పరీక్షలు...హడావుడి. ఇప్పుడు ఆ యముడొచ్చి పిలిచినా తరువాత రావోయ్...అనే పరిస్థితి.
ఇంతలో ఎక్షాంస్ రాయాల్సిన ఒక బ్లైండ్ గర్ల్ ఒచ్చింది. అందరు ఇన్విజిలేటర్స్ రూంస్ కి వెళ్ళిపోయారు. ఈ అమ్మాయి రావటం లేట్ అయింది. ఇప్పుడు వెంటనే తన ఎక్షాం రాయటానికి ఎవరైనా వెళ్ళాలి. ఇక్కడొక చిన్న విషయం. స్టాలిన్ సినిమా లాగా బ్లైండ్ స్టూడెంట్స్ తమ ఎక్షాం రాయటానికి తామే కష్టపడి ఎవరినో తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. అలా ఎక్కడ కూడా జరగదు. ఎక్కడైనా సరే ఆ స్టూడెంట్ కాంబినేషన్ కాని ఎవరో ఒక లెక్చరర్ ని స్క్రైబర్ గా అలాట్ చేస్తారు.
అప్పటికే పది నిమిషాలైపోయింది. ఇప్పుడెలా! ఎవర్ని పంపాలి? కంట్రోల్ రూం లో ఉన్నది నలుగురమే. మధ్యాహ్నం డ్యూటీ ఉన్నవాళ్ళు ఇప్పుడే రారు. ఆ అమ్మాయి అక్కడే నిలబడి ఉంది. అప్పటికే ఆ అమ్మాయిని చూడంగానే నా మనసు కరిగి నీరై ఆ అమ్మాయి దగ్గరికెళ్ళిపోయింది. నేనే తన ఎక్షాం రాయాలని డిసైడై పోయాను. ఆ సంగతి నాతోటి వాళ్ళకు చెప్పాను. అక్కడ ఒకళ్ళు తక్కువైనా పని ఎంత కష్టమో తెల్సి కూడా వాళ్ళు సరే అన్నారు.
ఇప్పుడున్నది సెకండ్ లాంగ్వేజ్ ఎక్షాం. ఆ అమ్మాయిది తెలుగు పరీక్ష. ఆన్సర్ షీట్, క్వెశ్చన్ పేపర్ తో పాటు ఆ అమ్మాయిని తీసుకొని కారిడార్ లో ఒకపక్క కి వెళ్ళాను. ఆ అమ్మాయిని వేరు గానే కూచోపెట్టాలి. వాళ్ళు బయటకి అన్నీ చెప్తూ ఉంటారు కాబట్టి అందరితో పాటు ఒకే రూం లో ఉంచరు.
టేబల్ కి అటూ ఇటూ గా ఇద్దరం కూచున్నాం. హాల్ టికెట్ తీసుకొని తన డిటైల్స్ అన్నీ ఫిల్ చేసేసాను. అప్పటికే చాలా ఆలష్యమయ్యింది. ఆ అమ్మాయికి పేపర్ మొత్తం చదివి వినిపించి...చెప్పమ్మా ఏ ప్రశ్నలు రాస్తావో...అన్నాను. ఆ అమ్మాయి ఏమీ మాట్లాడలేదు. వినలేదేమో...అని మళ్ళీ అడిగాను. ఇప్పటకీ ఏ జవాబు రాలేదు. ఇదేంటి? నాకేం అర్ధం కాలేదు. ఆ అమ్మాయి ఏం చెప్తే అదే కదా నేను రాయాలి. ఇప్పుడు ఈ అమ్మాయి ఏం మాట్లాడట్లేదు. ఎలా!
ఇప్పటికే ఆలష్యమైంది. నువ్వేమి చెప్పక పోతే ఎలా? పేపర్ మళ్ళీ చదవ మంటావా? అని అడిగాను. ఊహూ...ఏం కదలిక లేదు. ఒక నిమిషం చుట్టూ చూసాను. కారిడార్ లో కూచున్నాం కదా, బయట గాలి చల్లగ తగులుతోంది. కిందనుంచి పైదాకా పెరిగిన ఉడన్ రోజ్ తీగ, దాని ఆకులు మెల్లగ తలలూపుతున్నాయి. అప్రయత్నంగా నా చేయి ఓ చిన్నారి రోజ్ మీదకెళ్ళింది. ఎంతందంగా ఉంటాయి కదా ఈ పూలు అనిపించింది. ఇంతలో మేడం, మీరు నాకు తెలుసు...అన్న ఆ అమ్మాయి మాటలు వినిపించాయి. తలతిప్పి తనని చూసాను. చూసుండొచ్చు రోజూ కాలేజ్ అంతా తిరుగుతూనే ఉంటానుగా అనుకున్నాను.
చూడు టైం ఎలా గడిచిపోతోందో. ఇలా ఎంతసేపు కూచుందాం అన్నాను. ఈ మొదటి క్వెశ్చన్ బాగున్నట్లుంది. దీనితో స్టార్ట్ చేయి, అని ఓ ఉచిత సలహా ఇచ్చాను. వెంటనే, మీరే రాసేయండి మేడం అంది. నేనే రాసేయాలా...తనేం చెప్పకుండానే? అదిరిపోయి, ఆ అమ్మాయి మొహం లోకి చూసాను. కళ్ళు చాలా అందంగా ఉన్నాయి. చూపు లేదంటే నమ్మలేను. ఆ కలువరేకుల్లోనుంచి ఒక్కొక్క కన్నీటి చుక్క మెల్లగా బయటికి ఒచ్చి ఆ లేత బుగ్గ్గల మీదికి జారిపోతున్నాయి. ఒక నిమిషం నాకేం అర్ధం కాలేదు. మెల్లగా ఏంటమ్మ ఎందుకేడుస్తున్నావు ఏమయ్యింది, అనడిగాను.
