20, నవంబర్ 2010, శనివారం

"పంతులమ్మల డే అవుట్"



ఇవేనండి...మా వంటలూ...వనభోజనాలూ... మరి మీ అందరు వస్తారా మాతో........



చాలా రోజులయింది. హాయిగా కబుర్లు చెప్పుకొని. అందరం తీరిక లేకుండా అయిపోయాం. ఏమన్నా ప్రోగ్రాం వేయండి, కాస్త అలా తిరిగేసి వద్దాం అన్నారు మా ప్రిన్సిపల్ మేడం. ఇంకేం దొరికిందే ఛాన్స్. వదలకూడదనుకొని అందరం ప్లానింగ్ మొదలుపెట్టాం. అక్కడున్న పదిమంది పది ప్రోగ్రాంస్ పెట్టారు.పొద్దున్న పోయి సాయంత్రానికి ఒచ్చేయొచ్చు, సిటీ లో గోల్కొండా ఫోర్ట్, మ్యూజియం చూసొచ్చేద్దాం అన్నారు ప్రిన్సిపల్. అబ్బా!!!అనుకొని అందరం ఒకరి మొఖాలు ఒకరం చూసుకున్నాం. కొందరికైతే బిక్కమొహాలే పడ్డాయి. ఎలా? ఏం చేయాలి?

కార్తీక మాసం కదా, హాయిగా మనకి దగ్గిరలోనే ఉన్న అనంతగిరి అడువుల్లో తిరిగొద్దాం. చక్కగా వనభోజనాలు కూడా చేసుకోవచ్చు. సైట్ సీయింగ్ బాగుంటుంది. చక్కటి పురాతన గుడి కూడా ఉంది. అక్కడే మా ఫాం హౌజ్ కి వెల్దాం అంది మా వంశీ. గుడి అనంగానే మా ప్రిన్సిపల్ వెంటనే ఒప్పేసుకొని, సరే అందర్నీ కనుక్కోండర్రా ఎవరెవరొస్తారో, మొత్తం ప్లాన్ చేయండి అన్నారు. హమ్మయ్యా, భలే ఒప్పించావ్, లేకపోతే అందరం ఆ సాలార్జంగ్ మ్యూజియం చుట్టూ తిరిగేవాళ్ళం అని వంశీ ని పొగిడేసి తెగ సంబరపడిపోయాం. మిగతా విషయాలేవీ మాకు సమస్యకాదు కాబట్టి వెంటనే ఏర్పాట్లన్నీ జరిగిపోయాయి. వర్కింగ్ డే పోనివ్వరు కనుక, సెకండ్ సాటర్ డే ప్లాన్ చేసుకున్నాం.

పొద్దున్నే ఆరు గంటల కల్లా బయలు దేరాలి. అందుకని మా హాస్టల్ లోనే పులిహోర, దద్దోజనం, పూరీ కూర లంచ్ గా తయారుచేయించుకొని వెళ్ళాలనుకున్నాం. రకరకాల తినుబండారాలెలాగూ తీసుకెల్తాం. చాల్లే అనుకున్నాం.

పొద్దున్నే అందరం కాలేజ్ దగ్గరికి చేరుకున్నాం. మా వెహికల్ కూడా వచ్చేసింది. ఎవ్వరూ ఆలస్యం చేయలేదు. అహా, సాగింది ప్రజా రధం అని పాడటం మొదలు పెట్టారు. పదండి ముందుకు..పడండి ముందుకు..పద పద తోసుకు పదండి అని ఇష్టమొచ్చినట్లు కేకలు పాటలు. ఎన్ని రోజులయిందో ఇలా ఎంజాయ్ చేసి అనుకున్నాం. అదేంటర్రా...వెంకటరమణా గోవిందా..గోవిందా అనాలి అన్నారు మా ప్రిన్సిపల్. అలా అంటే గోవిందా అయితామేమో అని నవ్వుకున్నాం. అంత పొద్దున్నే ఖాళీ రోడ్ల మీద అలా పోతూఉంటే ఎంతో ప్రశాంతంగా అనిపించింది. మెల్లిగా ఊరి పొలిమేరలు కూడా దాటేసాం. ఆ సమయంలో రష్ లేని హైద్రాబాద్ చాలా అందంగా కనిపించింది.

