4, జులై 2011, సోమవారం

బాధ్యత...




ఓ కండెమ్డ్ క్రిమినల్ మీద హత్యా ప్రయత్నం జరిగింది. రివాల్వర్ తో పాయింట్ బ్లాంక్ లో కాల్చబడ్డాడతను. ఎమెర్జెన్సీ ట్రీట్మెంట్ కోసమని చావు బతుకుల్లో ఉన్న ఆ ముద్దాయిని పోలీసులు ప్రభుత్వ హాస్పిటల్ లో తగిన సదుపాయాలు లేవని ఓ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కి తీసుకొచ్చారు.

"ప్లీజ్ డాక్టర్! ఇతన్ని ఎలాగైనా బతికించాలి మీరు. ఎంత ఖర్చయినా సరే" అంటూ ప్లీజ్ చేస్తున్న జైలర్ వంక వింతగా చూసారు డాక్టర్లు. "మాకు చాతనయినంత కృషి చేస్తున్నాం. ఆ పైన ఇతగాడి అదృష్టం, ఆయుష్షూనూ"...అని జవాబిచ్చారు.

ఎమెర్జెన్సీ ఆపరేషన్ చేసి బుల్లెట్ తీసేశారు. ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో ఉంచి స్పెషలైజ్డ్ ట్రీట్మెంట్ ఇచ్చారు. అతను బతికి బయటపడగానే మరోవారం రోజులు స్పెషల్ వార్డ్ లో ఉంచి ప్రత్యేకంగా చూసుకున్నారు. దాంతో మనిషి బాగా ఆరోగ్యంగా తయారయ్యాడు.

సాధారణం గా కస్టడీలో ఉన్న ముద్దాయిల గురించి పెద్దగా పట్టించుకోదు ప్రభుత్వం. వాళ్ళు చస్తూ ఉన్నా, ఆ జైలు డాక్టరూ, ఆ రంగునీళ్ళూ, ఆ కల్తీ మందులే తప్ప మరో దిక్కుండదు. హ్యూమన్ రైట్స్ వాళ్ళు ప్రభుత్వం నెత్తిమీద మొట్టినా అతీగతీ ఉండదు.

అటువంటిది ఓ కండెమ్డ్ క్రిమినల్ ని బతికించటం కోసం అంతగా తహ తహ లాడుతూ ఖర్చులకు సయితం వెరవకుండా రూల్స్ నతిక్రమించి ప్రత్యేక వైద్య సదుపాయాన్ని కలిగించడం....అతనికి నయమయేంతవరకూ స్వంత మనుషులకంటే ఎక్కువగా ఆతృత, ఆందోళనా చూపడం....ఆ డాక్టర్లకి, తాము కలగంటున్నామా లేక పోలీసులలో నిజంగానే మార్పు వచ్చిందా అన్న సందేహం కూడా కలిగింది.

ముద్దాయిని డిశ్చార్జ్ చేస్తూ అదేమాట అడిగారు వాళ్ళు. "ముద్దాయిలను జీవంలేని మట్టి సుద్దల్లా ట్రీట్ చేసే వాళ్ళు....ఓ నేరస్తుడి పట్ల ఇంత శ్రద్ద, కన్సర్న్ చూపిస్తున్న మీ సహృదయాన్నీ, మానవతా దృక్పథాన్ని మనసారా అభినందించలేకుండా ఉండలేకపోతున్నాం. మీ లాంటి అధికారులు మరికొందరుంటే మన వ్యవస్థే మారిపోతుంది"...అని ప్రశంసించారు. ఆ జైలర్ కాస్త ఇబ్బందిగా కదిలి...ఆ తరువాత మెల్లగా అన్నాడు...."సార్! ఇది నా బాధ్యత. ఇతను మల్టిపుల్ మర్డర్ కేసులో మరణశిక్ష పడిన ఖైదీ. వచ్చేవారమే ఇతనికి ఉరిశిక్ష. ఉరితీసేలోగా చావకుండా చూడటం మా భాద్యత. అందుకే ఈ పాట్లన్నీ!"....ఆ....అంటూ, నోళ్ళు వెళ్ళబెట్టారు డాక్టర్స్.

( ఆ మధ్య చదివిన ఒక న్యూస్ ప్రేరణ తో......ఈ మధ్యనే నేను జువెనైల్ హోమ్ లో బాల నేరస్తుల కష్టాలు కళ్ళారా చూసిన ఆవేదనతో....)





*****************************************************************************************************

10 కామెంట్‌లు:

కథా మంజరి చెప్పారు...

దీనిని అమానుష మానవత్వం అనే కొత్త పదబంధంతో పిలవొచ్చునేమో. కదిలించేలా ఉంది మీ కథనం.

Padmarpita చెప్పారు...

ఎంతటి అమానుషం.....

SRRao చెప్పారు...

జయ గారూ !

విషయం బాధాకరమైనా మీ కథనం బావుంది.

శ్రీలలిత చెప్పారు...

ఈ రచనకి మీరు సరైన శీర్షిక పెట్టారు. విద్యుక్తధర్మం ముందు మానవత్వం మరుగున పడిపోతుంది.

శిశిర చెప్పారు...

హ్మ్.. ఏం స్పందించాలో కూడా తెలియడం లేదు. జువెనైల్ హోమ్ చూశారా? తెలిసీ తెలియనితనంతో తప్పు చేసిన పిల్లలూ, క్షణికావేశంలో తప్పు చేసిన పిల్లలూ, బ్రతుకు కోసం తప్పు చేసిన పిల్లలూ చాలామంది ఉండుంటారే! ఎంతమంది పిల్లల బాల్యం సరైన దిశ చూపించేవారు లేక, దిక్కు లేక ఊచల వెనుక మగ్గుతూందో కదా.

కొత్త పాళీ చెప్పారు...

నిజమే.

మురళి చెప్పారు...

చాలా బాధ కలిగించే విషయమండీ..
నిజానికి ఒక కథ చదివినట్టుగా అనిపించింది.. రావు గారి మాటే నాదీను

జయ చెప్పారు...

@ పంతుల జోగారావు గారు, అవునండీ తలచుకున్నా కొద్దీ రకరకాల ఫీలింగ్స్ వస్తూ ఉంటాయి.

@ పద్మార్పిత గారు, అసలు ఇలా జరుగురుంది అంటేనే బాధగా ఉంటుంది.

@ రావ్ గారు థాంక్సండి.

జయ చెప్పారు...

@ శ్రీ లలిత గారు, సరిగ్గా చెప్పారండి.

@ శిశిరా, ఆ బాల నేరస్తులని చూస్తుంటే ఎంత బాధనిపిస్తోందొ చెప్పలేను. అప్పుడప్పుడూ వాళ్ళని చూడటానికి వెళ్ళి కొన్నిస్వీట్స్, పళ్ళు ఇచ్చి కబుర్లాడి వస్తూ ఉంటాను. పాపం, వాళ్ళు ఎంత అమాయకులో చూస్తేనే అర్ధం అవుతుంది.

@ కొత్తపాళీ గారు, ఆలోచిస్తూంటే అలాగే అనిపిస్తుందండి.

@ మురళి గారు, ఒక చిన్న న్యూస్ నా మీద చూపించిన ప్రభావం అదండి. థాంక్యూ.

శిశిర చెప్పారు...

great జయగారు. ఎంత మంచి మనసో మీది. I adore u.

 

మనస్వి © 2008. Template Design By: SkinCorner