
మల్లాది వెంకట కృష్ణమూర్తి గారి కలం నుంచి వెలువడ్డ ఆధ్యాత్మిక నవల ఈ పరంజ్యోతి.
అనేక ఆధ్యాత్మిక అంశాలతో, కమర్షియల్ నవల లోని ముఖ్యమైన ఎలిమెంట్ అయిన ఉత్కంఠని జత చేసి రాసిన ఈ ఆధ్యత్మిక నవల పరంజ్యోతి లోని చిత్రమైన కథ అన్ని తరహా పాఠకులని సమానంగా అలరిస్తుంది.
మరణించిన మనిషి తిరిగి బ్రతుకుతాడా? అన్నది ఇందులోని ముఖ్యమైన అంశం.
చితిదాకా చేరిన మనిషి మళ్ళీ లేచికూచుంటాడా? అలాంటి మనిషికి సంబంధించిందే ఈ కథ.
ఇది ఓ సంస్థానం రాజకుమారుడు విజయ రామరాజు అనే చిన్న రాజావారి కథ. ఇదే ఒక సన్యాసి పరంజ్యోతి కథ కూడా. ఇది ఒక ఆధ్యాత్మిక జీవనానికి చెందిన కథ.
నెమలికొండ సంస్థానపు అధిపతి భూపతిరాజు నలుగురి సంతానంలో చివరి వాడుగా అతి గారాబంగా పెరిగి అన్నదమ్ములలో వైషమ్యాలకి కారకుడవుతాడు విజయ రామరాజు. అన్ని దురలవాట్లకు లోనవుతాడు. అతని భార్య అహల్య కూడా అతన్ని భరించలేని పరిస్థితి ఏర్పడుతుంది. తన సోదరుడు ప్రతాపవర్మ కి తన గోడు వెళ్ళబోసుకుంటుంది. అనేక జబ్బులతో ముదిరిపోయిన రామరాజుని ఇతడు కూడా ద్వేషిస్తూనే ఉంటాడు.
రామరాజు సోదరులు, ఇతర ఉద్యోగులు కూడా అతన్ని తట్టుకోలేకపోతారు.
తీవ్రమైన జబ్బులతో మంచానపడ్డ అతన్ని ఇంగ్లీష్ వైద్యం కూడా ఏమీ చేయలేదని తేల్చేస్తారు వైద్యులు. అటువంటి సమయంలో అతని మీద విషప్రయోగం జరిగి రామరాజు మరణిస్తాడు. అది విషప్రయోగమనీ తెలియదు, ఎవరు చేసారోకూడా తెలియదు. రామరాజు దహన సంస్కారాలు కూడా జరిగిపోతాయి.
ఇది తనకి విషం ఇచ్చి చంపాలని ప్రయత్నించిన వారి మీద ధ్వేషం పెంచుకున్న ఓ వ్యక్తి కథ.
"మరణం అంటే నాకు భయంలేదు. ఎందుకంటే నేను జీవించి ఉన్నంతకాలం మరణం నా సమీపంలోకి రాలేదు. అది వచ్చినప్పుడు నేనుండను. ఇంక చావంటే నాకు భయం దేనికి?" ఓ సందర్భంలో రామరాజు తనతండ్రితో అన్న మాటలివి. కాని మరణం తరువాత కూడా తాను ఉంటాడని, ఆ మాటలు అన్నప్పుడు రామరాజుకి తెలియదు. ఇది సాధ్యమా?
ఆ తరువాత ఎన్నో సంవత్సరాలకి ఓ వ్యక్తి నర్మదా పరిక్రమ లో సన్యాసి పరంజ్యోతి ని చూసి అతను పూర్తిగా రామరాజు పోలికలతో ఉండటంతో ఆశ్చర్యపడి, రామరాజు సోదరి కుముదినీదేవికి తెలియజేస్తాడు. ఆమె ఈ విషయాన్ని తన ఇతర సోదరులకు తెలియజేస్తుంది. వారు ఇతర అధికారులతో చర్చలు జరిపి, చనిపోయి దహనంచేసిన వ్యక్తి తిరిగిరావడం ఎలా జరుగుతుంది, ఇదేదో పొరపాటు అని భావిస్తారు. కాని క్రమంగా అదే సమాచారం చాలామందే పంపటంతో అతనిని వెతికి, వివరాలు తెలుసుకోటానికి ప్రయత్నిస్తారు.
ఇక్కడినుంచి, జరిగిన రకరకాల ప్రయత్నాలే కథని అనేక మలుపులు తిప్పి మనల్ని ఏకబిగిన చదివిస్తుంది.
ఎన్నోఆధ్యాత్మిక చర్చలు ఈ నవల నిండా ఉన్నాయి. అయినప్పటికీ అది ఇంకా చదవాలి అన్న కోరికని పెంచుతుందే కాని ఎటువంటి నిరాసక్తతను కలిగించదు. కొన్ని చక్కటి ఆధ్యాత్మిక గీతాలు కూడా మనకి ఈ గ్రంధంలో కనిపిస్తాయి. తేలికైన పదాలతో కూర్చిన ఈ పాటలు పాడుకోవాలనిపిస్తుంది. ఈ పాటలొచ్చినప్పుడు మనకే తెలియకుండా మనసులో పాడుకుంటాంకూడా.
తమ అనుమానాలు తీర్చుకోటానికి న్యాయస్థానం లో జరిగే అనేక వాదోపవాదాలు కూడా మనకి ఎన్నో కొత్త విషయాలను ఎంతో విపులంగా తెలియ జేస్తాయి. అనేక ఉదాహరణలు కూడా రచయిత మనకి చూపిస్తారు.
నర్మద, గోదావరి నదీ తీరాల్లో జరిగే ఈ కథ ఆధ్యాత్మిక పాఠకులని, సాధారణ పాఠకులని సమానంగా ఆకర్షిస్తుంది.
ఈ నవలకి ప్రేరణ చాలా సంవత్సరాల క్రితం బెంగాల్ లో జరిగిన ఒక నిజ సంఘటనే. ఇది భారతదేశంలో దీర్ఘకాలం కొనసాగి సంచలనాత్మక తీర్పు నిచ్చిన కేసుగా చాలా ప్రసిద్ధి చెందింది. దీని మీద ఆధారపడి ఎన్నో భాషల్లో సినిమాలు కూడా వచ్చాయి.
మే 2010 లో ముద్రించిన ఈ గ్రంధం వెల రూ 100/-. నవోదయా బుక్ హౌజ్, సుల్తాన్ బజార్, హైద్రాబాద్ లో లభిస్తాయి.
*****************************************************************************