27, ఏప్రిల్ 2010, మంగళవారం

యమునా తీరమున....

నాలోని నవరసాలు - అద్భుతం

ఉత్తరా౦చల్ లో ఉన్న కేదారీనాధ్, బద్రీనాధ్, యమునోత్రి, గ౦గోత్రి...ఈ నాలుగు పుణ్య క్షేత్రాలు చూడాలని నాకు ఎప్పటిను౦చో కోరిక. భక్తి తో కాదు..రక్తి తోటే..ఆ మహోన్నతమైన హిమాలయాల సౌ౦దర్య౦ తనివితీర ఆస్వాది౦చాలన్న కోరిక మాత్రమే. మామూలు జీవితాలకి దూరంగా స్వర్గలోకాన్ని చూపే ఈ యాత్ర నా చిరకాల వాంఛ. పోయినసంవత్సరం వెళ్ళిన ఈ యాత్ర నాకు ఇంకా కొత్తగానే నిలిచిపోయింది. నాకు అన్నిటికన్నా నచ్చిన యాత్ర యమునోత్రి. మరచిపోయిందేలేదు. ఇంకోసారి తలుచుకోవాలనిఉంది. నా బ్లాగ్ మితృలందరితో మరొక సారి ఈ అనుభవాలు పంచుకోవాలనే ఆశతో....

చార్ ధాం యాత్ర అంటేనే ఎంతో ప్రత్యేకమైంది. గంగోత్రి, బద్రినాధ్ దాకా వాహనాల్లో వెళ్ళిపోవచ్చు. కేదారినాధ్ రానూపోను ఇరవైఎనిమిది కిలోమీటర్లు ప్రయాణం చేయాలి. డోలీలు, గుర్రాలు మేము ఎక్కదలుచుకోలేదు. అక్కడ హెలికాప్టర్ ఎక్కేసాం. ఆ అనుభవం ఇంకోసారి. యమునోత్రి మాత్రం ఇటువంటి సౌకర్యం లేదు కాబట్టి ఏదోఒకటి ఎక్కాల్సిందే...లేదంటే రానూపోనూ పదహారు కిలోమీటర్ లు నడవాలి. సరస్వతి, సంధ్యా నడుద్దామన్నారు. కాని అంతదూరం నడిచే నమ్మకం నామీద నాకు లేదు. నేను పోనీ ఎక్కేస్తానన్నాను. సంధ్య కూడా అదే ఫాలో అయిపోయింది. కాని సరస్వతి నడిచొస్తానంది. ముగ్గురమూ పక్కపక్కనే వెళ్ళే అవకాశం ఎలాగూ లేదు. సరే ఇంక పైనే కలుసుకోవాలని అనుకున్నాం. సరస్వతి నడక మొదలుపెట్టి వెళ్ళిపోయింది. ఒక గుర్రం సంధ్య ఇంకోటి నేను ఎక్కాం. చాలామందే ప్రయాణం చేస్తున్నారు. క్రమంగా ముగ్గురం వేరే అయిపోయాం.



ఇక్కడి నుంచి ఒంటరి ప్రయాణం తప్పలేదు. భయపడకూడదు అనినాకు నేను ధైర్యం చెప్పుకున్నాను. మళ్ళీ ఇటువంటి అవకాశం రాదు. కోరికతీరేవేళ భయపడితే ఎలా అనుకున్నాను. ముందూ వెనకా ఇంతమంది వెళ్తూనే ఉన్నారుగా....ఏమన్నా అయితుందేమో...ఊహూ...ఇంక ఏ ఆలోచనలూ ఒద్దు...అంతే...అన్నీ మర్చిపోయాను. దానికి కారణం చుట్టూఉన్న ఆ అందమైన ప్రక్రుతే...నా గుర్రం తో ఉన్న అబ్బాయి చిన్నవాడు. హుషారుగా ఉన్నాడు. ఏదో భాషలో పాట పాడుతున్నాడు. వినటానికి చాలా బాగుంది. సన్నటి రహదారి. ఒకవైపు చేతికి కొండలు తగులుతున్నాయి. ఇంకోవైపు అగాధం. ఒక్కసారి కొంచెం తలవొంచి కిందకి చూశాను. అమ్మో! అంతపెద్ద లోయ నేనెప్పుడూ చూడలేదు. ఒక్కనిమిషం భయం వేసినా..మరుక్షణమే అన్నీ మరిచిపోయాను. ఆ లోయలో ప్రవహిస్తున్న నది, దూరంగా కనబడుతున్న మంచుపరచుకున్న ఎత్తైన పర్వతాలు, ఆ పర్వతాలమీంచే దోబూచులాడుతూ మెల్లగా కదిలిపోతున్న దూదిపింజాల్లాంటి తెలతెల్లని మబ్బుతెరలు, మబ్బులమధ్య అక్కడక్కడా నీలి ఆకాశం...ఎంత అందంగా ఉందో ప్రక్రుతి. ఇంత తక్కువ ఆకాశమా! అంత ఎక్కువ మబ్బులా! చాలా ఆశ్చర్యం! అంతేకాదు..ఆ తెల్లతెల్లని మబ్బులన్ని సయ్యటలాడుతున్నాయి. నా చేతికి దొరుకుతానంటూ..ఎంతో చేరువలోకి ఒస్తున్నాయి. కాని..మరుక్షణమే దూరమైపోతున్నాయి. మబ్బుల మధ్య నేను తేలిపోతున్నాను...నిజమేనా!!! ఇంకోసారి చేయి చాపాలనుకున్నాను. కాని గుర్రాన్ని ఒదలాలంటే భయం వేసి బిగించి పట్టుకొని అలాగే కూచున్నాను. నాపని "ఊపర్ సే షేర్వాణి, అందర్ సే పరేషానీ..." లాగా ఉంది.




