాం. అన్ని డిషెస్ కూడా టేబల్ మీద ఎంతో అందంగా ఏర్పాటు చేసాం.నేను అందంగా టేబల్ స్పూన్స్ సద్ది సలాడ్ రెండు వైపులా కారెట్స్, బీట్రూట్స్, కాబేజ్, మిర్చీ, ఆనియన్ తోటి రక రకాల పూలు, డిజైన్స్ చేసి అలంకరించి పెట్టాను. (నేను సలాడ్ డెకరేషన్ లో చాలా ఎక్స్పర్ట్ లెండి). అది చూసి సార్ నన్ను చాలా మెచ్చుకున్నారు. కాని వెంటనే భయమేసింది, ఎప్పుడూ ఇవే డ్యూటీలు నాకిస్తారేమో అని. మా సార్ ఇంట్లోనుంచి స్పెషల్ గా తయారు చేయించి తెప్పించిన 'ఖుర్బాని ' స్వీట్ కప్స్ లో వేసి, పైన కస్టర్డ్ వేసి ఆ పైన వెనిలా అయిస్ క్రీం వేసి(ఇది మా సార్ ఇన్స్ట్రక్షన్) వేరే టేబుల్ మీద పెట్టాము. ఈ లోపల నాన్ వెజ్ డిషెస్ వచ్చాయి. నేను పక్కా బ్రాహ్మిణ్ కాబట్టి ఆ వాసనలేమి నేను తట్టుకోలేక పోయాను. ఆ పని కాస్తా మా గ్రేస్ కి అప్ప చెప్పాను. పాపం తను అవి అన్నీ సద్దేసింది. అందరు లంచ్ కి  వచ్చేసారు. ఇంక మా కష్టాలు మొదలైనాయి. ఒకాయన వార్మ్ వాటర్ కావాలన్నాడు. ఆ పక్కనే   ఫిజిక్స్ లాబ్ ఉంది. ఒక ఆయాను ఉరికించాను, అక్కడ బర్నర్ మీద వేడినీళ్ళు పెట్టుకోని ఫ్లాస్క్ లో పోసుకోని రమ్మన్నాను. ఒకాయన సాల్ట్ లేని కూరలు కావాలన్నాడు. నాకు దిక్కు తోచలేదు. ఇంకో ఆయన కూరలో షుగర్ వేసి ఇమ్మని అడిగాడు. ఇంకేం చెప్తాను లెండి, ఇటువంటి కష్టాలు చాలానే పడ్డాను ఆ లంచ్ కార్యక్రమం పూర్తయ్యే సరికి. మా సర్ అయిదు నిముషాలకొక సారి జయా, జయా, అని పిలుస్తూనే ఉన్నారు, అదేదో తారక మంత్రం లాగా.

అప్పుడే మా కష్టాలు తీర లేదు. టు థర్టీ నుంచి థ్రీ వరకు అన్ని లైబ్రరీల విజిట్, త్రీ టు త్రీ థర్టీ ఫాకల్టీ తో ఇంటారాక్షన్ ఉంది. ఈ లోపల మంచి ఫ్రెష్ ఫ్రూట్ సలాడ్ అందరికీ పంపించాలి. పాపం పొద్దుటినుంచి మా ఆయాలు రకరకాల ఫ్రూట్స్ అందంగ ముక్కలు కోసిపెట్టారు. అవి అన్నీ చక్కటి కప్స్ లో, బుజ్జి బుజ్జి ఫోర్క్స్ పెట్టి పంపించాము. నాకు మనసులో చాలా అనుమనంగానే ఉంది వాళ్ళు వెంటనే అవి తినగలరా అని. నో డౌట్, చక్కగా ఆరగించేసారు.

థ్రీ థర్టీ టు ఫోర్ థర్టీ వరకు ఇంక వాళ్ళు మా కాలేజ్ రిపోర్ట్ తయారు చేయాలి. ఆ తరువాత ఫోర్ థర్టీ నుంచి ఎక్షిట్ మీటింగ్ ఉంటుంది. అంటే అప్పుడు హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ గా నేను కూడా మీటింగ్ లో పార్టిస్పేట్ చేయాల్సి ఉంటుంది. కాని అప్పుడే నా పని పూర్తి అయేలా లేదు. ఎందుకంటే వాళ్ళు రిపోర్ట్ ప్రిపరేషన్ లో ఉన్నప్పుడు వాళ్ళకి మళ్ళీ కాఫీలు, టీ లు అందించాలి. మళ్ళీ ఉరుకులు పరుగులు మొదలైనాయి. పాపం ఈసారి మా జూనియర్స్ ఎంతో శ్రద్దతో వాళ్ళని ఆర్చుకున్నారు.

ఇంక ఎక్షిట్ మీటింగ్ స్టార్ట్ అయింది. ఈ సారి మళ్ళీ స్నాక్స్ అండ్ డ్రింక్స్ సర్వ్ చేయబడ్డాయి. ఇంక వాళ్ళు ప్రెజంట్ చేసిన రిపోర్ట్ ఎలా ఉంటుందో నేను చెప్పాల్సిన అవసరం లేదుకదా! మా కాలేజ్ అన్ని విధాలుగా ఎంతో అభివృద్ధి చెందిందని, 'నాక్ ' నుంచి 'ఏ ' గ్రేడ్ పొందిన గొప్ప కాలేజ్ అని, మా అటానమీ ఇంకో అయిదేళ్ళు పొడిగిస్తున్నామని ఎంతో ఆనందంగా ప్రకటించారు. వాళ్ళకి శాలువాలు కప్పి, మెమొంటోలు ఇచ్చి, కావలసినన్ని ఫొటోలు తీసుకొని,  ఆనందంగా మేము కూడా వాళ్ళని వాళ్ళ కార్ల దాకా తీసుకెళ్ళి, అప్పటిదాకా ఎన్నోసందర్భాలలో  ఇస్తూ వచ్చిన పూలబొకే లను కూడ వాళ్ళ కార్లల్లో పెట్టించి, ఎంతో సంతోషంతో టా టా చెప్పాం.

కాని నాకు మాత్రం ఎంతో అనుమానం, ఇన్ని తిన్న ఆ ముసలి వాళ్ళ అరోగ్యాలు మర్నాడు ఎలా ఉన్నాయో అని:)))
ఇదండి, మేము చేసిన పూజ్యుల సేవ:)


  (నా 'మయూఖ' ని ఖాళీ చేద్దామనుకుంటున్నాను:)   అందుకే నాకు నచ్చని కొన్ని టపాలను తీసేసాను.   నాకు నచ్చిన రెండో మూడో 'మనస్విలో' దాచిపెడ్దామనుకుంటున్నాను.   ఒకటో రెండో ’మయూఖ” లోనే ఉండిపోతాయి. అవి అక్కడే ఉండాలి.  అందుకే, ఈ ప్రయత్నం.)




*********************************************************************************************************************************************************

30, నవంబర్ 2011, బుధవారం

గోలీ మార్~*@*:(




ఒళ్ళుమండిపోతోంది. రగిలిపోతోంది. చంపేయాలనుంది. చాలా ఇరిటేటింగ్ గా ఉంది.
కాలేజ్ పై ఫ్లోర్ కిటికీ లోంచి ఇస్సిరి పారేస్తాను.
ఫాన్ కి హాంగ్ చేసేస్తా!!!
కొత్తగా కడుతున్న ఫ్లోర్ టెర్రస్ పైన సిమెంట్ లో కూరేస్తా!!!!
తొక్కలో వాడు...అడ్డగాడిదా....నక్కగాడు... విలన్ మొహం గాడు... జోకరోడు.... ఊరికే మంచం మీంచి ఠఫాఠఫా పడ్తాడేమో....మెదడు పూర్తిగా మాయమైపోయింది...కొంచమన్నా మిగల్లేదు.

తీరాలి నా కోపం తీరాలి...తీరాల్సిందే నా కోపం...
ఎట్లా...ఎలా..ఏవిధంగా అయినా సరే.... కోపంతో కొరికి కొరికి నా పళ్ళన్నీ అరిగిపోయాయి. తీసుకుపోయి ట్రాఫిక్ జాం లో తిండితిప్పలు లేకుండా వదిలేయాలి.

పెద్ద గొప్ప... బోడి గొప్ప....ఓ పిచ్చి సూట్ వేసుకొని... ఈ లోకంలో ఇంతోటి ఘనుడెవ్వరు లేరు పాపం.... క్రాక్ మాస్టర్... థర్డ్ డిగ్రీ ట్రీట్మెంట్ ఇప్పించాలి...లేకపోతే మమతా బెనర్జీ దగ్గరికి పంపించేయాలి. ఒట్ఠి భీభత్సం గాడు.
చి...చీ...ఇంక చచ్చినా ఈ ఉద్యోగం చేయను గాక చెయ్య్యను... చెయ్యను ... చేయ్యను...అంతే...నాకొద్దు. ఇంక అంతే...టాటా...బిర్లా...ఫో!!!!!

నేనింకా ఏమి రాసుకుంటే ఈ కసి, కోపం తీరాలి.... రామాయణం లో లంఖిణి గాడు.... బాగా ఒబెసిటే వచ్చేస్తుందిలే....

ఇదంతా నాకే లెండి....నా కచ్చకొద్దీ తిట్టుకుంటున్నాను. ఎక్కడంటే ఎవరూరుకుంటారు గనక.... దొరికిందిగా నా బ్లాగూ...నా యిష్టమని....

ఇట్లా తిట్టాలి బాగా....



*******************************************************************************************************************************************************************

30, సెప్టెంబర్ 2011, శుక్రవారం

’నే చూసిన దసరా మంటపం ’

సకల జనుల సమ్మె......
రాజధాని బంద్......
నేను కూడా ఫ్రీ:)
చక్కగా దొరికిన ఈ అవకాశం. ఏం చేయాలి. అవునూ...ఎంతో అందమైన అమ్మవారి మంటపాలు చూసి రావచ్చుకదా! అనుకున్నాను. ఇదిగో, నేను చూసిన ఒక అందమైన దసరా మంటపాన్ని మీరు కూడా చూడండి మరి. నాకు తెలుసు...మీకు తప్పకుండా నచ్చుతుంది. ఈ పాటికే మీరు చాలా చూసేసే ఉంటారు. అయినా సరే, ఇది కూడా చూసేయండి మరి.


ఎంతో అందమైన ఈ దీప తోరణాలు మనల్ని ఆహ్వానిస్తాయి. అందమైన స్వాగతాలు పలుకు తాయి.


అదిగో అల్లంత దూరాన ఎత్తైన ఆ గుడి గోపురం మనల్ని పలకరిస్తుంది. అనంత పద్మనాభ దేవాలయం సొగసులు ఇక్కడ పొందుపరిచారు. ఆ నేలమాళిగలు ద్వారాలుగా రూపుదిద్దుకున్నాయి. చూడండి, ఎంత అందంగా ఉందో!!!


ఇదే ఆ నేల మాళిగ తలుపు. పక్కనే నాగబంధం, వినాయకుడు, గోడమీద దేవతా విగ్రహం కూడా చూడొచ్చు.









మెట్లెక్కి లోనికి ప్రవేశించాలి. అక్కడే మనకు నిలువెత్తు అనంత పద్మనాభ స్వామి దర్శనమిస్తాడు. ఆ పక్కనే మునులు యజ్ఞ యాగాలు నిర్వహిస్తున్నారు.





ఇక్కడినుంచి సన్నటి ద్వారం గుండా లోనికి ప్రవేశించాలి. ఇక్కడ మనకి అగ్నిపరీక్ష. అంటే నిప్పులమీద నడచిపోవాలన్న మాట:) ఇదిగో ఇలాగ.



మెలికలు తిరిగిన ఆ దారిలో ఒక పులి కూడా ఉంది. మనల్ని పలకరిస్తోందా!!!! తస్మాత్, జాగ్రత్త అంటోందా!!!!!



ఆ తరువాత మనం ఈ 'లక్ష్మణ ఝూలా' కూడా దాటాలి. ఇక్కడ కొంతమంది మునీశ్వరులు తపస్సు కూడా చేసుకుంటున్నారు.




ఆ తరువాత ఒక సన్నని గుహ లోకి ప్రవేశించాలి. పాపం ఆయనెవరో!!! ఆయనకి తెలీదు ఆయన ఫీట్ నేను ఫొటో తీస్తున్నానని:)


హు: అప్పుడే ఎక్కడయిందండీ, బాబు. ఇప్పుడు మనం ఈ వైతరిణి దాటితే తప్ప ఆ అమ్మవారు మనకి దర్శనమివ్వదు.


ఈ దీర్ఘ ప్రయాణం తర్వాత, ఇంక మనం గర్భ గుడిలోకి ప్రవేశించినట్లే. అదిగో, చూడండి. ఆ జగజ్జనని శ్రీమతా దుర్గాదేవి దివ్యమంగళ స్వరూపం. అక్కడి దీపాల వెలుగులో, రకరకాల రంగులలో, మిరుమిట్లు గొలిపే ఈ ప్రాంతం, దివ్యలోకాన్ని చూపిస్తోంది.


ఇంతటి దివ్యమంగళ స్వరూపం మనలో భక్తి భావాలను తట్టి లేపుతుంది. ఈ హారతులు, ఇక్కడ ఆలాపించే కీర్తనలు పరవశింప చేస్తాయి.






పవిత్రమైన ఈ తపోవనాలను దాటుకుంటూ, మెల్లిగా...బయటి ప్రపంచంలో మళ్ళీ ప్రవేశిస్తాం.....



ఇక్కడ మనల్ని రకరకాల సాంస్కృతిక కార్యక్రమాలు అలరిస్తాయి.


ఇక్కడే మనకు ప్రసాదాలు, కావలసిన వారికి చల్లటి నీరు, శీతలపానీయాలు లభిస్తాయి.






ఈ గుడి ప్రాంగణంలో కూర్చుని, కార్యక్రమాలను వీక్షిస్తూ, ఫలహారాలు, పానీయాలు సేవిస్తూ......ఎంతకాలమైనా హాయిగా గడిపేయొచ్చు కదూ....



బాగుందా! నా తీర్ధయాత్ర.:)
దసరా పండుగలోని ఈ సరదాలు ఎంతో తృప్తినిస్తాయి. అలరిస్తాయి. అలసిన మనసును సాంత్వన నిస్తాయి. ఈ తొమ్మిది రోజులు స్వర్గలోకాన్నే చూపిస్తాయి. మీరందరు కూడా నవరాత్రు లు బాగా సరదాగా, జరుపుకోవాలి. శుభాకాంక్షలు........

