వంటకాలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
వంటకాలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

10, నవంబర్ 2011, గురువారం

విందు భోజనాలు




అక్కడ కేవలం పదేళ్ళ లోపు వయసున్న మొగపిల్లలు మాత్రమే ఉన్నారు. వాళ్ళకి పదహారు ఏళ్ళ వయసు వచ్చే వరకు అక్కడే ఉండి చదువుకుంటారు. ఏదో వృత్తివిద్య నేర్చుకుంటారు. అప్పుడప్పుడూ వారిని పలుకరిస్తూ ఉంటాను. అలాగే ఇవాళ కూడా కాసేపు సరదాగా కబుర్లు చెప్పుకుందామని వెళ్ళాను. ఇవాళ వాళ్ళకి తినటానికి ఏమీ తీసుకు పోలేదు. ఇవాళ ఏమీ తేలేదర్రా, ఇక్కడే ఏమన్నా చేసుకుందాం.తినుకుంటూ హాయిగా ఆడుకుందాం. పాటలు పాడుకుందాం, కథలు చెప్పుకుందాం... సరేనా!!! మీరే చెప్పండి, ఏమన్నా అని అడిగాను.
అక్కా, అక్కా నేను చెప్తాను అంటూ వచ్చాడు ఏడేళ్ళ శీను. (నేను నన్ను ఆంటీ అని పిలవమన్నా ఎందుకో అక్కా అనే పిలుస్తారు:) కన్నా వీడికంటే కొంచెం పెద్ద వాడు. అంతే. అయినా పేద్ద లీడర్ అనుకుంటాడు. నేను చెప్తానక్కా అన్నాడు. సరే అందరూ తోచినట్లు చెప్పండి. మన ఇష్టమొచ్చినట్లు చేసుకుందాం...సరేనా అన్నాను. అందరూ సరే సరే అంటూ ఏకధాటిగా ఏం చేయాలో చెప్పటం మొదలు పెట్టారు.
మూంపల్లీలు బాగుంటాయి దానితో చేసుకుందాం అన్నాడు కన్నా.
సరే అయితే చెప్పు, అని డబ్బాల్లో వెతికితే కనిపించాయి. చాలానే ఉన్నాయి.

అక్కా బాగా ఉడకపెట్టాలి అన్నాడు. సరే వాడి గైడెన్స్ ఒప్పుకున్నాను కాబట్టి తప్పదు. నేనే చేస్తాను అని చక్కగా కుక్కర్ తెచ్చి అవన్నీ కడిగి ఓ గిన్నెలో పోసి నీట్ గా స్టవ్ మీద పెట్టాడు. ఏయ్, ఆ నీళ్ళల్లో కొంచెం ఉప్పువేయ్ అనరిచాడు శీను. అవునుకదా, అని అందరం నవ్వేసాం. మా లీడర్ గారు కుక్కర్ తెరిచి దానిలో చేతితో కొలుచుకుంటు రెండు మూడు చెంచాల ఉప్పు వేసేసాడు. అంత చిన్నవాడు, ఎంత జాగ్రత్తగా చేసాడో ఆ పని. అక్కా, దీన్ని అయిదు విజిల్స్ తరువాత ఆఫ్ చేయాలి అని అక్కడే కూర్చున్నాడు. సరే, ఇహ అందరం ఆ కుక్కర్ దగ్గిరే విజిల్స్ కోసం ఎదురు చూస్తూ కూర్చున్నాం. ఈ లోపల నాని వచ్చి నేనే బంద్ చేస్తా అన్నాడు. అందరూ నవ్వటం మొదలు పెట్టారు. ఎందుకురా అంటే, రోజూ బంద్ లన్నీ చూసి ఇక్కడ కూడా బంద్ చేద్దామని వచ్చాడు అని అంతా ఒక్కటే నవ్వు. నాని గాడి బుంగమూతి చూసి, ఊరుకోండిరా, అలా తమాషా చేయకూడదు, మనం స్టవ్ బంద్ చేయటమనే అంటాం కదా అన్నాను. మొత్తానికి వాడే స్టవ్ బంద్ చేసాడు:)

