కృష్ణవేణి - రంగనాయకమ్మ గారు
నేను ఈ మధ్య అనుకోకుండ చదివిన రంగనాయకమ్మ గారి నవల కృష్ణవేణి గురించి రాయాలనిపించింది. ఆవిడ చాలా చిన్నప్పుడు అంటె దాదాపు 17, 18 సంవత్సరాల వయసులో రాసిన నవలట ఇది. అరవైఒకటి లో ఆంధ్రప్రభ లో సీరియల్ గా వచ్చింది. అందరూ ఎంతో ఆసక్తిగా చదివేవారట. ఈ సీరియల్ కటింగ్స్ తీసి బైండింగ్ చేసి దాచిపెట్టుకున్నారట. అనేక ముద్రణలు కూడా వచ్చాయి. కాని కొంతకాలానికి ఈ నవలలో అక్కడక్కడా తాను రాసిన విధానం నచ్చలేదని, అపరిపక్వతతో రాసిందని అసంతృప్తితో మళ్ళీ ముద్రణలు ఆపివేసారు. కాని ఆ నవల చదవాలి అని ఇప్పటికీ చాలామంది పాఠకులు దీని పునర్ముద్రణ కోసం కోరుకోగా, చివరికి తన కొత్త ముందు మాటతో, దీనిని ముద్రించారు. తనకు తెలిసిన కొన్ని నిజ జీవిత సంఘటనల మీద ఈ నవల రాసానని తెలిపారు. అందుకే ఈ కథ అంటే మొదటి నుంచి ఇష్టమూ, భయమూ ఉందని తెలిపారు. అందుకే ఇప్పటి కొత్త ముద్రణలో అక్కడక్కడా సర్దుళ్ళూ దిద్దుళ్ళూ ఉన్నాయన్నారు. తన అసంతృప్తికి కారణమైన భాగాల్లో కింద ఫుట్ నోట్స్ కూడా ఇచ్చారు. అప్పుడు ఆంధ్రప్రభ సీరియల్ లో ఒకటే బొమ్మ వచ్చేదట. ఆ బొమ్మనే ఇప్పటి ఈ పుస్తకానికి ముఖచిత్రంగా ఉంచారు. ఈ కొత్త ముద్రణలో అనేక విషయాలలో తన మారిన అభిప్రాయాలను ఎంతో వివరంగా రాసారు. ఈ నవల లో ఒక ప్రత్యేకత ఉంది. కథ అంతా ఉత్తరాల రూపంలోనే కొనసాగుతుంది.
కృష్ణవేణి కి వచ్చిన ఉత్తరం కాయితాలు నేల మీద ఎగరూతూ ఉంటాయి. అప్పుడే పెళ్ళైన కృష్ణవేణి, భర్త శ్యాంసుందర్ ఆ ఉత్తరం చూడడంతో కథ ప్రారంభమవుతుంది. నూతన దంపతుల మధ్య ఈ ఉత్తరం చిచ్చురేపుతుంది. అది తన భార్య ప్రేమలేఖ అని తెలిసిన కృష్ణవేణి భర్త కోపంతో వెళ్ళిపోయి విడాకులు కోరుకుంటాడు. దానితో మొదటినుంచి మాధవరావు తో తన పరిచయాన్ని, ఆ పరిచయంలోని అనేక మలుపులను తన భర్తకు వివరంగా ఉత్తరం రాస్తుంది కృష్ణవేణి. కథంతా ఈ ఉత్తరమే మనకు చెప్తుంది.
కృష్ణవేణి పాత్ర అనేక వైరుధ్యాలతో ఉంది. యువతీ యువకుల మధ్య ప్రేమా, దానిలో తలెత్తే సమస్యలూ...అదే ఇందులో కథావస్తువు. అతి సామాన్యంగా, సాంప్రదాయబధ్ధంగా సాగే కృష్ణవేణీ, మాధవ్ ల ప్రేమ కథ ఇది. భార్యాభర్తలు సామరస్యంగా ఉండాలని, ప్రేమ సంబంధాలు సాహసవంతంగా ఉండాలనీ చెప్పే కథ.
మాధవ్ సమస్య తెలుసుకున్న కృష్ణవేణి, చివరికి తన స్నేహితుల సలహాని కూడా సరిగ్గా అర్ధంచేసుకో లేక వేరే వివాహానికి సిద్ధం అవుతుంది. కృష్ణవేణి స్నేహితురాలు రేణూ పాత్ర చిత్రణ బాగుంది. కృష్ణవేణి నిష్కారణంగా మాట తప్పింది. వేరే పెళ్ళి చేసుకుంది. ఈ పాత్ర నిజాయితీ కోల్పోయింది. ఆ యువతీ యువకుల ప్రేమ సంబంధం తెగిపోయినా, అది చివరికి వారి సంతోషం తోటే కథ ముగుస్తుంది. ఇలాంటి ముగింపు చాలా తప్పు అని రచయిత్రి భావించారు. వాళ్ళు విడిపోవడమూ, వేరే వ్యక్తులతో జీవితాలు గడపడమూ జరిగితే జరగవచ్చు. కానీ అది, వారికి విషాదమే...అనే అర్ధం ముగింపులో కనపడాలి. కాని ఆ విషయం మీద తాను శ్రధ్ధ చూపలేదని తన రచన మీద తన అసంతృప్తిని వ్యక్తపరిచారు. రచయితలు తమ రచనలను ఎప్పటికప్పుడు పరిశీలించుకుంటూ ఉండాలని రచయిత్రి అభిప్రాయం.