ఎంత చల్లటి వాతావరణం. ఎక్కడా సూర్యభగవానుని జాడేలేదు. మెల్లి మెల్లిగా పైకి పోతున్నాము. కొంచెం కొంచెంగా పైకి పోతున్నా కొద్దీ హిమవన్నగమే ఎక్కుతున్న ఆనందం కలుగుతోంది. కొంచెం సేపు కిందికి దిగాలనిపించింది. పాపం నేనెక్కిన గుర్రం చిన్నపిల్ల. కొన్ని చోట్ల నన్నుమోసుకుంటూ మెట్లు కూడా ఎక్కుతోంది పాపం. కానీ ఎలా దిగాలి! ఆ అబ్బాయే ఒక చిన్న కొండదగ్గిర ఆపి నేను తిగటానికి సహాయం చేసాడు. మెల్లిగా ఆ అబ్బాయి చెప్పే కబుర్లు వింటూ ఇద్దరం నడక సాగించాం. దారిలో ఒక చోట వేడివేడి టీ తాగాం. టీ తాగుతూ అక్కడి పరిసరాలు చూస్తు మైమరచిపోయాను. సన్నటి జల్లు ప్రారంభమైంది. ఆ చల్లటి వాతావరణం లో, ఆ చిరుజల్లులలో....ఇది నిజమేనా! అక్కడ ఉన్నది నేనేనా!!! చిన్నపిల్లలా గిరగిరా తిరుగుతూ వానావానా వల్లప్పా అని ఆడుకోవాలనిపించింది. ఒంటరితనంలో ఇంత ఆనందమా!!!

పాడాలని ఉంది..మాటలే రాని వేళ పాట ఎలా పాడను...
కళ్ళలోన కడలి సాకి...ఎంతసేపు ఆపను...
ఓ గగనాన హత్తుకున్న మేఘమా..నీ దరిని చేరనీ నన్నిలా
నా మది గలగలా ఈ జీవనదిలా
దరహాసమంటి ఈ చిరు చినుకు లా
చేరాలి నను గాలి తరంగంలా
ఓ ప్రియ నేస్తమా! మేఘమా...కదలిపోకు...
స్వప్నమా జారిపోకు....ఈ ఆనందాన్ని నా మూగ మదిలో నింపిపో
నా గుండె గుడిలో దాగిపో
నా కోసం మళ్ళీ వస్తానని మాటిచ్చిపో
ఎందుకంటే నా మనసంతా ఉండిపోయింది నీ చెంతే!!!
అందుకే ఈ దిగులంతా ఓ ప్రియ నేస్తమా...
నా హ్రుదయస్పందన ఇంకా మిగిలే ఉంది....
ఈ ఆహ్లాద ప్రక్రుతిలో లీనమైన నాకు పైకి ఎప్పుడు చేరుకున్నానో తెలియనేలేదు.
నాకంటే ముందే అక్కడ చేరిన నా స్నేహితులను చూచి, మెల్లగా నా ఆలోచనలు జారుకున్నాయి.

అక్కడున్న చిన్నచిన్న దుకాణాల్లో చాలా మందే సేదదీరుతున్నారు. మేమూ అక్కడే వేడివేడి పరాటాలు, ఆలూ కర్రీ తో తిన్నాం. ఎంతో రుచిగా అనిపించింది. అక్కడి నుంచి మెల్లిగా కిందికి దిగుతూ పోతే అందమైన యమునమ్మ స్వాగతం చెపుతూ ఎదురయింది.



హిమాలయల్లోంచి సన్నని పాయగ మొదలైన యమున అక్కడ మందగమనంతో వయ్యారంగా వంపులు తిరుగుతూ మలుపుల్లో కలిసిపోతోంది. అది దాటటానికి చిన్న వంతెన. ఆ వంతెన దాటుతుంటె సన్నటి నీటితుంపరలు మీద పన్నీటిని చిలకరిస్తూ పవిత్రభావాన్ని కలిగిస్తున్నాయి. అక్కడే ఒక చిన్నగుడి. ఆ గుడికి చేరటానికి మధ్యలో చిన్న చిన్న కొండలు దాటుకుంటూ పోవాలి. ఆ పక్కనే వేడినీటి కొలను(హాట్ స్ప్రింగ్) ఉంది. అందులో స్నానం చేసి అమ్మవారి దర్శనానికి వెళ్ళాలి. కాని అది నాకిష్టం లేదు. అంతమంది ఆ నీటిలో స్నానం చేస్తుంటే భక్తి ఏమోకాని రోగాలొస్తాయనిపించింది. ఆ వేడివేడి నీటిదగ్గరికి వెళ్ళి కాళ్ళు తడిపాను. గోరువెచ్చటి నీళ్ళే, కాని ఆ నీరు సెగలుపొగలు కక్కుతోంది. మెల్లిగా పక్కకి వెళ్ళాను. అక్కడ ఇంకో చిన్న వేడినీటి కుండం ఉంది. ఆ నీరు మాత్రం మసిలి పోతున్నాయి. మనం కొన్న పూజాద్రవ్యాల్లో చిన్న బియ్యం మూట కూడా ఉంటుంది. ఆ చిన్న మూటని ఆ నీటిలో ముంచితే క్షణాల్లో అన్నం ఉడికిపోతుంది. అది అమ్మవారికి ప్రసాదం పెట్టాలి. అక్కడినుంచి గుళ్ళోకి వెళ్ళాం.

