5, డిసెంబర్ 2010, ఆదివారం

ఆలస్యం...అమృతం ....




వావ్!!! నేను కూడా ఒక మూవీ ప్రీమియర్ షో కి వెళ్ళానోచ్......ఆ మూవీ......"ఆలస్యం...అమృతం"....

ఎలా అంటారా...అసలీరోజు రేపటి ఫారన్ డెలిగేట్స్ మీట్ అరేంజ్మెంట్స్ కోసం కాలేజ్ కెళ్ళాలి. దారిలో అభినందన భవాని కనిపించారు. చాలారోజులయింది, ఎలా ఉన్నావు, ఏంటి...అని పలకరించి, నేను, ఇంకొంతమంది మన’ అప్నాఘర్’ మెంబర్స్ ఆలస్యం...అమృతం సినిమా స్త్రీలకోసం ఫ్రీ షో అని రామానాయుడు రమ్మన్నారు వెల్తున్నాం....దాని తర్వాత ప్రెస్ మీట్ ఉంటుంది. నువ్వూరా...అన్నారు. ఇలాంటి ఫ్రీ మూవీస్ నేనెప్పుడు చూడ్లేదు...కాలేజ్ పోవాలిగా...మా ప్రిన్సిపల్ గుర్తొచ్చారు. ఇప్పుడు కాదులే అని వెళ్ళబోయాను. ఫర్వాలేదు, మీ ఫ్రెండ్స్ ని కూడా తీసుకొని రా, ఇంకా చాలా టైం ఉందిగా అని వెళ్ళిపోయారు.

నేను కాలేజ్ కెళ్ళానే గాని మనసంతా ఆ సినిమా ధ్యాసే. ఎవరెవరొస్తారో చూడాలని ఆరాటం. తొందరగానే మా పనైపోవటం తో మా ఫ్రెండ్ కి చెప్పి మనం పోదామా అన్నాను. తను అంతకంటే హుషారుగా, మరి చెప్పవేం పోదాం పదా..వాళ్ళందరితో మనకెప్పుడు చాన్స్ వస్తుంది, అట్లా చూస్తే చాలా మజా వస్తుంది పోదాం పా అంది. ఇంకేముంది...ఇద్దరం ఆటో ఎక్కేసాం.... ఇంత వరకు ఆ సినిమా పేరు కూడా వినలేదు. నటీ నటులెవరో కూడా తెలీదు. హీరోయిన్ ఎలాగూ బాంబే అమ్మయేలే అని నవ్వుకున్నాం.

థియేటర్ కి పోగానే మా మహిళా సోదరీమణులందరూ అక్కడే ఉన్నారు. భవాని నన్ను చూసి నాకు తెలుసులే నువ్వొస్తావని, మీరిద్దరే వొచ్చారేంటి...ఇంకెవరూ రాలేదా అన్నారు. ఇవాళ కాలేజ్ కెళ్ళింది మేమిద్దరమేగా మరి అన్నాను:) సరే పదండి పైకి పోదాం అని తీసుకెళ్ళారు. ఐమాక్స్ లో నాకు తెలియని ఇంకో థియేటర్ ఉందని అప్పుడే తెలిసింది. ప్రీమియర్ షోలకి మాత్రమే ఆ థియేటర్ వాడుతారుట. ఇంతా చేస్తే లోపల అంతా లేడీసే, వేరే వాళ్ళెవ్వరూ లేరు. ఓహో..ఇది వుమన్ ఓరియెంటెడ్ మూవీ లా ఉందే అనుకున్నాం. మా అందరికీ పాప్కార్న్ కూడా ఇచ్చారు. అది తింటూ సినిమా చూట్టం మొదలుపెట్టాం.

హీరోయిన్ వైదేహి ఆటోలో రైల్వేస్టేషన్ కి రావటం తో మొదలైన సినిమా చివరివరకూ ఫ్లాట్ ఫాం మీదనే జరిగి పోయింది. ఒకటీ రెండూ పాటలకు మాత్రం వేరే లొకేషన్ లో తీసారు. మొత్తం అయిదు పాటలూ, కోటి సంగీతం లో బాగానే ఉన్నాయి. ఈ సినిమాకి సెట్టింగ్ ల ఖర్చు ఎక్కువలేనట్లే.

