27, ఏప్రిల్ 2010, మంగళవారం

యమునా తీరమున....

నాలోని నవరసాలు - అద్భుతం

ఉత్తరా౦చల్ లో ఉన్న కేదారీనాధ్, బద్రీనాధ్, యమునోత్రి, గ౦గోత్రి...ఈ నాలుగు పుణ్య క్షేత్రాలు చూడాలని నాకు ఎప్పటిను౦చో కోరిక. భక్తి తో కాదు..రక్తి తోటే..ఆ మహోన్నతమైన హిమాలయాల సౌ౦దర్య౦ తనివితీర ఆస్వాది౦చాలన్న కోరిక మాత్రమే. మామూలు జీవితాలకి దూరంగా స్వర్గలోకాన్ని చూపే ఈ యాత్ర నా చిరకాల వాంఛ. పోయినసంవత్సరం వెళ్ళిన ఈ యాత్ర నాకు ఇంకా కొత్తగానే నిలిచిపోయింది. నాకు అన్నిటికన్నా నచ్చిన యాత్ర యమునోత్రి. మరచిపోయిందేలేదు. ఇంకోసారి తలుచుకోవాలనిఉంది. నా బ్లాగ్ మితృలందరితో మరొక సారి ఈ అనుభవాలు పంచుకోవాలనే ఆశతో....

చార్ ధాం యాత్ర అంటేనే ఎంతో ప్రత్యేకమైంది. గంగోత్రి, బద్రినాధ్ దాకా వాహనాల్లో వెళ్ళిపోవచ్చు. కేదారినాధ్ రానూపోను ఇరవైఎనిమిది కిలోమీటర్లు ప్రయాణం చేయాలి. డోలీలు, గుర్రాలు మేము ఎక్కదలుచుకోలేదు. అక్కడ హెలికాప్టర్ ఎక్కేసాం. ఆ అనుభవం ఇంకోసారి. యమునోత్రి మాత్రం ఇటువంటి సౌకర్యం లేదు కాబట్టి ఏదోఒకటి ఎక్కాల్సిందే...లేదంటే రానూపోనూ పదహారు కిలోమీటర్ లు నడవాలి. సరస్వతి, సంధ్యా నడుద్దామన్నారు. కాని అంతదూరం నడిచే నమ్మకం నామీద నాకు లేదు. నేను పోనీ ఎక్కేస్తానన్నాను. సంధ్య కూడా అదే ఫాలో అయిపోయింది. కాని సరస్వతి నడిచొస్తానంది. ముగ్గురమూ పక్కపక్కనే వెళ్ళే అవకాశం ఎలాగూ లేదు. సరే ఇంక పైనే కలుసుకోవాలని అనుకున్నాం. సరస్వతి నడక మొదలుపెట్టి వెళ్ళిపోయింది. ఒక గుర్రం సంధ్య ఇంకోటి నేను ఎక్కాం. చాలామందే ప్రయాణం చేస్తున్నారు. క్రమంగా ముగ్గురం వేరే అయిపోయాం.ఇక్కడి నుంచి ఒంటరి ప్రయాణం తప్పలేదు. భయపడకూడదు అనినాకు నేను ధైర్యం చెప్పుకున్నాను. మళ్ళీ ఇటువంటి అవకాశం రాదు. కోరికతీరేవేళ భయపడితే ఎలా అనుకున్నాను. ముందూ వెనకా ఇంతమంది వెళ్తూనే ఉన్నారుగా....ఏమన్నా అయితుందేమో...ఊహూ...ఇంక ఏ ఆలోచనలూ ఒద్దు...అంతే...అన్నీ మర్చిపోయాను. దానికి కారణం చుట్టూఉన్న ఆ అందమైన ప్రక్రుతే...నా గుర్రం తో ఉన్న అబ్బాయి చిన్నవాడు. హుషారుగా ఉన్నాడు. ఏదో భాషలో పాట పాడుతున్నాడు. వినటానికి చాలా బాగుంది. సన్నటి రహదారి. ఒకవైపు చేతికి కొండలు తగులుతున్నాయి. ఇంకోవైపు అగాధం. ఒక్కసారి కొంచెం తలవొంచి కిందకి చూశాను. అమ్మో! అంతపెద్ద లోయ నేనెప్పుడూ చూడలేదు. ఒక్కనిమిషం భయం వేసినా..మరుక్షణమే అన్నీ మరిచిపోయాను. ఆ లోయలో ప్రవహిస్తున్న నది, దూరంగా కనబడుతున్న మంచుపరచుకున్న ఎత్తైన పర్వతాలు, ఆ పర్వతాలమీంచే దోబూచులాడుతూ మెల్లగా కదిలిపోతున్న దూదిపింజాల్లాంటి తెలతెల్లని మబ్బుతెరలు, మబ్బులమధ్య అక్కడక్కడా నీలి ఆకాశం...ఎంత అందంగా ఉందో ప్రక్రుతి. ఇంత తక్కువ ఆకాశమా! అంత ఎక్కువ మబ్బులా! చాలా ఆశ్చర్యం! అంతేకాదు..ఆ తెల్లతెల్లని మబ్బులన్ని సయ్యటలాడుతున్నాయి. నా చేతికి దొరుకుతానంటూ..ఎంతో చేరువలోకి ఒస్తున్నాయి. కాని..మరుక్షణమే దూరమైపోతున్నాయి. మబ్బుల మధ్య నేను తేలిపోతున్నాను...నిజమేనా!!! ఇంకోసారి చేయి చాపాలనుకున్నాను. కాని గుర్రాన్ని ఒదలాలంటే భయం వేసి బిగించి పట్టుకొని అలాగే కూచున్నాను. నాపని "ఊపర్ సే షేర్వాణి, అందర్ సే పరేషానీ..." లాగా ఉంది.
ఎంత చల్లటి వాతావరణం. ఎక్కడా సూర్యభగవానుని జాడేలేదు. మెల్లి మెల్లిగా పైకి పోతున్నాము. కొంచెం కొంచెంగా పైకి పోతున్నా కొద్దీ హిమవన్నగమే ఎక్కుతున్న ఆనందం కలుగుతోంది. కొంచెం సేపు కిందికి దిగాలనిపించింది. పాపం నేనెక్కిన గుర్రం చిన్నపిల్ల. కొన్ని చోట్ల నన్నుమోసుకుంటూ మెట్లు కూడా ఎక్కుతోంది పాపం. కానీ ఎలా దిగాలి! ఆ అబ్బాయే ఒక చిన్న కొండదగ్గిర ఆపి నేను తిగటానికి సహాయం చేసాడు. మెల్లిగా ఆ అబ్బాయి చెప్పే కబుర్లు వింటూ ఇద్దరం నడక సాగించాం. దారిలో ఒక చోట వేడివేడి టీ తాగాం. టీ తాగుతూ అక్కడి పరిసరాలు చూస్తు మైమరచిపోయాను. సన్నటి జల్లు ప్రారంభమైంది. ఆ చల్లటి వాతావరణం లో, ఆ చిరుజల్లులలో....ఇది నిజమేనా! అక్కడ ఉన్నది నేనేనా!!! చిన్నపిల్లలా గిరగిరా తిరుగుతూ వానావానా వల్లప్పా అని ఆడుకోవాలనిపించింది. ఒంటరితనంలో ఇంత ఆనందమా!!!

