30, నవంబర్ 2011, బుధవారం

గోలీ మార్~*@*:(




ఒళ్ళుమండిపోతోంది. రగిలిపోతోంది. చంపేయాలనుంది. చాలా ఇరిటేటింగ్ గా ఉంది.
కాలేజ్ పై ఫ్లోర్ కిటికీ లోంచి ఇస్సిరి పారేస్తాను.
ఫాన్ కి హాంగ్ చేసేస్తా!!!
కొత్తగా కడుతున్న ఫ్లోర్ టెర్రస్ పైన సిమెంట్ లో కూరేస్తా!!!!
తొక్కలో వాడు...అడ్డగాడిదా....నక్కగాడు... విలన్ మొహం గాడు... జోకరోడు.... ఊరికే మంచం మీంచి ఠఫాఠఫా పడ్తాడేమో....మెదడు పూర్తిగా మాయమైపోయింది...కొంచమన్నా మిగల్లేదు.

తీరాలి నా కోపం తీరాలి...తీరాల్సిందే నా కోపం...
ఎట్లా...ఎలా..ఏవిధంగా అయినా సరే.... కోపంతో కొరికి కొరికి నా పళ్ళన్నీ అరిగిపోయాయి. తీసుకుపోయి ట్రాఫిక్ జాం లో తిండితిప్పలు లేకుండా వదిలేయాలి.

పెద్ద గొప్ప... బోడి గొప్ప....ఓ పిచ్చి సూట్ వేసుకొని... ఈ లోకంలో ఇంతోటి ఘనుడెవ్వరు లేరు పాపం.... క్రాక్ మాస్టర్... థర్డ్ డిగ్రీ ట్రీట్మెంట్ ఇప్పించాలి...లేకపోతే మమతా బెనర్జీ దగ్గరికి పంపించేయాలి. ఒట్ఠి భీభత్సం గాడు.
చి...చీ...ఇంక చచ్చినా ఈ ఉద్యోగం చేయను గాక చెయ్య్యను... చెయ్యను ... చేయ్యను...అంతే...నాకొద్దు. ఇంక అంతే...టాటా...బిర్లా...ఫో!!!!!

నేనింకా ఏమి రాసుకుంటే ఈ కసి, కోపం తీరాలి.... రామాయణం లో లంఖిణి గాడు.... బాగా ఒబెసిటే వచ్చేస్తుందిలే....

ఇదంతా నాకే లెండి....నా కచ్చకొద్దీ తిట్టుకుంటున్నాను. ఎక్కడంటే ఎవరూరుకుంటారు గనక.... దొరికిందిగా నా బ్లాగూ...నా యిష్టమని....

ఇట్లా తిట్టాలి బాగా....



*******************************************************************************************************************************************************************

16, నవంబర్ 2011, బుధవారం

సలహా కావాలి !!!

ఎంతో అల్లారు ముద్దుగా చూసుకున్నారు. కాలు కింద పెట్టనీయకుండా కోరిన కోరికనెల్లా తీర్చారు. ముద్దూ మురిపాలందించారు. చక్కటి విద్యా సంస్థలో ఉన్నత విద్యకై చేర్చారు. చదువుల సరస్వతి గా విలసిల్లింది. ప్రతి పోటీలోనూ ఉన్నత బహుమతులు సంపాదించుకుంటోంది. ఉపాధ్యాయుల ప్రియతమ శిష్యురాలయింది. అంతేకాదు, ఎన్నో లలిత కళలను అభ్యసిస్తోంది. చక్కటి విజ్ఞానవంతురాలు. ప్రతిఒక్కరికీ తలలో నాలుక.

ఇంతటి ఆక్టివ్ అమ్మాయి ఉన్నట్లుండి స్తబ్దుగా మారిపోయింది. అన్నీ ఒదిలేసింది. ఒంటరిగా ఉంటోంది. పద్నాలుగేళ్ళ ఆ అమ్మాయి స్కూల్ మానేసింది. పుస్తకాలు ఒదిలేసింది. చక్కగా పాడే అమ్మాయి గొంతు ఎందుకో మూగబోయింది. అసలు ఉత్సాహం అనే పదానికి అర్ధమే మరిచిపోయింది.

తల్లిదండ్రులను మాత్రం ఎంతో గౌరవిస్తోంది. చాలా కృతజ్ఞత చూపిస్తోంది. ఎంతో ఒదిగి ఒదిగి ఉంటోంది. ఒక్క మాట ఎదురు మాట్లాడటం లేదు. ఆ పసిపిల్ల అల్లరి అంతా ఎక్కడ మాయమైపోయిందో. ఏమీ చాతకాని మూలనున్న ముసలమ్మకన్నా బలహీనమై పోయింది.

