30, సెప్టెంబర్ 2011, శుక్రవారం

’నే చూసిన దసరా మంటపం ’

సకల జనుల సమ్మె......
రాజధాని బంద్......
నేను కూడా ఫ్రీ:)
చక్కగా దొరికిన ఈ అవకాశం. ఏం చేయాలి. అవునూ...ఎంతో అందమైన అమ్మవారి మంటపాలు చూసి రావచ్చుకదా! అనుకున్నాను. ఇదిగో, నేను చూసిన ఒక అందమైన దసరా మంటపాన్ని మీరు కూడా చూడండి మరి. నాకు తెలుసు...మీకు తప్పకుండా నచ్చుతుంది. ఈ పాటికే మీరు చాలా చూసేసే ఉంటారు. అయినా సరే, ఇది కూడా చూసేయండి మరి.


ఎంతో అందమైన ఈ దీప తోరణాలు మనల్ని ఆహ్వానిస్తాయి. అందమైన స్వాగతాలు పలుకు తాయి.


అదిగో అల్లంత దూరాన ఎత్తైన ఆ గుడి గోపురం మనల్ని పలకరిస్తుంది. అనంత పద్మనాభ దేవాలయం సొగసులు ఇక్కడ పొందుపరిచారు. ఆ నేలమాళిగలు ద్వారాలుగా రూపుదిద్దుకున్నాయి. చూడండి, ఎంత అందంగా ఉందో!!!


ఇదే ఆ నేల మాళిగ తలుపు. పక్కనే నాగబంధం, వినాయకుడు, గోడమీద దేవతా విగ్రహం కూడా చూడొచ్చు.









మెట్లెక్కి లోనికి ప్రవేశించాలి. అక్కడే మనకు నిలువెత్తు అనంత పద్మనాభ స్వామి దర్శనమిస్తాడు. ఆ పక్కనే మునులు యజ్ఞ యాగాలు నిర్వహిస్తున్నారు.





ఇక్కడినుంచి సన్నటి ద్వారం గుండా లోనికి ప్రవేశించాలి. ఇక్కడ మనకి అగ్నిపరీక్ష. అంటే నిప్పులమీద నడచిపోవాలన్న మాట:) ఇదిగో ఇలాగ.



మెలికలు తిరిగిన ఆ దారిలో ఒక పులి కూడా ఉంది. మనల్ని పలకరిస్తోందా!!!! తస్మాత్, జాగ్రత్త అంటోందా!!!!!



ఆ తరువాత మనం ఈ 'లక్ష్మణ ఝూలా' కూడా దాటాలి. ఇక్కడ కొంతమంది మునీశ్వరులు తపస్సు కూడా చేసుకుంటున్నారు.




ఆ తరువాత ఒక సన్నని గుహ లోకి ప్రవేశించాలి. పాపం ఆయనెవరో!!! ఆయనకి తెలీదు ఆయన ఫీట్ నేను ఫొటో తీస్తున్నానని:)


హు: అప్పుడే ఎక్కడయిందండీ, బాబు. ఇప్పుడు మనం ఈ వైతరిణి దాటితే తప్ప ఆ అమ్మవారు మనకి దర్శనమివ్వదు.


ఈ దీర్ఘ ప్రయాణం తర్వాత, ఇంక మనం గర్భ గుడిలోకి ప్రవేశించినట్లే. అదిగో, చూడండి. ఆ జగజ్జనని శ్రీమతా దుర్గాదేవి దివ్యమంగళ స్వరూపం. అక్కడి దీపాల వెలుగులో, రకరకాల రంగులలో, మిరుమిట్లు గొలిపే ఈ ప్రాంతం, దివ్యలోకాన్ని చూపిస్తోంది.


ఇంతటి దివ్యమంగళ స్వరూపం మనలో భక్తి భావాలను తట్టి లేపుతుంది. ఈ హారతులు, ఇక్కడ ఆలాపించే కీర్తనలు పరవశింప చేస్తాయి.






పవిత్రమైన ఈ తపోవనాలను దాటుకుంటూ, మెల్లిగా...బయటి ప్రపంచంలో మళ్ళీ ప్రవేశిస్తాం.....



ఇక్కడ మనల్ని రకరకాల సాంస్కృతిక కార్యక్రమాలు అలరిస్తాయి.


ఇక్కడే మనకు ప్రసాదాలు, కావలసిన వారికి చల్లటి నీరు, శీతలపానీయాలు లభిస్తాయి.






ఈ గుడి ప్రాంగణంలో కూర్చుని, కార్యక్రమాలను వీక్షిస్తూ, ఫలహారాలు, పానీయాలు సేవిస్తూ......ఎంతకాలమైనా హాయిగా గడిపేయొచ్చు కదూ....