******************************************************************************************

3, ఆగస్టు 2011, బుధవారం

Intellectually Challenged!!!

'Mentally Retarded' అనేకన్నా 'Intellectually Challenged' అంటే ఇంకా బాగుంది కదూ.
ఇదిగో వీళ్ళతోటే మేము Friendship Day చేసుకున్నాం. ఎంతమాత్రం మంచీచెడూ తెలియదు. ఎవరెలాంటివారో అసలే తెలీదు... తమగురించి తమకే తెలీదు...పూర్తి మానసిక వైకల్యమే...అయినా అదేవిటో వారికే తెలీదు.... ఎప్పుడూ నవ్వుతూ తుళ్ళుతూ ఆనందంగానే గడుపుతారు. ఏమైనా నేర్పిద్దామని ప్రయత్నిస్తే నవ్వుతూ చూస్తారు. ఆ...బా...వా....అని నవ్వుకుంటూ వెళ్ళిపోతారు. కానీ, మళ్ళీ నవ్వుకుంటూ మనదగ్గిరికే వచ్చేస్తారు. ఎంతమంచివాళ్ళో, ఎంత అమాయకులో....వాళ్ళు పిచ్చిపిల్లలట. కాదు...ఎంతమాత్రం కాదు. సరి అయిన శ్రద్ధ చూపించి ముద్దారా నేర్పిస్తే, అన్నీ తెలుసనుకునే మనకన్నా చాలా తెలివితేటలే చూపించగలరు. వీరే హైద్రాబాద్ లోని "మానస" స్కూల్ విద్యార్ధులు. నాకు తెలిసిన వారు.

ఈ రోజు వారి ఆటపాటలతో చాలా సంతోషంగా ’స్నేహితుల దినోత్సవం’ చేసుకున్నాం. ఎంతో చక్కగా డాన్స్ లు, పాటలు పాడారు.



ఈ పాప ఎంత చెప్పినా, స్టేజ్ మూలకి వెళ్ళిపోయి చేస్తోంది. కాని చక్కటి క్లాసికల్ స్టెప్స్ ఎక్కడా తప్పకుండా చేసింది, తెలుసా!!!!

ఇదిగో ఇక్కడ నించుంది చూసారా! ఈ పాపే డాన్స్ చేసింది. తెల్లగులాబీ లాగ ఎంత అందంగా, అమాయకంగా నవ్వుతోందో....




ఈ అబ్బాయి వయసెంతనుకుంటున్నారు? మీరు చెప్పలేరు. నాకు తెలుసు. ఎంతోకాదు. కేవలం పదిసంవత్సరాలు మాత్రమే. నమ్మగలరా!!!
చూడండి. హృదయమెక్కడున్నది....అంటూ ఎంతబాగా డాన్స్ చేసాడో....అంతేకాదు, మిగతా పిల్లలందరినీ క్రమశిక్షణ మీరకుండా కాపాలాకాసాడుకూడా. నా కళ్ళతో చూడకపోతే నేనస్సలు నమ్మేదాన్నేకాదు....



ఈ పాప ఎంత చక్కగా రామదాసు కీర్తన పాడిందో...స్పస్టత లేకపోయినా, చక్కటి నిష్ట, ఏకాగ్రతా ఉన్నాయి. సో గ్రేట్.




చక్కటి Friendship Day Bands తయారు చేసారు. అంతేకాదు అందమైన రాఖీలు కూడా తయారు చేసారు. అవన్నీ తీసుకొచ్చి మాకు పంచిపెట్టారు. ఎంతో కళాత్మకంగా చక్కటి గ్రీటింగ్ కార్డ్స్ కూడా తయారు చేస్తారు.

ఇంతతెలివైన పిల్లల్ని చులకన చేసి అందరినుంచి దూరంచేయకుండా మనలోనే కలుపుకుంటే.....అదే అసలైన ఎంతో విలువగల జీవితం...
"చూపులతోనే చులకన భావం వద్దు!
మంచిమాటలతో స్నేహభావం ముద్దు....."

ఈ రోజు నాకనిపిస్తుంది....
"నేను సైతం ప్రపంచాగ్నికి సమిధ నొక్కటి ఆహుతిచ్చాను.
నేను సైతం విశ్వ సృష్టికి అశ్రువొక్కటి ధారపోశాను.
నేను సైతం భువన ఘోషకు వెర్రిగొంతుకనిచ్చి మ్రోశాను......."

నేర్చుకుంటూ ఉన్న వీరి దగ్గిరే నేను ఇంకా నేర్చుకోవాలి. వెలుగుతున్న ఈ దీపమే నన్ను వెలిగించగలదు.వీళ్ళు ఎన్ని సార్లో విఫలమైనా సఫలం కావటానికి మార్గం వెతుక్కుంటూనే ఉంటారు. విజయమే వీరి గమనం.
వీరిపై అపారమైన ప్రేమ కుండపోతగా కుమ్మరించాలనిపిస్తోంది.
నా జీవిత పయనం లో మహోన్నతమైన మజిలీ ఇదే.....మౌనంగా జారే మంచుబిందువులా ఉంది.... కాలగమనంలో......ఈ అందమైన కల కరిగి పోకుండా కలకాలం దాచిపెట్టుకుంటాను.
మనసులో బాధ...గుండెలో వ్యధ....
తోసివేసిన ఈ రాళ్ళను మూల విరాట్టులు చేయటానికి నేనూ చేయూతనిస్తాను.

గొప్పగా మరణించాలి అంటే...గొప్పగా జీవించాలి కదూ.... కనీసం ఒక మనిషిగా నైనా !!!

అందరికీ నా హృదయపూర్వక స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు.
తొందరపడి కూసానా. మేమివాళే కూసేసాం మరి:)



************************************************************************************

1, జనవరి 2011, శనివారం

జ్ఞాపకాల నీడలు....




మిత్రులందరికీ...మనసారా... హృదయపూర్వక... నూతనసంవత్సర శుభాకాంక్షలు.....

నూతన సంవత్సర వేడుకలు అంటే నాకు బ్లాక్ అండ్ వైట్ పాత సినిమాల్లో లా గిర గిరా గింగిరాలు తిరుగుతున్న ఆ చక్రాలు నన్ను తీసుకెళ్ళి నేను బరోడాలో రీసెర్చ్ చేస్తున్న రోజుల్లో ఆపేస్తుంది. హాస్టల్ జీవితం, మా స్నేహాలు నన్ను, గుర్తుకొస్తున్నాయి.....అంటూ అక్కడే ఆగిపొమ్మని వెనక్కి పిలుస్తూ ఉంటాయి....అదే అంతం...అదే ఆరంభం....

మేము అయిదుగురు ఫ్రెండ్స్ ఉండే వాళ్ళం. నేనూ, మంజు, జస్పాల్, నీహాల్, పురుషోత్తం. ఎమ్.ఎస్. యూనివర్సిటీలోరీసెర్చ్ చేస్తూ ఉండగా అక్కడే మాకు మంచి స్నేహం కలిసింది. మా సబ్జెక్ట్స్ ఒకటి కాకపోయినా మా స్నేహం ఎలా కలిసిపోయిందో నాకే గుర్తు లేదు. జస్పాల్ పంజాబ్ అమ్మాయి. మా ఇద్దరికి ఎక్కువగా బాంబే ట్రిప్స్ ఉండేవి. మంజు తమిళమ్మాయి. నా రూంమేట్. తెలుగు బాగా వచ్చు. పురుషోత్తం పక్కా తెలుగు. ఇంకపోతే నీహాల్ గుజ్జూ..అంటే గుజరాతీ. మంజూ, పురుషోత్తం పెళ్ళి చేసుకో బోతున్నారని నాకు మాత్రమే తెలుసు. రోజూ మంజు రాత్రిపూట మేము వర్క్ చేసుకుంటున్నప్పుడు రకరకాల టీలు చేసిచ్చేది. బ్లాక్ టీ..ఒక్కోసారి అందులో పల్లీలపొడి కలిపేది. ఇంకోసారి ఏలకులు కలిపేది. ఇలాగే చాలా ప్రయోగాలు చేసేది. అవన్నీ నాకు ఎంతో రుచిగా అనిపించేవి. ఇప్పటికీ తన చేతి టీ రుచి మళ్ళీ ఎక్కడా దొరకలేదు.

రోజూ సాయంత్రం కాగానే నీహాల్, పురుషోత్తం మా హాస్టల్ దగ్గరికొచ్చేవారు. రీసెర్చ్ స్కాలర్స్ ఏ టైం కయినా బయటికి పోవచ్చు. యూనివర్సిటీ పొడుగునా మధ్యలో రోడ్, అటువైపు ఎంతో అందమైన కమాటీ బాగ్ ఉండేది. రాత్రి పదింటికి అక్కడికి పోయి కూర్చుని కబుర్లేసుకునేవాళ్ళం. రోడ్ పక్కనే ఉన్న టీ బంక్ లో అక్కడే కూచుని వేడి వేడి టీ చేయించుకొని తాగేవాళ్ళం. ఆ పక్కనే ఒక చాట్ బండి కూడా ఉండేది. అది ఎంతో ఇష్టంగా తినేవాళ్ళం. ముఖ్యంగా ఉల్లిగడ్డను ఒడుపుగా పట్టుకొని ఒక చిన్న అబ్బాయి చకాచకా సన్నటి ముక్కలు కోసేయటం నాకు భలే నచ్చేది. ఎన్నోసార్లు ఆ అబ్బాయి దగ్గిర నేర్చుకోవాలని మేము ప్రయత్నించాం కాని, నీహాల్ ఒక్కడే చాలా చక్కగా ఆ టెక్నిక్ నేర్చుకున్నాడు.

నూతన సంవత్సరం అని అందరూ రకరకాల సందడితో ఎక్కడెక్కడికో పోతుంటే మేము మాత్రం ఆ గార్డెన్ లోనే గడపాలనుకున్నాం.
ఆరోజు కూడా అలాగే పార్క్ లోకి చేరుకున్నాం. మాకు ఎంతోనచ్చే కలర్ ఫౌంటెన్ దగ్గర కూచున్నాం. ఒక వైపు చక్కటి గడ్డి, ఇంకోవైపు ఇసుకతో చాలా బాగుంటుంది ఆ చోటు. అక్కడే గడ్డిమీద ఎత్తుగా ఒక గడియారం పెద్ద పెద్ద ముల్లులతో ఏర్పాటు చేసారు. ఆ రాత్రంతా రకరకాల ఆటలతో గడిపేయాలనుకున్నాం. వాళ్ళకే ఆటలు తెలియవు. అందుకే నేనూ మంజూ లీడింగ్ తీసుకున్నాం. తెలుగులో ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతూ వాళ్ళను నానా తికమక పెట్టేసాం. ఇంక మేమాడిన ఆటలు ఏంటో తెలుసా!!!

(ఈ పాటలన్నింటిలో కూడా దీర్ఘ వ్యాధులను తగ్గించే ఆయుర్వేద ఔషధాల గురించే ఉంటుంది (మెడిసినల్ ప్లాన్ట్స్.) గమనించండి)

అందర్నీ కాళ్ళు జాపుకొని కూచోమని...కాళ్ళ గజ్జి కంకాళమ్మా...
వేగూ చుక్కా వెలగా మొగ్గా
మొగ్గా కాదూ మోదుగ నీరు
నీరూ కాదు నిమ్మల వాయ
వాయా కాదు వాయింట కూర
కూరా కాదు గుమ్మడి పండు
పండూ కాదూ పాపాయి కాలు....లింగూ లిటుకూ పందమేల పటుకూ...
కాలూ తీసీ కడగా పెట్టుకో.....అని ఆడించి వాళ్ళందరితో ఒక్కో కాలే మడత పెట్టించి, మేము మాత్రం మా దగ్గిరికొచ్చే సరికి మా కాళ్ళమీద చేయి ఆనించకుండా..చివరికి ఆ ముగ్గురితో నీల్డౌన్ చేయించాం. మేము చెప్పినట్లల్లా ఆడుతున్న ఆ ముగ్గురినీ చూసి మాకు భలే సరదా వేసింది. అందుకని ఇంకో ఆట మొదలుపెట్టాం. అదే....
చెమ్మా చెక్కా చారడేసి మొగ్గా
అట్లుపోయంగ ఆరగించంగా
ముత్యాల చెమ్మచెక్క ముగ్గులేయంగా
రాత్నాల చెమ్మచెక్క రంగులేయంగా
పగడాల చెమ్మచెక్క పందిరేయంగా
పందింట్లొ మా బావ పెళ్ళి చేయంగ
సుబ్బరాయుడి పెళ్ళి...చూచి వత్తము రండి
మా ఇంట్లొ పెళ్ళి..మళ్ళీ వత్తము రండి....
దొరగారింట్లో పెళ్ళి దోచుకు వద్దాం రండి....అని చక్కగా వాళ్ళతో చెమ్మచెక్క ఆడించాం. నీహాల్ అయితే ఎంత ముద్దుగా ఆడాడో:)
ఊహూ.. మాకు తృప్తి కలగ లేదు. వీళ్ళతో బిస్తి గీయిద్దామా మంజూ అని మెల్లిగా అడిగితే తను అంతకంటే హుషారుగా ఒప్పుకుంది. ఇంకేముంది మళ్ళీ ఇంకో ఆట మొదలయ్యింది. అదేనండి.....
ఒప్పులకుప్పా వయారి భామా
మినపా పప్పు.. మెంతీ పిండి
తాటీ బెల్లం ...తవ్వెడు నెయ్యి
గుప్పెడు తింటే ...కులుకూలాడి
నడుమూ గట్టె... నా మాట చిట్టి
సన్నబియ్యం.. చాయ పప్పు
కొబ్బరికోరు..బెల్లపు అచ్చు
చిన్ని మువ్వ... సన్నగాజు
రోట్లో రూపాయ్ నీ మొగుడు సిపాయ్
రోట్లో తవుడు...నీ మొగుడెవరూ....అని చేతులు పట్టుకొని గిర గిరా తిరిగాం. జస్పాల్ కి ఈ ఆట భలే నచ్చింది. నీ మొగుడెవరూ అంటూ నీహాల్ వెంట పడింది. మేము నవ్వలేక చచ్చాం.ఎంతో ఆనందంగా మనమయిదుగురం మా పంజాబ్ లోని అయిదు నదులం కదూ అంది...పరవశంగా కళ్ళు మూసుకొని. పురుషోత్తం ఊరుకుంటాడా...నేనే నదో చెప్పవా..జీలమా..చీనాబా....కాదు కాదు నేను సట్లెజ్ అని నిహాల్ అంటూ నవ్వుకోటం మొదలుపెట్టారు. పాపం జస్పాల్ చాలా ఉడుక్కొంది. అప్పటికే గిరగిరా తిరిగిన నీహాల్ కళ్ళు తిరగటం తో ఇంక కూచొని ఆడుకొందాం అని డిసైడ్ అయ్యాం.
గుడు గుడు కుంచెం గుండే రాగం
పాములపట్నం పడగే రాగం
చిన్నన్న గుర్రం చిట్టికి పోయే
పెద్దన గుర్రం పెళ్ళికి పోయె
మా అన్న గుర్రం మా ఇంటికొచ్చే ...అని ఒకళ్ళ చేతిమీద ఇంకోళ్ళు గుప్పిట్లు మడిచిపెట్టుకొని ఆ ఆట అడుకున్నాం. ఇంతలో దూదూ పుల్ల ఆట ఆడదాం అంది మంజు. ఇంకేముంది..హాయిగ ఇసుక దగ్గరగా పోగుచేసి పొడుగ్గా చేసాం. దూదూపుల్ల...దురాయ్ పుల్ల...చూడాకుండా జాడా తీయ్....ఊదాకుండా పుల్లా తీయ్....అని వాళ్ళకు తెలియకుండా పుల్లను అందులో దాచేసి, రెండు చేతుల వేళ్ళు మడిచి ఎక్కడో అక్కడ మూయాలి. వాళ్ళు మూసిన చోట పుల్ల ఉంటే వాళ్ళు గెలిచినట్లు లేకపోతే వాళ్ళ కళ్ళు మూసి దోసిట్లో ఇసుక పోసి అందులో మళ్ళీ ఒక పుల్ల ఉంచి, ఎంతెంత దూరం అని వాళ్ళతోటి అడిగిస్తూ మేమేమొ కూసింత దూరం అని పాడుకుంటూ ఎక్కడో అక్కడ వాళ్ళ చేతిలో ఇసుక పోసేసి, ఆ తరువాత మళ్ళీ మొదటికే వచ్చి ఆ చోటు కనుక్కోమన్నాం. పాపం వాళ్ళకి ఈ ఆట తెలియదు. కాని పురుషోత్తం మాత్రం వేళ్ళ సందుల్లోంచి చూసేసి కనుక్కున్నాడు. అందుకని మా కళ్ళు మూసి, వీరీ వీరి గుమ్మడిపండు..వీరీ పేరేమి అని మా తోటి ఆడించాడు. ఈ ఆట నీహాల్ కి చాలా నచ్చింది. తనకు కళ్ళు మూయమని మమ్మల్ని ఎదురుగ్గా కూచోమని చేయిపెట్టి ఊపుతూ భలే ఆడాడు. అందరు ముక్కు గిల్లుతుంటే బాగుందంట. కాని మొత్తానికి మా అందరినీ కూడా బాగానే గుర్తుపట్టాడు. ఒక రాత్రిపూట రీసెర్చ్ స్కాలర్స్ అలా చిన్న పిల్లలాటలాడుతోంటే మాకే గమ్మత్తుగా అనిపించింది:)