మెల్లిగా అన్ని విషయాలు చెప్పింది. తనొక అనాధ. ఎక్కడో దూరంగా ఒక అనాధ శరణాలయంలో పెరుగుతోంది. ఎప్పటినుంచి ఉందో తనకే తెలియదు. చదువు మీద ఉన్న కోరికతో శ్రద్ధగా చదువుకుంటోంది. అంతే కాకుండా అక్కడున్న చిన్న పిల్లలకు తనే అక్షరాలు నేర్పించి, తను తెలుసుకున్న విషయాలన్నీ చెప్పుతూ ఉండేది. కళ్ళు లేక పోయినా ఎన్నో పనుల్ని హుషారుగా చేసేది. ఆ అమ్మాయి తెలివితేటలకి అక్కడి అధికారులు సంతోషించి అక్కడే తనకి ఒక ఉపాధి కల్పించాలనుకున్నారు. అక్కడే చిన్న పిల్లలకి టీచర్ గా నియమిస్తే తనకి ఒక ఆధారం దొరుకుతుందని భావించారు. కాబట్టి డిగ్రీ చదువు పూర్తి చేస్తే తనకి ఆ ఉద్యోగం ఇస్తామని చెప్పారు. అప్పటినుంచి ఆ అమ్మాయి కష్టపడి చదువుకొని, అక్కడే స్థిరపడాలనుకుంది. కాని, లోకమంతా పాతుకుపోయిన కుత్సితపు బుద్ధి అక్కడ కూడా బాగానే స్థిరపడింది. ఈ అమ్మాయికి ఆ ఉద్యోగం రావటం ఇష్టం లేని మిగతావారి మూలంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఒచ్చింది. తనమీద కంప్లైంట్స్ చేసేవారు. ఎప్పుడు చదువుకోటానికి ప్రయత్నం చేసినా ఏదొవిధమైన విఘ్నాలు కల్పించే వాళ్ళు. అక్కడ దుర్భర పరిస్థితులు కల్పించారు. అడుగడుగునా సమష్యలు ఎదుర్కొంటోంది. ఉద్యోగం మీది దిగులుతో, ఏమి చదువుకోలేని పరిస్థితుల్లో ఇవాళ ఎక్జాం రాయటానికి ఒచ్చింది.
నాకు అసలే నెత్తిమీద ఎప్పుడూ స్థిరంగా ఉండే నీళ్ళ కుండ కదిలిపోయి ఆ నీరంతా నా మొహం మీద పరుచుకోటం మొదలుపెట్టింది. ఈ అమ్మాయి పాస్ అయితే తను స్థిరపడి సంతోషంగా ఉంటుంది. కేవలం అక్కడి చిన్న పిల్లల చదువుకి ఈ అమ్మాయి చదివే డిగ్రీ చదువుకి ఏం సంబంధం లేదు. నేను గనుక హెల్ప్ చేస్తే సంతోషిస్తుంది. ప్రతిరోజు ఎన్ని రకాలుగా అరికట్టటానికి ప్రయత్నిస్తున్నా కాపీలు కొట్టే స్టూడెంట్స్ నా కళ్ళముందు మెదిలారు. వాళ్ళు పెద్దపెద్ద ఉద్యోగాలు సంపాదించుకుంటారు. ఈ అమాయకురాలికి నేను సహాయం చేస్తే ఏం ముంచుకు పోతుంది గనుకా! అనిపించిందొక క్షణం. ఈ తెలుగు పేపర్ నేనెలా రాయాలి. పేపర్ నిండా ఉన్న ప్రశ్నలు ఒక్కటికూడా నాకు తెలియవు. అంతే కాదు, పద్యాలు...ప్రతిపదార్ధాలు, వ్యాకరణం..అలంకారాలు...చందస్సు... బాబోయ్..ఇవన్నీ నేనెలా రాయాలి. నా తరంకాదు. టైం ఏమో రన్నింగ్ కాంపిటీషన్ లో ఉంది. ఇదొక్కటేనా..ఈ అమ్మాయి పాస్ అవ్వాలంటే రేపటినుంచి అన్నీ నేనే రాయాలి. అటువంటి పని నేను చేయగలనా? వెంటనే నేనో పెద్ద అద్దాల గదిలో ఉన్నట్లు..అందులోని నా ప్రతిబింబాలన్నీ నన్ను నిలదీస్తున్నట్లు అనిపించింది. అంతేనా...నా మనస్సాక్షి కూడా అప్పటివరకు నేను చూసి మురిసిపోయిన ఉడ్రోజ్ పక్కనే కూచొని నన్ను నిలువునా కోరచూపులతో దహించేస్తున్నట్లనిపించింది.
ఏం చేయాలి...ఇప్పుడు నేనేం చేయాలి...
నాకే తెలియకుండా తెలుగు పరీక్ష జరుగుతున్న రూం ముందుకెళ్ళాను.
అక్కడ అన్నీ ఒకే రకం తెలుగు గైడు లన్నీ ఓ పెద్ద పర్వతం లాగా ఉన్నాయి. అక్కడే ఒక ఆయా కూడా ఉంది. చాలా మంది గైడ్లు మాత్రమే చదువుతారని నా కర్ధమయ్యింది. మెల్లిగా ఒక బుక్ తీసుకున్నాను. తిరిగి ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళాను. కొన్ని ఆన్సర్లు అందులో వెతికి రాసాను. వ్యాకరణం సరిగ్గా రాయలేక పోయాను. పద్యం చందస్సు విభజన కష్టపడి చేసాను. అది ’నజభజజజర” అనుకుంట. అవును చంపక మాల. పద్ధతి ప్రకారం రాయలేక పోయినా మొత్తానికి పరీక్ష రాసేసాను.
