15, ఫిబ్రవరి 2011, మంగళవారం

ఇదో బాధా శప్తసతి.....



వంటిల్లు......

నేను ఇంక వంట చేయను గాక చేయను. రోజూ పొద్దున్నే గృహప్రవేశం లాగా టైం కి వంటింటి ప్రవేశం చేయాలి. ఇష్టం ఉన్నా లేకున్నా అలాగే వంట చేయాల్సిందే! అబ్బా, ఈ వంట ఎవరు కనిపెట్టారో కాని....ఇళ్ళల్లో వంటిల్లు కట్టట్టం బాన్ చేస్తే బాగుండు. ఎన్నో ఆధునిక పరికరాలు కనుక్కుంటున్నారు. అన్ని పనులు చాలా సులభమయ్యేట్లుగా చూస్తున్నారు. వినాశన సాధనాలు ఎన్ని కనుక్కుంటున్నారో. ప్రపంచమే ఏ నిమిషం లో అయినా అంతమయ్యేంత పరిజ్ణానాన్ని పెంచేసుకుంటున్నారు. కాని, ఒక్కరంటే ఒక్కరన్నా...అలా సులభంగా కిచన్ లోంచి చక చకా ఫుల్ మీల్ ప్లేట్స్ బయటికి వచ్చేట్లు కనుక్కోలేదు. ఇలాంటి పనికొచ్చే విషయాలు మాత్రం కనుక్కోరు. ఎందుకో, నాకిప్పుడు బాగా అర్ధమయింది. అవన్నీ కనుక్కుంటున్నది ’మగబుద్ధి’ కదా!!! అందుకే ఆడవాళ్ళు ఎక్కడ సుఖపడిపోతారో అని ఇలాంటి సౌకర్యాలు మాత్రం కనుక్కోటం లేదు. ద్రౌపదికిచ్చిన అక్షయ పాత్ర నాక్కూడా, ఏమూలో, ఓ రోడ్డు మీదో దొరకచ్చు కదా...లేపోతే కళ్ళు మూసుకుని ఏదో ఒక మంత్రం చదివితేనో, మాయాబజార్ లో లాగా పంచభక్ష్య పరమాన్నాలు ప్రత్యక్ష్యమైతే ఎంత బావుండో కదా.....కనీసం ఓ కామధేనువన్నా నాకు దొరికితే బావుండు.

కనీసం అప్పుడప్పుడన్నా ఇంట్లో మగాళ్ళు వంట చేస్తే ఎంత బావుంటుందో కదా. అయినా ఏం లాభం లెండి. వాళ్ళు వంట చేస్తే వచ్చే సుఖం కన్నా ఆ తరువాత పడే కష్టం ...అబ్బో చాలా కష్టం. కూరలు కోసే కత్తులు, యుద్ధరంగంలో విచ్చుకత్తుల్లా భయపెడ్తాయి. స్టౌ, ప్లాట్ ఫాం లు శతృదేశాల్లా మారిపోతాయి. మిక్సీ భాగాలన్నీ ఎక్కడెక్కడో ఊడి పడిపోయి క్షతగాతృల్లా విలపిస్తూ కనిపిస్తాయి. పగసాధించాలని మరీ నా కోసం కన్నీరు తుడుచుకుంటూ కసిగా ఎదురుచూస్తూ ఉంటాయి. రకరకాల మూతలు వివిధసైజుల గిన్నెలకి చేరి, ముట్టుకుంటే ఏకంగా పాశ్చాత్య నృత్యాలే చేస్తాయి. ఉప్పులూ, ఖారాలూ, నూనెలు నేలమీద పంచెవన్నెల రంగోలిల్లా పరుచుకొని, అతుక్కుపోయి వంటయింటికే అలంకారమై కనువిందు చేస్తాయి. వంటింటిలో కాలు పెట్టిన మరునిమిషం..ఓహోహోహో...ఆహ హాహాహ ...ఇదియే కదా నా స్వర్గసీమ అని పరవశమై గొంతెత్తి మరీ పాడుకోవాల్సిందే. వావ్, వాటే హెల్ ఇటీజ్:( వంటిల్లు అనే ఆ రణరంగం వికటాట్టహాసంతో సింహంబోను లాగా నోరు తెరిచి మరీ ఆహ్వానిస్తుంది. ఒక్క సారంటే ఒక్క సారి, కేవలం ఒక్కసారే...కనీసం ఒకేఒక్కసారి ఈ క్లీనింగ్ పని మగ వాళ్ళకు అప్పగిస్తే ఎలా ఉంటుందో చూడాలని నా చిరకాల కోరిక. లాభంలేదు, అదినేనే,,,ఇదినేనే...అని పాడుకుంటు నడుం బిగించాల్సిందే.