పాడాలని ఉంది..మాటలే రాని వేళ పాట ఎలా పాడను...
కళ్ళలోన కడలి సాకి...ఎంతసేపు ఆపను...
ఓ గగనాన హత్తుకున్న మేఘమా..నీ దరిని చేరనీ నన్నిలా
నా మది గలగలా ఈ జీవనదిలా
దరహాసమంటి ఈ చిరు చినుకు లా
చేరాలి నను గాలి తరంగంలా
ఓ ప్రియ నేస్తమా! మేఘమా...కదలిపోకు...
స్వప్నమా జారిపోకు....ఈ ఆనందాన్ని నా మూగ మదిలో నింపిపో
నా గుండె గుడిలో దాగిపో
నా కోసం మళ్ళీ వస్తానని మాటిచ్చిపో
ఎందుకంటే నా మనసంతా ఉండిపోయింది నీ చెంతే!!!
అందుకే ఈ దిగులంతా ఓ ప్రియ నేస్తమా...
నా హ్రుదయస్పందన ఇంకా మిగిలే ఉంది....
ఈ ఆహ్లాద ప్రక్రుతిలో లీనమైన నాకు పైకి ఎప్పుడు చేరుకున్నానో తెలియనేలేదు.
నాకంటే ముందే అక్కడ చేరిన నా స్నేహితులను చూచి, మెల్లగా నా ఆలోచనలు జారుకున్నాయి.

