25, జులై 2011, సోమవారం

మా అక్క పుట్టింరోజండీ ఇవాళ...





అక్కా!!! హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.

పేరుకు అక్కే అయినా తల్లి కన్నా నాకు ఎక్కువే.
ఎన్నో సలహాలు....ఎన్నో సహాయాలు...ఎంతెంతో ప్రేమా అభిమానం చూపిస్తావు.....
కోపమొచ్చినప్పుడు తిట్టినా....సరి అయిన మార్గం చూపిస్తావు....
నా పిరికి తనానికి కోపం తెచ్చుకొని....నన్ను సరిదిద్దుతావు.......
ఊరికే ఏడ్చేసే నాకు లోకాన్ని తెలియచేసావు......
ఆవేశపడిపోతానని.....తొందరపాటుతో నేనేం చేసేస్తానో అని భయపడిపోతావు......
నేను సంతోషంగా ఉంటే...నా చిన్న నవ్వుకే పులకించి పోతావు.....
నాకు చిన్న కష్టమొస్తే చాలు.....విలవిలలాడిపోతావు......
ప్రేమ చూపి, తోడునీడగా నిలచి, బ్రతుకు నేర్పిన నీకు ఏమిచ్చి రుణం తీర్చుకోగలను....

చిన్నప్పుడు ఇంటిపట్టునుండకుండా, ఎక్కడెక్కడో తిరిగి పిచ్చి ఆటలన్నీ ఆడి వచ్చే నన్ను అమ్మ తిడితే....ఎంత ఆదుకునే దానివో....
నాకోసం చిన్న చిన్న త్యాగాలు కూడా చేసేదానివి....నాకు ఇంకో అక్కకూడా ఉండేది. కాని నేను తనని చూడనుకూడాలేదు. నేను పుట్టకముందే చనిపోయింది. తనుకూడా ఉంటే నాకు ఇద్దరు అక్కలుండే వారు. కాని ఆ లోటేం తెలియకుండా అందరికన్నా నువ్వే ఎక్కువనిపించావు.....

నా చదువంతా నీ దగ్గిరేగా.....నీ పిల్లలతో సమానంగా చూసుకున్నావు....వాళ్ళతోపాటూ నాకూ అన్నీ కొనిచ్చావు...నాకు బావగారంటే చాలా భయం....కాని ఆ భయమంతా పోగొట్టేసావ్......ఇప్పుడైతే...కొన్నిసార్లు పోట్లాడే స్థాయికొచ్చాను......బావగారంటే నాకెంత గౌరవమో చెప్పలేను...ఏం చెప్పినా...వెంటనే మాట్లాడకుండా చేసేస్తాను:) చివరికి నా పెళ్ళి కూడా మీ ఇద్దరి చేతుల మీదేగా జరిగింది.......

నాకు డాక్టరేట్ అవార్డ్ అయితే నీకే డిగ్రీ ఇచ్చినంత గర్వపడిపోయావ్....అందరికీ ఎంత గొప్పగా చెప్పావో......

నాకు ఉద్యోగం వచ్చినప్పుడు ఎంత సంబరపడిపోయావో....నేను ఉన్నత శిఖరాలు అందుకోవాలని...ఎంతమంది దేవుళ్ళకు ఎన్ని మొక్కులు మొక్కావో...అవి తీర్చటానికి ఎన్ని అవస్థలు పడ్డావో....నేనెలా మరచిపోగలను....

ప్రతి సంవత్సరం ఓ రెండుమూడు రోజులెక్కడికన్నా పోవాలి అని ప్లాన్ వేసుకున్నామ్. కాని నువ్వేమో గుళ్ళూ గోపురాలు అంటావ్...నేనేమో చెట్లూ తోటలూ అంటాను.....మెల్లిమెల్లిగా మనం దూరమైపోతున్నామేమో అనిపిస్తోంది కొన్ని సార్లు.

బ్లాగులంటే తెలియని నన్ను బ్లాగ్ మొదలుపెట్టమన్నావ్. నేనూ గుడ్డిగానే దూకేసాను....ఆ తరువాత తెలిసింది లోతు....బ్లాగ్ జోలికి పోను అని మొండికేసిన నన్ను....ఎన్నో మురిపాల కబుర్లు చెప్పేసి...ఏదేదో చేసేసి... ఉబ్బేసి..స్వీట్స్ పెట్టేసి...ఎలాగో మళ్ళీ దింపేసావ్. ఇదిగో ఇప్పుడిలా ఈదుతున్నాను.

నీ చేయూత నాకు బలమివ్వాలి.....ప్రతి విషయమూ నీ తోనే చెప్పుకోవాలి. అన్నిటికీ నువ్వే అండ కావాలి. ఎప్పుడూ అక్కా...అక్కా అంటుంది....అని నన్ను ఎవ్వరేమన్నా సరే....నీ నీడనే నేను.....నీ దీవెనలు...ఆశీస్సులు ఎప్పటికీ కావాల్సిందే......

నేనేమివ్వాలి....ఏమివ్వగలను.....
ఎదుటివారి సంతోషాన్ని కోరే నీవు...జీవితమంతా సంతోషంగా గడపాలి.
అపకారికి కూడా ఉపకారాన్ని కోరే నీ ఉన్నత మనస్సు తో గొప్ప ఆనందాన్ని పొందాలి....

ఇవాళ మా అక్కకు అరవై ఏళ్ళు వచ్చాయండి....ఎంతో ఆనందంగా పండగ జరగాలి....మా అక్క ఫ్రెండ్స్ ..చాటింగ్...ప్రమదావనం...ఇంకా బజ్జు ఫ్రెండులు....అందరూ ఇక్కడికే వచ్చి తప్పకుండా మీ శుభాకాంక్షలందించాలి... బ్లాగ్ లోకంలోని నా ఫ్రెండ్స్....మా అక్క ఫ్రెండ్స్.....అందరూ వచ్చేయాలి....రాకపోతే నేను చాలా ఫీల్ అయిపోతానన్నమాట..