తల్లిదండ్రులు సెటిల్ చేసిన పెళ్ళి వద్దంటే తల్లి ఆత్మహత్య చేసుకుంటానన్నదని, తానే ఆత్మ హత్య చేసుకోటానికి అన్నవరం రైల్వే స్టేషన్ కి వస్తుంది. రాబోయే సింహాద్రి ట్రైన్ కింద పడి చనిపోవాలని ఈ అమ్మాయి ఆలోచన. స్టేషన్ లో కూర్చోని తాను చనిపోదలచుకున్నానని ఒక సూసైడ్ నోట్ రాస్తుంది. ఇంతలోనే అది గాలికి ఎగిరిపోతుంది. అక్కడినుంచి స్టేషన్ లో అనేక పాత్రలు పరిచయమౌతాయి. అక్కడి స్టేషన్ మాస్టర్, ఒక చిన్న ఫామిలీ, ఒక దొంగ, ఓ ప్రభువు కుమారుడు, ఇద్దరు జ్యోతిష్కులు, ఒక గ్రూప్ ఫాక్షనిస్ట్ లు, ఇద్దరు సన్యాసులు, అక్కడే ఒదిలేయబడ్డ ఒక చంటి బాబు క్రమంగా మనకి పరిచయమవుతారు.

స్టేషన్ లో వదిలేయబడ్డ ఆ చిన్న బాబును హీరో రాము, వైదేహి కొడుకనుకొని ఆమెకివ్వడానికి ప్రయత్నిస్తాడు. కాని ఆ బాబు ఆమె కొడుకు కాదని తెలుసుకొని ఇద్దరూ ఆ బాబు తల్లి కోసం వెతుకుతూ ఉంటారు. ఈ లోపల ఎగిరిపోయిన వైదేహి సూసైడ్ నోట్ దొరికి సన్యాసులు ఆమెని కాపాడాలని స్టేషన్ లో వెతుకుతూ ఉంటారు. కాని అనుకోకుండా ఆ నోట్ హీరోకి దొరుకుతుంది. అతడు కూడా ఆ అమ్మాయిని కాపాడి ఆత్మహత్య చేసుకోకుండా జీవితం విలువ గురించి చెప్పాలని ప్రయత్నిస్తూ ఉంటాడు ఆ అమ్మాయి కోసం వెతుకుతూ ఉంటాడు. ఆ అమ్మాయి దొరికేవరకూ ట్రైన్ లేట్ కావాలని కోరుకుంటూ ఉంటాడు. ఈ లోపల మిగతా పాత్రలతో హాస్యం పండించటానికి ప్రయత్నించారు దర్శకుడు చంద్ర మహేశ్. మధ్యలో కౌశ తో ఒక అయిటమ్ సాంగ్ కూడా వస్తుంది.

ఈ సినిమాలో కొన్ని సంఘటనలు బాగున్నాయి. స్టేషన్ కి వచ్చిన అనాధ బాలలను ఓదార్చిన విధానం బాగుంది. ఫాక్షనిస్ట్ ల తో హాస్యం కూడా బాగుంది. మధ్య మధ్య లో కొన్ని స్పెషల్ జోకు లొస్తాయి. అవికూడా బాగానే ఉన్నాయి.

ట్రైన్ లేట్ అయినా కొద్దీ కొన్ని సంఘటనలు జరుగుతూనే ఉంటాయి. ఇంతకీ ఆ బాబు ఎవరన్నది కూడా సస్పెన్స్ ని పెంచుతుంది. అన్నట్లు ఆ తల్లి మొదటి నుంచి మన కళ్ళముందే ఉంటుందండోయ్. మరి మీరు కనుక్కో గలరేమో చూడండి. అంతే కాదు, ఇంతకీ ఆత్మహత్య చేసుకోదలచిన అమ్మాయిని రాము కనుక్కొని కాపాడ గలడా! ఆత్నస్థైర్యాన్ని పెంచుకొని జీవితాన్ని సక్రమంగా మలచుకోవాలి గాని ఆత్మహత్య సరిఅయిన విధానం కాదు...అనే మెసేజ్ మీద ఈ సినిమా తీసారు. ఆత్మహత్య వద్దూ అన్న ఈ సినిమాలో ఒక ఆత్మ హత్య కూడా చూపించారు. ఈ సినిమా బాగుందా లేదా అన్నది మీరే తేల్చుకోండి. ఒకటే సెట్ మీద అనేక సినిమాలే వచ్చాయి. వాటన్నిటిలో ఇదికూడా ఒకటే. ఆ మధ్య వచ్చిన మొత్తం సినిమా ఎయిర్ పోర్ట్ లోనే జరిగిన ప్రయాణం చూసాను. ఫరవాలేదనిపించింది. ఈ సినిమా కూడా ఫరవాలేదు. అంతే.