సరే ఎలా గయితేనేం ఈ మగపిల్లలంతా కలసి చివరికి ఉడికిన ఆ పల్లీలను బయటికి తీసారు. మరి ఇప్పుడేం చేయాలి అని అడుగుతూనే ఉన్నాను...ఈ లోపలే కన్నా చిన్న జల్లెడ తెచ్చి దానిలో పల్లీలను చాలా ఒడుపుగా దొర్లించి, అక్కా నీళ్ళన్నీ పోయే దాకా ఆగుదాం అన్నాడు. చక్కగా వడ గట్టిన ఆ పల్లీలను పెద్ద కంచం లో పోసాడు. కన్నా, నానీ, శీను కింద చతికిలబడి, కత్తిపీట తీసుకొని ఒకరి తరువాత ఒకరుగా చక చకా పచ్చి మిరపకాయలు, ఉల్లిగడ్డలు, టమాటాలు చిన్న చిన్న ముక్కలుగా కోసేసారు. మిగతా పిల్లలంతా చుట్టూ చేరారు. వాళ్ళతో మీరందరూ వీటిని చక్కగా అందంగా పల్లీలమీద చల్లండి అని ఆర్డర్ వేసి, తనేమో నిమ్మకాయ కోసి దానిమీదంతా సమానంగా పిండాడు. తర్వాత సన్నగా కొత్తిమీర కోసాడు. ఇదన్నా నేను చల్లుతానురా అని వాడి పర్మిషన్ తీసుకొని ఆ పని నేను చేసాను. నా దగ్గిర కొన్ని డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి కూడా చల్లేసాను. దీనిమీద కొంచెం సేవ్ చల్లుదాం అన్నాడు అప్పటి దాకా చూస్తూ కూచున్న రహీం గాడు. ఎక్కడ చూసినా సేవ్ కనిపించలేదు. ఏం చేద్దాం అని అలోచనలో పడ్డాం. పోనీ బయట షాప్ లో తొందరగా తీసుకొచ్చేస్తా అన్నాడు వాడే మళ్ళీ. అలా అయితే ఇది చల్లగా అయిపోయి ఏమాత్రం బాగుండదు అక్ఖర్లేదు అన్నాడు కన్నా గాడు. ఎలాగోలా వాడిని ఒప్పించి రహీం షాప్ కెళ్ళి వచ్చే వరకు ఓపిక పట్టాం. పెద్ద హీరో లాగా ఫీల్ అయిపోతూ, తానే మొత్తం పల్లీల మీద సన్నగా చల్లాడు. అబ్బా, ఒక్క సారిగా దాన్ని చూస్తుంటే రకరకాల రంగులతో ఎంతో అందంగా కనిపించింది.

హాయిగా ఆ పెద్ద పళ్ళెం తో బయటికొచ్చి, కింద గడ్డిమీద పెట్టి చుట్టూ కూర్చున్నాం. ఆనందంగా "విందు భోజనం...పసందు భోజనం, ఏటి గట్టు తోటలోన మేటి భోజనం" అహహ్హ హహ్హ హహ్హా...ఒహొహ్హొహొహ్హొ హొహ్హొ అహహహహ్హహా..వింతైన భోజనంబు...ఇవన్ని మాకె చెల్ల:))) అని పాడుకుంటూ... కబుర్లు, పాటలతో మొత్తం తినేసాం.

తెలిసిపోయిందిగా, మా అబ్బాయిలు చేసిన వంటకమేమిటో:)

కార్తీక వనభోజనాలతో అంతా భుక్తాయాసంతో ఉండి ఉంటారు. సాయంత్రం పూట హాయిగా మా చిన్నారులు కలిసిమెలిసి చేసి మీకు ప్రేమ మీర వడ్డించిన ’పీనట్ స్నాక్’ ఆనందంగా తినేసి, వేడి వేడిగా చాయ్ చేసుకొని తాగేసేయండేం:)))

జ్యోతి గారు మా వంట పనికి రాదంటే మాత్రం నేనొప్పుకోనంతే... చెమటోడ్చి, కష్టపడి చేసాం.