ముఖ్యంగా ఉత్తరభారతదేశంలో దేవాలయాల్లో అమ్మవారి విగ్రహాలు నాకెందుకోగాని నచ్చదు. పాలరాతి విగ్రహానికి, చెమ్కీ బట్టలేసి, విగ్గుతో రెండుజెడలేసి, రబ్బరుబాండ్లు పెట్టి, ప్లాస్టిక్ పూలు పెడతారు. దక్షిణ భారతదేశపు గుళ్ళల్లో ఉండే భక్తిభావం బహుశా నాకందుకే అక్కడ కలగదేమో మరి.



అక్కడినుంచి ఒకగంటసేపు చుట్తూతిరుగుదామనుకున్నాము. అంత చల్లటి వాతావరణంలో కూడా నాకు ఆ నీటిలొ నడవాలనిపించింది. లోతు లేదు. నీరు చాలా స్వచ్చంగా, కింద నేల కనిపిస్తూ సనసన్నటి తుంపరలతో సాగిపోతోంది. చిన్న బండలమీంచి వెళ్లి నీటి మధ్యలో కూచున్నాను. కాలు తీసి నీటిలో పెట్టాను. ఆ చల్లదనానికి కాలు జివ్వుమని వెంటనే పక్కకి అడుగేసాను. ఈ సారి కాలు చుర్రుమంది. నాకు ఒక పక్క గడ్డకట్టే చల్లటి నీరు, ఇంకోవైపు వేడినీరు. గమ్మత్తుగా ఉంది. ఒకేసారి రెండుకాళ్ళు రెండువైపులా పెట్టాను. కాని అదే స్పీడ్ తో నా కాళ్ళు తిరుగు టపాలో పైకొచ్చేసాయి. ఇంక లాభం లేదని నీటి అంచులకి పైపైన కాళ్ళు తాటిస్తూ కూచున్నాను.

ఎంతో అందమైన పాట...యమునా తీరమున ...సంధ్యా సమయమునా..వేయికనులతో రాధా వేచియున్నది కాదా!!! అని పాడుకున్నాను. నిజంగా నా కోసం ఆ నల్లనయ్య ఒస్తే బాగుండు.
ఓ కన్నయ్యా! నా దగ్గరికి రావా!!
చిరునవ్వుల పూలవాన కురిపించవా
కమ్మటి కలలు అందించవా
బ్రతుకు అనే పయనంలో పడిపోయిన నన్ను
నీ ప్రేమ బంధంలో ఓలలాడించవా
ప్రక్రుతినే ఆహ్లాదపరిచే, సర్వ కాలాల్లోను చిగుళ్ళు తొడిగే
రాగడోలికల్లొ ఊగించే ఈ మధురస్మ్రుతిని నాకు కలకాలం నిలుపు.

ఒక్క క్షణం ప్రేమిస్తావా,
చితినుండి లేచి వస్తాను...
మరుజన్మకు మనసిస్తావా,
ఈ క్షణమే మరణిస్తాను....
నా హృదయమంతా నీ జ్ఞాపకాలే....

వెంటనే ఒక మెరుపు మెరుస్తూ చెప్పింది. ఉండేది క్షణమైనా ఉజ్వలంగా ఉండమని
ఆ పక్కనే ఒక ఆకు రాలుతూ చెప్పింది ఈ జీవితం శాశ్వతం కాదని
ఈ పక్క ఒక పువ్వు వికసిస్తూ చెప్పింది, జీవించేది ఒకరోజైనా గౌరవంగా జీవించమని
ఇక్కడి యమునమ్మ జలజల పారుతూ చెప్పింది, తనలాగే కష్టసుఖాల్లో చలించకుండా సాగిపొమ్మని.

ఇప్పుడు నాకర్ధమైంది...ఎందుకింతగా ఈ యమునోత్రి యాత్ర నన్నాకర్షించిందో!!!
అద్భుతం ....మహాద్భుతం....

**********************************************************

8, ఏప్రిల్ 2010, గురువారం

తప్పుచేసానా!





పరీక్షలు...హడావుడి. ఇప్పుడు ఆ యముడొచ్చి పిలిచినా తరువాత రావోయ్...అనే పరిస్థితి.