మా అంత్యాక్షరీకి, అల్లరికీ అడ్డే లేకుండా ప్రయాణం కొనసాగింది. ఒక గంట తరువాత దారిలో కనిపించిన ధాభా దగ్గిర ఆగాం. అందరూ చాయ్..చాయ్ అని గొడవ పెట్టేసారు మరి. హాయిగా ఆ చుట్టుపక్కలే ఉన్న ప్రాంతాల్లో చెట్ల మధ్య తిరుగూతూనే టీ తాగాం. అక్కడ చుట్టూ చింత చెట్లు నిండా కాయలతో ఉన్నాయ్. ఆ కాయలన్నీ చింతపండుగా కూడా అయిపోయినై. అయినా సరే అందరం ఆ "చింతపండు కాయ" లే కోసుకొని పరమానందంగా చప్పరించాం. ఆహా! చెట్టుమీద చింతపండు ఎంత రుచో. ఇదీ నాచురల్ పూడ్ అంటే, మన వన భోజనాలు ఇంక మొదలైనట్లే అని సంబరపడిపోయాం.

మెల్లిగా అనంతగిరి అడువులకు చేరుకున్నాం. చిక్కటి ఆ అడువుల్లో పోతూ ఉంటే ఏదో దివ్యలోకాలకు వెళ్తున్న అనుభూతే కలిగింది. సుదూరంగా వ్యాపించిన పచ్చని గడ్డి బయలు, రెల్లు పొదలు, బూరుగు చెట్ల చిటారు కొమ్మల మీద నుంచి జారిపోతున్న బంగారు కాంతులీనే ఆ నీరెండ...పైన నీలాకాశం ఎంతోదూరం...చాలా దూరం వరకూ అంతే నీలాకాశం...ఒఠ్ఠి నీలం....పులులో చిరుతలో తిరుపతిలో లాగా ఇక్కడ కూడా తిరుగుతూ మాకడ్డమొచ్చేస్తే ఎలా అని ఒక నిముషం భయమేసింది. పులిలాంటిదేదో కనిపించింది కూడా. కాని మెల్లిగా అది కుక్క ఆకారంలో బయటపడింది:)

ముచుకుందా నది ఇక్కడే పుట్టిందట. అదే మూసీ నదిగా మారింది.ఈ అనంత గిరికి మార్కండేయ క్షేత్రమని, దామ సరోవరమని పేరట. ఇక్కడే మార్కండేయుడు తపస్సు చేసి అనంతపద్మనాభస్వామి ని సాక్షాత్కరింపచేసుకున్నాడట. అలాగే గంగా దేవిని కూడా ఇక్కడికి రప్పించుకున్నాడట. ఆ పేరుమీద సరోవరం ఏర్పడింది.

ఇక్కడి ప్రకృతికి, వాతావరణానికి ఆనందపడి, అక్కడ మృగాలు స్వేచ్చగా తిరగటం గమనించి నిజాం ప్రభువులు ఇక్కడికే వేటకొచ్చేవారట. ఇక్కడ దొరికే పచ్చటి గరిక తోటే తమ గుర్రాలని మేపేవారు. ఇక్కడ దొరికిన సాలగ్రామాలను చూసి, అనంతపద్మనాభ దేవాలయాన్ని నిర్మించారు. అది మాత్రం విచిత్రమే. ఆ తర్వాతనే ఎంతో మంది హిందువులు ఈ దేవాలయాన్ని దర్శించటంతో ఈ స్థలం ప్రసిద్ధిగాంచింది. ఇక్కడి స్థల పురాణం కూడా చాలా గొప్పగానే చెప్తారు. ఈ దేవాలయాన్నే మేము దర్శించుకొంది.