ఆహా!!! ఏమి రుచి...తినరా మైమరచి...రోజూ తిన్నా మరి మోజే తీరనిది...అని హాయిగా పాడుకోవాలి. సరేనా:)

(కెమెరా తీసుకు పోలేదుగా...అందుకని సొంత ఫొటో లేదన్నమాట)

మిత్రులందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు


**************************************************************************

2, నవంబర్ 2009, సోమవారం

వనభోజనాలు





























"గోలా భాత్"

కార్తీక మాసం హరి, హరులకు ఎంతప్రీతో, మనకూ అంతే ప్రీతి. పూజలు, నోములకే కాదు, వనభోజనాలు కు కూడా ఇప్పుడే సరయిన సమయం. పౌర్ణమి వెన్నలలో చేసే భోజనాలు ఎంతో ఆహ్లాదాన్నిస్తాయి. అందులో ఇంక రకరకాల వొంటలతోటి విందుభోజనం ఇంకా పసందుగా ఉంటుంది.

మరి వనభోజనాలలో నేను కూడా ఒక ఒంట చేయాలికదా. ఏం చేయాలబ్బా! ఇదే ఆలోచన. నేను రోజు సాయంత్రం వాకింగ్ కోసం పార్క్ కెల్తాను. అక్కడ కొంతమంది ఫ్రెండ్స్ అయ్యారు. నాకొక పంజాబి స్నేహితురాలు, గీతామెహ్రా ఉంది. తనతో మాట్లాడుతూ ఏదైనా కొత్తరకం వొంటకం చెప్పమన్నాను.మంచి మరాఠీ ఒంటకం చెప్తానని "గోలా భాత్" గురించి చెప్పింది. చివరికి నేను అదే చేద్దామని డిసైడ్ అయిపోయాను.

సో, పంజాబి ఫ్రెండ్ చెప్పిన మరాఠీ స్పెషల్ మన తెలుగు వనభోజనం లో మీ కందిస్తున్నాను. ఎంతైనా మనది "భినత్వంలో ఏకత్వం" కద.

గోలా భాత్ చేయు విధానబెట్టిదనిన: ఇది మనం చాలా సులభంగా చేసేసుకోవచ్చు. రైస్ కుక్కర్ లో కూడా వొండచ్చు. దీన్ని కొన్ని దశలుగా చెయాలి.

మొదటి దశ: గోలా భాత్ బాసుమతి బియ్యం లేదంటే మామూలు బియ్యమైనా వాడొచ్చు. ముందు ఒక బాండీ లో కొంచెం నెయ్యి వేసి అందులో అల్లం, ఎల్లిపాయ పేస్ట్ కొంచెంగా వేసుకోవాలి. అందులోనే కొంచెంగా దాల్చిన చెక్క, షాజీర, ఇలాచీలు కొంచెం పొడిపొడిగా దంచుకొని వేసుకోవాలి. కొంచెం మిరియాలు, ఇంగువ కూడా వేసుకోవాలి. దీనిని కొంచెంగా వేడిచేసి అందులోనే మనకు కావలసినంతగా బియ్యం వేసుకోవాలి. అరకొరగా బియ్యాన్ని వేయించి తీసి రైస్ కుక్కర్లో వేయాలి. ఒకవేళ కిలో బియ్యమైనట్లైతే దానిలో మన అలవాటును బట్టి నీరు పోసుకోవాలి. ఇష్టపడేవారు, వెజిటబల్ రైస్ లాగా కొన్ని కారట్, బీన్స్ ముక్కలు, బఠాణీలు కూడా వేసుకోవచ్చు. ఉడుకుతూ ఉండగా, గిన్నె అంచుల నుంచి కొంచెం నూనె వేయాలి. మధ్య భాగంలో రెండు లేదా మూడు చెంచాల నెయ్యి పోయాలి.