ఇంతలో ఎక్షాంస్ రాయాల్సిన ఒక బ్లైండ్ గర్ల్ ఒచ్చింది. అందరు ఇన్విజిలేటర్స్ రూంస్ కి వెళ్ళిపోయారు. ఈ అమ్మాయి రావటం లేట్ అయింది. ఇప్పుడు వెంటనే తన ఎక్షాం రాయటానికి ఎవరైనా వెళ్ళాలి. ఇక్కడొక చిన్న విషయం. స్టాలిన్ సినిమా లాగా బ్లైండ్ స్టూడెంట్స్ తమ ఎక్షాం రాయటానికి తామే కష్టపడి ఎవరినో తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. అలా ఎక్కడ కూడా జరగదు. ఎక్కడైనా సరే ఆ స్టూడెంట్ కాంబినేషన్ కాని ఎవరో ఒక లెక్చరర్ ని స్క్రైబర్ గా అలాట్ చేస్తారు.

అప్పటికే పది నిమిషాలైపోయింది. ఇప్పుడెలా! ఎవర్ని పంపాలి? కంట్రోల్ రూం లో ఉన్నది నలుగురమే. మధ్యాహ్నం డ్యూటీ ఉన్నవాళ్ళు ఇప్పుడే రారు. ఆ అమ్మాయి అక్కడే నిలబడి ఉంది. అప్పటికే ఆ అమ్మాయిని చూడంగానే నా మనసు కరిగి నీరై ఆ అమ్మాయి దగ్గరికెళ్ళిపోయింది. నేనే తన ఎక్షాం రాయాలని డిసైడై పోయాను. ఆ సంగతి నాతోటి వాళ్ళకు చెప్పాను. అక్కడ ఒకళ్ళు తక్కువైనా పని ఎంత కష్టమో తెల్సి కూడా వాళ్ళు సరే అన్నారు.

ఇప్పుడున్నది సెకండ్ లాంగ్వేజ్ ఎక్షాం. ఆ అమ్మాయిది తెలుగు పరీక్ష. ఆన్సర్ షీట్, క్వెశ్చన్ పేపర్ తో పాటు ఆ అమ్మాయిని తీసుకొని కారిడార్ లో ఒకపక్క కి వెళ్ళాను. ఆ అమ్మాయిని వేరు గానే కూచోపెట్టాలి. వాళ్ళు బయటకి అన్నీ చెప్తూ ఉంటారు కాబట్టి అందరితో పాటు ఒకే రూం లో ఉంచరు.

టేబల్ కి అటూ ఇటూ గా ఇద్దరం కూచున్నాం. హాల్ టికెట్ తీసుకొని తన డిటైల్స్ అన్నీ ఫిల్ చేసేసాను. అప్పటికే చాలా ఆలష్యమయ్యింది. ఆ అమ్మాయికి పేపర్ మొత్తం చదివి వినిపించి...చెప్పమ్మా ఏ ప్రశ్నలు రాస్తావో...అన్నాను. ఆ అమ్మాయి ఏమీ మాట్లాడలేదు. వినలేదేమో...అని మళ్ళీ అడిగాను. ఇప్పటకీ ఏ జవాబు రాలేదు. ఇదేంటి? నాకేం అర్ధం కాలేదు. ఆ అమ్మాయి ఏం చెప్తే అదే కదా నేను రాయాలి. ఇప్పుడు ఈ అమ్మాయి ఏం మాట్లాడట్లేదు. ఎలా!

ఇప్పటికే ఆలష్యమైంది. నువ్వేమి చెప్పక పోతే ఎలా? పేపర్ మళ్ళీ చదవ మంటావా? అని అడిగాను. ఊహూ...ఏం కదలిక లేదు. ఒక నిమిషం చుట్టూ చూసాను. కారిడార్ లో కూచున్నాం కదా, బయట గాలి చల్లగ తగులుతోంది. కిందనుంచి పైదాకా పెరిగిన ఉడన్ రోజ్ తీగ, దాని ఆకులు మెల్లగ తలలూపుతున్నాయి. అప్రయత్నంగా నా చేయి ఓ చిన్నారి రోజ్ మీదకెళ్ళింది. ఎంతందంగా ఉంటాయి కదా ఈ పూలు అనిపించింది. ఇంతలో మేడం, మీరు నాకు తెలుసు...అన్న ఆ అమ్మాయి మాటలు వినిపించాయి. తలతిప్పి తనని చూసాను. చూసుండొచ్చు రోజూ కాలేజ్ అంతా తిరుగుతూనే ఉంటానుగా అనుకున్నాను.

చూడు టైం ఎలా గడిచిపోతోందో. ఇలా ఎంతసేపు కూచుందాం అన్నాను. ఈ మొదటి క్వెశ్చన్ బాగున్నట్లుంది. దీనితో స్టార్ట్ చేయి, అని ఓ ఉచిత సలహా ఇచ్చాను. వెంటనే, మీరే రాసేయండి మేడం అంది. నేనే రాసేయాలా...తనేం చెప్పకుండానే? అదిరిపోయి, ఆ అమ్మాయి మొహం లోకి చూసాను. కళ్ళు చాలా అందంగా ఉన్నాయి. చూపు లేదంటే నమ్మలేను. ఆ కలువరేకుల్లోనుంచి ఒక్కొక్క కన్నీటి చుక్క మెల్లగా బయటికి ఒచ్చి ఆ లేత బుగ్గ్గల మీదికి జారిపోతున్నాయి. ఒక నిమిషం నాకేం అర్ధం కాలేదు. మెల్లగా ఏంటమ్మ ఎందుకేడుస్తున్నావు ఏమయ్యింది, అనడిగాను.

