17, జనవరి 2010, ఆదివారం

ఇదండీ! మా సంక్రాంతి...



ప్రతి సంవత్సరం మా కాలేజ్ లో అందరం భోగికి, కనుమ పండగకి కలుసుకుంటాం. అది మా కొక అలవాటై పోయింది. అందరం ఇక్కడ సంతోషంగా గడుపుకొని, సాయంత్రం మా మా ఇళ్ళల్లో పండుగలు, పేరంటాలు జరుపుకుంటాం. ఆ రోజు పొద్దున్నే ఎవర్నీ కలవక పోతే ఆ సంక్రాంతి పండుగ లోనే మాకు వెలితి కనిపిస్తుంది.

ఇంతకీ మేమంతా కలిసి ఏం చేస్తామంటే...

పొద్దున్నే మా అయాలు కాలేజ్ ముందు చక్కగా ఊడ్చి కళ్ళాపి చల్లుతారు. గొబ్బెమ్మలు పెడ్తారు. పాటలు పాడుతారు. ఆ రోజు మా అమ్మాయిలకి ముగ్గుల పోటీలు ఉంటాయి. చక్కగా మా కాలేజ్ అంతా ముగ్గులేస్తారు. మా ఆయాలు కూడా చక్కటి ముగ్గులేస్తారు. వాళ్ళని మా పిల్లలు ఆంటీ అనిపిలుస్తూ ఉంటారు. మా పిల్లలు ఈ ఆంటీల దగ్గిర కాపీ కొట్టేస్తూఉంటారు. అయినా చాలా బాగా వేస్తారు. మొత్తం చక్కటి అలంకారాలు కూడా చేస్తారు. ఎంత చక్కటి పండగ కళ ఒస్తుందో!





అంతేనా! ఆ రోజు మా అమ్మాయిలు పతంగులు కూడా ఎగిరేస్తారు. చిలుకా పద పద...నెమలి పద పద...మైనా పద పద..గాలి పటమా పద పద పద....అని సరదాగా పాడుకుంటాం. ఈ సారైతే పద పదవె వయ్యారి గాలి పటమా... అని కూడా పాడుకున్నాం.





చక్కటి ఎక్జిబిషన్ కూడా ఏర్పాటు చేస్తాం. బొమ్మల కొలువు పెట్టి,బొట్టూ, పసుపూ, గంధం అన్నిటి తోటి మేమే తాంబూలాలు ఇచ్చుకుంటాం. మా బొమ్మల కొలువు బాగుందా?





ఈ సారి రాష్ట్రం లో శాంతి నెలకొనాలని మా పిల్ల లు యజ్ఞం కూడా చేసారు. వాళ్ళే ఎంతో శాస్త్రోక్తంగా చేసారు. చూసారుగా, ఎంత చక్కగా చేసారో...




ప్రతీ సంక్రాంతి కి మేము వనమహోత్సవం కూడా చేస్తాం. అంటే ఏదైనా ఒక మొక్క నాటుతామన్న మాట. ఇది మాత్రం మా "పెద్ద సర్" తోటే చేయిస్తాం. ఆయన కూడా కాదనకుండా ఎంతో ఉత్సాహంగా ఒస్తారు.

ఇంకో పని కూడా చేస్తామండోయ్. ఏం లేదు. మా కాలేజ్ లో రకరకాల కమిటీలు వేసుకుంటాం. ఎవరి కమిటీ పిల్లలైన ఆ సంవత్స్యరం బయట జరిగే పోటీల్లో ఏవైనా బహుమతులు సంపాదించుకుంటే, మేము ఇంచక్కా వాళ్ళతో ఫొటోలు తీయించుకుంటాం.

ఇవండీ... మా సంక్రాంతి సంబరాలలొ కొన్ని ముచ్చట్లు. మీకు నచ్చాయా మరి.



చిలుకా పద పద ... నెమలీ పద పద ... మైనా పద పద ... మనసా! పదా ... గాలిపటమా పద పద పద...




*******************************************************************************

18 కామెంట్‌లు:

శిశిర చెప్పారు...

బాగుందండీ మీ కాలేజ్ సంక్రాంతి. మీది ఉమెన్స్ కాలేజా?పిల్లలతో కలసి ఇలా గడపడం చాలా ఆనందాన్నిస్తుంది. వాళ్ళకి కూడా బెరుకు తగ్గి ఏ విషయమైనా మనతో మాట్లాడగలుగుతారు. ముఖ్యంగా వాళ్ళు యజ్ఞం చేయడం నాకు నచ్చింది. ఇంతకీ మీరెక్కడ ఈ ఫోటోల్లో? కాస్త చెప్పరూ?

శేఖర్ పెద్దగోపు చెప్పారు...

మీ సంక్రాంతి సంబరాలు నచ్చాయండీ...ఇవన్నీ ఒక్కో సంక్రాతికి ఒక్కో కార్యక్రమమా లేక ఇటీవల సంక్రాతి సంబరాలా? ఎనీవే కాస్త లేటుగా సంక్రాంతి శుభాకాంక్షలండి.

మరువం ఉష చెప్పారు...

నైస్.

సిరిసిరిమువ్వ చెప్పారు...

చాలా బాగున్నాయి మీ సంక్రాంతి సంబరాలు. మీ పిల్లలకి మీకూ అభినందనలు.

భావన చెప్పారు...

బలే చేసుకున్నారే జయ మీ సంక్రాంతి. చాలా బాగుంది మనసుండాలే కాని ఎక్కడైనా మన వూరు చేసుకుని పండుగ చేసుకోవొచ్చు అని నిరూపించారు.

SRRao చెప్పారు...