ఇందులోనే ఇంకొక భాగం కూడా ఉంది. ముఖ్యంగా దీనివల్లే దీనికి గోలా భాత్ అనే పేరొచ్చింది. కిలో బియ్యం గనక ఒండినట్లైతే అందులోకి అరకిలో శనగపిండి అవసరముంటుంది. శనగపిండిని ఒకగిన్నెలో వేసుకొని, అందులో కొంచెం ఉప్పూ, ఖారం, నూనె వేసి గట్టిగా ముద్దలాగా కలుపుకోవాలి. కలుపుకున్న పిండితో గులాబ్ జాం లాగా కొన్ని చిన్న చిన్న గుండ్రని ముద్దలుగా చేసుకోవాలి. వీటినే మరాఠివాళ్ళు "గోలా" అని అంటారు. తర్వాత లడ్డూలను రైస్ కుక్కర్ లో ఉడుకుతున్న బియ్యంలో వేయాలి. భయపడఖర్లేదు. ఇవి బియ్యంలో కలసిపోవులెండి. చక్కగా విడి విడిగానే బియ్యంతో పాటే ఉడుకుతాయి. అదే సమయంలో భాత్ లో కొంచెం ఉప్పేసుకోవాలి.

సో, యువర్ "గోలా భాత్" ఈజ్ రేడీ...

ఇంక రెండవ దశ: ఇమిలీ చట్నీ

ఇది ఇంకా ఈజీ. ఆడుతూ పాడుతూ చేసేయొచ్చు. ఏంలేదండి. ఇప్పుడేం చేయాలంటే గోలాభాత్ తినేటప్పుడు చట్నీ కావాలికదా! అది తయారు చేయాలన్నమాట. ఒంట మొదలు పెట్టటానికి ముందుగానే కొంచెం చింతపండు నానబెట్టుకోవాలి.దాన్ని కొంచెం జారుగా చేసుకొని అందులోనుంచి చింతపండు మిగిలిన తుక్కు తీసేయాలి. అందులోనే చాలా కొంచెంగా శనగపిండి నీటిలో కలుపుకొని ఇందులో కలపాలి. చిటికెడు బెల్లం, కొంచెం ఉప్పూ కూడా ఇందులో వేయాలి. దీనిని స్టౌ మీద కాసేపు ఉడికించి దించేయాలి. ఇదే ఇమిలీ చట్నీ. దీనిని గోలా భాత్ తో నంచుకొని తినాలి. అప్పుడు స్వర్గానికి బెత్తడే దూరం, అంతే.

మూడవ దశ: ఇక్కడ నూనెలో పోపు చేసుకోవాలి అంతే. నూనె వేడిచేసి అందులో కొంచెం ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు వేసి పోపు చేసుకోవాలి. కావాలనుకుంటే, తినే అలవాటు ఉన్నవాళ్ళు ఇందులో మూడు, నాలుగు ఎల్లిపాయ రెబ్బలు కూడా వేసుకోవచ్చు. నూనె గోలాభాత్ తినేటప్పుడు కొంచెంగా పైన వేసుకోవాలి. ఇందులోని మిరపకాయాలు కొంచెంగా కొరుక్కుంటూ భాత్ తినొచ్చు. గోలా భాత్ తినేటప్పుడు ఒకపక్క ఇమిలీ చట్నీ, ఇంకో పక్క పోపు వేసిన నూనె ఉంచుకొని తినాలి. కావాలనుకుంటే మధ్యమధ్యలో సలాడ్ కూడా ఎంజాయ్ చేయొచ్చు.

ఇదండీ గోలాభాత్... బాగుందికదూ!

ఏవిటో, ఎంత ఫ్రెండైతే మాత్రం పుంజాబీ ఆంటీ చెప్పిన మరాఠీ వంటకం మన ఆంధ్రా వనభోజనాలలొ చేస్తుందా! ఎంత ధైర్యం అని నన్ను గిరగిరా తిప్పి అవతల విసిరేస్తారో ఏమొ....


*********************************************************************************************************************

 

మనస్వి © 2008. Template Design By: SkinCorner