9, ఏప్రిల్ 2012, సోమవారం

కృష్ణవేణి




















కృష్ణవేణి - రంగనాయకమ్మ గారు



నేను ఈ మధ్య అనుకోకుండ చదివిన రంగనాయకమ్మ గారి నవల కృష్ణవేణి గురించి రాయాలనిపించింది. ఆవిడ చాలా చిన్నప్పుడు అంటె దాదాపు 17, 18 సంవత్సరాల వయసులో రాసిన నవలట ఇది. అరవైఒకటి లో ఆంధ్రప్రభ లో సీరియల్ గా వచ్చింది. అందరూ ఎంతో ఆసక్తిగా చదివేవారట. ఈ సీరియల్ కటింగ్స్ తీసి బైండింగ్ చేసి దాచిపెట్టుకున్నారట. అనేక ముద్రణలు కూడా వచ్చాయి. కాని కొంతకాలానికి ఈ నవలలో అక్కడక్కడా తాను రాసిన విధానం నచ్చలేదని, అపరిపక్వతతో రాసిందని అసంతృప్తితో మళ్ళీ ముద్రణలు ఆపివేసారు. కాని ఆ నవల చదవాలి అని ఇప్పటికీ చాలామంది పాఠకులు దీని పునర్ముద్రణ కోసం కోరుకోగా, చివరికి తన కొత్త ముందు మాటతో, దీనిని ముద్రించారు. తనకు తెలిసిన కొన్ని నిజ జీవిత సంఘటనల మీద ఈ నవల రాసానని తెలిపారు. అందుకే ఈ కథ అంటే మొదటి నుంచి ఇష్టమూ, భయమూ ఉందని తెలిపారు. అందుకే ఇప్పటి కొత్త ముద్రణలో అక్కడక్కడా సర్దుళ్ళూ దిద్దుళ్ళూ ఉన్నాయన్నారు. తన అసంతృప్తికి కారణమైన భాగాల్లో కింద ఫుట్ నోట్స్ కూడా ఇచ్చారు. అప్పుడు ఆంధ్రప్రభ సీరియల్ లో ఒకటే బొమ్మ వచ్చేదట. ఆ బొమ్మనే ఇప్పటి ఈ పుస్తకానికి ముఖచిత్రంగా ఉంచారు. ఈ కొత్త ముద్రణలో అనేక విషయాలలో తన మారిన అభిప్రాయాలను ఎంతో వివరంగా రాసారు. ఈ నవల లో ఒక ప్రత్యేకత ఉంది. కథ అంతా ఉత్తరాల రూపంలోనే కొనసాగుతుంది.

కృష్ణవేణి కి వచ్చిన ఉత్తరం కాయితాలు నేల మీద ఎగరూతూ ఉంటాయి. అప్పుడే పెళ్ళైన కృష్ణవేణి, భర్త శ్యాంసుందర్ ఆ ఉత్తరం చూడడంతో కథ ప్రారంభమవుతుంది. నూతన దంపతుల మధ్య ఈ ఉత్తరం చిచ్చురేపుతుంది. అది తన భార్య ప్రేమలేఖ అని తెలిసిన కృష్ణవేణి భర్త కోపంతో వెళ్ళిపోయి విడాకులు కోరుకుంటాడు. దానితో మొదటినుంచి మాధవరావు తో తన పరిచయాన్ని, ఆ పరిచయంలోని అనేక మలుపులను తన భర్తకు వివరంగా ఉత్తరం రాస్తుంది కృష్ణవేణి. కథంతా ఈ ఉత్తరమే మనకు చెప్తుంది.

కృష్ణవేణి పాత్ర అనేక వైరుధ్యాలతో ఉంది. యువతీ యువకుల మధ్య ప్రేమా, దానిలో తలెత్తే సమస్యలూ...అదే ఇందులో కథావస్తువు. అతి సామాన్యంగా, సాంప్రదాయబధ్ధంగా సాగే కృష్ణవేణీ, మాధవ్ ల ప్రేమ కథ ఇది. భార్యాభర్తలు సామరస్యంగా ఉండాలని, ప్రేమ సంబంధాలు సాహసవంతంగా ఉండాలనీ చెప్పే కథ.