రేపటినుంచి ఆ మర్నాటి ఎక్షాం బుక్స్ తీసుకొచ్చుకో. ఎక్షాం కాంగానే ఇక్కడే సాయంత్రం వరకు చదువుకొని పోవచ్చు, నేను ఎవరికన్నా చెప్తాను, నీకు హెల్ప్ చేస్తారన్నాను. తన బుక్స్ అన్నీ ఎత్తుకుపోయారుట. ఏదో విధంగా ఇక్కడే చదవొచ్చు. సాయంత్రం వరకు ఇక్కడే ఉండు. రేపటి ఎక్షాం నీకు చెప్పటానికి ట్రై చేస్తాను అని ఆ పేపర్ తీసుకొని వెళ్ళిపోయాను.
ఇవాళ నేను చేసిన పని ఎవరూ హర్షించరు.నా మనసు నాకే ఎదురుతిరుగుతోంది. డబుల్ యాక్షన్ లాగా నాకు నేనే సమాధానం చెప్పుకోటానికి ప్రయత్నం చేస్తున్నాను. నన్ను నేనే క్షమించుకో లేక పోతున్నాను. రేపటినుంచి ఎవరైనా కాపీ కొడుతుంటే అడ్డుకునే మనస్థైర్యం పోయింది. ఈ అమ్మాయికి నేను చేసిన సహాయం మూలంగా ఎవరికీ అన్యాయం జరుగదు కదా...
ఈ అమ్మాయి జీవితం నిలబడుతుంది కదా...ఎక్కడో తన జీవితాన్ని గడుపుతుంది....అంతే కదా!
నేను తప్పు చేసానా!!! ఈ తప్పుకు నాకు శిక్షేంటి?
అసలు ఇంత పవిత్రమైన ఉద్యోగం చేసే అర్హత ఇంకా ఉందా నాకు?
రేపటినుంచి ఆ అమ్మాయికి నేనేం చేయాలి? మిగతా పరీక్షలు నేనే రాయాలా...వద్దా?
నాకు ఇంకా అనుమానమే!!! ఈ అమ్మాయిని అక్కడ బ్రతకనిస్తారా?
********************************************************************
25 కామెంట్‌లు:
ఇది వాస్తవం కాకపోతే బావుండును - కథ అయితే బావుండును అనిపిస్తోందండీ. ఎక్కువగా ఆలొచించకుండా చెప్పాలనుకుంటే మీరు చేసినది సరి అయినదే అనిపిస్తోంది. వంద అబద్ధాలయినా ఆడి ఒక పెళ్ళి చెయ్యమన్నారు - కొన్ని అబద్ధాలతో ఒక అమ్మాయి - అందునా గుడ్డి అమ్మాయి జీవితం నిలుపుతున్నారు కదా.
వాఖ్యలో గుడ్డి అమ్మాయి అనే పదం వాడినందుకు శరత్ గారికి నిరశన తెలుపుతున్నాను.
స్టాలిన్ సినిమా లాగా బ్లైండ్ స్టూడెంట్స్ తమ ఎక్షాం రాయటానికి తామే కష్టపడి ఎవరినో తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. అలా ఎక్కడ కూడా జరగదు. ఎక్కడైనా సరే ఆ స్టూడెంట్ కాంబినేషన్ కాని ఎవరో ఒక లెక్చరర్ ని స్క్రైబర్ గా అలాట్ చేస్తారు.
కొన్ని రకాల పోటీ పరీక్షలలో ఇంకా బి ఈడి పరీక్షల్లలో చాల మంది స్క్రైబ్స్ లేక అల్లాడుతున్నారు. ఎలాట చేసేది వందమందికి అయితే బయట నుండి తెచ్చుకునే వారు రెండు వందల మంది ఉంటారు. గమనించండి
ఇక మీరు అడిగే విషయానికి వస్తే లోకం లో అసలు తప్పు చేయని వాడు ఎవరన్న కనిపిస్తే అప్పుడు ఫీల్ అవండి మీరు చేసింది తప్పు అని.
ఆమె చెప్పేది పూర్తిగా నిజం కాకపోయి ఉండచ్చు. అయినా ఆ అమ్మాయి బతకాలంటే డిగ్రీ కావాలి కాబట్టి ఆమె అందరిలా కాదు కాబట్టి రేపు నుండి కూడా ఆమెకి హెల్ప్ చేయండి. చేయకపోతే ప్రతిరోజూ పాపం కళ్ళు లేని ఆ పిల్లకి సాయపడలేకపోయానే అనే ఫీలింగ్ ఇంకా బాధాకరంగా ఉంటుంది.
జయ గారూ,
మీ అంతర్మధనం సహజమే కానీ, ఏమీ తెలియని వ్యక్తులుగా బయటి నుంచి చూస్తే మాత్రం.. నాకు మీరు చేసింది తప్పనిపించట్లేదు.
అయినా, తప్పొప్పులకి 'ఇదీ' అని ఒక ఖచ్చితమైన definitions ఉండవని నా అభిప్రాయం. ఆయా పరిస్థితిని బట్టి, విలువలు మారుతుంటాయి.
మీరు చెప్పిన పరిస్థితిలో మీరు చేసిందాంట్లో తప్పేమీ లేదని నా అభిప్రాయం.
అలాగే, కేవలం ఈ అమ్మాయి డిగ్రీ పాస్ అయినా అనాధాశ్రమంలో తనకున్న సమస్యలు తీరకపోవచ్చు. తను అక్కడ ఉద్యోగంలో చేరినా అడ్డంపడి ఎలా వెళ్ళగొట్టాలా అని చూసే వాళ్ళుంటారేమో అని కాస్త భయంగా ఉంది. కానీ, ఆ అమ్మాయికి మరేదైనా స్థిరమైన ఉపాధి చూపించాలంటే.. ఎలా మరి? ఏదైనా స్వచ్చంద సంస్థలు సాయం చేస్తాయేమో.? అలాంటి సమాచారం తెలిసిన మన బ్లాగ్మిత్రులెవరైనా స్పందిస్తే బాగుంటుంది.