మెల్లిగా అన్ని విషయాలు చెప్పింది. తనొక అనాధ. ఎక్కడో దూరంగా ఒక అనాధ శరణాలయంలో పెరుగుతోంది. ఎప్పటినుంచి ఉందో తనకే తెలియదు. చదువు మీద ఉన్న కోరికతో శ్రద్ధగా చదువుకుంటోంది. అంతే కాకుండా అక్కడున్న చిన్న పిల్లలకు తనే అక్షరాలు నేర్పించి, తను తెలుసుకున్న విషయాలన్నీ చెప్పుతూ ఉండేది. కళ్ళు లేక పోయినా ఎన్నో పనుల్ని హుషారుగా చేసేది. ఆ అమ్మాయి తెలివితేటలకి అక్కడి అధికారులు సంతోషించి అక్కడే తనకి ఒక ఉపాధి కల్పించాలనుకున్నారు. అక్కడే చిన్న పిల్లలకి టీచర్ గా నియమిస్తే తనకి ఒక ఆధారం దొరుకుతుందని భావించారు. కాబట్టి డిగ్రీ చదువు పూర్తి చేస్తే తనకి ఆ ఉద్యోగం ఇస్తామని చెప్పారు. అప్పటినుంచి ఆ అమ్మాయి కష్టపడి చదువుకొని, అక్కడే స్థిరపడాలనుకుంది. కాని, లోకమంతా పాతుకుపోయిన కుత్సితపు బుద్ధి అక్కడ కూడా బాగానే స్థిరపడింది. ఈ అమ్మాయికి ఆ ఉద్యోగం రావటం ఇష్టం లేని మిగతావారి మూలంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఒచ్చింది. తనమీద కంప్లైంట్స్ చేసేవారు. ఎప్పుడు చదువుకోటానికి ప్రయత్నం చేసినా ఏదొవిధమైన విఘ్నాలు కల్పించే వాళ్ళు. అక్కడ దుర్భర పరిస్థితులు కల్పించారు. అడుగడుగునా సమష్యలు ఎదుర్కొంటోంది. ఉద్యోగం మీది దిగులుతో, ఏమి చదువుకోలేని పరిస్థితుల్లో ఇవాళ ఎక్జాం రాయటానికి ఒచ్చింది.

నాకు అసలే నెత్తిమీద ఎప్పుడూ స్థిరంగా ఉండే నీళ్ళ కుండ కదిలిపోయి ఆ నీరంతా నా మొహం మీద పరుచుకోటం మొదలుపెట్టింది. ఈ అమ్మాయి పాస్ అయితే తను స్థిరపడి సంతోషంగా ఉంటుంది. కేవలం అక్కడి చిన్న పిల్లల చదువుకి ఈ అమ్మాయి చదివే డిగ్రీ చదువుకి ఏం సంబంధం లేదు. నేను గనుక హెల్ప్ చేస్తే సంతోషిస్తుంది. ప్రతిరోజు ఎన్ని రకాలుగా అరికట్టటానికి ప్రయత్నిస్తున్నా కాపీలు కొట్టే స్టూడెంట్స్ నా కళ్ళముందు మెదిలారు. వాళ్ళు పెద్దపెద్ద ఉద్యోగాలు సంపాదించుకుంటారు. ఈ అమాయకురాలికి నేను సహాయం చేస్తే ఏం ముంచుకు పోతుంది గనుకా! అనిపించిందొక క్షణం. ఈ తెలుగు పేపర్ నేనెలా రాయాలి. పేపర్ నిండా ఉన్న ప్రశ్నలు ఒక్కటికూడా నాకు తెలియవు. అంతే కాదు, పద్యాలు...ప్రతిపదార్ధాలు, వ్యాకరణం..అలంకారాలు...చందస్సు... బాబోయ్..ఇవన్నీ నేనెలా రాయాలి. నా తరంకాదు. టైం ఏమో రన్నింగ్ కాంపిటీషన్ లో ఉంది. ఇదొక్కటేనా..ఈ అమ్మాయి పాస్ అవ్వాలంటే రేపటినుంచి అన్నీ నేనే రాయాలి. అటువంటి పని నేను చేయగలనా? వెంటనే నేనో పెద్ద అద్దాల గదిలో ఉన్నట్లు..అందులోని నా ప్రతిబింబాలన్నీ నన్ను నిలదీస్తున్నట్లు అనిపించింది. అంతేనా...నా మనస్సాక్షి కూడా అప్పటివరకు నేను చూసి మురిసిపోయిన ఉడ్రోజ్ పక్కనే కూచొని నన్ను నిలువునా కోరచూపులతో దహించేస్తున్నట్లనిపించింది.