మా ఆటల సందడి లో గమనించనేలేదు. ఆ గడ్డిగడియారం ముల్లులు పన్నెండు దగ్గరికొచ్చేస్తున్నాయి. మరి మేము హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకోవాలికదా! ఇంతలో మా జస్పాల్..జోయా..ప్లీజ్ ప్లే రుద్రవీణ అంది. ఏ మాత్రం దీర్ఘాలు, కొమ్ములు, వత్తులు వంటివి లేని నా పేరుని తను జోయా అని బెంగాలి వాళ్ళలాగా పిలిచేది. మా వాళ్ళు కూడా నన్నేడిపించటానికి అలాగే పిలిచేవాళ్ళు.తనకి తెలుగు నేర్పించటానికి నేనూ మంజూ చాలా ట్రై చేసాం కాని తనకి, వాడు..అది... అనే పదాలు తప్ప ఇంకేం రాలేదు. మమ్మల్ని కూడా వాడూ, అది అనే పిలిచేది. నేర్పించిన ఖర్మకి మాకు పలకక తప్పలేదు. అక్కడ ఫైన్ అర్ట్స్ డిపార్ట్మెంట్ చాలా ఫేమస్. నేనూ మంజూ అక్కడ రుద్రవీణ నేర్చుకునేవాళ్ళం. మంజు దాన్ని కూడా తీసుకొచ్చింది. ఇద్దరం వంతుల వారిగా పలికిస్తూ ఉండగానే న్యూ ఇయర్ ఒచ్చేసింది. రుద్రవీణ మీద హ్యాపీ న్యూ ఇయర్ ప్లే చేస్తూ మా ఫ్రెండ్స్ ని విష్ చేసాం. ఆ నాద తరంగాలు గాలిలో తేలిపోతుంటే మాకు చాలా సంతోషమేసింది. మేమందరం రీసెర్చ్ అయిపోయి వెళ్ళిపోయేటప్పుడు వీణ తను తీసుకొని వాయించే షటిల్ మాత్రం నాకిచ్చింది మంజు:)

వెంటనే ఆకలి గుర్తొచ్చింది. నిజమే ..మేము తినటానికి ఏమీ తెచ్చుకోలేదు. ఇప్పుడెలా!!!అందరం పార్క్ బయటికెళ్ళాం. మా బండి ఉంది గాని ఇక్కడ ఒక ఆరేళ్ళ పిల్ల తప్ప ఎవ్వరు లేరు. ఆ పిల్ల కునికిపాట్లు పడుతోంది. వెంటనే నిహాల్ ఉల్లిగడ్డలు తీసుకొని చకచకా కట్చేసి ఆ బండి మీద చాట్ చేసి మా కందరికీ పెట్టాడు.ఎంత రుచిగా ఉందో నేను చెప్పలేను. ఆ పిల్లని లేపి చేతిలో డబ్బులు పెడితే ఆశ్చర్యంగా నోరు తెరిచేసింది పాపం. మేము ఏ హోటల్ కెళ్ళలేదు. కాని మేమాడుకున్న ఆటలు..తిన్న ఆ చాట్ ఎప్పటికీ మరిచిపోలేని తీపిగుర్తులుగా మాకు మిగిలిపోయాయి. మాకు ఏమాత్రం చెప్పకుండానే కాలచక్రం గిర్రున తిరిగిపోయింది.

జరిగిపోయిన ఆ కాల గమనంలో చివరకు మాకు మిగిలిందేమిటి? ఎంతో తెలివైన మా అందరికంటే చిన్నవాడైన డా. నిహాల్ చావ్డా చిన్నతనంలోనే కదలలేని పరిస్థితిలో, గొప్ప శాస్త్రజ్ఞుడవ్వాలని కలలు గని, భవిష్యత్తన్నదే లేకుండా మంచాని కంటుకుపోయాడని చెప్పటానికి గుండెగొంతుకడ్డుపడుతోంది. ఎన్నో ఆశలు నింపుకున్న ఆ అమాయక ముఖాన్ని ఎలా మర్చిపోను.... ఆకేసి ఉప్పేసి, పప్పేసి అన్నంపెట్టి నెయ్యేసి..అమ్మకో ముద్ద, నాన్నకో ముద్ద, చెల్లికో ముద్ద అని తినిపించాలని ఉంది. భవిష్యత్తులో ఎంతో ఎత్తుకు ఎదగాలని కలలు కన్న నా ప్రియ స్నేహితురాలు డా. జస్పాల్ కౌర్ దత్ పంజాబ్ లో, పెళ్ళిచేసుకొని ఒక మారు మూల గ్రామంలో ..వంటింటిలో మగ్గిపోతోందని చెప్పనా. ‘దాని’ దగ్గిరికెళ్ళి కొండాపల్లి కొయ్యాబొమ్మా....నీకో బొమ్మా నాకో బొమ్మా...నక్కాపల్లి లక్కా పిడత...నీకో పిడత నాకో పిడత ....నిర్మల పట్నం బొమ్మల పలకలు...నీకో పలక నాకో పలక...చూస్తూ ఉండు ఇచ్చేదాకా.... అని పాడాలని ఉంది. ఏడవకు ఏడవకు వెర్రిపాపాయి...ఏడిస్తె నీ కళ్ళ నీలాలు కారు..నీలాలు కారితే నే చూడలేను...పాలైన కారవే బంగారు కళ్ళ...అని తనివి తీరా ఓదార్చాలని ఉంది.

ప్రొఫెసర్ మంజూ పి. రావ్ కీర్తి కిరీటాలు పెంచుకుంటూ ఒంటరిగా బెంగళూరు లో కాలం గడుపుతోందని చెప్పనా. లేకపోతే...బుర్రుపిట్ట బుర్రు పిట్ట తుర్రు మన్నది...పడమటింటి కాపురం చేయనన్నది...అని పాడనా. మల్లెమొగ్గల నవ్వులారబోసే భార్యకన్నా మించిన ఎంతో గొప్ప కీర్తి కిరీటాల కోసం... ప్రొఫెసర్ పురుషోత్తమ రావ్ ఆస్ట్రేలియా నుంచి తిరిగి రావట్లేదని చెప్పనా..... ఉడతా ఉడతా వెంటనే రా...చక్కని ఉడతా వెంటనే రా..జామ చెట్టు ఎక్కిరా..సగం పండు నీకు...సగం పండు మంజుకు....కలసి మెలసి ఉండు ...రా....అని పాడానా. ఇప్పుడు ఏ పాట పాడాలి. గడప లన్నింటి లోన ఏ గడప మేలు...అని వెతక్కు...అన్ని గడపల్లోన నీ మహలక్ష్మి నివసించు గడప మేలు...అని ఎప్పుడు తెలుసుకుంటావయ్యా....పురుషోత్తమా!!!!

నా మదిలోని ఆ జ్ఞాపకాలే నా జీవితాంతం నా నూతన సంవత్సర సంబరాలు. అది దాటి ముందుకు రాలేక పోతున్నాను. అక్కడే ఆగి పోయాను. అడుగు ముందుకు పడటం లేదే...మరి ఏం చేయను. మేమయిదుగురం ఎప్పటికైనా కలవాలి. అదే నా ప్రతి నూతన సంవత్సరపు ఆకాంక్ష...తీరని కోరిక. నిజమైన ఆనందం స్నేహమే... కదా......

***************************************************************************

3, అక్టోబర్ 2010, ఆదివారం

"నీ ఉజ్వల భవిష్యత్తు కోరుతున్నానురా కన్నా!!! "

బుజ్జులు,

నిన్న, అదే అక్టోబర్ 2 న నీ పుట్టినరోజు. యాపీ యాపీ బర్త్ డే కన్నయ్యా....

స్కూల్ వాన్ దిగుతుంటే నేను ఎదురు రాకపోయినా, పక్కింటి ఆంటీ తో మాట్లాడుతూ ఒక్క నిముషం నిన్నుచూడక పోయినా ఎంత అలిగే వాడివో. స్కూల్ వాన్ తలుపులో నీ చేయి వేలు పడిందని, మన చుట్టు పక్కల వాళ్ళంతా వొచ్చి చేరేలా నువ్వేడ్చినా, నేను బయటికి రాలేదని, అసలు ఇంట్లోనే లేనని ఎన్ని రోజులు గొడవ పెట్టావో. నేనొచ్చేవరకూ, చేతిలో గడ్డి పరకలు, ఇంకా ఏవేవో పట్టుకొని, హకల్బెరీఫిన్ లాగా నీలోనువ్వే ఏవేవో మాట్లాడుకుంటూ ఆక్ట్ చేస్తూ ఉండే వాడివి. ఇంట్లో కూడా నీరూంలో నువ్వు చదివిన బుక్స్ అన్నింటిలో రకరకాల డైలాగ్స్ గట్టిగా మాట్లాడుతూ ఫైటింగ్స్ కూడా చేస్తూ ఉండే వాడివి. నీ గదిలోంచి రకరకాల శబ్దాలు వినిపించేవి. ఒకసారి ఎవరో మీకెంతమంది పిల్లలండీ చాలా గోలగా ఉంటుంది అని కూడా అడిగారు. ఒక్కడే అంటే వాళ్ళు నమ్మనేలేదు.

గాంధీ పుట్టినరోజే నువ్వూ పుట్టావు శాంతంగా ఉండాలి, నువ్వు పేరుకి మాత్రమే శాంతం అంటే...నేను గాంధీ కాదుకదమ్మా అని నవ్వేస్తావు.

నీ పుట్టిన రోజని హారతిచ్చి, తాతయ్యకు, నానికీ కాళ్ళకు దండం పెడితే నీ కాళ్ళక్కూడా దండం పెట్టాలని ఎంత గొడవ చేసే వాడివో గుర్తుందా.

చిన్నప్పుడు నీ పుట్టిన రోజంటే చాలా హడవిడి చేసే వాడివి. అందరూ రావాల్సిందే. ఇంటినిండా బలూన్లు నీ ఫ్రెండ్స్ తో కట్టించే వాడివి. చివరికి పనమ్మాయి కూతురు రాకపోయినా వాళ్ళ ఇంటిముందే నిలబడి, ఏడ్చి రాగాలు పెట్టి, బతిమలాడుకొని మరీ తీసుకొచ్చే వాడివి. ఆ పిల్లేమో భయంతో బిక్కమొహం వేసేది. మీ అందరికీ ఎన్నో రకాల గేంస్ పెట్టి రకరకాల బహుమతులిస్తే చాలా గొప్పగా ఫీలయ్యే వాడివి.

కిరీటాలు, రకరకాల పెద్ద పెద్ద రాజుగారి నగలు, ఆయుధాలు ఎన్ని కొనిపించేవాడివో. ఇంటి నిండా అవే.

పిలిచిన పేరుతో పిలవకుండా, రకరకాల పేర్లతో పిలుస్తావమ్మా, నా మొత్తం పేరుతో పిలిచావంటే మాత్రం నా మీద నీకు కోపం వచ్చినట్లు లెఖ్ఖ, అని ఇప్పటికీ నవ్వుతావ్.

నాతో కావాల్సిన లెసెన్స్ అన్నీ చెప్పించుకొని...నేనేమన్నా నీ స్టూడెంట్నా నా మీద అరుస్తున్నావు ...అనుకుంటూ దర్జాగా వెళ్ళిపోయేవాడివి.