అర్ధం కాని తల్లిదండ్రులు అల్లాడిపోయారు. అమ్మాయిని ఎన్నోరకాలుగా బతిమలాడి ఈ మార్పుకు కారణం తెలుసుకోటానికి ప్రయత్నం చేసారు.

తట్టుకోలేని తల్లి నువ్వు నాకు ఏ కారణం చెప్పక పోతే ఈ నాటి నుంచి నేను పూర్తిగా ఆహారం మానేస్తానని పట్టుబట్టింది. ఆ రోజంతా ఏమీ తినలేదు కూడా.

అదే రోజు ఆ అమ్మాయి తల్లి పాదాలపై తలపెట్టి విపరీతంగా ఏడవసాగింది. తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. అక్కున చేర్చుకొని, కన్నీరు తుడిచి...కన్నీళ్ళతో ఎంతో బ్రతిమిలాడారు.

ఎన్నాళ్ళనుంచో భరిస్తున్న తన బాధను తట్టుకోలేక గుండెపగిలి అడిగింది. 'అమ్మా! నేను మీ బిడ్డను కాదా!!!' అని.

వారిద్దరూ నిశ్చేష్టులయ్యారు.

అవును. ఆ అమ్మాయి అడిగిన మాట నిజమే. తను వాళ్ళ స్వంత బిడ్డ కాదు. సంతానం లేని వారు, ఒక ప్రభుత్వ అనాధ శరణాలయం నుంచి కొన్ని రోజుల వయసున్న ఆ అమ్మాయిని దత్తత చేసుకున్నారు. ఎంతో అపురూపంగా చూసుకున్నారు. కాని ఈ రోజు చుట్టుపక్కలెవరి ద్వారానో ఆ అమ్మాయికి నిజం తెలిసిపోయింది. అప్పటినుంచి తట్టుకోలేక పోతోంది.

తను అనాధనని, వీరు తనని పోషిస్తున్నారని, తనకెవరూ లేరని తల్లడిల్లిపోతోంది. ఎప్పటిలా వారితో ప్రవర్తించలేకపోతోంది. విపరీతమైన కృతజ్ఞత చూపిస్తోంది. అప్పటి గారాబాలు, అభిమానం, అధికారం స్థానం లో పూర్తి ఆత్మ న్యూనత పెరిగింది. ఆ ఇల్లు తనది కాదు. వారు తన వారు కారు అనే భావం పెరిగిపోయింది. ఈ చిన్న వయసులో ఒక్క సారిగ తన పరిస్థితిలో వచ్చిన ఆ మార్పుని తట్టుకోలేక పోతోంది. విపరీతమైన సంఘర్షణకు లోనవుతోంది. మనసువిప్పి, చనువుగా తల్లిదండ్రులతో ఉండలేకపోతోంది. విలువైన వస్తువులన్నీ పక్కన పెట్టేసింది. వారు తిన్నాకనే తను తింటోంది. ఇంట్లో పనంతా చేయటానికి ప్రయత్నిస్తోంది. ఆ సున్నిత మనస్సు నలిగిపోయింది. కోలుకోలేకపోతోంది.

తల్లిదండ్రులు ఎంత ప్రయత్నించినా సహజంగా ఉండలేకపోతోంది. ఆ అమ్మాయికి ఆ నిజం చెప్పినవారికి తృప్తి కలిగి ఉండొచ్చు, కాని దాని ద్వారా ఇక్కడ మూడు జీవితాలు అల్లకల్లోలమయిపోతున్నాయి.
స్నేహితులు, బంధువులు ఎన్నో రకాలుగా ఆ అమ్మాయి నిజం మరిచిపోయి స్వేచ్చగా ఉండటానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా అవన్నీ దండగే అవుతున్నాయి. ఉన్న వూరు, స్వంత ఇల్లు వదులుకొని ఎక్కడికి పోగలరు. ఆ అమ్మాయిని కొంత కాలం సరదాగా స్నేహితులతో వేరే ఎక్కడికన్నా పంపటానికి కూడా ప్రయత్నం చేసారు.

తను వాళ్ళకు ఎంతో ఋణపడి ఉన్నట్లుగా ప్రవర్తిస్తోంది. ఒకవేళ తన తల్లిదండ్రులెవరో తెలిస్తే వెళ్ళిపోతానంటోంది. పరాయి భావన పెరిగిపోయింది. దూరం పెరిగిపోతోంది. దగ్గిరయ్యేది ఎలా?