ఏం చేయాలి...ఇప్పుడు నేనేం చేయాలి...
నాకే తెలియకుండా తెలుగు పరీక్ష జరుగుతున్న రూం ముందుకెళ్ళాను.
అక్కడ అన్నీ ఒకే రకం తెలుగు గైడు లన్నీ ఓ పెద్ద పర్వతం లాగా ఉన్నాయి. అక్కడే ఒక ఆయా కూడా ఉంది. చాలా మంది గైడ్లు మాత్రమే చదువుతారని నా కర్ధమయ్యింది. మెల్లిగా ఒక బుక్ తీసుకున్నాను. తిరిగి ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళాను. కొన్ని ఆన్సర్లు అందులో వెతికి రాసాను. వ్యాకరణం సరిగ్గా రాయలేక పోయాను. పద్యం చందస్సు విభజన కష్టపడి చేసాను. అది ’నజభజజజర” అనుకుంట. అవును చంపక మాల. పద్ధతి ప్రకారం రాయలేక పోయినా మొత్తానికి పరీక్ష రాసేసాను.

రేపటినుంచి ఆ మర్నాటి ఎక్షాం బుక్స్ తీసుకొచ్చుకో. ఎక్షాం కాంగానే ఇక్కడే సాయంత్రం వరకు చదువుకొని పోవచ్చు, నేను ఎవరికన్నా చెప్తాను, నీకు హెల్ప్ చేస్తారన్నాను. తన బుక్స్ అన్నీ ఎత్తుకుపోయారుట. ఏదో విధంగా ఇక్కడే చదవొచ్చు. సాయంత్రం వరకు ఇక్కడే ఉండు. రేపటి ఎక్షాం నీకు చెప్పటానికి ట్రై చేస్తాను అని ఆ పేపర్ తీసుకొని వెళ్ళిపోయాను.

ఇవాళ నేను చేసిన పని ఎవరూ హర్షించరు.నా మనసు నాకే ఎదురుతిరుగుతోంది. డబుల్ యాక్షన్ లాగా నాకు నేనే సమాధానం చెప్పుకోటానికి ప్రయత్నం చేస్తున్నాను. నన్ను నేనే క్షమించుకో లేక పోతున్నాను. రేపటినుంచి ఎవరైనా కాపీ కొడుతుంటే అడ్డుకునే మనస్థైర్యం పోయింది. ఈ అమ్మాయికి నేను చేసిన సహాయం మూలంగా ఎవరికీ అన్యాయం జరుగదు కదా...

ఈ అమ్మాయి జీవితం నిలబడుతుంది కదా...ఎక్కడో తన జీవితాన్ని గడుపుతుంది....అంతే కదా!

నేను తప్పు చేసానా!!! ఈ తప్పుకు నాకు శిక్షేంటి?

అసలు ఇంత పవిత్రమైన ఉద్యోగం చేసే అర్హత ఇంకా ఉందా నాకు?

రేపటినుంచి ఆ అమ్మాయికి నేనేం చేయాలి? మిగతా పరీక్షలు నేనే రాయాలా...వద్దా?

నాకు ఇంకా అనుమానమే!!! ఈ అమ్మాయిని అక్కడ బ్రతకనిస్తారా?

********************************************************************

4, ఏప్రిల్ 2010, ఆదివారం

వరుడు...




వరుడు...

నేను ఎంతో ఆశగా ఎదురు చూసిన చిత్రం. మొదట్లోనె చెప్పేస్తున్నానండి. ఊహూ...నాకు నచ్చలేదు....

ఇన్నాళ్ళకు మళ్ళీ మంచి ఓ కుటుంబ కథా చిత్రం తృప్తిగా చూడొచ్చు అన్న ఆశతో వెళ్ళాను. ఎక్కువ రష్ ఉండదు, చల్లటి వాతవరణం లో ఆనందంగా చూడొచ్చు అని మేము INOX(GVK) సినిమా కి వెళ్ళాము.

పబ్ లో యువత కేరింతలతో ఈ సినిమా మొదలౌతుంది. హీరో సందీప్ కి గర్ల్ ఫ్రెండ్స్ కూడా చాలా మందే ఉంటారు. ఇక్కడ పక్కా మోడర్న్ సాంగ్ పాడేస్తాడు కూడా. ఇతని తల్లి తండ్రులు ప్రేమ వివాహం చేసుకుంటారు. ఏ సమస్య లేకుండా ఆనందంగా ఉంటారు. వాళ్ళ కుమార్తె కూడా ప్రేమ వివాహమే చేసుకుంటుంది. అలాగే తమ కుమారుడు కూడా ప్రేమ వివాహమే చేసుకుంటాడనుకొని అతని కి వివాహం చేయాలని, అతని గర్ల్ ఫ్రెండ్స్ ఫొటో లన్నీ చూపించి, నీ కెవరిష్టమో చెప్పు, వారితోటే నీ వివాహం నిర్ణయిస్తాం అని సందీప్ ని అడుగు తారు. కాని వాళ్ళు ఎదురుచూడని సమాధానం ఇస్తాడు సందీప్. తల్లితండ్రులు కుదిర్చిన వివాహమే తనకిష్టమని, తమ పూర్వీకుల లాగా పదహారు రోజుల సంబరాలతో, అయిదు రోజుల పెళ్ళి కావాలి అంటాడు. లవ్ మాజిక్ పెళ్ళిపీటలమీదే అ౦టాడు.