నీ బర్త్ డే కి ప్రతిసారి హాలిడే వస్తుందని, స్కూల్లో శలవివ్వద్దని చెప్పమని ఎంత రభస చేసే వాడివో. చివరికి ఎసెంబ్లీ లో అనౌన్స్ చేయిస్తే, ఒక రోజు ముందుగానే అందరి విషెస్ తో, మహా ఆనందంగా ఇంటికొచ్చే వాడివి. అంతేనా! మర్నాడు స్వీట్స్ కూడా తీసుకెళ్ళే వాడివి. మొత్తానికి ప్రతిసారి నీ పుట్టిన రోజు రెండేసి రోజులు చేయించే వాడివి. గుర్తుందా, బేటా.

ఇప్పుడు పుట్టినరోజుకి ఇంట్లో పార్టీలు కాకుండా, నీ ఫ్రెండ్స్ తో బయటికి వెళ్ళి ఎంజాయ్ చేస్తున్నావు. కేక్ కటింగ్, అర్ధరాత్రి ఫ్రెండ్స్ విషెస్ మొదలయ్యాయి. హొటల్ కొద్దురా మటన్ కలుస్తుంది అంటే, మటన్ ముక్కలు మా ఫ్రెండ్ తో తీసేయిస్తాలే అంటావు. మోపెడ్ ఎక్కుతా అంటావు. కిందపడ్తావురా అంటే అస్సలు వినిపించుకోవు. ఇంటికొచ్చే వరకు ఎంత భయమేస్తుందో తెలుసా. మోపెడ్ కొనివ్వలేదని ఇంకా అలుగుతూనే ఉన్నావు. మోటర్ సైకిల్ మీద పోతున్న స్టూడెంట్స్, వాళ్ళ స్పీడ్ చూస్తే ఎంత భయమేస్తుందో, అదెంత డేంజరో చెప్తె వినవు. అన్నిటికీ ఇట్లా భయపడితే ఎట్లా అంటావు గాని, రోజూ చూస్తున్న ఆక్సిడెంట్స్ తో నా మనస్సు ఒప్పుకోటంలేదురా బాబులూ.

నువ్వు ఎదిగి ఎదిగి ఎంతో పెద్దవాడివై, నిండునూరేళ్ళు, సుఖశ్శాంతులతో, ఆనందమయ జీవితం గడపాలిరా, బంగారుతండ్రి..

చింటుగాడా, నీకు తెలియని విషయం ఒకటి చెప్పనా:) నీ పుట్టిన రోజునే నా "మనస్వి"లో కూడా రాయటం మొదలు పెట్టాను.

నీవు ధనరాశులు సంపాదించకపోయినా...మంచిపేరు సంపాదించుకో బాబా. నువ్వెంత అల్లరివాడివైనా, అమ్మ మాట నీకు ప్రాణమని నాకు తెలుసురా చిన్నా! వింటావు కదురా, అమ్మలూ!!!

ప్రేమతో అమ్మ.


***************************************************************

25, ఆగస్టు 2010, బుధవారం

నాస్టీ ఎక్స్పీరియన్సా!!! అడ్వంచరా!!!!




ప్రతి సంవత్సరం వరలక్ష్మీ వ్రతం తప్పకుండా చేస్తాను. ఈ వ్రతమంటే నాకెంతిష్టమో చెప్పలేను. ఎప్పటిలాగే, చక్కటి పీఠం మీద బియ్యంపోసి, తమలపాకులు పెట్టి, విఘ్నేశ్వరున్ని తలచుకొని, ఒక పెద్ద బిందె మీద చిన్న బింద పెట్టి, చేతులుగా ఒక హాంగర్ కట్టి అమ్మవారి విగ్రహం తయారు చేసాను. అమ్మవారికి కొత్తగా కొన్న పట్టుచీర కట్టి, పెద్ద అంచులు కనిపించేట్లుగా అందంగా సద్దాను. పైన కలశం పెట్టి, కళకళ లాడే పెద్ద వెండి మొహాన్ని పొజిషన్ లో పెట్టాను. శుభ్రంగా ఉతికి ఉంచిన సవరాన్ని వెనకాల భుజాలదాకా పరచి, అందమైన పూలతో అలంకరించాను. పైన జలతారు మేలిముసుగు కూడా వేసాను. చక్కటి పూల దండ వేసి, వివిధ అభరణాలతో అలంకరించాను. గిల్టు, అసలు...అన్ని రకాలు ఉంటాయిలెండి. గౌరమ్మను కూడా చేసి పెట్టాను. వెనక గోడకంతా రకరకాల సైజుల్లో, షేపులతో రంగు రంగుల ఎలెక్ట్రిక్ దీపాల వరుసలతో అలంకరించాను. అమ్మవారి చుట్టూ ఎన్నో పూలు అందంగా ఉంచాను. కలువ పూల అందమైతే మరీ ప్రత్యేకంగా ఉంది. మొగలిపూల సువాసనలు ఆ గదంతా విరజిమ్ముతు ఏదో లోకాలకు తీసుకెళ్ళిపోతోంది. ఇంకా పెద్ద నుంచి చిన్న సైజు వరకు వెండి దీపాలు చుట్టూ పెట్టాను. చిక్కటి రంగులతో వేసుకున్న రంగవల్లి కన్నుల పండుగగా ఉంది. ఇదంతా అయ్యాక చూసుకుంటే అబ్బా.. మా అమ్మవారు ఎంత దేదీప్యమానంగా వెలిగిపోతున్నారో. వెలుగు జిలుగుల మా అమ్మవారు ఎంత ముద్దొస్తున్నారో. చాలా సంతోషమనిపించింది. అబ్బో ఎంత బాగా చేసానో అని భలే గర్వం కూడా వచ్చేసింది. నేను చేస్తున్న ప్రతి అలంకరణ మా అత్తగారు కూడా మెచ్చుకుంటూ ఉండడంతో ఇంకా మురిసి ముప్పందమైపోయాను. ఈ 'ముప్పందం' అంటే ఏమిటో నిజ్జంగా నాకుతెలీదు. ఇది మా అత్తగారి దగ్గిర పట్టిన మాటన్నమాట. కావల్సిన మిగతా పూజా సామాన్లన్నీ కూడా పొందంగా సద్దేశాను. నేను కూడా చక్కగా కొత్త పట్టుచీర కట్టుకొని, హాయిగా వంటినిండా నగలన్నీ పెట్టేసుకున్నాను. ఈ సారి చేయించుకున్న పచ్చలసెట్ వేసుకున్నాను. అబ్బో ఎంత బాగున్నానో..నన్ను చూసి నేనే మురిసి పోయాను. తెలుగాడపడుచంటే ఇలా ఉండాలి. నన్ను నేనే శభాష్ అని మెచ్చుకున్నాను. చక్కగా ఎర్రగా పండిన చేతి గోరింటాకు, చేతినిండా వేసుకున్నగాజులతో, మోచేయి వరకు మాత్రమే కనిపించేట్లుగా అమ్మవారితో ఒక ఫొటో తీసుకొని నా బ్లాగ్ లో పెట్టుకోవాలనిపించింది. అసలే ఈ మధ్యనే గాజులేసుకోనని రాసుకున్నాను బ్లాగ్ లో. తనకు తాను మురిసె తాటాకు గుడిసె అంటే ఇదేనేమో!!!

ఎట్లా నిన్నెత్తుకుందునమ్మా..వరలక్ష్మీ తల్లీ..ఎట్లా నిన్నెత్తుకుందునమ్మా...
ఇట్లా రమ్మనుచూ పిలిచీ కోట్లా ధనమిచ్చే నిన్ను....ఎట్లా నిన్నెత్తుకుందునమ్మా...అని పాడుకుంటూ వెళ్ళి నా డిజిటల్ కెమెరా తెచ్చాను. ముందుగా అక్కడే కూచుని అప్పటి దాకా నాకు సలహాలిస్తున్న మా అత్తగార్ని ఒక ఫొటో తీద్దామనుకున్నాను. ఆవిడకి ఫొటో దిగటమంటే చాలా ఇష్టం. ఫొటో అనంగానే చీర, అంచులూ, నగలూ అన్ని సద్దేసుకొని, నా వైపే కళ్ళర్పకుండా, నేనెప్పుడు ఫొటో తీస్తానా అని బిగించుకొని కళ్ళుకూడా తిప్పకుండా కూచున్నారు. తన ఫొటో ఏ కొంచెం బాగా రాకున్నా చాలా అలుగుతారు. కాని కెమెరా నుంచి చూస్తున్న నాకు అంతా ఎర్రగా కనిపిస్తోంది. ఎందుకబ్బా మా అత్తగారు ఎర్రచీర కట్టుకోలేదే అనుకుంటూ మళ్ళీ, మళ్ళీ చూసాను. ఊహూ... ఎర్రగానే కనిపిస్తున్నారు. ఇదేంటబ్బా, అనుకొని అమ్మవారి వైపు తిరిగి మళ్ళీ లెన్స్ నుండి చూసాను. అయ్యో! అమ్మవారు కూడా ఎర్రగానే కనిపిస్తున్నారు. అరె, అమ్మవారికి నేను ఎర్రచీర కాదే కట్టింది, అని మళ్ళీ చూసాను. లాభంలేదు, ఎర్రగానే ఉన్నారు. ఏంటబ్బా! అనుకొని, ఇంకో వైపున్న టి.వీ. వైపు లెన్స్ పెట్టి చూసాను. అంత పెద్ద నల్లటి స్క్రీన్ కూడా ఎర్రగానే ఉంది. అలా కాదని మిగతా రూమ్ ల్లోకి పోయి అన్ని చోట్లా చూసాను. మా ఇల్లంతా ఎర్రగానే ఉంది. ఎందుకు మా ఇల్లంతా ఎర్రగా అయిపోయిందో అర్ధం కాలేదు. ఈ లోపల మా అత్తగారు అసహనంతో, ఇంకెప్పుడమ్మాయ్, నన్ను ఫొటో తీసేదీ అని గట్టిగా పిలిచారు. అన్ని గదుల్లో సంచరిస్తున్న నేను, ఇంక ఆ ప్రయత్నాలు ఆపి మా అత్తగారి దగ్గరికెళ్ళి మళ్ళీ చూశాను. ఊహూ..ఇంకా ఎర్రగానే ఉన్నారావిడ. ఒక నిమిషం భయం వేసింది. కాని మెల్లిగా నా ట్యూబ్ లైట్ బుర్ర వెలిగి, కెమెరా పాడైంది అని అర్ధమైంది. వెంటనే గాలి తీసిన బెలూన్ లా అయిపోయాను. అయ్యో! ఫొటో తీసుకోలేనా..ఎంత దిగులేసిందో. దిగులెందుకు, రెండు లైన్ల అవతల ఒక ఫొటో స్టూడియో ఉంది. అక్కడికి పోతే నిముషాల్లో రిపేర్ చేసేసి ఇస్తాడు. తెలిసిన వాడే. మా కాలేజ్ కి ఆస్థాన ఫొటోగ్రాఫరే. ఇప్పుడే పోవాలి. సాయింత్రమైతే పేరంటాళ్ళందరూ ఒచ్చేస్తారు. ఇంకా చాలా పని ఉంది. తొందరగా వచ్చేస్తే సరి అని బయలుదేరాను.

కొంచెం దూరంలో ఒక జంక్షన్ ఉంది. రోడ్ దాటాలి. ఇటు పక్కగా కొన్ని కార్లు వరుసగా ఆగి ఉన్నాయి. నేను రోడ్ దాటాలి అంటే ట్రాఫిక్ కంట్రోల్ అయితే తప్ప దాటనన్నమాట. అందుకని అక్కడే ఒక కార్ కానుకుని నించుని సరిఅయిన చాన్స్ కోసం చూస్తున్నాను. మిగతావాళ్ళంతా, వాళ్ళ రెండు చేతులు ఊపేసుకుంటూ, వెహికల్స్ ఆపేసుకుంటూ చకచకా రోడ్ దాటేస్తున్నారు. చీ..నాకీ పిరికితనం ఎప్పుడుపోతుందో. అయినా ఈ మాత్రం జాగ్రత్త ఉండాలిలే...నేనే కరెక్ట్, అనుకున్నాను. ఇలా నా అలోచనా తరంగాల్లో నేనుండంగానే, నా పక్కనే నించున్న ఒకాయన, మేడం, మీ గాజనుకుంట, పడిపోయింది...చూసుకోండి అన్నాడు. అసలే నావి కొత్త గాజులు. పైగా చిన్న క్లిప్ తోటి ఉంటాయి అవి. ఆ క్లిప్ తీసి చేతికి వేసుకొని మళ్ళీ క్లిప్ పెట్టేయటమే. అలా అయితే ఎవరికైనా వేసుకోటానికి సైజ్ ప్రాబ్లం ఉండదు. నేను తరువాత ఈ గాజులు నా కోడలికివ్వాలనుకుంటున్నాను. మరి తన సైజేంటో, ఇప్పుడు తెలీదుగా...అందుకన్నమాట. ఆ క్లిప్ ఊడి పడిపోయాయేమో!!నేను సరిగ్గా పెట్టుకోలేదు అనుకుంటూ, నా చుట్టూ చూసాను. కాని అక్కడ నాకు ఏ గాజులు కనిపించలేదు. ఇక్కడ కాదు మేడం, ఆ కార్ పక్కన పడింది అన్నాడాయన. వెంటనే ఆ కారు పక్కన ఉన్న సందులో ఒక అడుగేసి చూసాను. కార్ చివర ఒకాయన నుంచుని నన్నే చూస్తున్నాడు. మేడం, ఇక్కడ ఉంది గాజు అన్నాడు. ఒక్క అడుగు లోపలికి వేయబోతున్న దాన్ని, ఎందుకో నా చేతుల కేసి చూసుకున్నాను. గాజులు చేతికే ఉన్నాయి. ఎక్కడో కార్ కి ఒక చివర నించున్నతనికి నా గాజు గురించేం తెలుసు! నా మట్టిబుర్రలో ఒక్కసారిగా ప్లాష్ వెలిగింది. చటుక్కున వెనక్కి తిరిగేసాను. నా పక్కనే నించున్న మనిషి నాకు దగ్గరిగా వచ్చేస్తున్నాడు. కారుకు అటు చివర ఉన్న మనిషికూడా నేను వెనక్కి తిరగటంతో నా వైపే మేడం..మేడం అని పిలుస్తూ స్పీడ్ గా వచ్చేస్తున్నాడు. ఏదో ప్రమాదం జరగబోతోందని అప్పుడు కాని నా కర్ధం కాలేదు. గట్టిగా అరుద్దామన్నా నోరు పెగల్లేదు. నా ఎదురుగా వస్తున్న మనిషిని ఒక్క తోపు తోసి కారు సందులోంచి బయటకు దూకేసాను. ఆ మాత్రం చేయటమే నాకెక్కువ. ఆ మనిషి ధఢాల్ మని కిందపడిపోయాడు పాపం. రోడ్ దాకా వచ్చేసి ఒకసారి వెనక్కి తిరిగి చూసాను. ఆ ఇద్దరూ నాకు దరిదాపుల్లో కనిపించలేదు. ఒక్క సారిగా నా గుండె ఆగిపోయింది. బాబోయ్..వాళ్ళు దొంగలు, అని అప్పుడనుకున్నాను. ఒళ్ళు చల్లబడిపోయి, గొంతు తడారిపోయి, అలాగే ఉండిపోయాను.