@ శ్రీనివాస్ గారూ,
నా వ్యాఖ్యలో చివరి లైను రాసేప్పుడు మీరే గుర్తొచ్చారండీ! నేను కామెంటు పోస్ట్ చేసే లోపలే మీ వ్యాఖ్య ఉంది :-)
ఆ అమ్మాయికి డిగ్రీ చేతికి వచ్చాక అక్కడే ఉండాల్సిన అవసరం లేదు .... చాలా బ్లైండ్ స్చూల్స్ లో ఆవిడకి అవకాశాలు దొరుకుతాయి. ఏదేని సహాయం కావాలంటే .... సర్వకాల సర్వావయస్తలయండు నేను సాయం చేయగలను :-)
evergreenboss@gmail.com
జయ గారూ !
ఈ లోకంలో తప్పులే చెయ్యని వాళ్ళెవరూ వుండరు నిజమే ! వ్యక్తికి అతీతం వృత్తిధర్మం. వృత్తికి అతీతం మానవత్వం. వృత్తి కోణంనుంచి మీరు చేసింది తప్పే ! కానీ మానవీయ కోణం నుంచి ఆలోచిస్తే తప్పు కాకపోవచ్చు. గతం గతః ! ఈ రోజు జరిగింది మర్చిపోండి. ఒక బాధ్యతాయుతమైన వృత్తిలో వున్నారుగనుక రేపు ఆ అమ్మాయికి చెప్పండి. ఇంతకుముందు చదవలేకపోవడం నిజమైతే, ఆమెకు లక్ష్యాన్ని చేరుకోవాలనే పట్టుదల నిజంగా వుంటే మీరు అందించిన సాయం ఉపయోగించుకుని ఇప్పుడైనా చదువుకుని ఎంత వీలైతే అంతవరకూ తన బాధ్యతను నేరవేర్చుకోమనండి. మీ సాయాన్ని దుర్వినియోగం చేసే అవకాశాన్ని మీరే ఇవ్వకండి. ఇదే పద్ధతిలో అయితే ఎన్ని పరీక్షలైనా సులువుగా పాస్ అవవచ్చు అనే తప్పుడు ఆలోచన ఆమె మనసులో రానివ్వకండి. దానివలన ఆమెకు ఉద్యోగమిచ్చి మరికొందరు పిల్లలకు పాఠాలు చెప్పించాలని ఆశించిన వారికి ఆశాభంగం తప్పదు. మానవత్వంతో సాయం చేసిన మీకు, మీ ఉద్యోగానికి హాని కలగకుండా చూడాల్సిన బాధ్యత ఆమెదేనని గట్టిగా చెప్పండి. ఆమె కృషి కొంతైనా వుంటే మీరు సాయం చేసినా అర్థం వుంటుంది. లేకపోతే మీ సాయం అపాత్రదానం అవుతుంది. ఆమెకు ఆత్మస్థైర్యాన్ని ఇవ్వండి గానీ బాధ్యతను విస్మరించి ఇతరుల మీద పూర్తిగా ఆధారపడడం ఎప్పుడూ మంచిది కాదని అర్థమయ్యేలా చెప్పండి. ఇక మీరు చేసింది తప్పా ఒప్పా అనే మీమాంస ఇప్పుడు అనవసరం. రేపు చెయ్యాల్సిన దాన్ని గురించి బాగా ఆలోచించండి. సాయం చెయ్యబోయి చిక్కుల్లో మాత్రం ఇరుక్కోకండి.
@ శ్రీనివాస్
బ్లైండ్ గర్ల్ కి అనువాదం గుడ్డి అమ్మాయి అని కాదా? అంధురాలు అని వాడివుంటే బావుండేదంటారా? గుడ్డితనం అనడం ఇప్పుడు పొరపాటుగా పరిగణిస్తున్నారా? అంధత్వం అని మాత్రమే ఇప్పుడు వాడుకలో వుందా? తెలియక అడుగుతున్నాను.
@మధురవాణి గారు,
>>>తప్పొప్పులకి 'ఇదీ' అని ఒక ఖచ్చితమైన definitions ఉండవని నా అభిప్రాయం. ఆయా పరిస్థితిని బట్టి, విలువలు మారుతుంటాయి...
నూటికి రెండొదల పాళ్ళు కరెక్ట్ గా చెప్పారు...నాదీ అదే అభిప్రాయం...
@జయ గారు,
మీరు చేసింది తప్పు ఎంత మాత్రం కాదు...సపోజ్ ఆ అమ్మాయి చెప్పిందంతా అబద్దం అనే అనుకుందాం...అయినా సరే మీరు చేసింది తప్పు కాదంటే కాదు...అన్నీ సక్రమంగా ఉన్న వాళ్ళకి మీరిలా సహాయం చేస్తే మిమ్మల్ని మీరు ప్రశ్నించుకున్నప్పుడు అర్ధం ఉంటుంది...అనవసరంగా మిమ్మల్ని మీరు చిద్ర వధ చేసుకోకండి...ఒకవేళ మీరిప్పుడు సహాయం చేయకుంటే జీవితాంతం "అయ్యో..ఆ మాత్రం సాయం చెయ్యలేకపోయానే" అని నీడలా ఆ ఫీలింగ్ వెంటాడుతుంది....Please go ahead...