మాధవ్ సమస్య తెలుసుకున్న కృష్ణవేణి, చివరికి తన స్నేహితుల సలహాని కూడా సరిగ్గా అర్ధంచేసుకో లేక వేరే వివాహానికి సిద్ధం అవుతుంది. కృష్ణవేణి స్నేహితురాలు రేణూ పాత్ర చిత్రణ బాగుంది. కృష్ణవేణి నిష్కారణంగా మాట తప్పింది. వేరే పెళ్ళి చేసుకుంది. ఈ పాత్ర నిజాయితీ కోల్పోయింది. ఆ యువతీ యువకుల ప్రేమ సంబంధం తెగిపోయినా, అది చివరికి వారి సంతోషం తోటే కథ ముగుస్తుంది. ఇలాంటి ముగింపు చాలా తప్పు అని రచయిత్రి భావించారు. వాళ్ళు విడిపోవడమూ, వేరే వ్యక్తులతో జీవితాలు గడపడమూ జరిగితే జరగవచ్చు. కానీ అది, వారికి విషాదమే...అనే అర్ధం ముగింపులో కనపడాలి. కాని ఆ విషయం మీద తాను శ్రధ్ధ చూపలేదని తన రచన మీద తన అసంతృప్తిని వ్యక్తపరిచారు. రచయితలు తమ రచనలను ఎప్పటికప్పుడు పరిశీలించుకుంటూ ఉండాలని రచయిత్రి అభిప్రాయం.

ప్రేమంటే సరి అయిన అవగాహన లేకుండా తానీ నవల రాసానని బాధపడ్తారు రంగనాయకమ్మగారు. ఎందుకంటే, నిజమైన ప్రేమ కలిగిన వ్యక్తులు ఆ సంబంధం తెగిపోయినా, వాళ్ళిద్దరు వేరే వ్యక్తులతో సంతోషం గా ఉన్నారని చెప్పటం తప్పు. ఇది ప్రేమకే అవమానం. దేవదాసు దు:ఖాంతం. కాని ప్రేమ కోసం కట్టుబడిన కారణం గానే దు:ఖాంతం అయింది. దేవదాసు మనసులో ప్రేమ పోతే అది అతనికి సుఖాంతం అయ్యేది. కానీ, అది ప్రేమకి అవమానం. మల్లీశ్వరి కథ చూస్తే అది, ప్రేమ కోసం సాహసాల్లోంచి, దు:ఖాంతం నుంచి నడచిన సుఖాంతం. ప్రేమ విలువని ఎగరగొట్టి, ప్రేమికులు కూడా సాంప్రదాయమైన పెళ్ళిళ్ళ లోనే చాలా సంతోషంగా ఉన్నారని చెప్తే, అది చాలా అవాస్తవం. ప్రేమ కథ, ప్రేమ విలువలతో ముగియాలి. అది సుఖాంతమైన, దు:ఖాంతమైనా అది ప్రేమ కోసమే జరగాలి. ముగింపు ప్రేమకు అవమానం జరగకుండా ఉండాలి.

కృష్ణవేణీ, మాధవ్ కి పరిచయం కావడం, అది ప్రేమగా మారడం, ఇద్దరూ ఒక సమస్యలో చిక్కుకోవడం, దాని వల్ల ఆందోళన పడుతూ కాలం గడపడం, చివరికి సామాజిక కట్టుబాట్లకే తలలు వొంచడం జరుగుతుంది. ఇదీ కథ క్లుప్తంగా. ఇందులో అసహజమేమీ లేదు. అపరాధమూ లేదు. కథ చివరికి మాధవ్ కృష్ణవేణికి అన్న అయిపోతాడు. ఎప్పటి లాగే అతన్ని ఒక స్నేహితుడిగా ఎంచుకునే స్వతంత్రమైన వ్యక్తిత్వం లేదు కృష్ణవేణికి. అతని సంబంధాన్ని సంఘ ధర్మాలకు అనుకూలంగా, తప్పు కానిదిగా చేసుకుంటుంది. ఈ విషయంలో కూడా రచయిత్రి తీవ్ర అసంతృప్తిని తెలియచేసారు.

