15, ఫిబ్రవరి 2011, మంగళవారం
ఇదో బాధా శప్తసతి.....
వంటిల్లు......
నేను ఇంక వంట చేయను గాక చేయను. రోజూ పొద్దున్నే గృహప్రవేశం లాగా టైం కి వంటింటి ప్రవేశం చేయాలి. ఇష్టం ఉన్నా లేకున్నా అలాగే వంట చేయాల్సిందే! అబ్బా, ఈ వంట ఎవరు కనిపెట్టారో కాని....ఇళ్ళల్లో వంటిల్లు కట్టట్టం బాన్ చేస్తే బాగుండు. ఎన్నో ఆధునిక పరికరాలు కనుక్కుంటున్నారు. అన్ని పనులు చాలా సులభమయ్యేట్లుగా చూస్తున్నారు. వినాశన సాధనాలు ఎన్ని కనుక్కుంటున్నారో. ప్రపంచమే ఏ నిమిషం లో అయినా అంతమయ్యేంత పరిజ్ణానాన్ని పెంచేసుకుంటున్నారు. కాని, ఒక్కరంటే ఒక్కరన్నా...అలా సులభంగా కిచన్ లోంచి చక చకా ఫుల్ మీల్ ప్లేట్స్ బయటికి వచ్చేట్లు కనుక్కోలేదు. ఇలాంటి పనికొచ్చే విషయాలు మాత్రం కనుక్కోరు. ఎందుకో, నాకిప్పుడు బాగా అర్ధమయింది. అవన్నీ కనుక్కుంటున్నది ’మగబుద్ధి’ కదా!!! అందుకే ఆడవాళ్ళు ఎక్కడ సుఖపడిపోతారో అని ఇలాంటి సౌకర్యాలు మాత్రం కనుక్కోటం లేదు. ద్రౌపదికిచ్చిన అక్షయ పాత్ర నాక్కూడా, ఏమూలో, ఓ రోడ్డు మీదో దొరకచ్చు కదా...లేపోతే కళ్ళు మూసుకుని ఏదో ఒక మంత్రం చదివితేనో, మాయాబజార్ లో లాగా పంచభక్ష్య పరమాన్నాలు ప్రత్యక్ష్యమైతే ఎంత బావుండో కదా.....కనీసం ఓ కామధేనువన్నా నాకు దొరికితే బావుండు.
కనీసం అప్పుడప్పుడన్నా ఇంట్లో మగాళ్ళు వంట చేస్తే ఎంత బావుంటుందో కదా. అయినా ఏం లాభం లెండి. వాళ్ళు వంట చేస్తే వచ్చే సుఖం కన్నా ఆ తరువాత పడే కష్టం ...అబ్బో చాలా కష్టం. కూరలు కోసే కత్తులు, యుద్ధరంగంలో విచ్చుకత్తుల్లా భయపెడ్తాయి. స్టౌ, ప్లాట్ ఫాం లు శతృదేశాల్లా మారిపోతాయి. మిక్సీ భాగాలన్నీ ఎక్కడెక్కడో ఊడి పడిపోయి క్షతగాతృల్లా విలపిస్తూ కనిపిస్తాయి. పగసాధించాలని మరీ నా కోసం కన్నీరు తుడుచుకుంటూ కసిగా ఎదురుచూస్తూ ఉంటాయి. రకరకాల మూతలు వివిధసైజుల గిన్నెలకి చేరి, ముట్టుకుంటే ఏకంగా పాశ్చాత్య నృత్యాలే చేస్తాయి. ఉప్పులూ, ఖారాలూ, నూనెలు నేలమీద పంచెవన్నెల రంగోలిల్లా పరుచుకొని, అతుక్కుపోయి వంటయింటికే అలంకారమై కనువిందు చేస్తాయి. వంటింటిలో కాలు పెట్టిన మరునిమిషం..ఓహోహోహో...ఆహ హాహాహ ...ఇదియే కదా నా స్వర్గసీమ అని పరవశమై గొంతెత్తి మరీ పాడుకోవాల్సిందే. వావ్, వాటే హెల్ ఇటీజ్:( వంటిల్లు అనే ఆ రణరంగం వికటాట్టహాసంతో సింహంబోను లాగా నోరు తెరిచి మరీ ఆహ్వానిస్తుంది. ఒక్క సారంటే ఒక్క సారి, కేవలం ఒక్కసారే...కనీసం ఒకేఒక్కసారి ఈ క్లీనింగ్ పని మగ వాళ్ళకు అప్పగిస్తే ఎలా ఉంటుందో చూడాలని నా చిరకాల కోరిక. లాభంలేదు, అదినేనే,,,ఇదినేనే...అని పాడుకుంటు నడుం బిగించాల్సిందే.
