
రాబోయె ఎలక్షన్స్ లో ట్రైనింగ్ క్లాసెస్ కి, పోలింగ్ కి, కౌంటింగ్ కి మా కాలేజ్ తీసేసుకుంటారు. దీని మూలంగా మా అల్మనాక్ బాగా డిస్టర్బ్ అవుతుంది. అందుకని, కనీసం పోలింగ్ ఆఫీసర్ల ట్రైనింగ్ క్లాసులన్న ఇంటర్ బిల్డింగ్ లో వీలైతుందేమొ, అక్కడి ఆడిటోరియం చెక్ చేసిరమ్మని మా ప్రిన్సిపల్ అడిగారు. అందుకని, నేను అనుకోకుండా మా ఇంటర్మీడియట్ బిల్డింగ్ కి వెళ్ళాను. క్లాస్ రూంలు చూసుకుంటూ లైబ్రరీ కి వెల్తున్నాను. అన్ని క్లాసులు చాలా సీరియస్ గా జరుగుతున్నాయి. ఒక క్లాస్ లో మాత్రం ఓ పదిమంది అమ్మాయిలు ఖాళీగా ఉన్నట్లున్నారు, ఉప్పరి మీటింగ్ పెట్టేసుకున్నారు. నా కెక్కడైనా పిల్లలు ఖాళీగా కనిపిస్తే అక్కడ దూరిపోవటం అలవాటు. ఇంకా ముందుకి పోలేక వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయాను. పాపం, ఆ పిల్లలు నన్నుచూసే సరికి వాళ్ళమాటలు ఆపేసి, నిలబడిపోయారు. అంతవరకు హాయిగా మాట్లాడుకుంటున్న వాళ్ళ మూడ్స్ పాడుచేయటం నాకిష్టం లేదు. అయినా, నాకు వాళ్ళని వొదలాలనిపించలేదు. ఏమర్రా, మీ కే క్లాస్ లేదా ఇప్పుడు అన్నాను. మాకు ఇప్పుడు లీజర్ మేడం అన్నారు. ఒహో! అయితే ఏం మాట్లాడు కుంటున్నారు, దేనిమీద మీ డిస్కషన్ అంటూ వాళ్ళలో చేరిపోయాను, నేను ఒచ్చిన పని పక్కనపెట్టేసి.
వాళ్ళకెన్నో కబుర్లుంటాయ్, అవి నాకెందుకు చెప్తారు. వాళ్ళు చాలా సీరియస్ గా డిస్కస్ చేస్తున్న టాపిక్ 'పెళ్ళిచూపులు' గురించి. కాని, ఒకమ్మాయ్ వెంటనే అనేసింది మేడం, మా ఫ్రెండ్ కి రేపు పెళ్ళిచూపులట...అది ఏడుస్తోంది, అంది. నిజంగానే నాకేం తోచలేదు. అప్పుడే వీళ్ళకి పెళ్ళేంటి. వెంటనే ఇంకో అమ్మయి అంది. మేడం, మా అక్కయ్యని మా బావ మా ఇంటికి పంపించేసాడు. రోజూ ఏడుస్తుంది... అంది. మేడం. ఈ మొగవాళ్ళు అస్సలు మంచి వాళ్ళు కాదు మేడం, నేనైతే పెళ్ళే చేసుకోను..మా వాళ్ళకి చాలా గట్టిగా చెప్పేస్తాను...అంది, ఇంకో అమ్మాయి. ఇలా వాళ్ళు రకరకాల కామెంట్స్ మొదలు పెట్టారు. వాళ్ళు ఉపయోగిస్తున్న మాటలు గాని, పెళ్ళి పట్ల వాళ్ళ అభిప్రాయాలు కాని వింటూ ఉంటే నాకు కళ్ళు గిర్రున తిరిగిపోయాయి. ఒక్క అమ్మాయి కూడా పెళ్ళికి అనుకూలంగా మాట్లాడలేదు. అనుకోకుండానే అక్కడ ఒక పెద్ద డిబేట్ జరిగి పోయింది.
