3, డిసెంబర్ 2009, గురువారం

భయ౦...భయ౦ !!!

నాలోని నవరసాలు - భయానకం


ఆ మధ్య నవ రసాల మీద ఆధారపడి నేను అనుభవించిన కొన్ని సంఘటనలు "నవరసాల నా అనుభవాలు" రాయాలి అనుకున్నాను. నేను రాసిన " నా మది దోచిన పాండురంగడు" నాకు ప్రశాంతత నిచ్చి" శాంత రసంగా" అనిపించింది. దీనితోటే ఎందుకు ప్రారంభించ కూడదు అనుకున్నాను. అనుకోకుండా ఇవాళ నేనెదుర్కొన్న సంఘటన నాకు " భయానక రసాన్ని" గుర్తు చేసింది. నా జీవితం లో ఇంతవరకు ఇటువంటి భయాన్ని నేను అనుభవించ లేదు. అదికూడా నేను పని చేసే కళాశాల లో ఈ విధమైన అనుభవాన్ని, నేనెప్పుడూ ఊహించను కూడా లేదు.

ప్రత్యేక రాష్ట్రం కోసం తెలంగాణా అట్టుడికి పోతున్న సమయమిది. ముఖ్యంగా విద్యాలయాల మీద చాలా ప్రభావాన్ని చూపిస్తోంది. రోజుకో రకంగా సమస్యలు ఎదుర్కో వలసి ఒస్తోంది. కె.సీ.ఆర్. తో, ఉస్మానియా యూనివర్సిటీలోని విద్యార్ధుల గొడవలతోటి, ఖమ్మం లో కె.సీ.ఆర్. అరెస్ట్ తరువాతి సంఘటనలు విద్యార్ధుల మీద చాలా ప్రభావాన్ని చూపిస్తున్నాయి.

బంద్ లు నిర్వహించినప్పుడల్లా మేము కూడా స్టూడెంట్స్ ని పంపించేస్తునే ఉంటాము. కాని శలవు అన్నది అఫీషియల్ గా ప్రకటించలేము కదా. అందుకే ఎవరన్నా, విద్యార్ధి సంఘాలు వొచ్చి డిమాండ్ చేస్తే అప్పటికప్పుడు పిల్లల్ని పంపించేస్తాం. ఈ రోజు కె.సీ.ఆర్. ని హైదరాబాద్ తీసుకొస్తూ ఉండటం తో మళ్ళీ ఉద్రిక్తత చోటుచేసుకుంది. అయినా ఇవాళ హాలీడే కాదు కాబట్టి, అందరం కాలేజ్ కి రావాల్సే ఒచ్చింది. అదేవిటో ఎప్పటికన్నా కూడా ఇవాళ స్టూడెంట్స్ కూడా చాలా మందే వొచ్చారు. నేను ఇంటినుంచి కాలేజ్ కి వెల్తున్నప్పుడే చాలా మంది జూనియర్ కాలేజీల స్టూడెంట్స్ తిరిగి వెళ్ళిపోవటం గమనించాను. మా కాలేజ్ దగ్గరికి వొచ్చేటప్పటికి యధావిధిగా గేట్ తీసి, వాచ్మాన్ ఉన్నాడు. స్టూడెంట్స్ కూడా లోపలికి పోతున్నారు. మామీద ఏమి ప్రభావాం లేదేమొ అనుకుంటూ నేను కూడా లోపలికి వెళ్ళిపోయాను. యధావిధిగా మా రొటీన్ ప్రారంభమయ్యింది.

నాకు ఫస్ట్ టు అవర్స్ వరసబెట్టి ఉన్నాయి. అందుకని స్టాఫ్ రూం కి పోకుండా రెండు క్లాస్ ల రిజిస్టర్స్ తీసుకొని, పైన ఉన్న నా క్లాస్ కి వెళ్ళి పోయాను. ఫస్ట్ పీరియడ్ బాగానే జరిగింది. సెకండ్ పేరియడ్ స్టార్ట్ అవగానే ఆ క్లాస్ కి వెళ్ళాను. పిల్లల్ని పలకరించి అటెండన్స్ తీసుకున్నాను. ఈ లోపల ఒకమ్మాయి, మాడం... కె.సీ.ఆర్. చచ్చి పోతాడా... అని సడన్ గా అడిగింది. ఈ రోజు ప్రపంచ వికలాంగుల దినోత్సవం . దాని గురించి స్టూడెంట్స్ తో చర్చిద్దాం అనుకున్నాను. ఇ౦తలొ ఈ ప్రశ్న తో...ఆగిపోయి..ఎందుకలా అడుగుతున్నావు అన్నాను.

