25, డిసెంబర్ 2011, ఆదివారం

బుక్ ఫెయిర్ లో నేను...




అయిపోతోంది బుక్ ఫెయిర్. ఈ సారి ఏవిటో అస్సలు వీలు కావటం లేదు. దానికి తోడు రెండురోజులనుంచి జ్వరం, ఒళ్ళునొప్పులు. మొహం పీక్కు పోయింది. ఓపిక ఎటో ఎగిరిపోయింది. లాభం లేదు. అయినా సరే వెళ్ళాల్సిందే. ఎప్పుడూ ఒకటో రెండో కొత్త పుస్తకాలు తెచ్చుకుంటూ ఉంటాను. ఈ సారి ఒక్కటన్నా తెచ్చుకోపోతే ఎలా!!!

సరే మొత్తానికి శనివారం శలవు కాబట్టి ఆ రోజు ప్లాన్ వేసాను. మిట్టమధ్యాహ్నం బుక్ ఫెయిర్ కి చేరుకున్నాము. ఎండ బాగానే ఉంది. కాని నాకెందుకో చలేస్తోంది. మా ఫ్రెండ్ ఫ్రీ పాసులు ఇచ్చింది. అయినా టికెట్ తీసుకునే పోవాలనిపించింది.

ఎంటర్ అవగానే లెఫ్ట్ సైడ్ మొదట్లోనే కనిపించింది...ఇ-తెలుగు స్టాల్. అక్కడ ఆగి లోపలున్న ఇద్దరిని చూసి పరిచయం చేసుకోవాలనుకున్నాను. ఒకరు చక్రవర్తి గారు ఒకరు కౌటిల్యగారు. నేను వాళ్ళ గురించి అడిగి వాళ్ళ బ్లాగ్ ల గురించి కనుక్కునే సరికి మీరు బ్లాగరా, బ్లాగ్ లు చదువుతారా అని అడిగారు చక్రవర్తి గారు. ఒక్క సారి గా నాకేం చెప్పాలో తెలియలేదు. మౌనంగానే కాదన్నాను. అక్కడే ఉన్న వైట్ పోస్టర్ మీద ఆనాడు విజిట్ చేసిన బ్లాగర్ల యూఆరెల్స్ కూడా రాసి ఉన్నాయి. నాక్కూడా వెంటనే అక్కడికి పోయి నా పేరు రాయాలనిపించింది. ఒద్దులే, ఏం గొప్ప బ్లాగర్ నని అనిపించి ఊరుకున్నాను. చక్రవర్తి గారు నాకు అంతర్జాలం గురించి ఒక పాంప్లేట్ ఇచ్చారు. కూడలి చూస్తారా అని అడిగారు. ఆయనకే అర్ధంకానంతగా తల అటో ఇటో ఎటో ఊపేసాను. చక్రవర్తి గారు నేను ఎన్నో వివరాలు అడగటంతో నా వైపు కొంచెం అనుమానంగా చూస్తున్నారు. నేను కౌటిల్య గారిని వారి బ్లాగ్ పేరు మళ్ళీ అడిగాను. ఈ సారి కౌటిల్య గారు కొంచెంగా తలతిప్పేసుకున్నారు. పాపం ఇంక ఇబ్బంది పెట్టొద్దులే అనుకొని ముందుకెళ్ళిపోయాను. కొంచెం దూరం వెళ్ళి ఒక సారి వెనక్కి తిరిగి చూసాను. చక్రవర్తి గారు ఇంకా అనుమానంగా చూస్తునే ఉన్నారు. చక్రవర్తి గారు,కౌటిల్య గారు సారీ అండీ.

ఎదురుగుండా మా స్టూడెంట్ కనిపించింది. వెంటనే మొహమింత చేసేసుకొని మేమ్ నాకు హెల్ప్ చేయారా అంది. నవ్వొచ్చింది. ఇక్కడేవిటి హెల్ప్, ఏమయింది, అని అడిగాను. నాకు గాన్ విత్ ద విండ్ బుక్ కావాలి అంది. సరే అని తనతో స్టాల్ లోకి వెళ్ళి ఆ బుక్ తో పాటు మిడ్ నైట్ చిల్డ్రెన్ బుక్ కూడా తీసి ఇచ్చాను. నాకు క్లాసిక్స్ కూడా కావాలి అంది. సరే అని, కొంచెం వెతికి ద గ్రేట్ వర్క్స్ ఆఫ్ విలియం షేక్స్పియర్, ద గ్రేట్ వర్క్స్ ఆఫ్ బి.జి.షా తీసిచ్చాను. కొంచెం సులభంగా చదువుకోకలదని. ఇంకా ఏదో అడగబోతోంది. ఒకపని చేయి, మెల్లిగా అన్ని బుక్స్ చూసి లేటెస్ట్ బుక్స్ కూడా తీసుకురా, నేను తెలుగు స్టాల్స్ చూడాలి అని అక్కడినుంచి బయటికొచ్చాను.