ఆ అమ్మాయి ఈ బాధ ఎలా తీరాలి? తిరిగి వారందరు ఎప్పటిలా సంతోషంగా కలిసి ఉండే అవకాశం ఇంక లేదా? దీనికి పరిష్కారం ఏవిటి? ఆ అమ్మాయి మీద ప్రాణాలు పెట్టుకొని ఎన్నో ఆశలతో బ్రతుకుతున్న ఆ తల్లిదండ్రులు ఏమవ్వాలి? వారికి కావాల్సింది ఆ అమ్మాయి కృతజ్ఞత కాదు. ఎప్పటిలాగే ఆ ప్రేమ, అభిమానం కావాలి. అప్పటి చనువు, ఆప్యాయత కావాలి. ఆమె భవిష్యత్ కావాలి. తమ గారాలపట్టి తమకు కావాలి. ఇప్పుడెలా!!!

ఆ పసి మనసు ఎలా తట్టుకోవాలి. ఎలా ఓదార్చాలి. ఇలాగే కొనసాగితే...ఆ అమ్మాయి ఏమయిపోతుంది.......


**************************************************************************************************

10, నవంబర్ 2011, గురువారం

విందు భోజనాలు




అక్కడ కేవలం పదేళ్ళ లోపు వయసున్న మొగపిల్లలు మాత్రమే ఉన్నారు. వాళ్ళకి పదహారు ఏళ్ళ వయసు వచ్చే వరకు అక్కడే ఉండి చదువుకుంటారు. ఏదో వృత్తివిద్య నేర్చుకుంటారు. అప్పుడప్పుడూ వారిని పలుకరిస్తూ ఉంటాను. అలాగే ఇవాళ కూడా కాసేపు సరదాగా కబుర్లు చెప్పుకుందామని వెళ్ళాను. ఇవాళ వాళ్ళకి తినటానికి ఏమీ తీసుకు పోలేదు. ఇవాళ ఏమీ తేలేదర్రా, ఇక్కడే ఏమన్నా చేసుకుందాం.తినుకుంటూ హాయిగా ఆడుకుందాం. పాటలు పాడుకుందాం, కథలు చెప్పుకుందాం... సరేనా!!! మీరే చెప్పండి, ఏమన్నా అని అడిగాను.
అక్కా, అక్కా నేను చెప్తాను అంటూ వచ్చాడు ఏడేళ్ళ శీను. (నేను నన్ను ఆంటీ అని పిలవమన్నా ఎందుకో అక్కా అనే పిలుస్తారు:) కన్నా వీడికంటే కొంచెం పెద్ద వాడు. అంతే. అయినా పేద్ద లీడర్ అనుకుంటాడు. నేను చెప్తానక్కా అన్నాడు. సరే అందరూ తోచినట్లు చెప్పండి. మన ఇష్టమొచ్చినట్లు చేసుకుందాం...సరేనా అన్నాను. అందరూ సరే సరే అంటూ ఏకధాటిగా ఏం చేయాలో చెప్పటం మొదలు పెట్టారు.
మూంపల్లీలు బాగుంటాయి దానితో చేసుకుందాం అన్నాడు కన్నా.
సరే అయితే చెప్పు, అని డబ్బాల్లో వెతికితే కనిపించాయి. చాలానే ఉన్నాయి.

అక్కా బాగా ఉడకపెట్టాలి అన్నాడు. సరే వాడి గైడెన్స్ ఒప్పుకున్నాను కాబట్టి తప్పదు. నేనే చేస్తాను అని చక్కగా కుక్కర్ తెచ్చి అవన్నీ కడిగి ఓ గిన్నెలో పోసి నీట్ గా స్టవ్ మీద పెట్టాడు. ఏయ్, ఆ నీళ్ళల్లో కొంచెం ఉప్పువేయ్ అనరిచాడు శీను. అవునుకదా, అని అందరం నవ్వేసాం. మా లీడర్ గారు కుక్కర్ తెరిచి దానిలో చేతితో కొలుచుకుంటు రెండు మూడు చెంచాల ఉప్పు వేసేసాడు. అంత చిన్నవాడు, ఎంత జాగ్రత్తగా చేసాడో ఆ పని. అక్కా, దీన్ని అయిదు విజిల్స్ తరువాత ఆఫ్ చేయాలి అని అక్కడే కూర్చున్నాడు. సరే, ఇహ అందరం ఆ కుక్కర్ దగ్గిరే విజిల్స్ కోసం ఎదురు చూస్తూ కూర్చున్నాం. ఈ లోపల నాని వచ్చి నేనే బంద్ చేస్తా అన్నాడు. అందరూ నవ్వటం మొదలు పెట్టారు. ఎందుకురా అంటే, రోజూ బంద్ లన్నీ చూసి ఇక్కడ కూడా బంద్ చేద్దామని వచ్చాడు అని అంతా ఒక్కటే నవ్వు. నాని గాడి బుంగమూతి చూసి, ఊరుకోండిరా, అలా తమాషా చేయకూడదు, మనం స్టవ్ బంద్ చేయటమనే అంటాం కదా అన్నాను. మొత్తానికి వాడే స్టవ్ బంద్ చేసాడు:)