మెల్లిగా తేరుకున్నాను. రోజూ ఎన్నో వింటున్నాను. ఈ మాత్రం కూడా నాకు తెలివి లేదేంటని తిట్టుకున్నాను. రోడ్ మీద అంతమంది జనం ఉన్నా కూడా ఎంత ధైర్యం వీళ్ళకి!!! నా చేతులు తెగ్గోసేవాళ్ళా...మెడ నరికేసేవాళ్ళా... అమ్మో!!! వాళ్ళెంతోదూరం పోయుండరు. పర్లేదు, నాకు ధైర్యం చాలానే ఉందని ఒక నిమిషం సంబరపడ్డాను. అక్కడ ట్రాఫిక్ పోలీస్ కి చెప్పాలి. లేకపోతే...నా లాగా ఇంకా ఎందరో....ఇవాళ నా అదృష్టం బాగుంది. లేకపోతే ఏమైపోయేదాన్నో!!! మా ఇంట్లో నక్కైతే లేదుకాని తోక తొక్కి రావటానికి, బహుశ: ఆ వరలక్ష్మీ దేవే నన్ను కాపాడింది అనిపించింది. ఎంత చూసినా అక్కడ ట్రాఫిక్ పోలీస్ కనిపించలేదు. అక్కడ ఎక్కువ సేపు ఉండే ధైర్యం మాత్రం లేదు. కెమెరా వద్దు ఏం వద్దు అనుకోని, తల గిరగిరా అన్ని వైపులా తిప్పి చూసుకుంటూనే, మెల్లిగా ఇంటి దారి పట్టాను. వాళ్ళు ఇంకా నా వెనుకే ఎక్కడో రహష్యంగా వస్తూనే ఉన్నారని నా అనుమానం. వాళ్ళకి మా ఇల్లెక్కడ తెలిసి పోతుందో అని భయపడుతూనే, అన్ని వైపులా జాగ్రత్తగా చూసి కాని ఇంట్లో కాలు పెట్టలేదు. ఆ రోజు సాయంత్రం కనీసం ఒక్క పేరంటానికైనా ఇల్లు దాటి బయటికి పోతే ఒట్టు. మనసులోంచి పండగ సంబరం మాయమైపోయింది. మా అత్తగారు ఎంతడిగినా ఎందుకుపోవటం లేదో చెప్పలేదు. అసలేమైందో కూడా ఎవ్వరికీ చెప్పలేదు. అంతేకాదు ఓ రెండు మూడు రోజులు ఆ రోడ్ మీద ఒంటరిగా అస్సలు పోనేలేదు. ఎన్నడూ లేనిది, ఎంతో దగ్గిరలో ఉన్న మా కాలేజ్ కి మావార్నడిగి లిఫ్ట్ ఇప్పించుకున్నాను. ఈ నగరాల్లో ఇంత బాధలు పడుతూ ఉండే బదులు హాయిగా ఏదో ఒక చిన్న పల్లెటూళ్ళో ఏదో ఒక చిన్న పొలంలో పనిచేసుకుంటూ బతికితే, ఎంత శాంతంగా ఉండచ్చో అనిపించింది, ఆ క్షణంలో నాకు. అదీ కాకపోతే గోదారొడ్డున కె. విశ్వనాథ్ వేసేలాంటి ఒక చిన్న గుడిసె వేసుకొని బతికేసినా ఎంత సుఖమో!!!! నాకేమన్నా అయిఉంటే...బహుశ: బ్లాగ్ లోకం నుంచి ఒక బ్లాగ్ ఎగిరిపోయుండేదేమో!!!!! మిమ్మల్నందర్నీ మళ్ళీ పలకరించే యోగం నాకున్నట్లే ఉంది. అందమైన మా అమ్మవారి ఫొటో వచ్చే సంవత్సరం బ్లాగ్ లో పెడ్తాను లెండి. మరి ఈ సారి కుదరలేదుగా:)

మన మహిళలందరికీ శ్రావణమాస శుభాకాంక్షలు. పురుషులందరికీ ప్రత్యేక అభినందనలు. మరి మా పూజలన్నీ మీ కోసమేకదా:)
మాకోసం మీకే పూజలు లేవెందుకో. అందుకే...మా కిలాంటి కష్టాలు.....


********************************************************************************

17, జులై 2010, శనివారం

గాజులు-శఠగోపం!!!




నాకో అలవాటు ఉంది. ఏంలేదు, సాయంత్రం ఇంటికి రాగానే, చేతిగాజులు, మెడలోవి(మంగళసూత్రం తప్ప), చేతిలోవి, చెవివి ఆభరణాలు అన్నీ తీసిపెట్టేస్తానన్నమాట. మళ్ళీ మర్నాడు బయటికి వెళ్ళేప్పుడే అవి తిరిగి నా ఒంటిమీదకి చేరుతాయి. ఈ లోపల ఎటైనా బయటికి వెళ్ళినా హాయిగా అలాగే వెళ్ళిపోతాను. అవన్నీ తీసేసినాక నాకెంతో ఫ్రీ గా ఉంటుందిమరి.

రోజూ సాయంత్రం పార్క్ కెళ్ళి కాసేపు వాకింగ్ చేసి అక్కడి ఫ్రెండ్స్ తో కాసేపు హస్క్ వేసుకునే అలవాటు కూడా నాకుంది. పార్క్ కెళ్ళి ఓ నాలుగైదు రౌండ్స్ నడిచాక, నాకోసం చూస్తున్న నా ఫ్రెండ్ దగ్గరికెళ్ళి కూచున్నాను. రోజూ ఈ రోడ్డు దాటి వచ్చేటప్పటికి నా తలప్రాణం తోక కొస్తోంది తల్లీ, ఈ సర్కస్ ఇంక నేను చేయలేను... మా ఇంటి చుట్టే రౌండ్స్ కొట్టుకుంటానమ్మ, ఇంక నేను పార్క్ కి రాను గాక రాను అని అన్నాను మా ఫ్రెండ్ తో. తను నాగోడు ఏమాత్రం వినిపించుకోకుండా, నీ ధైర్యసాహసాలు తెలియందెవరికి గాని గుడికిపోదాం కొంచెం తోడురా అంది. మొత్తం మనిషినైతే రాగలనమ్మ, కొంచెం మనిషినెలా వస్తాను...అయినా ఈ రాత్రిపూట ఇప్పుడు గుడికెందుకు అనడిగాను. అబ్బా, యక్షిణి ప్రశ్నలేయకుండా ఏ పని చేయవు కదా నువ్వు. మాట్లాడకుండా రా అంది. యక్షిణి ప్రశ్నలు అన్నది యక్షప్రశ్నలకు స్త్రీలింగం కాదనుకుంటా, అని నా అనుమానం వ్యక్తం చేశాను. ఇంక కామెంట్స్ మాని ఉరిమి చూడ్డం మొదలుపెట్టింది. బాబోయ్, నీ ఉరుములు మెరుపులతో మళ్ళీ వర్షం వచ్చేట్లుంది, పద తొందరగా పోయొచ్చేద్దాం. ఇప్పటికే చాలా చీకటి పడింది, అని బయిలు దేరాను. అబ్బో నిన్నెవ్వరెత్తుకెళ్ళరులే ఈ చీకట్లొ అని తనూ నడక మొదలుపెట్టింది. అక్కడే దగ్గిర్లో ఉన్న ఆంజనేయస్వామి గుడికెళ్ళాం.

హనుమాన్ చాలీసా మనసులో చదువుకుంటూ, భక్తిగా తనతోపాటే నేను కూడా ప్రదక్షిణలు చేశాను. ఓ పదకొండు ప్రదక్షిణాలు చేసాక ఆగింది. తీర్థప్రసాదాలు కూడా తీసుకున్నాం. గుడిలో అయ్యగారు, శ్రద్ధగా కళ్ళుమూసుకొని, రెండు చేతులూ కలిపి దండాలు పెట్టుకుంటున్న మాకు శఠగోపం పెట్టటానికి వచ్చారు. మా ఫ్రెండ్ కి శఠగోపం పెట్టారు. ఇంక నా వంతు. నేనింకా చేతులెత్తి దేవుడివైపే పరవశంగా, మైమరచి చూస్తూ దండాలు పెట్టుకుంటున్నాను. అయ్యవారు ఎంత సేపైనా నాకు శఠగోపం పెట్టకపోవటం తో అయ్యగారి వైపు తిరిగి చూశాను. నా నెత్తిన శఠగోపం తగలగానే కోరుకునే కోరికతో నేను సిద్ధమయ్యాను. అయినా అయ్యగారు శఠగోపం పెట్టలేదు. నా రెండు కళ్ళూ దేవుడి నుంచి మరల్చి అయ్యగారి వైపు తిప్పి ప్రశ్నార్ధకంగా, ఇంకా పెట్టరేం అన్నట్లు చూశాను. ఆయనెందుకో నా వైపు పరమ కోపంగా చూస్తున్నారు. నాకస్సలర్ధం కాలేదు. ఏంటమ్మా, ఇది ముత్తైదు పిల్ల గాజులు లేకుండా గుడికి వస్తారా. ఇంటికెళ్ళి గాజులేసుకురా! అన్నారు. అయ్యోరామా! గాజులకోసమా, ఈ కోపమంతా..ఇప్పుడేం చేయాలి. ముత్తైదు పిల్లో...పండు ముత్తైదువో, ఇప్పుడెలాగా? ఇంటికెళ్ళి గాజులేసుకొని నేనెప్పుడు రావాలి.

ఆంజనేయస్వామి దగ్గిర గాజులు లేకపోతే ఏంటట, పోనీ అమ్మవారైనా కాదుగా అనటానికి. లాభంలేదు. గుడికొచ్చి శఠగోపం లేకుండా ఎలా పోవాలి? అందునా నా ఫ్రెండ్ కి పెట్టి నాకు పెట్టక పోతే ఎంతవమానం. ఏమైనా సరే, నేను శఠగోపం పెట్టించుకోవాల్సిందేనని, ఆ నిముషమే...భీష్మణి ప్రతిజ్ఞ, మంగమ్మ శపధం లాంటివి దబదబా చేసేసుకున్నాను. ఈ అయ్యగారేమో వినిపించుకునేటట్లు లేరు. అదేంటి అయ్యగారు, గుడి కి ఎన్నో రకాల వాళ్ళు వస్తారుకదా! నన్నలా అంటే ఎలా? అన్నాను. ఉహూ.. నా పప్పులేమి ఉడకలేదు, కాదుకదా కనీసం నాననైనా లేదు. చూడమ్మా నీకు గాజుల అర్హత ఉందని నాకు తెలుసు కదా! ఈ గుడికి నువ్వు చాలాసార్లే వచ్చావు కదా! అన్నారు. ఇంతమాటన్నాక ఇంకేం మాట్లాడాలి నేను. ఎవరైనా ఆంజనేయస్వామికి గాజులివ్వకపోతారా!!! అవి ఓ రెండేసుకుందాం అని చుట్టూ చూశాను. ఎక్కడా ఒక్క గాజు కూడా కనిపించలేదు. బహుశా: ఆంజనేయస్వామికి గాజులివ్వరనుకుంట. అయినా ఘోటక బ్రహ్మచారి గుళ్ళో గాజులెతకటం నాదే తప్పు. లాభంలేదని అయ్యగార్ని బతిమిలాట్టం మొదలుపెట్టాను. ఎప్పుడూ పొద్దున్నే ఫ్రెష్ గా తయారయి గుడికి వెళ్ళేదాన్ని. ఇవాళ రాత్రిపూట ఇలా వెళ్ళాను ఏంచేస్తాం...ప్లీజ్ అయ్యగారు, ఇంకెప్పుడిలా రాను. ఈ ఒక్క సారికి క్షమించేయండి, అని ఏడుపుమొహం పెట్టాను.

ఇహ, నేను ఇంతగా కాళ్ళా వేళ్ళా గోళ్ళా పడ్డాక తప్పదనుకున్నట్లున్నారు. నా నెత్తిమీద శఠగోపం ఠఫీ మని పెట్టారు. అంత ఘాట్టి దీవెనకి తట్టుకోలేక నెత్తిమీద బరాబరా రాసుకుంటూ, మా ఫ్రెండ్ ని, వీలైనంత కోపం గా చూసుకుంటూ బయట పడ్డాను. తనకేమో నన్ను చూస్తున్నా కొద్దీ ముసిముసి నవ్వులొస్తున్నాయి. గుళ్ళో కూచోవాలిగా మరి. అక్కడ ఒక అయిదు నిముషాలు కూర్చోని ఇంటి దారి పట్టాం. "కరముల పైడి కంకణములతో నిను కొలిచెదమమ్మా! తల్లీ, మము కాపాడగ రావమ్మా" అని అమ్మవారి కీర్తన రాగాలాపన మొదలుపెట్టింది మా ఫ్రెండ్. నాకు ఇంకా పుండు మీద ఖారం, ఇంకా ఏవో ఏవో కెమికల్స్ పోసినట్లనిపించింది. ఇప్పుడర్దమయ్యిందనుకుంటా, గాజుల్లేకుండా ఇంకెప్పుడు గుడికి రాకు, అని మా ఫ్రెండ్ నాకు హితోపదేశం మొదలుపెట్టింది. ఔనౌను, నిజమే! నా కర్ధమైందేమిటయ్యా అంటే వేళా పాళా లేకుండా ఫ్రెండ్ మాట వినకూడదని. చాలా ఉక్రోషంతో, కసిగా అనేసాను తనతో....

అంతేనంటారా? గాజులేసుకోకుండా గుడికెళ్ళకూడదా!!!! ఈ అయ్యగారు నన్నెప్పుడూ చూస్తూనే ఉంటారుగా, అందుకనే అలా అనిఉంటారులే. అందర్నీ అనరు. అని సర్దిచెప్పుకుని....నన్ను నేనే ఓదార్చుకున్నాను.....





****************************************************************************

18, జూన్ 2010, శుక్రవారం

ఆమెన్......