తెలుగు స్టాల్స్ చాలానే ఉన్నాయి కాని దాదాపు అన్నిట్లోనూ రిపీటెడ్గా చాలా బుక్స్ ఉన్నాయి. ఎప్పుడూ చూసేవే కాకుండా కొత్తవి కనిపిస్తాయేమో అని చూసాను. పిల్లల పుస్తకాలు చాలానే ఉన్నాయి. ఇన్ని సార్లు చూసినా అమరావతి కథలు నేనెప్పుడూ తెచ్చుకోలేదు. ఈ సారి తీసుకుందామనిపించింది. పంచతంత్రం ఒకటి కొనుక్కున్నాను. పెయింటింగ్ గురించి బుక్స్ ఉన్నాయి కాని అంతగా నచ్చలేదు. వంశీ బుక్స్, బాపూ రమణ పుస్తాకాలు కూడా తీసుకోలేదు. అన్నీ ఉన్నవే. జీవితచరిత్రలు ఉన్నాయి గాని హంపీ నుంచి హరప్పా వరకు మాత్రమే కొనుక్కున్నాను. దాదాపుగా అన్ని స్టాల్స్ లోనూ చలం బుక్స్ కనిపించాయి. ఒకచోట మాత్రం శరత్ సాహిత్యం కూడా కనిపించింది. అందరూ మిథునం పుస్తకం గురించి చెప్తున్నారుగా అని ఒకటి తీసుకున్నాను. ఈ బుక్ రెండు సైజుల్లో కనిపించింది. భానుమతి బుక్స్ కూడా కొనేసినవే.

ప్రతి స్టాల్ లో గరుడ పురాణం కనిపించింది. కాని ఎందుకో కనీసం చేయేసి చూద్దామన్నా భయమేసింది. అస్సలు ముట్టుకోను కూడా ముట్టుకోలేదు. పురాణ గ్రంధాలు తాత్విక గ్రంధాలు చాలా ఉన్నాయి. కాని నేను ఏవీ తీసుకోలేదు.
మొత్తం సినిమా వాళ్ళ గురించే ఉన్న స్టాల్ మాత్రం నన్ను కాసేపు నిలబెట్టింది. నాగేశ్వర రావ్ హీరోయిన్స్, నందమూరి, శొభన్ బాబు పుస్తకం, ఘంటసాల, సావిత్రి కి చెందిన పుస్తకాలు బాగనిపించాయి.

ప్రముఖ చరిత్ర కారులు వకుళాభరణం రామకృష్ణ గారు కనిపించారు. వారు నాకు తెలుసు. దగ్గరికి వెళ్ళి నమస్కరించి, పలకరించాను. చాలా రోజులయింది నువ్వు కనిపించి, బాగున్నావా అని చాలా ఆప్యాయంగా అడిగారు. ప్రజాశక్తి వారి, అమెరికా ప్రజల చరిత్ర, ప్రాచీన ప్రపంచ చరిత్ర పుస్తకాల ఆవిష్కరణకు వచ్చానని చెప్పారు. అమెరికా ప్రజల చరిత్ర పుస్తకం ఒక కాపీ నాక్కూడా ఇచ్చారు. నిజం చెప్పాలంటే, ఆ బుక్ తీసుకుంటున్నప్పుడు ఏదో బహుమతి పొందిన ఆనందం కలిగింది:)

పిల్లల కోసం కొన్ని ఫాన్సీ వస్తువుల షాప్ కూడా బాగుంది. రకరకాల పెన్నులు, పెన్సిల్స్, షార్ప్నర్స్, ఎరేజర్స్ గమ్మత్తుగా బాగున్నాయి. వేరుశనగ కాయల ఆకారం లో ఉన్న ఒక రబ్బర్, షార్ప్ నర్ తీసుకున్నాను. ఆరు రంగులతో ఉన్న ఫాన్సీ పెన్ కూడా తీసుకున్నాను. చేతిలోంచి ఎగురేసినప్పుడల్లా రంగులు మారే ఒక బంతి కూడా కొన్నాను. ఇవన్నీ మా సోనీ, చింటూ గాడి కోసమన్నమాట. నెహ్రూ డిస్కవరీ ఆఫ్ ఇండియా మా లక్ష్మి కిద్దామని కొన్నాను. ఇప్పుడు చాలా పుస్తకాలే చదువుతోంది.

పోయిన సారి కన్నా కూడా ఈ సారి బుక్స్ చాలా ఉన్నాయి. అప్పటికే తిరిగే ఓపిక అయిపోయింది. జ్వరం పెరుగుతున్నట్లుగా అనిపించింది. కళ్ళు మంటలుగా ఉన్నాయి. నోరెండిపోతోంది, నీళ్ళు తాగ బుద్ధి కావట్లేదు. ఇంక వెళ్ళిపోదామన్నాను. బయటికొస్తుంటే మా ఫ్రెండ్ వస్తూ కనిపించింది. చాలా బుక్స్ ఉన్నాయి. మీ అబ్బాయికి కొను. సిడీ లు ఒదిలేయ్. అని చెప్పి బయటి కొచ్చాను. అక్కడినుంచి ఈట్ స్ట్రీట్ కి వెళ్ళి వేడి వేడి కాఫీ తాగి కాసేపు కూర్చున్నాము. టాంక్ బండ్ మీంచి చల్లటి గాలి వస్తోంది గాని, వాసన భరించలేక పోయాను. మెల్లిగా ఇంటిదారి పట్టాము.



**************************************************************************************************************************
 

మనస్వి © 2008. Template Design By: SkinCorner