సత్యవతి గారి ఇంట్లో ఈ సీజన్ లో పూసిన మొదటి బ్రహ్మకమలం పుష్పాన్ని మా అక్కకి ఇచ్చేస్తున్నాను. ఎందుకంటే తనకిష్టం కాబట్టి....అక్కా, సత్యవతి గారేమన్నా అంటే మాత్రం నువ్వే జవాబు చెప్పేసుకో:)

ఇంతకీ మీ అక్క ఎవరు తల్లీ అంటారా...మీ అందరికీ బాగా తెలుసులెండి.....’సాహితీ మాల’. కేకులు, చాకలెత్తులు, బిసెకత్తులు, గట్రా గట్రా ఏమన్నా కావాలంటే మాత్రం మా అక్కనే అడగండేం:

అవునూ..అక్కా, ఇంతకీ నీ బర్త్ డే కి నాకేమిస్తున్నావ్.....

యాపీ యాపీ బర్త్ డే టు యూ......




***********************************************************************************************************************************************

4, జులై 2011, సోమవారం

బాధ్యత...




ఓ కండెమ్డ్ క్రిమినల్ మీద హత్యా ప్రయత్నం జరిగింది. రివాల్వర్ తో పాయింట్ బ్లాంక్ లో కాల్చబడ్డాడతను. ఎమెర్జెన్సీ ట్రీట్మెంట్ కోసమని చావు బతుకుల్లో ఉన్న ఆ ముద్దాయిని పోలీసులు ప్రభుత్వ హాస్పిటల్ లో తగిన సదుపాయాలు లేవని ఓ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కి తీసుకొచ్చారు.

"ప్లీజ్ డాక్టర్! ఇతన్ని ఎలాగైనా బతికించాలి మీరు. ఎంత ఖర్చయినా సరే" అంటూ ప్లీజ్ చేస్తున్న జైలర్ వంక వింతగా చూసారు డాక్టర్లు. "మాకు చాతనయినంత కృషి చేస్తున్నాం. ఆ పైన ఇతగాడి అదృష్టం, ఆయుష్షూనూ"...అని జవాబిచ్చారు.

ఎమెర్జెన్సీ ఆపరేషన్ చేసి బుల్లెట్ తీసేశారు. ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో ఉంచి స్పెషలైజ్డ్ ట్రీట్మెంట్ ఇచ్చారు. అతను బతికి బయటపడగానే మరోవారం రోజులు స్పెషల్ వార్డ్ లో ఉంచి ప్రత్యేకంగా చూసుకున్నారు. దాంతో మనిషి బాగా ఆరోగ్యంగా తయారయ్యాడు.

సాధారణం గా కస్టడీలో ఉన్న ముద్దాయిల గురించి పెద్దగా పట్టించుకోదు ప్రభుత్వం. వాళ్ళు చస్తూ ఉన్నా, ఆ జైలు డాక్టరూ, ఆ రంగునీళ్ళూ, ఆ కల్తీ మందులే తప్ప మరో దిక్కుండదు. హ్యూమన్ రైట్స్ వాళ్ళు ప్రభుత్వం నెత్తిమీద మొట్టినా అతీగతీ ఉండదు.

అటువంటిది ఓ కండెమ్డ్ క్రిమినల్ ని బతికించటం కోసం అంతగా తహ తహ లాడుతూ ఖర్చులకు సయితం వెరవకుండా రూల్స్ నతిక్రమించి ప్రత్యేక వైద్య సదుపాయాన్ని కలిగించడం....అతనికి నయమయేంతవరకూ స్వంత మనుషులకంటే ఎక్కువగా ఆతృత, ఆందోళనా చూపడం....ఆ డాక్టర్లకి, తాము కలగంటున్నామా లేక పోలీసులలో నిజంగానే మార్పు వచ్చిందా అన్న సందేహం కూడా కలిగింది.

ముద్దాయిని డిశ్చార్జ్ చేస్తూ అదేమాట అడిగారు వాళ్ళు. "ముద్దాయిలను జీవంలేని మట్టి సుద్దల్లా ట్రీట్ చేసే వాళ్ళు....ఓ నేరస్తుడి పట్ల ఇంత శ్రద్ద, కన్సర్న్ చూపిస్తున్న మీ సహృదయాన్నీ, మానవతా దృక్పథాన్ని మనసారా అభినందించలేకుండా ఉండలేకపోతున్నాం. మీ లాంటి అధికారులు మరికొందరుంటే మన వ్యవస్థే మారిపోతుంది"...అని ప్రశంసించారు. ఆ జైలర్ కాస్త ఇబ్బందిగా కదిలి...ఆ తరువాత మెల్లగా అన్నాడు...."సార్! ఇది నా బాధ్యత. ఇతను మల్టిపుల్ మర్డర్ కేసులో మరణశిక్ష పడిన ఖైదీ. వచ్చేవారమే ఇతనికి ఉరిశిక్ష. ఉరితీసేలోగా చావకుండా చూడటం మా భాద్యత. అందుకే ఈ పాట్లన్నీ!"....ఆ....అంటూ, నోళ్ళు వెళ్ళబెట్టారు డాక్టర్స్.

( ఆ మధ్య చదివిన ఒక న్యూస్ ప్రేరణ తో......ఈ మధ్యనే నేను జువెనైల్ హోమ్ లో బాల నేరస్తుల కష్టాలు కళ్ళారా చూసిన ఆవేదనతో....)





*****************************************************************************************************
 

మనస్వి © 2008. Template Design By: SkinCorner