O Lord, Jesus Christ, the Son of God
have mercy on us!


ఈ మధ్య అనుకోకుండా ఒక చర్చ్ కెళ్ళాను. అప్పుడే నా గత స్మ్రుతులు గుర్తుకొచ్చాయి. ఎందుకో ఒకసారి నా ’క్రైస్తవ మతం’ గురించి చెఫ్ఫాలనిపించింది....నా చిన్నప్పటి జ్ఞాపకాలు తరుముకొచ్చేసాయి.

నా చిన్నప్పుడు నేను చదివింది క్రిస్టియన్ స్కూల్లో. అది మామూలు క్రిస్టియన్ స్కూల్ కాదు. ప్రొటెస్టెంట్ స్కూల్. పూర్తిగా మత వ్యాప్తికి ప్రాధాన్యత ఇచ్చే స్కూల్ అది. అక్కడ స్కూల్ లోనే ఒక చాలా పెద్ద, ఎంతో అందమైన చర్చ్ ఉండేది. ప్రతిరోజు పొద్దున చర్చ్ లోనే మా ప్రేయర్. అన్ని స్కూళ్ళల్లో లాగా బయట గ్రౌండ్ లో మామూలు పద్ధతిలో ప్రేయర్ ఉండేది కాదు. అందరమూ తప్పని సరిగా ఒక గంట సేపు మోకాలి మీద కూర్చొని ప్రేయర్ చేయాల్సిందే. ఆ చర్చ్ లో జీసెస్ క్రైస్ట్ జీవిత చరిత్రకు సంబంధించి ఎన్నో పైంటింగ్స్ ఉండేవి. ప్రతిరోజు ఆ చిత్రాలు చూసే నా మనసు నిండా క్రీస్తు జీవితమే నిండిపోయేది.

అందరికీ ఏదో సహాయం చేయాలి అంటూ ఎటో వెళ్ళిపోతూఉండేదాన్ని. రోడ్డుమీద చిన్నకుక్కపిల్ల కనిపించినా ఇంటికి తెచ్చేదాన్ని. ఎక్కడ ముసలివాళ్ళు కనిపించినా వెళ్ళి కాళ్ళో, చేతులో వత్తేదాన్ని. చిన్నపిల్లలకి భక్తి గీతాలు నేర్పించేదాన్ని. ఇంట్లో ఏ మందులు కనిపించినా ఎవరోవొకరికి వద్దన్నా వినిపించుకోకుండా ఇచ్చేసేదాన్ని. ఇలా ఎంత సేవ చేసేదాన్నో ఇప్పుడు చెప్పటం చాలా కష్టం:)

మా మదర్ సుపీరియర్ ఎక్కడ కనిపించినా వెంటనే మోకాలిమీద కూర్చొని క్రాస్ చేసుకొని, ఆమె దీవించే వరకు కదిలేదాన్ని కాదు. ఆవిడకు కూడా నేనంటే చాలా అభిమానమే. ఎన్నో ముఖ్యమైన పనులే నాకు చెప్పేవారు. నేను చాలా బాధ్యత గలదాన్ని అని ఎప్పుడూ ఎంతో మెచ్చుకునేవారు.

చిన్నప్పుడు మనకు కొంత మంది టీచర్ల మీద ప్రత్యేక అభిమానం ఉంటుంది కదా!!! అలాగే అప్పుడు నాకు మా క్లాస్ టీచర్, సిస్టర్ ఫిలోమినా అంటే చాలా పిచ్చి ప్రేమ ఉండేది. ఆమె కేరళ నుండి వచ్చింది. ఒక్క రోజు ఆమెని చూడకపోయినా ఎంతో బాధపడిపోయేదాన్ని. ఆమె మా అందరికీ ఎప్పుడూ చిన్న చిన్న బైబిల్స్, రోజరీ లు బహుమతిగా ఇచ్చేది. అవన్నీ ఎంతో ప్రాణప్రదంగా దాచిపెట్టుకొనే దాన్ని. ఆమె చెప్పేకథలు నా మీద ఎంతో ప్రభావాన్ని చూపించేవి. జీసెస్ అంటే చాలా ఇస్టపడడం మొదలుపెట్టాను. మాకెప్పుడూ "టెన్ కమాండ్మెంట్స్" గురించి ఎక్కువగా చెప్పేది. రాత్రి బైబిల్ చదవకుండా ఎప్పుడూ పడుకోలేదు. నా దిండు కింద అన్ని సైజులల్లో బైబిల్స్ ఉండేవి. దిండు అడ్డదిడ్డంగా ఉండేది. సరిగ్గాపడుకోటానికే కుదిరేది కాదు. నాదిండు ఒక ఇండియా మాప్ లాగా ఉండేది.

రకరకాల క్రాస్ లు మా ఇంట్లో ఎక్కడపడితే అక్కడ దాచిపెట్టేదాన్ని. పాపం ఒకసారి మా అమ్మ వత్తులడబ్బాలో చూసుకుంటే అందులో చక్కటి తెల్ల రాళ్ళతో మెరిసిపోయే క్రాస్ కనిపించింది. మా నాన్నగారి పర్స్ లో కూడా క్రాస్ పెట్టాను. అది నల్లటి క్రాస్. పాపం, అది తేలనుకొని భయపడ్డారుకూడా. అప్పుడప్పుడూ నన్ను మందలించేవారు. మా పనమ్మాయి కి మంచి రంగురంగుల పూసలతోటి, అందమైన క్రాస్ ఉన్న రోజరీ ఒకటి ఇస్తే ఎంతో మురిసిపోతూ వేసుకొంది. కాని మర్నాడు, ఆ రోజరీ లో క్రాస్ కి బదులు అమ్మవారి బొమ్మ ఉంది. వాళ్ళమ్మ కోప్పడి లాకెట్ మార్చేసిందిట. ఇంక, బజార్ లో రంగురంగుల కొవ్వత్తులు కనిపిస్తే అవి కొనిపించేదాకా వదిలేదే లేదు. బుక్స్ లో నెమలిఈకలు దాచి వాటికి మేత వేసుకునేవాళ్ళం కదా చిన్నప్పుడు. నేనైతే మేతతోపాటు రకరకాల క్రాస్ లు కూడా పెట్టేసేదాన్ని. అవన్నీ బాగా ఒత్తుకొని క్వాటర్లీ ఎక్జామ్స్ కల్లా నా బుక్స్అన్నీ చినిగిపోయేవి.

ఏదైనా పండగ వస్తే ఇంట్లో నాతోటి పెద్ద గొడవే జరిగేది. నాకు తెల్లటి పెద్ద లాంగ్ ఫ్రాక్ మాత్రమే కొనమనేదాన్ని. అన్ని వైట్ బట్టలే వేసుకోటం మొదలుపెట్టాను. ఇంట్లో ఏ పూజా పునష్కారం జరిగినా నేను ఆబ్సెంట్ అవటం మొదలుపెట్టాను. ఇంట్లో గనుక కోపం చేసి బలవంతాన కూచోపెడితే ఆ కార్యక్రమం పూర్తయ్యే వరకు కూడా మోకాలిమీద కూర్చొని, నెత్తిమీద తెల్లటి కాపో, కర్చీఫో, టవలో కప్పుకొని క్రాస్ చేసుకుంటూ, కళ్ళుమూసుకొనే ఉండేదాన్ని. అది సత్యనారాయణ వ్రతమైనా సరే ఇంకే పూజైనా సరే. నా పోస్ట్యర్ మాత్రం అదే. అంతేకాదు, అయిన దానికి కానిదానికి క్రాస్ చేసుకుని ఆమెన్ చెప్పుకొనే దాన్ని. నా పేరు సిస్టర్ ఫిలోమినా గా మార్చమని ఒకటే గొడవ చేసే దాన్ని.

అప్పుడు నాకో కోరిక ఉండేది. అదేంటంటే ఎప్పటికైనా సరే ఒకసారి రోమ్ వెళ్ళాలి, పోప్ ని చూడాలి అని. పోప్ ని చూడటం జీవితంలో చాలా పెద్ద అచీవ్మెంట్ అని నాకు గొఫ్ఫ నమ్మకం. క్రిస్మస్ కైతే మా ఫ్రెండ్స్ ని పోగేసి "మాస్" చేసేదాన్ని. బయట తలుపుకి పొడగాటి సాక్స్ వేలాడేసి, మర్నాడు శాంతాక్లాజ్ ఇచ్చిన బహుమతుల కోసం తెగవెతుక్కొనేదాన్ని. అమ్మ వెంటపడి మరీ మంచి కొత్త డ్రెస్ కొనిపించుకొనేదాన్ని. న్యూఇయర్ కి కూడా ఇలాగే చేసేదాన్ని. ఇంక గుడ్ ఫ్రైడే వచ్చిందంటే, మన ఇంట్లో చచ్చిపోయినవాళ్ళెవరు, ప్రేయర్ చేద్దాం రా, ఇవాళంతా మనం ఏడవాలి...అని మాఅమ్మ వెంట పడి పిచ్చి తిట్లుతినేదాన్ని. ఈస్టర్ రోజైతే ఇంటినిండా రకరకాల కొవ్వొత్తులు వెలిగించి పెట్టేసేదాన్ని.

మెల్లిగా ఇంట్లో వాళ్ళకి నా సంగతి అర్ధమైపోయింది. మాది అసలే నిప్పులు కూడా కడిగే శుద్ధ బ్రాహ్మణ కుటుంబం.
ఒకసారి మా అమ్ముమ్మ వచ్చింది మా దగ్గరికి. మా అమ్ముమ్మ దేవుడికి పూజ చేసుకుంటూ, హారతిచ్చే సమయానికి నన్ను పిలిచి మంగళ హారతి పాడమని అడిగింది. నేను వెంటనే మోకాలి మీద కూర్చొని, ఎంతో భక్తితో కళ్ళుమూసుకొని, క్రైస్తవ భక్తి గీతం పాడడం మొదలుపెట్టాను. ఒక్కసారిగా మా అమ్ముమ్మ అదిరిపోయింది. నా చేయిపట్టి గుంజుకోని పోయి, అదేవిటే, పిల్లని కిరస్తాని దాన్ని చేస్తారా ఏవిటి. దాని సంగతి అసలు ఎవరైనా గమనిస్తున్నారా? అని మా అమ్మను నిలదీసింది. ఈ పిల్లని ఇంకో బళ్ళో వేస్తారా, లేకపోతే నేను తీసుకెళ్ళిపోనా? అని మా నాన్న గారి వెంట పడింది.

అప్పటి వరకు నా వ్యవహారం ఎవరూ సీరియస్ గా తీసుకోలేదు. ఇప్పుడింక తప్పలేదు పాపం. నన్ను ఆ ఊరినుంచి మార్చేసి వేరే రెసిడెన్సియల్ స్కూల్ లో వేసేసారు. టెన్త్ క్లాస్ కొచ్చేటప్పటికి, అక్కడి హాస్టల్ వాతావరణం లో, కొత్త ఫ్రెండ్స్ మధ్య క్రమంగా నా క్రైస్తవమతం నన్నొదిలేసి వెళ్ళిపోయింది. లేకపోతే ఈపాటికి నేను నా బ్రాహ్మణత్వం వదిలేసి, క్రైస్తవ మత ప్రవచనాలు చెప్పుకుంటూ, ఏ చర్చ్ లోనో ఒక క్రైస్తవ సన్యాసిని గా బ్రతుకు గడుపుతూ ఉండేదాన్నేమో:) ఆమెన్!

ఇప్పటికీ అల్లంతదూరాన, క్రిష్ణమ్మ ఒడిలోని సాగర్ డామ్ కనిపిస్తూ, అందమైన ప్రక్రుతిలో, కొండల మధ్య ఉన్న నా చిన్నప్పటి పాఠశాలని తలచుకుంటూనే ఉంటాను.

**************************************************************************************************

3, మే 2010, సోమవారం

నల్లమల లో... చెంచులతో...!!!



చెంచులతో రెండు రోజులు నల్లమలలో గడిపాము. అదొక వింతైన, గమ్మత్తైన అనుభూతి. ఆధునిక జీవితానికి పదడుగుల దూరంలో చాలా క్రొత్త ప్రపంచంలో అతికొత్త లోకానుభవం. నల్లమలలోని కొన్ని చెంచు గూడాలను చూడాలనిపించి బయలుదేరాము. వారి జీవనసరళి, ఇతర పద్ధతులూ తెలుసుకోవాలనిపించి...చెట్టులెక్కగలవా, ఒ నరహరి పుట్టలెక్క గలవా, చెట్టులెక్కి ఆ చిటారుకొమ్మన చిగురుకోయగలవా...ఓ చెంచిత....అనుకుంటూ ఝాం అని బయలుదేరాం...!!!

నల్లమల అడువుల్లో చాలా చిన్న చెంచు గూడెం ఒకటుంది. ఆధునిక నాగరికతకు దూరంగా బ్రతుకుతున్నారు. అందుకని, వారికి నాగరికత లేదనటానికి వీల్లేదు. వాళ్ళకు గోత్రాలు, సాంప్రదాయ బద్ధవివాహాలు ఉన్నాయి. చిన్న వయసులోనే పెళ్ళిళ్ళు జరుగుతాయి. అమ్మాయి కాని అబ్బాయి కాని వెళ్ళి గూడెం లో తమకు నచ్చిన వారిని ఎన్నుకొని ఊరిపెద్దైన పూజారి అనుమతితో వివాహం చేసుకోవచ్చు. అతడే గూడెం లోని వారినందరిని ఆహ్వానించి స్వయంగా వివాహం జరిపిస్తాడు. వీళ్ళల్లో బహుభార్యాత్వం ఉంది. అంతే కాదు బహు భతృత్వం కూడా ఉంది. అమ్మాయి కూడా తనకిష్టమైతే ఎన్ని వివాహాలైనా చేసుకోవచ్చు. ఈ మధ్యనే అమ్మాయి పలువివాహాల్ని మాత్రం వీరు వ్యతిరేకిస్తున్నారుట. అబ్బాయిలు మాత్రం బహుభార్యాత్వం కొనసాగిస్తునే ఉన్నారు. అంటే కొంత మన నాగరికత నేర్చుకున్నట్లే. తల్లిదండ్రుల పేర్లే మళ్ళీ పిల్లలకు కూడా కొనసాగిస్తారు. ఊరిమొత్తం మీద ఒక పదిపేర్లు మాత్రమే ఉన్నాయి. అందరి ఇళ్ళల్లోనూ అవే పేర్లు.