మొత్తంగా చూసినప్పుడు ఈ రచన, సామాన్యమైన యువతీ యువకుల మధ్య పరిచయాలూ, ప్రేమలూ, ఏ రకం స్థాయిలో ఉంటాయో, అందులోనే వారు ఎన్ని ఇబ్బందుల్లో ఇరుక్కుని వ్యాకుల పడతారో, వారి ప్రేమ ఎంత సామాన్యమైన పునాది మీద ఆధారపడి సాగుతుందో...మొదలైన విషయాలను ప్రతిబింబిస్తుంది.

యువతీ యువకుల మధ్య ప్రేమ అనే దాని పునాది ఉన్నతమైన స్థాయి పై ప్రారంభం కావాలి. కేవలం శారీరక అందచందాల మీదా, అలంకారాల మీదా కాదు. వారి అభిప్రాయాలు అభ్యుదయకరంగా ఉండాలి. స్త్రీ, పురుషులు సమానమైన వ్యక్తిత్వాలు కలిగి ఉండాలి. అటువంటి అభిప్రాయాలు గల వ్యక్తుల్నే ఎంచుకోవాలి---అనే హెచ్చరిక చేసారు ఈ రచయిత్రి.

ఈ పుస్తకం ఇప్పటికే చాలా మంది చదివే ఉంటారు. కాని, నేను ఇప్పుడే కదా చదివింది!



స్వీట్ హోం పుబ్లికేషన్స్: 8 వ ముద్రణ, 2010 ఆగష్ట్, ధర: 80/-


***************************************************************************************************************************






18 కామెంట్‌లు:

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

అరే! నాకు ఈ నవల గురించి అసలు తెలియదు .భలే విశేషంగా తెచ్చారు. చక్కని సమీక్ష ఇచ్చారు. తప్పకుండా చదివి తీరతాను. బాగుంది జయ గారు. ధన్యవాదములు.

జలతారు వెన్నెల చెప్పారు...

జయగారు! నేను ఈ పుస్తకం ఇంతకు ముందే చదివాను. ఎందుకో నాకు ఈ పుస్తకం నేను చదివినప్పుడే నాకు నచ్చలేదు.పైన ఉన్న ఫొటో రంగనాయకమ్మ గారిదాండీ?

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

నేను కూడా ఈ పుస్తకం గురించి ఇప్పుడే తెలుసుకున్నానండీ..
మంచి పుస్తకాన్ని పరిచయం చేశారు..

"స్త్రీ, పురుషులు సమానమైన వ్యక్తిత్వాలు కలిగి ఉండాలి. అటువంటి అభిప్రాయాలు గల వ్యక్తుల్నే ఎంచుకోవాలి"

జయ గారూ..ఇది ఆచరణలో సాధ్యమేనంటారా??

Mauli చెప్పారు...

@ కేవలం శారీరక అందచందాల మీదా, అలంకారాల మీదా కాదు.
@ స్త్రీ, పురుషులు సమానమైన వ్యక్తిత్వాలు కలిగి ఉండాలి. అటువంటి అభిప్రాయాలు గల వ్యక్తుల్నే ఎంచుకోవాలి---అనే హెచ్చరిక చేసారు ఈ రచయిత్రి.