పదిహేను, పదహారు సంవత్సరాల వయసున్న ఈ పసి పిల్లలు, శారీరకంగా...మానసికంగా ఎన్నో మార్పులకు లోనవుతున్న ఈ సున్నిత దశలొ వాళ్ళకి పెళ్ళి పట్ల ఇంతటి విముఖత ఏర్పడితే...వాళ్ళ భవిష్యత్తేమిటి..అని దిగులేసింది. ఇప్పుడిప్పుడే ప్రపంచాన్ని చూస్తున్న ఈ లేత కళ్ళు కలవరపడిపోతే ఎలా! సరి అయిన అవగాహన ఎలా రావాలి? వీళ్ళ జీవితంలో అందమైన అనుభవాలు పొందాలంటే ఏం చేయాలి... కాని, వాళ్ళ ప్రస్తుత పరిస్తితుల పరిశీలన...జరుగుతున్న అనేక సంఘటనలు వాళ్ళ ధైర్యాన్ని, నమ్మకాన్ని మింగేస్తున్నాయ్. ఒకళ్ళ తరువాత ఒకళ్ళు చాలా తీవ్రమైన భావాలు వ్యక్తీకరించారు. నేను మాట్లాడిన ప్రతీ మాటకి వాళ్ళు ధీటైన సమాధానం ఇస్తున్నారు.
మాట్లాడటమే కాని వినే అలవాటు లేని ఉద్యోగం నాది. అటువంటిది వాళ్ళముందు మూగదాన్నై పోయాను. ఆ చిన్న పిల్లల భావాలను చాలా మటుకు యధాతధంగా మీ కందిస్తాను. ఎప్పుడూ కాలేజ్ గురించే మాట్ల్లాడుతుంది...అంటారా! నాకు ఇక్కడే మొత్తం 'ప్రపంచం' కనిపిస్తుంది... మరి ఇదే కదా నా లోకం... "ఇదెక్కడి న్యాయం" అన్నది వాళ్ళ ప్రశ్న...
*****ఇదెక్కడి న్యాయం ******
రండి, రండి అందరూ లోనికి రండి
స్వచ్చమైన నేతి మిఠాయిలు తినండి
పళ్ళూ, ఫలహారాలు ఆరగించండి
అమ్మాయిని ముస్తాబు చేస్తున్నారు
ఓ పెళ్ళిచూపుల కొచ్చిన పెద్దలూ ముందు ముందుకొచ్చి కూర్చోండి
కాఫీలు, టీలు సేవించండి
అదిగో అమ్మాయిని తీసుకొచ్చారు
పిల్ల లక్షణంగా లక్ష్మి లా ఉంటుంది
పట్టుకుచ్చులాంటి పొడువైన కురులతో
ఆడపడుచులు ఎంత లాగాలన్నా లాగొచ్చు
వెన్నముద్దలాంటి ముఖం, పువ్వులాంటి కోమలత్వం
మొగడు సిగరెట్లతో ఆనందంగా కాల్చేయొచ్చు
తీర్చిదిద్దిన అంగసౌష్టవం
బావలో, బావమరుదులో అసభ్యంగా చూసి, చూసి
వంటిగా వంటగదిలో కొంగు పట్టి లాగొచ్చు
బంగారు రంగులో నాజూకు నడుము
జల్సాలకు డబ్బు అవసరమైనప్పుడల్లా వాతలు పెట్టొచ్చు
అందమైన శరీరం
అత్తమామలు కిరోసిన్ పోసి అంటించ ఒచ్చు
కమ్మగా పాడే గొంతును ఇంటిల్లిపాదీ సీలింగ్ ఫాన్ కు ఉరి తీయవచ్చు
ఇంకా బాగా పరీక్షించుకోండి
గుడ్డిది కాదు, మూగది కాదు
మీరెన్ని కుట్రలు పన్నినా చూడదు
ఎన్ని తిట్టినా మాట్లాడదు
అయినా పిల్లల్ని కని వంశాభివృద్ధి చేస్తుంది...
ఇవి ఏవీ కూడా నా భావాలు కావు. కాని ఈ పిల్లలు నాకు తీసుకున్న క్లాస్ చూస్తే మాత్రం నాకిలా అనిపించింది. "నెల రోజులు గ్రంధ పఠనం లో సంపాదించే జ్ఞానాన్ని పండితునితో గంట కాలం సంభాషించడంతోనే పొందవచ్చు" అని అర్ధమైంది. ఇవి నేను తెలుసుకున్న వాళ్ళ "అనుభవాల పాఠాలు".
*************************************************************