సినిమా అయిపోయిన తరువాత ప్రెస్ మీట్ జరిగింది. ఫ్రీ గా సినిమా చూసిన ఈ మహిళలందరూ ఆ మీట్ లో పాల్గొనాలి. బయటకు రాగానే అక్కడ ఒక్కసారే బ్రైట్ లైట్స్ , కామెరాలతో, మైక్ లతో చానల్స్ వాళ్ళు కనిపించారు. కవిత,
సినిమా హీరో నిఖిల్, దర్శకుడు చంద్ర మహేష్, అశోక్ కుమార్, శివారెడ్డి మొదలైన వాళ్ళున్నారు. ఇంక మా వాళ్ళందరూ హుషారుగా నిర్మాత రామానాయుడుని,
సినిమా ని తెగ పొగిడేసారు. ఇదంతా ఇంక రోజూ టి.వి. లో కొంతకాలం వస్తూ ఉంటుందిట. నేను అందులో పాల్గొనలేదు కాని, అంతా అయిన తరువాత ఆ డైరెక్టర్ తో మాత్రం కాసేపు నా డౌట్స్ గురించి మాట్లాడాను. అంటే కుంజెం ఇంటర్వ్యూ చేసానన్నమాట. ఏమాటకా మాటే చెప్పుకోవాలి. హీరో కన్నా డైరెక్టరే బాగున్నాడు. హీరోయిన్ మదాలస కూడా బాగుంది.

మీరూ చూడండి మరి ఈ సినిమా. ఫ్రీ గా వచ్చింది నువ్వు చూసేసావ్ అంటారా. మరి ఇవాళ నా అదృష్టం అలా వచ్చింది. అన్నట్లు ఈ సినిమాలో "నీ కివాళ అదృష్టం కలిసొస్తుంది" అన్న వేయింగ్ మిషన్ కాప్షన్ చాలా సార్లే వస్తుంది. చూడాలి మరి నాకెంత కలిసొస్తుందో ఈ సినిమా తరువాత.:) ఆలస్యం మూలం గా అమృతం సంపాదించుకోవచ్చు మరి.


`ఏడవకే...ఏడవకే చంటిపాపాయి ...’




*******************************************************************************

12 కామెంట్‌లు:

తృష్ణ చెప్పారు...

'భలే చాన్సులే...' అనుకుంటూ వెళ్ళారన్నమాట..:) బాగుందండీ.
మొత్తానికి చూడచ్చంటారు..!

సమూహము చెప్పారు...

నమస్కారం.
మెదటగా టపాకు ఏమాత్రం సంబంధం లేని వ్యాఖ్య వ్రాసినందుకు క్షమించండి.
http://samoohamu.com సమూహము గురించి చెప్పుకుందామని మీ బ్లాగు తలుపు తడుతున్నాను.
తెలుగు బ్లాగులు విస్తృతంగా వాడుకలో ఉన్న ఈ ఎలక్ట్రానిక్ యుగములో అన్ని తెలుగు బ్లాగులను ఒక గూటిలోనికి తేవాలనే మా ప్రయత్నం .
మీకు నచ్చిన ,మీరు మెచ్చిన బ్లాగులను ఈ బ్లాగులో చేర్చవచ్చును(add@samoohamu.com).
సమూహము ను మీరు చూడాలంటే ఈ లింకు పైన నొక్కండి. సమూహము మీ బ్లాగునుంచి టపాలను మరియు ఫోటోలను సేకరించి చూపిస్తుంది.
మీ సౌకర్యాన్ని బట్టి వీలును బట్టి ఓ సారి దర్శించండి.

దయచేసి మీ సలహను / సూచలను అభిప్రాయాలను దయచేసి info@samoohamu.com తెలుపండి .
మీ వ్యాఖ్యలు మాకు అమూల్యమైనవి .
--
ధన్యవాదముతో
మీ సమూహము
http://samoohamu.com

కొత్త పాళీ చెప్పారు...

Interesting, and lucky you! :)

శిశిర చెప్పారు...