ఇప్పటికే చాలా గొడవలవుతున్నాయి, ఇంకెంతో గొడవలు పెరిగిపోయె ప్రమాదముంది కదా...అందుకని అడిగాను అంది.

నేనేదో అనబోయే లోపలే, ఇంతలో, ఇంకో అమ్మాయి...మాడం...నిన్న "ఆంధ్ర మహిళ సభా" ఉమెన్స్ కాలేజ్ పేరు, ఉద్యమకారులు, "తెలంగాణా మహిళా సభా" కాలేజ్ గా మార్చి రాసారుట. వాళ్ళేమి అనలేదుట...మన కాలేజ్ పేరు కూడా అలా మార్చేస్తారా? అని అడిగింది.

అటువంటి ప్రమాదమేమి మనకు లేదులే... అలా మార్చే అవకాశం మన కాలేజ్ పేరుకి లేదుకదా... అన్నాను ...అందరం నిజమే, అని నవ్వుకున్నాం.

అందరూ నవ్వుల్లో ఉండగానే ఒక్క సారిగా పెద్ద పెద్ద అరుపులు వినిపించాయి. మాకేమి అర్ధం కాలేదు. ఏమయ్యిందా! అనుకునేంతలోనె, కాలేజ్ లో పెద్ద గొడవ మొదలయ్యింది. వెంటనే క్లాస్ రూం నుంచి బయటికి ఒచ్చి, మేము మూడో అంతస్తులో ఉండటం తో కిందకి ఒంగి చూసాను.

ఒక్కసారిగా భయం తో ఒళ్ళు జలదరించింది. కింద కెమిస్ట్రీ కారిడార్ లోనుంచి, ఫిజిక్స్ కారిడార్ లోకి పెద్దగా అరుచుకుంటూ... తలుపుల మీద కర్రలతోటి గట్టిగా కొడుతూ... ఒక ముప్పై మంది దాకా మొగపిల్లలు అక్కడ ఉన్న అమ్మాయిల మీదకి పరిగెత్తుకుంటూ ఒస్తున్నారు. ఆ పిల్లలు భయం తో, దిక్కు తోచక...లాబ్స్ లోకి...అటూ..ఇటూ... అరుచుకుంటూ పారిపోతున్నారు. కొంత మంది అబ్బాయిలు, కింద ఉన్న లాన్ లోకి పోయి... గడ్డి పీకటం... చెట్లను పీకి పారేయటం చేస్తున్నారు. వాళ్ళ చేతుల్లో కత్తులూ...కఠారులు కూడా ఉన్నాయి. కిందనే ఉన్న ఎక్జామినేషన్ బ్రాంచ్ లోకి ఉరుకుతున్నారు. ఫిజిక్స్ లాబ్ లోని పరికరాలు అన్నీ విసిరి అవతల పారేస్తున్నారు. ఇదంతా క్షణాల మీద జరిగిపోయింది. కింద పరిస్తితి చాలా ఘోరంగా తయారయ్యింది. కొంతమంది మెట్లెక్కి పైకి ఒస్తున్నారు. వెంటనే, కిందకి వెళ్ళబోయాను. కాని, ఇక్కడ ఉన్న అమ్మాయిల్ని ఒదిలేసి మాత్రం ఎలా వెళ్ళగలం.