గృహ హింసా చట్టం పై ఒకసారి తాడేపల్లి గారితోనూ ,శ్రీకాంత్ (ఆకాశరామన్న) గారితోను జరిగిన చర్చలో ఇదే అభిప్రాయాన్ని స్పష్టం చేసాను . ఆ చట్టం గురించి ఆవేశపడటం లో పదో వంతు సమయం పెట్టి ఈ దిశ లో కృషి చేస్తే మంచిది కదా. అబ్బాయిలు వ్యక్తిత్వాలు చూసి మాత్రమె పెళ్లి చేసుకోవాలి అని వుద్యమించాలన్న మాటా :) ఇప్పటికి అబ్బాయిలకన్నా పెళ్లి నిర్ణయం లో కావాల్సిన స్వతంత్రం ఉంది. వాళ్ళు అన్నా సరైన నిర్ణయం తీసికోవడం మొదలు పెడితే అసలీ చట్టం ఉంటె ఎంత , లేకపోతె ఎంత :)

ఇప్పటి వరకు రంగనాయకమ్మ గారి రచనలు చూడలేదు, మీ వ్యాసం మాత్రం బాగుందండీ .

@శ్రీకాంత్ గారు,

మీరు రంగనాయకమ్మ గారు వ్రాసిన పుస్తకాలు కూడా ఆ హింసా చట్టాల వ్యాసాలతో కలిపి చదవండి. సమాధానాలు బోల్డు ఈజీ గా దొరికేస్తాయేమో .

Padmarpita చెప్పారు...

చక్కని సమీక్ష....Thanks for sharing.

జయ చెప్పారు...

@ వనజ గారు మీరు ఒక రచయిత్రి. తప్పకుండా చదవండి. ఎన్నో తేడాలు తెలుస్తాయి.

@ జలతారు వెన్నెల గారు. ఆ ఫొటొ రంగనాయకమ్మ గారిదే నండి. ఆ నవల తనకి ఇప్పుడు నచ్చటం లేదని, అందుకే కొత్త ముద్రణలకు ఇష్టపడలేదని తెలిపారు. ఎంతో మంది కోరిక మీదనే అది ఎలా ఉంటే తనకిష్టమో తెలియచేస్తూ రీ ప్రింట్ కిచ్చారు. వివిధ రకాల ముగింపులు కూడా చెప్పారు. వీలైతే మళ్ళీ ఒక సారి చదవండి.నేను అందుకనే కథ కన్నా వారి అభిప్రాయాలను తెలియచేయటానికి ప్రయత్నించాను. బహుశ: ఇప్పుడు నచ్చుతుందేమో:)

@ రాజి, వీలైతే ఈ పుస్తకం ఒకసారి చదవచ్చు. ప్రేమ అన్నది మంచి చెడు చూసుకుని కలగదు, కాని ఈ పద్ధతి లో ఉంటె ఆ ప్రేమ కలకాలం నిలిచే అవకాశముంటుందని రంగనాయకమ్మ గారు ఆ అభిప్రాయాన్ని వెలిబుచ్చారు.

@ మౌళి గారు ఆ చర్చ లింక్ ఇవ్వొచ్చుగా మేమూ చదువుతాము.

మీ అభిప్రాయాలని చాలా మంది అంగీకరించరండి అని రంగనాయకమ్మ గారిని అడిగితే...ఏముందమ్మా! ఇవన్నీ సంఘంలో జరుగుతున్నవే గా, కాదనటానికి ఏముంది అందులో అంటారు. వారిదే 'స్త్రీ','జానకి విముక్తి' చదువుతున్నాను. ఈ మధ్య తెలుగు నవలలు చదవాలి అనిపిస్తోంది. అందుకే చాలానే తెచ్చాను. ముఖ్యంగా రంగనాయకమ్మగారివి. అవన్నీ మెల్లిగా చదువుతాను.

@ పద్మార్పిత గారు, మీరు ఈ నవల చదివితే చక్కటి బొమ్మతో ఒక కవిత రాసేస్తారు. నిజ్జంగా నిజం.

స్పందించిన ప్రతిఒక్కరికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు.

అజ్ఞాత చెప్పారు...

సమానవ్యక్తిత్వం X ఆడా-మగా అన్యోన్యంగా కలిసుండడం.