క్షమించండి నేను ఇలా అంటున్నందుకు .,మీరు చేసేది ముమ్మాటికి తప్పే తెలియకుండా చేస్తే అది వేరు తెలిసి తెలిసి తను చెప్పిన సమస్యలకి స్పందించి తనేమి చదవకుండా (మీకు చెప్పకుండా )మీరు రాసేయడం ,అదీ పుస్తకాలు చూసి మీదికానివి అంత రిస్క్ తీసుకుని చేయడం ,తను వున్నా పరిస్థితి కి మీకు సహాయపడాలి అనిపిస్తే వేరే మార్గాలు చాలా వున్నాయి .నిజంగా సమస్య అంత తీవ్రమైనది అంటే నేనుకూడా సహాయపడగలను .
మనం చేసే సహాయం ఎలా వుండాలి అంటే "to help the people to help themselvs".ఇంకొకటి అండీ మనకి పెద్దలు ఎప్పుడో చెప్పారు తనను మాలిన ధర్మం పనికి రాదనీ ..ఎంతో గౌరవంగా చేసే మీ వృత్తికి కళంకం తెచ్చుకోకండీ .జయ గారు నేను ఎక్కువ చనువు తీసుకుని చెబుతున్నానేమో ,మీరు రాసింది చదివి ఆగలేక రాస్తున్నాను ,క్షమించండి .
వీరిని సంబోధించేప్పుడు "దృష్టిమాంద్యము " దృష్టి లోపము "(visually impaired,challenged) కలిగిన వారు అంటారు .గ్రుడ్డి అంటే నొచ్చుకుంటారు
జయగారూ, మీరు చేసింది తప్పా ఒప్పా అని అనడంకంటే, కొన్ని కొన్ని మనసులో వుంచుకోవాల్సిన విషయాలు వుంటాయి. అందులో ఇదొకటి అని నా అభిప్రాయం. కొన్ని బ్లాగుల్లో లేదా పది మందికి చెప్పలేని, చెప్పకూడని విషయాలుంటాయి. మీరు వ్యక్తిగా గెలిచారు, ఉపాధ్యాయిని గా ఓడారు. ఇది మీకు సమ్మతమైతేనే ఈ వ్యాఖ్యను ప్రచురించండి.లేకపోతే వద్దు.
జయ గారూ !
నేను భా.రా.రె. గారితో ఏకీభవిస్తాను. అన్ని విషయాలు ఇక్కడ చెప్పడం, అందరి అభిప్రాయాలు తీసుకోవడం, మనసు మరింత వికలం చేసుకోవడం అంత మంచిది కాదని నా అభిప్రాయం కూడా ! ఒకరికి మంచి అయినది మరికరికి మంచి కాకపోవచ్చు. భిన్నాభిప్రాయాలు సహజం. నేను కూడా నాకు తోచింది రాసాను. ఇలాంటి సున్నితమైన అంశాలలో ఈ పరిస్థితి గందరగోళానికి దారి తీస్తుంది. సరైన సలహాకోసం, ఓదార్పు కోసం మీకు బాగా అత్మీయిలైన, నమ్మకమైన వారితో చెప్పుకోవడం తప్పుకాదు. బ్లాగులోకి వచ్చేటప్పటికి పబ్లిక్ లోకి వచ్చినట్లే ! అందుకని మా సలహాలలో మీకు ఏవైనా నచ్చితే పాటించండి. లేదా ఇవన్నీ ప్రక్కనబెట్టి నిర్ణయం మీ మనస్సాక్షికి వదిలివేయ్యండి.
WOW.
ఇందరు పిల్లలకి విద్యాబుద్ధులు చెబుతున్న మీకు తెలియనిది కాదు జీవితంలో చాలా సందర్భాలు నలుపు తెలుపంత స్పష్టంగా ఉండవని. మీ నిబ్బరానికి హేట్సాఫ్.
ఇది తప్పా ఒప్పా అని ఒక్క మాటలో చెప్పడం కష్టమండీ.. జరిగిపోయిన దానిని వదిలేద్దాం.. కానీ ఒక ఉపాధ్యాయినిగా మీరు అదే పనిని మళ్ళీ మళ్ళీ చేయడాన్ని మాత్రం నేను సమర్ధించ లేను.. అన్నీ సక్రమంగా ఉన్నవాళ్ళే కాపీలు కొడుతున్నారు అన్నది excuse కాదు అన్నది నా అభిప్రాయం.. any how, నిర్ణయం మీది..
రెండు మూడు గంటల ముందు ఈ టపాను చూసి ఇంతసేపు ఆలోచించాకా వ్యాఖ్య రాస్తున్నానండీ..
ముందుగా ఆ అమ్మాయి చెబుతున్నది కరక్టేనా అన్నది తెలుసుకునే అవకాశం ఉంటే తెలుసుకోవాలి..అది నిజమే అయితే మాత్రం మీరు చెసినది ఎంత మాత్రం తప్పు కాదన్నది నా అభిప్రాయం అండీ. మీరు చేసిన పని వల్ల ఒక మనిషి జీవితానికి ఉపాధి లభిస్తుంది,ఆ వ్యక్తి జివితానికి ఒక దారి ఏర్పడుతుంది అంటే అంతకంటే తృప్తి ఏం కావాలండీ?
మనం చేసే వృత్తి,పని ఏదైనా ముందు మనం మానవులం. మనలోని మానవత్వం ఒకరి ఉన్నతికి ఉపయోగపడటం అనేది సాధారణమైన విషయం కాదు.
కాకపొతే ఈ పని వలన మీ వృత్తికి ఎటువంటి ఆతంకం కలగకుండా చూసుకోండి.Don't get into trouble.