ఈ చుట్టు పక్కల ఎంత బాగుందో. ఈ గుడి నిర్మాణం కూడా మహ్మదీయ సాంప్రదాయాన్నే చూపిస్తోంది. కొంచెంలోయలోకి ఉన్న ఈ గుడి ని పైనుంచి చూస్తుంటే ఎంతో ఎత్తుకు పెరిగిన ఈ చెట్ల గుబురులే ఎండా వాన నుంచి ఈ గుడిని కాపాడుతున్నాయా అనిపిస్తుంది. ఈ గుళ్ళో పెళ్ళి చేసుకుంటే ఎటువంటి కష్టాలు కలగవంట. (పెళ్ళికూతురికి మాత్రమే ఇది వర్తిస్తుంది). ఎలా వాడుకలోకొచ్చిందో నాకు మాత్రం తెలీదు. కాబట్టి పెళ్ళి కాని అమ్మాయిలూ కొంచెం ఈ సంగతేంటో ఆలోచించండి. అసలు సంగతి అబ్బాయిలకి మాత్రం తెలియనియ్యకండేం. మేము వెళ్ళేటప్పటికే అక్కడ ఒక పెళ్ళి జరుగుతోంది.

ఈ గుడే లోయలోకి ఉందనుకుంటే, అక్కడినుంచి ఇంకా లోయలోకి మెట్లు, కాలి బాట ఉన్నాయి. సరోవరం అక్కడుందన్నమాట. ఈ నడక మాత్రం చాలా ఆహ్లాదాన్ని కలిగించింది. అవధుల్లేని ఆకాశంలో పరుచుకుంటున్న మేఘాల్ని అందుకోటానికి పైపైకి పాకి పోతున్నఆ పచ్చటి చెట్ల తోరణాలు ఎంత బాగున్నాయో. నేల మీద రాలిన వన్నెచిన్నెల పూలు కొత్త కొత్త రంగవల్లుల డిజైన్ల లా ఉన్నాయి. అక్కడే కూర్చుని కాపీ చేసుకుందా మనిపించింది. కాని, ఆ అల్లిక జిగిబిగి నా తరమయ్యేనా! 'ఎవరు నేర్పేరమ్మ ఈ కొమ్మకూ...పువులిమ్మనీ రెమ్మ రెమ్మకూ...ఎంత తొందరలే హరి సేవకూ...పొద్దు పొడవక ముందే పువులిమ్మనీ' అని మనసు లోనుంచి బయటకొచ్చింది ఈ అందమైన అనుభూతి. అసలు అలంకరణ అనే కళ ప్రకృతి దగ్గిరే మనం నేర్చుకోవాలి. పరలోకమంటే ఇదే! అక్కడి దాకా వెళ్ళిన వాళ్ళం కొంత మందిమే:)

అప్పటికే మధ్యాహ్నం అయిపోయింది. అందరి కడుపుల్లో ఎలుకలు కాదు...కాదు...గుర్రాలు..ఏనుగులు పెరేడ్ చేయటం మొదలుపెట్టాయి. బహుశ: అడువుల్లో ఉన్నందుకు ఇలా ఉందా అనిపించింది కాని, తొందరలోనే మాకర్ధమయ్యింది...ఆ జంతువుల్ని బయటకు తోలేయాల్సిన అవసరమేర్పడిందని.

పరిగి లో ఉన్న ఫామ్ హౌజ్ కెళ్ళి అక్కడి పొలాల్లో భోంచేద్దామనుకున్నాం. అక్కడి నుంచి మళ్ళీ ఓ అరగంట ప్రయాణం సాగించాం. ఈ పయనం అమేయం..అద్భుతం. దారంతా పచ్చటి పసుపు తోటలు. గాలి తెమ్మరలో తేలి వస్తున్న ఆ పసుపు లేలేత సువాసనలు ఇన్నాళ్ళ మా కాలుష్యాని పూర్తిగా వదిలించేసింది. దూరంగా కనిపిస్తున్న టేకు చెట్లు, వాటి మీద పరుచుకున్న తెల్లటి పూలు అంబరమంటిన హృదయాలను తలపించాయి. అంతేనా, కాలీ ప్లవర్, కాబేజ్ తోటలు నేల మీద పరచిన కొత్తరకం తివాచీలను చూపిస్తున్నాయి. ఇంక జొన్న చేలైతే పిల్లగాలులకు తలలూపుతూ మమ్మల్ని ఎంత ఆనందంగా ఆహ్వానించాయో చెప్పలేను. దారిలో కనిపించిన సన్నటి నీటి వాగు గలగల లాడుతూ స్వచ్చమైన నీటితో హొయలు ఒలకబోస్తూ సన్నటి రాగాలు తీసుకుంటూ మమ్మల్ని కూడా తనతో రమ్మని ఎంతగా పిలిచిందో!!!అక్కడే మత్తు గొలిపే మొగలి పొదలు ఆవరించుకొని ఉన్నాయి. హత్తుకునే చల్లని గాలి,ఆ పూల పరిమళంతో చేరి పరవశింప చేస్తున్నాయి. ఆ సౌందర్యపు అనుభూతే తప్ప, నేను అన్న ఉనికి పూర్తిగా మాయమైంది.