పైన ఉన్న మాకు ఒక్క క్షణం ఏం చేయాలో తోచలేదు. వెంటనే అమ్మాయిలందర్ని అక్కడే ఉన్న లైబ్రరీ లోకి వెళ్ళిపొమ్మన్నాం. ఎవర్నీ బయటికి రావద్దని గట్టి వార్నిగ్ ఇచ్చాం. పిల్లలు కూడా చాలా భయపడిపోయారు. అందరూ లైబ్రరీలో కి వెళ్ళిపోయారు. నాతో పాటు ఇంకా అయిదుగురు లెక్చరర్స్ ఉన్నారు పైన. మా కాళ్ళు ఒణికి పోతున్నాయి. నోట మాట రావటం లేదు. అంతా భయానకంగా అయిపోయింది. మేము మాత్రం ఏం చేయగలం.

ఇంతలోనే కింద పోలీస్ విజిల్స్ వినిపించాయి. ఆ అబ్బాయిల్ని...ఎక్కడికక్కడ పట్టుకొని...లాఠీ లతోటి కొడుతున్నారు. ఇంక ఎవ్వరూ పైదాకా రాలేదు. మేము వెంటనే కిందికి దిగి వెళ్ళాం. అక్కడ పోలీస్ ఆఫీసర్, మా ప్రిన్సిపల్, మిగతా లెక్చరర్స్, మా అటెండర్స్, అఫీస్ స్టాఫ్ అంతా కనిపించారు. వాళ్ళను చూడంగానే కొంచెం ధైర్యం వొచ్చింది. ఆ అబ్బాయిలందర్ని అక్కడినుంచి తీసుకెళ్ళిపోయారు.

గేట్ దగ్గిర ఇద్దరు వాచ్మన్లు బాగా దెబ్బలు తగిలి పడిపోయిఉన్నారు. చిన్నగేట్ విరిగిపోయిఉంది. పెద్దగేట్ ని వాళ్ళేమి చేయలేక పోయారు. మా కాలేజ్ పనిచేస్తూ ఉండటం తో... కాలేజ్ మూయించాలని లోపలికి ఒచ్చి... ఇంత భయానకంగా ... ఘోరంగా ప్రవర్తించారు. అయిదునిముషాల్లో పిల్లలందరిని ఇళ్ళకు పంపించేసాం. దేవుడి దయ వల్ల ఎలాంటి ప్రమాదం జరగ కుండా నిమిషాల మీద చర్య తీసుకొని... బయట పడగలిగాం. ఇంతా చేస్తే వాళ్ళు ఏ స్టూడెంట్ సంఘాల వాళ్ళు కాదట. ఉత్త రౌడీ మూకలని పోలీస్ ఆఫీసర్ చెప్పారు.

ఏమైనా జరిగి ఉంటే....మేమూ..మా పిల్లలూ...మా కాలేజ్...ఏమైపోయుండే వాళ్ళం. ఈ గొడవలతో ఎంతటి సెక్యూరిటీ కూడా సరిపోవటం లేదు.

మా కాలేజ్ పేరు చానల్స్ లో మోగిపోయి ఉండేదేమో! అమ్మో...అదేగనుక జరిగిఉంటే! ఇంకా ముందుకు ఊహించే శక్తి నాకు లేదు. ఎటువంటి ప్రమాదం లేకుండా బయట పడడం... మా అదృష్టం అనే అనిపిస్తోంది నాకైతే ... నేనైతే ఇంతకన్నా భయానక దృశ్యం నా జీవితంలో ఇప్పటివరకు చూడా లేదు. ఒక పట్టాన నా భయం పోలేదు.

నాకు ఇప్పటికీ....కళ్ళు మూస్తే చాలు....పరిగెత్తి పారిపోతున్న మా అమ్మాయిలే కనిపిస్తున్నారు.

కొసమెరుపేమిటంటే...రేపటినుంచి పదిహేను రోజులు ... తెలంగాణా లో ఉన్న అన్ని విద్యా సంస్థలకు శెలవులు ప్రకటించటం. రోజూ భయపడుతూ కాలేజ్ కి వెళ్ళోచ్చే కన్నా... ఇదే నయమనిపిస్తోంది.

నాకే రాజకీయాలు తెలియవు. కాని చాలా కాలానికి దొరికిన ఈ విశ్రాంతిని మాత్రం ఎలా సద్వినియోగం చేసుకోవాలా అన్న ఆలోచనలొ పడ్డాను.