ఇవి అసాధ్యమైన విషయాలు. పరస్పర వ్యతిరేక విషయాలు. ఇవి గొంతెమ్మకోరికలు. తనతో సమనమైన వ్యక్తిత్వం ఉన్న ఆడదానితో సహజీవనం మగవాడికి హోమోసెక్సులా అనిపిస్తుంది. తనతో సమానుడైన మగవాడు ఆడదానికి అస్సలు ఎగ్సైటింగ్ కాడు. కనుక వివాహబంధం అన్నాక (అక్కడి దాకా స్త్రీపురుష సంబంధం పురోగమించాలంటే)అందులో తప్పనిసరిగా అసమానత్వం ఉండాల్సిందే. కూరలో కూడా ఉప్పూ, కారమూ సమపాళ్ళల్లో వెయ్యలేం. కారం ఎక్కువగానూ, ఉప్పు తక్కువగానూ వేస్తాం. పరస్పరగౌరవం ఒక భావన. ఒక స్థితి కాదు. భావనని భావనగానే ఉంచాలి. భావనల్ని ప్రోత్సహించాలి. పనిగట్టుకుని బలవంతంగా స్థితిగా మార్చకూడదు.

జయ చెప్పారు...

అజ్ఞాత గారు? మీ అభిప్రాయాలే అందరివీ అయి ఉండక పోవచ్చు. రంగనాయకమ్మ గారి లాగా ఆలోచించే వారు కూడా ఉండొచ్చు కదా! లోకం లోని అనేక మార్పుల్లో ఇదీ ఒకటి. Thanks for sharing.

జ్యోతిర్మయి చెప్పారు...

జయగారూ ఈ నవల ఇంకా చదవలేదండీ. మీ సమీక్ష చూశాక వెంటనే చదవాలని ఉంది. రంగానాయకమ్మ గారు వ్రాసిన 'స్వీట్ హోం' నాకు చాలా ఇష్టమైన పుస్తకం.

Praveen Mandangi చెప్పారు...

సొంత పేరు చెప్పుకునే ధైర్యం లేని అజ్ఞాతా, నువ్వు చెప్పేది ఏమిటంటే "వ్యక్తిత్వం అనేది మగవానికే అవసరం కానీ ఆడదానికి అవసరం లేదు" అనే కదా. కుల గజ్జి ఉన్నవాడు కూడా ఇలాగే అనుకుంటాడు "సామాజిక హోదా అనేది మా కులంవాళ్ళకే అవసరం కానీ వేరే కులాలవాళ్ళకి అవసరం లేదు" అని. అవసరాలు అనేవి అందరికీ సమానమే. ఒకరికి ఎక్కువ అవసరం, ఒకరికి తక్కువ అవసరం అని determination ఏమీ లేదు.

అజ్ఞాత చెప్పారు...

@ ప్రవీణ్... ఇందులో ధైర్యం గోలేంటో నాకర్థం కాలే. People prefer to remain anonymous for various reasons other than courage. I have my own. As for this post, I understand that it is not about feminism, but harmonious married life.

నేను వ్రాసింది ఒకటైతే నువ్వు చెబుతున్నదొకటి. Inequality (or అసమానత్వం) is the central flavor of man-woman relation. అదే అందులో ఉన్న ప్రధాన ఆకర్షణ. అదీ నా పాయింటు. నువ్వు మాట్లాడేదేమో ఆత్మగౌరవాల గొడవ. ఆడైనా, మగైనా ప్రేమున్నచోట తమని తాము తగ్గించుకోవడమే ఉంటుంది తప్ప ఆత్మగౌరవం ప్రసక్తే రాదు. ప్రేమకి ఇవ్వడమే తప్ప తీసుకోవడం తెలీదు. దోచుకోవడం అసలే తెలీదు. ప్రేమ తగ్గిపోయాక మొదలవుతాయి ఒకరినొకరు judge చేయడం, self-esteem, rights etc. non-romantic stuff.

ఈ తరంవాళ్ళకి ఇవన్నీ చెబితే అర్థం కాక పిచ్చెక్కుతుంది. ఎందుకంటే ఇప్పుడసలు romantic love ఎక్కడా లేదు. కళ్ళెదుట లేనిదాన్నుంచి ఆదర్శాలూ, ఎగ్సాంపుల్సూ తీసుకోవడం సాధ్యం కాదు. ఉన్నదల్లా స్వార్థం, స్వార్థం, స్వార్థం... That's all.