ఇన్ని ఆనందాలతో కొనసాగిన మా ప్రయాణం మాకే తెలియకుండా ఎంత తొందరగా గమ్యం చేర్చిందో. పొలాల మధ్య ఒంటరిగా ఉన్న ఆ ఫామ్ హౌజ్, చుట్టూ ఉన్న రక రకాల పూల తోటలు, కూరగాయ మొక్కలు అనేక రకాల పండ్ల చెట్లు ఏ చిత్ర కారుడూ చిత్రిం చలేని గొప్ప చిత్రాలనే మాకు చూపించాయి. చుట్టూ ఉన్న పొలాలు మమ్మల్ని చూసి సన్నగా తలలూపాయి. రండి..రండి అన్నాయి. గడ్డి పూలు కూడా అందంగా విచ్చుకొని నీటి తుంపరల ముసుగులో ఆకర్షిస్తున్నాయి. ఆకాశపుటంచున ఒక సన్నని మెరుపు మెరిసి, ఒక్క క్షణంలో ఇంద్రధనుస్సులోని రంగులన్నీ అక్కడ ఆరబోసింది. అప్పుడే మొదలైన సన్నటి వర్షపు వెండిపోగులు మమ్మల్నివానా వానా వల్లప్ప ఆడుకునేట్లు చేసాయి. తుమ్మచెట్లు తలలూపుతూ పూలను నీటిలో రాలుస్తున్నాయి. పిల్ల తెమ్మరలు పరవశింప జేస్తున్నాయి. అలా ఆడుకుంటూ పాడుకుంటూ తిన్న మా పులిహోర, దద్దోజనమే మాకు పంచభక్ష పరమాన్నాలు. అవే మా కార్తీక వన భోజనాలు.

విరిసిన ప్రతి పువ్వూ అమాయకంగా చేతులు చాచి మరీ మమ్మల్ని వెనక్కి పిలిచాయి...."అప్పుడే వెళ్ళిపోతారా, మీ లోకానికి"......




************************************************************************************

21 కామెంట్‌లు:

లక్ష్మీదేవి / लक्ष्मीदेवी చెప్పారు...

భలేగా ఉన్నాయండీ మీ అడవిప్రయాణపు కబుర్లు.

మురళి చెప్పారు...

చాలా బాగా రాశారు.. మీ అనుభూతి అంతా అక్షరాల్లో పరుచుకుంది..

Padmarpita చెప్పారు...

భలేగా ఎంజాయ్ చేసారుకదా!:)

మధురవాణి చెప్పారు...

అబ్బ.. ఎంత బాగా చెప్పారండీ మీ ప్రయాణపు అనుభూతిని. మమ్మల్ని కూడా కాసేపు ఆ అందమైన ప్రకృతిలో విహరించేలా చేశారు. :)

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

జయ గారూ మీ కార్తీకవనభోజనాలు చాలా బాగున్నాయండీ..

శిశిర చెప్పారు...

మీ అక్కచెల్లెళ్ళిద్దరూ ఇలా వర్ణించేస్తుంటే చదువుతున్న మేమేమయిపోవాలి? ఇప్పుడే మాలగారి టపా చదివి కామెంటి వస్తున్నా. ఈ అనుభూతులన్నీ ఇప్పటికిప్పుడు మాకూ కావాలనిపిస్తుంటే ఏంచేయగలం? :) చాలా బాగా వర్ణించారు ప్రకృతినీ, మీ ప్రయాణాన్నీ. మీ ఆనందం అంతా అక్షరాల్లో కనిపించింది.

sunita చెప్పారు...