సరే ఎలా గయితేనేం ఈ మగపిల్లలంతా కలసి చివరికి ఉడికిన ఆ పల్లీలను బయటికి తీసారు. మరి ఇప్పుడేం చేయాలి అని అడుగుతూనే ఉన్నాను...ఈ లోపలే కన్నా చిన్న జల్లెడ తెచ్చి దానిలో పల్లీలను చాలా ఒడుపుగా దొర్లించి, అక్కా నీళ్ళన్నీ పోయే దాకా ఆగుదాం అన్నాడు. చక్కగా వడ గట్టిన ఆ పల్లీలను పెద్ద కంచం లో పోసాడు. కన్నా, నానీ, శీను కింద చతికిలబడి, కత్తిపీట తీసుకొని ఒకరి తరువాత ఒకరుగా చక చకా పచ్చి మిరపకాయలు, ఉల్లిగడ్డలు, టమాటాలు చిన్న చిన్న ముక్కలుగా కోసేసారు. మిగతా పిల్లలంతా చుట్టూ చేరారు. వాళ్ళతో మీరందరూ వీటిని చక్కగా అందంగా పల్లీలమీద చల్లండి అని ఆర్డర్ వేసి, తనేమో నిమ్మకాయ కోసి దానిమీదంతా సమానంగా పిండాడు. తర్వాత సన్నగా కొత్తిమీర కోసాడు. ఇదన్నా నేను చల్లుతానురా అని వాడి పర్మిషన్ తీసుకొని ఆ పని నేను చేసాను. నా దగ్గిర కొన్ని డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి కూడా చల్లేసాను. దీనిమీద కొంచెం సేవ్ చల్లుదాం అన్నాడు అప్పటి దాకా చూస్తూ కూచున్న రహీం గాడు. ఎక్కడ చూసినా సేవ్ కనిపించలేదు. ఏం చేద్దాం అని అలోచనలో పడ్డాం. పోనీ బయట షాప్ లో తొందరగా తీసుకొచ్చేస్తా అన్నాడు వాడే మళ్ళీ. అలా అయితే ఇది చల్లగా అయిపోయి ఏమాత్రం బాగుండదు అక్ఖర్లేదు అన్నాడు కన్నా గాడు. ఎలాగోలా వాడిని ఒప్పించి రహీం షాప్ కెళ్ళి వచ్చే వరకు ఓపిక పట్టాం. పెద్ద హీరో లాగా ఫీల్ అయిపోతూ, తానే మొత్తం పల్లీల మీద సన్నగా చల్లాడు. అబ్బా, ఒక్క సారిగా దాన్ని చూస్తుంటే రకరకాల రంగులతో ఎంతో అందంగా కనిపించింది.

హాయిగా ఆ పెద్ద పళ్ళెం తో బయటికొచ్చి, కింద గడ్డిమీద పెట్టి చుట్టూ కూర్చున్నాం. ఆనందంగా "విందు భోజనం...పసందు భోజనం, ఏటి గట్టు తోటలోన మేటి భోజనం" అహహ్హ హహ్హ హహ్హా...ఒహొహ్హొహొహ్హొ హొహ్హొ అహహహహ్హహా..వింతైన భోజనంబు...ఇవన్ని మాకె చెల్ల:))) అని పాడుకుంటూ... కబుర్లు, పాటలతో మొత్తం తినేసాం.

తెలిసిపోయిందిగా, మా అబ్బాయిలు చేసిన వంటకమేమిటో:)

కార్తీక వనభోజనాలతో అంతా భుక్తాయాసంతో ఉండి ఉంటారు. సాయంత్రం పూట హాయిగా మా చిన్నారులు కలిసిమెలిసి చేసి మీకు ప్రేమ మీర వడ్డించిన ’పీనట్ స్నాక్’ ఆనందంగా తినేసి, వేడి వేడిగా చాయ్ చేసుకొని తాగేసేయండేం:)))

జ్యోతి గారు మా వంట పనికి రాదంటే మాత్రం నేనొప్పుకోనంతే... చెమటోడ్చి, కష్టపడి చేసాం.

ఆహా!!! ఏమి రుచి...తినరా మైమరచి...రోజూ తిన్నా మరి మోజే తీరనిది...అని హాయిగా పాడుకోవాలి. సరేనా:)

(కెమెరా తీసుకు పోలేదుగా...అందుకని సొంత ఫొటో లేదన్నమాట)

మిత్రులందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు


**************************************************************************
 

మనస్వి © 2008. Template Design By: SkinCorner