30, డిసెంబర్ 2012, ఆదివారం

కొత్త సంవత్సరం కొత్తగా ఉంటుందా!!! ఎప్పటిలా పాతగానే ఉంటుందా!!!! THUNDER 13





వ్రాద్దామంటే అ ఆ లు రావటం లేదు
చెప్దామంటే భాష రావట్లేదు.....ఎందుకిలా పూర్తిగా మూగ బోయింది!!!!!
తెలియటం లేదు....
నిండుపున్నమంటి ఆలోచనలు పరచుకోటమే లేదు...
మబ్బు చుక్కల నీలపు చీర పరచుకున్న గగనమలా రెప రెపలాడుతోనే ఉంది.....
ఆ రెప రెపల సందడి, సయ్యాటలా!!!....అలజడి పరుగులా!!!
ఆకాశమంతా అగ్నిపర్వతాలు చిందులేస్తున్నాయా!!!....మరెందుకలా వేడి వేడి సెగల శ్వాస ఎర్ర రంగు తివాచీ పరుస్తోంది!!!!
పాదయాత్రల తాకిడికి కందిపోయిన భూమాత ప్రతి రూపమా అది?
ఈ అత్యాచార ప్రపంచంలో ప్రతి రోజూ యుగాంతమేనా!!!
 అలా ఓ అమ్మాయి రోడ్డు మీద కనిపిస్తే...అరె, ఈ అమ్మాయి జాగ్రత్తగా ఇంటికి చేరేనా! అనెంత భయమో!!!
తల్లీ, నీవు బయటకు రాకమ్మా...ఇంట్లోనే ముసుగేసుకొని నీ జీవితాన్ని చంపేయ్....
నే కోరుకున్న వెలుగులు  ఈ పుడమిని ఏనాటికీ చేరవా !!!
 ఒడుపుగా చీకటి తెరలను తొలగించి...జీవితాన్ని ఎలా వెతుక్కోవాలో.....
ఏదో శక్తి వచ్చి భళ్ళున వెలుతురు నింపితే ఎంత బాగుండు!!!!
ప్రకృతి కాంత కళా హస్తం ఒక సుందర ప్రతిబింబాన్ని తీర్చి దిద్ది ఇస్తే బాగుండు...
రేయింబవళ్ళు కష్టపడిన జీవితపు చరమ దశలో వెనక్కి తృప్తి గా తిరిగి చూసుకోవచ్చు.....
జీవితంలో మల్లెల సుగంధాల్ని వెదజల్లాలి...  జ్ఞాపకాలు జార్చుకోనివ్వద్దు ...  హృదయాన్ని స్పందింపచేయాలి
ఎక్కడ చూసినా యాంత్రికత....నిరాశా నిస్పృహలు....ఎంతకాలమిలా!!!!
 జీవితం అగాధాల ఆశల నిలయం
అంతు పట్టని జీవన వలయం...కానీ,
నీవు మలచుకుంటే అది ఆనందాలకు ఆలయం.
స్వార్ధం...కపటం...కుట్ర...అసూయా...ఈ మాయాజాలపు ముసుగుల్ని ఛేధించి, చింపేసి...
స్వఛ్చమైన తెల్లటి గులాబీ హృదయం విచ్చుకుంటే ....ఎంత నూతనం గా ఉంటుందో కదా!!!

ఆశల నందనం విరబూయాలి... విడవకుండా ప్రయత్నం చేసే వారిని చూసి ఓటమి భయపడుతుంది.

మనం ఖచ్చితంగా మెరుగు పరచగలిగిన ప్రదేశం  ఈ మొత్తం విశ్వం లో ఒక్కటే...అదే మన మనసు

అమ్మాయిల చిరునవ్వుల మల్లెల మాలలు స్వీకరించే నూతన సంవత్సరం వస్తుందా!!!!
ఊహూ...ఇది కల కాకూడదు....నిజమే..ఇదిగో ఈ నూతన సంవత్సరంలో...జగమంతా పసిపాప నవ్వులా...జలజలా....కిల కిల రావాలతో ఉప్పెనగా ముంచేస్తోంది. రండి అందరం అందులో మునిగిపోయి సరిగంగ స్నానాలు చేద్దాం....

    Positive thinking..Self Esteem...Is it wrong?????