>>>ఇదంతా ఇంక రోజూ టి.వి. లో కొంతకాలం వస్తూ ఉంటుందిట. నేను అందులో పాల్గొనలేదు.>>>>

అయ్యో, అదేంటి జయగారు? అందులో పాల్గొని "చూసేకొద్దీ చూడబుద్ధేస్తంది" అనో, మరోటో చెప్పుంటే మేమూ మిమ్మల్ని చూడబుద్ధేసినంతకాలం టి.వి లో చూసుందుము. మంచి చాన్స్ మిస్ చేశారు. :)

వేణూశ్రీకాంత్ చెప్పారు...

సినిమా కాన్సెప్ట్ కొత్తగా ఉన్నట్లుంది ఐతే ఒకసారన్నా చూడచ్చు అంటారు. ప్రీమియర్స్ కి వేరే థియేటర్ ఉందన్న విషయం నాకు కూడా తెలీదండి. మొత్తానికి మీ ఎక్స్పీరియన్స్ బాగుంది.

మురళి చెప్పారు...

భలే..భలే.. మీరు కాలేజీకి ఆలస్యంగా కాకుండా పెందలకడనే బయలుదేరడం వల్ల యెంత మేలు జరిగిందో చూడండి :-) చంద్రమహేష్ అప్పుడెప్పుడో 'ప్రేయసి రావే' అని సినిమా తీశాడు..

జయ చెప్పారు...

@ఊ..ఊ...బాగానే చూడచ్చు తృష్ణా, బఠాణీలు తీసుకుపోయి మంచిగా టైం పాస్ చేసుకోవచ్చు.


@కొత్తపాళీ గారు థాంక్స్. లక్కీనే :)

@అయ్యో శిశిరా..నేను లేకపోవటమే మీ అందరి అదృష్టం:) నాకైతే ఇప్పటివరకు ఏ చానల్ లో కనిపించలేదు. కాబట్టి నాకూ అదృష్టమే.

@ వేణూ శ్రీకాంత్ గారు, పర్లేదులెండి...హీరోని కనుక భరించగలిగితే ఒకసారి చూడచ్చు.

@ మురళి గారు ఆ రోజు ఆదివారం:)చూశారా, ఈ సినిమా గురించి ఇప్పటి వరకు ఎవరూ రివ్యూ రాయలేదు. నేనే ఫస్ట్:)

శివరంజని చెప్పారు...

జయ గారు ప్రీమియర్ షో కి వెళ్ళి కాలేజీ కీ డుమ్మా కొట్టేసారనుకున్నానే .. అయితే మిమ్మల్ని టి.వి. లో చూసే చాన్స్ లేదా ?????
అభినందన భవాని అంటే ఆవిడ అభినందన మూవీ లో ఏక్ట్ చేసారా

జయ చెప్పారు...

శివరంజనీ...శివానీ...రంజనీ...అయ్యో రామా, ఆదిత్య 369 లో 'పారిజాతాపహరణం' అంటే పారిజాత అనే అమ్మాయిని కిడ్నాప్ చేస్తారా అని హీరోయిన్ అడిగిన లెవెల్ లో ఉంది నీ క్వెశ్చన్:) అభినందన అనేది హైద్రాబాద్ లో చాలా ఫేమస్ కల్చరల్ అసోషియేషన్. దానికి ఆవిడ సెక్రటరీ.అందరు ఆవిడ్ని అలా పిలుస్తారు. నేను కూడా అప్పుడప్పుడు శక్తికొలది కొంత పాత్ర వహిస్తూ ఉంటానన్నమాట. ఇంకపోతే..టి.వి. లో నన్ను చూడక పోవటమే మంచిదన్నమాట. ఎందుకంటే మనమంత ఫొటోజెనిక్ అన్నమాట:)

శివరంజని చెప్పారు...

Jaya గారు మీకు మీ కుటుంబానికి నూతన సంవత్సర శుభాకాంక్షలు . ఈ కొత్త సంవత్సరం సుఖసంతోషాలతో ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను

జయ చెప్పారు...

హాయ్ శివానీ...ధన్యవాదాలు, నా హృదయ పూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు.

SRRao చెప్పారు...

జయ గారూ !

మీకు, మీ కుటుంబానికి నూతన సంవత్సర శుభాకాంక్షలు

SRRao
శిరాకదంబం

 

మనస్వి © 2008. Template Design By: SkinCorner