నాకు తెలిసిన ఒక సంఘటన:
ఒక 40 ఏళ్ళ క్రితం ఒక ప్రొఫెసర్ గారు దయతో 2మార్కులు వేసి పాస్ చేయటం వల్ల నైట్ కాలేజీలో చదువుకుంటున్న ఒక మనిషి తిరిగి లెక్చరర్ అయ్యి,ప్రొఫెసర్ అయి-- పెద్ద కుటుంబాన్ని పోషించి,బాధ్యతలు తీర్చుకుని,ఇద్దరాడపిల్లని పెద్ద చదువులు చదివించి..ఒకరిని అమెరికాలో ఇంజినీరుగా,ఒకరిని డాక్టర్ గా చూసి ఈమధ్యనే తృప్తిగా రిటైరయ్యారు. దీనికంతటికీ 40ఏళ్ల క్రితం తనను 2మార్కులు వేసి పాస్ చేసిన వ్యక్తేనని ఇప్పటికీ తలుచుకుంటారు.
జయ గారు, కొన్నిసార్లు మనం చేసే పనులు పరిస్థితులని ప్రభావితం చేస్తే, కొన్నిసార్లు పరిస్థితులు మనం చేసే పనులని ప్రభావితం చేస్తాయి. అప్పటి మన మనఃస్థితి, పరిస్థితులు, వాటికి మన ప్రతిస్పందన లాంటివి మనం చేసిన పని తప్పో, ఒప్పో నిర్ణయిస్తాయి అని నా అభిప్రాయం.
మీరు చేసిన పని తప్పా, ఒప్పా అనేది నేను చెప్పలేను, కానీ "అసలు ఇంత పవిత్రమైన ఉద్యోగం చేసే అర్హత ఇంకా ఉందా నాకు?" అని మీరు మధనపడుతున్నారు చూశారా అదే మీకు వృత్తి పట్ల గల నిబద్ధతని, బాధ్యతని, మీరు పాటించే విలువలని తెలియచేస్తూంది. కొన్ని సందర్భాలలో మనిషి తను నమ్మిన విలువలని ఆచరణలో పెట్టలేకపోవచ్చు. దీనికి ఎవరూ అతీతులు కారు. అలాంటప్పుడు ఈ అంతఃసంఘర్షణ సహజం. నేను చేశాను కనుక అది సరైన పనే అనే అతిశయానికి పోకుండా మిమ్మల్ని మీరు సమీక్షించుకోవడం చాలా అభినందనీయం. మీ సున్నిత మనస్తత్వమే మీరు అలా చేసేలా చేసింది అనేది నా అభిప్రాయం.
ఉపాధ్యాయ వృత్తిలో నాకున్న కొద్దిపాటి అనుభవంతోనే చెప్తున్నాను. పిల్లలలో ఆడతనాన్ని మాత్రమే చూసే అపర కీచకులు, ప్రాక్టికల్ మార్కులు వేయాలంటే నిస్సిగ్గుగా డబ్బు గుంజే మేతగాళ్ళు ఉన్న ఉపాధ్యాయలోకంలో మళ్ళీ జన్మంటూ ఉంటే " నేనునేనుగానే " పుట్టాలంటూ ఆశిస్తున్న మీరు, "వాళ్ళు నాకు విద్యార్ధులు కాదు, నా పిల్లలు" అని మనసా వాచా కర్మేణ నమ్మే మీరు తప్పకుండా ఉండి తీరాలి.
శరత్ గారు ధన్యవాదాలండి. ఇది వాస్తవమేన౦డి. కలకాదు. ఆ నిముషంలో నేను ఆలోచించింది కూడా అదే. ఆ అమ్మాయి జీవిత౦ ఎలా ఉ౦టు౦దో ము౦దుము౦దు చూడాల్సి౦దే.
శ్రీనివాస్ గారు థాంక్యూ. మా లాంటి కళాశాలలను దృష్టి లోపెట్టుకొనే స్క్రైబర్ గురించి చెప్పాను. కాకపోతే, ఒకేసారిగా వందలమంది స్క్రైబర్స్ అవరసరముంటుందన్నది నిజంగా నాకు తెలియని విషయమే.
అసలు తప్పుచేయని వాళ్ళున్నారా? అని మీరడిగిన విధానం చూస్తుంటే నాకు జీసెస్ క్రైస్ట్, అంతే కాకుండా నేరం నాదికాదు ఆకలిది లో ఎన్.టి.ఆర్. గుర్తుకొస్తున్నారుప్పారు. అదేనండి. మీలో నేర౦చేయని వారెవరైనా ఉంటేనే రాళ్ళతో కొట్టండి అన్న డైలాగ్:)
రాత్రంతా నేను చేసిన తప్పు గురించే ఆలోచించానండి. పొద్దున్నే మా ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్ళి జరిగిన విషయం, పూసగుచ్చినట్లుగా మొత్తం చెప్పేసాను. ఆవిడ ఒక నిముషం ఆలోచించుకున్నారు. తరువాత నాకు ధైర్య౦ చెప్పారు.
ఇంక నువ్వు వర్రీ అవకు, ఆ అమ్మాయి గురించి అన్ని వివరాలు కనుక్కుందాం అన్నారు. అంతే కాదు, వెంటనే తనుండే సంస్థ వివరాలు అన్నీ కనుక్కున్నారు. తను చెప్పిన విషయాలన్నీ కూడా నిజమే. ఆ అమ్మాయి మన కాలేజ్లో చదువుతుంది, తన బాధ్యత కూడా మనదే అన్నారు.ఆ అమ్మాయి ఇంకా ఫస్ట్ ఇయర్ లోనే ఉంది. అందుకని ఫ్రీ ఎడ్యుకేషన్ తో, మా కాలేజ్ హాస్టల్ లో ఆ అమ్మాయికి అకామొడేషన్ ఇప్పిద్దామన్నారు. దీనికి ఒక అయిదారు రోజుల సమయం పడుతుంది. మా హాస్టల్ లో ఇటువంటి వాళ్ళు ఇంకా కొంతమంది ఉన్నారు. కాకపోతేవాళ్ళు అనాధలు కారు.మా హాస్టల్ లో తన ఏజ్ పిల్లల మధ్య ఆ అమ్మాయి ఆనందంగానే ఉంటుందని నా నమ్మకం. ఈ మూడేళ్ళ డిగ్రీ తరువాత ఆ అమ్మాయి ఫ్యూచర్ గురించి చూద్దాం అన్నారు.
