27, మార్చి 2013, బుధవారం

పాత బట్టల పండుగ





పాతబట్టలతో ఎప్పుడూ ఎంతో కొత్త కొత్తగా ఉండే ఈ పండుగ నాకు పుట్టినప్పటి నుంచి ఇష్టం. ఎంతో ప్రాణం....

అవును మరి, నేను పుట్టిన సంవత్సరం లో హోళీ  రోజు అక్కడే ఉన్న ఓ కలర్ బకెట్లో పడిపోయానట. పసుపు రంగులో పడ్డనేను, అందుకేనేమో! అప్పటినుంచి ఆ రంగంటే చాలా ఇష్టం. పసుపులో అన్ని షేడ్స్ ఇష్టమే. పసుపు రంగు స్నేహానికి కూడా ఒక మంచి గుర్తు. కదూ!

అప్పటినుంచి ప్రతి సంవత్సరం ఏదో విధంగా హోళీలో మునిగి తేలుతూనే ఉన్నాను.హోళీ కోసం ఎక్కడెక్కడి రంగులో కొనుక్కొస్తున్నానని మా అమ్మ నాకు డబ్బులిచ్చేది కాదు. ఓ సారైతే బజార్లో సామాన్లు కొనే వాడొస్తే, మా ఇంట్లోంచి రెండు మూడు గిన్నెలు తీసుకెళ్ళి వాడికి అమ్మేసాను. తోచిన కలర్స్ అన్నీ కొనుక్కొచ్చేసాను. ఆ తరువాత జరగాల్సిందేదో జరిగిపోయిందనుకోండి. అది వేరే విషయం....

హోళీ కి కొత్త బట్టలు కావాలని ఒకటే గొడవ చేసేదాన్ని. పసుపు పచ్చటి పట్టు పరికిణీ, బ్లౌజు కుట్టించమనిఎంత గోల చేసేదాన్నో. ఇప్పుడైతే ఆ బట్టలు పాడైపోతాయి, శివరాత్రికి కుట్టిస్తాలే....అప్పుడు ఇంచక్కా నువ్వొక్కదానివే కొత్త బట్టలేసుకోవచ్చు అనే వాళ్ళు మా నాన్నగారు....:)

కుక్కపిల్ల లంటే భలే ఇష్టం ఉండేది. మేము నాగార్జున సాగర్ లొ ఉన్నప్పుడైతే, దారిలో కనిపించిన ప్రతి కుక్క పిల్ల ని ఇంటికి తీసుకొచ్చి పాలు పోసే దాన్ని. వాటిని మంచాల కింద దాచిపెట్టేదాన్ని.రకరకాల కుక్కపిల్లలు ఇంటినిండా గునగునా తిరుగుతూ ఉండేవి.హోళీ అప్పుడైతే ఒక్కో కుక్కపిల్లని ఒక్కో రంగులో ముంచేసేదాన్ని. అప్పుడైతే మా ఇంట్లోనే సప్తవర్ణాల ఇంద్రధనుస్సు గిరగిరా తిరుగుతున్నట్లుండేది. హోళీ కి పిల్లలందరం కలిసి డబ్బులేసుకుని రంగులు కొనుక్కుని అక్కడే ఉన్న పార్క్ లో ఆడుకునే వాళ్ళం.  ఎవరు ఎవరో కూడా గుర్తుపట్టలేనంతగా రంగులు పూసేసుకునేవాళ్ళం. నా కుక్కపిల్లలన్నీ నాతో పాటు వచ్చేస్తాయి కాబట్టి నా దగ్గిర ఎక్కువ డబ్బులు తీసుకునే వాళ్ళు.  హోళీ అప్పుడు నా కుక్కపిల్లల్ని చూట్టానికి, తెలియని వాళ్ళు కూడా ఎంత మందో వచ్చే వాళ్ళు. నా గొడవ పడలేక నేను స్కూల్ కెళ్ళిన టైం లో వాటన్నింటిని సాగర్ లో తిరిగే ట్రక్కుల్లో ఇంకెక్కడికో పంపించేసేది మా అమ్మ.చాలా గొడవ పెట్టేసేదాన్ని. కాని, మళ్ళీ మామూలే....ఎక్కడెక్కడినుంచో కుక్కపిల్లల్ని తీసుకొచ్చేస్తూ ఉండేదాన్ని. ఇప్పటికీ రంగులు పూసిన బుజ్జి బుజ్జి కోడిపిల్లల్ని దారిలో అమ్ముతున్న వాళ్ళను చూసినప్పుడు నా కుక్కపిల్లలే గుర్తొస్తాయి.