అక్కడున్న చిన్నచిన్న దుకాణాల్లో చాలా మందే సేదదీరుతున్నారు. మేమూ అక్కడే వేడివేడి పరాటాలు, ఆలూ కర్రీ తో తిన్నాం. ఎంతో రుచిగా అనిపించింది. అక్కడి నుంచి మెల్లిగా కిందికి దిగుతూ పోతే అందమైన యమునమ్మ స్వాగతం చెపుతూ ఎదురయింది.హిమాలయల్లోంచి సన్నని పాయగ మొదలైన యమున అక్కడ మందగమనంతో వయ్యారంగా వంపులు తిరుగుతూ మలుపుల్లో కలిసిపోతోంది. అది దాటటానికి చిన్న వంతెన. ఆ వంతెన దాటుతుంటె సన్నటి నీటితుంపరలు మీద పన్నీటిని చిలకరిస్తూ పవిత్రభావాన్ని కలిగిస్తున్నాయి. అక్కడే ఒక చిన్నగుడి. ఆ గుడికి చేరటానికి మధ్యలో చిన్న చిన్న కొండలు దాటుకుంటూ పోవాలి. ఆ పక్కనే వేడినీటి కొలను(హాట్ స్ప్రింగ్) ఉంది. అందులో స్నానం చేసి అమ్మవారి దర్శనానికి వెళ్ళాలి. కాని అది నాకిష్టం లేదు. అంతమంది ఆ నీటిలో స్నానం చేస్తుంటే భక్తి ఏమోకాని రోగాలొస్తాయనిపించింది. ఆ వేడివేడి నీటిదగ్గరికి వెళ్ళి కాళ్ళు తడిపాను. గోరువెచ్చటి నీళ్ళే, కాని ఆ నీరు సెగలుపొగలు కక్కుతోంది. మెల్లిగా పక్కకి వెళ్ళాను. అక్కడ ఇంకో చిన్న వేడినీటి కుండం ఉంది. ఆ నీరు మాత్రం మసిలి పోతున్నాయి. మనం కొన్న పూజాద్రవ్యాల్లో చిన్న బియ్యం మూట కూడా ఉంటుంది. ఆ చిన్న మూటని ఆ నీటిలో ముంచితే క్షణాల్లో అన్నం ఉడికిపోతుంది. అది అమ్మవారికి ప్రసాదం పెట్టాలి. అక్కడినుంచి గుళ్ళోకి వెళ్ళాం.

ముఖ్యంగా ఉత్తరభారతదేశంలో దేవాలయాల్లో అమ్మవారి విగ్రహాలు నాకెందుకోగాని నచ్చదు. పాలరాతి విగ్రహానికి, చెమ్కీ బట్టలేసి, విగ్గుతో రెండుజెడలేసి, రబ్బరుబాండ్లు పెట్టి, ప్లాస్టిక్ పూలు పెడతారు. దక్షిణ భారతదేశపు గుళ్ళల్లో ఉండే భక్తిభావం బహుశా నాకందుకే అక్కడ కలగదేమో మరి.అక్కడినుంచి ఒకగంటసేపు చుట్తూతిరుగుదామనుకున్నాము. అంత చల్లటి వాతావరణంలో కూడా నాకు ఆ నీటిలొ నడవాలనిపించింది. లోతు లేదు. నీరు చాలా స్వచ్చంగా, కింద నేల కనిపిస్తూ సనసన్నటి తుంపరలతో సాగిపోతోంది. చిన్న బండలమీంచి వెళ్లి నీటి మధ్యలో కూచున్నాను. కాలు తీసి నీటిలో పెట్టాను. ఆ చల్లదనానికి కాలు జివ్వుమని వెంటనే పక్కకి అడుగేసాను. ఈ సారి కాలు చుర్రుమంది. నాకు ఒక పక్క గడ్డకట్టే చల్లటి నీరు, ఇంకోవైపు వేడినీరు. గమ్మత్తుగా ఉంది. ఒకేసారి రెండుకాళ్ళు రెండువైపులా పెట్టాను. కాని అదే స్పీడ్ తో నా కాళ్ళు తిరుగు టపాలో పైకొచ్చేసాయి. ఇంక లాభం లేదని నీటి అంచులకి పైపైన కాళ్ళు తాటిస్తూ కూచున్నాను.

ఎంతో అందమైన పాట...యమునా తీరమున ...సంధ్యా సమయమునా..వేయికనులతో రాధా వేచియున్నది కాదా!!! అని పాడుకున్నాను. నిజంగా నా కోసం ఆ నల్లనయ్య ఒస్తే బాగుండు.
ఓ కన్నయ్యా! నా దగ్గరికి రావా!!
చిరునవ్వుల పూలవాన కురిపించవా
కమ్మటి కలలు అందించవా
బ్రతుకు అనే పయనంలో పడిపోయిన నన్ను
నీ ప్రేమ బంధంలో ఓలలాడించవా
ప్రక్రుతినే ఆహ్లాదపరిచే, సర్వ కాలాల్లోను చిగుళ్ళు తొడిగే
రాగడోలికల్లొ ఊగించే ఈ మధురస్మ్రుతిని నాకు కలకాలం నిలుపు.

ఒక్క క్షణం ప్రేమిస్తావా,
చితినుండి లేచి వస్తాను...
మరుజన్మకు మనసిస్తావా,
ఈ క్షణమే మరణిస్తాను....
నా హృదయమంతా నీ జ్ఞాపకాలే....