అసలు నాకు చిన్నప్పుడు వంటిల్లంటే ఒక అద్భుతంగా కనిపించేది. అడగంగానే అమ్మ పోపులడబ్బాలోంచి డబ్బులు తీసిచ్చేది. అలా పోపుల డబ్బాలోంచి డబ్బులొస్తుంటే ఎంత విచిత్రంగా ఉండేదో. అదొక మాజిక్ బాక్స్ లాగా అనిపించేది. వంటిల్లు రకరకాల వస్తువులతో్ ఓ మ్యూజియం లా కనిపించేది. ఎన్నో రకాల వంటకాలు వంటింటిలోంచి తీసుకొచ్చి వడ్డిస్తుంటే, మా అమ్మ నాకో మాంత్రికురాలే అనిపించేది. ఎప్పుడేం అడిగినా ఫర్వాలేదు, ఆ వంటిటి లో ఏదో ఇంద్రజాల మహేంద్ర జాలం చేసి బయటకు తెస్తుంది అని నాకు ఘాఠి నమ్మకం. తెరలు తెరలుగా వ్యాపించే ఆ చక్కటి పరిమళాలు , మా అమ్మ వంటింటిలో పెర్ఫ్యూమ్స్ కూడా తయారు చేస్తుందనిపించేది. అమ్మకు ఎన్నో మంత్రాలొచ్చుకదా...అని ముచ్చట పడిపోయేదాన్ని. మా అమ్మ ఒక అద్భుత యక్షిణి లాగా కూడా అనిపించేది. వంట ఎంత తేలికో. గిన్నెల్లో చేతులు పెట్టి తిప్పేస్తే రకరకాల వంటకాలు రెడీ. సినిమాల్లో లా గరిటలు పట్టుకొని కూడా కనిపించఖ్ఖర్లేదు. నేను కూడా అలాగే దర్జాగా వంటలన్నీ చేసేయాలి అని ఎన్ని కలల మీద కలలు కనేదాన్నో. నేను కూడా తొందరగా చాలా పెద్దదాన్నైపోయి, మా అమ్మలాగే చాలా మాజిక్ లు చేయాలని దేవుడ్ని మితిమీరిన భక్తితో ప్రార్ధించాను. దేవుడిని కోరుకోవాలే గాని, ఆ దయామయుడు తప్పక తీరుస్తాడు కదా. కల నిజమాయెగా...కోరిక తీరెగా అని పాడుకొనే రోజులు తొందరగానే వచ్చేసాయి.
నాకు చిన్నారి కొంటె కిష్టయ్య ఎంత ఇష్టమో... అమ్మలాగే చీర కట్టుకొని, నేనే ఓ యశోదనై, బొమ్మరింటినే మధురానగరం చేసి, కృష్ణయ్యకి లాల పోసి జోలపాడి ఎన్ని ఆనందాశృవులురాల్చానో. మరి ఇక్కడేగా నేను అమ్మతనం నేర్చుకుంది.