అసలు నాకు చిన్నప్పుడు వంటిల్లంటే ఒక అద్భుతంగా కనిపించేది. అడగంగానే అమ్మ పోపులడబ్బాలోంచి డబ్బులు తీసిచ్చేది. అలా పోపుల డబ్బాలోంచి డబ్బులొస్తుంటే ఎంత విచిత్రంగా ఉండేదో. అదొక మాజిక్ బాక్స్ లాగా అనిపించేది. వంటిల్లు రకరకాల వస్తువులతో్ ఓ మ్యూజియం లా కనిపించేది. ఎన్నో రకాల వంటకాలు వంటింటిలోంచి తీసుకొచ్చి వడ్డిస్తుంటే, మా అమ్మ నాకో మాంత్రికురాలే అనిపించేది. ఎప్పుడేం అడిగినా ఫర్వాలేదు, ఆ వంటిటి లో ఏదో ఇంద్రజాల మహేంద్ర జాలం చేసి బయటకు తెస్తుంది అని నాకు ఘాఠి నమ్మకం. తెరలు తెరలుగా వ్యాపించే ఆ చక్కటి పరిమళాలు , మా అమ్మ వంటింటిలో పెర్ఫ్యూమ్స్ కూడా తయారు చేస్తుందనిపించేది. అమ్మకు ఎన్నో మంత్రాలొచ్చుకదా...అని ముచ్చట పడిపోయేదాన్ని. మా అమ్మ ఒక అద్భుత యక్షిణి లాగా కూడా అనిపించేది. వంట ఎంత తేలికో. గిన్నెల్లో చేతులు పెట్టి తిప్పేస్తే రకరకాల వంటకాలు రెడీ. సినిమాల్లో లా గరిటలు పట్టుకొని కూడా కనిపించఖ్ఖర్లేదు. నేను కూడా అలాగే దర్జాగా వంటలన్నీ చేసేయాలి అని ఎన్ని కలల మీద కలలు కనేదాన్నో. నేను కూడా తొందరగా చాలా పెద్దదాన్నైపోయి, మా అమ్మలాగే చాలా మాజిక్ లు చేయాలని దేవుడ్ని మితిమీరిన భక్తితో ప్రార్ధించాను. దేవుడిని కోరుకోవాలే గాని, ఆ దయామయుడు తప్పక తీరుస్తాడు కదా. కల నిజమాయెగా...కోరిక తీరెగా అని పాడుకొనే రోజులు తొందరగానే వచ్చేసాయి.

నాకు చిన్నారి కొంటె కిష్టయ్య ఎంత ఇష్టమో... అమ్మలాగే చీర కట్టుకొని, నేనే ఓ యశోదనై, బొమ్మరింటినే మధురానగరం చేసి, కృష్ణయ్యకి లాల పోసి జోలపాడి ఎన్ని ఆనందాశృవులురాల్చానో. మరి ఇక్కడేగా నేను అమ్మతనం నేర్చుకుంది.

నా బొమ్మరింటి లో అన్నిటికన్నా వంటిల్లు పెద్దగా, చాలా అందంగా కట్టుకునేదాన్ని. రకరకాల వస్తువులన్నీ అక్కడే చేరి అదో ఎక్జిబిషన్ లాగుండేది. అలాగే, చూసుకుని...చూసుకొంటూ... చూసేసుకుంటూనే ఎంత మురిసిపోయేదాన్నో. ఆటలు ఆడి పాటలు పాడి అలసి వచ్చానె...తీయతీయని తాయలమేదో తీసిపెట్టమ్మా, అని నేనే పాడుకొని...ఆ ఉత్తుత్తి వంటకాలన్నీ వడ్డించుకొని ఎంత మురిసిఫోయేదాన్నో. వంటింటితనం నేర్చుకుంది ఆ ఆటల్లోనే కదూ. ఈ తమాషా ఆటలు కాదు, ముందుంది అసలైన తమాషా అని, పాపం అప్పుడు నాకుతెలీదు. హు...ఆ సంబరాలన్నీ, పెరిగి పెద్దవుతున్నా కొద్ది కరిగి నీరైపోయాయి.

