15, ఆగస్టు 2010, ఆదివారం
జగతి శిగలో జాబిలమ్మకు వందనం
జగతి శిగలో జాబిలమ్మకు వందనం......
మమతలెరిగిన మాతృ భూమికి వందనం...
"ఐ లవ్ మై ఇండియా"...ఈ పదాలు పలుకుతుంటేనే మనసు ఎంత పులకరించిపోతుందో...శరీరం మీద రోమాలు నిక్కబొడుచుకుంటాయి...
స్కూల్ లోని ఆ జ్ఞాపకాలు ఇటువంటి రోజుల్లో ఇంకా, ఇంకా తలచిన కొద్దీ గిలిగింతలు పెడుతూనే ఉంటాయి.
గుర్తుకొస్తున్నాయి...అంటూ ముందుకు తోసుకొస్తాయి.ఆగస్ట్ పదిహేను వస్తోంది అంటే ఎంత హడావుడి..ఎంతసంబరం...
ఎప్పుడూ వేసుకొనే వైట్ డ్రెస్సే అయినా...ఇంకా ఎంతో ప్రత్యేకంగా ఉతికించి, తెల్లగా ధగధగ లాడుతోందో లేదో అన్ని కోణాల్లోంచి పరిశీలించి చూస్తే తప్ప తృప్తే కలిగేది కాదు.
తెల్లటి కాన్వాష్ షూష్, సాక్స్ ని కూడా మళ్ళీ మళ్ళీ కళ్ళు జిఘేల్ మనేలా ఉన్నాయోలేదో ఒకటికి పదిసార్లు చూసుకోవాల్సిందే కదా...
నల్లటి రిబ్బన్లు తెల్లగా ఉతుక్కోని అవి మాత్రం నేనే ఇస్త్రీ చేసుకోని చక్కగా మడతపెట్టుకొంటే ఎంతో పనిచేసిన ఆనందం:)
చక్కగా తయారైపోయి, డ్రెస్ కి జెండా పెట్టుకోని...ఓహ్..ఎదో మహా ప్రపంచాన్నే గెలిచేశామన్న ఆ గర్వం ఎప్పటికీ మరువలేనిదేకదా...
పాఠశాల లోని జెండా వందనం, పెరేడ్ ఎంత గొప్పగా అనిపించేవో....ఎంతటి ఉద్వేగం...ఎంత ఉత్తేజం..
స్టేజ్ మీద దేశభక్తి గీతం పాడుతూ, చేతిలో పెద్ద పెద్ద జెండాలు ఊపుతూఉంటే...ఎవరెస్ట్ శిఖరం ఎక్కినంత ఆ పరవశం ఎప్పటికైనా తీరేదా...
చేతినిండా రకరకాల పూలతో అమరవీరులకు వందనం అర్పిస్తుంటే, భరతభూమి వన్నెచిన్నెల సోయగాలన్నీ తలపుకొచ్చేవి కాదా....
పొరపాటున, ఏదైనా బహుమతి వచ్చిందంటే, కాశ్మీరం నుంచి కన్యాకుమారి దాకా ఊరేగిన సంబరమే....
తెలిసీతెలియని ఆ మైమరపే నిజమైన ఆనందం అనిపిస్తుంది. ఆ అమాయకత్వంలోనే ఈ దేశభక్తి, తల్లిమీద ప్రేమ లాగా స్థిరపడుతుంది. ఈ నాడు కలిగే భావాలను ఎప్పటికీ కొనసాగించగలగాలి.
పెరిగి పెద్దైనా కొద్దీ ఆ సంబరాల ముచ్చట్లు ఏవి? ఉన్నత విద్యా స్థాయిలో ఇది ఒక శలవు దినం మాత్రమే.....ఇంక రీసెర్చ్ చేసినంత కాలం అసలే సంబంధం లేకుండా.. ఆరోజున ఎక్కడ ఉంటామో..ఏ పని పూర్తి కాలేదన్న టెన్షన్ లో ఉంటామో....మామూలు రోజులకి ఆ రోజుకీ తేడా తెలియకుండానే గడచిపోయేది.
కాని...ఇప్పుడో..అలా లేదు. చిన్నప్పటి ఆ ఉత్సాహం తిరిగి మొలకలు వేస్తోంది. ఈనాటి..ఈ చిన్నారి విద్యార్ధులను చూస్తుంటే.....గుర్తుకొచ్చే బాధ్యత ఎంతో మహోన్నతంగా కనిపిస్తుంది. వీరికి ప్రగతిమార్గం చూపించాలి అని గుండెలోతుల్లోంచి పొంగివచ్చే భావాలెన్నో... వాళ్ళ కళ్ళల్లో కనిపించే ఆ ఉద్వేగపు నిర్ణయాలు...వారి భవిష్యత్తుకి నేను వేసే పునాదులని గుర్తు చేస్తున్నాయి. వీరిమీదే ఆధారపడిన దేశభవిష్యత్తుకి వీరికొక స్పూర్తిని కలిగించాలి. వీరి భావాలను గౌరవించి... మనోధైర్యాన్ని పెంచాలి ...తప్పదు... మళ్ళీ మళ్ళీ జరుపుకునే ఈ పండుగ, వారికి దేశభక్తిని పెంచి మాతృభూమి పట్ల విపరీతమైన అభిమానాని పెంచుతోంది. అందుకు ఉదాహరణే ఈరోజు వారాలాపించిన ఈ గీతం.