Praveen Mandangi చెప్పారు...

అసమానత్వం అనేది ఎన్నడూ ఆరోగ్యకరం కాదు. అసమానత్వాన్ని కోరుకునేది ప్రేమ అవ్వదు. అది ఆకర్షణ లేదా మానసిక బలహీనత మాత్రం అవుతుంది.

స్వార్థం అనేది ఎప్పటి నుంచో ఉంది. అదేమీ కొత్తగా వచ్చినది కాదు. మనిషికి స్వార్థం కాకుండా సామాజిక బాధ్యత ఉండాలనేదే నేను చెప్పేది.

అజ్ఞాత చెప్పారు...

ప్రేమికులు అసమానత్వాన్ని కోరుకోవాలని నేను చెప్పలేదు. అది లేకుండా వాళ్ళు ప్రేమికులు అవ్వరు అంటున్నాను. నేను ఒక కొత్త రూల్ పెట్టడం లేదు. ఆల్రెడీ నేచర్ లో ఉన్న రూల్ గురించి చెబుతున్నాను.

ఇద్దరు మనుషులు తమలో తాము చేసుకునే అడ్జస్టుమెంట్లకి, సామాజిక బాధ్యతకీ సంబంధమేంటి ?

జయ చెప్పారు...

@ జ్యోతిర్మయి గారు థాంక్స్. అవునండి, స్వీట్ హోం కూడా తెచ్చాను. చదువుతాను.

@ అజ్ఞాత గారు, ప్రవీణ్ గారు...ఇంత తీవ్రం గా వాదించుకుంటే ప్రేమంటే భయమేస్తుందండి. వద్దండి. ప్లీజ్.

మరువం ఉష చెప్పారు...

ఉదయాన్నే తెలిసిన రచయిత్రి ఊసు చెప్పారు; జయా, థాంక్స్! రాకపోకలున్న స్నేహితం వారితో మాకు. నేను రెండు వర్షన్స్ చదివాను. ఆ ముందుదే బావుంటుంది నా వరకు. మా ఫామిలీ ఫ్రెండ్ అంకుల్ ఒకరు ఈ కథ సీరియల్ గా వచ్చినప్పటి ఫాలోయింగ్ అవీ చెప్పినపుడు చాలా సరదాగా విన్నాను. నాన్న గారు కూడా చాలా గుర్తులు చెప్తారప్పటివి. "కృష్ణవేణి" తో మా అనుబంధం చాలా లోతైనది, మాటల్లో చెప్పలేనిది.

జయ చెప్పారు...

ఉషా,చాలా మంచి అనుబంధం గురించి చెప్పారు. థాంక్స్. మా అమ్మ కూడా అలాగే సీరియల్స్ అన్నీ దాచిపెట్టుకొనేది. నాకు చదవాలనే 'జ్ఞానం' వచ్చి వాటి గురించి అడిగితే అన్ని నాన్నగారి ట్రాన్స్ ఫర్ లల్లో ఎక్కడెక్కడొ పోయినై అని చెప్పింది.

satyam చెప్పారు...

రంగనాయకమ్మ గారు ప్రస్తుతం 'నవ్య వీక్లీ 'లో ఒక వ్యాస మాలిక రాస్తున్నారు .అందరూ తప్పక చదవాలి.
రంగనాయకమ్మ గారి 'కళ్ళు తెరిచిన సీత ''పెళ్లి చేసుకోబోయే అమ్మాయిలు తప్పక చదవాలి. ఆ పుస్తకం చదివితే కొన్ని జాగ్రత్తలు తెలుస్తాయి,అమ్మాయిలకు . అబ్బాయిలు బుద్ధి ఉంటె ప్రవర్తన మార్చుకుంటారు.
రంగనాయకమ్మ గారు రాసిన ప్రతి పుస్తకం అమూల్యమినదే .

జయ చెప్పారు...

Satyam garu, Thanq, for the comment.

 

మనస్వి © 2008. Template Design By: SkinCorner