8, మార్చి 2012, గురువారం

ఇంటిదీపం






స్త్రీ - సిరి, విరుల పరిమళం వెదజల్లే కమనీయ మనోహర కమలం. స్త్రీ అంటే శుభాలనొసగే సుమధుర సుమహారం. సిరి సంపదలకు మూలాధారం. ఆనందానికి, అభిమానానికి...ఆత్మీయతకు జీవనాధారం. తన రక్త మాంసాలను పంచి పెంచి పోషించే కల్పతరువు. భావి సత్పౌరులను తీర్చి దిద్దటానికి శిక్షణ ఇవ్వటం లో, శిక్షించటం లో దూరదృష్టి గల దృష్ట. తన సంతానం సర్వసుఖాలను కోరుకునే అభిలాషిణి. తన పిల్లల ఆకలిని గుర్తించి అన్నం పెట్టే కడుపుతీపి గల కరుణామూర్తి స్త్రీ. తన కలలు కల్లలైన వేళ కడుపుకోతతో కుమిలికుమిలి పోయే అభాగిని...అమ్మ...స్త్రీయేగదా!!!

తాను వలచి సరసన నిలచి మనోహరుడైన వరుని లాలించి స్వర్గసుఖాల్లో తేలించే వనిత స్త్రీయేగదా!!! మనసిచ్చిన మగువ తన మనసు మార్చుకోలేదు. మమతల మణిహారాన్ని ప్రియుని మదిలో వేసి ఎదలో నిలచే స్నేహప్రియ...దేవత.... స్త్రీ....

జీవితంలో మల్లెల సుగంధాల్ని వెదజల్లి తరింపచేసేది స్త్రీ.... కాటుక చారికతో జ్ఞాపకాలు జార్చుకోనివ్వద్దు ...స్త్రీ హృదయాన్ని స్వీకరించి స్పందింపచేయాలి....

ఈ సుకుమారపు మొక్కకు అనురాగపు నీరు పోస్తే, మానవత్వం అనే మొగ్గలు వికసిస్తాయి. ప్రేమ అనే పువ్వులు ప్రకాశిస్తాయి....






దీన జన రక్షిణి...సేవకురాలు...సున్నితమైన సువాసనలు వెదజల్లే ఈ గులాబీకి అంటించొద్దు చీకటిమరకలు... ఈ వసంతాన్ని చిగురింపచేస్తే...సరిగమల ఆమని అవుతుంది...

రంగుల వెలుగులుజిమ్మే ఇంటిదీపం పై నల్లరంగు పారబోయొద్దు......

స్త్రీ నిర్జీవ శిల కాదని, ఒక బొమ్మ అసలే కాదని, పరిపూర్ణ ఆదిశక్తి స్వరూపమనీ...మంచికి మారుపేరైన మమత నిండిన హృదయమని...స్త్రీ సరిహద్దులు లేని స్వేచ్చాస్థలాన్ని చేరుకోవాలని.....నిజమైన శాంతి కపోతాన్ని ఎగురవేయాలని....

ఆశిస్తాను...ఆకాంక్షిస్తాను....ఆక్రోశిస్తాను.

“All Nations have attained greatness, by
Paying proper respect to women. That Country
And nation which does not respect women
Has never become great, nor will ever be in future.” ---Swami Vivekananda.

W - Women
O - Of
M - Modern
E - Era
N - Need to protect Social Values.

A woman who fights for her rights is successful in every aspect of life.
“Women get what she likes.
And likes what she gets.
And it is easy to her to protect social values”…..


"ఉత్సాహంగా రంగుల పండుగ జరుపుకుంటున్న నా స్నేహితులందరికీ, జీవితమంతా ఇలాగే గడచిపోవాలని..... ఆనందమయ మహిళాదినోత్సవ శుభాకాంక్షలతో"..... జయ





***********************************************************************

14, ఫిబ్రవరి 2012, మంగళవారం

ఊహా సుందరి











ఊహా సుందరి
(Richard Crashaw రచనకు స్వేచ్చానుసరణ)


కాదేమో ఆమె కసాధ్యం...
అదే...గమ్యానికి చేర్చే సారధ్యం
అందాన్నే...ఆమె అందాన్నే ఊహిస్తాను
ఊహిస్తూ విశ్రాంతి పొందుతాను
ఆ వయ్యారపు నడకల
సౌకుమార్యపు కుమారినే;
అందరిపై అధికారం చెలాయించే
ఆ సుందరి ముఖారవిందాన్నే వాంఛిస్తాను

కొట్టులో చేయబడిన
కృత్రిమ బొమ్మ కాదామె

కాని ప్రకృతి కాంత కళాహస్తమే
తీర్చిదిద్దిందా సుందర ప్రతిబింబాన్ని...
పరిహసిస్తున్నాయి ఆమె నును బుగ్గలే
వికసిస్తున్న గులాబీ మొగ్గలను.

అవె ఆమె లే పెదవులు
పలుసార్లు ప్రియుని ప్రతి చుంబనం పారాడినా,
వాడిపోని చిరు పెదవులు.

ఆమె కనులో!
వానిలోంచి ప్రచురించే క్రీగంటి వాలు చూపులే
వజ్రపు వెలుగునే వెలితి చేస్తాయి
కాంతి గోళములనే కించపరుస్తాయి...

ఆమె దరహసితములె
ఉత్తేజ పరుస్తాయి
రక్తాన్ని ఉరుకలెత్తిస్తాయి
పవిత్రత నింపేస్తాయి...

ఆమె శరీరపు ఒంపుల్లోనే
నిండి ఉంది ప్రకృతి సొంపు.

అలంకార భూషణాదు లక్కర లేదామెకు
ఆమెను గురించి రాయాలంటే
అవుతుంది ఒక మహాకావ్యం
ఆమెను గురించి చెప్పాలంటే
ఒక్క ముక్కలో ఆమె కామెయె సాటి.

ఆ సుందరి దివ్య కాంతియే
ప్రతిఫలిస్తోంది ప్రతిక్షణం నా కనులలో...
కల్పనే కావచ్చు యిది అంతా,
కాని; కావచ్చు, ఇదే కావ్యానికొక వస్తువు.


*****************



ఇష్టపడే వారందరికీ ఈ పాట..... ఈ రోజు......




********************************************************************************




6, ఫిబ్రవరి 2012, సోమవారం

నివేదన


చమత్కారమున చంపకమాల లల్లగలేను
నీదు గళమలంకరింపగ

కమనీయమగు
కందరీతి నేనెరుగ
నీదు ప్రసన్నత వేడ

ఉత్పన్నమగు నాదు భావసరళి
ఉత్పలయందు జేర్ప శక్తియు నొకించుక లేదు

వేయేల! వేరొండు నేనెరుగ
మ్రోలనిలచి నీదుపూజసేతు

ఏమని?

రవంత నన్ను నీదరినిల్పి
ఆవంత శక్తి ననుగ్రహింపుమమ్మ

సాహితీ నందనమందు
కలుపుమొక్కను నేను

విదిలించి పెకలించకుమమ్మ
సాహిత్య వల్లీ!

నా నివాళులివిగో!!!


(Your heart is a very beautiful garden. And my friendship is a small rose in your garden. Please don't pluck the rose for any reason.....)


*************************************************************************************


 

మనస్వి © 2008. Template Design By: SkinCorner