జయ గారూ !
మన సంస్కృతీ సాంప్రదాయాలను తెలియకుండా చేస్తున్న ఈనాటి కాలేజీల మధ్యలో మీది తులసి మొక్కే ! చదువంటే పుస్తకాలలోదే కాదు అని పిల్లలకు తెలిసేటట్లుజేస్తున్న మీరు అభినందనీయులు.

మాలా కుమార్ చెప్పారు...

మీ కాలేజ్ సంక్రాంతి సంబరాలు బాగున్నాయి .

మురళి చెప్పారు...

బాగున్నాయండీ మీ సంక్రాంతి వేడుకలు.. మీకూ, మీ పిల్లలకీ (అదేనండీ స్టూడెంట్స్) కొంచం ఆలస్యంగా పండుగ శుభాకాంక్షలు..

జయ చెప్పారు...

అవునండి శిశిర గారు, మేమంతా ఆడమళయాళమే. సీక్రెట్ ఏమీలేదు. నేనూ ఉన్నానుగా రెండు ఫొటోస్ లో. అయినా, ఇదేమి ఫ్రెండ్షిప్ అమ్మా! ఆమాత్రం ఫ్రెండ్ ని కనుక్కోలేకపోతే ఎలా? ఒక్కరోజు మాత్రమే టైం ఇస్తున్నాను. చెప్పేయాలి. ఆ తరువాత ఈ ఫొటో లో నుంచి వెళ్ళిపోతున్నాను.

జయ చెప్పారు...

శేఖర్ గారు మీకు కూడా హృదయపూర్వక సంక్రాంతి శుభాకాంక్షలు. ఇవన్నీ కూడా ఈ రెండు రోజుల సంబరాలేనండి.



ఉషా గారు ధన్యవాదాలు. మీరు చాలా క్లుప్తంగా ఉన్నారు. మా సంబరాల మీద చిన్న కవిత చెప్పక పోతారా అని ఆశపడ్డాను.

జయ చెప్పారు...

సిరిసిరిమువ్వ గారు థాంక్యూ. మా పిల్లలకి మీ దీవెనలు ఎప్పుడూ ఉండాలండి.



హాయ్ భావనా, థాంక్యూ. ఎప్పుడు ఎలా టైం దొరుకుతుందా, ఏమేమి చేద్దామా అనే రకాలం మేము. ఇప్పుడు జనవరి 26 కి చాలానే ప్లాన్ చేస్తున్నాము. ఆ కబుర్లు అప్పుడు చెప్తానేం.

జయ చెప్పారు...

రావ్ గారు మేము చాలా చాందస్తులం. ఎప్పుడు ఇలాంటి పనులే చేస్తూ ఉంటాం. ధన్యవాదాలండి.


అక్కా థాంక్యూ.


మురళీ గారు ధన్యవాదాలు. ఏవిటా మీరూ కనిపించకుండా అయిపోయారనుకుంటున్నాను. మీరు బాగా చెప్పారు. వాళ్ళు నాకు స్టూడెంట్స్ కాదు ...పిల్లలే...

శిశిర చెప్పారు...

ఈ అల్పప్రాణికి అంత పెద్ద పరీక్షా? హతవిధీ... !!!

sreenika చెప్పారు...

మీ వేడుకలు చూస్తుంటే మా అల్లరి గుర్తొస్తూంది.
సరిత, రజని, నేను ముగ్గురం సంక్రాంతి వచ్చిందంటే వాణి ఇంటికి వెళ్ళేవళ్ళం. ఎందుకంటే వాణి వాళ్ళింటికి పెద్ద వాకిలి ఉండేది. నలుగురం కలసి పోటీపడి ముగ్గులు పెట్టేవాళ్ళం. కాలేజీలో ఉన్న ఐదేళ్ళు ఇదే...
మీ కాలేజీ ముచ్చట్లు బాగున్నాయి.

జయ చెప్పారు...

శ్రీనిక గారు థాంక్యూ. కాలేజ్ రోజుల తీపిగుర్తులు కలకాలం మనల్ని వెన్నంటే ఉండాయండి. అప్పటి స్నేహితులను కలుసుకుంటే ఎంత ఆనందమో కదూ!

జయ చెప్పారు...

హాయ్ శిశిర, నేనెక్కడున్నానో కనుక్కోలేదుగా...ఇదిగో చెప్పేస్తున్నాను. మా సర్ మొక్క నాటుతున్నారే, అందులో మొక్క పట్టుకొని ఎరుపు, నలుపు చీరలో ఉన్నది నేనే. ఇంక గ్రూప్ ఫొటోలో నేమొ, నెమలిపింఛం రంగు చీరలో ఇటుచివర కూర్చున్నది నేనన్నమాట. ఓకేనా!!!

విశ్వ ప్రేమికుడు చెప్పారు...

భలే సరదాగా జరుపుకున్నారన్నమాట మీ సంక్రాంతి. నేను మొన్నెప్పుడో అనుకున్నాను ఆ మొక్క పట్టుకున్నది మీరేనేమో అని. మీ గుర్తులు చెప్పినట్టే చెప్పి ఆ చిత్రాలే లేకుండా చేస్తారా? ఫర్వాలేదు లెండి సరదాకన్నాను.

జయ చెప్పారు...

విశ్వప్రేమికుడు గారు వారం రోజులనుంచి ఉందిగా ఫొటో! మీరు భలే కనుక్కున్నారే! శిశిర కనుక్కో లేదుగా మరి. కనీసం గెస్ కూడా చేయలేదు. ఒక్కరోజులో కనుక్కో పోతే వెళ్ళిపోతానన్నానుగా. మరి, మాటమీద నిలబడకపోతే ఎలా చెప్పండి...

 

మనస్వి © 2008. Template Design By: SkinCorner