  ఇంపాజిబిల్ అన్నది నా డిక్షనరీ లోనే లేదు....నెపోలియన్

 శుభాకాంక్షలే పలకాలి నవ్వుల పువ్వుల మాలతో....ఇలాగే ఉంటుంద,  ఇలాగే కావాలి!!!!!!!


******************************************************************************************



14, నవంబర్ 2012, బుధవారం

Dial T for 'THRILL'







థ్రిల్....

  మా అక్క దగ్గిర తీసుకొచ్చిన వీరేంద్రనాథ్ 'థ్రిల్ ' ఒక నెల రోజుల్లో పూర్తి చేసా. అంటే బుక్ అంత పెద్దదనుకునేరు. చిన్నదే! కాకపోతే నేను శ్రద్ధగా తీసుకున్న టైం అది:)

నాకు నవల కన్నా అందులో ఒక అంశం భలే నచ్చింది. హీరోయిన్ కొన్న నవల 'థ్రిల్ ' మొత్తం ఖాళీ పేజీలతో ఏమీ ప్రింట్ కాకుండా ఉంటుంది. ఏమీ ప్రింట్ అవని బుక్ తనకి వచ్చినా,అది ఒక థ్రిల్ గా ఫీల్ అయి అందులో తన అనుభవాలు రాసుకోవాలనుకుంటుంది.

నేను కూడ అలాగే ఒక బుక్ లో కేవలం అద్భుతమైన అనుభవాలు రాసుకోవాలనిపించింది. కాని, అలాంటి బుక్ నాకెవరిస్తారు. అందుకే నేనే తయారు చేసుకున్నాను.

 మరి నాకు థ్రిల్లింగ్ విషయాలు ఏమైనా ఉన్నాయా! ఆలోచన మొదలైంది.....

 నేను లెక్చరర్ గా తీసుకున్న మొట్టమొదటి క్లాస్ గుర్తొచ్చింది.   పదహారేళ్ళ వయసు లో శ్రీదేవి లాగా పక్కా పంతులమ్మ లాగా క్లాస్ కెళ్ళాను.
 
నా చిన్నప్పుడు మా క్లాస్ కెవరన్నా కొత్త మిస్ వస్తున్నారూ అంటె ఎంతో ఉత్సాహంగా ఎదురు చూసే వాళ్ళం. ఎన్నో చాక్లెట్లు, ఎన్నెన్నో పూలు వరుసాగ్గా ఇచ్చి మెరిసిపోయె కళ్ళతో ఆ టీచర్ మాట్లాడే ప్రతిమాట ఎంతో అబ్బురం గా వినే వాళ్ళం. ఇప్పుడు నా స్టూడెంట్స్ కూడా అలాగే ఎదురు చూస్తూ ఉంటారని తలచుకోగానే మితిమీరిన సంతోషంతో ఒళ్ళంతా పులకరించి పోయింది.

కాని, చిన్నప్పటి నా ఆనందం ఈ పిల్లల కళ్ళల్లో కనిపించలేదు. పైగా ఒక్కోళ్ళు మహా షొగ్గా ఉన్నారు. వస్తే వచ్చావులే అన్నట్లు చాలా నిర్లక్ష్యం గా కనిపించారు. ఇంకేం పూలు, ఇంకేం పళ్ళు...వాళ్ళందరి చేతులు ఖాళీ గానే ఉన్నాయి.:(

ఏదో కొంచెం ధైర్యం తెచ్చుకున్నాను.   మెల్లిగా  నేనెవరో, నా పేరేంటో చెప్పుకున్నాను.  ఆ సరేలే అన్నట్లు, ఎంతో చాలా మెకానికల్ గా ఏదో విష్ చేసారు.

  చాలా సినిమాల్లో పంతులమ్మలను, వాళ్ళ ఆదర్శాలను, మహోన్నత వ్యక్తిత్వాన్ని గుర్తు తెచ్చుకుంటూ మెల్లిగా మొదలు పెట్టాను......

 బోర్డ్ మీద చాక్పీస్ తో టైటిల్ వ్రాయబోతే అది పుటుక్కున మూడు ముక్కలైపోయింది...

వెంటనే వెనుతిరిగి అటెండన్స్ రిజిస్టర్ ఓపెన్ చేసాను.  అబ్బే, అందులో ఏం లేదు!!! అయ్యోరామా! పిల్లల పేర్లే రాసుకోలేదు. వెంఠనే క్లోజ్ చేసేసా.