వీలైనంత తొందరగా ఈ గొడవలు...భయాలు... సద్దుమణిగి పోతే బాగుండు!

మళ్ళీ ప్రశాంతంగా...ఎప్పటిలా...కళ కళ లాడే పిల్లల నవ్వులతో మా కాలేజ్ ఎప్పుడుంటుందో!!!


*******************************************************************








19 కామెంట్‌లు:

Anil Dasari చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
Anil Dasari చెప్పారు...

కత్తులు, కఠార్లతో పిల్లల మీద పడి బెదిరించి కాలేజీలు మూయించేవాళ్లు విద్యార్ధులయ్యుండే అవకాశం లేదు. రౌడీ మూకలకి ఉద్యమాలతో పనుండదు. వాళ్లకి కావలసింది తమ రాక్షస ప్రవృత్తి బయట పెట్టుకునే అవకాశం మాత్రమే. అల్లరి మూకల చిల్లర వేషాల్ని విద్యార్ధి బలంగా అపోహ పడుతూ ఆ వేషాలే నేడో రేపో రాష్ట్ర విభజనకి దారి తీస్తాయనుకునే అమాయకులు కొందరున్నారు. వాళ్లని చూసి జాలి పడటమే ప్రస్తుతం మనం చెయ్యాల్సింది. వినాశకాలే విపరీత బుద్ధి. మొన్నటిదాకా అంతో ఇంతో ప్రశాంతంగా సాగబట్టే తెలంగాణ వేర్పాటువాదం మనగలిగింది. ఎప్పుడైతే విధ్వంసకర చర్యలు మొదలయ్యాయో, అప్పుడే వేర్పాటువాదాంతానికి కౌంట్ డౌన్ కూడా మొదలయింది.

మాలా కుమార్ చెప్పారు...

చదువుతుంటేనే కాళ్ళు గజగజ లాడిపోతున్నాయి . పిల్లలంతా క్షేమంగా ఇళ్ళకు చేరారు కదా ?

శిశిర చెప్పారు...

కొన్ని అల్లరి మూకలు ఇలాంటి అవకాశాల కోసమే ఎదురు చూస్తాయి జయ గారు. నేను చదువుకునే రోజులనుండీ ఇలాంటివి చూస్తున్నాను. మా చిన్నప్పుడు, ఎన్.టి.ఆర్ పోయినపుడు పెద్ద పెద్ద కర్రలతో వచ్చి స్కూళ్ళ మీద, కాలేజీల మీదా పడి జనాలు గందరగోళం సృష్టిస్తుంటే క్లాసు రూములనుండి ఇళ్ళకు పరిగెత్తడం నాకింకా గుర్తే. అలాగే మొన్న వై.యస్.ఆర్ మిస్సయినప్పుడు ఇంకా హెలీకాప్టర్ జాడ తెలియక మామూలుగానే క్లాసులు రన్ చేస్తున్నాము. ఎప్పటికప్పుడు ఆఫీస్ స్టాఫ్ నెట్ ఫాలో అవుతూనే వున్నారు న్యూస్ కోసం. హెలీకాప్టర్ సేఫ్ లాండిగ్ జరుగలేదు అని తెలియగానే శెలవు అనౌన్స్ చేసి పిల్లల్ని పంపేశాము. మీకూ దూరమే కదా మేడం, మీరూ పిల్లలతో వెళ్ళిపోండని నన్నూ పంపేశారు వెంటనే. దొరికిన బస్సు పట్టుకుని గంట ప్రయాణం తరువాత మా వూల్లో దిగాప్పటికి అక్కడనుండి ఇంటికి వెళ్ళడానికి ఒక్క ఆటో కూడా లేక నేనూ, ఇంకో ఇద్దురు పిల్లలూ కలసి నడక మొదలుపెట్టాం ఇంటికి. దారిలో చూడాలి, బళ్ళకి సైలెన్సర్లు తీసేసి, చేతిలో కర్రలతో, హోటళ్ళా మీదా,షాపుల మీదా పడీ వీళ్ళు చేస్తున్న హడావుడి. మా ఇల్లు దగ్గరే, అసలీ అమ్మాయిలు ఇళ్ళకి క్షేమంగా వెళ్తారా అని భయం వేసింది. ఎలాగో అందరం ఇళ్ళు చేరి వూపిరి పీల్చుకున్నాము. అసలు వీళ్ళ ప్రవర్తన ఆ పోయిన వాళ్ళకి గాని, ఆ ఉద్యమాలకి గాని చెడ్డ పేరు తెచేదిలా వుంటూంది తప్ప నిజంగా ఆ వ్యక్తులకి నివాళీ కాదు. ఆ ఉద్యమాలకి సపోర్టూ కాదు. ఏమైనా మీరు, పిల్లలు క్షేమంగా బయట పడ్డారు. అదే చాలు.
నవ రసాల గురించీ రాయాలన్న మీ ఆలోచన బాగుంది. మిగిలిన ఏడు రసాల కోసం ఎదురు చూస్తూ వుంటాను.