బాగుందా! నా తీర్ధయాత్ర.:)
దసరా పండుగలోని ఈ సరదాలు ఎంతో తృప్తినిస్తాయి. అలరిస్తాయి. అలసిన మనసును సాంత్వన నిస్తాయి. ఈ తొమ్మిది రోజులు స్వర్గలోకాన్నే చూపిస్తాయి. మీరందరు కూడా నవరాత్రు లు బాగా సరదాగా, జరుపుకోవాలి. శుభాకాంక్షలు........

******************************************************************************************

13, ఆగస్టు 2011, శనివారం

వరమహాలక్ష్మి దీవించవమ్మా...



మీ అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు.

బాగున్నారా....మా అమ్మవారు.

పోయిన సారి ఫొటో తీసుకోలేకపోయాను. పైగా కొన్ని కష్టాలు కూడా ఎదుర్కున్నాను. అందుకే ఈ సారి జాగ్రత్తగా, అసలెక్కడికీ పోకుండా శ్రద్ధగా ఇంట్లోనే అన్నీ చేసుకుంటూ ఉండిపోయాను. మా సుజాత కొడుకు చింటు గాడు, ఈ సారి నాకు అసిస్స్టెంట్. వాడి అక్క సోనీ నా కుడిచెయ్యి. ఆ పిల్ల ఎప్పుడూ నా వెనకాల ఉండాల్సిందే. ఈ పిల్ల నా పెంపుడుకూతురన్నమాట.

ఈ సారి పూజకి నాతోపాటు, మా స్నేహాలయ అమ్మాయిలు నలుగురిని, మా లక్ష్మిని కూడా పిలిచి, అందరం కలసి చేసుకున్నాం. వాళ్ళు ఎంత సంతోషించారో. హుషారుగా అన్ని పనులు వాళ్ళే చేసిపెట్టారు కూడా. చక్కగా తోరణాలు కట్టారు. ముగ్గులేసారు. ఎంతముద్దుగా ఉన్నాయో.

అమ్మవారిని తయారుచేసుకోటానికి చాలా సహాయం చేసారు. ఈ చిన్ని పిల్లలే ఈ సారి నాకు ముత్తైదువులు. వేరే ఎవ్వరినీ నేను పేరంటానికి పిలువలేదు. వాళ్ళే ఒకరికొకరు తాంబూలాలు ఇచ్చుకున్నారు. వ్రతకథ చక్కగా విన్నారు. నాక్కూడా వాళ్ళే భోజనాలు వడ్డించారు. అందరం సరదాగా అమ్మవారి కీర్తనలు పాడుకుంటూ భోంచేసాం. ఆ పిల్లల ఆనందం చూస్తుంటేనే నాకు కడుపు నిండిపోయింది.

సాయంత్రం కూడా చక్కగా మేమందరం కలిసి గుడికి వెళ్ళాం. ఈ రోజంతా చాలా సరదాగా గడిచిపోయింది.

వరలక్ష్మీ దేవి నా ఈ పిల్లలందరినీ కలకాలం సుఖంగా ఉండేట్లు దీవించుతల్లి.....

మీరు కూడా నా పిల్లల్ని దీవిస్తారు కదూ!!!!


వరలక్ష్మీ రావే మా ఇంటికి...క్షీరాబ్ధి పుత్రి...వరలక్ష్మి రావే మా ఇంటికీ.....



***********************************************************************************************************************************************************

7, ఆగస్టు 2011, ఆదివారం

స్నేహమా!



స్నేహమా! వెన్నెల దీపమా!
నా అల్ప జీవితంలో ఎగిసిపడే
భావతరంగం నీ పరిచయం

నా గుండె లోగిలిలో.....
మమతల మకరందాన్ని పంచి,
అనురాగపు జ్యోతుల్ని వెలిగించిన
నా స్నేహ సుప్రభాతమా!....నువ్వెక్కడ?

నీ చిరునవ్వు కుసుమాల పరిమళం,
నన్నింకా వీడిపోకముందే
నా కనురెప్పల క్రింద
నీ జ్ఞాపకాల జలపాతాన్ని మిగిల్చి తరలిపోయావ్!

నిజం మిత్రమా!
ఏ అర్ధరాత్రో.......
నీ అనురాగపు అలికిడి ఆర్తిగా వినిపించినప్పుడు
నువ్వు రావన్న దిగులుతో,
నా దు:ఖం ముక్కలై ...ఏ ముత్యపుచిప్పలోనో
ఎక్కడెక్కడో రాలిపడింది......




**********************************************************************************************************************************************
 

మనస్వి © 2008. Template Design By: SkinCorner