మీరు సహృదయంతో ఆఫర్ చేసిన సహాయానికి నా కృతజ్ఞతలు. ఇంకా ఎన్ని రకాల అమ్మాయిలు నా కెదురవుతారో ...ఏమో? అప్పుడు తప్పకుండా మీరు సహయం చేయాల్సిందే.
రావ్ గారు థాంక్యూ. నా వృత్తికి ఒచ్చిన ఇబ్బంది, చిక్కులు ఏమీ లేదండి. ఆ అమ్మాయిని ఈ సంగతి ఎవరికి చెప్పకు అని అడిగే ప్రశ్నే లేదు. అపాత్ర దానమనికూడా అనిపించలేదు. అప్పుడు ఆ అమ్మాయి ఉన్న మానసిక పరిస్థితి నా కళ్ళకు ప్రత్యక్షంగా కనిపించింది. అంతకుముందు సెమిస్టర్ ఎక్షాంస్ బాగా రాసి పాస్ అయింది. చదువురాని అమ్మాయి కాదు. ఆ అమ్మాయి ఏమీ తినకుండా ఒచ్చింది. తన గురించిన ఆలోచనలో చాలా బాధలో ఉంది. ఏమీ ఆలోచించే స్థితిలో లేదు. ఇవన్నీ గమనించే నేను ఆ నిర్ణయం తీసుకున్నాను.
ఈ విషయం మీ అందరికి తెలియ చేయటం లో మీరిచ్చే సలహాలు నాకు తోడ్పడతాయనే నా ఉద్దేశ్యం.
మధురవాణి గారు ధన్యవాదాలు. ఏమోనండి, ఆ సమయంలో ఆ అమ్మాయి విద్యా సంవత్సరం నష్టపోకూడదనే ఉద్దేశ్యంతోనే ఆ పని చేసాను. ఇంక అనాధాశ్రమంలో ఆ అమ్మాయి కష్టపడనవసరం లేదు.మా కాలేజ్ హాస్టల్లో త్వరలోనే చేరబోతుంది. ఈ విషయం ఆ అమ్మాయిఉండే సంస్థకి కూడా తెలియచేసారు. నేను తప్పు చేసినప్పటికీ, ఇప్పుడు నాకాభావం లేదు. ఎంతో సంతోషంగా ఉంది.
శేఖర్ గారు మీరిచ్చిన సపోర్ట్ కి ధన్యవాదాలు. నేను చేసింది తప్పేలెండి. కాని ఇప్పుడు మాత్రం ఎందుకో, మనసు చాలా తేలిక గా, గాల్లో తేలిపోతోంది. ఇప్పుడింక సాయం చేయలేకపోయానే అన్న బాధ నాకింక లేదు. అంతే కాదు తన పరీక్షలు కూడ ఇంక నేను రాయను. వీళ్ళకి రోజు విడచి రోజు ఎక్షాంస్ ఉంటాయి. రోజు సాయంత్రం వరకు ఈ అమ్మాయి కాలేజ్ లోనే ఉంటుంది. కన్సర్న్ లెక్చరర్స్ ఎక్షాం కి కావాలసిన పద్ధతిలో అంటే ఇంపార్టెంట్ సెలెక్టెడ్ సిలబస్ నేర్పిస్తారు. కొన్ని ప్రశ్నలన్నా ఆన్సర్ చేయగలిగుతుంది. అంతకుముందు చదువుకొనే ఉంది కాబట్టి పెద్ద సమస్య కూడా కాదు. ఇకముందు తను చెప్తుంది, స్క్రైబర్ రాస్తారు.ఈ సంవత్సరం నష్టపోదు. ఇప్పుడు మా ప్రిన్సిపల్ మీద నాకు ప్రేమ తెగ కారిపోతోంది:)
చిన్ని గారు మీ స్పందనకి నిజంగా నా హృదయపూర్వక కృతజ్ఞతలు. అప్పుడు ఆ అమ్మాయి ఉన్న పరిస్థితి అక్కడ ఉన్న వాళ్ళకే అర్ధమవుతుందేమో!!! నా వృత్తి మీద నాకెప్పుడూ గౌరవముంది. కోరి ఎంచుకున్న ఉద్యోగం. నా వల్ల ఎటువంటి కళంకం ఏర్పడినా ఆ నిముషంలో నేను నా ఉద్యోగాన్నే ఒదిలేస్తాను. ఆ అమ్మాయి స్టూడెంట్ కాబట్టి,తన నిస్సహాయతను కళ్ళారా చూసి, తను ఫైల్ అవకూడదనే అభిప్రాయంతోనే చేసాను. ఇదేవిధంగా ఇకముందు కొనసాగుతుంది అనే దురభిప్రాయం కూడా ఆ అమ్మయికి నేను కల్పించలేదు.ఒక్క రోజు తేడాలో ఆ అమ్మాయి జీవితం లో ఒచ్చిన మార్పుకి ఇప్పుడు నాకు సంతోషంగానే ఉంది. తనకు మాలిన ధర్మం కాదనే అనిపిస్తోంది. మీరు కూడా సహాయం చేస్తాను అన్నందుకు నాకు చాలా హ్యాపీ గా ఉంది.
భాస్కర రామిరెడ్డి గారు మీ కు నా కృతజ్ఞతలు. ఏమో...ఈ విషయం మీ అందరికీ చెప్పాలనే అనిపించింది నాకు. ఏదైనా మనసు విప్పి మితృలకే గా చెప్పుకుంటాం. ఏం..మీరెవవరు నాకు మితృలు కారా? మీ అభిప్రాయాలు, సలహాలు నాకు తోడ్పడతాయి కదా! మనసులో పెట్టుకొని బాధపడే కంటే పంచుకుంటేనే కదా పరిష్కారం లభ్యమయ్యేది. నా గురించి దురభిప్రాయం ఏర్పడినా ఫరువాలేదు.