సాగర్ లో పెద్ద పెద్ద క్వాటర్స్, ఇంటిముందు రకరకాల చెట్లతో కాంపౌండ్ వాల్ తో అందంగా ఉండేవి. ప్రతిఒక్కరి ఇళ్ళల్లో మందార, బంతి, చేమంతి, రంగురంగుల జినియాలు,  పచ్చటి తంగేడు పూలు ఇంకా ఎన్నో చెట్లు ఉండేవి. ఇంక చెప్పేదేముంది...అన్ని పూలు తెంపేసి...నలిపేసి ఒంటినిండా పూసేసుకునేవాళ్ళం. సహజ రంగులన్నమాట. మందార ఎరుపు, చేమంతి పసుపు, అనేకరంగుల్లోని జినియాల, బంతుల రంగులు బట్టలకు అసలు వదిలేవేకావు. ఒంటికంటుకున్న ఆ రంగులు ఎన్నో రోజులకు కాని పోయేవి కావు. ఆ రంగులెక్కడ మాయమైపోతాయో అని సరిగ్గా స్నానం కూడా చేయకుండా కాపాడుకునేవాళ్ళం. ఎవరి వంటి మీద ఎక్కువ రోజులు ఆ రంగులుంటాయో వాళ్ళు గ్రేట్ అన్నమాట. మా అమ్మ కోపం చేసి ఆ రంగులు వదిలించేది. రహస్యంగా మళ్ళీ ఏవో రంగులు పూసేసుకోని కాంపిటీషన్ లో కొనసాగేదాన్ని:) అందమైన లోకమనీ....రంగు రంగులుంటాయనీ....మురిసిపోయే .... అమాయకమైన రోజులవి....

  పోన్లే ఇదేదో చిన్నప్పటి సరదాలే అనుకుంటే పెద్దయ్యాక కూడా అంతే...కాలేజీ చదువుల్లోను, హాస్టల్ రోజుల్లోనూ అంతే...ఇంకా పెరిగిందేగాని తగ్గలేదు. పెద్ద పెద్ద హోళీ గన్ లు, పిచ్ కారీలు కొనుక్కొని ఎన్నెన్నో రంగులు నింపుకొని చిన్న పిల్లల కంటే కూడా ఇంకా చిన్నపిల్లల్లాగా ఆడుకునే వాళ్ళం. 'అదిగో దెయ్యం' అనేంత భయంకరంగా తయరయ్యే వాళ్ళం. ఒకే ఒక్క డైలాగ్ తో సీరియల్ ఎపిసోడ్ మొత్తం లాగించేసినట్లే ఈ హోళీ తోనే జీవితమంతా లాగించేయాలనిపించేది.  నాకైతే మేమంతా సీతాకోక చిలుకల్లాగా, స్వర్గలోకపు నాట్యకత్తెల్లాగా అనిపించేది. ఎందుకో గాని ఎంతో గర్వంగా ఉండేది.  ఎందుకో అంత ఆనందం!!!

ఇప్పుడైనా అంతేకదా!!! ముందు రోజో వెనక రోజో పిల్లలందరూ వస్తే ఏదో, అయిష్టంగానే...కొంచెంగా కోపగించుకొని...వాళ్ళకీ నాకు కూడా తెలియకుండానే రంగుల వర్షం లో తడిసిపోతూనే ఉంటాను:)  చిన్నతనంలో ఎప్పుడెప్పుడు పెరిగి పెద్దైపోతామా అని ఒకటే ఆరాటం....పెరిగి పెద్దైపోయాకేమో మళ్ళీ పిల్లలమైపోతే బాగుండు అని ఎంత అల్లాడిపోతామో:) ఇదిగో, ఈ హోళీ మన కోరిక  మనసారా తీరుస్తుంది...