నా బొమ్మరింటి లో అన్నిటికన్నా వంటిల్లు పెద్దగా, చాలా అందంగా కట్టుకునేదాన్ని. రకరకాల వస్తువులన్నీ అక్కడే చేరి అదో ఎక్జిబిషన్ లాగుండేది. అలాగే, చూసుకుని...చూసుకొంటూ... చూసేసుకుంటూనే ఎంత మురిసిపోయేదాన్నో. ఆటలు ఆడి పాటలు పాడి అలసి వచ్చానె...తీయతీయని తాయలమేదో తీసిపెట్టమ్మా, అని నేనే పాడుకొని...ఆ ఉత్తుత్తి వంటకాలన్నీ వడ్డించుకొని ఎంత మురిసిఫోయేదాన్నో. వంటింటితనం నేర్చుకుంది ఆ ఆటల్లోనే కదూ. ఈ తమాషా ఆటలు కాదు, ముందుంది అసలైన తమాషా అని, పాపం అప్పుడు నాకుతెలీదు. హు...ఆ సంబరాలన్నీ, పెరిగి పెద్దవుతున్నా కొద్ది కరిగి నీరైపోయాయి.
నలుడు, భీముడు చాలా గొప్ప వంటవాళ్ళని చెప్తారుగా. ఎప్పుడన్నా వాళ్ళ భార్యలకు వండిపెట్టారో లేదో. అన్ని హోటల్స్ లో వంటవాళ్ళు మగవాళ్ళేగా. వాళ్ళన్నా, కనీసం వాళ్ళ భార్యలకి వండి పెట్టారా! ఏమో... వాళ్ళు వంటలు చేస్తే మాత్రం, అది పెద్ద బిజినెస్. గొప్ప కీర్తిప్రతిష్టలు. అదే ఆడవారి వంటకైతే ఎటువంటి గుర్తింపులేదు. సో, మా వంటలకి విలువ లేదన్నమాట. హు...స్త్రీలని అణిచివేయటమంటే ఇదేమరి.
ఇప్పుడు, నా వంటింటికి నేనే మహారాణి ని. అది మహాసామ్రాజ్యమే. రోజూ సూర్యుడికే ...దినకరా...హే శుభకరా ..దేవా, దీనాపాలా...పతితపావనా...మంగళదాతా...పాప సంతాప లోకహితా...అని మేలుకొలుపు పాడుతూ, శ్రీ సూర్యనారాయణా, మేలుకో...మేలుకో....అంటూ వంటింటి ప్రవేశం చేయాల్సి వస్తోంది. స్టౌ నీలి మంటలే ఎన్ని ప్రకృతి దృశ్యాలో చూపిస్తున్నాయి. గిన్నెల చప్పుడే నీటి గలగలలు. మిక్సీ డమడమలే డమరుక ధ్వనులు. కుక్కర్ విజిల్సే వీణానాదాలు. అబ్బో, ఎంత భావుకత్వమో నాకిక్కడ. మా అమ్మమ్మ పల్లెటూరి వంటకాల్లోని మాధుర్యం ఇప్పుడిక్కడ ఎందుకో, నాకు కనిపించట్లేదు. మా అమ్మ మంత్రనగరిలోని ఇంద్రజాలం అలా ఎలాగో మాయమైపోయింది. చిన్నప్పటి నుంచి నాలో పెరిగిన ఆ అద్భుతభావం గమ్మత్తుగా ఇగిరిపోయింది. ఎందుకబ్బా, ఇప్పుడు వంటింటిలో ఇంత సఫకేటింగ్ గా ఉంటోంది నాకు. మా తాతగారు, నాన్నగారు వంటచేయకపోయినా, కనీసం ఇప్పుడు మావారన్నా వంట చేస్తే బాగుండు. రోజులు మారాయిగా...అదీ నాబాధ. కనీసం వంటిల్లు క్లీన్ చేస్తే చూడాలని ఉంది. చీపిరి పట్టి వంటిల్లూడుస్తుంటే ఎలా ఉంటుందా అని అలా తలపైకెత్తి అప్పుడప్పుడూ కాస్త ఊహిస్తూంటాను. అబ్బే..