ఏదేశమేగినా, ఎందు కాలిడినా
పొగడరా నీ తల్లి భూమి భారతిని
నిలుపరా నీ జాతి నిండు గౌరవము.......
ఎన్ని విప్లవాలు వచ్చినా...సమస్యలు ఏర్పడినా....కష్టాలు నష్టాలు కలిగినా...ఎన్ని మార్పులొచ్చినా సరే, ఈ సంబరాలను మరచిపోవాల్సిన అవసరమే లేదు. ఈ విజయగీతిక ఆలాపనే వచ్చే తరాలవారి బాధ్యతను కూడా కొనసాగిస్తుంది. మనమే కాదనుకుంటే ...ఆ వీరుల త్యాగఫలానికి అర్ధమేలేదు. ఏం సాధించాం...అని కనుక అడిగినట్లైతే..ఆ ప్రశ్న మనకే వర్తిస్తుంది. అభివృద్ధే లేదని మనస్పూర్తిగా ఎవరైనా చెప్పగలరా? పెరిగిన అరాచకాలకి ఎవరు బాధ్యులు? స్వాతంత్ర్యసంబరాలకి దీనికి ఏమిటి సంబంధం? ఇంత పెద్ద ప్రజాస్వామ్య దేశంలో బాధ్యతలు విస్మరించి స్వార్ధం పెరిగితే ఎవరిది నేరం. పాపప్రక్షాళణకు ప్రయత్నాలు జరగాలి గాని, ఈ పండగలవల్ల లాభం ఏంటి...అంటే అది మూర్ఖత్వం కాదా? అరబిందుని, వివేకానందుని బోధనలు కలకాలం నెమరువేసుకోవాల్సిందే.... ఎన్నో ఇతర పండుగలు, వేల రూపాయలు ఖర్చు పెట్టి జరుపుకుంటూనే ఉన్నముగా? వాటి పరమార్ధం ఏం సాధిస్తున్నాం? ఎప్పుడో కొద్దిగా దేశభక్తిని ప్రేరేపించే ఇటువంటి చిన్న పండుగలతో వచ్చే నష్టమేమిటి? ప్రపంచంలో అన్ని దేశాలలో ఇంతకంటే ఘోరమైన విపత్తులే సంభవిస్తున్నాయి. వారికి దేశభక్తి లేదా? స్వాతంత్ర్యదినోత్సవాలు జరుపుకోటం లేదా? తనకంటే ఎంతో చిన్న దేశమైన ఇంగ్లాండ్ సంకెళ్ళనుంచి విడిపోయిన అమెరికా స్వాతంత్ర్యదినోత్సవం ఇంకా ఎంతో గర్వంగా జరుపుకుంటూనే ఉంది. ఏం... వారికి ఏ సమస్యలూ లేవా?
మంచి దేశం నిర్మించాలి అంటే ముందు మంచి పౌరులను తయారుచేయాలి....
భారతీయ సంస్కృతిని ప్రపంచమే గౌరవిస్తున్న ఈ రోజుల్లో...మనలోనే ఎన్నో వ్యతిరేక భావాలను వింటున్న నాకు ఇలా రాయాలనిపించింది.
సంపదలతో సొంపులొసగే భారతీ జయహో...మంగళం.. వందేమాతరం...
ప్రతి ఒక్కరికీ నా హృదయపూర్వక స్వాతంత్ర్యదినోత్సవ శుభాకాంక్షలు.
*******************************************************************
లేబుళ్లు:
అంతర్మధనం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
15 కామెంట్లు:
పంద్రాగస్టు అంటే చిన్నప్పటి జెండాపండుగ సంబరాలే గుర్తొస్తాయండి. నేను ఒక టపా రాద్దామనుకున్నాను. కుదరలేదు. మీరు చెప్పిన ముచ్చట్లే నావీనూ. బహుశా అందరి చిన్నప్పటి జెండాపండుగా అలాగే ఉంటుందేమో. ఎందుకు జరుపుకోవాలీ అనేవారికి మీ జవాబు బాగుంది. మీకు కూడా స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు.
ये दुनिया एक दुल्हन
ये माथेकी बिंदिया
ये मेरा इंडिया
I Love my India
స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు జయ గారు.
స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు జయ గారు.
హాయ్ జయ గారూ నా సరిగమలు...గలగలలు బ్లాగ్ లో కామెంట్ ఇచ్చారు థాంక్సండీ...
కానీ మీరు ఆ కామెంట్ లో త్రుష్న అని సంబోధించారు..
సరిగమలు..గలగలలు బ్లాగ్ కూడా నాదే...