ఈ మధ్య ప్రభుత్వం వీరికి గృహాలు నిర్మించి ఇవ్వటానికి ప్రయత్నం చేసింది. కాని వీరు ససేమిరా వద్దనేసారు. కారణం ఏమిటో తెలుసా! నాలుగువైపులా గోడలున్న ఇళ్ళంటే వీరికి భయమంట. అంతేకాదు సమాంతరంగా ఉండే పై కప్పు కూడా వీరు ఇష్టపడరు. మూలల్లో దయ్యాలుంటాయని వీరి నమ్మకం. ఎత్తుతక్కువగా ఉండే పైకప్పు వీరిమీద పడిపోతుందని భయమట. అందుకే గుండ్రంగ ఉండే గుడిసెలు, బరువులేని చొప్పలతో త్రిభుజాకారంలో ఎత్తైన పైకప్పుతో తయారు చేసుకుంటారు. అంతేకాదు, ఇప్పటికి కూడా వీరు ఎప్పుడూ వలస పోతూనే ఉంటారు.గూడెంలో ఎవరైనా చనిపోతే, వెంటనే వేరొక చొటికి గూడెం జనమంతా కూడా వెళ్ళిపోతారు. కేవలం పది గుడిసెలే ఉన్న గూడాలు కూడా ఉండొచ్చు.

మమ్మల్ని సాదరంగా ఆహ్వానించారు. వారితోటి ఉండమని బతిమిలాడారు. ఎంత మర్యాదస్తులో.చక్కటి తెలుగే మాట్లాడ్తారు.చాలా ప్రేమ, అభిమానం చూపిస్తారు. మన జీవిత విధానం వేరని వారికి బాగా తెలుసు. అందుకేనేమో, వీలైనంత సౌకర్యంగా ఉంచటానికి ప్రయత్నించారు. ఇప్పటికీ వంట అన్నది వాళ్ళకు లేనే లేదు. కేవలం కట్టెలపొయ్యిమీద అన్నం మాత్రం వండుకుంటారు. తినటానికి వెరే పాత్రలేవీ వాడరు. బండల మీద అన్నం కుమ్మరించుకొని, ఖారం మాత్రమే అందులో కలుపుకొని తింటారు. మాకోసమని అడవిలోని పెద్ద పెద్ద ఆకులు కోసుకొని వచ్చి అందులో మాకు భోజనం పెట్టారు . అవి కడగనేలేదు. మీరు కూరలు తింటారు, మాకు తెలుసు అని, రకరకాల ఆకులు కోసుకొచ్చి కూరవండి మాకు పెట్టారు. ముందు తినాలనిపించలేదుగాని, తిన్నాకొద్దీ ఎంతో రుచిగా అనిపించింది. ఆకు దొన్నెల్లో తేనె ఇచ్చారు. నాకైతే భక్త కన్నప్ప గుర్తుకొచ్చాడు. అన్నట్లు వీళ్ళకోసం ప్రభుత్వం కట్టించిన స్కూల్ పేరు 'భక్త కన్నప్ప గురుకులం’

ఇష్టకామేష్టి అమ్మవారి దేవాలయం కూడా ఉంది. చాలా చిన్నది. కొంచెం అండర్ గ్రౌండ్ లోకి కూడా ఉంటుంది. లోపలికి ఒంగి వెళ్ళాలి. ఈ గుడికి ఎక్కడెక్కడి చెంచులో వస్తారట. చాలా ప్రసిద్ధి అని చెప్పారు.పూర్తిగా హిందూ మతాన్నే నమ్ముతారు. చాలా మంది క్రైస్తవ మత వ్యాప్తి కోసం ఇక్కడ ప్రయత్నించినా వాళ్ళని హింసించి మరీ వెళ్ళగొట్టారుట. మేమెందుకు క్రైస్తవులుగా మారాలి అని అడుగుతారు.

మాకు అడివి చూపిస్తానని ఒక ముప్పై ఏళ్ళాయన మాతో వచ్చాడు. వన్నెచిన్నెల రంగులీనె ఏనాడూ చూడని పూలు, తీగలు, చెట్ల ఊడలు చూస్తున్నాకొద్దీ అదొక కొత్తబంగారు లోకమనిపించింది. ఆ చిక్కటి అడవిలో నడుస్తుంటే ఏ మూలనుంచి ఏ జంతువులొస్తాయో అని భయమేసింది. మేమంతా ఇక్కడున్నాం కదండి, అందుకే ఏ జంతువులు రావు అన్నాడాయన. ఒక్కసారిగా అక్కడున్న ఒక చెట్టు ఆకులు తీసి చివర్ల నుంచి పీల్చటం మొదలు పెట్టాడు. అదేంటి అంటే దాహమేస్తుంది నీళ్ళు తాగుతున్నా అన్నాడు. అంతే మరి, వాళ్ళు నీళ్ళు పట్టి ఇంట్లో పెట్టుకోటమన్నదే లేదు. ఇంతలో ఆకలేస్తుంది అని ఓ పక్కకి పోయి అయిదునిముషాల్లో వచ్చాడు. అతడి చేతిలో చచ్చిపోయిన జంతువొకటి వేలాడుతోంది. ఏ పులులో వాటిని చంపి, నీరు తాగటానికి వెళ్ళినప్పుడు వీళ్ళు వాటిని ఎత్తుకొస్తారట. ఆ పచ్చి మాంసం అలాగే తినటం మొదలు పెట్టాడు. నాకైతే కడుపులో తిప్పటం మొదలుపెట్టింది. ఇప్పటికీ ఈ విధంగా జీవించేవాళ్ళు ఉన్నారని ఎవరైనా చెప్పిఉంటే నమ్మేదాన్ని కాదు. కానీ నా కళ్ళతోటే చూస్తున్నాను కదా!

నా దగ్గిరున్న ఒక కాడ్బరీ చాక్లెట్ ఇచ్చి తినమన్నాను. మొత్తం బాగానే తిని, ఛీ..మేమైతే ఇట్ల చుంచెలుకలు తియ్యగ తినం, అన్నాడు. అంటే నేనిచ్చిన కాడ్బరీ, ఎలుక అనుకున్నాడు. ఖర్మ...నేను చివరికి ఎలుకలు తినేదానిలాగ కనిపించానా! హతోస్మి...గమ్మత్తేంటంటే, మేము వొచ్చేసేటప్పుడు నాదగ్గిరున్న కాడ్భరీ పాకెట్ మొత్తం అడిగి మరీ తీసుకున్నాడు.

చెట్ల ఊడలు పట్టుకోని చాలా స్పీడ్ గా ముందుకెళ్ళిపోతున్నాడు. మన వెహికల్స్ తో పోటీ పెట్టొచ్చనిపించింది. నేనూ ప్రయత్నించాను అలా పోవటానికి. కాని తరువాత ఏం జరిగిందో చెప్పకపోవటమే మంచిది. నాకు మంచిగా నేర్పిస్తానని మాటిచ్చాడు లెండి:)

అక్కడి ఫారెస్ట్ ఆఫీసర్ చెప్పిన ఒక సంఘటన తెలుసుకుంటే వీళ్ళెంత అమాయకులో కూడా అర్ధమౌతుంది. ఒకసారి ఒకాయనకి కలలో తన స్నేహితుడు తన భార్యని తీసుకెళ్ళిపోతున్నట్లుగ కలవచ్చిందిట. అంతే, మర్నాడే అతన్ని బాణం వేసి చంపేసాడట. పోలీసులు ఎందుకలా చంపావు, నీకు ఋజువేంటి అనడిగితే నాకు కల వచ్చిందిగా అన్నాడుట. చివరికి వీళ్ళ వ్యవసాయం కూడా వాళ్ళ అమాయకత్వాన్నే చూపిస్తుంది. వరి పంటలు పండిస్తారు. కొంచెం భూమిలో అయిదువేల రూపాయల ఖర్చుతో పంట పండిస్తే వారికి వచ్చేది మూడు మూటల ధాన్యం మాత్రమే. మూడు మూటల్లో ధాన్యం ఉందని సంబరపడిపోతారే కాని తాము ఖర్చు పెట్టిన అయిదువేలకు వచ్చింది పదిహేను వందలే అన్న ధ్యాస మాత్రం వాళ్ళకుండదు. ఇప్పటికీ వీళ్ళు బార్టర్ సిస్టమే అనుసరిస్తున్నారు.

ఈ అడవి మొత్తం మీద కొన్ని వేల మంది చెంచులున్నారు. వాళ్ళకి విద్యాబుద్దులు నేర్పాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. వీరందరిలో పదిమంది గ్రాడ్యుయేట్లున్నారుట. వీళ్ళు మాత్రం ఎంతో ఆధునికంగా బయటిప్రపంచంలో జీవిస్తున్నారు. వీళ్ళని చెంచులంటే నమ్మలేము. వీళ్ళ తల్లితండ్రులు మాత్రం ఇంకా అలానే ఉన్నారు. దగ్గరి గ్రామాల్లో వీళ్ళకి హాస్టల్స్, ఉచితవిద్యా సౌకర్యాలు కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఒక యాభైమంది చెంచు విద్యార్ధులు మాత్రమే విద్యనభ్యసించటానికి ముందుకు వచ్చారు.

అన్నట్లు వీళ్ళల్లోనే పచ్చగడ్డి లింగన్న అనే ఒకబ్బాయికి ఆర్చరీలో నేషనల్ అవార్డ్ కూడా వచ్చింది. అక్కడున్న వెదురుచెట్లనుంచి విల్లు, బాణాలు తయారు చేసాడు. బాణాలకి చివర రాతిని అరగ దీసి కట్టాడు. అంతేకాకుండా బాణం చివర నెమలి ఈకలు కట్టాడు. అటువంటి బాణం చాలా దూరం పోతుందిట.గూడెం లోని వాళ్ళందరూ ఇలాటి బాణాలుపయోగించే వేటాడుతారు. ఈ బాణంతోటే అతడు అవార్డ్ గెల్చుకున్నది. ఢిల్లీ లో అధికారులు ఇతని దగ్గరున్న బాణాలు తీసుకొని అక్కడ మ్యూజియం లో పెట్టారుట. ఇతడుకూడా ఉచిత విద్యనభ్యసించినవాడే. నేనుకూడా ఆ బాణం తీసుకొని ప్రయత్నించాను. వెంటనే మా ఫ్రెండ్ అది నీకు సరిపోదులే, "నువ్వేనా...నువ్వులాఉన్న ఎవరోనా..." అని పాడటం మొదలుపెట్టింది. నాకు రోషం, ఆవేశం వచ్చేసాయి. కాని ఏంలాభం, నేను వేసినబాణం పదడుగుల దూరానికి కూడా పోలేదు. కొంచెం నువ్వేసి చూపించవా అంటే వేసాడు. ఆ బాణం పోయినదూరం కొలవటం చాలా కష్టం. అతను దాన్ని తిరిగి తీసుకురాటానికి పదినిముషాల పైనే పట్టింది. ఆ బాణం వేస్తే మనుషులు రెండుగా చీలిపొతారని చెప్పాడు.అది వినగానే నా చేతిలోని విల్లు, బాణం జారి పడిపోయాయి.

వీళ్ళల్లోను రాజకీయాలున్నాయి. కాని అవి వాళ్ళకే పరిమితం. ఇప్పసారా అలవాటు చాలా ఉంది. బాగా తాగుతారు, వాళ్ళల్లో వాళ్ళే కొట్టుకుంటారు. ఎందుకలా అంటే. అదంతే అంటారు.

ప్రస్తుతం ఎంతో అభివృద్ధి చెందుతున్న ఇకో టూరిజం ద్వారా ఇక్కడి ప్రజల సహకారం తో వారిని ఆర్ధికంగా, సామాజికంగా ఉన్నత స్థాయికి తీసుకెళ్ళచ్చనిపిస్తోంది. ప్రభుత్వానికి, ఇక్కడిప్రజలకి ఆదాయం పెరిగే అవకాశం కూడా చాలాఉంది. జూలాజికల్ పార్క్స్, జియొలజి, ఆర్చరీ, ట్రెక్కింగ్, బోటింగ్, స్విమ్మింగ్, మెడిసినల్ ప్లాంట్స్, తెనె పరిశ్రమల వంటి అనేక ఇతర వృత్తివిద్యలకు వీళ్ళేకదా అధినాయకులు. ప్రభుత్వం వీరితోటే ఇవన్నీ నిర్వహించవచ్చు.

కొంతమంది వీరిని ఆధునిక ప్రపంచంలోకి తీసుకు రావటానికి ఇష్ట పడటం లేదట. కారణమేమిటి అంటే,అది ఈ గిరిజన సంస్కృతిని మరుగున పడేస్తుంది, మన ప్రాచీన సంస్కృతిని కాపాడాలి, అన్నది వీరి వాదన. అలా అంటే ఎలా? అందరం ఈ పరిణామ దశ నుంచి వచ్చిన వారమే కదా!!! అభివృద్ధి లేక పోయినట్లైతే, ఇప్పటికీ అందరం ఆది మానవులమేగా!!! అవే ఆకులు అలములు తినాల్సి వచ్చేది కదా...!!!




*************************************************************************

13, ఫిబ్రవరి 2010, శనివారం

"అచ్చిపోయిండు"...




ప్రతి రోజు సాయంత్రం పార్క్ లోకి వెళ్ళి కాసేపు వాకింగ్, టాకింగ్ చేయటం నాకలవాటు. అక్కడ బోల్డు మంది ఫ్రెండ్స్. ఒకపట్టాన ఇంటికి పోబుద్ధి కాదు. ఈ మధ్యనే ఆంధ్రా నుంచి కొత్తగా పెళ్ళి చేసుకొని ఇక్కడికొచ్చిన ఒక అమ్మాయి ఇక్కడి భాషతో చాలా ఇబ్బందిగా ఉంది అని చెప్తోంది. ఏంటబ్బా అంత ఇబ్బంది, అని ఆగలేక ఏమయిందేంటి అన్నాను.

ఆ మధ్య ఎప్పుడో ఆఫీస్ కెళ్ళే హడావుడిలో వాళ్ళాయన షూస్ కనిపించలేదట. ఈ అమ్మాయికి కొత్తకదా, పాపం...హడావుడిగా ఇల్లంతా వెతికేస్తోందిట. అయినా ఎక్కడా కనిపించలేదు. వాళ్ళాయనేమొ టైమయిపోయిందని ఏవో ఒకటి వేసేసుకొని వెళ్ళిపోయాట్ట. వాళ్ళత్తగారు ఆమె కొడుకు చికాగ్గా వెళ్ళిపోయేప్పటికి మనసు నొచ్చుకున్నారట. "అందుకే నేనెప్పుడు సెప్తనే ఉంట. ఏడనో దూరం నుండి పిల్లను తోలుకురావద్దు. నా బిడ్డ బిడ్డని చేసుకొమ్మని ఎంత లొల్లిపెట్టినా ఇనలేదు.ఆడేమో, ఊకె నువ్వూకో, నువ్వూకో అంటడు. అదైతే, మంచిగ ఆర్చుకునేది. అన్నీ జల్ది సేయకుంటె ఎట్లైతది. ఏడున్నాయో సరిగ్గా దేవులాడు...అన్నారట."