అలా ఇల్లూడుస్తుంటే శ్రీవారేమాత్రం అందంగా కనిపించట్లేదు. ఊహూ...ఆ పోజ్ లో ఉన్న అందమంతా కరిగిపోయి వాళ్ళ ఆఫీస్ లో అటెండర్ లాగా కనిపిస్తున్నారు:) యాక్..అస్సలు బాలే. పాపం, రోజంతా కష్టపడే మనిషి. వద్దులె, వదిలేద్దాం అనిపించింది. మరి నా ఆత్మ ఎలా శాంతించాలి. ఆలోచించాను. చాలా ఆలోచించాను. అలా ఆలోచించి...బాగా చించి....చివరికి, మా ఇంట్లోని వంట సామాను తీసుకెళ్ళి, వాటిమీదున్న ఆయన పేర్లన్నీ చెరిపించేసి, మళ్ళీ కొత్తగా నా పేరు రాయించి తీసుకొచ్చాను. మరి వంట చేసేది ఆడవారైనా, గిన్నెల మీద మగవారి పేరేకదా:) కొంచెం ఆత్మ శాంతించినట్లే అనిపించింది.
ఏం చేస్తాం...ఎవరి యుద్ధం వారే చేయాలిగా. ఇక్కడ శతృవులెవరూ ఉండరులెండి....సర్దుకుపోదాం రా....అన్న పాలసీ తప్ప:)
ఏదో సరదాగానే లెండి:)
.......BAWARCHI-------
********************************************************************************
లేబుళ్లు:
సరదాగా ...
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
23 కామెంట్లు:
మీ పోస్ట్ చదువుతుంటే నన్ను నేను చూసుకున్నట్టు ఉంది జయ గారు.
బావుందండీ.నిజమే ఎంత ఇష్టంగా వంట చేసినా ఒకోసారి ఇలాగే అనిపిస్తుంది కదా
ఎంత బాగా చెప్పారో ..నాక్కూడా ఇలాగే అనిపిస్తుంది. కనేసం ఒక్కరోజన్నా నేను టీవీ చూస్తూ , మా వారు వంట గదిలో వంట చేస్తూ వుండాలి అనుకుంటాను..ప్చ్ ఎప్పుడు తీరలేదు....
బాగుందండి. Reflectiveగా.
తేజస్వి
బాగా చెప్పారండి అన్నిటికీ పరికరాలు వచ్చాయీ కాని
వంటకు మాత్రం రాలేదు ఓపిక వున్న లేక పోయీన చెయ్యాలి ఒక వేళ వంట మనిషి ని పెట్టుకున్నా కొన్ని రోజులకే బోర్ కొట్టేస్తుంది తర్వాత షరా మామూలే ...
తప్పద్దు ఆడ వాళ్ళు గా పుట్టాము కదా
మగవాళ్ళు వంట ఎలా చేయాలో యెంత బాగా నేర్పించారో కదా :-) :-)
చివరి లైన్ చాలా బాగుందండీ, ఆలోచింపజేసేలా..
>>>వంటిల్లు అనే ఆ రణరంగం వికటాట్టహాసంతో సింహంబోను లాగా నోరు తెరిచి మరీ ఆహ్వానిస్తుంది.>>>
:) రోజూ చేస్తారు కనుక మీకింత భయంకరంగా అనిపిస్తుందేమోనండీ. ఎలా మరి? మీ అబ్బాయికైనా ఈ రణరంగాన్ని పరిచయం చేసి, యుద్ధం చేయడం అలవాటు చేయండి. మీ కోడలు కూడా ఇలా వాపోవాల్సిన అవసరం రాకుండా. :)
మీరు చెప్పింది నిజమే. ఎప్పుడైనా అమ్మని సుఖపెట్టేద్దామని రెండు రోజులు వరుసగా ఈ రణరంగంలోకి దూకినా మూడోరోజు మళ్ళీ అమ్మకి అప్పగించేయాల్సిందే.