తల్లితండ్రులు ఆ మాట నమ్మలేక పోయినా, క్రమంగా ఆ విషయం గ్రహించి పెళ్ళిళ్ళ పేరయ్య బ్రమ్హానందం తో మాట్లాడి అతను తెచ్చిన ఫొటోలు చూసి అదిరిపోతారు. అంత మోడర్న్ గా ఉంటారు ఆ అమ్మాయిలు. సందీప్ తన తల్లితండ్రులకు వారు ఏ అమ్మాయిని చూసినా తను ఇష్టపడ్తానని, తను ఆ అమ్మాయిని చూడాల్సిన అవసరం కూడా లేదని, పూర్తి బాధ్యత వారిదేనని వారికి నమ్మకంగా చెప్తాడు. చివరికి వాళ్ళు ఒక అమ్మాయిని మెచ్చి పెళ్ళి కుదిరిస్తారు. పెళ్ళికొడుకు ఫొటో కూడా చూడకుండానే పెళ్ళికి ఇష్టపడ్డాడని తెలిసిన ఆ అమ్మాయి కూడా తనూ పెళ్ళికొడుకును పీటల మీదనే చూస్తానంటుంది. అందరు బంధువులను ఆహ్వానించి అయిదు రోజుల వివాహానికి సంబరాలు ప్రారంభిస్తారు.

ఇక్కడ కృష్ణా జిల్లా ప్రస్తావన కూడా ఉంది. అమ్మాయి ఊరిలో కృష్ణా నదీ తీరానా పచ్చటి పొలాలలో, పెద్ద పందిరి వేసి ఆడంబరంగా పెళ్ళి ప్రారంభిస్తారు. ఇదంతా కూడా చూడటానికి చాలా ఆహ్లాదంగా ఉంటుంది. పెళ్ళి సాంప్రదాయాలు కూడా చూపించారు. కన్యాదానం చేయించారు. జీలకర్రాబెల్లం కూడా తలమీద పెట్టించారు. మధ్యలో తెర తీసి ఇద్దరూ ఒకరినొకరు మొదటిసారిగా చూసుకొన్న అనుభూతి కూడా చాలా బాగుంది.

వాళ్ళిద్దరి మధ్యా తొలగించిన తెర ఆ తరువాత నా ఆనందానికి తెర దించుతుందని అప్పుడు నేననుకోలేదు. మైమరచి చూస్తున్న మనసు అదిరిపోయేలా, అంత పెద్ద పెళ్ళి మండపం కూలిపోవటం మొదలైంది. గందరగోళం...అంతా గగ్గోలు...ఒక్కసారిగా కల్లోలం మొదలైపోతుంది. అంతా తేరుకున్న తరువాత తేలిన విషయం, హీరోయిన్ కిడ్నాప్ అయిందని.

ఇదిగో ఇక్కడినుంచే నండి, నేను సినిమా ఇంక ఏమాత్రం భరించ లేక పోయాను. అంత చల్లటి వాతావరణం లో కూడా నా బుర్ర వేడెక్కిపోయి, వేడి వేడి ఆవిరుల సెగల పొగలు మొదలైనై. ఎంతో గొప్పగా ఊహించుకొని ఒచ్చిన సినిమా అరగంటలోనే నాకు నిరాశా నిస్ప్రుహలను మిగులుస్తుందనుకోలేదు.

కిడ్నాప్ అయిన పెళ్ళికూతుర్ని మర్చిపొమ్మని, తాళి ఇ౦కా కట్టలేదు కాబట్టి, ఇ౦కో పెళ్ళిచేసుకొమ్మని అక్కడి వారు సలహా ఇస్తారు. జరిగిన కన్యాదానానికి విలువలేకపోతే స౦ప్రదాయాలకే విలువ పోతు౦దని, తనకి వివాహ౦ జరిగిపోయి౦దని, భార్యని కాపాడట౦ తన ధర్మమని చెప్తాడు. కిడ్నాపర్ దివాకర్ అని తెలుసుకొని అతన్ని వెతుక్కుంటూ వెళ్ళిన హీరో, రోజూ ఆమె బస్ ఎక్కే చోట ఒక చిన్న అమ్మాయి చెప్పిన అనుభవంతో సంతోషిస్తాడు. చిన్న వయసులో చదువుకోకుండా కష్ట పడుతున్న ఆ అమ్మాయిని స్కూల్లో చేర్పిస్తుంది. ఒక గులాబి మొక్క ని ఇస్తుంది. ఆ మొక్కకు పూసిన గులాబిని చూసి సందీప్ సంతోషిస్తాడు.

ఆమె స్నేహితురాలైన ఒక టీచర్ని కలుసుకుంటాడు. ఇది ప్రస్తుతం జరుగుతున్న ఆసిడ్ అటాక్ లకు ఒక ఉదాహరణ. ఆ టీచర్ మీద ఆసిడ్ పోయబొతున్న విలన్ అనుచరుడినుంచి ఆమెని రక్షిస్తాడు. ఆమె దగ్గరినుంచె విలన్ వివరాలు, హీరోయిన్ సమస్య తెలుసుకుంటాడు. అప్పటినుంచి సినిమా చివరి వరకు కావల్సినంత, రకరకాల వయొలెన్స్ చూడొచ్చు. సినిమా ఎంతగా డైవర్ట్ అయిపోయిందో మనకి కూడా బాగానే అర్ధమైపోతుంది.