ఒక గంట కోసం ప్రిపేర్ అయిన పాఠం ఓ పదిహేను నిమిషాలకే అయిపోయింది. ఇప్పుడెలా మిగతా టైం ఏం చేయాలి? కాళ్ళు చేతులు ఒణుకుతున్నాయి. మరీ అప్పచెప్పేసినట్లున్నాను. ఇప్పుడెలా! పిల్లలు గుడ్లు మిటకరిస్తూ నన్నే చూస్తున్నారు. ఇంకో నిమిషమైతే ఏదో చేసేట్లే ఉన్నారు. లాభం లేదు వెంటనే ఏదో ఒకటి నేనే చేసేయాలి.

     ఇంత లో ఒకమ్మాయి మేడం మీ శారీ చాలా బాగుంది,  రోజూ కాటన్ చీరలే కడ్తారా? అంది. ఇంకో అమ్మాయి మేడం సింగిల్ బ్యాంగిల్ వేసుకున్నారు, ఎంతో బాగుంది అంది.   ఇంకో వైపునుంచి ఓ అమ్మాయి మేడం మీ కళ్ళెంత బాగున్నాయో అంది. అప్పటి వరకు గుడ్లు మిటకరిస్తున్న నేను కూడా వెంటనే చలనం వచ్చి కళ్ళు మూసేసాను.
 ఓహో!!! వీళ్ళతో రోజూ కాసిన్ని కబుర్లు చెఫ్ఫాలి కాబోలు....   దేవుడా నా కళ్ళు తెరిపించావు.  జ్ఞానోదయమయింది.

 హమ్మయ్యా!! ఇంక వాళ్ళు నాకు క్లాస్ తీసుకోటం అయిపోయింది.   నేనెళ్ళిపోవచ్చు.

 అంటే!!! ఇంత వరకూ వాళ్ళు గమనించింది...నేను చెప్పిన పాఠం కాదు, నన్ను:))))

ఏ లెసన్ తీసుకోకుంటే ఇంత థ్రిల్ ఉంటుందన్నమాట:))))

 ఒక పని ఎట్లా చేయాలా అని   అధైర్య పడొద్దు. పని చెయ్యడం ప్రారంభించు...ఎట్లా చేసావని నువ్వే ఆశ్చర్య పోతావ్. - గెథే

 అక్షరం ఎప్పుడూ పుడుతూనే ఉంటుంది.(ఎవరూ పుట్టించకపోతే కొత్త మాటలెలా వస్తాయి:)అన్నారుగా ఎస్.వి.ఆర్.)

దానికి చావే లేదు ఓ కవి హృదయంలా....
ఉపయోగించని విజ్ఞానం నిష్ప్రయోజనం అనిపించింది....
అప్పటి నుంచి నా స్వంత పరిజ్ఞానమే పిల్లల్లొ నాకొక ప్రత్యేక స్థానాన్ని ఇచ్చి నా శ్రద్ధ కూడా పెంచుకుంటూ పోయింది...

ఓనమాలతో మొదలెట్టి జీవన విధానాన్ని నేర్పించి
విద్యార్ధి విజయానికి నాంది పలికిన
నిజమైన గురువుల ప్రతిభకు సాటి ఏది!!!!!

దీపావళి కి రెండు రోజులముందే నేను లెక్చరర్ అయ్యానన్నమాట! అందుకే ఇలా తలుచుకుంటున్నాను:)
కొత్త పంతులమ్మ లందరికీ ఇది అంకితం.....

  మితృలందరికీ హృదయపూర్వక దీపావళి పండుగ శుభాకాంక్షలు.

ఇవాళ పిల్లల పండుగ కదా! అందుకని మా పిల్లలకి, బ్లాగుల్లో ఉన్న  బాబులకి, పాపలకి....

బాలల దినోత్సవ శుభాకాంక్షలు......




*****************************************************************************************************************************************************

22, అక్టోబర్ 2012, సోమవారం

Let flowers do the talking ...


  
  
Each of us is a flower
Growing in life’s garden.....   