మనిషిగా నేను గెలిచానా లేదా అన్నది నాకు అస్సలు పట్టదు. నా వృత్తిలో నేను ఓడిపోయినా నాకు బాధలేదండి. నా కళ్ళముందు ఒకమ్మాయి బాధ మాత్రం భరించలేక పోయాను.
ఇవాళ మీ అందరి అభిప్రాయాలు చదివాక నేను తప్పుచేసాను అన్నది నిజమే అయినా, నాకు మాత్రం మనసు తేలిక పడింది.
కొత్తపాళీ గారు థాంక్యూ. ఇవాళ మీ అందరి అభిప్రాయాలే నాకు సరి అయిన నిర్ణయం తీసుకోటానికి హెల్ప్ చేస్తొంది. బ్లాగ్ లో ఈ విషయం చెప్పినందుకు నాకు ఏ ఫీలింగ్ లేదు. బ్లాగ్ ఓపెన్ చేసిన ఇన్నాళ్ళకు ఒక మంచి పని చేస్తున్నా ననిపించింది.దీని మూలంగా నా మీద చెడ్డ అభిప్రాయం ఏర్పడినా ఫర్వాలేదు. ఎవరో ఏదో చెడు చేస్తారేమొ అన్న భయం కూడా నాకు కలగటం లేదు. నా నేచర్ నాది. బహుశా, నా బుద్ధి పుడకలతోటే పోతుందేమొ. చూశారా...మొత్తానికి, ఇంతమంది హేమా హేమీలను ఇవాళ నా బ్లాగ్ కి రప్పించుకున్నాను.
మురళి గారు నేను చేసింది తప్పే. కాదని ఎలా అనగలను. పాపప్రక్షాళణ చేసుకున్నాలెండి.రాత్రంతా నిద్ర పోలేదు. ఆ అమ్మాయికి ఇక ముందు ఎక్షాంస్ నేను రాయటం లేదు. అంతే కాదు ఆ అమ్మాయి మా కాలేజ్ హాస్టల్ లోనే చేరబోతోంది.అకడమిక్ ఇయర్ కూడా వేస్ట్ కాదు. మీకు సంతోషంగా లేదూ?
హాయ్ తృష్ణా, థాంక్యూ. ఆ అమ్మాయి చెప్పిన వన్నీ నిజమే. మా ప్రిన్సిపల్ కనుక్కున్నారు కదా... మానవత్వమో, వృత్తిధర్మమో...నా లాంటి సామాన్యురాలికి, అంత దీర్ఘంగా అలోచించే తెలివి లేదు. కాకపోతే ఆ అమ్మాయి కష్టాలు గట్టెక్కాయన్నదే నా బాధని కూడా గట్టుమీద పెట్టేసింది. ఇకముందు, చాలా జాగ్రత్తగా ఆలోచించటానికి ప్రయత్నిద్దామనుకుంటున్నాను.
శిశిరా, మీరు రాసింది చదివాకా నా కళ్ళు నీటితో నిండిపోతున్నాయి. గొంతు మూగబోతోంది. నేనేం చెప్పాలి. పబ్లిక్ ప్రాసిక్యూషన్ లో నిలబడ దలుచుకున్నాను. అంతే. పీనలైజ్ అవ్వాలి. దీన్నే కోర్ట్ మార్షల్ అంటారు.
ఎవరి గోల వాళ్ళు చూసుకుంటూ, ఇతరుల గురించి పట్టించుకోని ఈ రోజుల్లో, మీరు తప్పు చేసారా లేదా చెప్పటానికి కూడా అర్హత కావాలి.
మీరు చాలా అదృష్టవంతులు. గౌరవప్రదమైన ఉపాధ్యాయులు గా పని చేస్తూ, పిల్లల్ని తీర్చి దిద్దుతున్నారు.
మీరు చేసిన సహయాన్ని అభినందిస్తున్నాను.
నా వ్యాఖ్యలు భాద పెట్టినట్లు అనిపిస్తే క్షమించండి .....ఇది తప్పా అని అడిగారు కాబట్టి నా మనస్సులో వున్నది వున్నట్లు అనేసాను
బాటసారి గారు థాంక్యూ.
చిన్ని గారు మీరు ఆ విధంగా అనుకోవద్దు. అడిగింది నేను. చేసింది తప్పు. పైగా సమర్ధించమని నేనెలా అంటాను? డైరెక్ట్ గా మీరు మాట్లాడే పద్ధతి నాకెప్పుడూ ఇష్టమే.మీరందరూ వెంటనే స్పందించిన విధానం నాకు ఎంతో తృప్తినిచ్చింది. మళ్ళీ ఎప్పుడైనా అవసరమొస్తే మీరు హెల్ప్ చేయాలి సుమా....
మీరు అలా అంతే నా పరిస్థితి ఏంటి నాకు ఎగ్జామ్స్ లో చీట్ చేయటం అంతే నచ్చదు నాకు ఎగ్జామ్స్ లో కాప్యింగ్ చేసే అవకాశం వచ్చిన చేయలేదు కానీ ఇప్పుడు నా స్టూడెంట్స్ కి మంచి మార్క్స్ (వాళ్ళు రాయక పోయిన మేమే కరెక్ట్ చేసి మరి ) వేయాల్సి వస్తుంది కాలేజీ management నుండి వచ్చిన ఆర్డర్ మరి ఎం చేయమంటారు చాలా కోపం,బాధ వస్తుంటాయ్ కానీ తప్పటం లేదు??????
కామెంట్‌ను పోస్ట్ చేయండి