మామూలు క్రైం మూవీ కి ఏమాత్రం తీసిపోదు. కావాల్సినన్ని మసాలాలు దట్టించారు. ఒక హాలీవుడ్ లెవెల్ కిస్సింగ్ సీన్ కూడా చూపి౦చారు. తెలుగు సినిమాలో ఇటువంటి సీన్ నేను మొదటిసారిగా చూస్తున్నాను. అంతేకాదు ఆడపిల్లకు ఇష్టమైతే ఎంతకైనా తెగిస్తుంది అని హీరోయిన్ తో దర్శకుడు చెప్పించాడుకూడా. ఏమో, ఇది మాత్రం నాకు నచ్చలేదు.

అంతేకాదండోయ్, హీరోయిన్ చేతికి సెలైన్ బాటిల్ పెట్టి, బాటిల్ అడ్డ౦గా పట్టుకొని, కొండల మీంచి, వాగుల్లోంచి, వీర లెవల్ల్లో, ఏ మాత్రం చెదిరిపోకుండా తీసుకొచ్చేస్తాడు.హీరోయిన్ కూడా తరువాత ఆ సూదిని టక్కున చేత్తో చాలా ఈజీ గా తీసేసు కుంటుంది.

ఇంకా ఫైటింగ్ కోరిక తీరక పోతే, చివర్లో ఒక అరగంట సేపు రకరకాల కుస్తీలు, కావాల్సినన్ని గ్రాఫిక్స్, మాయలు మంత్రాలు కూడా చూడొచ్చు. బహుశా, తన సిక్స్ పాకో, జీరో పాకో...ఆ బాడీ ఏదో చూపిద్దామని, వరుడుగా వచ్చినట్లున్నాడు.

నేను మాత్రం దర్శకత్వం, రచన, సంగీతం ఇతర ఏ సాంకేతిక అంశాల గురించి మాట్లాడ దలుచుకో లేదు. ఈ సినిమా లో కావాల్సినంత శిరోభారాన్ని పెంచిన ఈ అంశాల ప్రత్యేకత నాకేం కనిపించలేదు. హేమచంద్ర పాడిన ఒక పాట బాగుంది. రేలారె పాటకూడా బాగానే ఉంది. అ౦త రాకీ సా౦గ్స్ అయితే ఏ౦లేవు.

చక్కటి కుటు౦బకథా చిత్ర౦, పదహారు రోజుల పెళ్ళి స౦బరాలు కళకళ లాడుతూ చూసేద్దామనుకు౦టే మాత్ర౦ పప్పులో కాలేసినట్లే... ఈ సినిమా కి ఇచ్చిన పబ్లిసిటీ ఒకటైతే, మనకు చూపించేది మాత్రం వేరొకటి. హీరోయిన్ ఒక పంజాబీ అమ్మాయి. నాకైతే ఏం బాగా లేదు. ప౦జాబీ అమ్మాయి తెలుగు పెళ్ళికూతురి అల౦కార౦, కట్టిన చీర స౦ప్రదాయబద్ధ౦గా లేవు. అల్లు అర్జున్ కూడా బాగాలేడు. ఒత్తి ఒత్తి పలికిన ఆ డైలాగ్స్ కూడా ఏం బాగా లేవు. సినిమా మొత్తం మీద నాకు ఎంతో నచ్చిన వారు ఒకరు ఉన్నారు. అదేనండి, నా ఫేవొరెట్ హీరోయిన్ సుహాసిని. ఇందులో హీరో తల్లి ఈమెనే. ఎంత బాగుందో చెప్పలేను.

ఈ సినిమాకి వరుడు అన్న పేరు కాకు౦డా..'కూష్మాండా' అన్నపేరు పెడితే బాగుండేది. ఎందుకంటే...అది చూసిన వాళ్ళకే అర్ధం అవుతుంది లెండి:) ఇప్పటి వరకు ఈ సినిమా చూడని వారెవరైనా ఉంటే చూడాలన్న ఆ ఉత్సాహాన్ని తగ్గి౦చుకుంటే మీకే మంచిదనుకుంట. బతికుంటే బలిసాకు తిని బతకొచ్చు. కనీస౦ రాబోయె ప్రప౦చ ఆరోగ్యదిన౦ వరకైనా హెల్దీగా ఉ౦డొచ్చు. చూసేసిన వాళ్ళున్నారనుకొండి...నా లాగే తొ౦దరపడి... ఇది వాళ్ళ ఖర్మ. మంచి థియేటర్ ఎంచుకొని మరీ పోతారేమొ నాలాగా...ఒద్దండి బాబూ.. ప్లీజ్...

మొత్తానికి ఆహ్లాదం తక్కువ...భీభత్సం ఎక్కువ:)

*************************************************************************
 

మనస్వి © 2008. Template Design By: SkinCorner