
సామెతల వర్ణమాల
అడ్డగోడ చాటునుంచి మొగుడి పెళ్ళికి అర్ధణా చదివించినట్లు.
ఆలికి చీరకొంటే ఊరికి ఉపకారమా!
ఇంటిదొంగను ఈశ్వరుడైనా పట్టలేడు.
ఈత వచ్చినప్పుడు లోతనిపిస్తుందా!
ఉదరపోషణార్ధం బహుకృత వేషం.
ఊరపిచ్చుక మీద బ్రహ్మాస్త్రం వేసినట్లు.
ఋణశేషము శతృశేషము ఉండరాదు.
ఎంత చెట్టుకు అంత గాలి.
ఏ గ్రహం పట్టినా ఆ గ్రహం పట్టరాదు.
ఐశ్వర్యానికి అంతం లేదు దారిద్ర్యానికి మొదలు లేదు.
ఒక్కొక్క రాయి తీస్తుంటే కొండ అయినా కరుగుతుంది.
ఓలి తక్కువని గుడ్డిదాన్ని పెళ్ళిచేసుకుంటే కుండలన్నీ పగలగొట్టింది.
ఔను కాదు అనే మాటలెంత చిన్నవో వాటిని అనడం అంత కష్టం.
అందని మ్రాని పండ్లకు అర్రులు చాచినట్లు.
ఆ:, ఓహో లతో తెచ్చేవు అసలుకే మోసం!
కంచుమ్రోగునట్లు కనకంబు మ్రోగునా!
ఖరము కున్న ఓపిక జగమెరుగనిదా!
గంజాయి తోటలో తులసి మొక్క.
ఘడియ లోన చెల్లు జీవితంబు కై ఖేదమేల!
చదివింది, చదవనిది ఒకటిగా ఉండటమే పండిత లక్షణం.
ఛ ఛా అందువే అన్నింటికీ, ఏల అబ్బునే మంచి గుణంబు!
జయాపజయాలు ఒకరి సొమ్ము కావు.
ఝుమ్మన్న నాదం జీవితానికి వీణా నాదమయ్యేనా!
టమటాల తోట ఏయరా బిడ్డా అంటే, టమటమాల బండి కొనిస్తవా అయ్యా! అన్నాట్ట.
ఠక్కున చెప్పమంటే ఢంకా మోగించాడు.
డబ్బు దాచిన వాడికే తెలుసు లెక్క వ్రాసిన వాడికే తెలుసు.
ఢమాల్ అనే వ్యాపారానికి డాంబికాలు కూడానా!
తనకు మాలిన ధర్మం మొదలు చెడ్డబేరం లేదు.
థయ్యి థయ్యిన ఆకసానికెగిరితే భూమిలోని మురికి గుంత కూడా దక్కదు.
దంచినమ్మకు బొక్కిందే దక్కుడు.
ధర తక్కువ బంగారానికి వన్నెలెక్కువ.
నవ్వలేని వారిని నమ్మరాదు.
పచ్చగా ఉంటే పదిమంది చుట్టాలు.
ఫలములున్న చెట్టుకే కదా, రాళ్ళ దెబ్బలు!
బంగారపు పళ్ళానికైనా గోడ అండ కావాలి.
భక్తి లేని పూజ పత్రి చేటు వంటిది.
మంచి మరణం లో తెలుస్తుంది.
యదార్ధ వాది లోక విరోధి.
రత్నాన్ని బంగారం లో పొదిగితేనే రాణింపు.
లక్కవంటి తల్లి రాయి వంటి బిడ్డ.
వజ్రాన్ని వజ్రం తోనే కోయాలి.
శతకోటి దరిద్రాలకు అనంత కోటి ఉపాయాలు.
షష్టి నాడు చాకలి వాడైనా ప్రయాణం చేయడు.
సంస్కారం లేని చదువు, కాయ కాయని చెట్టు ఒకటే.
హంస నడకలు రాకపోయె, ఉన్న నడకలు మరచిపోయె.
క్షణం తీరికాలేదు దమ్మిడీ ఆదాయం లేదు .
ఱ ఱ ఱ ఱ ఱ.....హు...ఈ అక్షరమే ఎగిరిపోయె కదా! ఇంకేటి రాతు!!!!
ఙ, ఞ, ణ, ళ.....అమ్మో! ఇదీ తెలుగు భాష అంటే...అందుకే దేశ భాషలందు లెస్స. ఈ సామెతలు మాత్రం మీరే రాసేసుకోండేం:))))
రీసెర్చ్ చేసి ఎంతో డేటా పోగేసాను మరి! రెండో, మూడో మా అక్క దగ్గిర కూడా ఎత్తుకొచ్చేసా లెండి. మీ అందరికీ నచ్చిందా!! ఈ అక్షరాల వరుసలోని సామెతలు!!!
పద్మార్పిత గారు, ఇదన్నమాట నా ‘కాపీ క్యాట్’.......:)
*************************************************************************************