వెంటనే ఒక మెరుపు మెరుస్తూ చెప్పింది. ఉండేది క్షణమైనా ఉజ్వలంగా ఉండమని
ఆ పక్కనే ఒక ఆకు రాలుతూ చెప్పింది ఈ జీవితం శాశ్వతం కాదని
ఈ పక్క ఒక పువ్వు వికసిస్తూ చెప్పింది, జీవించేది ఒకరోజైనా గౌరవంగా జీవించమని
ఇక్కడి యమునమ్మ జలజల పారుతూ చెప్పింది, తనలాగే కష్టసుఖాల్లో చలించకుండా సాగిపొమ్మని.

ఇప్పుడు నాకర్ధమైంది...ఎందుకింతగా ఈ యమునోత్రి యాత్ర నన్నాకర్షించిందో!!!
అద్భుతం ....మహాద్భుతం....

**********************************************************

7 కామెంట్‌లు:

SRRao చెప్పారు...

జయ గారూ !
అందమైన ఆ లోయలు, ధవళ కాంతులతో వెలిగిపోతున్న ఆ హిమన్నగాలూ, పరవశించిపోతున్న మీ కవితాగానం.... ఓహ్(......! మమ్మల్ని కూడా ఉత్తరాంచల్ యాత్ర చేయించేశారు కదా ! నిన్న ' అన్వేషి ' కమల్ గారి అద్భుత కథనాలు చదివాను. మళ్ళీ ఈ రోజు మీరు. మహాదానందమై పోయింది. ధన్యవాదాలు.

తృష్ణ చెప్పారు...

మీ టపాతోనే నయనానందం కలిగించారు. చాలా బాగుంది post...మేము చిన్నప్పుడు ఢిల్లీ ట్రిప్ కు వెళ్ళినప్పుడు ఆగ్రాలో తాజ్మహల్ వెనకాల యమునా తీరాన్ని చూసే భాగ్యం దక్కింది...హరిద్వార్,ఋషీకేష్, మథుర(శ్రీకృష్ణ జన్మస్థలం)..మొదలైనవన్నీ అప్పుడు చూసాం. మీరు రాసిన ప్రదేశాలన్నీ కూడా చూడాలని కోరిక..ఎప్పటికో మరి..!!

హను చెప్పారు...

మీ టపా చాలా బాగుంది. nijamga chala baga establish chesaru.

శేఖర్ పెద్దగోపు చెప్పారు...

యమునా తీరానికి మమ్మల్ని కూడా మీతో పాటు తీసుకుపోయారు...ఫోటోలు ఇంకొంచెం ఎక్కువగా పెట్టాల్సిందండి...ఇంతకూ ఈ వేసవి సెలవులకు ఎక్కడికి ప్లాన్ చేసుకున్నారు?

శిశిర చెప్పారు...

చాలా బాగుదండి మీ వర్ణన. నాకు ఈ యాత్ర గురించే కదా చెప్పారు. శేఖర్ గారు, ఈసారి జయగారు కోనసీమ టూర్ ప్లాన్ చేస్తున్నారనుకుంటా. అవునా జయగారు. :)

జయ చెప్పారు...

రావ్ గారు థాంక్స్ అండీ. అన్వేషి గారి బ్లాగ్ చూసాను. బాగుందండి.

తృష్ణా థాంక్యూ. అవన్నీ కూడా ఒకదాన్ని మించి ఒకటి చాలా అందమైన ప్రాంతాలు. ప్రతిఒక్కళ్ళూ తప్పని సరిగా ఒక్క సారైనా చూడాలి అనుకుంటారు. తొందరొద్దులే. పిల్లలిద్దరూ స్కూల్లో చేరి హాలిడేస్ ఇచ్చినప్పుడు పోవచ్చు:)


హను గారు ధన్యవాదాలండి.

జయ చెప్పారు...

హాయ్ శేఖర్ గారు, థాంక్యూ. ఇవన్నీ గూగులమ్మ దగ్గర ఎత్తుకొచ్చిన ఫొటోలండి. ఎన్ని పెట్టినా ఒకటే. నా కామెరా ఋషీకేష్ లో నేను యమునమ్మ దగ్గరికి పోతున్నానని, గంగమ్మ గుంజేసుకుందండి:) ఇంక ఈ హాలిడేస్ లో అంటారా... రెండురోజులు అడవులు పట్టుకొని పోదామనుకుంటున్నాను అంతే.


హాయ్ శిశిరా, హౌ ఆర్ యూ! అవును ఈ యాత్ర గురించే చెప్పాను. నన్ను కోనసీమకు శిశిరనే తీసుకెళ్ళాలి మరి:)

 

మనస్వి © 2008. Template Design By: SkinCorner