@ అను గారు,హు:) మనందరి చరిత్ర ఇదే కదండి.
@ లత గారు, ఏం చేస్తామండి, ఉద్యోగాలన్నా రిటైర్ అవుతాము గాని, వంటింటి ఉద్యోగానికి మాత్రం మినిస్టర్ లాగా ఏజ్ లిమిట్, రిటైర్మెంట్ ఏమీ ఉండవుకదా.
@ ప్రవీణ గారు, మనమలా కోరుకుంటాం. అంతే కాని నిజంగా అలాచేయబుద్ధేయదు కదా:)
ఎందుకండీ, మేము వంట చేయటమూ..ఆ తరువాత వెంటనే తిట్టించుకోవడమూ :-).. అలాక్కాదు కానీ ఇంకో మాట చెప్పండి జయగారూ .
@ తేజస్వి గారు, అంతే ....అదింకొకరి మీద రిఫ్లెక్ట్ అవ్వకుండా చూసుకోవాల్సిందే మరి.Identity crisis:)
@ సుమలత గారు అంతేకదండి. వంటిల్లు ఎప్పటికీ మన సామ్రాజ్యమే. అది ఇంకోరికిచ్చేస్తే ఏమన్న ఉందా. మన రాజరికం పోదూ. అమ్మో, ఆ హక్కు వదులుకోటమే. మనం పడుతున్న కష్టం ఎలాగైనా తెలవాలి కదా:) Nothing doing. This is ours.
@ మురళి గారు,వంట మగాళ్ళు నేర్పించినట్లైతే పాపం ఒక్కసారన్నా వాళ్ళ భార్యలకి ఎందుకు వండి పెట్టరు. అక్కడ చెల్లదని వాళ్ళకి తెలుసు. అందుకే తెలివిగా బయట చెలాయించుకుంటు చరిత్రకెక్కారు. చూసారా, ఆడవాళ్ళు ఎంత త్యాగం చేస్తారో:) o.kay. Think about that last line. Thanq.
@ శిశిరా, శ్రీవారినే కాలు పెట్టనియ్యని దాన్ని. మా అబ్బాయినెందుకు కష్టపడనిస్తాను. నా రాజ్యంలోకి శతృవులనెలా రానిస్తాను:)
@ అయ్యో, రామిరెడ్డిగారు...ఏనాటికైనా ఒకటే మాటండి బాబూ. ఒక్కసారి మా మహాసామ్రాజ్యం లో కాలుపెట్టి చూడండి. అలా కాదు కాని, చేతులు కట్టుకొని మా కష్టాన్ని 'గుర్తించా'లన్నమాట. అంతే. It's quiet simple:)
హహహహ జయ గారు నాది కూడా శిశిర గారి మాటే ..ఏమంటారు ... మా అమ్మ అంతే తన రాజ్యం లోకి నన్ను అస్సలు కాలు పెట్టనివ్వదు
Adento.. pelli ki mundu vantalu chesina abbayilu kooda pelli ayyaka vantala joliki vellaru(vellanivvaru)..)
ayina evari rajyam valladi, so mee rajyam gurinchi memu no comments akka.. :)
@ ఔనౌను శివాని...మన 'స్వంత వంటిల్లు' వచ్చాక అప్పుడు తెలుస్తుంది, ఆడవాళ్ళు వంటింటి పెత్తనం ఎందుకు వదలరో:)
@ సో, శశిధర్...అర్ధమయ్యింది కదా ఎంత పవర్ ఆడవాళ్ళ కంట్రోల్లో ఉంటుందో:) అదన్నమాట సంగతి.