అదన్న మాట. నా హోళీ కథ. కాబట్టి రేప్పొద్దున్న ముసలి దాన్నయినా...ఎల్లుండెప్పుడో చనిపోయినా ....ఇప్పటికీ అప్పటికీ ఎప్పటికీ హోళీనే:)

త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ముగ్గురినీ దంపత సహితంగా పూజించే రోజు ఈ ఒక్కటే. అదే ఫాల్గుణ పూర్ణమి. ఈనాటి పూజలు కూడా భిన్నంగానే ఉంటాయి. వసంత పూర్ణిమ కి సంతోషాన్ని వ్యక్తం చేసుకుంటూ ఒకరిపై ఒకరు రంగు పొడులు, రంగు కలిపిన నీళ్ళు చల్లుకుంటారు. ' హోళి హోళీర రంగ హోళీ చమకేళిర హోళీ' అని పాడుకుంటూ ఆడుకునే ఈ ఆటలో ఎన్నో అర్ధాలు ఉన్నాయి. మోదుగపూలు తెచ్చి రోట్లో దంచి, కుండలో వేసి, రసంతీసి, వెదురు గొట్టాల్లో నింపాలి. ఆ రసం ఎర్రగా ఉంటుంది. దీనికే వసంతం అని పేరు. ఈ కషాయం ఒంటిమీద పడటం వల్ల శరీర కాంతి, వర్చస్సు ఎక్కువై ఆరోగ్యం ఇనుమడిస్తుంది. మానసిక వికారాలు, ఉద్రేకాలు కూడా తగ్గుతాయిట. ఎప్పుడో చదివిన విషయం ఇది. మన ఆయుర్వేదంలో ఉన్న గొప్పతనం ఇదే మరి....

 అటువంటి  ఈ వసంతోత్సవ కేళి ప్రతిఒక్కరి జీవితం లోనూ అన్ని రంగులూ కలకాలం చిలకరిస్తూనే ఉండాలని కోరుకుంటూ, మీ అందరికీ నా హృదయ పూర్వక హోళీ శుభాకాంక్షలు.

  'అజ్ఞానమనేది దట్టమైన చీకటిలాంటిది ' అన్నాడు షేక్ష్పియర్. ఎన్నో పరమార్ధాలు తెలిపే ఈ రంగులే మన అజ్ఞానాన్ని తొలగిస్తాయి. జగమంతా రంగులమయం.ఆ నీలి ఆకాశం, శత వర్ణాల పూలు,తెలియని రంగులను చూపించే సముద్రం, రంగులమయమైన ఈ ప్రకృతి....ఓహ్...మనజీవితమే రంగు రంగుల పూలసజ్జ....ఇందులోని ప్రతి రంగునీ మనం సద్వినియోగం చేయాలి.... అస్వాదించాలి ...అనుభవించాలి...ఈ పూల సుకుమారాన్ని సడలనీకుండా కాపాడుకోవాలి.....

హోళీ ఆయారే...దేఖో హోళీ ఆయారే....మస్తీ కరో....:)


   రంగ్ బరిసే హోళీ.....





  హోళీ కె దిన్ దిల్ ఖిల్ జాతే హై....





***************************************************************************************************************************************************

13 కామెంట్‌లు:

జలతారు వెన్నెల చెప్పారు...

ఎంత బాగుందో ఈ పోస్ట్! టైటిల్ కూడా చాలా నచ్చింది నాకు.మీకెంతో ఇష్టమైన హోళీ పండుగ శుభాకాంక్షలండి మీకు.

..nagarjuna.. చెప్పారు...

సెంచరీ పోస్ట్ టపాయించినందు అభినందనలు :)

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

Very nice Jaya Gaaru.

Ilaage HoLee anandasaagaramlo prati Edu gadapaalani korukuntoo.. Happy HoLee!

జ్యోతిర్మయి చెప్పారు...

మీ రంగుల పోస్ట్ చదువుతుంటే రంగులు చల్లుకున్నట్లుగానే వుంది. హోలీ చేసుకొని కొరత తీర్చేశారు.

శిశిర చెప్పారు...