ప్రేమంటే సరి అయిన అవగాహన లేకుండా తానీ నవల రాసానని బాధపడ్తారు రంగనాయకమ్మగారు. ఎందుకంటే, నిజమైన ప్రేమ కలిగిన వ్యక్తులు ఆ సంబంధం తెగిపోయినా, వాళ్ళిద్దరు వేరే వ్యక్తులతో సంతోషం గా ఉన్నారని చెప్పటం తప్పు. ఇది ప్రేమకే అవమానం. దేవదాసు దు:ఖాంతం. కాని ప్రేమ కోసం కట్టుబడిన కారణం గానే దు:ఖాంతం అయింది. దేవదాసు మనసులో ప్రేమ పోతే అది అతనికి సుఖాంతం అయ్యేది. కానీ, అది ప్రేమకి అవమానం. మల్లీశ్వరి కథ చూస్తే అది, ప్రేమ కోసం సాహసాల్లోంచి, దు:ఖాంతం నుంచి నడచిన సుఖాంతం. ప్రేమ విలువని ఎగరగొట్టి, ప్రేమికులు కూడా సాంప్రదాయమైన పెళ్ళిళ్ళ లోనే చాలా సంతోషంగా ఉన్నారని చెప్తే, అది చాలా అవాస్తవం. ప్రేమ కథ, ప్రేమ విలువలతో ముగియాలి. అది సుఖాంతమైన, దు:ఖాంతమైనా అది ప్రేమ కోసమే జరగాలి. ముగింపు ప్రేమకు అవమానం జరగకుండా ఉండాలి.
కృష్ణవేణీ, మాధవ్ కి పరిచయం కావడం, అది ప్రేమగా మారడం, ఇద్దరూ ఒక సమస్యలో చిక్కుకోవడం, దాని వల్ల ఆందోళన పడుతూ కాలం గడపడం, చివరికి సామాజిక కట్టుబాట్లకే తలలు వొంచడం జరుగుతుంది. ఇదీ కథ క్లుప్తంగా. ఇందులో అసహజమేమీ లేదు. అపరాధమూ లేదు. కథ చివరికి మాధవ్ కృష్ణవేణికి అన్న అయిపోతాడు. ఎప్పటి లాగే అతన్ని ఒక స్నేహితుడిగా ఎంచుకునే స్వతంత్రమైన వ్యక్తిత్వం లేదు కృష్ణవేణికి. అతని సంబంధాన్ని సంఘ ధర్మాలకు అనుకూలంగా, తప్పు కానిదిగా చేసుకుంటుంది. ఈ విషయంలో కూడా రచయిత్రి తీవ్ర అసంతృప్తిని తెలియచేసారు.
మొత్తంగా చూసినప్పుడు ఈ రచన, సామాన్యమైన యువతీ యువకుల మధ్య పరిచయాలూ, ప్రేమలూ, ఏ రకం స్థాయిలో ఉంటాయో, అందులోనే వారు ఎన్ని ఇబ్బందుల్లో ఇరుక్కుని వ్యాకుల పడతారో, వారి ప్రేమ ఎంత సామాన్యమైన పునాది మీద ఆధారపడి సాగుతుందో...మొదలైన విషయాలను ప్రతిబింబిస్తుంది.
యువతీ యువకుల మధ్య ప్రేమ అనే దాని పునాది ఉన్నతమైన స్థాయి పై ప్రారంభం కావాలి. కేవలం శారీరక అందచందాల మీదా, అలంకారాల మీదా కాదు. వారి అభిప్రాయాలు అభ్యుదయకరంగా ఉండాలి. స్త్రీ, పురుషులు సమానమైన వ్యక్తిత్వాలు కలిగి ఉండాలి. అటువంటి అభిప్రాయాలు గల వ్యక్తుల్నే ఎంచుకోవాలి---అనే హెచ్చరిక చేసారు ఈ రచయిత్రి.
ఈ పుస్తకం ఇప్పటికే చాలా మంది చదివే ఉంటారు. కాని, నేను ఇప్పుడే కదా చదివింది!
స్వీట్ హోం పుబ్లికేషన్స్: 8 వ ముద్రణ, 2010 ఆగష్ట్, ధర: 80/-
***************************************************************************************************************************