జయ గారూ..పోస్టు సూపర్ అండీ...ఏంటో మా దిక్కుమాలిన ఊళ్ళో హోటళ్ళు కూడా లేవు..మెక్డొనాల్డ్సూ, టిం హార్టన్సూ తప్ప! ఎన్ని యేళ్ళయిందో యెవరైనా వండి పెడితే తిని...పాపం నేను..మాలా గారు పిలిచారుగా వచ్చేయాలి తొరగా ..
శశీ,వంట వచ్చిన మగ వాళ్ళుంటే ఎంత నరకమో నన్ను అడగండి చెప్తాను...వాళ్ళు వండరు...ఇంకొకళ్ళు వండితే నచ్చదు..వంకలు పెడుతూ తింటుంటే..అలసట మూడితలవుతుంది...నాకు తెలిసీ వంట రాని వాళ్ళకి వండి పెట్టడమే వీజీ..మీకు నీతి యేమనగా..మీరు వండక పోయినా ఫర్వాలేదు...ఎవరైనా వండి పెడితే..మెచ్చుకుంటూ తినవలెను...
@jaya akka - Oppukunta..Anduke annaru.. intiki deepam illalu ani. :) adento ila pogidi panulu chepinchukovatam abbayilaki puutaka tho vasthundi anukunta.
@ennela akka - meeru cheppindhi aksharala correct, naa freind valla husband ki vanta vacchu anta, thanaki monna call chesthey "Popu kooda enthaga veyinchalo cheputhunnaru sasi".. ani.. anduke naaku vanta vacchina aa vishayanni nenu dachesthunna.. ee secret mana mugguru lone vundali...
//naaku , jaya akka ki , ennala akka ki tappa evvariki ee comment kanapadadhu kaka.. omm beem beesah...
నిజమే మరి నేను కూడ ఎంత బాగా చెయ్యాలని
ట్రై చేసినా ఒకొక్కసారి ఇలాగే జరుగుతుంది .
@ ఎన్నెల గారు, రెండు రోజులు తిరుపతెళ్ళొచ్చాను. అందుకే లేట్ అయ్యాను. వంట వచ్చిన వాళ్ళ గురించి సమస్యలైతే పెద్ద పెద్ద గ్రంధాలే రాయొచ్చు:) పొన్లే మనం అదృష్టవంతులమే. ఏదో ఒకటి మనం చేసిపెట్టింది తినాలి గాని, వాళ్ళే వండుతే ఎలా:) మా అక్కని మాత్రం నా వంట గురించి అడగకండేం.
@ హాయ్ శశిధర్, ఏంటీ...వంట వచ్చా? అలా అయితే చాలా కష్టమబ్బాయ్. మరి మాకెప్పుడు వండిపెట్టేది:) నీ చేతి వంట, వైకుంఠ.....:):) :) అంతేనా.
@ అవును సుమలత గారు...అది మగవాళ్ళు పెట్టిన దిష్ఠి:)
శశీ మీ మంత్రం బాగా పనిచేసింది. నేను వేరే కంప్యుటర్ నుంచి లాగ్ అయి చూస్తే మీ కామెంట్ కనబడట్లే
@jaya Akka - naa chethi vanta. bane vuntundhi ani talk :)
@Ennela akka - adenti.. vere system loninchi meeru chusina comment kanipinchali kada.. mathram ekkado theda kottesindhi
@ఎన్నెల గారు శశిధర్ కి మంత్రాలు సరిగ్గా రావు. బాగా నేర్చుకోలేదు. చూసారుగా ఎలా బాధ పడుతున్నాడో.
@ శశిధర్, ఎక్కడైనా మంత్రాల క్రాష్ కోర్స్ ఉందేమో నేర్చుకోవచ్చుగా. అప్పుడు మంత్రం బాగా పనిచేస్తుంది:)
జయగారు చాలా బాగుంది .నాది సేం ఫీలింగ్ :)). ఎప్పుడో ఒకసారన్నా ఇలా అనుకొని ఆడవారు ఉండరేమో .
రాధిక గారు సేం పించ్ కదా:)
కామెంట్‌ను పోస్ట్ చేయండి