 వాడిపోతాను, అని తెలిసినా వికసించక మానదు పువ్వు. జీవితం క్షణ భంగురమే అయినా ఎలా పరిమళించాలో ఈ పూల గుసగుసలు, గాలిలో ఈలలు వేసుకుంటూ మరీ మనకి నేర్పిస్తాయి.
పువ్వు చెట్టుకుంటే అందాన్ని ఇస్తుంది.
భగవంతుని చెంత చేరితే పరిమళిస్తుంది.
ఆడపిల్ల జడ నలంకరిస్తే నింగిలో చందమామలా వెలుగొందుతుంది.
సిపాయి మృతదేహం తాకితే పువ్వు జన్మ పరిపూర్ణత చెందుతుంది.

ఓ అందమైన పూవా!
నీవు అందం...నీ మనస్సు అందం...
నీ మనస్తత్వాన్ని సువాసనలతో వెదజల్లుతావు
నీ వంటి మనస్సు మాకుందా!

నన్ను నీవు నాటినప్పుడు
నాకు జన్మ నిచ్చిన తల్లి వనుకున్నాను
నాకు నీరు పోసి పెంచినపుడు
నా మేలు కోరే తండ్రి వనుకున్నాను
నేనొక పూవు పూయగానే
నువ్వు సంతోషిస్తావనుకున్నాను
తీరా నువ్వు ఆ పువ్వును కోసి నప్పుడు
నేను కొంత కృంగిపోయాను
కానీ ఆ పువ్వును భగవంతుని
పాదాల చెంత ఉంచినపుడు
నేనెంతో సంతోషించాను
చివరకు నా జన్మ సార్ధకమైనందుకు
నేను మరీ మరీ ఆనందించాను . . . .
నేనెప్పుడో రాసుకున్న ఈ కవిత గుర్తొచ్చింది.....ఈ పూలతో దానిని జత కూర్చాలనిపించింది....

దేవుణ్ణి పూలతో కొలుస్తాం...ఆ పూలనే దేవుడిగా కొలుస్తే!!!!





రక రకాల రంగు రంగుల పూలు
భలె భలె పూలు... పసందైన పూలు
అందమైన పూలు... కొత్త కొత్త పూలు
ముట్టుకుంటె వదలి పోలేమండి.....
కోరుకున్న పూలు...పూలంటె పూలు కావండి:) 
పూలను   చేకొనరండి ఓ అమ్మల్లారా.....ఓ అయ్యల్లారా...



పూజలు చేయ పూలు తెచ్చాను 
నీ గుడి ముందే నిలిచాను
తీయరా తలుపులను రామా
ఈయరా దర్శనము 






నీ వుండే దా కొండ పై, నా స్వామీ!  నే ఉండే దీ నేలపై.  ఏ లీల సేవింతునో....ఏ పూల పూజింతునో....
శ్రీ పారిజాత సుమాలెన్నో పూచె.....ఈ పేద రాలి మనస్సెంతొ వేచే......


                                                    


ఎవరు నేర్పేరమ్మ ఈ కొమ్మకు.. పూలిమ్మని రెమ్మరెమ్మకు...
ఎంత తొందరలే హరి పూజకు..ప్రొద్దు పొడవక ముందె పూలిమ్మని...
 కొలువైతివా దేవి నా కోసము.. తులసీ..తులసీ దయా పూర్ణ కలసి...
మల్లెలివి నాతల్లి వరలక్ష్మికి..మొల్లలివి నన్నేలు నా స్వామికి 
ఏ లీల సేవింతు ఏ మనుచు కీర్తింతు...
సీత మనసే నీకు సింహాసనం...



ఒక పువ్వు పాదాల..ఒక దివ్వె నీ మ్రోల ఒదిగి నీ ఎదుట...
ఇదె వందనం.. ఇదె వందనం...  


 


ముద్దు ముద్దు రోజావే ముద్దు లొలుకు రోజావే 
ప్రేమ మంత్రమే, వాడని రోజావే
నిన్ను చూస్తే నన్ను నేను మరచిపోనా!




జగన్మాత నవరాత్రి ఉత్సవాల శుభాకాంక్షలు.....మీరెల్లరూ ఉల్లాసంగా రంగు రంగుల, వన్నె చిన్నెల పూనవ్వులతో ఆనందంగా ఈ పండుగ జరుపుకోవాలి......జయ






**************************************************************************************************************************************

                                   

 

మనస్వి © 2008. Template Design By: SkinCorner