నలుడు, భీముడు చాలా గొప్ప వంటవాళ్ళని చెప్తారుగా. ఎప్పుడన్నా వాళ్ళ భార్యలకు వండిపెట్టారో లేదో. అన్ని హోటల్స్ లో వంటవాళ్ళు మగవాళ్ళేగా. వాళ్ళన్నా, కనీసం వాళ్ళ భార్యలకి వండి పెట్టారా! ఏమో... వాళ్ళు వంటలు చేస్తే మాత్రం, అది పెద్ద బిజినెస్. గొప్ప కీర్తిప్రతిష్టలు. అదే ఆడవారి వంటకైతే ఎటువంటి గుర్తింపులేదు. సో, మా వంటలకి విలువ లేదన్నమాట. హు...స్త్రీలని అణిచివేయటమంటే ఇదేమరి.

ఇప్పుడు, నా వంటింటికి నేనే మహారాణి ని. అది మహాసామ్రాజ్యమే. రోజూ సూర్యుడికే ...దినకరా...హే శుభకరా ..దేవా, దీనాపాలా...పతితపావనా...మంగళదాతా...పాప సంతాప లోకహితా...అని మేలుకొలుపు పాడుతూ, శ్రీ సూర్యనారాయణా, మేలుకో...మేలుకో....అంటూ వంటింటి ప్రవేశం చేయాల్సి వస్తోంది. స్టౌ నీలి మంటలే ఎన్ని ప్రకృతి దృశ్యాలో చూపిస్తున్నాయి. గిన్నెల చప్పుడే నీటి గలగలలు. మిక్సీ డమడమలే డమరుక ధ్వనులు. కుక్కర్ విజిల్సే వీణానాదాలు. అబ్బో, ఎంత భావుకత్వమో నాకిక్కడ. మా అమ్మమ్మ పల్లెటూరి వంటకాల్లోని మాధుర్యం ఇప్పుడిక్కడ ఎందుకో, నాకు కనిపించట్లేదు. మా అమ్మ మంత్రనగరిలోని ఇంద్రజాలం అలా ఎలాగో మాయమైపోయింది. చిన్నప్పటి నుంచి నాలో పెరిగిన ఆ అద్భుతభావం గమ్మత్తుగా ఇగిరిపోయింది. ఎందుకబ్బా, ఇప్పుడు వంటింటిలో ఇంత సఫకేటింగ్ గా ఉంటోంది నాకు. మా తాతగారు, నాన్నగారు వంటచేయకపోయినా, కనీసం ఇప్పుడు మావారన్నా వంట చేస్తే బాగుండు. రోజులు మారాయిగా...అదీ నాబాధ. కనీసం వంటిల్లు క్లీన్ చేస్తే చూడాలని ఉంది. చీపిరి పట్టి వంటిల్లూడుస్తుంటే ఎలా ఉంటుందా అని అలా తలపైకెత్తి అప్పుడప్పుడూ కాస్త ఊహిస్తూంటాను. అబ్బే..అలా ఇల్లూడుస్తుంటే శ్రీవారేమాత్రం అందంగా కనిపించట్లేదు. ఊహూ...ఆ పోజ్ లో ఉన్న అందమంతా కరిగిపోయి వాళ్ళ ఆఫీస్ లో అటెండర్ లాగా కనిపిస్తున్నారు:) యాక్..అస్సలు బాలే. పాపం, రోజంతా కష్టపడే మనిషి. వద్దులె, వదిలేద్దాం అనిపించింది. మరి నా ఆత్మ ఎలా శాంతించాలి. ఆలోచించాను. చాలా ఆలోచించాను. అలా ఆలోచించి...బాగా చించి....చివరికి, మా ఇంట్లోని వంట సామాను తీసుకెళ్ళి, వాటిమీదున్న ఆయన పేర్లన్నీ చెరిపించేసి, మళ్ళీ కొత్తగా నా పేరు రాయించి తీసుకొచ్చాను. మరి వంట చేసేది ఆడవారైనా, గిన్నెల మీద మగవారి పేరేకదా:) కొంచెం ఆత్మ శాంతించినట్లే అనిపించింది.

ఏం చేస్తాం...ఎవరి యుద్ధం వారే చేయాలిగా. ఇక్కడ శతృవులెవరూ ఉండరులెండి....సర్దుకుపోదాం రా....అన్న పాలసీ తప్ప:)

ఏదో సరదాగానే లెండి:)


.......BAWARCHI-------




********************************************************************************
 

మనస్వి © 2008. Template Design By: SkinCorner