బాగున్నాయండీ, మీ అడవిప్రయాణపు కబుర్లు.

వేణూశ్రీకాంత్ చెప్పారు...

చాలాబాగా రాశారు జయగారు. మీ ఆనందానుభూతులు ప్రతి అక్షరంలోను కనిపించాయి.

వైదేహి చెప్పారు...

ఈ బ్లాగు దర్శించి మీ అమూల్యమైన అభిప్రాయలు తెలుపగోరుతున్నాను.
www.vidyavydehi.blogspot.com

మాలా కుమార్ చెప్పారు...

మీ అడవి కబుర్లు బాగున్నాయి .

రాధిక(నాని ) చెప్పారు...

మీ ట్రిప్ చాలా బాగుందండి.

చెప్పాలంటే...... చెప్పారు...

చాలా బాగా రాశారు..

ఇందు చెప్పారు...

చాలా అందంగా వర్ణించారండీ....అడవి...ఆ ప్రకృతి...సూపెర్ :)

శ్రీలలిత చెప్పారు...

స్నేహితులతో కలిసి చేసిన మీ వనభోజనాల కబుర్లు చాలా అందంగా వర్ణించారు.

జయ చెప్పారు...

మందాకిని గారు,
మురళి గారు,
పద్మర్పిత గారు,
మధురవాణి గారు,
రాజి
శిశిర,
సునీత గారు,
వేణూ శ్రీకాంత్ గారు,
వైదేహి గారు,
రాధిక గారు,
అక్కా,
మంజు గారు,
శ్రీలలిత గారు,
ఇందు గారు
మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. మీ అందరికీ కార్తీక మాస శుభాకాంక్షలు కూడా.

శివరంజని చెప్పారు...

చూసారా చూసారా జయ గారు ..గార్డెన్ పార్టీకి నన్ను తీసుకెళ్ళలేదు..నేను మీ మీద అలిగా ... కనీసం నేనొచ్చేవరకు కూడా ఆగలేదు .మీరు ..

జయ చెప్పారు...

సారీ, సారీ, సారీ, సారీ, సారీ, సారీ, సారీ అన్నాగా....వెయ్యో సారీ.....శివానీ:) :) :) :) ))))))))....

Hima bindu చెప్పారు...

జయగారు మీతో పాటు ప్రయాణం చేసాను..ఎవరు నేర్పారమ్మ ఈ కొమ్మకు పూలిమ్మని అంటూ పాడుకుంటూ.:-) చాల బాగా రాసారు ...అనంతగిరి కళ్ళముందు సాక్షాత్కారించింది .

జయ చెప్పారు...

ఏమోనండి చిన్నిగారు. అలా చెట్లూ పుట్టలూ పట్టుకు తిరగమంటే నాకస్సలు ఒళ్ళు తెలీదన్నమాట. అయినా దర్జాగా అన్ని ఊర్లు తిరిగేసే మీరే ఈ సారి అన్ని ప్రాంతాల విశేషాలు కూడా రాయలి. ఆ తర్వాత మేము కూడా వీలైనన్ని చూసొస్తామన్నమాట.

తృష్ణ చెప్పారు...

ఈ టపా మొన్నొకరోజు చదివానండి. వ్యాఖ్య రాసేలోగా మా పాప వచ్చేసింది. మళ్ళీ ఇప్పుడు కుదిరింది. చాలా బాగుంది మీ వర్ణన. నేనైతే అక్కడికి వెళ్పోయి, తిరిగేసి, వచ్చేసి మా వారిని తీసుకెళ్ళమని కూడా అడిగాను. ఎప్పటికి వెళ్తామో కానీ నా మనసులో మాత్రం ఓ చోటు చేసేసుకుంది ఈ ప్రదేశం.

జయ చెప్పారు...

తప్పకుండా వెళ్ళిరండి తృష్ణా. కనీసం మనకి దగ్గిరలో ఉన్న ప్రాంతాలకైనా అప్పుడప్పుడు వెళ్ళాలి.

 

మనస్వి © 2008. Template Design By: SkinCorner