కార్తీక్ చెప్పారు...

అక్క ఎందుకమ్మా అంత భయం :)

ఈ విషయంలో ప్రభుత్వం తప్పు కూడా ఎక్కువే ఉంది...
వీళ్ళు చేయవలసింది ఉద్యమ కారులని అణచివేయడం కాదు, వారితో త్వరితంగా చర్చలు జరపడం...
విద్యాలయాలకు సెలవులు ప్రకటించి వీళ్ళు ఎం చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకే సరిగా తెలియదు...
దీని వల్ల ఉద్యమకారుల్లో మరింత అణచివేతకు గురిఅవుతున్నాం అనే భావన పెరిగి మరింతగా రేచ్చిపోతూ ఇలా రౌడి మూకల్ని ఆశ్రయించే అవకాశం ఎక్కువగా ఉంటుది కాబట్టి దీనికి బాద్యత ప్రబుత్వానిదే...

అన్ని కేంద్రం చేతులోనే మా చేతుల్లో ఎం లేదని చెప్పడం మనప్రబుత్వ అసమర్ధతని వెలి చూపుతుంది...

ఏదేమైనా మీకు మాత్రం పదిహేను రోజులు సెలవు....... :)

Anil Dasari చెప్పారు...

@కార్తీక్:

>> "విద్యాలయాలకు సెలవులు ప్రకటించి వీళ్ళు ఎం చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకే సరిగా తెలియదు..."

పొరబడ్డారు :-)

సగటు విద్యార్ధికి మందలో ఒకడుగా ఉండి గుంపులో గోవిందయ్యలా నాలుగు రాళ్లేయటానికి ఉండే ధైర్యం ఒంటరిగా అదే పని చెయ్యటానికి ఉండదు. ఆ మందని చెల్లాచెదురు చేసి విడదీసి ముఖ్యులని మూసేసే అవకాశం పోలీసులకివ్వటానికే ఈ సెలవుల ఎత్తుగడ.

1990లో దేశమంతా రిజర్వేషన్ వ్యతిరేక ఉద్యమంతో అట్టుడికినప్పుడు ఎక్కడికక్కడ ప్రభుత్వాలు, విశ్వవిద్యాలయాలు చేసింది సరిగా ఇదే పని. Trust me, ఆ నాటి ఉద్యమంతో పోలిస్తే నేటి తెలంగాణ ఉద్యమంలో విద్యార్ధుల పాత్ర nothing. అప్పట్లో -సెలవులు ప్రకటించగానే పిల్లకాయలు పెట్టేబేడా సర్దుకుని ఎవరి ఊళ్లకు వాళ్లు వెళ్లిపోయారు. మిగిలింది కొద్దిమంది నాయకులు మాత్రమే. వాళ్లని పోలీసులు దొరికినోళ్లని దొరికినట్లు మూసేసి 'పెళ్లిళ్లు' చేశారు. మళ్లీ కాలేజీలు తెరిచేసరికి ఉద్యమం గిద్యమం అంతా గప్‌చుప్.

ఇప్పుడు జరగబోయేదీ అదే, చూస్తుండండి.