ఇంట్లోంచి గిన్నెలు తీసుకెళ్ళి అమ్మేయడం, కుక్కపిల్లలని తెచ్చి రంగుల్లో ముంచేయడం.. ఏంటి? జయగారే? :) బేబీ జయగారి అల్లరి బాగుంది. వందవ పోస్టా.. నాగార్జున వ్యాఖ్య చూసేదాకా తెలియలేదు. అభినందనలు.

అజ్ఞాత చెప్పారు...

చిన్నప్పటి ముచ్చట్లు ఆనందం కదూ! ఇది మీ బ్లాగని తెలియదండీ జయగారు.

జయ చెప్పారు...

@జలతారు వెన్నెల గారు థాంక్స్:)

@నాగార్జునా, అవునా! థాంక్స్:)

@వనజ గారు, జీవితమంతా హోళీ లాగానే ఉండాలని నా కోరిక. థాంక్స్.










జయ చెప్పారు...


@ జ్యోతి గారు, హోళీ చేసుకోవాలండి. ఈ సరి కనిపించండి. నేను పూసేస్తాను రంగులన్నీ:)


@ శిశిరా, చిన్నప్పుడు అంత అల్లరి వాళ్ళు పెద్దయ్యాక చాలా బుద్దిమంతులవుతారు. ఇదిగో, నాలాగన్నమాట:)

@ బాబాయి గారు, ధన్యవాదాలండి. తెలిసిందిగా, మరి వస్తూ ఉంటారా మా ఇంటికి:)

భారతి చెప్పారు...

'అజ్ఞానమనేది దట్టమైన చీకటిలాంటిది ' అన్నాడు షేక్ష్పియర్. ఎన్నో పరమార్ధాలు తెలిపే ఈ రంగులే మన అజ్ఞానాన్ని తొలగిస్తాయి. జగమంతా రంగులమయం.ఆ నీలి ఆకాశం, శత వర్ణాల పూలు,తెలియని రంగులను చూపించే సముద్రం, రంగులమయమైన ఈ ప్రకృతి....ఓహ్...మనజీవితమే రంగు రంగుల పూలసజ్జ....ఇందులోని ప్రతి రంగునీ మనం సద్వినియోగం చేయాలి.... అస్వాదించాలి ...అనుభవించాలి...ఈ పూల సుకుమారాన్ని సడలనీకుండా కాపాడుకోవాలి.....

ఆహా ... ఎంతచక్కటి పోస్ట్.
అద్భతమండి ... మీ వివరణ.
హోళీ శుభాకాంక్షలండి జయగారు.

జయ చెప్పారు...

భారతి గారు, హోళీ బాగా చేసౌకున్నారా. థాంక్సండి.

జలతారు వెన్నెల చెప్పారు...

విజయ సంవత్సర ఉగాది శుభాకాంక్షలండి జయ గారు!


జయ చెప్పారు...

థాంక్ యూ శ్రీవల్లి గారు. మీకు ఈ విజయ నామ సంవత్సరం అన్ని శుభాలు అందించాలని కోరుకుంటున్నాను.

ranivani చెప్పారు...

నేను ఈ మధ్యనే మీ టపాలు ఒక్కొక్కటే చదువుతూ ఉన్నాను .చాలా బాగా .వ్రాసారు . మీ బ్లాగు నాకు బాగా నచ్చింది . బ్లాగు మొదలుపెట్టేసి తెలుగు .టైపు చేయడం సరిగ్గా రాక,తప్పుల తడకలతో ఏదేదో కెలికేసిన నా బ్లాగు చూస్తే .నాకే నవ్వు .వస్తోంది . మీ బ్లాగు చూసాక అన్పించింది .వ్రాస్తే ఇలాగే వ్రాయాలి అన్పించిందండీ!మీ అత్తగారు కుట్టిన చీరలన్నీ చాలా బావున్నాయి .కోడలి ఫ్రెండ్స్ క్కూడా కుట్టి ఇచ్చారంటే ఆవిడ చాలా .గ్రేట్ .మీ ఫ్రెండ్స్ లక్కీ .

 

మనస్వి © 2008. Template Design By: SkinCorner