ఆ మాటలన్నీ విన్నాక ఆ అమ్మాయికి అయోమయంతో ఇంకా గాభరా పెరిగిపోయిందిట. ఒక్క ముక్క కూడా అర్ధం కాలేదు ఎలాగండీ...అని దిగులు పడిపోయింది. అది విని అక్కడి వాళ్ళంతా ఒకటే నవ్వటం. ఆ నిమిషం లో నవ్వొచ్చినా, తరువాత ఆయ్యో, పాపం అనిపించింది. అనేక ప్రాంతాల్లో రకరకాల భాషలు కదా! అంతా తెలుగే...కాని ఎంత తేడానో!!! అందరూ ఆ అమ్మాయికి ఏవేవో సలహాలు చెప్తున్నారు. మెల్లగా నా మనసు మాత్రం గతం లోని నా అనుభవాన్ని తలచుకోటం మొదలు పెట్టింది.

నేను అప్పుడే నా రిసెర్చ్ అయిపోయి, థీసిస్ సబ్మిట్ చేసి హైద్రాబాద్ లో మా అత్తగారింటి కొచ్చాను. అప్పుడే నేనెంతో ఇష్టపడే ఉద్యోగం కూడా దొరికింది. ఒక పక్క ఇంట్లో కొత్త బాధ్యతలు.ఆ టైం లో ఇంట్లో ఎవరూ లేరు. హాయిగా, నా ఉద్యోగం లో నా కలలెలా నేరవేర్చుకోవాలో ఆలోచించుకుంటూ ఊహాలోకంలో కెళ్ళిపోయాను.

ఇంతలో టక్...టక్...టక్...మని తలుపు చప్పుడినిపించింది. ఎవరా అని ఆలోచిస్తూ తలుపు తీసాను. శ్రీ కృష్ణ పరమాత్ముడి స్టైల్లో దీవిస్తున్నట్లుగా చేయెత్తి మళ్ళీ తలుపు మీద కొట్టబోతున్నాడొకాయన. అక్కడున్నాయనెవరో నాకు తెలీదు. ఎవరు కావాలండీ అని మెల్లగా అడిగాను.

ఆ వొచ్చినాయన "పెద్దయ్యున్నడా?" అనడిగాడు. లేరండి ఏదో పనిమీదెళ్ళారు అన్నాన్నేను.
"అరె, బయటకు పోయిండా! మల్ల నన్ను గిప్పుడే రమ్మన్నడు గందా! అయితె మానె, దొరొచ్చినంక గిట్లా అయితోలు సర్పంచి అచ్చిపోయిండని సెప్పుండ్రి. మళ్ళ ఒకటే ఒర్లుతడు. ఆడ బస్సుల కాడేమో పొద్దుగాల నుండె నూకుతుంటరు. నేను దబ్బున పోకుంటే ఊర్ల లొల్లి పెడ్తరు. ఊకె జబ్బర్దస్తి చేస్తుండ్రు. పుర్సత్ లేకుండైంది." అనేసి గబగబా వెళ్ళిపోయాడు.

తలుపు మూసి లోపలికి ఒస్తున్న నాకు ఇంతకీ ఆ వొచ్చిన వ్యక్తి ఎవరో ఏమిటో, అడగలేదే? ఎక్కడినుంచి ఒచ్చాడో ఏవిటో...ఇప్పుడేం చెప్పాలి నేను. అసలే ఆయన మాట్లాడింది గందరగోళంగా నాకేమి అర్ధం కాలేదు.

మా మామగారు రాగానే, మధ్యాన్నం ఒకాయన ఒచ్చారు. అయితోలు సర్పంచి చచ్చిపోయాడని చెప్పమన్నారు. అని జాగ్రత్తగా విన్న మాటలను గుర్తు చేసుకుంటూ చెప్పాను.

మా మామగారు ఒక్క సారిగా గాభరా పడిపోయారు. మా అత్తగారితో అదే మాట చెప్పారు. "అయ్యయ్యో! చాలా మంచి వ్యక్తి. కపటం లేనివాడు. నేనంటే ఎంతో గౌరవం. నేనక్కడ లేకపోయినా పొలాలన్నీ చాలా శ్రద్ధగా చూసుకుంటాడు. ఏదో నాలుగు మంచి పనులు చేద్దామని, మంచి పేరు సంపాదించుకుందామని అంటూ ఉంటాడు. వయసు కూడా ఎక్కువ లేదు. అప్పుడే పోయాడా! చూట్టానికి బాగానే ఉంటాడే? ఏ జబ్బులు గట్రా ఉన్నట్లు లేవు" అన్నారు. అని నిజంగానే చాలా బాధపడ్డారు. మా అత్తగారితో బయలు దేరండి. మనం తొందరగా వెళ్ళాలి. అబ్బాయి ఊర్లో లేడుగా, తరువాత చెప్పొచ్చులే. అమ్మాయ్, నువ్వు కూడా పదా. అందరం పోకపోతే బాగుండదు, అన్నారు. నాకు చాలా భయమేసింది. అప్పటివరకు నేను చనిపోయిన వాళ్ళను చూడలేదు. అయినా తప్పదుగా! అందరం బయలు దేరాం.

ఊరికి చేరేటప్పటికి తెల్లగా తెల్లారిపోయింది. సర్పంచి గారి ఇంటిముందు ఎటువంటి హడావుడి కనిపించలేదు. చక్కగా కళ్ళాపి చల్లి పెద్ద పెద్ద ముగ్గులు పెట్టిఉన్నాయి. మేము వాళ్ళ ఇంటిముందు కారు ఆపేటప్పటికి, అప్పటివరకు మా కార్ వెనకాలే పరిగెత్తుకొస్తున్న ఊరిపిల్లలంతా కార్ పట్టుకొని వేళ్ళాట్ట౦ మొదలుపెట్టారు. మా డ్రైవర్ కి౦దున్నకట్టెపుల్లల్ని ఏరి వాళ్ళమీద బాణాల్లాగా ప్రయోగి౦చట౦తో వాళ్ళు కాస్తా పారిపోయారు. అందరం మెల్లిగా కార్ దిగాం. వె౦టనే చల్లటి పిల్లగాలి పలకరించింది. ఇంటిలోపలినుంచి చక్కటి పల్లెపదాలినిపిస్తున్నాయి. వంటల ఘుమఘుమలు కూడా మమ్మల్ని పలకరించాయి. ఇంతటి మామూలు వాతావరణం చూసి మాకు చాలా అశ్చర్యమేసింది. మెల్లిగా ఇంట్లోకి అడుగుపెట్టాం.

లోపలికి వెళ్ళాం. అక్కడ కుర్చీలో కాళ్ళుచాపుకొని, కళ్ళు అరమోడ్పుతో, బారెడు పొడుగున్న లావుపాటి చుట్ట కాల్చుకుంటు,తన్మయత్వం లో,చేత్తో కుర్చీ మీద దరువేస్తూ, ముసిముసి నవ్వులతో పరవశమౌతు నిన్న మాయింటికొచ్చినాయన కూర్చోని ఉన్నాడు.

ఆయన్ని చూసిన మా అత్తగారు, మామగారు బిత్తరపోయారు. ఒక్కసారిగా మమ్మల్ని చూసిన ఆయన కూడా బిత్తరపోయాడు. అలా ఒకరినొకరు బిత్తరచూపులు చూసుకుంటూ చాలా సేపే ఉన్నారు. ముందుగా ఆయనే బిత్తరచూపులు ఆపి, అయ్యో, మీరే వొచ్చిండ్రా దొరా. నిన్ననే మీ ఇంటికాడకొచ్చిన. చిన్నమ్మను కూడా తోలుకొచ్చిండ్రా. నేనే మళ్ళ అస్తుంటి గందా! అన్నాడు.

మా మామగారు వెంటనే తేరుకున్నారు. ఏమయ్యా సర్పంచి ఎలా ఉన్నావ్. మనూరు ఒకసారి చూద్దామని మేమందరం ఒచ్చాం, అన్నారు. వెంటనే నా కర్ధమైంది. మా ఇంటికొచ్చినాయనే సర్పంచి అని. ఒక్కసారిగా ప్రప౦చమ౦తా గిరగిరా తిరగిపోతో౦ది. దిక్కులు మరిచిపోయిన నా కళ్ళు టుయ్ టుయ్ మని ఆడుతూ నిట్టనిలువుగా నిలిచి పోయాయి. మా అత్తగారే, చల్లబడిన నా చేయి గు౦జి కుర్చీలో కూలేసారు. ఆవిడకి అర్ధమైపోయి౦ది, నేను ఎక్కడోపప్పులో కాలేసానని, అ౦దుకే ఆ ఊరి ను౦చి జుయ్యిన జారి ఈ ఊరికొచ్చామని.

ఇంతకీ, ఆ సర్పంచి తను ఒచ్చి వెళ్ళినట్లుగా చెప్పమన్న "అచ్చిపోయిండని" చెప్పమన్న మాట నాకు "చచ్చిపోయాడని" అర్ధమవటంతో వొచ్చిన తిప్పలివన్నీ. హతవిధీ! ఇదంతా నా భాషా పరిజ్ణానం వల్ల ఒచ్చిన ప్రమాదమే కదా! ఈ "తారే జమీన్ పర్" గ౦దరగోళ౦ ను౦చి ఎలా బయట పడాలి? అప్పటినుంచి ఆశావాదినై, నిరుత్సాహ పడక ఎంతో పట్టుదలతో శ్రమించి భాషమీద పట్టు సంపాదించాను.హు...ఏం లాభం...ఇంత కష్ట పడ్డా ఇప్పటికీ ఉన్నాయనుకోండి కొన్ని సమస్యలు.

నెహ్రూ గారు చెప్పినట్లు ఆశావాది గులాబీని చూస్తే, నిరాశావాది దానికింద ముల్లుని చూస్తాడట. ఇదే సంగతి మా పార్క్ లో ఆ అమ్మాయికి కూడా చెప్పాను. చూడాలి, ఆ అమ్మాయి ఎలా నిలదొక్కుకు౦టు౦దో మరి!!!...



.....తెలుగు జాతి మనది, నిండుగ వెలుగు జాతి మనది.....


*************************************************************************

17, జనవరి 2010, ఆదివారం

ఇదండీ! మా సంక్రాంతి...



ప్రతి సంవత్సరం మా కాలేజ్ లో అందరం భోగికి, కనుమ పండగకి కలుసుకుంటాం. అది మా కొక అలవాటై పోయింది. అందరం ఇక్కడ సంతోషంగా గడుపుకొని, సాయంత్రం మా మా ఇళ్ళల్లో పండుగలు, పేరంటాలు జరుపుకుంటాం. ఆ రోజు పొద్దున్నే ఎవర్నీ కలవక పోతే ఆ సంక్రాంతి పండుగ లోనే మాకు వెలితి కనిపిస్తుంది.

ఇంతకీ మేమంతా కలిసి ఏం చేస్తామంటే...

పొద్దున్నే మా అయాలు కాలేజ్ ముందు చక్కగా ఊడ్చి కళ్ళాపి చల్లుతారు. గొబ్బెమ్మలు పెడ్తారు. పాటలు పాడుతారు. ఆ రోజు మా అమ్మాయిలకి ముగ్గుల పోటీలు ఉంటాయి. చక్కగా మా కాలేజ్ అంతా ముగ్గులేస్తారు. మా ఆయాలు కూడా చక్కటి ముగ్గులేస్తారు. వాళ్ళని మా పిల్లలు ఆంటీ అనిపిలుస్తూ ఉంటారు. మా పిల్లలు ఈ ఆంటీల దగ్గిర కాపీ కొట్టేస్తూఉంటారు. అయినా చాలా బాగా వేస్తారు. మొత్తం చక్కటి అలంకారాలు కూడా చేస్తారు. ఎంత చక్కటి పండగ కళ ఒస్తుందో!





అంతేనా! ఆ రోజు మా అమ్మాయిలు పతంగులు కూడా ఎగిరేస్తారు. చిలుకా పద పద...నెమలి పద పద...మైనా పద పద..గాలి పటమా పద పద పద....అని సరదాగా పాడుకుంటాం. ఈ సారైతే పద పదవె వయ్యారి గాలి పటమా... అని కూడా పాడుకున్నాం.





చక్కటి ఎక్జిబిషన్ కూడా ఏర్పాటు చేస్తాం. బొమ్మల కొలువు పెట్టి,బొట్టూ, పసుపూ, గంధం అన్నిటి తోటి మేమే తాంబూలాలు ఇచ్చుకుంటాం. మా బొమ్మల కొలువు బాగుందా?





ఈ సారి రాష్ట్రం లో శాంతి నెలకొనాలని మా పిల్ల లు యజ్ఞం కూడా చేసారు. వాళ్ళే ఎంతో శాస్త్రోక్తంగా చేసారు. చూసారుగా, ఎంత చక్కగా చేసారో...




ప్రతీ సంక్రాంతి కి మేము వనమహోత్సవం కూడా చేస్తాం. అంటే ఏదైనా ఒక మొక్క నాటుతామన్న మాట. ఇది మాత్రం మా "పెద్ద సర్" తోటే చేయిస్తాం. ఆయన కూడా కాదనకుండా ఎంతో ఉత్సాహంగా ఒస్తారు.

ఇంకో పని కూడా చేస్తామండోయ్. ఏం లేదు. మా కాలేజ్ లో రకరకాల కమిటీలు వేసుకుంటాం. ఎవరి కమిటీ పిల్లలైన ఆ సంవత్స్యరం బయట జరిగే పోటీల్లో ఏవైనా బహుమతులు సంపాదించుకుంటే, మేము ఇంచక్కా వాళ్ళతో ఫొటోలు తీయించుకుంటాం.

ఇవండీ... మా సంక్రాంతి సంబరాలలొ కొన్ని ముచ్చట్లు. మీకు నచ్చాయా మరి.



చిలుకా పద పద ... నెమలీ పద పద ... మైనా పద పద ... మనసా! పదా ... గాలిపటమా పద పద పద...




*******************************************************************************
 

మనస్వి © 2008. Template Design By: SkinCorner