శేఖర్ పెద్దగోపు చెప్పారు...

ఏంటో ఇది ఏ మలుపు తిరుగుతుందో వేచిచూడాలి. ఇప్పటికే కే.సీ.ఆర్ ఆరోగ్యం బాగా క్షీణించినట్టుంది.

జయ చెప్పారు...

స్పందించి, మీ అభిప్రాయాలు తెలియ చేసిన అబ్రకదబ్ర గారు, శిశిర గారికి, కార్తీక్ కి, అక్క కి నా ధన్యవాదాలు.

జయ చెప్పారు...

శేఖర్ గారు వీలైనంత తొందరగా, ఏ అమాయకులూ బలికాకుండా ఇదేదొ ముగిసిపోతే బాగుండు. రేపటినుంచి ఇంకా 48 గంటలు బంద్ నిర్వహిస్తారుట. అదెలా ఉంటుందో.

అజ్ఞాత చెప్పారు...

మేం చదువుకునేప్పుడూ ఇలానే మండల్ కమిషన్ అని ఏదో గడవలు జరిగాయి . అసలు ఆ కమిషన్ ఏంటో ఎవరికి సరిగా తెలీకపోయినా మమ్మల్నీ బలవంతంగా ధర్నాలు అవీ చేయించేసేవాళ్ళు స్టుడెంట్ యూనియన్ వాళ్ళు . దాదాపు నెల రోజులు మేం కాలేజ్ కి వెళ్ళటం వాళ్ళు వచ్చి మూయించెయ్యటం . ఈసురోమంటూ ఇళ్ళు చేరటం . దానికంటే ఇలా సెలవులు ప్రకటించడమే మంచిది. అపుడే అసలు వుద్యమంలో పాల్గొనే స్టుడెంట్స్ ఎంతమదో రౌడీలు ఎంతమందో తెలుస్తుంది.

జయ చెప్పారు...

ఇప్పుడిప్పుడే కె.సీ.ఆర్. చనిపోయాడన్న పుకార్లు కూడా ఒస్తున్నాయ్ లలిత గారు. చాలా గొడవలు జరుగుతున్నాయ్. ఏవిటో! ఏమవుతుందో...

మురళి చెప్పారు...

అవి పుకార్లేనండీ.. కేసీఆర్ క్షేమమే..

రాజన్ చెప్పారు...

జరిగిన విషయాన్ని కళ్ళముందు జరుతున్నట్లుగా వ్రాసారు. మీ రచనా శైలి కి అభినందనలు.

జయ చెప్పారు...

అవునండి ఆ విషయం తెలుస్తూనే ఉంది మురళి గారు. కె.సీ.ఆర్. కి ఏమీ కాదు. కాని జరుగుతున్నవి, విద్యార్దుల ఆత్మహత్యలే భయానికి కారణ మవుతున్నాయి.

జయ చెప్పారు...

రాజన్ గారు, అది జరిగిన విషయమే కదా...అందుకని మీకలాగ అనిపించినట్లుంది. నేను చాలా మామూలుగా, అప్పటికప్పుడు తోచినట్లు రాసేస్తు ఉంటానండి. ధన్యవాదాలు.

శ్రీలలిత చెప్పారు...

జయగారూ, అరాచకమంటే ఇదేనెమో కదా..అసలు మనం సభ్యసమాజంలో బ్రతుకున్నామా అన్న అనుమానం వస్తూంటుంది.

జయ చెప్పారు...

శ్రీ లలిత గారు బాగా చెప్పారు. సభ్య సమాజం డెఫినిషనే మారిపోతోంది.

తృష్ణ చెప్పారు...

"మళ్ళీ ప్రశాంతంగా...ఎప్పటిలా...కళ కళ లాడే పిల్లల నవ్వులతో మా కాలేజ్ ఎప్పుడుంటుందో!!! "

మీ కాలేజే కాదండీ..అసలిలా మన రాష్ట్రం ఎప్పుడుంటుందో...అనిపిస్తోందండీ...

జయ చెప్పారు...

అవును తృష్ణా.

 

మనస్వి © 2008. Template Design By: SkinCorner