రాజి.(నా చిన్నిప్రపంచం)
జయ గారూ !
చాలా విరామం తర్వాత టపా రాసారు. సంతోషం. మీకు కూడా 64 వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు.
స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు జయ గారు.
చాలా బాగా రాసారు. మీ టపా చదివితే చిన్నప్పటి స్వాతంత్ర్య దినోత్సవవేడుకలు గుర్తొచ్చాయి.
నా కలభాషిణి లో కామెంట్ ఇచ్చినందుకు థాంక్సండీ..
మిగిలిన టపాలు కూడా వీలుచూసుకొని చదివి మీ అభిప్రాయం తెలపండి.
చాలా చాలా చక్కగా రాశారు. మీరు ఒక ఉపాధ్యాయిని కనుక ఇలా ఆలోచించ గలిగారు. స్వయంగా అనుభవించి రాశారు. నేడు ఏదో ఒకటి రాయాలి కనుక అందరికంటే కొత్తగా రాద్దామని ఏదో ఏదేదో రాశే వారికి ఒక చెప్పు దెబ్బలా ఉంది. కొత్తదనం ఉంటే ఫర్వాలేదు, కానీ వెర్రితలలు వేయకూడదు మన ఆలోచనలు. మన జాతీయ పండగ చేసుకోవడమే దండగ అనడమేమిటి? ఇంతకంటే ఘనంగా, చేతనైన నాలుగు మంచి పనిలు చేసి ఇంతకంటే గర్వంగా చేసుకోవాలని ఉవ్విళూరాలి గానీ..
మీ అనుమతి లేకుండా నా google buzz లో ఈ టాపా లింక్ పెడుతున్నాను మన్నించండి.
@శిశిరా, మీరు ఉదహరించిన పాట చాలా బాగుంటుంది. నాకెంతిష్టమో!!!ఇప్పటికిప్పుడూ ఆ పాటే వింటున్నాను మరి. మీరు ఎంతో బాగా రాస్తారు. రాసిఉండాల్సింది. చదివిపెట్టే వాళ్ళం కదా.
@ అశోక్ పాపాయ్ గారూ, మీకు కూడా స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు.
@హాయ్ రాజీ, మీ ఇద్దరి టేంప్లేట్స్ ఒక్కటే పెట్టుకున్నారు. మరి నా లాంటి వాళ్ళను కొంచెం గుర్తు పెట్టుకోవచ్చు కదా:) అందుకే మరి కొంచెం మకతిక పడ్డాను. అయినా నాకు చాలా ఇస్ఠమైన పాట, మీరే వ్రాసారు....కాబట్టి ఆ అభినందనలు మీకే. చాలా మంచి పాటలు మీ బ్లాగ్ లో చూసాను. ఇన్నాళ్ళు చాలా మిస్ అయ్యాను అని ఇప్పుడు నాకు అర్ధమయ్యింది. థాంక్యూ. ఈపాటికి అలకపానుపు ఎత్తి గోడకి పెట్టేసుంటార్లే.
@ రావ్ గారు మీకు కూడా శుభాకాంక్షలండి. ఏదో ఒకటి రాస్తూనే ఉన్నానండి. బహుశ: గమనించి ఉండరు. థాంక్యూ.
@ హాయ్ శివానీ, మళ్ళీ టపా ఎప్పుడు. కడుపారా నవ్వుకోవాలని చాలా ఎదురు చూస్తున్నాను. ఎన్నో..ఎన్నెన్నో... శుభాకాంక్షలతో...
@కలభాషిణి రాధ గారు మీ బ్లాగ్ ఈ మధ్యే చూసాను. ఇంకా చూస్తూనే ఉన్నాను. చాలా బాగుంది. ఇంకా ఇంకా చాలా మంచి మంచి టపాలు వస్తాయని నా నమ్మకం. మీకు కూడా కావలసినన్ని శుభాకాంక్షలు.
@ విశ్వ ప్రేమికుడు గారు...విశ్వమంతా మీదే అని చెప్పి అస్సలు కనిపించక పోతే ఎలా? ధన్యవాదాలు. నేనేదో నా బ్లాగే కదా అని రాసేసుకుంటే, మీరేమొ ఏదో గూగులమ్మ బజార్లో పెడతామంటున్నారు. అదేంటో నాకు తెలీదు కాని, ఎవరైనా ఏమైనా అంటే మాత్రం మీ పేరే చెప్తాను.
మంచి పాటని గుర్తు చేశారండీ.. ప్రతిసంవత్సరం జెండా పండుగలో వినిపించే పాట...
థాంక్యూ మురళిగారు. ఈ పాట ఇష్టపడని వారెవరండి.....
enta chakkaga raasaru. inta kanna cheppadam kastam mii post chustu. chala bavundi. vishaya parigyanam kuda nachindi.
krsna గారు థాంక్యూ. మీ గురించి వ్రాసుకున్న పరిచయ వాక్యాలు ఎంతో బాగున్నాయి.
కామెంట్‌ను పోస్ట్ చేయండి